ఆగస్ట్ 2022

​సృజన స్వేచ్ఛని కోరుకుంటుంది. ఆలోచనలోనూ, వ్యక్తీకరణలోనూ హద్దురాళ్ళు లేని ప్రపంచాన్ని స్వప్నించే సృజనకారులు ఒక మామూలు ఊహకి తమదైన అస్తిత్వాన్ని అద్ది, దానికి నవ్యతనూ ప్రాణశక్తినీ అందజేస్తారు. తరతరాలుగా సృజన బ్రతుకుతున్నది ఈ స్వేచ్చా ఊహల పునాదుల పైనే. ఆలోచనలో కొత్తదనం మాటెలా ఉన్నా, వ్యక్తీకరణలో కొత్తదనాన్ని చూపించగలిగితే, విషయాన్ని నిమిషాల మీద దేశాలను దాటించి వైరల్ చేసేందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వేదికలు. ఇన్‍స్టంట్ అటెన్షన్, ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా కొందరు సృజనకారుల మీద పని చేస్తున్న తీరు విపరీతంగా అనిపించడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. కొత్తొక వింతలా కొత్త పుంతలు తొక్కుతూ తమ కళలను వేయినొక్క విధాలుగా ప్రదర్శించుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారీ సృజనకారులు. వీళ్ళ సంగతలా ఉంచితే, అన్నిటినీ తమ మనోభావాల మీదుగా వడపోసి చూసుకునే బృందం సమాజంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ మనోభావాలకు ఏ రకమైన సప్రమాణికతా లేదు, ఉండదు. ఇంటర్‍నెట్ అప్పనంగా ఇచ్చిన అనామకత్వం తప్ప మరే అర్హతా లేని వాళ్ళు, ఆత్మన్యూనతతో నిండిన అజ్ఞానం తప్ప మరే ఆస్తీ లేని వాళ్ళు, సమయాన్ని ఏ ఏట్లో కలుపుకోవాలో తెలీక దిక్కు తోచనట్టు తిరిగే వాళ్ళు, ఇట్లాంటి విషయాల్లో అభిప్రాయ ప్రకటనలకు, చర్చలకు సదా సిద్ధమంటూ ముందుకొస్తారు. అవసరమున్నా లేకున్నా అసంబద్ధమైన అభిప్రాయాలను గుప్పించి, తద్వారా ఒకరి భావవ్యక్తీకరణ స్వేచ్ఛని అడ్డుకుని, కొండొకచో గెలిచి, దరిమిలా సమాజాన్ని​ నియంత్రించ​గలమనుకుంటున్న ఈ కురచ మనస్తత్వాలను చూసి జాలిపడాలో అసహ్యపడాలో భయపడాలో తేల్చుకోలేని స్థితికి చేరుకున్నాం. ఈ రకమైన దౌర్జన్యం మతసాంస్కృతిక విషయాలలో మరింతగా ప్రబలివుంది. ఇటీవలి ఇంకొక ఉదాహరణ, శ్రావణభార్గవి అనే గాయకురాలు చేసిన ఒక వీడియోపై చెలరేగిన సోషల్ మీడియా దుమారం. ఆ గాయకురాలి వీడియో మెలోడ్రమటిక్‍గా ఉండటం సత్యదూరం కాదు. సాహిత్యాన్ని అర్థం చేసుకోకుండా సాగిన ఆమె అపరిపక్వ ప్రదర్శన గురించిన విమర్శలూ సహేతుకమే. కాని, దుమారం లేపిన నైతిక కాపలాదారులకు ఆ గాయకురాలి ప్రదర్శన నచ్చకపోవడానికి ఉన్న వేయి కారణాల్లో ఇవి లేవు. విమర్శల పేరిట వాళ్ళన్న మాటలివీ: ఆమె చీర కొంగు చుట్టుకోలేదు, వెనుక భాగం చూపిస్తూ కెమెరా ముందు నిలబడింది-అది అసభ్యం. ఆమె ఆమె కాళ్ళకు పసుపు పూసుకోలేదు, వేళ్ళకు మెట్టెలు లేవు-ఇది హైందవ సాంప్రదాయం కాదు. దేవుళ్ళకు ఆపాదిస్తే చాలు శృంగారం కూడా అతిపవిత్రమూ ఆముష్మికమూ అయిపోయే మనదేశంలోని కొందరు భక్తులకు ఆ పాట అర్థం సందర్భం ఏమీ తెలియకపోయినా, ఆ ‘దేవుళ్ళ’పాటలో అమ్మవారు తప్ప వేరొకరు కానరావడం తట్టుకోలేని కష్టమయింది. ఈ తీరుగా సాగిన వీళ్ళ అభ్యంతరాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మునుపొకపరి చెప్పినట్టు, తెలుగునాట సహేతుకమైన సంగీత సాహిత్య విమర్శలు ఎలాగూ లేవు, కనీసం సంస్కారం కూడా లేదని నిరూపించడం తప్ప​, సోషల్ మీడియా కల్మషాన్ని మరింత ఉత్సాహంగా పదే పదే ప్రసారం చేయడం ద్వారా ఈ పత్రికలు, టి.వి. ఛానెళ్ళు సాధిస్తున్నదేమిటి? ఈ విమర్శలు గుప్పించిన వాళ్ళలో ఎవరైనా, తామెలాంటి నిజాయితీతో, దయతో, ఋజుప్రవర్తనతో బ్రతుకుతున్నామన్న ఆత్మవిమర్శ చేసుకుంటారా? ఇతరుల అభివ్యక్తిని సంస్కృతికి, సంప్రదాయానికి చేటు అని అఘాయిత్యం చేసే వీరు తమ తమ తక్షణ కుటుంబీకులు, సన్నిహితుల దృష్టిలో తామెలాంటివారనిపించుకుంటున్నారో గమనించుకుంటారా? ఇలా వారి వారి నేలబారు బుర్రలకు తోచినట్లుగా ఈ సంస్కృతీసంప్రదాయ పరిరక్షకులు చెప్పే అభ్యంతరాలకు సహేతుకమైన ధార్మిక సాంస్కృతిక ప్రాతిపదికలు ఎన్నడూ లేవు. ఎప్పటికప్పుడు కొత్తగా విషం చిమ్మడానికి కారణాలు వెతుక్కునే వీరిని ఎవరూ సమాధానపరచలేరు. వీరివల్ల సంఘం ఎన్ని రకాలుగా చీలిపోగలదో అన్ని రకాలుగానూ చీలిపోతూనే ఉంది. సమాజంలో నానాటికీ ప్రబలిపోతోన్న ఈ కల్మషం బహురూప శత్రువు. దీనితో యుద్ధం చేయలేం. తెంపిన ప్రతీ తలకూ వెయ్యి కొత్త తలలు వేసే దీనిని అరికట్టలేం. ఇది చేదునిజం. కాని, ఏ లాభమూ లేకున్నా నూరు టంకములు చేసెడి చీరలు కొరికే చిమ్మెటల లాంటి ఈ నైతిక కాపలాదారుల మూర్ఖత్వాన్ని పక్కకు తోసి, కళాకారులు తమ సృజనను కాపాడుకోవడం ఇప్పుడొక సామాజిక అవసరం. కవులు రచయితలు, గాయకులు, నటులు, చిత్రకారులు ఎవరైనా సరే, ధైర్యంగా, ఎవరికీ ఏ సంజాయిషీలు ఇచ్చుకోకుండా, తమ తమ సృజనాప్రపంచాలను ధిలాసాగా ఆవిష్కరించుకోవడం ముఖ్యం.