వలలెందుకు?

నువ్వు సముద్రాన్ని
ఒంటి నిండా పులుముకొంటావు
నేను నదిలో మునిగినవాణ్ణి

ఉప్పు, తీపి కలసిన
గరగరలా ఉంటుంది
పెదాలు చప్పరిస్తుంటే

చేపలన్నీ నీళ్ళలో ఉంటే
నువ్వూ నేనూ ఈ పక్కమీద
ఈదుతున్నామెందుకు?

చల నిశ్చలాల తగువులాట
ఒంటికంటుకున్న
మట్టికి పరిమళం
కవ్వపు గాలికి మబ్బు రంగు

చూస్తూ చూస్తూ తుఫాను వేళ
దిగుడు బావిలోకి
తొంగి చూడడమెందుకు?
పాములన్నీ
పొదలమధ్య లుంగచుట్టుకొని

కొండ దుమికినప్పుడు
జడలా అడ్డుకున్న గరిక
నడిచే వేళ
ఊతమిచ్చిన వెదురు
కమిలిన కాలమే
ఉమ్మనీటి తట్టు

అటుకి, ఇటుకి
చేపల దూకుడు
వలలెందుకు, వడగళ్ళ వాన!