బామ్మ అన్నట్టూ తెలుగు నెలలు ఏ నెలకానెల గొప్పదే. దేని ఘనత దానిదే! ప్రతి నెలలోనూ చక్కగా పూజో, వ్రతమో, పండగో, సంబరమో ఏదో ఒకటి! పిల్లలకీ పెద్దలకీ కూడాను!
మార్గశీర్షము మరీనూ!
మార్గం అంటే దారి కదా! శీర్షం అంటే శిరం! శిరం అనేకన్నా కిరీటం అంటే ఇంకా బావుంటుంది కదా! ఊహూఁ కుదరలేదు! మార్గానికి మకుటం? మా, మ కలిసి చెవికి ఇంపుగా వినిపిస్తున్నాయి కదూ ఇప్పుడు! అందుకే తాపీగా మాట పడాలి. ఠపీమని తోచీ తోచగానే రాసీసుకోకూడదు!
ఆలోచిస్తే ఎన్ని మాటలు పుట్టుకొస్తున్నాయో, ఒకే మార్గశీర్షం నుంచి! భాష భలే తమాషా అయినది!
మార్గశీర్ష మాసంలో ఎంచక్కా లక్షింవారాలు వస్తాయి. వారం వారం ఏదో ఒకటి లక్ష్మీదేవికి నైవేద్యం పెడుతుంది బామ్మ. ఆ చేసే నైవేద్యాలన్నీ నాకు ఇష్టమైనవే! నాకే కాదు, ఎవరికైనా ఇష్టంగానే ఉంటాయి. ఓ లక్షింవారం పులగం, ఇంకో లక్షింవారం అట్లూ తిమ్మనం – ఇలా వరస్సాగా అప్పాలు, పరమాన్నం, గారెలు, పులిహోర, బూరెలు!
అసలు మన పిండివంటలే అంత! రుచైనవి. ఇన్ని రకాల పిండివంటలు చేసుకోవాలంటే ఒక వంక ఉండాలి కదా! పండగో, పబ్బమో, పూజో ఏదో ఒకటి!
మనవాళ్ళు తెలివైన వాళ్ళు. అందుకే పూజలు అని ప్రతినెలకీ ఏదో ఓ ప్లాను చేసి పెట్టీసేరు. తినాలంటే చేసుకోవాలి. చేసుకోవాలంటే దాని వెనుక ఓ కథా కార్యక్రమం ఏదో ఓటి ఉండాలి! కథలు కథలుగా చెప్పుకుంటూ తినాలి. మార్గశిర లక్షింవారం కథని వారానికి ఓ రకంగా చిలవలు పలవలుగా చెపుతుంది బామ్మ. వినడానికి భలేగా ఉంటుంది. ఎన్ని రకాల భాష విరుపులతో, ధోరణుల్లో చెపుతుందో కదా!
మఠం వేసుకుని ఆవిడ కథ అంతా విని ఆవిడతో అయ్యో అని, పాపం అని, దీని దరిద్రం తగలడా! దీన్ని బాగుచెయ్యడం పాపం, ఆ సవితి కూతురికి ఎంత కష్టంగా ఉందో అని మనమూ బాధ పడుతూ వినాలి.
బామ్మ దగ్గర కథలు విని రాయడం నేర్చుకోవాలి. నన్నడిగితే ప్రపంచం లోని పెద్ద పెద్ద పేరున్న కథకులందరూ బామ్మ దగ్గర కథ చెప్పడంలో బలాదూరే! ఒక్కసారి గాని వాళ్ళు వింటే ఎంత నేర్చుకోవాలో తెలిసివస్తుంది! బామ్మ దగ్గర కథలు విని కథలు రాయడం మొదలుపెడితే ఇంక వాటికి తిరుగు ఉండదు! అవి గొప్ప కథలే అవుతాయి. ఎవరూ వాటిని ఎంచడానికి వీలే ఉండదు!
మార్గశిర లక్షింవారం కథ మొదలు పెట్టింది బామ్మ. తన మొగుడి మొదటి పెళ్ళాం పిల్లను ఏ సవిత్తల్లయినా బాగా చూస్తుందా? అలా అనుకోడం మన వెర్రి గాని! అందులోనూ ఈ గయ్యాళి గంప – రక్కీసి తుప్ప ముళ్ళ కంప! మనలాంటి వాళ్ళం ఎందుకమ్మా పాపం అది చిన్నపిల్ల. దాన్ని అలా రాచి రంపాన పెడుతున్నావ్! అని సబబు మాటాడ్డమే? మనమీదా పడిపోయి రక్కి వదిలిపెడుతుంది!
