2021వ సంవత్సరానికి తానా బహుమతి గెల్చుకున్న రెండు నవలల్లో చింతకింది శ్రీనివాసరావుగారి మున్నీటి గీతలు ఒకటి. సిక్కోలు (శ్రీకాకుళం) మత్స్యకారుల జీవితాలను హృద్యంగా అక్షరబద్ధం చేసిన 210 పేజీల నవల ఇది. కేవలం జాలర్ల బతుకులను ఆధారంగా చేసుకుని రాసిన మొట్టమొదటి తెలుగు నవల. 2019లో తానా పురస్కారం గెల్చుకున్న సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి నవల కొండపొలం కడపజిల్లా, బాలరాజుపల్లెకు చెందిన గొల్ల కాపరుల జీవితాలకు అద్దం పట్టింది. అలాగే 2021లో తానా అవార్డు గెల్చుకున్న బండి నారాయణస్వామిగారి నవల అర్ధనారి హిజ్రాల గురించి రాసిన నవల. సమాజం దృష్టిలో ప్రాధాన్యతలేని బడుగు వర్గాల జీవనరీతులకు తెలుగు సాహిత్యంలో స్థానం కల్పించడానికి ఈ నవలాకారులు చేసిన ప్రయత్నం, అటువంటి నవలలకు పురస్కారాలిచ్చి వెలుగులోకి తీసుకురావడానికి తానా చేస్తున్న కృషి ముదావహం, అభినందనీయం!
మత్స్యవేనం గ్రామానికి చెందిన జాలర్ల జీవితకథ ఈ నవల. ఇందులో కథానాయకుడు పోలారావు. ఎర్రమ్మ మరదలు. పోలీసమ్మ, బవిరోడు ఎర్రమ్మ తల్లిదండ్రులు. ఎర్రమ్మ పోలీసమ్మ మేనల్లుడు పోలారావుని ఇష్టపడుతుంది. కానీ ఆదర్శభావాలున్న, పేదవాడయిన పోలారావుని ఎర్రమ్మకిచ్చి కట్టబెట్టడం బవిరికి ఇష్టంలేదు. తన చెల్లెలు కొడుకు, ధనవంతుడైన సత్తిరాజుకివ్వాలని అతని కోరిక. దానికి భార్య వ్యతిరేకి. చివరికి బవిరోడు పోలారావు మంచితనం గ్రహించి తన కూతురితో వివాహం జరిపించడానికి ఒప్పుకుంటాడు. కొండబాబు, నల్లమారి, కుంచయ్య, పైడితల్లి, వెంకటిలాంటి ఇతరపాత్రలు కూడా కథలో చోటుచేసుకుంటాయి, కథను నడిపిస్తాయి.
స్థూలంగా కథ ఇది: మత్స్యవేనం బెస్తలు ప్రతి సంవత్సరం గుజరాత్ లోని అరేబియా సముద్రతీరానికి వలసపోతారు. గుజరాత్ సేట్లు వచ్చి వాళ్ళని ఎంపిక చేసి రైలు ప్రయాణం ఏర్పాట్లు చేస్తారు. గుజరాత్లో వెలసిన చేపల రేవులు, జెట్టీలు, హార్బర్ల ఫలితంగా జాలర్ల జీవనం మెరుగ్గా ఉంటుంది. చేపలు సమృద్ధిగా దొరుకుతాయి. అవన్నీ లేక తూర్పుతీరం వట్టిపోయి, జీవనోపాధి కోసం గంగపుత్రులు వలసపోయే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. పూరీ-ఓకా రైలుబండి ఆముదాలవలసలో ఎక్కి, రెండు రాత్రిళ్ళు, రెండు పగళ్ళు ప్రయాణం చేసి సౌరాష్ట్ర రాజ్‌కోట్‌కు చేరుకుంటారు మత్స్యవేనం మత్సకారులు. అక్కడ నుండి వారిని బస్సుల్లో వెరావల్ సత్రానికి చేరుస్తారు. బస్సుల్లో ఫిషింగ్ షెడ్డుకి వేనం జనాలను పట్టుకుపోతారు. నెలకు ఇరవై రోజులు చేపలవేట. పదిరోజులు గట్టుమీద. వేట ఎనిమిది మాసాల వరకు సాగుతుంది. బోటు నడిపేవాడ్ని తాండేలంటారు. వలలు వేసి చేపలు పట్టేవారిని కళాసీలంటారు. తాండేలు కొండబాబు, కళాసీలు పోలారావు, కుంచయ్య, పైడితల్లి, గారయ్య, సూరిబాబు, వెంకటి ఒక జట్టుగా ఏర్పడి ఓంకార్ అనే పేరున్న బోటుకి చేరుతారు. ఆ ఏడాది తాండేళ్ళ వేతనం నెలకి పదిహేనువేలు, కళాసీల వేతనం నెలకి రెండువందలు తక్కువ తొమ్మిదివేలు పెరగడం వలన అందరూ సంతోషంగా ఉంటారు.
