దక్షిణ అమెరికా దృశ్యమాలిక-3

కొతోపాక్సీ – కిలొతోవా – క్వెన్క

మనం ఇంతకు ముందే చెప్పుకున్న కొతోపాక్సీ వోల్కనో దక్షిణ అమెరికా ఖండంలో ప్రసిద్ధి చెందిన పర్వతాలలో ఒకటి. ఆ పర్వతం చుట్టూ ఏర్పాటు చేసిన నేషనల్ పార్క్‌కు ఆ జ్వాలాముఖి పేరే పెట్టారు. ఆ పరిసరాల్లోనే ఉన్న కిలొతోవా (Quilotoa) అన్న అగ్నిపర్వత బిలసరోవరం ఎక్వదోర్ దేశంలో చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యమైనది. ఈ రెండు ప్రదేశాలనూ కాస్తంత శ్రమ తీసుకుంటే ఒకే రోజులో చూసి రావచ్చు. నేను అలా తిప్పి చూపించే ఒక ట్రిప్పులో సీటు బుక్ చేసుకున్నాను.

ఆ ట్రిప్పుకు ఆరంభ బిందువు ఆండాలూజ్ అన్న హోటల్ దగ్గరి కూడలి ప్రదేశం. నేనున్న చోటునుంచి పావుగంట నడక. అక్కడికి ఉదయం ఆరింటికే చేరుకోవాలి కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ ప్రస్తావన పెట్టుకోకుండా అటువేపు సాగాను.

ఆండ్రియా అన్న మహిళ ఆనాటి మా గైడు. జార్జి అన్న వ్యక్తి మా వాహన చోదకుడు. కొతోపాక్సీ నేషనల్ పార్క్ ఆనాడు మేము చూసే మొదటి ప్రదేశం. కీతో నగరానికి దక్షిణాన గంట దూరంలో ఉందా నేషనల్ పార్కు. ఆనాటి మా బృందంలో అంతా కలసి ఆరుగురం ఉన్నాం: మటాన, బార్ అన్న ఇజ్రాయెల్‌కు చెందిన యువజంట, రేచల్ అన్న జర్మనీ యువతి, జెస్సికా అన్న స్విట్జర్లాండ్ యువతి, ఆమె తల్లి ఎరికా – నాతో కలపి ఆరుగురు ఉన్న చిన్న బృందం మాది.

ఆండ్రియాకు చక్కని విషయ పరిజ్ఞానం ఉందని, ఆ పరిజ్ఞానాన్ని ఆకట్టుకొనేలా అందరికీ వివరించగల శక్తి ఉందనీ క్షణాల్లో అర్థమయింది. ఏ భేషజాలూ లేని సరళ ప్రవర్తన, అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడే తత్వం – ఆండ్రియా కాసేపట్లో మాకు చేరువ అయిపోయింది. మా బృందపు సభ్యులం కూడా చనువుగా కబుర్లు చెప్పుకోవడం ఆరంభించాం. డ్రైవరు జార్జి మాత్రం తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. అతడిని కబుర్లలో పెట్టడం ఏ మాత్రం క్షేమం కాదని మాకు తెలుసు. అలాగే ఎరికా కూడా మా మాటలు వింటూ ఉండిపోయిందే తప్ప పెద్దగా మాట కలపలేదు. బహుశా ఆమెకు భాషా సమస్య ఉండి ఉండాలి, లేదా కూతురు తన సమవయస్కులతో గలగలా కబుర్లు చెబుతున్నప్పుడు తాను అంతగా కల్పించుకోవడం సరికాదు అన్న ఇంగితమైనా ఆమెను ఆపి ఉండాలి. అన్నట్టు మా అందరి సంభాషణా ఆంగ్లభాషలో ధారాళంగా సాగిపోయింది. అసలు ఈ ఇంగ్లీషన్నది రాని పక్షంలో నేనింతగా యాత్రలు చెయ్యగలిగేవాడినా అన్న విస్మయం నాకు ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఎవరేమన్నా ఆంగ్లమన్నది మన కాలపు అంతర్జాతీయ భాష. అనుసంధాన భాష. ప్రపంచాన్ని చుట్టి వచ్చే నాలాంటి మనిషికి ఆ భాష వల్ల కలిగే సౌలభ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే!

మేమారుగురమూ ప్రపంచపు విభిన్న ప్రాంతాలకు చెందినవాళ్ళం. మాలో ప్రతి ఒక్కరికీ ఎక్వదోర్ అన్నది ఎంతో దూరాన ఉన్న అపరిచిత ప్రదేశం. తమతమ రక్షణ వలయాలను దాటుకుని యాత్రలకు ఉపక్రమించే అందరిలోనూ కొన్ని కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయనుకొంటాను. అలాంటివాళ్ళు ఒకరికొకరు తటస్థపడినపుడు, పూర్వపరిచయం లేకపోయినా, ఒకరినొకరు క్షణాల్లో గుర్తుపడతారనుకొంటాను. స్వజాతి పక్షుల యాత్రాకథనాలను వినడానికి ఉత్సాహపడతారు. తమతమ అనుభవాలు పంచుకోవడానికి ముందుకు వస్తారు. ఈ బాణీ మనుషులకు తాము ఏయే ప్రదేశాలు చూడాలనుకొంటున్నారో ఆ అవగాహన స్పష్టంగా ఉంటుంది. తమకు తటస్థపడిన వ్యక్తుల్లో కొందరు ఆ ప్రదేశాలు కొన్నిటిని అప్పటికే చూసి ఉండవచ్చు. అలా చూసినవారి నోట ఆయా ప్రదేశాల గురించి తెలుసుకోవడం ఎవరికైనా వరప్రసాదమే. సాటి యాత్రికులు అందించే వివరాలకు ఏ ఇంటర్నెట్టూ గైడుబుక్సూ సాటిరావు. తమ మిత్రుల ప్రత్యక్ష అనుభవాలు, మన ప్రశ్నలకు వారు అందించే విశ్వసనీయ సమాధానాలు అమూల్యం. ఇలా ఒకే జాతి యాత్రావిహంగాలు ఒకచోట కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు మనం చేస్తోన్న ఒక ప్రయాణం ఎంతో సహజంగా జరిగిపోవడం మరో యాత్రకు దారితీయడం అన్నది నాకు అనుభవమే.

మా దారిలో తటస్థపడుతోన్న అగ్నిపర్వతాలను మాకు పరిచయం చేస్తూ వెళ్ళింది ఆండ్రియా. ఆ ప్రక్రియలో ఎక్వదోర్ దేశపు జ్వాలాముఖులకు చెందిన ఆసక్తికరమైన ఎన్నో విషయాలు ఆమె మాతో పంచుకొంది.

కీతో నగరం ఉన్న ప్రాంతానికి అక్కడి జ్వాలాముఖి పిచించా పేరు పెట్టారు. అలాగే కొతోపాక్సీ (Cotopaxi), చింబొరాసో (Chimborazo), ఇంబబూర (Imbabura) అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతాలకూ వాటి పేర్లే పెట్టారు. అక్కడివారికి అగ్నిపర్వతాలు పవిత్ర ప్రదేశాలు. 6130 మీటర్ల (20,560 అడుగులు) చింబొరాసో శిఖరం ఎక్వదోర్ దేశంలోకెల్లా ఎత్తయినది. 5897 మీటర్ల (17,347 అడుగులు) కొతోపాక్సీది రెండవ స్థానం. ఈ రెండూ అక్కడి వచ్చే ట్రెకర్‌లకు మొట్టమొదటి గమ్యాలు. అన్నట్టు పంతొమ్మిదవ శతాబ్దం తొలిరోజుల వరకూ చింబొరాసో శిఖరమే ప్రపంచంలోకెల్లా ఎత్తయిన శిఖరమని అందరూ భావించేవారట. మనమింతకు ముందు చెప్పుకున్న అలెగ్జాండర్ ఫాన్ హమ్‌బోల్ట్ అన్న సుప్రసిద్ధ భౌగోళిక నిపుణుడు, ఏమ్ బోన్‌ప్లాఁ (Aime Bonpland) అన్న ఫ్రెంచి వృక్ష శాస్త్రవేత్తతో కలసి 1802లో చింబొరాసో శిఖరారోహణ ప్రయత్నం చేశాడు. 5800 మీటర్ల ల్యాండ్‌మార్క్ దాకా చేరుకోగలిగాడు. ఆ ఎత్తుకు చేరాక ఉన్నత శ్రేణులలో తరచూ సంభవించే తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. ముందుకు సాగలేకపోయాడు. అయినా ఆ 5800 మీటర్ల రికార్డు మరో మూడు దశాబ్దాల పాటు అజేయంగా నిలచి ఉందట.

