సోల్జర్ చెప్పిన కథలు: మొదటి ఏడాది

2:15 AM.

నైట్ డ్యూటీ యూనిఫార్మ్ విప్పకుండా, బూట్లు మాత్రం విప్పి మంచం కిందకి చేర్చి, దోమతెరలోకి ఒదిగాను, నులకమంచం కిరకిరలని సాధ్యమైనంతవరకూ అదుపు చేస్తూ… పొద్దున్నే ఆరింటికి డ్యూటీ కమాండర్ దగ్గర మళ్ళీ హాజరు వేయించుకున్న తర్వాతే ముగుస్తుందీ డ్యూటీ.

నజారేఁఏ అప్‌నీ మస్తియాఁ లుటా లుటా కె సోగయే
సితారేఁఏ అప్‌నీ రోష్‌నీ దిఖా దిఖా కె సోగయే
హర్ ఏక్ షమ్మా జల్ చుకీ – నా జానే తుమ్ కబ్ ఆవోగే
సుహానీ రాత్ ఢల్ చుకీ…

“ఇదుంచు బాస్” అంటూ చిన్న గిఫ్ట్ పాకెట్ అందించాడు కిరణ్. బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ముగించుకుని, ఆరునెలల తర్వాత మొదటిసారి సెలవు మీద పది రోజులు గడిపి తిరిగి రైలెక్కబోతుండగా…

“ఏంటిది?”

“ఏం లేదులే. పద ఎక్కు. సిగ్నల్ పడింది” అంటూ సాగనంపాడు, కనుమరుగయేంతవరకూ చెయ్యి ఊపుతూ.

సీట్‌కి చేరి పాకెట్ విప్పి చూస్తే, అదొక లేటెస్ట్ మోడల్ సోనీ వాక్‌మన్. సంతోషంతో కళ్ళు చెమర్చాయి. తనకీ నాకూ ప్రాణమైన పాటలని వినమని ఇచ్చాడు కిరణ్!

ఆ క్షణంనుంచీ అది నాకు ఎంతో ప్రియమైన వస్తువయింది. వీలయినప్పుడల్లా అందులో పాటలు వినడం ఇష్టమైన వ్యాపకమైంది. వినిపించే ప్రతి స్వరంతోబాటూ మనసు ఒంపులు తిరగడం ఆనవాయితీ అయింది.

నా జానే తుమ్ కబ్ ఆవోగే’ ఎప్పుడొస్తుందో తెలీదు గానీ, ఇలా తేనెలొలికిస్తూ పాడితే రాక తప్పదామెకి! చిన్న వాల్యూమ్‌లో వాక్‌మన్ నుంచి రఫీ పాట చెవుల్లోకి జారుతుండగా, మనసులోనే హమ్ చేసుకుంటూ నిద్రలోకి జారేను.

6:55 AM.

మామా చందమామా వినరావా మా కథా
వింటే, మనసు వుంటే కలిసేవూ నా జతా

బలవంతాన బాలూ పాటని ఆపి, వాక్‌మన్‌ని ఆఫ్ చేసి లాకర్లో పెట్టి తాళం వేసి, బారక్ బయటకొచ్చాను.

‘హౌ డూ ఐ లుక్?’ బారక్ గోడకి బిగించిన అడ్డం మీద రాసిన ఎర్రటి అక్షరాలని చదువుతూ, కింద బూట్లనుంచి పైన టోపీవరకూ యూనిఫారం అంతా ఒక్కసారి పరిశీలించుకున్నాను. షూస్ మెరుస్తున్నాయి. ముదురు ఆకుపచ్చరంగు యూనిఫారం ఫెళఫెళమంటోంది. బెల్ట్ కున్న బకిల్, టోపీకున్న జిమ్మీ తళతళలాడుతున్నాయి. క్లీన్‌గా షేవ్ చేసుకున్న గడ్డం ఆకుపచ్చని షేడ్ తేలుతోంది. నీటుగా కత్తిరించిన మీసం. భుజానికి తగిలించుకున్న పుస్తకాల సంచీ శుభ్రంగా ఉంది. అంతా ఓకే.

