ముందుమాట
భరతుడు, మాతంగముని రూపకల్పన చేసిన అతి ప్రాచీనమైన భారతీయ సంగీతాన్ని సంగీతమకరందం అనే గ్రంథం రాసి నారదుడు దానికి ఒక శాస్త్రీయత కల్పించాడని పూర్వీకుల నమ్మకం. (బరోడా కేంద్ర గ్రంథాలయ సంస్థ వారు ఈ సంస్కృత గ్రంథాన్ని ప్రచురించారు.) ఆ సంగీత మకరందంలో రాగ, తాళ విభజనల గురించిన ప్రస్తావన ఉంది. సంగీతంలో రాగాలు మార్గ, దేశి అని రెండు రకాలు. మార్గ అంటే గ్రాంథీయం లేదా శాస్త్రం అనీ దేశి అంటే జానపదం అని అర్థం తీసుకోవచ్చు. యావత్తు భారతదేశంలో ఈ విభజన పద్ధతి అనుసరించినట్టు కనిపిస్తుంది.
శార్ఙ్గదేవుడు రచించిన సంగీత రత్నాకరము (1210 – 1247) అప్పట్లో లభించిన విపులమైన సంగీత గ్రంథం. అందులో రాగ, తాళ విభజన క్రమ పద్ధతిలో జరిగింది. ఆ తరువాత కాలంలో పర్షియా నుండి ముస్లిం దండయాత్రలు మొదలయ్యి, భారతదేశంలో వాళ్ళు పరిపాలన సాగించడం మొదలు పెట్టేక పర్షియన్ సంగీత ప్రభావం మన సంగీతమ్మీద పడింది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో అక్బర్ పరిపాలనా కాలంలో సంగీతంలో పెనుమార్పులొచ్చాయి. హిందూస్తానీ సంగీతమ్మీద అతని ఆస్థాన గాయకుడు తాన్సేన్ ప్రభావం చెప్పనలవి కాదు. సరిగ్గా అదే కాలంలో (1500 – 1550) దక్షిణాన రామామాత్యుడు కర్నాటక సంగీత శాస్త్రానికి రూపురేఖలు దిద్దాడు. ఉత్తరాది నుండి సంగీత విద్వాంసుల రాకపోకలు చెప్పుకోతగినంత లేకపోయినా హిందూస్తానీ రాగాలు కొన్ని కర్ణాటక సంగీతంలోకి వచ్చాయి. ఉదా. నవరోజు, జైజైవంతి (ద్విజావంతి), మేఘరంజని, పీలూ వంటివి కర్ణాటక సంగీతంలోకి ప్రవేశిస్తే, కానడ, ఆభోగి, చారుకేశి వంటివి హిందూస్తానీలోకి వెళ్ళాయి. కాకపోతే రెండూ వేర్వేరు సంగీత పద్ధతుల్ని పాటించడం వల్ల ఈ ఎగుమతి దిగుమతులు చెప్పుకోతగినంతగా జరగలేదు. కొంతకాలం తరువాత ముస్లిములు దక్షిణ భారతంలోకి చొచ్చుకొచ్చారు. కృష్ణదేవరాయల కాలానికే పోర్చుగ్రీసు వారు, మెల్ల మెల్లగా ఫ్రెంచ్, డచ్ వాళ్ళూ దక్షిణ భారత దేశంలోకి ప్రవేశించారు. సరిగ్గా అదే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా తూర్పు నుండి ఇంగ్లీషువాళ్ళు మెల్లగా దక్షిణం వైపూ వచ్చారు. చిత్రం ఏవిటంటే బ్రిటీషు పాలనా సమయంలో కూడా పాశ్చాత్య సంగీత ప్రభావం ఈ రెంటిపైనా అంతగా లేదు. వేటికవే తమపోకడలని నిలుపుకుంటూ రాణించాయి.
