నిండు వేసవి

నిండు వేసవి! నిండు పౌర్ణమి లాగా నిండు వేసవి!

‘చిత్రంగా ఈ వేసవి వేసవిగా మొదలవలేదు. ముందు మబ్బులు, వానలు వచ్చాయి. ఆనక మెల్లిగా ప్రవేశించాయి ఎండలు, వెర్రి ఎండలు!’ సాయంకాలం ఆఫీసు నుంచి బయల్దేరి, పిల్లల్ని తీసుకుని ఇంటికొస్తున్న ఇందు అనుకుంది. చుట్టూ ఉన్న అపార్ట్‌మెంట్స్ చూస్తే గాలికే ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మధ్యాహ్నం కొలీగ్ ఇంద్రాణి పిల్లల వేసవి సెలవుల గురించిన కొత్త ఆలోచనలు చెప్పింది. వింటుంటేనే నచ్చేసింది. చూడాలి!

ఇల్లు చేరి వంటపనిలో మునిగిన ఇందు వెనుక వెనుకే తిరుగుతూ ఏదో చెప్పాలంటూన్న చిన్న కూతురు ప్రియని, “పనికి అడ్డు రాకు. భోజనం అయ్యాక మాట్లాడుకుందాం” అంటూ తరిమేసింది.

ఇంతలోనే పిల్లలిద్దరూ పరుగున వెళ్ళి తలుపు తియ్యటం విని ముందు గదిలోకి తొంగిచూసింది.

పక్కింటి సౌమ్య సరాసరి వంటింటి గుమ్మంలోకి వచ్చి “ఇందిరా, వీణ్ణి తీసుకుని అమ్మావాళ్ళ ఊరు వెళ్తున్నా. అశోక్ ఆఫీసు నుంచి స్టేషన్‌కి వస్తానన్నాడు” అని చెప్పింది.

“ఇంత సడన్ గానా? ఊళ్ళో అందరూ బానేవున్నారు కదా?”

“ఇడుగో వీడే, కొంచెం బావులేడు.” నవ్వుతూ కొడుకుని చూపించింది. “రైలెక్కేక విషయం చెప్తాను” అంటూ వెళ్ళిపోయింది.


ఆ రాత్రి భోజనాలయ్యాక ఇందిర కూతుళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుంది.

“ప్రియా, ఇందాక ఏమిటే చెప్పాలన్నావ్?”

“అమ్మా, నాకు ఈ వేసవి తరగతులు నచ్చలేదు. అమ్మమ్మ ఊరెళ్తాను.”

“అవునమ్మా, నా ఫ్రెండ్స్ కొంచెం మంది వాళ్ళ అమ్మమ్మ, నానమ్మల ఊరెళ్ళారు. నువ్వు ఎప్పుడూ చెప్తావు మీ చిన్నప్పడు హాయిగా పొద్దున్నుంచీ రాత్రి వరకూ ఆడుకునేవారని. మాకు ఆడుకుందుకే టైం ఉండట్లేదు. స్కూలున్నప్పుడు హోమ్ వర్క్, ఇప్పుడేమో ఈ క్లాసులు!” విసుగ్గా అంది శ్రియ.

“అమ్మమ్మ, నాన్నమ్మలు మీ అల్లరి భరించలేరు. మీతో వాళ్ళకి శ్రమ అయిపోతుంది.”

“అల్లరి చెయ్యం. వాళ్ళకి సాయం చేస్తాం. పంపించి చూడు కావాలంటే. ప్లీజ్!” బ్రతిమాలింది శ్రియ.

పిల్లల ముఖాలు చూస్తే బాధ వేసింది. చిన్న కోరిక! ఇందు ఆలోచనలో పడటం చూసి, “అమ్మా, మీ చిన్నప్పటి కబుర్లు ఇంకా చెప్పవూ?” మెరిసే కళ్ళతో ప్రియ తల్లి దగ్గరకి జరిగింది. నుదుటి మీద పరుచుకున్న జుత్తుని వెనక్కి తోస్తూ నవ్వింది ఇందు. నాలుగురోజుల క్రితం అప్రయత్నంగానే తమ చిన్ననాటి కబుర్లతో వాళ్ళని మురిపించింది.

