చావు బ్రతుకులు

పిల్లలు పుట్టకుండానే తన పసుపుకుంకుమలు పోగొట్టుకున్న కాదంబిని, బావగారు అయిన రాణీహాట్ జమీందార్ శారదాశంకర్ ఇంటికి చేరాక ఆయన కొడుకునే తన స్వంత బిడ్డగా చేరదీసింది. తన స్వంత బిడ్డ కాకపోయినా కుర్రవాడిమీద కాదంబినికి ఉన్న ప్రేమ అవ్యాజమైంది అని చెప్పుకోవాల్సిందే. దీనికి మరో కారణం, కాదంబినికి వేరే ఎవరూ లేరు; పిల్లవాడు తనవాడు కాదు కాబట్టి వాడి దగ్గిర్నుంచి ముందు ముందు ఆశించడానికీ ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నా అనే తోడు ఎవరూ లేని కాదంబినికి జీవితంలో ఆసరాకి ఏది దొరికినా ప్రియం అనిపించడం సహజమే కదా.

ఆ కుర్రవాడి మీదే తన ప్రేమంతా కురిపించిన కాదంబిని గుండె ఒక రోజు రాత్రి ఉన్నట్టుండి కొట్టుకోవడం ఆగిపోయింది. బయటకి తెలిస్తే పోలీసుల గొడవ కావచ్చు కనక, పోయినావిడని చూడడానికి అంటూ ఎవరూ లేరు కనక రహస్యంగా జమీందారుగారి ఇంట్లో పనిచేసే నలుగురు బ్రాహ్మణ నౌకర్లూ కాదంబిని శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్ళారు. రాణీహాట్ శ్మశానం ఊరికి చాలా దూరం. శ్మశానంలో శవాలు కాలేచోట ఈ తతంగం కోసం ఓ చిన్న గుడిసె, చెరువూ తప్ప మానవమాత్రుడెవరూ ఉండడు. గుడిసెకి కొంచెం దూరంగా ఏదో పేరు లేని ఏరు ప్రవహించేది కొన్నాళ్ళ క్రితం కానీ ప్రస్తుతం అందులో నీటి చుక్క లేదు. ఉన్న చెరువు ఆ ఏటి ఒడ్డున తవ్వినదే. కాదంబిని శరీరాన్ని గుడిసెలోకి చేర్చాక తీసుకొచ్చిన నలుగురూ కాసేపు కూర్చున్నారు అలసట తీర్చుకుంటూ, చితికి కావాల్సిన కలప రావడం కోసం ఎదురు చూస్తూనూ. అసలే రాత్రి, ఎంతసేపని చూస్తారు? చాలాసేపు గడిచాక నలుగురిలో ఇద్దరికి విసుగొచ్చింది. బిద్దూను, బనమాలిని అక్కడే ఉండమని చెప్పి నితాయ్, గురుచరణ్ ఈ కట్టెల విషయం చూడ్డానికి వెళ్ళారు.

శ్రావణమాసం, వర్షాలు వచ్చే సమయం. నల్లటి మబ్బులు కమ్ముకుని ఆకాశం, శ్మశానంలో వాతావరణం భయానకంగా ఉంది. చిమ్మచీకటిలో కాదంబిని శవం దగ్గిరే కూర్చున్న మిగతా ఇద్దరూ తమ దగ్గిర ఉన్న దీపం వెలిగించబోయేరు, అగ్గిపుల్లలతో. అవన్నీ తడిసి ఉన్నాయేమో ఏదీ పనిచేయలేదు. కాసేపు చూశాక ఇద్దరిలో ఒకరన్నాడు, “చుట్ట ఉంటే బాగుండేది. అన్నీ మర్చిపోయొచ్చేం హడావిడిలో.” దీనికి రెండోవాడు సమాధానం చెప్పేడు, “నేను వెళ్ళి తీసుకొస్తాను.” బిద్దూ ఉలిక్కిపడి చెప్పాడు, “అలా చెప్పి ఈ శవంతో నన్ను ఒక్కణ్ణీ ఇక్కడ వదిలేసి పోదామనా నీ ఉపాయం?” బనమాలి తిరిగి నోరు ఎత్తలేదు.