ఎప్పుడయితే ప్రాంతాల మధ్యా, రాజ్యాల మధ్యా సంబంధాలు తెగిపోయాయో అప్పటునుండీ ఈ రెండు సంగీతపద్ధతులు — హిందూస్తానీ, కర్ణాటక — రెండు పాయలుగా విడిపోయాయి. సంగీత బాణీలు కూడా కాలక్రమేణా వేరుపడి పోయాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, సూఫీ కవుల ప్రభావం పడితే, కర్ణాటక సంగీతమ్మీద భక్తి కవుల ప్రభావం కనిపించింది. కర్ణాటక సంగీతానికి భక్తి వాహకంగా మారింది. భక్తికీ, మోక్షానికీ సంగీతం ఒక సాధనం అయ్యింది. ఈ పరంపరలోనే అనేకమంది వాగ్గేయకారులు కర్ణాటక సంగీతాన్ని విస్తరించారు. తదనంతరం రామామాత్యుడు, వేంకటమఖి, మేళకర్త రాగ విభజన చేసి సంగీతానికి ఒక శాస్త్రీయతని తీసుకొచ్చారు. అనేకమంది సంగీత కారుల కృషితో కర్ణాటక సంగీతం తనదైన ఒక బాణీనీ, విలక్షణతనీ పొందింది. హిందూస్తానీ, కర్ణాటక సంగీతాల మధ్య కొన్ని సారూప్యతలున్నా, తేడాలు కూడా కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వ్యాపార నిమిత్తమై కలకత్తా వచ్చిన ఇంగ్లీషు వాళ్ళు దక్షిణాదిన పట్టు సాధించడానికి చాలా కాలమే పట్టింది. చిత్రం ఏవిటంటే బ్రిటీషు పాలన సమయంలో కూడా పాశ్చాత్య సంగీత ప్రభావం (వెస్ట్రన్ మ్యూజిక్) ఈ రెంటిపైనా అంతగా లేదు. వేటికవే తమ తమ పోకడలని నిలుపుకుంటూ రాణించాయి. కానీ అక్కడక్కడ కొంతమంది పాశ్చాత్య సంగీత ధోరణిలో కొన్ని పాటలు కట్టారు. కర్ణాటక సంగీతజ్ఞులకి వెస్ట్రన్ మ్యూజిక్ పరిచయం 1800 కాలంలోనే ప్రారంభమయ్యింది. ఇంగ్లీషు బ్యాండుతో చాలామంది సంగీత కారులకి పరిచయం ఉంది. ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ ఇంగ్లీషు బ్యాండ్ ప్రభావంతో కొన్ని పాటలు కట్టారు. ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం ఏయే పాటలు లేదా కృతులలో పాశ్చాత్య సంగీతపు పోకడలు కనిపిస్తాయో పరిశీలించడం.
ముత్తుస్వామి దీక్షితార్ – నొట్టు స్వరాలు
సరిగ్గా త్యాగరాజు కాలంలోనే ఉన్న మరొక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడూ అయిన ముత్తుస్వామి దీక్షితార్ వెస్ట్రన్ సంగీత ప్రభావంతో కొన్ని పాటలు కట్టాడు. వాటిని నొట్టు స్వరాలు అంటారు. ఇంగ్లీషులో నోట్ (Note) వాడుకలో నొట్టుగా మారింది. ఈ ఇంగ్లీషు నోట్స్ ఆధారంగా పాటలు కట్టారు కాబట్టి వీటిని నొట్టు స్వరాలు అన్నారు. కర్ణాటక సంగీత విద్వాంసులు ఈ నొట్టు స్వరాల నేపథ్యం తెలుసుకోవాలంటే అప్పట్లో మద్రాసు నగరం చరిత్ర కొద్దిగా తెలుసుకోవాలి.
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కలకత్తా నుండి చెన్నపట్టణం వరకూ వచ్చారని చరిత్ర చెబుతోంది. వారికి ముందే, 1500 కాలం నాటికే పోర్చుగ్రీసు వారు గోవా, కొచ్చిన్ వైపుగా భారత దేశంలోకి ప్రవేశించారు. పోర్చుగీసు దళాల చేతిలో కొచ్చిన్ యుద్ధంలో కళ్ళికోట రాజ్యం చిత్తుగా ఓడిపోయింది. అప్పటి మలబారు, కొచ్చిన్ సంస్థానాలు పోర్చుగ్రీసు వారి ఆధీనంలోకి వచ్చేశాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారికీ కొచ్చిన్ రాజు సమూద్రికీ మధ్య జరిగిన ఒడంబడిక ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చెన్నపట్టణం రేవు ఆధారంగా నౌకా వ్యాపారం చెయ్యడానికి వచ్చి స్థిరపడ్డారు. కలకత్తా రేవు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. మెల్లమెల్లగా చెన్నపట్టణం వైపు ఇంగ్లీషు వాళ్ళ కుటుంబాలు, ముఖ్యంగా సైనికాధికారులూ, సైనికుల కుటుంబాలు తరలి వచ్చాయి. వీళ్ళందరికీ సెయింట్ జార్జ్ ఫోర్ట్ స్థావరంగా[1] ఉండేది. ఈ సైనికులు ప్రధానంగా స్కాట్లాండ్, ఐర్లాండ్ నుండి వచ్చిన కుటుంబాలు. అప్పట్లో బ్యాండ్ సంగీతం ఈ యూరోపియన్ కమ్యూనిటీకి సాయంకాలం వినోద కార్యక్రమంగా ఉండేది. వీళ్ళందరూ రంగు రంగుల ఆడంబరమైన దుస్తులు ధరించి ఒక సంగీత విద్వాంసుడి ఆధ్వర్యంలో సాధన చేసేవారు. ఒక్కోసారి వీళ్ళు సెయింట్ జార్జ్ ఫోర్ట్ దగ్గర అధికార ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఇవి చూడ్డానికి చెన్నపట్టణం చుట్టుపక్కల నుండి చాలామందే వచ్చేవారు[2, 3]. సాంబమూర్తి, టి.ఎల్.వెంకట్రామయ్యర్, రచనలలో[4, 5] కూడా ఈ వివరాలు కనిపిస్తాయి.