“సెలవుల్లో పగళ్ళు రాత్రుళ్ళు కూడా కబుర్లు చెప్పేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆరుబయట మడతమంచాల మీద పడుకుని అమ్మమ్మ చెప్పే కథలు, కబుర్లు వింటూ, నిద్రకి జోగుతూ కూడా ‘ఊ’ కొడుతుండేవాళ్ళం. తెల్లవారిందంటే సెలవుల్లో ఒకరోజు తరిగి పోతుందని భయం. ‘పడుకోండర్రా ఇంక’ అని పెద్దవాళ్ళెవరైనా అంటే మా పెదనాన్న కూతురు లక్ష్మక్క ‘సెలవుల్లో నిద్రపోతే ఎలా’ అనేది.”

“మడత మంచాలా? అమ్మమ్మ ఇంట్లో మేడమెట్ల గదిలో ఉన్నాయి. అవేనా? వాటిమీద బయట పడుకునేవారా?” ప్రియ ఆశ్చర్యపోతూ అడిగింది తల్లి మాటలకి అడ్డొస్తూ.

“అవునే. వాటిని మడిచేసి, ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకుని పడుకోవచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు వాటి దుమ్ము దులిపి మీకు పక్కలు వేస్తాను. బయట హాయిగా ఆకాశంలో నక్షత్రాల్ని, చందమామని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ పడుకోవచ్చు.

“సరే, ఇంకో తమాషా చెప్పనా, మామూలు రోజుల్లో తొమ్మిదయ్యేసరికి నిద్రపొమ్మనే అమ్మమ్మ సెలవుల్లో ఏమీ అనేది కాదు. తను కూడా ఆవులిస్తూనే అందరితోటీ కబుర్లు చెపుతుండేది.”

“మనం అమ్మమ్మ ఊరెళ్తే నువ్వూ అమ్మమ్మా, తాతయ్యలతో కబుర్లు చెప్పుకోవచ్చు.” పిల్లల గడుసుదనానికి ఇందుకు నవ్వొచ్చింది.

“అయితే ఇది చెప్పండి. అలా చెట్లెక్కి దూకటం, పరుగులెత్తి ఆడటం లాటివే ఉంటే మీకు ఇష్టమేనా? మా చిన్నప్పుడు పెద్దగా టి.వి. ఉండేది కాదు. అసలు మొబైల్ ఫోనంటేనే తెలియదప్పుడు. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా మీరు మీ ఫోన్లు ఐపాడ్ లేకుండా రారు. మరి ఇప్పుడూ అమ్మమ్మ ఊర్లో అవి లేకుండా మాలా ఉండగలరా?” ఇందు అల్లరిగా అడిగింది.

శ్రియ, ప్రియ ముఖాలు చూసుకున్నారు.

“అమ్మో! మొబైల్ లేకుండానా? మాల్స్, పీజ్జా ఇవేమీ లేకుండా కష్టం. నిజానికి మాకు ఇప్పుడే బావుందమ్మా. కాని, మీరంతా సెలవుల్లో అమ్మమ్మ ఊరు, నానమ్మ ఊరు వెళ్ళటం, రోజుల తరబడి ఆడుకోవటం మాత్రం నచ్చింది. పూర్తిగా కాదు కాని అప్పుడప్పుడైనా ఫోన్ లేకుండా ఓకే. కనీసం ఒక నెల అయినా సరే.”

పిల్లలు ఇప్పటి తమ జీవితాల్ని ప్రేమిస్తున్నందుకు, ఇష్టమైన అంశాల గురించి చెప్పుకుంటున్నందుకు ఇందుకి సంతోషంగా అనిపించింది.

అంతలో సౌమ్య ఫోన్ రావటంతో కబుర్లాపి ఫోన్ అందుకుంది.

అమ్మమ్మ దగ్గరకెళ్ళాలంటూ ఈ రోజు కొడుకు పెట్టిన పేచీ గురించి సౌమ్య చెప్పింది. ఏడాది క్రితం తాము వాడిని ఇక్కడ స్కూల్లో చేర్చేందుకు బలవంతంగా తీసుకొస్తూ అమ్మమ్మ దగ్గరకి వేసవిలో పంపుతామని చెప్పటం కూడా చెప్పింది. ఆ మాట వాడు మర్చిపోలేదు. ఏడాదిపాటు ఎదురు చూశాడు. వాడికి సెలవులిచ్చాక అమ్మా, నాన్నా సమ్మర్ స్కూల్లో చేర్పించారు. వాడు ఈరోజు ఎదురు తిరిగేక కనువిప్పయిందిట తనకి.