నిముషాలు గంటల్లా గడుస్తున్నై. కట్టెల కోసం వెళ్ళిన ఇద్దరూ ఏమయ్యారో తెలియదు. ఎక్కడో కూర్చుని తీరిగ్గా చుట్ట కాలుస్తుండుంటారని నిర్ధారించుకున్నారు. తీతువు పిట్టల కూతలు, కప్పల బెకబెకలూ తప్ప వేరే శబ్దం లేదు. కాసేపటికి శవం కొద్దిగా కదిలి పక్కకి తిరిగి పడుకున్నట్టు ఇద్దరికీ అనిపించింది. కూర్చున్న ఇద్దరికీ పై ప్రాణాలు పోయినట్టయి రామనామం జపం చేయడం మొదలుపెట్టారు. ఆపైన శవం ఊపిరి తీస్తున్నట్టు దీర్ఘమైన మూలుగు వినిపించింది. కూర్చున్న ఇద్దరూ ఒక్క మాటున లేచి జమీందారు ఇంటివైపు దౌడు తీశారు వెనక్కి చూడకుండా.

మూడు మైళ్ళు పరుగెట్టాక కట్టెలకు వెళ్ళిన ఇద్దరూ లాంతర్లతో ఎదురుగా వస్తూ కనిపించేరు. వాళ్ళు నిజంగానే చుట్టలు తాగుతూ కాలక్షేపం చేశారు. కట్టెలు ఇంకో గంటలో వస్తాయని వీరితో బొంకారు. ఈ ఇద్దర్నీ చూశాక పరుగెట్టే ఇద్దరూ ఆగి చెప్పారు శవం కదలడం, మూలుగు వినడం అవీ. ఇది విన్న అవతలి వాళ్ళు వీళ్ళని వెక్కిరించారు పిరికిపందలని. ఏదైతేనేం మొత్తానికి నలుగురూ కలిసి మరోసారి శ్మశానానికి తిరిగొచ్చారు. గుడిసెలోకి వెళ్ళాక తెల్సింది – కాదంబిని శవం అక్కడ లేదు.

ఒకరి మొహం ఒకరు చూసుకోవడం తప్ప ఎవరికీ ఏమీ అంతుబట్టలేదు ఏం జరిగిందో. ఏ నక్కలో శవాన్ని ఈడ్చుకుపోయాయేమో? కానీ శవానికి చుట్టిన గుడ్డ కూడా లేదు. అయితే వర్షానికి ముద్ద అయిన నేలలో ఎవరో స్త్రీ నడిచి వెళ్ళినట్టూ చిన్న చిన్న అడుగు జాడలు కనిపించేయి. వెనక్కి వెళ్ళి జరిగింది ఇదీ అని జమీందారుతో చెప్తే ఆయన నమ్ముతాడా? ఇలాంటి కట్టుకథలు నమ్మేటంత చవట కాదు శారదాశంకర్. ఓ గంట మల్లగుల్లాలు పడ్డాక నలుగురూ నిశ్చయించారు – వెళ్ళి శవదహనం అయిపోయిందని జమీందారుతో చెప్పడమే అన్నివిధాలా మంచిది. తెల్లవారుతుండగా కట్టెలు తెచ్చేవాడొచ్చాడు. కానీ వాడు రావడం ఆలస్యం అయింది కనక గుడిసెలో ఉన్న కర్రలతో దహనం చేసేశామని వాడికి చెప్పి, తెల్లవారేసరికి ఇంటికి చేరారు నలుగురూ.


ఒక్కొక్కప్పుడు శరీరం అచేతనం అయినా ప్రాణం పోదు కదా. అలాగే కాదంబిని చచ్చిపోలేదు. ఆవిడ ఆగిపోయిన గుండె కొట్టుకోవడం మొదలవగానే దాదాపు జరిగినది ఊహించగలిగింది. తను ఇంట్లో ఎప్పుడూ పడుకునే మంచం మీదలేదు. చుట్టూ కటిక చీకటి, శ్రావణమాసం చలి. ‘దీదీ’ అని పిలిచింది. కానీ ఎవరూ బదులు పలకలేదు. మెల్లిగా గుర్తొచ్చింది. తన పెద్ద తోడికోడలు మూలగా కూర్చొని పిల్లవాడికి పాలు కాచుతుండడం, తనకు ఉన్నట్టుండి ఊపిరి ఆడకపోవడం, గుండె పట్టుకొని మంచం మీద పడిపోవడం, ‘దీదీ, బిడ్డను నాదగ్గరికి ఒకసారి తీసుకురా, నేను పోతున్నాను’ అని అనబోతుండగనే తన చుట్టూ చీకటి కమ్ముకోవడం. ఇక ఆపైన ఏం జరిగిందీ తనకు తెలియలేదు. తన బిడ్డ ‘కాకీమా’ అని ఆఖరిసారిగా పిలుస్తూ తన దగ్గరికి వచ్చాడా? ఆ చావు ప్రపంచం ఏమీ గుర్తు లేదు కాదంబినికి. చీకటీ నిరాశా తప్ప ఏమీ లేని ప్రపంచం అని అనిపించింది. ఎదురుచూస్తూ ఉండటం తప్ప చూడటానికి, వినటానికి, చేయడానికీ ఏమీ లేని లోకం అది. ఇంతలో గుమ్మంలోంచి చల్లని గాలి, దానితోపాటే వానజల్లు కాదంబినిని వణికించాయి. కప్పల బెకబెకలూ వినిపించాయి. ఉన్నట్టుండి ఇహప్రపంచంలోకి వచ్చింది. తన బిడ్డ ప్రేమే తనను బ్రతికించిందా? వాడి కోసమే మళ్ళీ తిరిగి తను బ్రతికివచ్చిందా? ఏమైతేనేం, తను మొదట చెయ్యవలసింది ఇంటికి వెళ్ళడం.