బోటు ప్రయాణం మొదలవుతుంది. మొదటి రెండు వేటల్లో చేపలు దండిగా దొరుకుతాయి. ఆ తర్వాత దొరక్క సముద్రంలో చాలా దూరం బోటును తీసుకెళతాడు కొండబాబు. చివరికి జి.పి.ఎస్. పనిచేయక పాకిస్తాన్ జలాశయాల్లోకి ప్రయాణిస్తుంది బోటు. అదే పొరపాటుని మిగతా బోట్లవాళ్ళు కూడా చేస్తారు. పాకిస్తాన్ నౌకలు బోట్లను చుట్టుముట్టి అందులోని 27మంది బెస్తలను అరెస్టుచేసి కరాచీ హార్బరుకు తీసుకెళతారు. అక్కడ నుంచి వ్యాన్లలో తీసుకెళ్ళి లాంధీ జైలులో వేస్తారు. అక్కడ వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు. సరైన తిండిలేక, విపరీతమైన శారీరక పరిశ్రమ వలన బక్కచిక్కిపోతారు. పోలారావు తన మంచితనంతో తోటి మత్స్యకారుల్నే కాకుండా, పాకిస్తాన్ జైలు అధికారుల మన్ననలను పొందుతాడు. చివరికి జాలర్లు భారతదేశపు అధికారుల ప్రయత్నాల మూలంగా విడుదల చేయబడి తూర్పుతీరం చేరుకుంటారు.
నవలంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది, ఆపకుండా చదివిస్తుంది. శ్రీకాకుళం మాండలికంలో సంభాషణలు సాగినా ఎక్కడా అర్థం కాని సమస్య రాదు. రచయిత పోలారావుని ఆదర్శవంతమైన యువకుడిగా తీర్చిదిద్దారు. నవల చివర్లో అతనన్న మాటలు అతనెటువంటివాడో తెలుపుతాయి. “మనిషి తెలివి ఉన్నది, భూమ్మీద గీతలుగీసి దేశాలను తయారుచేయడానికా. ఆ దేశాలను రాష్ట్రాలుగా చేయడానికా. ఆ రాష్ట్రాలను దూసి జిల్లాలుగా విభజించడానికా. ఇప్పటికి మానవుడు గీసిన గీతలు చాలవా. ఆడా మగా అని గీశాడొకడు. శరీరం రంగు చూసి గీశాడొకడు. కులాలు, మతాలు, వర్గాలుగా గీశాడొకడు. ఉన్నవాడూ, లేనివాడూ అని గీశాడొకడు. ఇదెంత అన్యాయం. ఎవడి ఆకలయినా ఒక్కటే. ఎవడి దుఃఖమైనా, ఎవడి సుఖమైనా ఒక్కటే. ఎవరిని కన్నప్పుడయినా తల్లి పడే నొప్పుల తీరు ఒక్కటే. మనిషి మేధ గీతలు గియ్యడానికి కాదు. గీతలు చెరపడానికి పనికిరావాలి. ప్రపంచాన పుట్టిన ప్రతివాడూ సమానుడే కావాలి. సంపద, వనరులు, అందరివీ కావాలి. ధనబంధం లేని మానవసంబంధాలు ఏర్పడాలి. దేశానికి మంచి ఆలోచించగల దేహసముదాయాలు నేలమీద నడయాడాలి. అందుకోసం ఏదయినా చెయ్యాలనుకుంటున్నాను” అని కంకణబద్ధుడైనట్టుగా స్పష్టపరుస్తాడు. ఈ మాటలవలన మున్నీటి గీతలు అర్థం కూడా మనకి బోధపడుతుంది. మున్నీటిగీతలంటే సముద్రపు సరిహద్దులని, అడ్డుగోడలని అంచనా వెయ్యవచ్చు.