ఇందిర ఆశ్చర్యపోయింది! పిల్లలు, తను కూడా ఈ క్షణంలో మాట్లాడుకుంటున్నదే సౌమ్య చెప్పింది. లంచ్ టైమ్‌లో ఇంద్రాణి చెప్పింది ఇదే. యూనివర్స్ కన్‌స్పైర్స్ అంటారు, ఇదేనేమో! ఒక్కసారి అక్కతో మాట్లాడాలనుకుని ఫోన్ అందుకుంది.


“అక్కా, ఖాళీగా ఉన్నావా?”

“ఆహాఁ, ఇప్పుడే పిల్ల రాక్షసుల్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలాను. రాజ్ క్యాంపుకెళ్ళాడు. పొద్దున్నుంచీ ఆఫీసు పని, ఇంటి పని, పిల్లల పనులు… ఒక్క క్షణం ఆదమరిచేందుకు లేదు కదా. చెప్పవే” అంది వల్లి.

“పిల్లలిద్దరూ వేసవి సెలవులకు అమ్మావాళ్ళ ఊరెళ్తామంటున్నారు. నాకూ వాళ్ళను తీసుకెళ్ళాలనే ఉంది. కానీ…”

చెల్లెలి మాటలతో వల్లికి అలసటంతా ఎగిరిపోయింది. ఆ వేసవులు ఎందుకంత హాయిగా ఉండేవో!

“కానీ ఏమిటే, చక్కగా తీసుకొని వెళ్ళక! మన చిన్నతనం ఎలా గడిచిందో వాళ్ళకీ తెలుస్తుంది. హాయిగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతో గడుపుతారు. చిన్నపిల్లలేగా, ఏం ఒక్క రెండు నెలలు చదువు లేకపోతే ఏం కారులే!”

“మనలానే అంటావ్! గుర్తుందీ, ఎలా ఆడేవాళ్ళమో పొద్దున లేచిన దగ్గర్నుంచీ.”

“అవునే. దసరాకి, సంక్రాంతికి వచ్చే సెలవులు పది పదిహేను రోజులు కూడా గట్టిగా ఉండేవి కావు. సెలవులంటే మనకి వేసవి కాలం సెలవులే లెక్క. తెలవారి లేస్తూనే ముందురోజుకి కొనసాగింపుగా ఆటలు మొదలయ్యేవి. భోజనం వేళకి ఇంట్లోంచి పిలుపొచ్చేది. వస్తున్నా వస్తున్నా అనడం, ఆడుతూనే ఉండడం… ‘పని తెమలాలి, రండని’ అమ్మ వాకిట్లోకొచ్చి కోప్పడ్డాకే ఇంట్లోకి పరుగెత్తే వాళ్ళం.”

“పాపం అమ్మ! ఇరవై నాలుగ్గంటలూ మనల్ని కాచుకోవటమే కాదు ఇంటి కొచ్చిన బంధువుల్ని చూసుకొనేది. ఎప్పుడూ ఎడతెగని పని. భోజనానికి కూర్చుంటూ మంచినీళ్ళు కూడా మనం పెట్టుకునే వాళ్ళం కాదు. ఇప్పుడాలోచిస్తే అమ్మ, పిన్నివాళ్ళు ఎలా చేసేవారో ఇంతమందికి అనిపిస్తుంది. ఇంకా ఊరగాయలు, వడియాలు పెట్టేవారు.” వల్లి నిట్టూర్చింది. అప్పుడెందుకు అమ్మ కష్టం అర్థం చేసుకోలేకపోయారో!

“అవునక్కా. అమ్మ వద్దువద్దన్నా ఊర్నించి వచ్చిన అత్తయ్య వినేదే కాదు. ‘కూర్చుందుకు వచ్చానా, ఇది నా ఇల్లని వచ్చా’నని గొడవ పెట్టుకునేది కూడా.”

ఉన్నట్టుండి వల్లి కూతురు ఏడ్చుకుంటూ రావటంతో అక్కచెల్లెళ్ళ ఊహాలోకం చెదిరి పోయింది.