కాని, కాదంబిని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు తాను శారదాశంకర్ ఇంటికి వెళ్ళడమా? వెళ్తే ఏమౌతుంది? తాను చచ్చిపోయింది. వాళ్ళు భయంతో ఏమనుకుంటారో? బ్రతికే జనాల నుంచి విడిపోయిన తాను ఇప్పుడు ఒక దెయ్యం. లేకపోతే జమీందారుగారి పరగణాలోంచి తాను ఇక్కడకి పాడె మీద ఎలా తీసుకురాబడింది? అయినా తన శవదహనం అవకుండా తనని ఇక్కడకి తీసుకొచ్చిన మనుషులేమయ్యారు? ఇంతకీ తాను బతికి ఉందా? చచ్చిపోయిందా? రాత్రికూడా బాగా వెలిగే జమీందారుగారి దీపాల ఇంట్లోంచి బయటకివచ్చి ఈ చీకటిలో తాను ఏం చేస్తున్నట్టు? నిజంగా తాను చచ్చిపోయి ఉండొచ్చు లేకపోతే ఈ చీకటి ఏమిటి? తనకు తాను చెప్పుకుంది కాదంబిని, “నేను ఈ ప్రపంచంలో భాగం కాను. నేను అపశకునాన్ని. చెడు తెచ్చేదాన్ని. నాకు నేనే ఒక దయ్యాన్ని.”

ఈ ఆలోచన రాగానే కాదంబినికి శృంఖలాలు అన్నీ తెంచుకున్నట్టై ఒక్క సారి శరీరం బలంగా ఉన్నట్టు, జీవితంలో ఏదో అనుకోని స్వాతంత్రం కలిగినట్టూ అనిపించింది. అప్పటివరకూ తాను ఏం చేస్తే ఎవరు ఏమంటారో అనే భయం అంతా మాయమైపోయింది. ఆ ధైర్యంతో గుడిసెలోనుండి బయటకు పరిగెత్తింది. ఆ బురద నేలలో, వరిపంటల మధ్యనుంచి చీకటిలో నడవసాగింది. రానురానూ అలసట మొదలయింది. ఇంతలో తొలివెలుగు కనిపించింది. పక్షుల కిలకిలారావాలు మొదలయ్యాయి. ఊరి చివర వెదురుపొదలు కనిపించాయి. కాదంబినికి భయం మళ్ళీ మొదలైంది. శ్రావణమాసం రాత్రి చీకటి శ్మశానంలో ఉన్నంత వరకూ తనకు భయం లేదు, అది తన లోకం. కానీ వెలుతురు, మనుషులూ ఉన్న ఈ లోకం ఆమెను భయపెట్టింది. దెయ్యాలూ మనుషులూ ఒకర్ని ఒకరు చూసుకుని భయపడతారుట. అవి రెండూ వైతరిణికి అటూ ఇటూ ఉండే లోకాలు.


రాత్రంతా వర్షంలో బురదలో నడవడం వల్ల కాదంబిని బట్టలన్నీ మట్టికొట్టుకుని ఉన్నాయి పొద్దున్నకి. ఎవరైనా చూస్తే ఈవిడో పిచ్చిదని అనుకునేవారే. పిల్లలైతే భయపడి పారిపోయేవారేమో. అయితే కాదంబినికి మొదట కనిపించినది ఎవరో మర్యాదస్తుడు. “అమ్మా మీరు చూడబోతే గౌరవమైన ఇంట్లోంచి వచ్చిన మహిళలా ఉన్నారు. ఇలా దుమ్మూ మట్టిగొట్టుకున్న బట్టలతో ఈ దారిలో ఎటు వెళ్తున్నారు?” అని అడిగాడు.

కాదంబిని ఆయనకేసి తేరిపార చూసింది. కాదంబినికి ఇంకా తాను బతికి ఉందో చచ్చి దెయ్యమైందో అర్థంకాలేదు. ‘గౌరవమైన ఇంట్లోంచి వచ్చిన వారిలా కనిపిస్తున్నారు’ అంటున్నాడు ఈయన, ఏం చెప్పాలి?