“ఓయ్ సిన్హా, తుమ్ నహీఁ సుధరేగా!”

“ఏం?” ఎదురు ప్రశ్న వేశాడు ఆ ఏకే సిన్హా. అతను మాకంటే కనీసం నాలుగు బాచ్‌లు సీనియర్. మాకన్నా ఆరు నెలలు ముందరే ఈ టెక్నికల్ ట్రైనింగ్ రెజిమెంట్‌కి వచ్చింది అతని బాచ్. ప్రతి సబ్జెక్ట్ లోనూ నూటికి అయిదూ ఆరూ మార్కులు తెచ్చుకుంటున్నాడని, అతన్ని ‘రెలిగేట్’ చేశారు. అలా మూడోసారి రెలిగేట్ అయి వచ్చి మా బాచ్‌లో పడ్డాడు. ఈసారైనా గట్టెక్కుతాడన్నది అనుమానమే.

“యూనిఫారం ఇస్త్రీ చేయించుకోవాలని, షూ పాలిష్ చేసుకోవాలని నీకు విడిగా చెప్పాలా?” కొంచెం ధాటీగా అడిగాడు ఉపాధ్యాయ్.

తనని కాదన్నట్లు ఎటో చూపులు తిప్పుతూ నిలబడ్డాడు ఏకే సిన్హా. తనకంటే ఉపాధ్యాయ్ జూనియర్ కాబట్టి, అతనికి జవాబివ్వాల్సిన అవసరం లేదన్నట్లుంది అతని వాలకం. చురచురా చూసి, “స్క్వాడ్! సావ్‌ధాన్. దహినే ముడ్. తేజ్ చల్” అంటూ మా కుడివైపుకి చేరి, అరవకుండా కమాండ్ ఇచ్చి, మమ్మల్ని క్లాస్‌కి మార్చింగ్ చేయించాడు ఉపాధ్యాయ్.

మధ్యాహ్నం ఒకటిన్నరకి మళ్ళీ బారక్ చేరుకున్న వెంటనే పుస్తకాల సంచీని లాకర్లో పెట్టి, మెస్‌లో లంచ్ చేసి వచ్చాం. రెడ్డి కూడా మా బాచ్ లోనే ఉన్నాడు. అతని మంచం బారక్‌లో ఓ చివర. నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడనుకుంటా.

వాక్‌మన్ కోసం లాకర్లో చెయ్యి పెట్టాను. అలవాటుగా చేతికి తగిలేది, ఇప్పుడు తగల్లేదు. చటుక్కున వంగి చూశాను. మిగిలినవన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. వాక్‌మన్ తప్ప.

పొద్దున్న బారక్‌ని వదిలే ముందు లాకర్‌కి తాళం వేశానా? అవును వేశాను. పైగా తాళం తెరిచే కదా పుస్తకాల సంచీని లోపల పెట్టాను! ఆ తర్వాతేగా మెస్‌కి వెళ్ళింది!?

అప్పుడు తాళం వేశానా? ఓ! లేదు. అంటే లంచ్ చేసి వచ్చే లోపు జరిగి ఉండాలి. ఏం చెయ్యను? నాకెంతో ఇష్టమైన వాక్‌మన్! నా ప్రాణస్నేహితుడు ఇచ్చిన వాక్‌మన్ అది. పోయిందని గుర్తొస్తున్నకొద్దీ కలుక్కుమంటోంది. పోయిన వస్తువు ధర కాదు బాధపెడుతున్నది. దాని విలువ.

అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నాడు ఉపాధ్యాయ్.

“లీడర్ సర్…”

“ఊఁ”

“ఒక మాట చెప్పాలి…”

“బోలో.”

చెప్పాను. “ఆ!” అంటూ ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడతను.