“ఇందూ, వీళ్ళిద్దర్నీ ఫిక్స్ చేసొచ్చి పిలుస్తానే. పదంటే పది నిమిషాలు.”

ఫోన్ పెట్టేసినా ఇందు మనసులో చిన్నప్పటి వేసవుల జ్ఞాపకాలు కదలాడుతూనే ఉన్నాయి. పిల్లలు అంతా కలసి తుమ్మెదల గుంపులా తిరుగుతుండేవాళ్ళు. చివరికి ఏ ఒక్కరికి దాహమైనా సరే పిల్లల బ్యాచ్ మొత్తం తాగాల్సిందే. అప్పటికే చిన్న బిందెతోటి, చెంబులతోటి, గ్లాసులతోటీ ఇంట్లోంచి తెచ్చుకున్నవి అయిపోయేవి. మళ్ళీ అందరూ లోపలికెళ్ళి ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటూ ఇల్లంతా సగం సగం ఒంపుతూ వచ్చేవాళ్ళు. వాకిలి వరండాలో పడుకున్న తాతగారు నిద్రలో కదిలి, ‘ఎవరర్రా ఆ శబ్దాలు? ఇంకా పడుకోలేదూ?’ అంటూ గట్టిగా అరిచేవారు. పిల్లలంతా ముంగాళ్ళ మీద హుష్ హుష్ అనుకుంటూ బైటకి పరారు.

‘ఆటల ధ్యాసలో ఆకలి ఎరగరు పిచ్చి మొహాలు’ అనేది అమ్మ పక్కింటి అమ్మమ్మగారితో. అటొచ్చీ, ఇటొచ్చీ ఎవరిళ్ళల్లోంచి వాళ్ళు ఇంట్లో చెప్పీ చెప్పక పట్టుకొచ్చిన మరమరాలు, వేరుశెనగ పప్పు వగైరా ఫలహారాలు ఎటూ పుష్కలంగా ఉండేవి. ‘మాకేం ఆకలెయ్యట్లేదు’ అనేసేవాళ్ళు.

‘హుఁ, ఆ రోజులే వేరు’ అనుకుంది ఇందు భారంగా.


ఫోన్ మోగడంతో జ్ఞాపకాలనుంచి బయటపడింది ఇందు. చెప్పినట్లే అక్క వల్లి ఫోన్.

“స్కూలు రోజుల్లో హోమ్ వర్క్ అవకుండానే, తొమ్మిదనగానే నిద్దర్లు ముంచుకొస్తాయి. ఇప్పుడు పదైనా నిద్ర రాదు. ఎప్పటికి పెద్దాళ్ళవుతారే వీళ్ళు.”

“నాకైతే అప్పుడే పెద్ద అయిపోతున్నారని బెంగ వేస్తోందక్కా. వీళ్ళకి వేసవిలోనూ సెలవుల్లేవు. మన ఉద్యోగాల పుణ్యమా అని పిల్లల్ని పట్టుమని నాలుగు రోజులు ఎటూ తీసికెళ్ళే సమయం ఉండట్లేదు. చివరికి ఆట, సంగీతం, లెక్కలు ఇలా సరదాగా నేర్పవలసిన అన్నిటిలోనూ పిల్లల్లో పోటీతత్త్వం పెంచుతున్నాం. ఎప్పటి భవిష్యత్తు కోసమో అని, వాళ్ళు మరింత మెరుగవ్వాలని వేసవిలో కూడా వాళ్ళకు కోచింగ్‌లు, ట్రైనింగ్‌లు అసలు వాళ్ళకి సెలవులే లేకుండా చేస్తున్నాయి. పిల్లల బాధ్యత తరగతులకి అప్పజెప్పి హాయిగా ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నాం. ఇంతలోనే స్కూల్స్ తెరిచేస్తారు.” దిగులుపడింది ఇందు.