ఈసారి ఆయన రెట్టించాడు, “రండి అమ్మా దారి తప్పారేమో, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చెప్పండి. నేను కూడా సహాయం వచ్చి దింపుతాను.”

కాదంబిని ఆలోచించింది ఒక్క క్షణం – శారదాశంకర్ ఇంటికి వెళ్ళలేదు; తనకి స్వంత తల్లీ తండ్రీ ఎప్పుడో పోయారు. యోగమాయ అనే స్నేహితురాలు ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడైనా ఓ ఉత్తరం రాయడం తప్ప ఆవిణ్ణి చూడ్డం తక్కువే. ఉత్తరం వచ్చాక వెంఠనే సమాధానం ఇవ్వకపోతే నన్ను మర్చిపోతున్నావులే అనే ఎత్తిపొడుపులు ఉన్నా స్నేహం బలంగానే ఉంది. చిన్నప్పుడు గిల్లికజ్జాలు ఉన్నా ప్రస్తుతం ఇద్దరూ మంచి స్నేహితులే. ఇదంతా ఆలోచించాక కాదంబిని అంది, “నేను నిశిందాపూర్‌లో శ్రీపతీచరణ్ అనేవారింటికి వెళ్ళాలి.”

కాదంబినిని పలకరించినాయన వెళ్ళేది కలకత్తా వేపుకి. నిశిందాపూర్ దగ్గిర కాదు కానీ ఆయన వెళ్ళేదారిలోనే. కాదంబినిని శ్రీపతీచరణ్ బాబు ఇంటికిచేర్చి ఆయన దారిలో ఆయన వెళ్ళాడు. స్నేహితురాళ్ళిద్దరూ ఒకరినొకరు గుర్తు పట్టడానికి కొంచెం సమయం తీసుకున్నారు. యోగమాయ అంది, “మళ్ళీ నిన్ను ఈ జన్మలో చూస్తానని అనుకోలేదే? ఎలా వచ్చావు ఇక్కడకి? మీ అత్తామామలు నిన్ను గెంటేశారా ఏమిటి?”

కాదంబిని అంది, “ఇప్పుడు వాళ్ళ గురించి అడక్కు. మీ ఇంట్లో కాస్త తిండి పెట్టి ఓ మూల పడుకోనివ్వు అదేచాలు. నువ్వు చెప్పిన పని చేస్తూ మీ ఇంట్లో పనిమనిషిలాగా పడి ఉంటా.”

“నౌకరులానా? నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలివి. నీ ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో…” అంటూండగానే శ్రీపతి వచ్చాడు లోపలకి. శ్రీపతి మొహంలోకి కాదంబిని ఏ భావమూ లేకుండా చూసి బైటకు నడిచింది, తన తలను కప్పుకోకుండా, సాధారణంగా స్త్రీలు కనపర్చే బిడియం, గౌరవం వంటివేమీ చూపించకుండా. భర్త ఏమనుకుంటాడో అని యోగమాయ ఏదో సర్దిచెప్పబోయింది కానీ కుదరలేదు.

కాదంబిని వచ్చింది సరే, అయితే స్నేహితుల మధ్య సాన్నిహిత్యం లేదు. చావు వారిని విడిగా నిలబెట్టింది. కాదంబిని ఆలోచనలు ఇప్పుడు వేరేగా ఉన్నాయి. తనెవరో తనకే తెలియదు. యోగమాయ, ఆమె భర్త ఆ కుటుంబం ఏదో సుదూరప్రపంచానికి చెందినవి. ‘వీరు ఈ ప్రపంచంలో మనుషులు. వారికేవో అవసరాలు, బంధాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను కేవలం ఒక నీడను. వీళ్ళది ఇహప్రపంచం. నాది పరలోకం.’

యోగమాయకు కూడా రోజులు గడిచే కొద్దీ ఓ రకమైన అర్థంకాని అలజడి ప్రారంభమైంది మనసులో, కాదంబిని వాలకం చూసి. ఆడవారికి తమ వ్యవహారాల్లో మర్మం గిట్టదు. తమకు అర్థం కానివాటిని వారు పూర్తిగా వేరే పెట్టగలరు. లేదూ, తమకు నచ్చిన కారణాలు ఆపాదించి వాటికొక అర్థం ఏర్పరచుకోగలరు. కాదంబిని వ్యవహారం తనకి అర్థం కాకపోయేకొద్దీ యోగమాయ ఎక్కువగా ఆలోచించడం, అరవడం మొదలుపెట్టడం శ్రీపతి గమనిస్తూనే ఉన్నాడు.