“మొత్తం సరిగ్గా వెతికావా?

“వెతికాను సర్.”

క్షణం ఆలోచించి, పీటీ డ్రస్ తొడుక్కుని, తిన్నగా వెళ్ళి బారక్ కమాండర్ నాయక్ ధగ్లారామ్‌కి ఈ చోరీ గురించి చెప్పాడతను. ఇప్పుడు ధగ్లారామ్‌ తనతోబాటు నన్నూ వెంటబెట్టుకుని ఒక్కొక్క లాకర్నీ తెరిపించి, తనిఖీ చేస్తాడు. నా వస్తువు నాకు తొందరగానే దొరుకుతుందిలే, బహుశా.

అయిదు నిముషాలైందో లేదో పెద్దగా విజిల్ వినబడింది. ఆ వెంటనే “ఏయ్ హరామీ స్క్వాడ్! దో మినట్ మే బాహర్ ఫాలిన్! పూరే కే పూరే చాహియే ముఝే!” ధగ్లారామ్‌ కేక.

అందరం బయటికి చేరుకున్నాం. “ఇన్ థ్రీస్! తీన్ దహినే బాకీ బాయేఁ! జల్దీ కరో సాలోఁ!”

అరుస్తున్నాడేం?!

“స్క్వాడ్! బాయేఁ ముడ్! పూరే బారక్ కా చక్కర్ లగాకే ఆయేగా! గో!”

ఇంత కోపం అవసరమా పోయిన ఒక వస్తువుని వెతకడానికి?

“సాలే! హారామ్‌ఖోర్! అభీ తక్ ఇధర్ హీ హై? భాగ్ సాలే భాగ్!”

నన్నే ఉద్దేశించి అరిచాడు ధగ్లారామ్. నన్నెందుకు తిడుతున్నాడు? పోయింది నాదేనని లీడర్ ఇతనికి చెప్పలేదా ఏంటి? చేసేది లేక పరుగు మొదలుపెట్టాను. 250 మీటర్ల పొడవున్న బారక్ అది. ఒకసారి చక్కర్ కొడితే అర కిలోమీటర్ అవుతుంది. మధ్యాహ్నపు ఎండ ఎర్రగా మండుతోంది. పది నిముషాల ముందే భోజనం చేయడంతో, తొందరగా చెమటలు పడుతున్నాయి.

“ఫాలిన్! మేరే సామ్‌నే. ఇధర్!” మాకోసమే సిద్ధంగా ఉన్నట్లు అరిచాడు ధగ్లారామ్. “ఊపర్ జంప్ షురూ కర్!” వెంటనే కమాండ్ ఇచ్చాడు. రెండు నిముషాలు జంప్ చేసేసరికి, వేసుకున్న ఆర్మీ టీ-షర్ట్ చెమటతో తడిసిపోయింది. దుమ్ము లేస్తోంది.

“పూరే కంపనీకా చక్కర్ లగాకే ఆయేగా. పహ్‌లా తీన్ చాహియే. రెడీ గో!” జంప్ చేస్తుండగానే మరోసారి కేక పెట్టాడు.

వగర్చుతూనే అలాంటి చక్కర్లు మరో మూడు కొట్టాం.

“స్క్వాడ్! దో మినట్ మే ఫుల్ పెరేడ్ డ్రస్ మే ఇధర్… రెడీ గో!”

పరుగుతో బారక్‌లోకి చేరాం. చెమటతో తడిసి ముద్ద అయిన నిక్కరూ, టీ-షర్టూ, పీటీ షూసూ గబగబా విప్పి మంచాల మీదకి విసిరి, హాంగర్లకి తగిలించిన యూనిఫారాలని తొడుక్కున్నాం ఆదరాబాదరాగా, ఎవరం ఎవరితోనూ మాట్లాడకుండా, బారక్ కమాండర్ ఇస్తున్న ఆదేశాలని పాటిస్తూ…

ఏకే సిన్హా వైపు చూశాను షూస్ తొడుక్కుంటూ. అతని గుంటకళ్ళలో ఏదో తెలీని భావం. నవ్వుకుంటున్నాడా?