చింబొరాసో శిఖరం ప్రపంచంలోకెల్లా ఎత్తయినది అన్న అభిప్రాయానికి ఊతమిచ్చే ఆసక్తికరమైన భౌగోళిక వివరమొకటి ఆండ్రియా మాతో పంచుకొంది. అంతరిక్షంలోంచి కానీ భూగ్రహపు కేంద్రబిందువు నుంచి కానీ కొలిచినట్లయితే చింబొరాసోనే భూమి మీది అత్యున్నత ప్రదేశం అవుతుందట. సముద్రతలాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఎవరెస్టుకు ఆ గౌరవం దక్కుతుంది. ఈ భౌగోళిక వైచిత్రికి భూమి ఆకారమే మూలకారణం. మనమంతా అనుకొంటున్నట్టు మన భూమి పరిపూర్ణమైన గోళాకారంలో లేదు; భూమధ్యరేఖ దగ్గర 27 మైళ్ళ (43 కిలోమీటర్లు) మేర ఉబ్బి ఉంది. అంచేత ఆ భూమధ్యరేఖా ప్రాంతంలో ఉన్న చింబొరాసో శిఖరం ఒక ప్రమాణం ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎత్తయిన శిఖరం!

మాకు ప్రయాణంలో విసుగన్నది సోకకుండా ఉండడానికి ఆండ్రియా ఇన్కా నాగరికత, చరిత్ర మూలాలు చెప్పుకొచ్చింది. ఇన్కా సామ్రాజ్యపు చిట్టచివరి చక్రవర్తి అతవాల్ప (అతఉఆల్ప: Atahualpa) పేరు ఎవరైనా విన్నారా అని ప్రశ్నించింది. ఆ చక్రవర్తి ఈ ఎక్వదోర్ ప్రాంతపు మనిషే అని తెలుసునా అని కూడా అడిగింది. మాలో ఒకరిద్దరం మాకు తెలిసిన వివరాలు చెప్పాం. సరేసరే అంటూ ఆమె మాకు మరో సవాలు విసిరింది; ఆ అతవాల్ప పూర్తిపేరు చెప్పినవాళ్ళకు నేనో బహుమతి ఇస్తాను. ఆ పూర్తిపేరు మీకు తెలిసే అవకాశం లేదు గాబట్టి నేనే ఒకటికి రెండు సార్లు చెపుతాను. అది విన్నాక మీరు తప్పుల్లేకుండా తిరిగి చెప్పాలి అంటూ భాషాక్రీడ ఆరంభించింది. సిరికరాన్ అతవాలిప ఉపంచి దూచి సెల సపాయ్ డవంటి సయొ అన్నది ఆ మహానుభావుడి పూర్తి పేరు. ఎన్నో ప్రయత్నాలు చేసినా మాలో ఒక్కరం కూడా ఆ పేరు సవ్యంగా చెప్పలేకపోయాం. ‘మీరు చెప్పలేరని తెలుసు. అందుకే అసలు బహుమతి తీసుకురానేలేదు’ అని నవ్వేసింది ఆండ్రియా. ఆ నవ్వుల పువ్వుల మధ్య, ‘తల్లీ నాకా స్పెల్లింగంతా చెపుతావా? పుస్తకంలో రాసుకొంటాను’ అని అడిగాను. చెప్పింది. Sirikaran Atavalipa Upanchi Duci Cela Sapai Davantil Suyo అన్నది ఆ సుదీర్ఘ నామపు ఇంగ్లీషు స్పెల్లింగు! అన్నట్టు ఎక్వదోర్ దేశంలో ఫుట్‌బాల్ అంటే ప్రాణం పెడతారు. కీతో నగరంలోని ముఖ్యమైన ఫుట్‌బాల్ స్టేడియమ్‌కు అతవాల్ప పేరే పెట్టారు.


ఇన్కా సామ్రాజ్యపు చిట్టచివరి అధినేత అయిన అతవాల్ప స్పానిష్ ఆక్రమణదారుల కుతంత్రాల ఫలితంగా వారికి బందీగా చిక్కి 1532లో ప్రాణాలు కోల్పోయాడు. స్పానిష్ విస్తరణను వీరోచితంగా ఎదుర్కొన్న వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. మైకెల్ ఉడ్ (Michael Wood) అన్న ఆంగ్ల చరిత్రకారుడు ది కాంక్విస్టడోర్స్ (The Conquistadors) అన్న పుస్తకంలో ఇన్కా నాగరికత చరమదశ గురించి ఎంతో వివరంగా రాశాడు. ఎంతో పరిశోధించి రాసిన ఆ పుస్తకం నన్ను బాగా ఆకట్టుకొంది. మధ్య అమెరికాకు చెందిన మాయన్ నాగరికత గురించి, దక్షిణ అమెరికాకు చెందిన ఇన్కా నాగరికత గురించీ మరింత అధ్యయనం చెయ్యడానికి ఆ పుస్తకం నాకు ప్రేరణ అయింది.

ఇప్పటి పెరు, బొలీవియా, చిలె, ఎక్వదోర్ ప్రాంతాలకు చెందిన ఆండియన్ పర్వతశ్రేణిలోని సారవంతమైన లోయ ప్రాంతాలు అప్పట్లో క్రమక్రమంగా వ్యవసాయ కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా పరిణమించాయి. మిగులు ధాన్యాలు, ఇతర సంపదలూ పోగుపడటం మొదలయ్యాక క్రీ. పూ. 900వ సంవత్సరం నాటికే నాగరికత నేర్చిన చిన్న చిన్న రాజ్యాలు అక్కడ ఉద్భవించాయి. క్రీ. శ. 1200 ప్రాంతాలో కుస్కో (Cuzco) నగరం కేంద్రంగా ఏర్పడిన ఇన్కా రాజ్యం అలాంటి చిన్న రాజ్యాలలో ఒకటి. అలా అనేక రాజ్యాలలో ఒకటిగా ఉంటూ వచ్చిన ఇన్కా రాజ్యం 1438-1478 మధ్య పరిపాలించిన పచకూతి (Pachacuti) అన్న అధినేత చొరవ వల్ల తన పరిధిని విస్తరించడం ఆరంభించింది. ఆ పచకూతి మనుమడు వాయ్‌న కపాక్ (Huayna Capac, Wayna Qhapaq) తన పరిపాలనాకాలంలో (1493-1527) ఇప్పటి ఎక్వదోర్, కొలంబియా దక్షిణ ప్రాంతం, చిలే దేశపు ఉత్తర ప్రాంతం, అర్హెంతీన దేశపు ఉత్తరభాగాన ఉన్న ఆండీస్ పర్వత ప్రాంతం – వీటన్నిటినీ తన రాజ్యంలో కలుపుకోగలిగాడు. అలా రాజ్యం కాస్తా క్రమక్రమంగా ఇన్కా ‘సామ్రాజ్యం’గా రూపుదిద్దుకుంది. (అన్నట్టు, ప్రసిద్ధి చెందిన మాచూ పిచ్చూ స్థలానికి శంకుస్థాపన చేసింది ఈ పచకూతి చక్రవర్తే.)

వాయ్‌న కపాక్‌కు ఉన్న అనేక మంది భార్యల్లో తన ఏలుబడిలోని ఎక్వదోర్ ప్రాంతానికి చెందిన రాకుమార్తె ఒకరు. ఆ భార్యకు పుట్టిన కొడుకే ఇన్కా సామ్రాజ్యపు చిట్టచివరి అధినేత అతవాల్ప. ఈ అధినేత మూలాలు ఎక్వదోర్‌కు చెందినవి కాబట్టి అతనంటే ఇప్పటికీ ఎక్వదోర్ ప్రజలకు ఎనలేని మక్కువ.

