అసంపూర్ణం

పట్టదకల్లు
గోపురాల ప్రయోగశాలలో
విగ్రహం లేని గుడి

ఖాళీ పీఠం మీద
కూర్చున్నవాడే దేవుడు

సగం మూసిన కనులు
చిదానంద రూపమై
కోరికలు లేని మనసు

జంటలందరూ
చుట్టూ తిరుగుతూ ఉంటే
కెమెరా మాగన్ను

పూవులన్నీ విదిల్చిన
పారిజాతం
రేపటి కోసం తయారవుతోంది

కడిగి ముగ్గులేసిన
ఆవరణలో
సందర్శకుల
పాదముద్రలు

భిత్తిక శిల్పాల
ముక్కులు చెక్కేసిన వాళ్ళని
తిట్టుకుంటూ
గోడల మీద
పేర్లు చెక్కేవాళ్ళ గుంపు

యుద్ధం లాగే
చరిత్ర కూడా అసంపూర్ణం.

(కర్ణాటకలోని పట్టదకల్లు ప్రఖ్యాత దర్శనీయ ప్రదేశం. దేవాలయ గోపురం నిర్మాణానికి ఇది ఒక ప్రయోగశాల అనవచ్చు. నియమిత ప్రదేశంలో అన్ని రకాల గోపురాలు ఉండడం విశేషం. ఉత్తర, దక్షిణ దేశాల గోపుర నిర్మాణ విన్నాణం ఓకే చోట దర్శనమిస్తుంది. పట్టదకల్లు అంటే పట్టాభిషేకం చేసుకున్న పీఠం అని చెప్పుకోవచ్చు.)