మళ్ళీ బారక్ బయటికి పరుగు… ఫాలిన్!

“లీడర్! రిపోర్ట్ కోన్ దేగా హాఁ? ఆజా, ఇధర్ బెండ్! మై దేతా హుఁ రిపోర్ట్!” గద్దించాడు ధగ్లారామ్.

చెమట తుడుచుకోబోతున్న ఉపాధ్యాయ్ ఉలిక్కిపడ్డాడు. ఒక్క ఉదుటున కమాండర్ ముందుకి చేరి “సర్…” అంటూ రిపోర్ట్ మొదలుపెట్టబోయాడు.

“చుప్! బెండ్ సాలే!”

“పూరా స్క్వాడ్ దో మినట్ మే ఫుల్ ‘చీతా’ డ్రస్ మే చాహియే. స్క్వాడ్! లైన్ తోడ్!” ధగ్లారామ్ గొంతు గర్జించింది. “బడే పిట్ఠూ కే సాథ్!”

ఓరి నాయనో! చాలామందికి ఒళ్ళు జలదరించింది. ఇప్పుడు ‘బడా పిట్ఠూ’తో సహా రావాలంటే, అవన్నీ తగిలించుకోవడానికి కనీసం పది నిముషాలు పడుతుంది. తప్పేదేముంది! పరుగు పెట్టాం బారక్ లోకి. అసలెందుకు ధగ్లారామ్ మమ్మల్నందరినీ పరుగులు తీయిస్తున్నాడు? అతనికి ఇంత కోపం రావడం మాలో ఎవరమూ ఎప్పుడూ చూడలేదు. తగిలించుకుంటున్నాం. బూట్లు తొడుక్కుంటున్నాం. చివరి రిక్రూట్ కూడా బయటికి వచ్చి ఫాలిన్‌లో చేరేసరికి పది నిముషాలు పట్టింది.

ఇప్పుడేం చెయ్యమంటాడో? కొంపదీసి ఫ్రంట్ రోల్ చేయించడు కద! మందపాటి టార్పాలిన్ గుడ్డతో చేసిన పిట్ఠూలు, డబ్బాల్లా కనపడేందుకు వాటిలోపల పెట్టే చెక్క ఫ్రేములు గుచ్చుకుని వీపు చీరుకుపోతుంది. వేళ్ళ చివర్లనుంచి చెమటలు ధారలు కడుతున్నా తుడుచుకునే ప్రయత్నం చేయడం లేదెవ్వరమూ…

అంతవరకూ బారక్ వరండాలో స్టూల్ మీద కూర్చొని తీరికగా కాల్చిన బీడీని విసిరేసి, నిలబడ్డాడు ధగ్లారామ్.

“కాన్ ఖోల్‌కే సునోరే తుమ్ సబ్. సివిల్ మే…” అమ్మయ్య! లెక్చర్ ఇచ్చి వదిలిపెడతాడల్లే ఉంది. “తప్పు చేసిన వాడికే శిక్ష పడుతుంది. అవునా?”

“…”

“కానీ ఫౌజ్‌లో అలా కాదు…” ఆగేడు.

“ఒకడు తప్పు చేస్తాడు. మొత్తం రెజిమెంట్‌కి పనిష్మెంట్ పడుతుంది.”

“…”

“సమ్‌ఝే?”

“యస్ సర్!” అన్నాడు ఉపాధ్యాయ్.

“ఇలా రండ్రా.”

బిలబిలా అందరం వరండాలోకి చేరేం. అమ్మయ్య! నీడ ఒక వరం.

“పీఛే మూడ్! టాంగే ఊపర్! కాళ్ళు కిటికీ మీద. చేతులు నేల మీద. షురూ కర్.”