ఇన్కా సామ్రాజ్యం ఉచ్చస్థాయిలో వెలిగిపోతోన్న సమయంలో ఒక అనుకోని విషాదం ఆ సామ్రాజ్యాన్ని బలంగా తాకింది. 1527లో వాయ్‌న కపాక్ మశూచి బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. యాదృచ్ఛికంగా అదే సమయంలో స్పానిష్ దళాలు పెరు దేశపు పసిఫిక్ తీరాన అడుగుపెట్టాయి. కొలంబస్ కనిపెట్టిన కొత్త ప్రపంచంలోకి – ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలను నిన్న మొన్నటిదాకా అలానే పిలిచేవాళ్ళు – యూరోపియన్ల పుణ్యమా అని మశూచి మహమ్మారి అడుగు పెట్టింది. ఇన్కా సామ్రాజ్యంలోకి ఆ మహమ్మారి స్పానిష్ దళాలకన్నా ముందుగా ప్రవేశించి, దారుణ పరిణామాలకు కారణభూతమయింది. ఆ సామ్రాజ్యంలోని స్థానిక ప్రజల్లో సగానికి సగం మశూచికి తమ ప్రాణాలర్పించారు.

అదే సమయంలో మెహికో దేశంలోని పటిష్టమైన ఆస్టెక్ సామ్రాజ్యాన్ని హెర్మన్ కోర్టెస్ (Herman Cortes) అన్న ఆక్రమణదారుని నేతృత్వంలో ఆయుధ సంపత్తి పుష్కలంగా ఉన్న చిన్నపాటి బృందం జయించి అదుపులోకి తీసుకోగలిగింది. వారి సైనిక ప్రాభవం పనమా దేశం వరకూ విస్తరించింది. తద్వారా స్పానిష్ దళాలు పసిఫిక్ మహాసాగర తీరానికి కూడా చేరుకోగలిగాయి.

అలా మధ్య అమెరికా చేరుకున్న స్పానిష్ వారిలో ఫ్రాన్సిస్కో పిసారో (Francisco Pizarro) చెప్పుకోదగ్గ మనిషి. కొత్తగా నిర్మించిన పనమా సిటీకి అతను మేయర్ కూడా అయ్యాడు. పనమా దాకా చేరుకున్న స్పానిష్ ఆక్రమణ దారులకు దక్షిణ అమెరికా ప్రాంతాల్లో విలసిల్లుతోన్న మహాసమ్రాజ్యంలో రాశులు పోసి ఉన్న బంగారమూ సంపదల గురించి అనేకానేక కథలు వినిపించాయి. ఆయా ప్రదేశాలలో అడుగుపెట్టి, శోధించి, జయించడానికి పిసారో స్పెయిన్ రాజు నుంచి అనుమతి సాధించాడు. ఆక్రమంలో దక్షిణ అమెరికా ఖండంలో పసిఫిక్ తీరం చేరుకున్న మొదటి యూరోపియన్‌గా పిసారో నిలిచాడు.

మశూచితో వాయ్‌న కపాక్ హఠాత్తుగా మరణించాక ఇన్కా సామ్రాజ్యంలో వారసత్వపు పోరు ఏళ్ళ తరబడి సాగింది. ఆయనకు చట్టబద్ధంగా సుమారు యాభైమంది కొడుకులు ఉన్నారు. వారిలో ఎక్వదోర్ ప్రాంతానికి చెందిన అతవాల్పకూ పెరు లోని కుస్కో నగరానికి చెందిన సవతి సోదరుడు వాస్కర్‌కూ (Huascar) మధ్య అంతర్యుద్ధం చెలరేగింది. ఆ యుద్ధంలో అతవాల్ప విజేతగా నిలిచాడు. వాస్కర్‌ను ఖైదు చెయ్యగలిగాడు. కానీ, సమర్ధవంతుడైన వాయ్‌న కపాక్‌ను పోగొట్టుకున్న ఇన్కా సామ్రాజ్యాన్ని ఏళ్ళ తరబడి సాగిన ఈ వారసత్వపు పోరు మరింత బలహీనపరచింది. స్పానిష్ ఆక్రమణదారుల చిన్నపాటి బృందం ఎనభై గుర్రాలమీద దండెత్తి వచ్చి శతాబ్దాలుగా వేళ్ళూని ఉన్న మహాసామ్రాజ్యాన్ని, ఆ సామ్రాజ్యపు సేనను కూకటివేళ్ళతో నిర్మూలించడమన్నది నమ్మశక్యం కాని చారిత్రక వాస్తవం. ఆక్రమణదారుల దగ్గర ఆధునిక ఆయుధాలున్న మాట, ఆ బృందంలోని వాళ్ళంతా తమకు లభించనున్న స్వర్ణసంపద మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని విజృంభించారన్న మాటా నిజమే అయినా వారి విజయం అనూహ్యం. సగటు ఇంగిత జ్ఞానాలకు అందని విషయం. మళ్ళా 225 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘటనే భారతదేశంలో పునరావృతం అయింది. రాబర్ట్ క్లైవ్ 1757 నాటి ప్లాసీ యుద్ధంలో అతి స్వల్పమైన బలగంతో స్థానిక నవాబు మీద విజయం సాధించి ఆంగ్లేయుల వలస పాలనకు నాంది పలికాడు. అన్నట్టు ఈ ఆక్రమణదారులు తమ సైనిక శక్తి, ఆయుధ బలం మీదనే ఆధార పడలేదు: యూరోపియన్ వలసవాదులకు బాగా అలవాటైన ‘విభజించి పాలించు’ అన్న యుక్తిని ఇక్కడా తమ విజయానికి వాడుకున్నారు. ఇన్కా ప్రభువుల పాలనతో అసంతృప్తి చెంది ఉన్న స్థానిక బృందాలను చేరదీసి, వారి మద్దతు సంపాదించి ఇన్కా సామ్రాజ్యాన్ని కూలదోయగలిగారు.


నేను అలా చరిత్ర పుటల మధ్య తిరుగాడుతూ ఉండగా మా ప్రయాణం ఎవెన్యూ ఆఫ్ వాల్కనోస్ ప్రాంతంలో కొనసాగింది. అక్కడి ఓ పర్వతానికి అతవాల్ప పేరు పెట్టారు. మరో పర్వతానికి స్థానిక ఇన్కా సైన్యాధికారి జనరల్ రుమినావి (Ruminawi) పేరు పెట్టారు. ఈ రుమినావి ఇన్కా సామ్రాజ్యం పతనమై అతవాల్ప వధించబడిన తర్వాత కూడా స్పానిష్ ఆక్రమణదారులకు ఎదురు నిలచి తిరుగుబాటు కొనసాగించాడు. కీతో నగరాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడడానికి శాయశక్తులా పోరాడాడు. నగరపతనం తప్పదు అని అర్థమయ్యాక స్పానిష్ ఆక్రమణ దారులను ప్రముఖంగా ఆకర్షించిన నగరసంపదను సురక్షితస్థానానికి తరలించి నగరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు.

నేను ప్రయాణం చేసిన లాటిన్ అమెరికా దేశాలలో ఒక విషయం స్పష్టంగా గమనించాను. అక్కడివాళ్ళంతా తమ తమ ప్రీ-కొలంబియన్ మూలాల అన్వేషణలో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తమ ప్రాంతంలోకి కొలంబస్, ఆ తర్వాత అనేకానేక యూరోపియన్ శక్తులూ అడుగుపెట్టడానికి ముందు ఆయా ప్రదేశాల్లో వికసించి, విలసిల్లిన మాయన్, ఇన్కా, ఆస్టెక్ లాంటి నాగరికతల గురించి, ఆయా కాలాల నాటి చారిత్రక పౌరాణిక వ్యక్తుల గురించి శోధించి తెలుసుకోవాలన్న ఉత్సుకత వారిలో నాకు బాగా కనిపించింది.