అయినా దీనిలాంటి వాళ్ళతో సబబూ న్యాయం, పాపం, జాలి అండం మనదే తప్పు! మన మీదే పడిపోదా, ఆ చిన్నపిల్ల ఒక లెక్కా! చుట్టుపక్కల వాళ్ళం, ఇరుగూ పొరుగూ అయ్యో పాపం అనుకోడం తప్పించి ఏం చెయ్యగలం?
బామ్మ ఇలానే మొదలు పెడుతుంది. చక్కగా ఓ బీదపిల్ల ఉండేది. ఆ పిల్లని సవతి తల్లి బాధ పెట్టేది అని మామ్మూలు వాళ్ళు కథ చెప్తారే, అలా చెప్పొచ్చుగా! ఊహూఁ అలా చెప్పదు! అలా చెపితే ఏముందీ? చప్పగా! విండానికి ఏం ఉంటుంది? అందుకే బామ్మ కథ చెపుతూ ఉంటే రెండు చెవులూ అప్పగించి వినాలి. మనమూ అలా చెప్పడం నేర్చుకోవాలి!
పాపం ఆ దేవాలయం పూజారిగారూ రోజూ ఈ చిన్నపిల్ల బాధని చూస్తూనే ఉన్నారు. సవితి తమ్ముణ్ణి పట్టుకుని వాడు పెట్టే అల్లరిని పడ్తూ వాడు కీ అంటే కీ అనీ కా అంటే కా అని అంటూ ఆడిస్తూ వాడికి పెట్టమని ఇచ్చిన బెల్లం ముక్కని ఓ ఆకులో పెట్టుకుని తినిపిద్దామంటే వాడు తినక తికమక పెట్టడం – సవిత్తల్లి ఆ బెల్లంముక్క నువ్వు గుటకాయస్వాహా చేసీడం కాదు. వాడికి పెట్టు! నువ్వు మింగేవో వాడికి పెట్టేవో నాకు తెలుసుకోడం రాదనుకోకు అని ఆ పిల్ల నెత్తి మీద పది మొట్టికాయలు మొట్టి ఇంట్లోకి తన పని చేసుకోడానికి వెళ్ళడం, వంట చేసుకుంటూ చేసుకుంటూ మధ్య మధ్య తొంగి చూస్తూ ఉండడం! పోలీసు లాగ! అదేదో ఆ చిన్నపిల్ల దొంగ అయినట్టు!
పూజారిగారు చూసి చూసి జాలి పడి ఆ పిల్లకి ఓ రోజున ‘తల్లీ మట్టితో లక్షిందేవి బొమ్మ చేసుకో, ఆడుకోడానికి ఆ బొమ్మతో. దానికే రోజూ దణ్ణం పెట్టుకుంటూ ఉండు. లక్షిందేవి నిన్ను కరుణిస్తుందీ ఆవఁటా’ అన్నాడు.
పిల్ల చిన్నపిల్లే అయినా బుద్ధిమంతురాలు, పెద్దవాళ్ళు చెప్పినట్టూ విండం, ఎలా చెపితే ఏది చెపితే అది చెయ్యడం – అలాగా అని ఆయనకు దణ్ణం పెట్టి మట్టితో చిన్న లక్షిందేవి బొమ్మ చేసుకుంది! పిల్లకు నేర్పు ఉంది! కొందరికి కొన్ని లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. లక్షిందేవి బొమ్మకి కిరీటం కూడా మట్టిముద్దతో చేసి పెట్టింది. చిన్న పుల్లతో ఆ కిరీటానికి గీతల్లా గీసి నగిషీల్లాగా చేసింది. కళ్ళని – ఈ కంటిని ఈ చెవి వరకూ, ఆ కంటిని ఆ చెవి వరకూ పుల్లతో లాగి లక్షిందేవికి పెద్ద పెద్ద కళ్ళని ఎలా చేసిందో! ఎంతో అందంగా ఉన్నాయి కళ్ళు. మెళ్ళో హారాల్లాగా, చేతులకు గాజుల్లాగా, కాళ్ళకి పట్టీల్లాగా – ఇలా ఆ బొమ్మకి ఎన్నెన్ని – ఆ చిన్ని బుర్రకి తోచినవన్ని చేసింది.
