పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా!


దామెర్ల రామారావు – బావిదగ్గిర (1925)

ఆధునిక చిత్రకళ చరిత్రలో ‘కలడు కలండనువాడు’ మూడు ఘోరాలు చేశాడు. తెలుగు చిత్రకారులలో దామెర్ల రామారావుకు మంచి ఆయుర్దాయం ఇవ్వకపోవడం, ఉత్తరాదిన అమ్రిత షెర్‌గిల్‌ని పెందరాళే పట్టుకుపోవడం, బెంగాల్‌లో చిత్తప్రసాద్‌కు తగిన ఆర్థిక, సామాజిక, రాజకీయ భద్రత ఏర్పాటు చేయకపోవడం. అసలు గుబురు మీసాల జర్మన్ తత్వవేత్త భావించినట్టు ‘నా దేవుడు యవ్వనమునే మరణించినట్టున్నాడు’ అనుకోవాలి మరి. లేకుంటే పై మూడు వైఫల్యాలు జరిగేవా?

1900వ సంవత్సరం నుంచి మనదేశంలో ఒక యాభయ్యేళ్ళు తరచిచూస్తే ‘భారతీయ చిత్రకళ’ దశ చిత్రవిచిత్రంగా కనిపిస్తుంది. ఇది దామెర్ల రామారావును స్మరించుకోవడానికి, ఆయన చిత్రకళ ఎటు దారి తీసి వుండేదో ఊహించడానికి అవసరమైన నేపథ్యమే. ఉత్తర భారతావని భుజమ్మీది చిలకలా వున్న టిబెట్‌ లోని సంప్రదాయ చిత్రకళ (బౌద్ధ) శైలి నేటికీ కొనసాగుతున్నా, అది విదేశాల్లో గుస్తాఫ్ క్లిమ్‌ట్ వంటివారిని ఆవహించినా, మన చిత్రకారులకు మాత్రం ఆవేశం ఇచ్చి ఆధునిక శైలికేసి మరలించలేకపోయింది. అలాగే చైనా, జపాన్, కొరియా వంటి దేశాల తాత్త్విక, ధ్యాన సంప్రదాయాల సాహిత్య శైలి కాకపోయినా చిత్రకళా విన్యాసం పూనకంలా పట్టుకోలేకపోయింది… కొద్దిపాటి ‘వాష్‌టెక్నిక్’ సరదా మినహాయిస్తే. అలాగని ఫ్రాన్స్‌లో మొదలయి యూరప్‌ లోకి ఎగబాకిన ఇంప్రెషనిజమ్ (అకాడమీలను పోపొమ్మన్నవి) నుంచి క్యూబిజమ్ వరకు ఎదిగిన సుప్రభావమూ మన ఆనాటి చిత్రకారులను కదిలించలేకపోయింది పాపం! సరేసరి, మన అజంతా, మొఘల్ తదితర మినియేచర్ చిత్రకళాశైలి, దక్షిణాది చోళ, విజయనగర చిత్రకళా విశేషాలు గాని మన చిత్రకారులలో ‘తదనంతరపు ఆధునిక శైలి, దృష్టి’ని ప్రసాదించలేకపోయినవి. మరి పై యాభయ్యేళ్ళు చిత్రకారుల మీద ఏ వెలుగు ప్రసరించినట్టు? పైన చెప్పుకొన్నవన్నీ ఆకళింపు చేసుకుని దేశం అంతా తిరిగి సరికొత్త స్వీయశైలి ఆరంభించబోతుండగానే అమ్రిత స్వర్గం పట్టిపోయింది. నందలాల్ బోస్ కొత్తదారి చూపే దిశలో వెళ్ళిపోయాడు. జామినీ రాయ్ ఆ దారిని జానపదశైలికి అంకితం చేస్తూ నిలిచి, ఆగి వెళ్ళిపోయాడు. చిత్తప్రసాద్ తూర్పు పడమర దేశాల చిత్రకళను చూసి కొత్తదారి చేసుకోబోయి నమ్మినవారి చేతిలో, నమ్ముకున్న పార్టీలో వమ్మయిపోయారు. సరిగ్గా ఇదే దుర్దశలో అన్నీ తెలుసుకుని రంగులు సిద్ధం చేసుకున్న లేత వయసులో దామెర్ల అన్యాయమై పోయారు!

దామెర్ల కనువిప్పినవేళ మన దేశ చిత్రకళ పరిస్థితి ఏమిటి? ‘ప్రి రాఫెలైట్’ల వలె కవిత్వం చిత్రకళ గలిసిన ముచ్చట మాట దేవుడెరుగు… పోయి పోయి కలోనియల్, బ్రిటిష్ వర్ణావస్థలు, డ్రాయింగ్, డ్రాఫ్టింగ్, లిథో క్రాఫ్ట్ సుడిలో పడి చిక్కుకున్నారు మన ఆనాటి చిత్రకారులు. అనంతరం బెంగాల్, బరోడా, బందరు, మదరాసుల్లో కొంత తేడా ఉందనడానికయితే లేకపోలేదు. నాడు ఏ ‘స్కూలు’కీ చెందని భారత చిత్రకారులని, వారి ప్రోత్సాహకులనూ పట్టినదేమిటి? ఒకటే ఒకటి. తమకు భర్జించని ‘ఇటాలియన రినైజాన్స్’ అనే వంటకం. అందులోని పోపు దినుసు బ్రిటిష్ నీటిరంగు చిత్రకళ, ఆయిల్ పెయింటింగ్. ఇది మిశ్రమ గందరగోళ తాళం.