మేమంతా బ్రేక్‌ఫాస్ట్ కోసం ఓ రోడ్డు పక్క రెస్టరెంటు దగ్గర ఆగాం. అప్పటికే కీతో నగరం దాటి వచ్చేశాం. మరి కాసేపటికి అంతా కొతోపాక్సీ నేషనల్ పార్క్ చేరుకున్నాం. ఈ పార్క్ ఆండీస్ పర్వతశ్రేణి నడుమన ఉంది. అక్కడ ఉన్న పర్వతాలలో కొన్ని మాత్రమే అగ్నిపర్వతాలు. 5827 మీటర్ల కొతోపాక్సీ శిఖరం ఆఫ్రికాలోకెల్లా అగ్రస్థానంలో ఉన్న కిలిమంజారో కన్నా రెండు మీటర్లు ఎక్కువ ఎత్తు. ప్రపంచంలో ఎత్తయిన సజీవ అగ్నిపర్వతాలలో దీనిది మూడవ స్థానం.

మేము పార్కులోకి ప్రవేశించినప్పుడు ఇంకా పొగమంచు విడలేదు. అక్కడి వాతావరణం క్షణక్షణానికి మారిపోతూ ఉంటుందట. అగ్నిపర్వత శిఖరాగ్రం నుంచి చిక్కని పొగ వెలికి వస్తోంది. నిజానికి అది ఆ పర్వతం విరజిమ్ముతున్న బూడిద-పొగల మిశ్రమం. పొగతోపాటు ఆ పరిసరాలన్నీ గాఢమైన గంధకధూమంతో నిండిపోయాయి. పర్వతం చిమ్ముతోన్న హైడ్రోజన్ సల్ఫైడ్ వాసన అది. సామాన్యభాషలో చెప్పాలంటే అది మురిగిన కోడిగుడ్ల వాసన. అగ్నిపర్వతాల నుంచి వెలువడే వాయుపరంపరలో ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ ముఖ్యమైనది.

ఇహ ఆ పర్వతసీమలోని బూడిద దగ్గరకు వస్తే దాని ఉనికి సర్వవ్యాపితం. మా బట్టల మీద, టోపీల మీద, బూట్ల మీద సన్నని పొర పేరుకుపోయింది. అన్నట్టు కొతోపాక్సీ పర్వతపు ఉన్నత ప్రాంతాలు గ్లేషియర్‌ – హిమానీనదాలతో నిండి ఉన్నాయి. ఆ గ్లేషియర్‌లూ అక్కడి మేఘాలు కలగలిసి ఏది మేఘమో, ఏది గ్లేషియరో తెలియకుండా పోయింది.

సైన్సు, టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అగ్నిపర్వతాల విస్ఫోటనానికి చెందిన వివరాలు ముందే గ్రహించడమూ, తగిన హెచ్చరికలు ఆ ప్రాంతమంతా ప్రసారం చేయడం, అవసరం వచ్చినప్పుడు ఆయా ప్రదేశాలను పూర్తిగా ఖాళీ చేయించడం సులభసాధ్యమైంది. కొతోపాక్సీ జ్వాలాముఖి చివరిసారిగా 1887లో నిప్పులు చిమ్మింది. ఇప్పుడు ఆ పరిసరాల్లో కనిపించే రాళ్ళు, బండలు ఆ 1887 నాటి విస్ఫోటనానికి చెందినవట.

అక్కడి పచ్చిక బయళ్ళలో ఎన్నో గుర్రాలు గడ్డిమేస్తూ కనిపించాయి. అవన్నీ ఆ ప్రాంతాలలోని స్పానిష్‌వారి విశాలమైన ఎస్టేట్లనుంచి పారిపోయి వచ్చి అడవి గుర్రాలుగా మారిన బాపతట. ఇదేదో ఆసక్తికరంగా ఉందే అనిపించింది. పెంపుడు జంతువుగా మారకముందు గుర్రాలు అడవి జంతువులుగానే మనుగడ సాగించాయి. అవే గుర్రాలు ఇప్పుడు పెంపుడు జంతువు అన్న స్థితి నుంచి తప్పించుకుని మళ్ళా వన్యప్రాణులు అవుతున్నాయి. తమ మౌలిక మూలాలలోకి మళ్ళుతున్నాయి. ఇలా వన్యమృగంగా మారడమూ ప్రకృతిలోకి తిరిగి ప్రయాణించడమూ అన్న భావన నాలో ఎన్నో ఆలోచనలకు కారణభూతమైంది.

ఆ మాటకొస్తే నిన్న మొన్నటిదాకా మనుషులు కూడా ప్రకృతిలో భాగంగానే మనుగడ సాగించారు. అదే మనిషి నాగరికత నేర్చి ప్రకృతి మీద ఆధిపత్యం సంపాదించే దశకు వచ్చినప్పుడు పరిస్థితి మారింది. మానవజాతి ప్రకృతి నుంచి విడివడటం మెల్లమెల్లగా మొదలైంది. మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న సమతౌల్యం చెదిరింది. ప్రకృతిని పీడించి మరీ తనకు కావలసినవి పిండుకునే నేర్పు మనిషికి అలవడింది. ప్రకృతికి దూరం అవ్వడం వేగవంతం అయింది. పారిశ్రామిక విప్లవం తరువాత గత 200 సంవత్సరాల కాలంలో మనిషికి ప్రకృతికి మధ్య పూడ్చలేని అగడ్త ఏర్పడింది. ఆ దూరం వెర్రితలలు వేసి మనిషే ప్రకృతి విధ్వంసకారిగా పరిణమించాడు. అదుపులేని భౌతిక అవసరాలకు, వస్తువినిమయ సంస్కృతికి ఈనాటి మనిషి దాసోహం అంటున్నాడు. భూగోళం మీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకూ ప్రమాదం ఏర్పడుతోంది. అలాంటి విపరీత పరిణామాలకు కారణభూతమైన తరానికి చెందిన వ్యక్తిని అన్న స్పృహ కలిగినప్పుడల్లా నన్ను చూసి నాకే సిగ్గేస్తోంది.

ఆ తర్వాత మేము నేషనల్ పార్క్‌లో ఉన్న లింపియొపూంగొ లగూన (Limpiopungo Laguna) అన్న విశాల సరోవరం దగ్గర ఆగాం. అగ్నిపర్వత సానువుల్లోంచి వస్తోన్న జలధారలు ఈ సరోవరం దగ్గర కూడుకోవడం గమనించాం. కొన్ని స్థానిక పక్షులు, నిడుపాటి గడ్డితుప్పలు అక్కడ కనిపించాయి. పిచించా అగ్నిపర్వతం దగ్గర కనిపించిన నారింజరంగు పూలు – స్పియర్స్ ఆఫ్ ఫైర్ – ఇక్కడ కూడా కనిపించాయి. ఈ పూలు ఎక్వదోర్ ట్రెకర్ల గుర్తింపు చిహ్నాలు – ఎంబ్లమ్‌లట. ఆ మొక్కల ఆకులతో ట్రెకర్లు టీ కాచుకుంటారని, అది వారిని హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ నుంచి కాపాడుతుందని చెప్పుకొచ్చింది మా గైడ్ ఆండ్రియా.


మేమా విశాల సరోవరం చుట్టూ ప్రదక్షణ చేస్తున్న సమయంలో వాతావరణం తేటపడింది. కొతోపాక్సీ శిఖరాన్ని ఆవరించి ఉన్న మబ్బులు తొలగాయి. శిఖరం చక్కగా కనబడసాగింది. ఆ అగ్నిపర్వతపు నడుమ భాగాల చుట్టూ మేఘాల వృత్తాలు చుట్టుకుని ఉన్నమాట నిజమే అయినా శిఖరం మాత్రం అతి చక్కని శంకువు రూపంలో వెలిగిపోతూ కన్నుల పండుగ చేసింది. జపాన్‌కు చెందిన మౌంట్ ఫుజిని తలపించింది. తరచూ ఈ కొతోపాక్సీని ఫుజి శిఖరపు కవల రూపంగా వ్యవహరిస్తూ ఉంటారట.