చూస్తోందిగా సవిత్తల్లినీ చుట్టుపక్కల పిల్లల తల్లులనీ. వాళ్ళలా తన లక్షిందేవికి అన్నీ చేసింది. ఆఖరికి చీర పమిట చెంగు ముడతల వరకూనూ!
అనుకుంటాం కానీ పెద్దవాళ్ళకన్నా పిల్లల కళ్ళు అన్నిటినీ ఎంతబాగానో చూస్తాయి. పెద్దవాళ్ళు దేన్నీ తిన్నగా పట్టించుకోరు! ఏఁవిటి చూస్తామో ఏఁవిటో? నేనైనా అంతేనూ! మీరు చూడ్లేదా వర్ధనంగారూ అని అవిడో ఈవిడో ఏదో అడిగితే చూళ్ళేదమ్మా అని చెపతా!
ఆ పిల్లను చూస్తే ఎవరైనా ముచ్చట పడతారు ఆ సవిత్తల్లి రాక్షసి తప్ప!
గాలికి ఎగిరివచ్చిన ఆకులు ఆ బొమ్మకి చుట్టూరా పెట్టి అవే పువ్వులు అన్నట్టు పూజ చేస్తున్నట్టు రోజూ దణ్ణం పెట్టుకునేది. సవిత్తమ్ముడి కోసం ఇచ్చిన బెల్లం ముక్కని ఆ బొమ్మకి చూపించి అదేదో పెద్ద పిండివంట చేసి నైవేద్యం పెట్టినట్టు బొమ్మకి నైవేద్యం పెట్టుకుని కళ్ళకి అద్దుకుని దణ్ణం పెట్టుకునేది. ఆ అమ్మాయి ఆటలో ఈ పూజ తంతు అంతా ఆ పిల్ల మనసుకి చాలా నచ్చినట్టు ఉండి ఏ రోజూ ఏ లోటూ లేకుండా చేసేది!
ఆ పిల్లకి కొన్నాళ్ళకి వయస్సు వచ్చింది. వాళ్ళ తల్లీ తండ్రీ పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేసేరు. అత్తారింటికి వెళ్తూ ఆ పిల్ల ఆ తన లక్షిందేవి బొమ్మను కూడా తనతోపాటు తీసుకు వెళ్ళిపోయింది.
ఇహ చూడాలి! సవిత్తల్లి ఇల్లు! ఇన్నాళ్ళూ లక్షిందేవితో కళకళ్ళాడుతూ ధనధాన్యసంపత్తితో తులతూగుతూ ఉండేది కాస్తా జెష్ఠాదేవి కొంప అయింది. వెలవెలపోతూ తిండికీ గుడ్డకీ కరువై నానా పాట్లు పడ్డం మొదలయింది.
అక్కడ ఆ పిల్ల అత్తారిల్లు ధనధాన్య సంపత్తితో తులతూగుతూ బాగా డబ్బుతో సకల సౌకర్యాలతో నిండి, తాము తింటూ నలుగురికి పెడుతూ దానధర్మాలు చేస్తూ, ఓ ఓ చూసి తీరాలి ఆ భోగభాగ్యాలు అన్నట్టుగా అయింది!
ఆ చిన్నపిల్ల ఆ లక్షిందేవి బొమ్మని అంత భక్తిశ్రద్ధలతో కొలిచింది మరి.
ఎప్పుడైనా అంతే! ఏదో దేవుడి వట్టి దగ్గర నాలుగు పువ్వులు పడేసి నెత్తిని నీళ్ళు జల్లుకుని పువ్వోటి చెవిలోనో, తల్లోనో పెట్టుకుని ఏదో మొక్కుబడిగా పూజ చేయడం వేరూ – దేవుడి మీద నిజమైన భక్తితో శ్రద్ధగా నిండు మనస్సుతో ఆరాధించడం వేరు!
ఇలా బామ్మ కథ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో నేర్చుకోవల్సినవీ ఉంటాయి. బామ్మ వాటి గురించి చెపుతుందంటే మనం వినేవాళ్ళ కోసం చెపుతున్నట్టు కాదు. తనకు తాను చెప్పుకుంటున్నట్టుగా, తనే అవన్నీ నేర్చుకుంటున్నట్టుగా చెపుతుంది.
