కాల పరీక్ష

కాలం
లిపి లేని భాషలో మాట్లాడినా
అర్ధం చేసుకోవాలి.

రూపం లేని అందాన్ని చెక్కి
ముఖం చాటేసినా
స్వీకరించాలి.

వెంట్రుకతో పర్వతాన్ని
ఎక్కించే ప్రేమను
కొలిచి తరించాలి.

దేహాన్ని సాది
వెలిగించుకున్న చెమట దీపాన్ని
ఆర్పినా భరించాలి.

చిల్లరతో కట్టిన కోటలో
లంకె బిందెలు మొలిస్తే
రహస్యాన్ని గౌరవించాలి.

గుండెను చిలికి
తోడిన కన్నీటితో
దప్పిక తీర్చుకోవడం నేర్చుకోవాలి.

బాధల కొలిమిలో
కాల్చిన అక్షరాలను నాలుకపై
లిఖిస్తున్నా ఓర్చుకోవాలి.

కాలం
తన ఆకలికి మనిషి సుఖాల్ని
నంజుతున్నా మౌనం దాల్చాలి.

కాలం
రహస్య పన్నాగంలో
ప్రతి ఒక్కరూ ఉంటారు.

ఎవరు
ఓడినా జాలిపడదు
గెలిస్తే మాత్రం దీవిస్తుంది.