ఇదిలా ఉండగా కాదంబినికి మరో సమస్య మొదలయింది. తన పట్ల తనకు భయం. బైట ప్రపంచంతో లేని భయం తనలోని తనను చూసుకుంటే రాసాగింది. మధ్యాహ్నాలు ఒంటరిగా తన గదిలో కేకలు పెట్టడం, సాయంత్రం అయ్యాక దీపం వెల్తురులో తన నీడ చూసి తానే బెదరడం మొదలయ్యాయి. ఈవిడ కేకలూ అరుపులూ చూసి ఇంట్లో మిగతావారికి కూడా ఇంట్లో దయ్యాలు కనిపించసాగేయి. ఓ రోజు రాత్రి కాదంబిని నిద్రలేచి హఠత్తుగా యోగమాయ పడుకున్న గది తలుపులు తట్టి ఏడవడం ప్రారంభించింది, ‘నన్ను నీతో పాటు ఈ గదిలో పడుకోనివ్వు, ఒంటరిగా వదలకు నన్ను’ అని అరుస్తూ. చిర్రెత్తుకొచ్చిన యోగమాయ ఈవిణ్ణి వెంఠనే ఇంట్లోంచి వెళ్ళగొట్టేదే కాని, దయామయుడైన శ్రీపతి భార్యకు నచ్చచెప్పి వేరే గదిలో పడుకోబెట్టించేడు.

తెల్లవారుతూనే యోగమాయ శ్రీపతితో తగువు వేసుకుంది, “ఒక పరాయి స్త్రీ మన ఇంట్లోకి వచ్చింది. వచ్చి నెల దాటింది. ఒక్కసారి కూడా ఈవిడ ఇక్కడకి ఎందుకొచ్చింది, ఎంతకాలం ఉంటుంది అని అడిగావా? మీ మొగాళ్ళందరూ అంతే, పరాయి ఆడది కనిపిస్తే చొంగ కార్చుకుంటూ చూడ్డమేనా!”

మొగవాళ్ళకు ఆడవాళ్ళంటే తెలీని బలహీనత ఒకటి ఉంటుంది నిజమే. కాదంబిని యోగమాయ స్నేహితురాలు అని తప్ప ఆవిడ ఎందుకొచ్చిందో ఏమిటో తనకేమీ తెలియదు. తాను ఒక్క మాట అడగలేదు వీళ్ళ స్నేహం చెడుతుందేమో అని. ఇప్పుడు తనదా బాధ్యత? శ్రీపతి యోగమాయ తలమీద చేయివేసి ఒట్టుపెట్టి చెప్పగలడు ఈ కాదంబిని మీద తన మనసు అసలు తిరగనేలేదని. ఏమో ఈవిడని అత్తామామలు ఎంత క్రూరంగా చూసేరో, అందుకే ఈమె పారిపోయి వచ్చిందేమో అనుకున్నాడు తప్ప ఇంకేమీ అడగలేదు. అలా అడగడం బాగుండదని తాను ఊరుకున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న ఎవరినైనా ఎలా గెంటేయగలం? కానీ ఇప్పుడు తన భార్య తన మంచితనాన్ని ప్రశ్నిస్తోంది. మీద నిందలు మోపుతోంది. ఏదో ఒకటి చేయక తప్పదు. ఉత్తరం రాస్తే బావోదేమో. తనే రాణీహాట్ వెళ్ళి అసలేమయిందో తెలుసుకుంటే మంచిది.

అలా శ్రీపతి రాణీహాట్ వెళ్ళిననాడు యోగమాయ అంది కాదంబినితో, “నువ్వు ఇక్కడే ఇక ఉండలేవేమో. జనం ఏమనుకుంటారు, ఆలోచించావా?”

“జనం ఏమనుకుంటున్నారో, ఆ జనం నాకేమౌతారో నేనెప్పుడూ ఆలోచించలేదు.”

యోగమాయ ఈ సారి ఆశ్చర్యంగా అంది, “కాదంబినీ, జనం ఏమనుకుంటున్నారో అనేది నీకు ఉండకపోతే మాకు ఉంటుంది కదా, రోజూ ఎవరో వచ్చి అడుగుతున్నారు, ఈవిడెవరు, మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంది అని.”

“జమీందారుగారి ఇల్లు ఎక్కడో ఎవరికి గుర్తుంది?”

యోగమాయ కళ్ళు పెద్దవయ్యాయి, కాదంబినికి బుర్ర పనిచేస్తోందా? ఇంకా మాట్లాడితే ఈవిడ ఏం వాగుతుందో తెలీదు. ఈ లోపులే కాదంబిని అంది.

