[ కల్బుర్గి హత్య జరిగి 10 సంవత్సరాలైన సందర్భంగా ఆయన గురించి గౌరీ లంకేశ్ రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ప్రచురిస్తున్నాం — సం ]
ఆ సంఘటన 2003 లోనో, 2004 లోనో జరిగింది. దావణగెరె జిల్లాలో ఉన్న మలెబెన్నూర్ అనే చిన్న పట్టణంలో కొందరు లింగాయత్ యువకులు ఒక మైనారిటీ మతానికి చెందిన ఇద్దరు స్త్రీలపై ‘జై రామ్’ అని నినాదాలు చేస్తూ అత్యాచారం జరిపారు. వెనువెంటనే ఘర్షణలు, దోపిడీలు జరిగాయి. మలెబెన్నూరు మా అమ్మ తరఫు బంధువుల ఇంటికి దగ్గరగా ఉన్న ఊరు కావడంతో ఈ సంఘటన నన్ను చాలా కలవరపరిచింది.
మలెబెన్నూరులో కొన్ని తరాలుగా హిందువులు, ముస్లిములు సంతోషంగా సహజీవనం గడుపుతున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతకాలానికే దావణగెరెలో ఒక లింగాయత మఠంలో నన్ను ప్రసంగించమని ఆహ్వానం వచ్చింది. అంతకుముందు వరకు నేను లింగాయత మఠాలకు వెళ్ళేదాన్ని కాను గానీ, ఆరోజున వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పాలనిపించి వెళ్ళాను. నా ప్రసంగంలో ఎ.కె. రామానుజన్ అనువదించిన బసవణ్ణ వచనం వినిపించాను.
The rich
will make temples for Siva.
What shall I,
a poor man,
do?My legs are pillars,
the body the shrine,
the head a cupola
of gold.Listen, O lord of the meeting rivers,
things standing shall fall,
but the moving ever shall stay.(సంపన్నులు శివుడికి ఆలయం నిర్మిస్తారు
పేదవాడిని; నేనేం చెయ్యగలను?
నా కాళ్ళే స్తంభాలు
నా శరీరమే ఆలయం
నా శిరస్సు దేవుడి కిరీటం
విను, కూడల సంగమ దేవా
నిల్చున్నవి పడిపోతాయి; కదిలేవి నిలబడతాయి)
అక్కడున్నవారిని నేనడిగాను. “మీ లింగాయతమతాన్ని స్థాపించిన బసవణ్ణ ఆలయ నిర్మాణాన్ని, విగ్రహారాధనను వ్యతిరేకించాడు. మీరెందుకు వాస్తవం కాని దేవుడికి గుడి కట్టాలనుకునే వాళ్లతో స్నేహం చేస్తున్నారు?” అంతే! వెంటనే సభ భగ్గుమంది. నన్ను ప్రసంగాన్ని పూర్తిచెయ్యనివ్వలేదు. స్థానిక లింగాయతులు ఎంత కలవరం సృష్టించారంటే నాకు పోలీసులు భద్రత కల్పించాల్సివచ్చింది.
నా అదృష్టం బాగుండి, కల్బుర్గి కూడ ఆ రోజు దావణగెరెలోనే ఉన్నారు; పైగా నేనున్న హోటల్ లోనే ఉన్నారు. మఠంలో జరిగిన ఉదంతం తెలిసి, ఆయన నాకోసం పిలిపించారు. నేను ఆయన్ని కలిసింది ఆ ఒక్కసారే. ఆయన ఒక మంచి పౌరుడు, మంచి పండితుడు కూడా. ఆయన ఎన్నో శాసనాలను, వచనాలనూ ఉల్లేఖిస్తూ, లింగాయతులు హిందువులు కారని చెప్పారు. ‘మీరన్న మాటలన్నీ నిజమే. మీ ఆలోచనలను చెప్పడానికి ఎప్పుడూ భయపడవద్దు’ అని చెప్పారు నాకు.
కల్బుర్గి హత్యకు కారణాలు ఇంకా తెలియాల్సే వుంది. అయితే ఆయన మరణంపట్ల సంప్రదాయవాదుల ఆనందం చూస్తూంటే, అధిక సంఖ్యాకుల అభిప్రాయాలకు విరుద్ధంగా మాట్లాడ్డం ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది. మా పొరుగువాళ్ళతో పోలిస్తే భిన్న రకాల ఆలోచనల పట్ల మా కన్నడిగులు చాలా ఉదారంగా, సహనంగా ఉంటామని చెప్పుకోవడం మాకిష్టం. కానీ దురదృష్టవశాత్తు, గత తొమ్మిది శతాబ్దుల్లో పరిస్థితులు పెద్దగా మారలేదు. ఈ విషయం కల్బుర్గి మరణానంతరం ఒక ఆదివారం జరిగిన సమావేశంలో ఒక అట్టమీద రాసిన మాటలతో స్పష్టమైంది. అందులో ఇలా ఉంది:
నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి
పన్నెండవశతాబ్దికి చెందిన సంఘసంస్కర్త, కవి అయిన బసవణ్ణ, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమైకజీవనమే పూజ అని నమ్మిన కులరహిత సమాజ నిర్మాణానికి ఆయన కృషి చేశాడు. బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు చేసి, ‘తక్కువకులస్థుల’తో మమేకమయ్యాడు. ఒక ‘వచనం’లో ఆయన, తను మదర చెన్నయ్య సేవకుడికీ, కాకయ్యవద్ద చర్మకారవృత్తిచేసే పనిపిల్లకు పుట్టినవాడినని చెప్పుకునేంతగా సాహసించాడు. బసవణ్ణ, ఇతర వచనకారులు అన్ని కులాలు, వర్గాలవారిని ఆకర్షించిన ఒక సుస్థిరమైన ఉద్యమాన్ని విజయవంతంగా నిర్మించారు. లింగాయత ధర్మంగా ప్రసిద్ధి చెందిన ఈ సరికొత్త సమూహంలో చేరినవాళ్ళు తమ గతంలోని కుల అస్తిత్వాలను వదిలిపెట్టి, అందరినీ సమానులుగా భావించేవారు. అయితే బసవణ్ణకు అసలు పరీక్ష వివాహం రూపంలో ఎదురైంది.