మూడడుగుల ఎత్తున్న కిటికీ చట్రానికి కాళ్ళు ఆనించి, బెండ్ పొజిషన్లో చేతులు నేలమీద పెట్టి… దేవుడా! పోయింది నాదైతే నాకు పనిష్మెంటేంటి? పోనీ, స్క్వాడ్ మొత్తానికీ పనిష్మెంట్ ఇవ్వడమేంటి? ఇదెక్కడి లాజిక్?
రెండుమూడు నిముషాలు గడిచాయి. తలనుంచి కారుతున్న చెమట ముక్కు మీదినుంచి జారి అంగుళం దూరంలోకొచ్చిన నేలమీద చిన్న చిన్న మడుగులు కడుతోంది. భుజాలు వడవడ వణకడం మొదలైంది. వీపు మీది పిట్ఠూ అంతకంతకూ బరువెక్కుతోంది.

“ఎవడి సామాను పోయింది?”

“నాది సర్…” మూలిగినట్లు జవాబిచ్చాను.

“పేరేంట్రా?”

“బీ కే రావ్ సర్.”

“పూరా బోల్ బే హీరో! నెంబర్ రాంక్ నేమ్ ఉన్నాయా లేవా?”

చెప్పాను.

“ప్రయాణీకులు తమ సామాన్లకి తామే బాధ్యులు. ఎప్పుడన్నా విన్నావా ఇది?”

“సర్…”

“నీ సామాన్ల బాధ్యత ఎవడిది? నీదా? నీ ఓసీ సాబ్‌దా?”

“నాదే సర్.”

“మరి?”

“…”

“అసలు, ఆ రేడియో నీ దగ్గరెందుకుంది? నీకు అంతగా పాటలు వినాలంటే మోటివేషన్ హాల్‌కి వెళ్ళు. అక్కడ రేడియో ఉంది. సమ్‌ఝే?”

“అది రేడియో కాదు సర్…”

“మూ బంద్! తెరిచిపెట్టుకుని కూర్చుంటే ఏదో ఒక రోజు నీ బుల్లా కూడా కోసుకుపోతారు.”

“…”

స్క్వాడ్ వైపు తిరిగాడు ధగ్లారామ్. “ఆ చోర్ ఎవడో మీలోనే ఉన్నాడు!”

“…” ఎవరూ కిమ్మనలేదు.

“సాయంత్రం రోల్‌కాల్ లోపు వీడి రేడియో వీడికి చేరాలి. తెలిసిందా హరామ్‌ఖోరోఁ?”

రేడియో ఏం? ఈ పొజిషన్లో ఇంకాసేపుంచితే ఆస్తులు రాసిమ్మన్నా ఇచ్చేస్తామేమో!

“లీడర్!”

“సర్.”

“రేడియో దొరికినట్లు రోల్‌కాల్‌లో రిపోర్ట్ కావాలి నాకు. లేదో…”

“…”

“ఔర్ సునో…”

“…”

“ఇంకోసారి ఇలా అవకాశమివ్వొద్దని చెప్పండి వాడికి!”

“యస్ సర్!” అన్నాడు ఉపాధ్యాయ్.

“అబ్ భాగో!”

ఆర్డర్ వేసి తన రూమ్‌లోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు ధగ్లారామ్.


చేరి ఏడాది.

“పదరా, మెస్‌కెళ్దాం” అంటూ కంచం తీసుకుని బయల్దేరేడు రెడ్డి. ఈ రోజు పిక్చర్ పెరేడ్. వారానికోసారి ఒక హిందీ సినిమా వేస్తారు. రూలు ప్రకారం అందరం వెళ్ళి చూడాల్సిందే.

మెస్ గ్రౌండ్‌లోకి చేరుకుని, లైన్లో నిలబడ్డాం. అది మా స్క్వాడ్ కాదు. కానీ పిక్చర్ డే కావడంతో లైన్లో స్క్వాడ్‌లవారీగానే నిలబడాలని లేదు. అప్పటికే చాలామంది తినేశారు. కొందరు తింటున్నారు.