అంటే అందులో అంతలా లీనమై పోతుందన్నమాట!
కథ కథ కాదు – అదేదో వాస్తవంగా జరుగుతున్న ఉదంతంలా తోస్తుంది! కథలు రాసేవాడు ఇది నేర్చుకోవాల్సిందే! తాను అందులో లీనమై భాగమైపోవాలి!
ఆ అమ్మాయి భర్తని అడిగి తన సవిత్తల్లి వాళ్ళకి సాయం చెయ్యాలని అనుకుంది. దానికేముంది భాగ్యం. అలాగే. నీకు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేసుకో. మనకున్న దాంట్లో నలుగురికి ఇవ్వాలి! అన్నాడు భర్త.
అమ్మా అమ్మా తమ్ముణ్ణి పంపూ అంటూ కబురు చేసింది. వాళ్ళమ్మకి అంతకంటే కావల్సిందేముంటుందీ? ఇన్నాళ్ళూ మొహం చెల్లక ఎలా అడగాలో తెలీక నోరు మూసుకు కూర్చుంది!
తమ్ముడు అప్పగారింటికి వెళ్ళేడు. వాణ్ణి ఆదరించి కడుపు నిండా తిండానికి పెట్టి, బట్టలు పెట్టి, ఓ కర్ర తొలిచి దానిలో బంగారు వరహాలు పోసి మళ్ళా మూసేసి ఇచ్చి – దీన్ని అమ్మకి ఇవ్వరా అంది! వాడు తోవలో కాలకృత్యాలు తీర్చుకోడానికి చెరువులో దిగుతూ అక్కడున్న ఓ చెట్టుకు చేర్లా పెట్టి వెళ్ళేడు! ఆ చెట్టు మీదున్న కోతి ఆ కర్రని కాస్తా పట్టుకుపోయింది. ఆ తమ్ముడు ఉత్తి చేతుల్తో ఇంటికి వెళ్ళేడు!
మళ్ళా మరోసారి నెత్తీనోరూ మొత్తుకుని వీడికిలాగ ఇస్తే కుదిరేటట్టు లేదని పాపం ఆ పిల్ల ఈసారి చెప్పుల్లో బంగారం వరహాలు వేసి కుట్టేసి ఆ చెప్పుల జత తొడుక్కుని వెళ్ళి అవి అమ్మకు ఇవ్వరా అంది. ఈసారీ వాడు కాలకృత్యాలకు చెరువులో దిగుతూ ఒడ్డున ఆ చెప్పుల్ని వదిలేడు. ఆ తోవని పోతున్నవాడు చెప్పులు భలేగా ఎత్తుగా ఉన్నాయే అనుకుంటూ వాటిని కాస్తా తొడుక్కుపోయేడు! మళ్ళా ఉత్తి చేతుల్తో ఏడుపుమొహంతో వాడు ఇంటికి వెళ్ళేడు.
ఈసారి ఇంకా బాగా తన తెలివిని అంతటినీ ఉపయోగించి ఆ పిల్ల పెద్ద తియ్యగుమ్మడి పండును తొలిచి దాని నిండా వరహాలు పోసి మళ్ళా ముచికను మూసేసి తమ్ముడికి ఇచ్చి, దీన్ని రెండు చేతులా పట్టుకుని వెళ్ళు, జాగ్రత్త అంది.
ఈసారీ వాడు చెరువులోకి దిగుతూ ఒడ్డున గుమ్మడిపండు పెట్టేడు. ఆ తోవంట వెళ్తున్న బ్రాహ్మడు, గుమ్మడిపండు బాగుందే, ఇవాళ తియ్య గుమ్మడి కూర, పులుసూ కూడా పెట్టుకు తినొచ్చు అనుకుంటూ దాన్ని పట్టుకు చక్కా పోయేడు!
మళ్ళా ఈ భభ్రాజమానంగాడు బుర్ర తక్కువ తెలివి తక్కువవాడు బుర్ర గోక్కుంటూ ఇంటికి వెళ్ళేడు.
ఆ సవిత్తల్లి కోసం వాళ్ళింటి కోసం తాపత్రయపడుతున్న ఈ అమ్మాయి ఈ సారి భర్తను అడిగి మా పుట్టింటికి వెళ్ళి మా అమ్మ చేత నోము నోపించి లక్షిందేవి కృప పొందమని దణ్ణం పెట్టిస్తానని అంది. సరే, అలాగే వెళ్ళు అన్నాడు మొగుడు.
