ఒకవారం మార్కెట్ వీధి
ఇంకోరోజు పూలకొట్టు అని
ఒక చోట నుండి ఇంకో చోటికి
నిలకడ లేకుండా నిరంతరం
సాగే అతగాడి జీవనం.
బహుశా
పదమూడేళ్ళ వయసుంటుందేమో
వంతెన పక్కన
నేనా అబ్బాయిని చూసినప్పుడు.
గొడుగును వెల్లకిలా పరిచి
తన సరుకును అందులో
వరుసలుగా పేర్చి పెట్టాడు.
వాటి పొట్టపైన
మైనపు పూత పూసివుండి
రెక్కలు విదల్చలేని స్థితిలో
సీతాకోకచిలుకలు.
సీతాకోకచిలుకలు, సీతాకోకచిలుకలు!
అని అరుస్తూ అందరినీ ఆకర్షిస్తూ
సీతాకోకచిలుకలమ్ముతున్నాడు.
తీసేవారి మునివేళ్ళలో
రంగులు వసివాడని
సీతాకోకచిలుకలు.
బాల్యంలో చేతికి చిక్కకుండా
తప్పించుకున్నవేవో
ఇప్పుడు తమకు చిక్కినట్టు
అందరి కళ్ళలోను విజయగర్వం.
అలమరవైపుకో, గోడవైపుకో
ఆశగా పాకుతూ వెళ్ళే
ఇంటి గోడలమీది బల్లులకు ఇకపై
ఎదురుకానుంది ఒక భంగపాటు.
(మూలం: పట్టాంబూచ్చి విఱ్పవన్ అనే తమిళ కవితాసంకలనంలో అదే పేరున్న కవిత.)