“ఇయాల కూడా ‘కడీ చావలే’ వుంటాదేమో!” అన్నాడు రెడ్డి. పెరుగులో శనగపిండి కలిపి తాలింపు దట్టించి, అందులో ఉల్లిపాయ పకోడీలు కూడా వేసి తయారుచేసే కఢీ అంటే అతనికి చాలా ఇష్టం. అతని నోట్లో అప్పుడే నీళ్ళూరుతున్నాయి.

అన్ని కష్టాలూ ఒకెత్తయితే ఈ అయిదున్నరకి భోంచెయ్యడం మరో ఎత్తు. ప్రతి వారమూ ఈ పిక్చర్ పెరేడ్ రోజున కఢీ చావల్ తప్ప మెస్‌లో మరోటేదీ వండరు. సినిమా చూడడం ఇష్టం లేకున్నా, ఆకలి వెయ్యకపోయినా అందరితోబాటు తినక తప్పదు. పోనీ పిక్చర్ చూసొచ్చాక తిందామంటే – అది కుదిరే పని కాదు. అప్పటికి మెస్ క్లోజ్ అయిపోతుంది. తినేందుకు మరెక్కడా ఏదీ దొరకదు. అరిచి గీపెట్టినా.

ఏదో మొక్కుబడిగా తిన్నాననిపించి బారక్‌కి వచ్చాను. “ఎన్నడా రావూ, సాపిట్టా?” నవ్వుతూ పలకరించాడు సుబ్రమణి. ఎప్పుడూ నవ్వు మొహమే. తిన్నానని చెప్పేలోపే నా ఎదురుగా ఉన్న తన మంచంలో, దోమతెరలోకి దూరిపోయాడు. వాడి తమిళ ఫ్రెండ్స్ తోనో, నాలాగా ఏ గ్రూపుకీ చెందని ఒకళ్ళిద్దరితోనో తప్ప మిగిలిన వాళ్ళతో పెద్దగా కలవడు. కానీ, వీడుంటే మాత్రం చుట్టూ ఉన్నవాళ్ళంతా నవ్వుతూనే ఉంటారు. ఈ తమిళ కుర్రాళ్ళకి హిందీ సినిమాలు ఎంత అర్థమౌతాయో తెలీదు గాని, అందరితోబాటు వచ్చి థియేటర్లో కూర్చోక తప్పదు కాబట్టీ సినిమా జరుగుతున్నంతసేపూ ఏదో మాట్లాడుకుంటూనే నవ్వుకుంటూనే ఉంటారా బాచ్ మొత్తం.

అయిదు నిముషాల తర్వాత లీడర్ ఉపాధ్యాయ్ వేసిన విజిల్ మోగింది.

చకచకా పీటీ షూస్ తగిలించుకుని బారక్‌లో ఉన్నవాళ్ళందరం బయటికొచ్చాం. “ఫాలిన్ హోజావ్, జల్దీ!” అంటూ కేకపెట్టాడు. నిలబడ్డాం. ఒక్కసారి స్క్వాడ్ ముందుకొచ్చి ఎంతమంది ఉన్నామో లెక్కపెట్టి, “స్క్వాడ్! సావ్-ధాన్” అంటూ కమాండ్ ఇచ్చి, డ్రిల్ చేసుకుంటూ బారక్ కమాండర్ గది ముందుకెళ్ళి నిలబడ్డాడు లీడర్. సరైన సైజు కాని ఖాకీ ఫాంటు, ఫుల్ హాండ్స్ షర్టూ వేసుకుని, బెల్టూ టోపీలాంటివేవీ లేకుండా డ్రిల్లు చేస్తున్నట్లు నడుస్తుంటే నవ్వొస్తోంది. నాకంటే ఎక్కువగా తమిళ కుర్రాళ్ళకి.