అమ్మా, మార్గశిరం మాసం వచ్చింది. అయిదు లక్షింవారాలు నోము నోచుకుందువు గాని. నువ్వూ నేనూ పూచ్చేసుకుందాం అని చెప్పి నేను పనులు చేసుకునేలోగా మా పిల్లలకి చద్దన్నాలు పెట్టు అన్నాది. ఆవిడ ఆ పిల్లలకి చద్దన్నాలు తినిపిస్తూ ఓ ముద్ద తనూ తినేసింది! ఉండలేక! సరే, ఈ వారం ఇలా అయింది. వచ్చేవారం నోచుకుందువి గానిలే అని తను ఒక్కతే పూజ చేసుకుంది.
ఎవరెన్ని చెప్పండి! నుదుటిని రాసి లేకపోతే ఏదీ రాదు! అంటూ బామ్మ తన నుదురు కొట్టుకుంటూ చెపుతూ కథను అలా సాగదీస్తూ ఉంటే నాకు చికాకు వేసి ఇవాళ్టికి ఈ కథ పూర్తవుతుందా? నీ నుదురూ నా నుదురూ కొట్టుకుంటూ కూచుందామా? కథ చెప్పెయ్యి బామ్మా, అన్నాలు తిందాం, నువ్వూ నీ కథ చెప్పడవూనూ! అని దెబ్బలాడేను.
అలా అంటే ఎలాగా? జరిగింది జరిగినట్టు, చూసింది చూసినట్టు, ఇప్పుడు జరుగుతున్నట్టూ ఇప్పుడు చూస్తున్నట్టూ చెప్పుకోవాలి. కట్టె కొట్టె తెచ్చె అని చెప్పకూడదు! నేర్చుకో కాస్త ఓపిగ్గా, అన్నాది బామ్మ.
ఈ బామ్మ ఇంతే! ఆవిడకి తోచిందే చేస్తుంది. ఎవరి మాటా వినిపించుకోదు. తన ఇష్టమే అంతానూ! కథ చెప్పినా, భోజనం పెట్టినా, మాటా మంతాడినాను!
ఖర్మ ఖర్మ అంటూ నేను తలనీ నుదుటినీ కొట్టుకున్నా.
రెండోవారం కాస్తా మళ్ళా ఇలానే తగలెట్టింది! పిల్లలకి నూనె రాసి జడలు వేస్తూ ఆ నూనె కాస్తా తన తలకీ పులుముకుంది! ఇంకేం పూజ! ఈ వారమూ తగలడ్డాది.
నాలుగో వారం ఇలా కాదని సవిత్తల్లిని ఓ గొయ్యి తీసి ‘గోతిలో కూచో. నే పూజకి పిలిచేదాకా’ అని జాగ్రత్తలూ హెచ్చరికలూ చేసింది. ఏ లాభం! తల కడిగిన దరిద్రపు సన్నేసులు ఇలాగా తగలడతారు! అంటూ బామ్మ ఆ పిల్లతో పాటూ తననూ తిట్టుకుంది.
ఆ గోతిలో ఓ కందిపప్పు బద్ద కనపడ్డాదిట! దాన్ని కాస్తా నోట్లో పడేసుకుందిట!
సవితి కూతురు పట్టు విడవని విక్రమార్కుడిలా ఆ తల్లికి ఎలా అయినా లక్షిందేవి దయ సంపాదించి పెట్టాలని నడుం బిగించిందాయె! ఎందుకూరుకుంటుందీ? బామ్మా నాటకీయంగా తన పంచెనీ నడుంకి బిగించి కట్టుకుంది.
నాకు ఫకాలున నవ్వొచ్చింది. అయితే నవ్వకండా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వాపుకున్నా. లేపోతే ఇంకేమైనా ఉందా?
భడవకానా, ఓ పక్క ఆ అమ్మాయి పాపం తన తల్లికి సాయం చెయ్యబోతే ఏంటే నీకు నవ్వుతాలుగా ఉందా? ముందు నేర్చుకో! ఉపకారికి ఉపకారం ఎవరైనా చేస్తారు! అందులో గొప్పేం లేదు. తనను రాచి రంపాన పెట్టి నానా బాధలు పెట్టినదానికి సాయం చేద్దామని చూస్తోంది చూడూ, అదీ నేర్చుకోవాల్సింది. అపకారికి నెపం ఎన్నకండా ఉపకారం చేసేవాడు నేర్పరి సుమతీ అని పద్యం చదువుకున్నావు కదా! అని నానా తిట్లూ తిట్టింది.
