అర్థం కాని
నీది మౌనమో
నిశ్శబ్దమో
అర్థం కాని సమయంలో
నేను ఎలా ఉంటానో నీకు తెలుసా?
ఆనకట్టల మధ్య ఆగిపోయిన నదిలా.
ఎర్రమందారం
ప్రతి వాక్యం
రచించబడుతూ
నూతనంగా
శిఖరం అంచుపైన వెలిగే ఒక కాంతి
శిలల శకలాలను కరిగించే
నిశ్శబ్దం ఒక శక్తి
వసంతకాలపు వెన్నెట్లో
నదిలా ప్రవహిస్తూ
ఒక పాట
ఎర్రమందారంలా పూసి
ఉషోదయపు వెలుగులా ప్రకాశిస్తుంటే
వెనకడుగు వేసిన మరణం.
చుట్టుముట్టిన వాన
ఎందుకో?
చుట్టుముట్టిన వాన
ఎంతకీ తెరిపివ్వదు
విరిగిన శబ్దాలలో
చీకటి పద్యాలు
నీకైనా బరువెక్కిపోతుంది కదూ
అది అలా ఎందుకో
మరి తెలుసుకున్నావా?
ఆఁ!
మళ్ళీ మొదలవుతుంది నాటకం
అదన్నా తెలిసిందా?
ప్చ్!
ఆగిన పాట
సాగని నడక
మరి, ఇదైనా అర్థమవుతోందా?
అక్కడక్కడే తిరుగుతూ
అలా ఎందుకు చేస్తున్నావో
నీకు తెలుస్తోందా?
పోగొట్టుకున్నదేదో
వెతికి వెతికి అలసి
ఇక అక్కడే నువ్వు
అది అలా ఎన్నోసారో?
మరి, అది నీకు ఎప్పటికీ తెలీదు.