చెన్నపట్టణానికి ఉత్తరాన మనాలి అన్న వూర్లో ముద్దుక్రిష్ణ ముదలియర్ అనే జమీందారు ఉండేవాడు. ఈయనకి ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యాపార సంబంధాలుండేవి. ఈయన వాళ్ళకీ చెన్నపట్టణంలోని వ్యాపారవేత్తలకీ, అప్పటి గవర్నరు పీగాట్‌కీ దుబాసీగా వ్యవహరించేవాడు. ఈయనకి సెయింట్ జార్జ్ ఫోర్ట్ అధికారులతో సత్సంబంధాలుండేవి. ఈ జమీందారులు తరచూ సెయింట్ జార్జ్ ఫోర్టులో జరిగే ఇంగ్లీషు బ్యాండు కచేరీలకి ఆహ్వానింపబడేవారు.
ముద్దుక్రిష్ణ ముదలియార్ ఓ సారి తంజావూరు దగ్గరున్న తిరువారూర్ వెళ్ళాడు. అక్కడ ఆయన రామస్వామి దీక్షితార్ కచేరీ విన్నాడు. ఈ రామస్వామి దీక్షితార్ కొడుకే ముత్తుస్వామి దీక్షితార్. ముదలియార్ కోరిక మీద రామస్వామి మనాలి జమీందార్ల ఆస్థాన విద్వాంసుడిగా ఉండటానికి అంగీకరించి, మనాలికి మకాం మార్చాడు. ఈ రామస్వామి దీక్షితారుకి ముగ్గురు కొడుకులు – ముత్తుస్వామి, బాలుస్వామి, చిన్నస్వామి. ఈ ముద్దుకృష్ణ ముదలియార్ తరువాత ఆయన కొడుకు వేంకటకృష్ణ మొదలియార్ (ఈయన్నే చిన్నస్వామి ముదలియార్ అనికూడా పిలుస్తారు) రామస్వామి దీక్షితార్ కుటుంబాన్ని సెయింట్ జార్జ్ ఫోర్టులో జరిగే ఇంగ్లీషు బ్యాండు కచేరీలకి వెంటబెట్టుకొని వెళ్ళేవాడు. ముత్తుస్వామికి సంగీతం (వీణ) లోనూ, సంస్కృత భాషమీదా, వేదంలోనూ ఉన్న ఆసక్తీ, పట్టూ చూసి పిన్నవయసులోనే చిదంబరయోగి అనే ఆయన వెంట తీర్థయాత్రలకని తండ్రి పంపించాడు. ఆ రోజుల్లో ఇంగ్లీషు బ్యాండు కచేరీల్లో వయులిన్ ప్రధాన వాయిద్యం కాదు. స్కాట్లాండ్ వారి విన్యాసాలకీ, ఐరిష్ డాన్స్ ట్యూన్లకీ పక్కవాయిద్యంగా వాడేవారు. అప్పట్లో ఇంగ్లీషు బ్యాండ్ కచేరీలో వాహ్యాళి వరుసలూ (మార్చింగ్ ట్యూన్స్), కులాసా పాటలూ, లయబద్ధమైన డప్పులూ (డ్రమ్స్), ఇంకా బ్యాగ్ పైపులూ, వేణువులూ ఉండేవి. బాలుస్వామి సెయింట్ జార్జ్ ఫోర్టు కచేరీల్లో వాడే ఐరిష్ వయులిన్ మీద ఆసక్తి కనబరచడంతో సెయింట్ జార్జ్ ఫోర్ట్ కొలువులో ఉన్న విలియం బ్రౌన్ అనే ఫిడేలు వాయిద్య కారుడిదగ్గర శిక్షణకి ఏర్పాటు చేశాడు వెంకట కృష్ణ ముదలియార్. అప్పట్లో వయులిన్ని ఫిడేల్ అనే వ్యవహరించేవారు. అలా బాలుస్వామి వయులిన్ మీద ప్రావీణ్యం సంపాదించాడు. తరువాత ఈ బాలూస్వామి దీక్షితారే ఫిడేలు వాయిద్యాన్ని కర్ణాటక సంగీతంలో పక్క వాయిద్యంగా ప్రవేశపెట్టాడు. ఈ కథ ముత్తుస్వామి దీక్షితార్ మీద వచ్చిన చాలా పుస్తకాల్లో[4, 5, 6] మనకు కనిపిస్తుంది.