వైష్ణవ మాయ

బిగిసిన కండరాలు సడలి
నరాలు తేలియాడుతున్నప్పుడు
కటిక చీకటి చలి రాత్రుల్లో
జరాసంధుడి నిద్రే

వాలిన పక్షి వున్నట్టుండి
రివ్వున్న గాల్లోకి గిరికీలు కొట్టినట్టు
ఎప్పుడో ఓసారి-
హృదయాంతరాళపు యవ్వనోద్వేగం
కాంతివేగమై దూసుకుపోతుంది

పచ్చలైటు పడినప్పుడల్లా
యాక్సిలేటర్ రైజ్ చేయడానికి
మనసు ఒక యంత్రం కాదు

మెలకువలో కల అదృశ్యమైనట్టు
కలయికలన్నీ ఇక
స్వప్నలిఖితాలే కావచ్చు.


దేశరాజు

రచయిత దేశరాజు గురించి:

సుప్రసిద్ధ కవి, రచయిత, జర్నలిస్టు దేశరాజు ఆధునిక జీవితంలోని వైరుధ్యాలను, మనుషుల జీవన శైలిని, విషాదాలను తన రచనల్లో సరళంగా, మనసుకు హత్తుకునే శైలిలో వ్యక్తీకరిస్తారు. 18 కథలతో కూడిన “బ్రేకింగ్ న్యూస్” ద్వారా మంచి కథకుడిగా గుర్తింపు పొందారు.”దుర్గాపురం రోడ్” నవలతో సహా కొన్ని ఇతర కవితా సంపుటాలు కూడా వెలువరించారు.

 ...