“మీతో, మిమ్మల్ని నాగురించి అడిగే జనంతో నాకేం పని? నేనీ భూమ్మీద మనిషినా ఏవిటి? మీకైతే నవ్వులూ ఏడుపులూ ప్రేమలూ, అవసరాలూ ఉన్నాయి. నేను కేవలం ఒక నీడను. మీమధ్య నన్ను ఆ దేవుడు ఎందుకు ఉంచాడో నాకు తెలియదు. నేను నీ సంతోషాన్ని చెడగొడతానని నువ్వు కంగారు పడుతున్నావు. కానీ నువ్వు నాకు ఏమవుతావో నాకే తెలియదు. నాలాంటివాళ్ళు ఉండటానికి దేవుడు వేరే చోటు ఎక్కడా పెట్టలేదు. అందుకే నేను నీ చుట్టే తిరుగుతాను, నువ్వు నన్ను దూరం నెట్టినా, నేను వెంటాడుతూనే ఉంటాను.”

కాదంబిని చెప్పిన తీరులో యోగమాయకు ఆ మాటలు అర్థమయినా వాటి భావం పూర్తిగా అర్థం కాలేదు. ఆమెకు ఆ మాటలు వింతగా, భయంగా అనిపించాయి. ఏమి అనాలో, అంటే కాదంబిని ఇంకేం చెప్తుందో తెలియక యోగమాయ వేరేగదిలోకి వెళ్ళిపోయింది.


రాణీహాట్ వెళ్ళిన శ్రీపతి రాత్రి ఇంటి కొచ్చేసరికి పది దాటుతోంది. ఆరాత్రి ప్రళయంలాంటి వర్షం; ఇంక తెల్లవారదేమో అన్నంత అలజడి. తడిబట్టలతో లోపలకి వచ్చిన శ్రీపతిని అడిగింది యోగమాయ వెళ్ళినపని ఏమైందో.

“అదో పెద్ద కథ. తర్వాత చెప్తాను” అన్నాడు శ్రీపతి. పొడిబట్టలు కట్టుకొని పరధ్యానంగా ఏదో కొంచెం తిని వెళ్ళి పడుకున్నాడు. యోగమాయకు నిద్ర పట్టలేదు. శ్రీపతిని కుదిపి మరీ అడిగింది.

“నువ్వు పెద్ద తప్పు చేశావు” అన్నాడు శ్రీపతి.

భార్యలు ఎప్పుడూ తప్పు అనేది చేయడం ఉండదు. ఒకవేళ చేసినా భర్త అనేవాడు వాటిని పైకి చెప్పకూడదు. ఇది కదా లోక వ్యవహారం. “ఏమిటి నేను చేసిన తప్పు; చెప్పండి ముందు” దబాయించింది యోగమాయ.

“నువ్వు ఇంట్లోకి రానిచ్చిన ఆవిడా, నీ స్నేహితురాలు కాదంబినీ ఒకరు కాదు.”

“ఏమిటీ? నా చిన్నప్పటి స్నేహితురాలు నాకు తెలియదా? మీరేదో పెద్ద తెలివైనవారు అనుకుంటున్నారు కాబోలు,” యోగమాయ కొట్టిపడేసింది.

శ్రీపతి చెప్పాడు, తమ ఇద్దరి మధ్యా దెబ్బలాట ఎందుకు అనవసరమో ఈ విషయంలో. రాణీహాట్ వెళ్ళాక తనకి తెల్సిన విషయాల ప్రకారం కాదంబిని చచ్చిపోయింది. ఈ వచ్చినావిడ ఎవరో మనకి తెలియదు.

“మీరేదో తప్పు చేసి ఉండొచ్చు. అసలు సరిగ్గా ఎవరింటికి వెళ్ళారో గుర్తుందా? కట్టెదుట మన ఇంట్లో కనిపిస్తుంటే కాదంబిని చచ్చిపోయిందని ఎలా నమ్మడం? అయినా ఉత్తరంతో పోయేదానికి ఎందుకంత దూరం వెళ్ళారు?”