“అదేమిటే ఇందూ అలా అంటావ్. మన చిన్నప్పుడు ఇన్ని రకాల కొత్తకొత్త విషయాలు నేర్చుకుందుకు అవకాశాలున్నాయా? అదీ ఒక్కచోట! గుర్తుందీ, అమ్మ మనకు సంగీతం క్లాసులు మొదలెట్టించింది. వద్దని ఎంత గోల చేసేం! మాస్టారు రాగానే నువ్వు ‘మంచినీళ్ళు తాగొస్తా’ అని లోపలికెళ్ళి ఐదు నిముషాలయ్యాక వచ్చేదానివి. మరో ఐదు నిముషాల తర్వాత నేను అదే సాకుతో ఇంకో ఐదు నిముషాలు లోపలికెళ్ళి పెరట్లో తిరిగి వచ్చేదాన్ని. ఎన్ని నెలలైనా ఒక్క పాఠం సరిగ్గా నేర్చుకున్నామా? ధ్యాసంతా బయట స్నేహితుల మీద, మిస్సవుతున్న ఆటల మీద ఉండేది మరి. క్లాసులో సరిగా నేర్చుకోవట్లేదని అమ్మ కోప్పడేది. ముగ్గురు టీచర్లు మారాక కదూ, మాకు సంగీతం వద్దు అని కచ్చితంగా అమ్మకు చెప్పేం.”

“అమ్మ మనల్ని అడక్కుండానే తనకిష్టమైన సంగీతంలో చేర్పించేసింది. ఆ కొత్త విద్య మనల్ని సేద తీరుస్తుందనుకుంది. మనమూ పిల్లల్ని అడగకుండానే వాళ్ళని సకలగుణాభిరాముల్ని చేసేద్దామనుకుంటున్నాం.”

“అలాకాదు ఇందూ, తమకు లేనివి పిల్లలకి మరిన్ని అవకాశాల్నివ్వాలని అమ్మానాన్నలుగా తాపత్రయపడతారు. ఏ తరమైనా అంతే.”

“నిజమే. కాని, పిల్లలకి ఇష్టమైనదేమిటో అడుగుతున్నామా? నువ్వు చెప్పు, నీ పిల్లల్ని వేసవి తరగతుల్లో చేర్చేప్పుడు వాళ్ళు సెలవులు ఎలా గడపాలనుకుంటున్నారో అడిగావా? నేనూ అడగలేదు. పసివాళ్ళని బేబీ కేర్‌లో చేర్పించినట్టు ఇప్పుడివి. పైగా అందరి పిల్లలూ అన్నీ నేర్చేసుకుంటూంటే మన పిల్లలు వెనకపడిపోతారని బెంగలు. ఎంత నేర్చుకుంటారు? ఎన్నని? వాళ్ళకి అవసరమని మనం నిర్ణయించేస్తున్నాం. అవకాశాల్నే కాదు అనుభవాల్నివ్వాలని తోస్తోందిప్పుడు. దీని గురించే మాట్లాడాలని ఫోన్ చేశానసలు.”

“ఇందూ నీకేమైందివాళ? పిల్లల్ని ప్రతిభావంతుల్ని చెయ్యాలనుకోవటం తప్పా?”

“వాళ్ళలో స్వతహాగా ఉన్న ప్రతిభని గమనిస్తున్నామా? వాళ్ళకి స్వంత ఆలోచన లేకుండా ఒక మూసలోకి చేరుస్తున్నాం. చిన్నప్పుడు మనం చుట్టుపక్కల అందరితో పరుగులెడుతూ ఆడుకుంటున్నప్పటి స్వేచ్ఛ ఇప్పుడు పిల్లలకుందా? బంగారు గూళ్ళు తయారుచేసి, ప్రతి క్షణం వాళ్ళని మన కనుసన్నల్లోనే ఉంచుకుంటున్నాం. చెప్పానుగా, సౌమ్య కొడుకు ఏడవడం నా కళ్ళు తెరిపించింది. నా పిల్లల్ని, నీ పిల్లల్ని కూడా ఎంతగా నియంత్రిస్తున్నామో ఇప్పుడర్థమవుతోంది.”

“దాన్ని నియంత్రించటం అంటావా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పనికొచ్చే కొత్త విషయాల్ని ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నారు. ఇక్కడ పరీక్షల్లేవు, మార్కుల్లేవు. కొత్త స్నేహితులు దొరుకుతారు.”