నిజమే! గొప్పే! అపకారికి ఉపకారం చెయ్యడం! కాని ఇక్కడ ఆకలితో చస్తూ ఉంటే కథ ఎప్పటికీ అవకపోతే ఉపకారం లాగానే ఉంది నా తలకాయి! ఇలాంటి సమయాల్లో అమ్మ ఏమన్నా సాయం వస్తుందా? ఊహూఁ! ఆ వంటింట్లో తసించుకు చస్తుంది గాని తొంగి చూసి వంగి వాలదు!
నోర్మూసుకు వినాల్సిందే చచ్చినట్టు!
ఇహ లాభం లేదని ఆ పిల్ల తల్లిని తన కొంగుకు కట్టుకుని తిరగడం మొదలెట్టింది. నీ దరిద్రం దొంగల్దోల! నీ అమ్మ బొడ్డు పొక్కిపోను! నీ దరిద్రం కూలా! నీ దరిద్రాన్ని చెరువులో తొక్కా! నీ దరిద్రాన్ని ఆ యముడు పట్టుకెళ్ళా! నీ దరిద్రం పాడు కానూ! నీ దరిద్రం ఏట్లో పడా! ఇలా ఏఁవిటేవిటో నోటికి ఎన్నెన్ని తిట్లూ శాపనార్థాలూ వస్తే అన్నీ వాగుతూ ఆ అమ్మ చేత ఆఖరికి ఎలా అయితేనేం నోము పట్టించింది. తీరా అంతా అయితే లక్షిందేవికి దణ్ణం పెట్టి తను మొక్కి తన తల్లి చేత మొక్కిస్తే లక్షిందేవి మొహం తిప్పేసుకుంది.
ఏం చేస్తుందీ? చూసేవా న్యాయం. న్యాయానికి దేవుడి కళ్ళు కప్పి ఎవరన్నా ఏవన్నా చెయ్యగలరా ఎక్కడన్నా? ఆవిడకి తెలీదా ఆ పిల్లని అన్ని తిప్పలు పెట్టి రక్కి రాచి రంపాన పెట్టింది కదా! అందుకే మొహం తిప్పేసింది.
బామ్మ మళ్ళీ తన వ్యాఖ్యానం మొదలు పెట్టింది. కథను కథగా చెప్పి చావదు ఈవిడ!
ఏఁవమ్మా తల్లీ నోం బాగా నోచుకున్నాం కదా అమ్మా అని అడిగితే చిన్నప్పుడు నువ్వు నీ మట్టిబొమ్మతో ఆడుకుంటూ ఉంటే నీ చెంప మీద చెల్లుమని ఓ లెంపకాయ కొట్టింది! వాచిపోయి దవడ ఇంత లావయింది. నువ్వు నొప్పి భరించలేక విలవిల్లాడినా పట్టించుకోలేదు అన్నాది.
అమ్మా, ఆవిడవల్ల తప్పయి పోయింది. క్షమించు. క్షమించమని అడగమ్మా అని తల్లి చేత కూడా క్షమాపణ అడిగించింది. దాంతో ఆవిడ కరుణించింది. చూశావా? చిన్నపిల్లల్ని అలా తనవాళ్ళయినా పరాయివాళ్ళయినా బాధ పెట్టకూడదు. పిల్లలు నా స్వరూపాలు. అందులో ఆడపిల్లలు లక్షిందేవి రూపాలే! వాళ్ళతోనే సిరీ సంపదలు. జ్ఞాపకం ఉంచుకోండి అంది లక్షిందేవి.
ఇతి లక్షింవారాలు మార్గశిరానివి కథలతో సహా సంపూర్ణం అని బామ్మ దేవుడి పట్టె దగ్గరున్న విగ్రహానికి తలవంచి మొక్కింది.
అమ్మయ్య! మార్గశీర్షం వెళ్ళింది! ఎక్కడికో? మళ్ళీ సంవత్సరం దాకా కనపడదు. బతికే!
నీకో దణ్ణం లక్షింవారమా! అని నేనూ దణ్ణం పెట్టే.