శ్రీపతికి కోపం వచ్చింది. అప్పటికీ ముందు శాంతంగా చెప్పాడు, తాను వెళ్ళి ఎవర్ని కల్సుకున్నాడో ఏమి విన్నాడో అనే విషయాలన్నీ. చిన్నగా మొదలయిన వాదులాట అర్ధరాత్రి దాటేక పెద్దదయింది. గొంతులు పెరిగేయి. చివరికి పక్కగదిలో కాదంబిని ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోయేరు. ఇద్దరికీ కావలసింది కాదంబిని ఇక ఈ ఇంట్లో ఉండకూడదనే. కాని, ఎవరూ తగ్గదలచుకోలేదు. స్నేహితురాలు మోసం చేస్తున్నదని శ్రీపతి వాదన. కాదు, ఇల్లు వదిలి వచ్చిందని యోగమాయ. చివరికి యోగమాయ కాదంబిని చచ్చిపోయిన రోజేమిటో చెప్పమని సవాలు చేసింది, అలా అయినా తన వాదన గెలవాలని. కానీ కాదంబిని ఇక్కడకు వచ్చిన రోజు, తను చచ్చిపోయిన మరుసటి రోజని నిర్ధారించబడింది. ఇంతలో వారి గది తలుపు తెరుచుకుంది. చల్లగాలికి దీపం ఆరిపోయింది. అక్కడే చీకట్లో నిల్చుని కాదంబిని అంది, “యోగమాయా, నేను నీ స్నేహితురాలు కాదంబినినే. కాని నేను ఇప్పుడు దయ్యాన్ని.”

యోగమాయ భయంతో కీచుగా అరిచింది. శ్రీపతికి మాట పెగలలేదు. “నేను ఇక్కడకి వచ్చి మీకూ మీ కుటుంబానికి ఏమీ హాని చేయలేదు కదా, నేనెక్కడకి వెళ్ళడానికీ లేదు. నేను చావలేదు కనక చచ్చినవాళ్ళతో దెయ్యం అవలేను. బతికినట్టు మీరు నమ్మరు కనక మీతోనూ ఉండనీయరు. ఎక్కడకి వెళ్ళాలి నేను?” ఇలా అంటూ కాదంబిని ఇంట్లోంచి బయటకి పరుగెత్తింది – భోరుమని కురుస్తున్న వర్షంలో, ఇహలోకంలోనో పరలోకంలోనో తన చోటు వెతుక్కుంటూ.


కాదంబిని రాణీఘాట్ మరోసారి ఎలా చేరుకుందనేది చెప్పడం కష్టం. తిన్నగా జమీందారుగారి ఇంటికి వెళ్ళలేదు. ఊరి చివర పాడుపడ్డ గుళ్ళో తలదాచుకుంది ఆకలితో మాడుతూ. సాయత్రం అవుతోంది. తుఫాను వచ్చేట్టుందని గ్రామస్తులంతా ఇళ్ళలోకి చేరుకున్నారు ఆ సాయంత్రం తొందరగానే. అప్పుడు కాదంబిని బయటకి వచ్చి శారదాశంకర్ ఇంటికి వెళ్ళింది. పనిమనిషిలా తలచుట్టూ చీర కప్పుకుంది. ఆమె గుండె దడదడా కొట్టుకుంటోంది. బయట కాపలా ఉన్న ఎవరూ ఆవిణ్ణి ఆపలేదు. ఇంతలో వాన జోరు, గాలి హోరు మరింతగా పెరిగాయి.

జమీందారుగారి భార్య వేరే గదిలో తన చెల్లెలితో ఏదో ఆటల్లో ఉంది. కాదంబిని చేతుల్లో పెరిగిన కుర్రాడు ఇంకో గదిలో జ్వరంతో పడుకుని ఉన్నాడు. ఎవరూ చూడకుండా కాదంబిని ఆ గదిలోకి అడుగుపెట్టింది. ఆ ఇంటికి కాదంబిని తిరిగి ఎందుకొచ్చిందే చెప్పడం కష్టం. కాని, కాదంబినికి ఆ కుర్రవాడిని ఒక్కసారి చూడాలని ఉందని తెలుసు, ఆపైన ఏదేమైనా, తనేమయిపోయినా సరే. దీపం వెలుగులో బక్కపలచగా ఉన్న ఆ కుర్రవాడిని చూసింది. ఒక్కసారి వాణ్ణి తన గుండెకు హత్తుకోవాలని, వాణ్ణి కాపాడుకోవాలనీ బలంగా అనిపించింది కాదంబినికి. వెంటనే ఒక ఆలోచన “నేను చచ్చిపోయాను. వీడి అమ్మకు వీడంటే పట్టదు. ఎంతసేపూ కబుర్లు, పేకాట తప్ప. నేనున్నంత కాలం నాకు వదిలేసింది వీణ్ణి. ఇప్పుడు వీణ్ణి నాలాగా ఇంకెవరు చూసుకుంటారు?”

కుర్రాడు నిద్రలో కదులుతూ కలవరిస్తున్నాడు, “చిన్నమ్మా, కాసిని మంచినీళ్ళివ్వు.”

