పర్వతాలనుకుంటావ్, అవి కాలిన బూడిద కుప్పలు
మనుషులనుకుంటావ్, వాళ్ళు కదిలే శవాలు
తోలుకొచ్చిన మందలను నీళ్ళతావుకు తోలేశాక,
నేను నీ కోసమే వెతుక్కుంటాను
పక్కనుంటే చాలు, కడుపు నిండిపోతుంది.
చిన్నప్పుడు ఆడుతూ, ఈని పుల్లతో గీసుంటావ్
దారిని, అదే తోవలో వచ్చేసింది.
నిన్న అడిగితే చెప్పింది, తన పేరు నదిట.
కౌమారంలో అనుకుంటా, అగ్గిపుల్లతో దిద్దుకున్న మీసాలు తిప్పి
బండరాళ్ళను బద్దబద్దలు చేశా
వాటిపై నుంచే జలపాతమయ్యావు నువ్వు
మీ అమ్మో, మా అమ్మో మరి, సరిగా గుర్తు లేదు
నలుదిక్కుల నుంచి ఎనిమిది రంగుల్ని దూసి
రోట్లో వేసి రుబ్బేస్తున్నారు
పిల్లలకు ఇంద్రధనస్సు వడ్డించాలంట.
పప్పు మెదిగేసరికి మన తడి బట్టలు ఆరనే లేదు
చివరికి, హైటెక్ సిటీపై వైనల్ ప్రింట్ వేలాడదీసి
వర్చువల్ ప్రపంచంలో విర్రవీగిపోయాం.
కర్ణుళ్ళం కాదు, కిరీటాల్లేవు
కవచకుండలాలూ కరవేనాయె.
ప్రాణమున్న గోధుమ పిండి బొమ్మలం
వత్తేసి కాల్చినా, వాయనాలై ఎటెటో వలసపోతాం.
నరకడానికి ప్రతి ఒక్కడూ సిద్ధమే, కానీ
ప్రాణం పోయడానికే పరమశివుడొక్కడూ దొరకడు
అయినా, ముక్కుతూ మోక్షం దిశగా మోరచాస్తాం.
మొన్ననేగా, చీకటితో లేచి పాలు స్టౌమీద పడేశావ్
అవి పొంగేలోపే సంధ్యాసమయం కలవరపెడుతోంది
చిన్నప్పుడెప్పుడో విరిగిపోయిన నాగలి మొన
తరువాత ఎంత ఇసక్కుప్పేసుకున్నా…
దొరికి చావదు, జీవితప్పుల్లాటలో.
ప్రేమగా, పద్ధతిగా పెంచామనుకున్న బాల్కనీ మొక్కలు
తీగలు సాగి, బయటకుపోయి కాస్తాయి
కుక్కలకు వున్న విశ్వాసం, మొక్కలకు వుండదు.
పిల్లల గురించి బహిరంగంగా చించుకోలేం
పచ్చగా ఎదగాలనే పిచ్చితో-
లేని శక్తుల భ్రమలో దీవెనలిస్తాం.
అధిరోహణలు, అవరోహణలు ఆదమరపు కదా, ఇక
అభిరుచులో, అలవాట్లో ఆటవిడుపులే కదా?
ఓసి నా ప్రియమైన పెళ్ళామా, ఇంకెందుకీ జాగరణలు?
బీపీ టాబ్లెట్ వేసుకుని మంచానికి ఆ చివర ఒదుగు.
ఇప్పుడంటే పేర్లు పెడుతున్నారని తెలుసుగానీ, ఇవన్నీ
మనం ఉఫ్ అని ఊదేసిన అల్ప పీడనాలు కావూ?
పరివ్రాజకా, పడిలేచే సముద్రాలకు బంధనాలేమిటి!
చిరుగాలికే చెదిరిపోయే బూడిదకుప్పలకు గుర్తింపేమిటి?