బసవణ్ణ గట్టి మద్దతుదార్లలో హరలయ్య అనే చెప్పులు కుట్టేవాడు, మధురవరస అనే సంపన్న బ్రాహ్మణుడు ఉండేవారు. వీళ్లిద్దరూ తాము బసవణ్ణ సమసమాజాన్ని మనసా, కర్మణా నమ్ముతామని నిరూపించదలుచుకున్నారు. అందువల్ల హరలయ్య కుమారుడు శీలవంతుడు, మధరువరస కుమార్తె లావణ్యల వివాహం నిశ్చయించారు. సహజంగానే బసవణ్ణ ఈ వివాహాన్ని సమ్మతించాడు.
అయితే ఒక బ్రాహ్మణ యువతికి ఒక అస్పృశ్య యువకుడికీ మధ్య వివాహాన్ని అక్కడి పురోహిత వర్గం సహించలేకపోయింది. వారు దాన్ని వ్యతిరేకిస్తూ, రాజు బిజ్జలుడికి ఫిర్యాదు చేశారు. స్వయంగా మంగలి కులానికి చెందిన బిజ్జలుడు ఉన్నత కులాల వత్తిడి తట్టుకోలేక వారి మాటలకు లొంగిపోయాడు. అతను విధించిన శిక్ష వేగంగానూ, అతి క్రూరంగానూ జరిగింది. వరుడు శీలవంతుడి కళ్ళు ఊడబెరికి, అతన్ని, తండ్రి హరలయ్యను, మధురవరసుడిని ఏనుగుల కాళ్ళకు కట్టేసి, ప్రాణాలు పోయేవరకూ వీధుల్లో ఈడ్చుకెళ్ళారు. అంతటితో ఆగక, బిజ్జలుడి సైన్యం లింగాయతులమీద దాడి చేసింది. వేలాదిమంది మరణించగా, మరెందరో నలుదిక్కులా పారిపోయాను. ఇంతకూ అక్కడ కులరహిత, వర్గరహిత సమాజ స్థాపనకు సంబంధించి ఉన్నసాక్ష్యమల్లా కొందరు రచించిన వచనాలు మాత్రమే. వాటిని రక్షించడంకోసం, లింగాయతులు వేర్వేరు ప్రాంతాల్లో ఎవరో ఒకరిదగ్గర వాటిని భద్రపరిచారు. అవన్నీ సేకరించబడింది ఇరవైయవ శతాబ్దిలోనే. 900 ఏళ్ళ క్రితం రచించిన లక్షలాది వచనాల్లో ఇప్పుడు ఇరవై వేలు మాత్రమే లభిస్తున్నాయి. ఇక బసవణ్ణ విషయానికి వస్తే ఈ సంఘటనకు అతను చలించిపోయి కల్యాణకు తరలిపోయాడు.
ఈరోజున లింగాయతులు తమ మతం ఎటువంటి ఆదర్శప్రాయమైన సిద్ధాంతాల పునాదులపై ఏర్పడిందో మరచిపోయారు. వాళ్ళు కూడ ఆలయదర్శనాలు చేసుకుంటూ, విగ్రహారాధన చేస్తున్నారు. అంతకంటే దారుణంగా, బసవణ్ణ ఏ పురోహిత వర్గాన్నయితే వ్యతిరేకించాడో, ఆ వర్గానికే దాసానుదాసులైపోయారు. వచన సాహిత్యోద్యమాన్నీ, కన్నడ భాష సాంస్కృతిక చరిత్రనూ అధ్యయనం చేసిన కల్బుర్గి వంటి పండితుడు వాళ్ళకు ‘ఇది మీ మతం కాదు’ అని చెప్పడానికి ప్రయత్నిస్తే, అతన్ని మతద్రోహిగా సంబోధించి, అసంఖ్యాకంగా కేసులు పెట్టి వేధించారు. చివరకు ఆయన హత్యకు గురయ్యాక, ఆనందిస్తూ ‘హైందవమతాన్ని వెక్కిరిస్తే ఇలాగే కుక్క చావు చస్తావు’ అని కేరింతలు కొట్టారు. వాళ్ళు మరిచిపోతున్నదేమిటంటే, కల్బుర్గి లాగే బసవణ్ణ కూడ అన్ని వందల సంవత్సరాల క్రితం తన అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పివుండకపోతే, అసలు లింగాయతులే ఉండేవారు కాదు. కల్బుర్గి మరణం వల్ల ఎవరికి ఎలాంటి భౌతిక ప్రయోజనం ఉంటుందో ఎవరికీ తెలీదు. కానీ బసవణ్ణ, కల్బుర్గి వంటి సంస్కర్తల స్వరాలను పాశవికంగా, శాశ్వతంగా మూసివేస్తే సంప్రదాయవాద ఫాసిస్టులు సైద్ధాంతికంగా గెలిచినట్లే అవుతుంది.
అయితే ఆలోచనలకు ఎప్పటికీ మరణం ఉండదు.
ఆగస్టు 31, 2015
బెంగళూరు మిర్రర్