“ఆడుతూ పాడుతూనా? సెలవుల్లో వాళ్ళక్కావలసినప్పుడు లేచి, వాళ్ళు కోరుకున్నట్టుగా గడపనిస్తే ఇంకా బావుంటుందేమో వాళ్ళకి. ఇప్పుడైతే అమ్మానాన్నలు ఫీజులు కట్టి చేర్పించిన ఈ తరగతులకి ఠంచనుగా సమయానికి వెళ్ళాలి. పొద్దున్నే తయారై లంచ్ బాక్స్‌తో సహా బయల్దేరాలి. ఐదు నిముషాలు అటూ ఇటూ అయేందుకు లేదు. మనం ఆఫీసులకి వెళ్తూ వాళ్ళని దింపి వెళ్ళాలి కనుక మనతో పాటే నిద్ర లేచి తీరాలి. సాయంకాలం పొద్దుపోయాక అలిసిపోయి, ముఖాలు వేలాడేసుకుని మనతోపాటు ఇళ్ళు చేరుతున్నారు. వాళ్ళకి సంవత్సరం పొడవునా ఒకటే రొటీన్ అవట్లేదా? అడిగి చూడు, వాళ్ళేమంటారో. అమ్మమ్మ, నానమ్మల ఊళ్ళు వెళ్దామంటారేమో!”

“అంటారు, అనకేం. అమ్మమ్మలు, నాన్నమ్మలు చేసే గారాలతో సంవత్సరం పొడవునా నేర్పిన క్రమశిక్షణ నెల రోజుల్లో వదిలిపోతుంది. వాళ్ళ మంచినీళ్ళు వాళ్ళు తాగరు. సెలవులయ్యాక వాళ్ళని స్కూల్‌కి తయారు చెయ్యటం అంత సులువేం కాదు.”

“కావల్సింది క్రమశిక్షణ ఒక్కటేనా? మనల్నీ అమ్మా, నాన్న గారం చేశారు. చక్కగా చదువుకుని మనం బాధ్యతగా జీవించట్లేదా? నిన్న శ్రియ తనకిష్టమైన కథల పుస్తకం తీసుకెళ్ళి మధ్యాహ్నం భోజనం అయ్యాక చదువుకోబోతే, ‘ఇక్కడికి పుస్తకాలు తేవద్దు. ఇంట్లో చదువుకోండి’ అని చెప్పారట. కథల పుస్తకాలు చదువుకోటం పిల్లలకి ఎంత బావుంటుంది! అక్కడ ఒక్క పుస్తకం చదివించరు. ఎంతసేపూ వాళ్ళ కరిక్యులమ్ ప్రకారం రొటీన్‌గా చేయించేవి, పోటీ పరీక్షలకు పనికొచ్చే పజిల్స్, ఆటలు. ఎక్కడా ఆరుబయట చెట్ల నీడన ఆటలకి అవకాశమే ఉండట్లేదు.”

వల్లి నవ్వింది. “మన చిన్నప్పటికీ ఇప్పటికీ పోలిక చెపుతున్నావు. అప్పుడు కంప్యూటర్లున్నాయా, మొబైల్ ఫోన్లున్నాయా, వీడియో గేమ్స్ ఉన్నాయా? అప్పట్లో మనకున్నవి తక్కువని కాదులే. నువ్వన్నట్టు బోలెడు స్వేచ్ఛ ఉండేది. అవి మాత్రమే ఇప్పటి పోటీ ప్రపంచంలో పిల్లలకి ఉపయోగపడవేమో ఇందూ. వీళ్ళ ఐక్యూ లెవెల్స్, సిలబస్, పోటీ అన్నీ ఎక్కువే. పిల్లలకేదో అన్యాయం జరిగిపోతోందంటున్నావు, కానీ ఎదురయ్యే సవాళ్ళకు వాళ్ళని తయారు చెయ్యాల్సిందే.”

“కాదనటం లేదు. కాని అదొక్కటేనా జీవితంలో? నాకిదంతా ఇప్పుడు నచ్చట్లేదక్కా. వాళ్ళకి స్వతంత్రం ఇచ్చి కాస్త పైన మనం గమనించుకుంటే వాళ్ళే ఎన్నో నేర్చుకుంటారనిపిస్తోంది. ఇన్నాళ్ళూ ఎందుకు తోచలేదో! పిల్లల్ని అమ్మా వాళ్ళ ఊరు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. వేసవి తరగతులకి కట్టిన డబ్బు పోతే పోయింది. పిల్లలకి సెలవులు ఇంకెలా గడపచ్చో చూపిద్దాం అని ఎంతో కోరికగా ఉంది.