కాదంబినికి కుర్రాడి మీద ఒక్కసారి ప్రేమ పొంగింది. నా బిడ్డ, వీడింకా నన్ను మర్చిపోలేదు అనుకుంది. నీళ్ళు తీసి గ్లాసులో పోసి ఇచ్చి వాణ్ణి దగ్గిరకి తీసుకుంది. నిద్రలో ఎవరు నీళ్ళు అందిస్తున్నారో కుర్రాడికి తెలియలేదు. కాదంబిని వాడిని ముద్దు పెట్టుకొని పక్కమీద పడుకోబెట్టింది. కుర్రవాడికి మెలకువ వచ్చింది. చిన్నమ్మను చూసి ఆనందంతో వాటేసుకున్నాడు.

“చిన్నమ్మా నువ్వు చచ్చిపోయావా?”

“అవును నాన్నా.”

“అవునా, మరి ఎలా వచ్చావు వెనక్కి. మళ్ళీ చచ్చిపోతావా?”

కాదంబిని ఏదో అనేంతలో గదిలోకి వచ్చిన పనిమనిషి చేతిలో కుర్రాడి కోసం తెచ్చిన జావ గిన్నె కిందపారేసి కెవ్వున ఒక్క అరుపు అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఈ అరుపుకి శారదాశంకర్ భార్య ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. చూసి కట్రాటై నిలబడిపోయింది చలనం లేకుండా. ఇది చూసిన కుర్రాడు, ఏడుస్తూ అరిచాడు, “వెళ్ళిపో చిన్నమ్మా, వెళ్ళిపో!”

కాదంబినికి ఇప్పటికి పూర్తిగా అర్థమైంది. తాను నిజంగా చావలేదు. కుర్రాడికి నీళ్ళు ఇచ్చింది తానే. ఇదే గదిలో కుర్రాణ్ణి ముందు సాకినది కూడా తానే. తనకీ వీళ్ళకీ మధ్య ఏమీ మారలేదు. తన స్నేహితురాలు యోగమాయ ఇంట్లో తాను చచ్చిపోయినట్టు ఊహించుకుంది కానీ ఇప్పుడు తెలుస్తోంది. తాను నిజంగా బతికే ఉంది. శారదాశంకర్ భార్యతో అంది, “అక్కా, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? నేను మునపటి కాదంబినినే. నేను చావలేదు.”

శారదాశంకర్ భార్య ఇది తట్టుకోగలిగే శక్తి లేనట్టూ నేలమీద స్పృహ తప్పి పడిపోయింది. ఈసరికి గది లోపలకి వచ్చిన శారదాశంకర్ చేతులు జోడించి చెప్పాడు కాదంబినితో, “ఇదేమైనా బాగుందా? సతీశ్ నాకు ఒక్కడే కొడుకు. నువ్వు ఇలా వచ్చి వాణ్ణి భయపెట్టవచ్చా? మేము నీ బంధువులమే కదా? నువ్వు పోయాకే వాడిలా అయ్యాడు జ్వరంతో. నిద్రలో రాత్రంతా ‘చిన్నమ్మా, చిన్నమ్మా’ అంటూ కలవరిస్తున్నాడు. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపో. నీకు చేయాల్సిన అంతిమ కార్యాలన్నీ సరిగ్గా జరిగేలా నేను చూస్తాను.”

“లేదు లేదు, నేను చావలేదు!” కాదంబిని అరిచింది, “మీకు ఎలా నిరూపించాలి నేను చావలేదని? నేను బతికే ఉన్నాను” అంటూ అక్కడే ఉన్న ఒక ఇత్తడి పాత్రతో తన తలమీద కొట్టుకుంది కాదంబిని. నుదిటి మీదనుంచి రక్తం కారింది. అది చూపించి కాదంబిని అరిచింది మరోసారి, “చూడండి నాలోంచి రక్తం కారుతోంది నేను చావలేదు.”

గదిలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు స్పృహ తప్పి నేలమీద పడివున్నారు. శారదాశంకర్ నిశ్చలంగా రాయిలా నిలబడ్డాడు చేతులూ కాళ్ళూ ఆడక. కుర్రవాడు తండ్రిని చూస్తూ మూలుగుతూ ఏడుస్తున్నాడు.

కాదంబిని ‘నేను చావలేదు, నేను చావలేదు, నేను చావలేదు’ అని అరుస్తూ ఆ గదిలోంచి ఆ ఇంట్లోంచి బయటకి పరుగెత్తి ఇంటి నడవాలో ఉన్న బావిలో దూకింది. ఆ శబ్దం పై అంతస్తులో కుర్రాడి గదిలో ఉన్న శారదాశంకర్‌కి వినిపించింది. ఆ రాత్రి నుంచి మర్నాడు మధ్యాహ్నం దాకా తెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నిజంగా చనిపోయి తాను మునుపు చావలేదని కాదంబిని నిరూపించింది.

(మూలం: The living and the dead)