“సర్, అఠారా హై,” రిపోర్ట్ ఇచ్చాడు బయటికొచ్చిన బారక్ కమాండర్‌కి. ఎప్పుడు ధుమధుమలాడుతూ ఉండే బారక్ కమాండర్ మొహం ఇవాళ ఎందుకో కొంచెం ప్రసన్నంగా కనిపించింది. బహుశా అతనికి ఇష్టమైన సినిమా ఉందేమో ఇవ్వాళ. “బాకీ?” అన్నాడు దాదాపు నవ్వుతూనే.

లీడర్ జవాబిచ్చాడు. “సర్, పాంచ్ మెస్ వర్కింగ్, దో మోరే సర్ కే ఘర్, తీన్ మర్కరీ హౌస్, చార్ పిక్చర్ వర్కింగ్, ఏక్ బారక్ సంత్రీ.”

“ఠీక్ హై. జావ్ సీధా పిక్చర్ హాల్ మే. బయట ఎవడైనా తిరుగుతూ కనిపించారంటే చూస్కోండి. మై చెక్ కరూంగా.”

సినిమాకి వెళ్ళినవాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఊరికి ఏడెనిమిది మైళ్ళ దూరాన ఉన్న ఈ రెజిమెంట్ నుంచి? వెళ్తారు. సినిమా మొదలైన కాసేపటికే టాయ్‌లెట్ వంకతో లేచి, ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ వెనకే ఉన్న వెట్ క్యాంటీన్‌లో దూరతారు. బారక్ నీడల్లోంచి నక్కుతూ వచ్చి, మంచాల్లో దోమతెరల్లో దూరి నిద్రతీస్తారు మరి కొందరు. చెక్ చెయ్యడానికి ఎవరైనా బారక్‌ లోకి వచ్చినా, దోమతెరలన్నీ దించేసి ఉంటాయి కాబట్టి, ప్రతి మంచంలోకీ తొంగిచూస్తే గానీ తెలీదు అందులో మనిషి ఉన్నదీ లేనిదీ. నిద్ర చాలక, అలా దొంగచాటుగా థియేటర్లోంచి బయటికొచ్చే ధైర్యం చెయ్యగలవాళ్ళ వైనం అది.

“యస్ సర్!” అతని ముందునించి రెండడుగులు వెనక్కి వేసి, అబౌట్ టర్న్ కొట్టి, అక్కణ్నించే “స్క్వాడ్, తేజ్ ఛాల్!” అంటూ కేకేశాడు.

అయిదారు నిమిషాల్లో చేరుకున్నాం ఓపెన్ ఎయిర్ థియేటర్లోకి. డ్రిల్లూ డిసిప్లినూ అంతా దాని గేటు బయటివరకే. లోపలికి వెళ్ళేక స్క్వాడ్‌లన్నీ ఎండునేల మీద కొత్త నీరు పరుచుకున్నట్లు విడిపోతాయి. ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత జాగా చుట్టూ పెద్ద యు-షేప్‌లో కాస్త ఎత్తుగా, వెడల్పుగా మెట్లు. ఎక్కడ కూచున్నా సినిమా స్పష్టంగా కనిపించేంత ఇరవై అడుగుల ఎత్తు గోడ – ఆర్క్‌లా ఒకవైపు, దానికి ముందు రెండు వైపులా పెద్ద పెద్ద స్పీకర్లు. గోడకి ఎదురుగా, అల్లంత దూరంలో ప్రొజెక్టర్ హాలు. దానికి దగ్గరగా మెట్ల మీద కుర్చీలు.

పై వరసలు ఆఫీసర్లూ వాళ్ళ ఫామిలీలూ కూర్చోవడానికి. కింది వరసలు జేసీవోలకి. ఇంకా కింది వరసలు ఎన్‌సీవోలూ వాళ్ళ కుటుంబాలకి. రిక్రూట్లు మెట్లమీదా వాటి మధ్య ఖాళీ జాగాలో ఎక్కడైనా కూర్చోవచ్చు – కుర్చీల్లో తప్ప.