కొతోపాక్సీ నేషనల్ పార్క్ విడిచి పెట్టే సమయం అయింది. వెళ్ళే ముందు అక్కడి సువనీర్ షాప్‌లో ఆగాం. కొతోపాక్సీ పర్వతపు మోడళ్ళ ప్రదర్శన కొలువుదీరి కనిపించింది. ఆగ్రాలో కనిపించే తాజ్‌మహల్ నమూనాలు గుర్తొచ్చాయి. అక్కడ అందరం కాఫీ తాగి మా తదుపరి గమ్యం కిలొతోవా బిలతటాకం వైపుగా దారి తీశాం. రెండు గంటల ప్రయాణం అది. సిమోన్ బొలీవార్ రహదారి మీదుగా వెళ్ళి వెళ్ళి చివరికి రెండు అమెరికా ఖండాల వెన్నెముక అయిన పాన్ అమెరికన్ హైవేలో కలిశాం. దారిలో కనిపించే అగ్నిపర్వతాలను ఆండ్రియా పరిచయం చేస్తూ వెళ్ళింది. నిమిషానికో పర్వతం చొప్పున కనిపించసాగాయవి.

ఆ ప్రాంతమంతా సారవంతమైన నేల. రకరకాల పంటలు మమ్మల్ని పలకరిస్తూ పోయాయి. ఆండ్రియాను మాటల్లో పెట్టాను. తమ దేశంనుంచి పెట్రోలియం, అరటికాయలు (plantain), కోకా విత్తనాలు, గులాబీలు, గాజు రొయ్యలు బాగా ఎగుమతి అవుతాయని చెప్పిందావిడ. అలాగే ఎక్వదోర్‌ దేశం కీన్వా (quinoa) బియ్యానికి ప్రసిద్ధి. ఈ మధ్యకాలంలో ఆరోగ్యవంతమైన ఆహారపదార్థంగా దానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాక అమెరికాలోను, యూరప్‌లోనూ గిరాకీ బాగా పెరిగిందట. ఆ గిరాకీ పుణ్యమా అని ధరలు కొండెక్కాయట. అనాది కాలం నుంచి ఆ ధాన్యం మీదే ఆధారపడి ఉన్న స్థానిక ప్రజానీకానికి అందనంతగా కీన్వాకు రెక్కలు వచ్చాయట.

అరటికాయలు స్థూలంగా ఆసియాకి చెందినవి. యూరోపియన్లు వీటిని అమెరికాలకు పరిచయం చేశారు. శరవేగంతో అవి ఉభయ అమెరికా ఖండాల్లో, ముఖ్యంగా దక్షిణ అమెరికాలో అల్లుకుపోయాయి. వారి జనజీవన స్రవంతిలో భాగమయ్యాయి. ఎక్వదోర్ అయితే ప్రపంచంలో ప్లాన్‌టెయిన్లను ఎగుమతి చేసే దేశాల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. భారతదేశంలోనూ అరటిపంట విరివిగా ఉంది గానీ అదంతా దేశంలోనే వినియోగింపబడుతోంది. ఎక్వదోర్‌తో పాటు మరికొన్ని దక్షిణ అమెరికా దేశాలు అరటి ఎగుమతిలో బాగా ముందున్నాయి. ఆ చిన్న చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థ అంతా అరటిపంట చుట్టూనే పరిభ్రమించడమూ కద్దు. అనేక ఆర్థిక రాజకీయ కారణాల వల్ల ఈ దేశాలకు ‘బనానా రిపబ్లిక్స్’ అన్న అవాంఛనీయమైన బిరుదు అంటుకుపోయింది (నిజానికి ఇవి బనానాలు – అంటే అరటిపళ్ళు కావు, ప్లాన్‌టెయ్‌న్ అనబడే మన కూర అరటి.)

ఎక్వదోర్‌ విరివిగా పండించే మరొక పంట బంగాళాదుంప. 80 రకాల బంగాళదుంపల్ని అక్కడ పండిస్తారట. బంగాళాదుంపలు, టొమాటోలు ఉభయ అమెరికా ఖండాలు తతిమా ప్రపంచానికి బహుమతులుగా అందించిన పంటలు. ఇటలీ, ఇండియాలాంటి ప్రపంచంలోని అనేకానేక దేశాల వంటకాల్లో ఈ బంగాళదుంపలు, టొమాటోలు ఇప్పుడు విడదీయలేని భాగం అయిపోయాయి.

ఉన్నట్టుండి ఓ నక్క రోడ్డు దాటుతూ కనిపించింది. అది ఈ ప్రాంతంలో తరచూ కనిపించే ఆండియన్ ఫాక్స్ అని వివరించింది ఆండ్రియా. మన రాబందులను పోలిన ఆండియన్ కాండోర్స్ అన్న పెద్దపాటి పక్షులు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తాయట. ఆ పక్షి ఎక్వదోర్‌ దేశపు అధికారిక చిహ్నం కూడానట. కానీ మాకా పక్షిని చూసే అదృష్టం కలగలేదు. రోడ్డుమీద పరుగులు పెట్టే వాహనంలో కూర్చుని అలాంటి పక్షిని చూడడం కష్టం అనుకుంటాను.

మరి కాసేపట్లో పుయిలి (Pujili) అన్న పట్టణం వచ్చింది. దేశవాళీ అమెరికన్ల జనాభా ఎక్కువగా ఉన్న పట్టణమది. కొతోపాక్సీ ప్రావిన్స్‌లోని పుయిలి ప్రాంతం విభిన్న తెగలకు చెందిన నేటివ్ అమెరికన్‌లకు ఆలవాలం. అక్కడ నివసించే స్పానిష్ అమెరికన్ మిశ్రమజాతి మెస్తీహోల (Mestijo) కన్నా ఆదిమతెగలకు చెందిన స్వచ్ఛమైన దేశవాళీ ప్రజల సంఖ్య చాలా ఎక్కువట.

ఎక్వదోర్‌ జనాభా అంతా కలిసి ఒకటి ముప్పావు కోట్లు. అందులో నాలుగో వంతు నేటివ్ అమెరికన్లు. అరవై అయిదుశాతం మిశ్రమజాతి వ్యక్తులు. ఆఫ్రికన్లు, తెల్లవాళ్ళు మిగతా పది శాతం. కెచువా (quechua) అన్నది స్థానిక తెగలవారు విరివిగా వాడే భాష. అలనాటి ఇన్కా సామ్రాజ్యపు అధికార భాష ఈ కెచువా. ఇప్పటికీ ఎక్వదోర్‌, పెరు, బొలీవియా, చిలే దేశాలలోని 12 లక్షల మంది స్థానిక తెగలవారు ఈ కెచువా భాషనే మాట్లాడతారు. ఎక్వదోర్‌ దేశంలో స్పానిష్ భాష తర్వాత ఇది రెండవ అధికార భాష.

అందరం తిగ్వా (Tigua) అన్న గ్రామంలో కాసేపు ఆగాం. ఈ ఊరు వర్ణచిత్రాలకు ప్రసిద్ధి. అక్కడనుంచి ముందుకు సాగి కిలొతోవా బిలసరోవరం చేరుకున్నాం. దారంతా మెలికలు మెలికలుగా సాగింది. దారి పొడవునా లోయలు… లోయల అడుగున, కొండచరియల్లోనూ చిక్కని చక్కని పంట భూములు.

