చినుకులు రాలాయి
మొక్కలు హాయిగా
ఊపిరి పీల్చుకున్నాయి
నింగికి జాబిలిపూవు పూసింది
వెన్నెల పుప్పొడి కురిసింది
మొగ్గ ముడుచుకుని
మొహమాటపడింది
రవికిరణపు ధైర్యంతో
చక్కగా విరిసింది
కొమ్మను కోల్పోయి చెట్టు దుఃఖపడింది
రెక్క విరిగిన పిట్ట భుజం తట్టింది
వాన
మట్టి పలకపై
చినుకు బలపంతో
తడి అచ్చులు దిద్దింది
రెండు విత్తులు మట్టిలో నిద్రించాయి
వేర్వేరు రూపాలతో లోకాన్ని అలరించాయి
ఆకుపచ్చప్రపంచంలో
ఎన్ని రంగులో
గుండెల్లో ఒంపుకోవడానికి
మనిషికి రెండే కళ్ళు
ఇప్పుడు పెదవులకు తాళాలు పడ్డాయి
మునివేళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి
అవే అక్షరాలతో
కలం కవలలను ప్రసవించింది
ఎన్నో వెలుగులను ప్రసరించింది