ఇంత ఉదాత్తుడయిన పోలారావు ప్రేమ విషయంలో ఉదాసీనంగా ఉన్నట్లు అనిపిస్తాడు. ఎర్రమ్మ వ్యక్తపరిచినంత గాఢత వానిలో కనపడదు. జైల్లో వున్న అందరూ తమతమ ఆత్మీయులకు ఉత్తరాలు రాస్తే, ఎర్రమ్మ తన క్షేమం తెలుసుకోవాలని తహతహలాడుతుందని తెలిసినా ఉత్తరం రాయకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. అయినా ఎర్రమ్మ తల్లి ప్రోద్బలంతో స్థిమితపడి అతనికి ఉత్తరం రాస్తుంది. దానికి పోలారావు ఎర్రమ్మ తన ఆదర్శాలకు చేయూతనిస్తుందని గ్రహించినా మావ చెప్పినట్లు సత్తిరాజునే వివాహం చేసుకోమని చెప్పడం ఒక్కింత నిరాశపరుస్తుంది.
నవలలోని మిగతా పాత్రలని కూడా సమర్థవంతంగా మలిచారు రచయిత. ఎర్రమ్మకి పోలారావు మీద ఉన్న ప్రేమని లోతుగా, ఉన్నతంగా చూపించారు. కుంచయ్య హాస్యధోరణి ఆకట్టుకుంటుంది. ఆముదాలవలస నుండి రాజ్‌కోట్ వరకు సాగిన రైలు ప్రయాణం ఉల్లాసభరితంగా ఉంటుంది. అందుకు కుంచయ్యతో చెప్పించిన సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. జట్టులో అందరికంటే చిన్నవాడయిన వెంకడి అమాయకత్వం, అన్నీ తెలుసుకోవాలన్న కుతూహలంతో వేసే ప్రశ్నలు ఆకర్షిస్తాయి. జాలర్లు పాకిస్తాన్ జైల్లో పడిన బాధలు కళ్ళనీళ్ళు పెట్టిస్తాయి. చుక్కమ్మ చెప్పిన చేపల పేర్లు విని, చేపల్లో ఇన్ని రకాలున్నాయా అని అబ్బురపడతాం! ఓంకార్ బోటుని వర్ణించిన విధానం, సముద్రప్రయాణం, చేపలుపట్టే వైనం, బోటు ప్రయాణీకుల దినచర్య ఆసక్తికరంగా ఉంటుంది.
పాకిస్తానులో సాజిత్ ఖాన్, హమ్ జాలా వంటి హృదయమున్న జైలు అధికారులున్నట్లు చూపించటం మానవత్వం ఇంకా బతికే ఉన్నదనటానికి నిదర్శనం! సంవత్సరాల తరబడి పాకిస్తాను జైళ్ళలో మగ్గుతున్న భారతీయ ఖైదీలలా కాకుండా అతి తక్కువ వ్యవధిలో తూర్పుతీర జాలర్లను విడుదల చేయటం ఆశ్చర్యపరచినా ఒకోసారి అసాధ్యాలు జరగవచ్చని సరిపెట్టుకోవచ్చు!