కిలొతోవా అగ్నిపర్వతం శిఖరాగ్రాన విస్ఫోటనల ఫలితంగా బిలముఖంలో ఏర్పడిన మూడు కిలోమీటర్ల వ్యాసంగల సరోవరం కిలొతోవా లగూన. స్థూలంగా వృత్తాకారపు సరోవరమది. పన్నెండు కిలోమీటర్ల చుట్టుకొలత. చుట్టూ నాలుగు వందల మీటర్ల నిడుపాటి బిలపు గోడలు. అక్కడి విస్టా పాయింట్ ఏకంగా 3215 మీటర్ల ఎత్తున నెలకొల్పబడి ఉంది. సరోవరపు జలాల దగ్గరకు చేరుకోవాలంటే ఆ 400 మీటర్ల బిలపు గోడలను దిగి వెళ్ళాలి. వాతావరణం, వెలుతురు స్థాయిలనుబట్టి ఆ సరోవర జలాలు నీలిరంగు నుంచి ఆకుపచ్చ దాకా తమ వర్ణాన్ని మార్చుకుని కనిపిస్తాయి. ఆ మిట్టమధ్యాహ్నం మేము చూసినప్పుడు లేత పచ్చని వైఢూర్యం రంగులో ఉన్నాయా నీళ్ళు. స్థానికులు ఆ సరోవరాన్ని ఆకాశానికి దర్పణం అని పిలుస్తారట. ఏది ఏమైనా ఆ సరోవరం ఎంతో సుందరమైనది అన్నది నిస్సందేహం. అక్కడికి చేరిన పర్యాటకులు అందరూ విభిన్న కోణాలనుంచి చకచకా సరోవరాన్ని డజనుల కొద్దీ ఫోటోలు తీయడంలో సహజంగానే నిమగ్నులైపోయారు.

మేమంతా ఆ చెరువు పరిసరాల్లో ఓ గంట గడిపాం. దాని అందాన్ని అనేక కోణాల్లో దర్శించాం. జలాలకు మరింత దగ్గర అవడానికి కాస్తంత దిగువకు నడిచాం. అక్కడి కిలొతోవా గ్రామం పర్యాటకులతో కళకళలాడుతూ కనిపించింది. ఊరునిండా రెస్టరెంట్‌లు ఉన్నాయి. ఆండ్రియా మమ్మల్ని చుకిరావా అనే చక్కని రెస్టరెంట్‌కి తీసుకెళ్ళింది. కిలొతోవా గ్రామంలో అందరూ బాగా ఇష్టపడే గిసాదొ దె బొర్రేగొ (guisado de borrego) అన్న వంటకం రుచి చూడమని ప్రోత్సహించింది. లేత మేక మాంసపు ఇగురుతోపాటు సాలడ్, ఓ చిన్న ముద్ద అన్నం, అవకాడో గుజ్జుతో చేసిన వాకమోలె, వేయించిన పెద్దపాటి అరటి ముక్క – సంపూర్ణ ఆహారమది. అందరం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ తీరిగ్గా లంచ్ చేశాం. మా కబుర్లలో ఆనాడు మేము చూసిన విశేషాలు అనుభవాలు దగ్గర్నుంచి ప్రపంచ రాజకీయాల దాకా దొర్లని విషయం లేదు.

భోజనం ముగించాక అక్కడికి దగ్గర్లో ఉన్న తొఆచి (Toachi) రివర్ కాన్యన్ అన్న ఆసక్తికరమైన భౌగోళిక ప్రాంతం చేరుకున్నాం. అక్కడి శిలల మధ్యన ప్రవహిస్తోన్న నది ఆ శిలలను వేల సంవత్సరాలపాటు కోతకు గురిచేసి ఏర్పరచిన వంద మీటర్ల లోతుగల గండి – కాన్యన్ – మాకు ఎదురుగా కనిపించింది. విస్టా పాయింట్ నుంచి కనిపించిన ఆ కాన్యన్ దృశ్యం మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. కాసేపు అక్కడ గడిపి ఓ కాఫీ తాగి, కీతోకు తిరుగు ప్రయాణం ఆరంభించాం. ఆ తిరుగు ప్రయాణమంతా సహయాత్రికులతో ఎడతెగని కబుర్లతో గడిచిపోయింది. మటాన, బార్, రేచల్, జెస్సికా కబుర్ల పుట్టలుగా మారారు. నేను నా యాత్రానుభవాలను వాళ్ళతో పంచుకున్నాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు శ్రద్ధగా సమాధానాలు చెప్పాను. అలాగే ఆ యువతీ యువకులు జీవితం గురించి, ప్రపంచం గురించి ఎలాంటి ఆలోచనలు, భావాలు కలిగి ఉన్నారో తెలుసుకొనే ప్రయత్నం చేశాను. స్థూలంగా ఇప్పటి యువతరం పర్యావరణ పరిరక్షణ మీద దృష్టి పెడుతోందని, ఆ విషయంలో ఎవరితోనైనా ధైర్యంగా తలపడడానికి సిద్ధపడుతోందని నాకనిపించింది. ఆ ఎరుక సంతోషం కలిగించింది. అలాగే ఇప్పటి యువతరం నా తరం వాళ్ళతో పోలిస్తే సామాజికంగా మరికాస్త చురుగ్గా ఉంటోందని అనిపించింది.


కీతో చేరేసరికి సాయంత్రం ఏడు దాటింది. ఆండ్రియా సిఫార్సు చేసిన ప్రకారం సిటీ సెంటర్లో అస్త ల వుఎల్తా (hasta la vuelta) అన్న రెస్టరెంట్లో డిన్నర్‌కు కుదురుకున్నాను. ఆ పేరుకు అర్థం ‘మళ్ళీ వచ్చేదాకా’ అని అట. నా ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్‌ని ఆ పేరు వెనక ఉన్న కథ ఏమిటో చెప్పమన్నాను. ఏనాడో ఒక కేథలిక్ మతపెద్ద ఇక్కడికి వచ్చి ఆ మాటలు పలికాడట. అలా ఆ పదబంధం ఈ రెస్టరెంట్‌తో ముడిపడిందట. ‘అంతే… అంతకన్నా నాకేం తెలియదు’ అనేశాడా వెయిటరు. నేనడగాలనుకున్న తదుపరి ప్రశ్నలు నాలోనే ఉండి పోయాయి. ఈ రెస్టరెంట్ వలస కాలపు వాతావరణం ఉట్టిపడే ప్లాసా గ్రాందె అన్న ప్రాంతంలో ఉన్న ఓల్డ్ బిషప్స్ ప్యాలెస్‌లో ఉంది. చక్కని పరిసరాలవి.

ఆండీస్ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో మొక్కజొన్ననుంచి తయారు చేసే చిచా అన్న మదిర తెప్పించుకొని రుచి చూశాను. ఆ పానీయం ఆ ప్రదేశాల్లో మాత్రమే తయారవుతుందట. దాని మూలాలు ఇన్కా నాగరికత పూర్వపుదినాల నాటివట. ఇన్కా ప్రజానీకం కూడా పండుగలు పబ్బాలలో ఈ మదిరను కాచి విరివిగా సేవించేవారట. స్పానిష్‌వాళ్ళు ఆ ప్రాంతాల్లో దొరికే దేశవాళీ మదిరలన్నిటినీ చిచా అనే పిలిచేవారట. కానీ స్థానికులు ఆ పదాన్ని లాక్టోస్ శాతం ఎక్కువగా ఉన్న మొక్కజొన్నను పులియబెట్టి చేసిన పానీయానికే వాడతారు. రుచిలో అది బీరుని పోలి ఉంటుంది. నా ప్రయాణాల్లో నేనొక విషయం గమనించాను. మత్తు పానీయాలను స్థానికంగా తయారుచేసుకోవడం అన్నది అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ సాగిపోతున్న ప్రక్రియ. స్థానికంగా దొరికే, చక్కెర పాలు ఎక్కువగా ఉండే పదార్థాలను పులియబెట్టడం అన్నది అన్ని చోట్ల మత్తు పదార్థాల ఉత్పత్తి వెనుక ఉన్న మౌలిక ధాతువు. ఆ పదార్థాలు పిండి పాళ్ళు ఎక్కువగా ఉండే బార్లీ, వరి ధాన్యం, గోధుమలు, బంగాళదుంపలు, ద్రాక్షలు ఏమన్నా కావచ్చు. చక్కెర పాలు ఎక్కువ ఉండాలి, అంతే. ఈ అమెరికా ఖండాలలో మొక్కజొన్న అలా విరివిగా దొరికే పదార్థం. అంచేత ఆ మొక్కజొన్న ఈ ప్రాంతాల్లో మదిర ఉత్పత్తికి మూలధాతువు అయింది.