అప్పటికే మెట్లన్నీ కిక్కిరిసి నిండిపోయాయి. ఖాకీ రంగులో. ఇదే థియేటర్లో నెలకోసారి జరిగే ‘సైనిక్ సమ్మేళన్’ రోజున ఈ మెట్లన్నీ ఆలివ్ గ్రీన్ రంగుతో నిండిపోతాయి. ఇవాళ కూడా నేలమీద కూర్చునే చూడాలల్లే ఉంది. కొందరు మెట్లమీదకి వెళ్ళే ప్రయత్నమేదీ చూడకుండా, నేరుగా వెళ్ళి గ్రౌండ్లోనే చతికిలబడ్డారు. సినిమా మొదలైన కాస్సేపటికే కాళ్ళు బార్లా చాపి వెల్లకిలా పడుకుని, ఆ రెండు గంటలూ నిద్రపోవడానికి! నాకు మాస్ తెలుగు సినిమాలే నచ్చేవి కావు. ఇక్కడ వారానికొకటి చొప్పున చూపించే హిందీ మాస్ సినిమాలు సరేసరి. పైగా ఆ సినిమా డైలాగుల్లో దొర్లే ఉర్దూ పదాలు, పాటలూ అర్థమయ్యేటంత హిందీ రాదు.

ఇవాళ వేస్తోంది రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ.

పక్కన కూర్చున్న కుర్రాళ్ళనుంచి బీడీ కంపు, చెమట కంపుతోబాటు దేన్నీ పట్టించుకోకుండా సినిమా తెరకేసి తదేకంగా చూస్తూ లీనమైపోయాడు రెడ్డి. ఎంత అర్థమౌతోందో దేవుడికే తెలియాలి.

సినిమా అయిపోయింది. సినిమా మొదలైనప్పుడు మూసుకున్న గేట్లు ఇప్పుడు వెంటనే తెరుచుకోవు. ముందుగా ఫామిలీలన్నీ బయటికి చేరుకున్న తర్వాతే, థియేటర్‌కి రెండో వైపున ఉన్న ఈ గేట్లు తెరుస్తారు. అంతవరకూ ఆ చీకట్లో నిలబడాల్సిందే.

ఉన్నట్టుండి, బయటకు నడుస్తున్న ఫామిలీల్లోంచి ఒక పిల్ల పెట్టిన కేక వినిపించింది. వెంటనే మగవాళ్ళ కేకలు. “కౌన్ హై? పకడో! పకడో సాలే కో!”

ఆ మసక చీకట్లో, మెట్ల మీదినుంచి ఎవరో రిక్రూట్ పరిగెడుతూ, బయటికి నడుస్తున్న రిక్రూట్ల గుంపుల్లో కలిసిపోయాడు. థియేటర్ చుట్టూ లైట్లు వెలిగాయి. అప్పటికే “సాలే తుమ్ లోగోంకే హర్కతే సుధరేంగే నహీ! చెయ్యి పెడతావురా మాదచ్ఛోద్? ఎంత ధైర్యంరా నీకు? ఏ స్క్వాద్‌రా నీది? చెప్పు?” అంటూ ఒక రిక్రూట్‌ని పట్టుకుని చెంపలు చెళ్ళుమనిపిస్తున్నారు కొందరు సీనియర్లు.

“సార్, నై పతా సార్. మై నై సార్. వో కౌన్ అమ్ కో నై పతా సార్” అంటూ వచ్చీరాని హిందీలో జవాబిస్తూ తన్నులు తింటున్నాడా తమిళ కుర్రాడు.

బారక్ వైపు నడుస్తున్నాం. ఎవరో అడుగుతున్నారు ఎవర్నో.

“అబే క్యా ఫిలం హై యే? నా కోయీ గానా హై, నా డాన్స్ హై! ఓయ్ యాదవ్, యే గాంధీ కోన్ హై బే?!”