“ఇందాకే ఒక కరపత్రం చేతికొచ్చింది. అది మా కాలనీలో అంచెలంచెలుగా పెరుగుతున్న ఒక స్కూల్ రాబోయే సంవత్సరంలో మా పిల్లల కోసం తమని ఎంచుకోమంటూ ఇచ్చిన పిలుపు. ప్రత్యేకతలేంటో తెల్సా, పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ కలిగేలా చేసి, విసుగుని, అసహనాన్ని తగ్గిస్తారుట. నలుగురిలో కలిసేలా, మంచి మాటకారితనం, తెలివి పెంచుతారట. మొక్కలు నాటించి పర్యావరణ ప్రేమికులుగా తీర్చి దిద్దుతారట. ఇంకా, ఉద్వేగాలను నియంత్రించుకోవటం నేర్పి, తిరుగుబాటు ధోరణులను అరికడతారట. చదువుతో పాటు నేర్పే వీటన్నిటికి ఈ సెలవుల్లో బ్రిడ్జ్ కోర్స్ ఉందట. విచిత్రంగా లేదూ? ఎండ దెబ్బ తగలకుండా సురక్షితంగా కేవలం ఎ.సి. గదుల్లోనేనట ఈ బ్రిడ్జి కోర్స్. పర్యావరణ ప్రేమికులు ఇలా పెరుగుతారన్నమాట.”

“ఇందూ, నీ పిల్లలింకా చిన్నవాళ్ళు. నా కొడుకు తొమ్మిదో క్లాసుకొస్తాడు. కోవిడ్ రోజుల పుణ్యమా అని వాడి చేతికి మొబైల్ వచ్చింది. ఒక్క క్షణం దాన్ని వదలడు. పరిమితంగా స్కూల్లో కూడా మొబైల్ అనుమతి ఉంటోంది. నువ్వన్నట్టు అమ్మా వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వదిలామంటే రాత్రి, పగలు ఇక దానితోనే గడుస్తుంది వాడికి. వాడి చెల్లికీ కావాలంటోంది. పొద్దున్నుంచీ సాయంత్రం దాకా మొబైల్ ఫోన్‌కి దూరంగా ఉంటారని ఈ వేసవి తరగతులే నయం అనిపిస్తోంది.”

“దానికీ ఒక దారి కనిపిస్తోంది. కొన్ని వేసవి శిబిరాల గురించి ఈరోజు నా స్నేహితురాలు చెప్పింది. అక్కడ మొబైళ్ళుండవుట. ఎ.సి. గదులుండవుట. ప్రకృతి మధ్య, ప్రకృతిలో పిల్లలు భాగమవుతూ పరిసరాల్ని చూస్తూ, స్వయంగా పరిశీలించి, గ్రహించే వాతావరణం ఉంటుందట. పిల్లలకి తెలియని ఎన్నో విషయాలను ఆటల మధ్య స్వయంగా నేర్చుకునేలా చేసే పిల్లల ప్రేమికులున్నారట. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలకి కావలసినంత స్వేచ్ఛ! చుట్టూ కేవలం ప్రకృతి, ప్రేమించే పెద్దలు. వార్తాపత్రికల్లో వీటి గురించిన వార్తలు కూడా పంపింది. మనం వెళ్ళి చూద్దామక్కా.”

“అలాటి చోటొకటుందని నాకు తెలియదే. వింటుంటేనే చాలా బావుంది. టిక్కెట్ల సంగతి చూడు. ఇందూ, నా మనసులోనూ ఇన్నాళ్ళూ ఒక అసంతృప్తి లేకపోలేదు పిల్లల సెలవుల పట్ల. ప్రత్యామ్నాయం కోసం మాత్రం వెదకలేదు” వల్లి నిజాయితీగా ఒప్పుకుంది.


[జహీరాబాద్‌కు చెందిన వైద్యదంపతులు డా. విజయలక్ష్మి, డా. శివబాబు ప్రతి సంవత్సరం ఇలాటి అందమైన వేసవి శిబిరాల్ని నడుపుతున్నారు. పిల్లల్ని ప్రేమించే కొందరు రకరకాల అంశాల్లో నిష్ణాతులు కూడా ఆ రోజుల్లో అక్కడికి వచ్చి పిల్లలకి సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో విషయాలు నేర్పుతున్నారు. అటువంటి శిబిరాలు మరెన్నో రావాలని, మరెందరో పిల్లలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్ష – రచయిత.]