చిచా సేవనం ముగిసాక తమాలె దె గలీనా అన్న వంటకం ఆర్డర్ చేశాను. చికెన్ ముక్కలు దట్టించి ఆకులో చుట్టి అందించే ఎక్వదోరియన్ మొక్కజొన్న పేస్ట్రీ అది. వడ్డించేటప్పుడు మా వెయిటర్ ‘ఆకును తినకండి’ అని మృదువుగా హెచ్చరించాడు. ‘బాబూ, అరటి ఆకుల్లో భోజనం చేసే సంస్కృతికి చెందిన మనిషిని నేను. మరేం అనుమానం పెట్టుకోక’ అని అంతే మృదువుగా, సరదాగా బదులిచ్చాను. కీతో నగరంలో నేను తీసుకుంటోన్న ఆఖరి భోజనమది. మొత్తానికి ఎక్వదోరియన్ వంటకాలతో చక్కని పరిచయమే ఏర్పరచుకున్నాను అనిపించింది.


నా తదుపరి గమ్యం దేశానికి దక్షిణాదిన ఉన్న క్వెన్‌క (కుఎన్‌క: Cuenca) అన్న నగరం. దక్షిణ ఎక్వదోర్‌ లోని హై ఆండీస్ పర్వతశ్రేణిలో 2550 మీటర్ల ఎత్తున ఉన్న నగరమది. వలస కాలపు శోభకు, పర్వతసీమ సౌందర్యానికి, ఆండీస్ ప్రాంతపు సంస్కృతికి పట్టుకొమ్మ ఈ నగరం. కీతోనుంచి రోడ్డుమీద వెళ్ళాలంటే 485 కిలోమీటర్లు. కారులో ఎనిమిది గంటలు, బస్సు అయితే పది. నేను ఇష్టపడే పాన్ అమెరికన్ హైవే ఈ రెండు నగరాలను కలుపుతూ సాగిపోతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ ప్రయాణానికి నేను పబ్లిక్ ట్రాన్‌స్పోర్ట్ వాడి ఉండేవాడిని. కానీ ప్రయాణపు సూక్ష్మ వివరాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని అధిగమించలేని సమస్యలు కనిపించాయి. ఈ రెండు నగరాల మధ్య నడిచే బస్సులన్నీ రాత్రిపూట తిరుగుతున్నాయి. బస్ స్టేషన్ ఏమో మా హోటల్‌కు చాలా దూరాన ఉంది. ఆన్‌లైన్‌లో గాని స్థానిక ఏజెంట్ ద్వారా గానీ బస్సు టికెట్ తీసుకోలేకపోయాను. ‘మరేం పర్లేదు, ఆ బస్సుల్లో సీట్లు ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. తిన్నగా బస్ స్టేషన్‌కు వెళ్ళి బస్సు పట్టుకో’ అని స్థానికులు సలహా చెప్పారు. కానీ ధైర్యం చేయలేకపోయాను. తీరా చేసి వెళితే బస్సు ఎక్కలేకపోయిన పక్షంలో అటు ఇటు కాకుండా ఇరుక్కుపోతాను. రాత్రంతా రికామిగా గడపాల్సి వస్తుంది. పైగా నాకు రాత్రి పూట బిక్కుబిక్కుమంటూ చీకట్లో ఏ దృశ్యమూ కనిపించకుండా ప్రయాణం చెయ్యడం అంటే సరిపడదు. పరిసరాల పరిశీలన లేని రోడ్డు ప్రయాణం ఎందుకు? రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాణం చేసి అలసి సొలసి గమ్యం చేరడంలో సుఖమేముంటుంది? చక్కగా రాత్రంతా నిద్రపోగలిగితే మర్నాడంతా చురుగ్గా ఉండవచ్చు కదా… బస్సు ప్రయాణంలో ఉన్న ఒకే ఒక సౌలభ్యం ఏమంటే అది బాగా చౌక.

ఆలోచనలు కట్టిపెట్టి విమానాల వివరాలు చూశాను. ఉదయం 11:49కి కీతోలో బయలుదేరి 55 నిమిషాల్లో క్వెన్క చేర్చే విమానం ఒకటి కనిపించింది. మరో ఆలోచన లేకుండా వెంటనే బుక్ చేశాను. అలా మర్నాటి ప్రయాణాన్ని ఫైసలు చేశాక నిశ్చింతగా పడక ఎక్కాను.

మర్నాటి ఉదయం బాగా పొద్దున్నే లేచాను. కీతో నగరపు హిస్టారిక్ సెంటర్లో ఓ గంట సేపు నడిచి రావాలన్నది నా ఆలోచన. అప్పటికే నాలుగు రోజులపాటు కీతో నగరం నాకు ఆశ్రయం ఇచ్చింది. ఆనాడు ఐదో రోజు. నగరంతో ప్రేమలో పడ్డాను. కీతోలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. సమ్మోహక శక్తి ఉంది. చక్కని భవనాలు, కూడలులు, ఉద్యానవనాలు, చర్చి ప్రాంగణాలు–నగరంలో హుందాతనం ఉంది. భేషజాలకు అతీతమైన ఆత్మీయ భావన ఉంది.

అన్ని రోజులు కీతో నగరంలో ఉన్న మాట నిజమే గానీ ఒక్క విషయంలో నిరాశతో వెళ్తున్నానని చెప్పాలి. ‘ఇగ్నేసియా ద ల కంపానియా ద హేసూస్’ అన్న సుందరమైన చర్చి ప్రాంగణం చూడటం పడనే లేదు. అప్పటికీ ఒకసారి వెళ్ళాను. మూసివేసి ఉంది. ఈరోజు విమానం పట్టుకునేలోగా వెళ్ళి వద్దామంటే అది తెరిచే సమయం కాదు. కానీ ఒక్క మాట – ఇన్నేళ్ళ ప్రయాణం, అనుభవాలు నాకు ఆశ-నిరాశలను ఒకే రకమైన స్థిరత్వంతో స్వీకరించడం నేర్పాయి. ఒక్కోసారి అనుకోని సంబరాలు ఎదురవవచ్చు, మరోసారి ఊహాతీతమైన నిరాశ చుట్టుముట్టవచ్చు. ఇవన్నీ యాత్రాజీవితంలో తటస్థపడే వాస్తవాలు. పరిణతి చెందిన యాత్రికుడు వీటన్నిటిని సమభావంతో స్వీకరిస్తాడు… కీతో నగరానికి మరోసారి వీడ్కోలు పలికి విమానాశ్రయం వేపు సాగిపోయాను.

నేను ఎక్కిన విమానం లాథమ్ ఎయిర్ అన్న చిలె దేశపు విమానయాన సంస్థకు చెందినది. ఆనాడు వాతావరణం సజావుగా ఉండటంవల్ల విమానంలోంచి ఆండీస్ పర్వతాలు ఎంతో స్పష్టంగా కనిపించాయి. వాటిలో కొన్ని పర్వతాలు మంచుతో కూడి ఉన్నాయి.

నా పక్కన ఓ మధ్య వయసు మహిళ కూర్చుని ఉన్నారు. బహుశా ఏభైల నడుమ వయస్సు అయి ఉండాలి. ఆమె ఏవో ఆఫీసు కాగితాలు చదవటంలో నిమగ్నమై కనిపించారు. అంచేత సంభాషణ ఆరంభించడానికి సందేహించాను. కాసేపటికల్లా ఆమె కాగితాలను ఒక బ్యాగులో సర్ది పరిసరాలను గమనించటం మొదలుపెట్టారు. చొరవ చేసి నాతో సంభాషణ కూడా ఆరంభించారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆమె పేరు ఎస్మరాల్ద అట. క్వెన్క నగరానికి చెందిన మనిషి. కీతో నగరంలో ఏవో ఆఫీసు పనులు చూసుకుని అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్న తన కూతుర్ని పలకరించి, క్వెన్క నగరానికి తిరిగి వెళుతున్నారు.