సాగర కాలుష్యం గురించి కూడా రచయిత మంచి సమాచారాన్ని అందజేశారు. విశాఖపట్నం, భోగాపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లోని కొన్ని రసాయన కర్మాగారాలు, మందుల కంపెనీలు, భారలోహాల కార్ఖానాలు, ఉత్పత్తివేళ వెలువడే వ్యర్థాలను మూడోకంటికి తెలియకుండా సముద్రజలాల్లో కలిపేస్తున్నాయి. ఆ వ్యర్థాలన్నీ చమురుకట్టులా కడలి మీద తేలుతూ మీనజాతిని బతకనివ్వడం లేదు. సముద్రపుటొడ్డున నాచులో కలగలిసిపోయి చేపగుడ్లను సైతం పురిట్లోనే చంపేస్తున్నాయి. ఈ వివరాలు పర్యావరణ కాలుష్యం పట్ల అవగాహన కలిగిస్తాయి. ఇటువంటి కాలుష్యానికి నదీజలాలు కూడా లోనవుతున్నాయని గ్రహించవచ్చు!
అయినా, నవల మంచే జరుగుతుందన్న ఆశాభావంతో ముగుస్తుంది. పోలారావు, ఎర్రమ్మల వివాహం మత్స్యవేనం జాలర్లందరి సమక్షంలో జరుగుతుంది. పెళ్ళయిన వెంటనే వాళ్ళిద్దరూ ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ధర్నాలో పాల్గొనటానికి వెళ్తారు. అక్కడికి దేశపు నలుమూలల నుంచి వేలాదిగా జాలర్లు తరలివస్తారు. శ్రీకాకుళం తీర ప్రాంతంలో జెట్టీల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు, మత్స్యకారులకు ఉపాధి కల్పన, వలసల నివారణ మొదలైనవి అక్కడ ప్రతిపాదించే ముఖ్యమైన డిమాండ్లుగా చెప్పబడతాయి. దీనివలన కొంతలోకొంత మార్పు తప్పక వస్తుందన్న ఆశ కలుగుతుంది.
‘తానా పోటీ ప్రకటన చూసి కళింగసీమ బీద జాలర్ల మనుగడ గురించి భక్తితో రాశాను, భయంతో రాశాను, అనురక్తితో రాశాను’ అని రచయిత తన ముందుమాటలో అనడం సిక్కోలు మత్స్యకార్ల జీవితాలకు ఒక గుర్తింపు తేవడానికి ఆయనెంత తపనపడ్డారో తెలుస్తుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం తీర గ్రామాల్లో తిరిగానని, మత్స్యకారులను కలిసి మాట్లాడానని, పాకిస్తాన్ కారాగారంలో గడిపి, స్వవాసానికి చేరిన కొందరి జాలర్ల సమాచారం తెలుసుకున్నానని రచయిత చెప్పడం, ఈ నవల రాయడానికి వెనుకనున్న నేపథ్యం, నవలాకారుని కృషి తెలిసివస్తుంది. వైవిధ్యభరితమైన బెస్తల జీవితాల గురించి మనకు తెలుసుకునే అవకాశం ఈ నవల మనకు కలిగిస్తుంది.
[చింతకింది శ్రీనివాసరావు: విశాఖపట్నం జిల్లా, చోడవరంలో జన్మించారు. వాణిజ్య, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎం.ఏ. చేశారు. అక్కడ నుంచే చేసిన వారి డాక్టరేటును బెస్ట్ థీసిస్‌గా గుర్తించి, 2013లో త్రిపురనేని గోపీచంద్ స్మారక బంగారు పతకాన్ని బహూకరించారు. 1989 నుంచి వారు ఈనాడు, ఆంధ్రప్రభ, సాక్షి వంటి వివిధ తెలుగు దినపత్రికల్లో ముప్ఫయి రెండేళ్ళపాటు జర్నలిస్టుగా పనిచేశారు. పనిచేస్తూనే విస్తృతంగా రాస్తూ, నాలుగు కథాసంపుటాలు, ఐదు నవలలు, మూడు నాటకాలు, ఐదు నాటికలు రచించారు. వారు రాసిన ‘కళింగ నానీలు’, మహిళా సాధికారికత మీద వ్యాసాలు విమర్శకుల గుర్తింపును, ప్రశంసలను పొందాయి. చాసో స్ఫూర్తి పురస్కారం, కొలకలూరి నవలా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ నంది, ఉగాది పురస్కారాలు పొందారు.]