సెప్టెంబర్ 2023

సాహిత్యసమాజాలు బలంగా ఎదగడానికి సాహిత్యాభిలాష, సాహిత్య కృషికి తగిన ప్రోత్సాహం మాత్రమే సరిపోవు. వాటికి వెన్నుదన్నుగా వ్యాపారదృష్టి, దక్షతా ఉండాలి. తెలుగులో చాలాకాలం పాటు చెప్పుకోదగ్గ ప్రచురణ సంస్థలు రెండు మూడింటికి మించి లేవు. కాలక్రమేణా సమాజంలో పుస్తకాల ఆదరణతోపాటు వాటి ప్రాభవమూ తగ్గుముఖం పట్టాక ప్రమాణాలు, నియమాలు లేని తాలు ప్రచురణ సంస్థలు పుట్టుకొచ్చాయి. రచయితలు తమ పుస్తకాలు తామే అచ్చువేసుకోవడం మొదలయింది. కాని, పుస్తకప్రచురణ, విక్రయాలు సృజనకు సంబంధించని వ్యాపారరంగపు మెళకువలని, అవి తమకు లేవని రచయితలు గుర్తించలేదు. ఏదో ఒకలా తమ పుస్తకం అచ్చులో చూసుకోవాలన్న రచయితల ఉబలాటానికి, ప్రచురణకర్తల లోభిత్వం, కొరవడిన అభిరుచి, ప్రమాణాల పట్ల అశ్రద్ధ తోడై నాణ్యత లేని నాసిరకపు పుస్తకాలు ప్రచురింపబడుతూ వచ్చాయి. గత కొన్నాళ్ళుగా ఆ ధోరణి మారుతోంది. తెలుగులో పుస్తకప్రచురణ పట్ల అభిలాష, నాణ్యత పట్ల శ్రద్ద ఉన్న ప్రచురణ సంస్థలు ఏర్పడ్డాయి. వారు ప్రచురించే పుస్తకాలు చక్కటి నాణ్యతతో అంతర్జాతీయ స్థాయితో పోల్చదగ్గవిగా ఉంటున్నాయి. కాని, అప్పటికీ ఇప్పటికీ మారని అంశం – పుస్తక ప్రచురణలో కనిపిస్తున్న ఈ వృత్తితత్త్వం రచయితలతో సాగే లావాదేవీలలో కనిపించక పోవడం. తద్వారా రచయితలకు ప్రచురణ సంస్థలపైన ఇప్పటికీ నమ్మకం కుదరకపోవడం. ఇందులో రచయితల పాత్ర గురించి, తమ రచనల పట్ల రచయితలకున్న అపోహల గురించీ తర్వాత, కాని తమ పుస్తకాలు ఎన్ని అచ్చు వేయబడుతున్నాయో, ఎన్ని అమ్ముడు పోతున్నాయో, ఎంత పారితోషకం రానుందో తెలియని అయోమయంలోనే చాలామంది రచయితలుంటున్నారు. ప్రచురణ సంస్థలు వారికి నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు, అపోహలకూ దారి తీస్తుంది. పుస్తకాలు అమ్మి కోటీశ్వరులైన ప్రచురణకర్తలు తెలుగులో ఎవరూ లేరు, నిజమే. అలాగని, తాము అమ్మలేని పుస్తకాలు సొంతడబ్బుతో ప్రచురించి ఈ సంస్థలు ఆ రచయితలనేమీ పోషించటం లేదు. ప్రస్తుత తెలుగు సాహిత్య వ్యాపారంలో డబ్బు తక్కువన్నది నిజం. కాని, తెలుగు సాహిత్యం వర్ధిల్లాలి అంటే రచయితలకు, ప్రచురణ సంస్థలకు మధ్య పరస్పరం నమ్మకం, గౌరవం ఉండాలి. అవి ఏర్పడాలంటే ప్రచురణ సంస్థలు స్పష్టమైన వ్యాపారనియమావళిని పాటించాలి. రచయితల డబ్బుతో ప్రచురణ, వితరణ వంటి సాంకేతికసహాయం మాత్రమే అందించే సంస్థలకూ ఇది వర్తిస్తుంది. నోటిమాటగా కాకుండా, తమ నిబంధనలు, విధానాలను చట్టబద్ధమైన ఒడంబడికలు చేసుకునే విధానం తెలుగునాట మొదలవ్వాలి. ప్రచురణావిక్రయాలు వ్యాపారాలు. వ్యాపారంలో స్నేహాలు, ఆత్మీయతలు, స్వచ్ఛంద సేవలు ఉండవు, ఉండకూడదు. పుస్తక ప్రచురణ క్రమంలో ప్రతీ అడుగుకూ మూల్యం ఉండాలి, అది చెల్లింపబడాలి. సంస్థలు రచయితలతో తాము చేసుకున్న ఒడంబడికలను పాటిస్తూ క్రయవిక్రయాల వివరాలు తెలియజేయాలి. తమ వ్యాపారసరళి నిజాయితీతో కూడినదని రచయితకు నిరూపించగలగాలి. సమస్య డబ్బు గురించి మాత్రమే కాదు, ఉండవలసిన నమ్మకం గురించి కూడా. ఇది ప్రచురణ సంస్థలకు అనవసరపు శ్రమగానో, వారి అహానికి దెబ్బగానో అనిపించవచ్చు. కాని, ఆ పారదర్శకత ప్రస్తుత తెలుగుసాహిత్య ప్రచురణారంగంలో అత్యవసరం. సాహిత్యం అభిలాష, పుస్తకం వ్యాపారం. ఈ రెంటిమధ్యా ఒక స్పష్టమైన విభజనరేఖ ఉంది. ఈ విభజనను గుర్తించి ఆచరించే కొద్దీ ఆ సంస్థల ప్రాభవమూ పెరుగుతుంది.