క్వెన్క నగరం ఎక్వదోర్‌లోకెల్లా మూడవ పెద్ద నగరమని, జీవన సౌకర్యం దృష్ట్యా దేశంలో అతి ఉత్తమ ప్రదేశమని చెప్పుకొచ్చారామె. ‘చిన్న నగరం మాది. అంతా కలిసి ఐదు లక్షల జనాభా. కీతో, గ్వయాకీల్ లాంటి మిగిలిన పెద్ద నగరాలలాగా క్వెన్క నగరం మనిషిని చుట్టుముట్టి అదుపులో ఉంచుకుంటోన్న భావన కలిగించదు. ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటుంది. ఇది మన ఊరు అన్న ఆత్మీయభావన కలిగిస్తుంది. మనుషులు స్నేహంగా ఉంటారు. నేరాలు తక్కువ…’ పరవశంగా చెప్పుకొచ్చారామె. ఆ ఊరు అమెరికన్ ఎక్స్‌పాట్స్‌కు కూడా అభిమాన ప్రదేశమట. చెప్పుకోదగిన సంఖ్యలో వాళ్ళా ఊళ్ళో నివసిస్తున్నారట. ఊళ్ళోని విశేషాల గురించి ఆమె దగ్గర కొన్ని వివరాలు సేకరించాను. రెస్టరెంట్ల గురించి అడగటం మర్చిపోలేదు. క్వి (Cui) అన్న ఎక్వదోర్‌ ఖాద్యవిశేషం రుచి చూడడానికి క్వెన్క నగరమే సరైన వేదిక అని చెప్పుకొచ్చారామె. వేయించిన గినీ పందులు ఆ వంటలోని మూలధాతువట.

నా జిజ్ఞాసల సంగతి ఎలా ఉన్నా ఓ సుదూర దేశపు మధ్య వయస్కుడు తన ఊరికేసి ఇలా ఎందుకు ప్రయాణం చేస్తున్నాడా అన్న కుతూహలం, ఆశ్చర్యం ఆమెను చుట్టుముట్టడం గమనించాను. ఇండియాలోని మనుషులకు అసలు క్వెన్క అన్న ఊరు ఉందని తెలుసా అని అడిగారామె. ఈ ప్రశ్న అచ్చంగా మా ఊరు హైదరాబాదు గురించి అపరిచితులను నేను అడిగే ప్రశ్నలాంటిదే! ప్రతివారికీ అవతలివాళ్ళు – ముఖ్యంగా విదేశీయులు, తమ ఊరు గురించీ దేశం గురించీ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందనుకుంటాను. ముఖ్యంగా రెండవ శ్రేణి నగరాల్లోంచి వచ్చినవారికి ఈ కుతూహలం ఎక్కువగా ఉంటుంది. న్యూఢిల్లీ, వాషింగ్టన్, కైరో, టోక్యో, బుయెనోస్ ఎయిరెస్ లాంటి రాజధాని నగరాల గురించి అందరికీ తెలిసే అవకాశముంటుంది. ఆగ్రా, మయామి, లక్సర్, క్యోటో, రియో దె హెనైరో లాంటి నగరాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి కాబట్టీ వాటి గురించీ మనం పెద్దగా చెప్పక్కర్లేదు. వైజాగ్, పుణె, బరోడాలాంటి రెండవ శ్రేణి ప్రదేశాల సంగతి వేరు. అవి విదేశీ పర్యాటకులకు తెలుసా లేదా అన్న కుతూహలం ఆయా నగరాలవారికి సహజంగానే ఉంటుంది. నిజానికి హైదరాబాద్ సంగతి వేరు. నిన్న మొన్నటిదాకా అది ద్వితీయ శ్రేణి ప్రదేశమే అయినా ఐటీ పుణ్యమా అని ఇపుడది అందరికీ తెలిసివస్తోంది. నేను లండన్ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసేటపుడు విమానమంతా ఎన్నారైలతో నిండి ఉంటుంది. అప్పుడప్పుడు ఒకటీ అరా విదేశీయులు కనిపిస్తారు. వాళ్ళను ఈ కుతూహలపు ప్రశ్న అడుగుతూ ఉంటాను. ఏదేమైనా ఎస్మరాల్ద అడిగిన ప్రశ్నకు నా దగ్గర సరైన సమాధానమే ఉంది. ‘క్వెన్క నగరం యునెస్కోవాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన అరుదైన నగరాలలో ఒకటి. అంచేత మీ ఊరు చూడాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను’ అని చెప్పాను. సంతోషించారామె. తమ ఊరు అందచందాలను దృష్టిలో పెట్టుకుని దానిని ‘ఏథెన్స్ ఆఫ్ ఎక్వదోర్‌’ అని పిలుస్తారన్న అదనపు సమాచారం అందించారామె!

‘ఈ క్వెన్క అన్న పదానికి అర్థం ఏమిటీ’ అని అడిగానామెను. నదీపరివాహక ప్రదేశం అని ఆ పదానికి అర్థమట. అర్థం చెప్పి ఊరుకోకుండా ‘ఇదే పేరుతో స్పెయిన్‌లో మరో ఊరు ఉంది. ఆ పేరే మా ఊరికి పెట్టారు’ అని కూడా వివరించారామె. ఆ స్పెయిన్ దేశపు క్వెన్క నగరం కూడా యునెస్కో వారితో వారసత్వ సంపదగా గుర్తింపు పొందినదేనట. కాకపోతే ఈ ఎక్వదోర్‌ లోని క్వెన్క, స్పెయిన్ లోని క్వెన్కకన్న బాగా పెద్దదీ అందమయినదీనట. అసలీ రెండు ఊళ్ళ మధ్య ఈ నామబంధాలకు మూలమేమిటీ అని ఆమెను అడిగాను. పదహారవ శతాబ్దపు నడుమ దినాలలో స్పానిష్ ఆక్రమణదారులు దక్షిణ అమెరికాలో అడుగుపెట్టి స్థిరపడిన తర్వాత నియమించబడిన వారి వైస్‌రాయిగారిది స్పెయిన్ లోని క్వెన్క నగరమట. అంచేత ఈ ఎక్వదోర్‌ దేశపు నగరానికి సదరు వైస్‌రాయిగారి గౌరవార్థం ఆయన స్వగ్రామం పేరే పెట్టారట. అసలు ఆ నగరం పూర్తిపేరు సాంతా ఆన దె రియోస్ దె క్వెన్క (Santa Ana de Rios de Cuenca) అంటూ మరో వివరం అందించారామె. ‘క్వెన్క నగరం గుండా ప్రవహించే నాలుగు నదులు’ అని ఆ పదబంధానికి అర్థమట. విషయం మరీ క్లిష్టతరమవుతోందనిపించింది. ‘వద్దండీ వద్దు. నేను మీ నగరంలో ఉండేది కొద్ది కాలమే. దానికి క్వెన్క అన్న హ్రస్వనామం బాగా సరిపోతుంది. ఆ పెద్ద పేరు మీ దగ్గరే ఉంచుకోండి. నేను చిన్న పేరుతో సర్దుకుంటాను’ అని సరదాగా అన్నాను. ఆమె నవ్వేసి ‘సరే, సరే, అలాగే కానిద్దాం’ అన్నారు.

మా విమానం మెల్లగా ఆండీస్ పర్వతాల మధ్యనున్న చక్కని పచ్చని లోయలోకి దిగనారంభించింది. క్వెన్క నగరం ఆ లోయలోనే ఉంది. విమానాశ్రయంలోంచి బయటకు వచ్చి హోటలుకు వెళ్ళడానికి ఊబర్ టాక్సీకోసం ప్రయత్నించాను. నాతో వచ్చిన ఒకావిడ ఇక్కడ ఊబర్ పనిచెయ్యదు. లోకల్ ఆప్ వాడాలి అని వివరమందించింది. టాక్సీ కోసం ప్రయాణీకులంతా క్యూ కడుతోన్న చోటికి నన్ను తీసుకువెళ్ళింది. ఆ క్యూలో ఎస్మరాల్ద కనిపించింది. నన్ను చూసి ఆమె క్యూ వదిలి నాతోపాటు క్యూ చివరికి వచ్చి నిలబడింది. మా వంతు వచ్చాక నన్ను టాక్సీ ఎక్కించి డ్రైవరుకు నా హోటలు వివరాలు చెప్పి, జాగ్రత్తగా తీసుకువెళ్ళమని పురమాయించింది.

(సశేషం)