ఇదొచ్చి మనదనే పూర్వ సంప్రదాయ చిత్రకళా పద్ధతుల మీద, శైలి మీద పెద్ద దెబ్బే తీసింది. దీనికి పెద్ద బాధ్యుడు రాజా రవివర్మ. పొర్‌ట్రైట్‌లు పోనీండి, మొత్తం పురాణ, కావ్య గాథలన్నీ ‘కేలండర్ కళ’కి ఖాయం చేసుకునే ‘ఆర్థిక మార్గా’నికి ఆయన శ్రీరామ చుట్టాడు. ఇలాగయితే అబ్బాయ్, మనకీ, నీకూనూ సొంత చిత్రకళా శైలి అంటూ ఏవీ మిగలదని ఆ రోజుల్లో వివేకానంద, అరవిందులు, టాగోర్, మన గురజాడ వరకూ రవివర్మకు చెప్పచూశారు- ఆయన తప్పు గమనించినట్టే ఠళాయించారు. ఇట్లాంటి స్థితిలో భారతీయ ఆంగ్లేయమైన (దక్షిణాదీ కలగలసిన) కాన్‌స్టబుల్, టర్నర్, సర్ జాషువా రెనాల్డ్స్ వంటి తెలుగు – తెలుగేం ఖర్మ, జాతీయ చిత్రకళ, ‘కారులూ’ అనేకులు ఉత్పత్తయి కూచున్నారు. ఈ దుష్ప్రభావం దాదాపు 50 సంవత్సరాలు గడిచేదాకా మొత్తం జాతీయ చిత్రకారులని కుమ్మేసింది. ఈ యావత్తు దామెర్ల వారి చిత్రకళకు, నాటి చిత్రాలకూ నేపథ్య సంగీతం.

కూల్డ్రే దొర కూడా కలోనియల్ బ్రిటిష్ చిత్రకళానైపుణ్యానికి అవతల నిలబడలేదు-ఆయనదీ అదే నేత. కానీ దారితెన్ను, అతీగతీ లేని చిత్రకళాపథంలో నాటికి ఆ ప్రాంతాల్లో ఆయన కాటన్ దొర వంటి పనే చేసేరు – మంచి పంటకు మొలకలెత్తించారు నారు పోసేరు. ఆ సరసన దామెర్ల రామారావు, ఆయన సాటి కళాకారులు, మిత్రులు అతి కొద్దిమంది గొప్ప చిత్రకారులుగా మిగిలారు-ఇక్కడ.

భారతీయత సరే, అసలు తెలుగు చిత్రకళ అంటే దేనినుంచి ప్రభావితమై ఏ దారి పట్టిందో చెప్పడానికి తిప్పలు పడక తప్పదు- నాటి చిత్రకారుల పేర్లు, వారి సాధన ఇక్కడ ఇప్పుడు అప్రస్తుతం. ఐతే కూల్డ్రే కృషివల్ల, దామెర్ల పనితనం వల్ల అప్పటికి ఆంధ్ర ప్రాంతంలో రవివర్మ జ్వరం పూర్తిగా సోకలేదు. అనగా అరగని ‘రినైజాన్స్’.

నిజానికి ఆ సమయంలో కొంచం ముందుగా రవివర్మ రాజమండ్రి, విజయవాడ, నూజివీడు, విశాఖపట్నం వచ్చి కొద్ది రోజులుండి మరీ వెళ్ళారు. అదే సమయంలో బొంబాయిలో రవివర్మను గురజాడ, విజయనగరం రాజుగారు, ‘ఆంధ్రభీష్మ’గారూ కలిసి మాట్లాడేరు. కాకినాడకు ఆయన బొమ్మలు తరలివచ్చాయట. ఐనా అనంతరం దామెర్ల మీద ఆ ప్రభావం పడలేదు. అజంతా ప్రభావం, పౌరాణిక గాథల దృశ్యప్రభావం మాత్రం సానుకూలంగా పడింది. వాటిని నిదానంగా సమీక్షించి, తెలుగు కట్టుబొట్టు చుట్టబెట్టి, కట్టబెట్టి అంచక్కని చిత్రరచనకు ఉద్యమించారు ఆయన. ఏదీ? తీరా శ్రీకారంతో మొదలయి అఖండకావ్యం పూర్తవటానికి మధ్యలోనే ఆయన మరి లేకుండా వెళ్ళిపోయారు. నిజానికి శిఖరాగ్రం చేరడానికి సకలం సిద్ధమై, సన్నాహాలు కుదిరి ముందుకే కదిలారాయన. అక్కడితో ఆయన కథ ముగిసింది.

అద్భుతంగా బొమ్మలు వేయడం వేరు, సొంత చూపుతో (He has an eye, but what an eye!) స్వీయ స్వేచ్ఛాగానం చేయడం వేరు. నిజదృష్టితో సృజనాత్మకమైన ఓ దృశ్యాన్ని కాన్వాస్‌పై నిలపడం కదా ముఖ్యం- ఆ దశలోనే దక్షిణాదికి ప్రయాణించి తిరుగుబాటలో దెష్ట రోగం దామెర్లవారిని మాయం చేసేసింది. ఆయన గీసిన గీతలు గమనించారా? యూరప్ మహనీయ కళాకారులకు తీసిపోని రేఖలవి. అలా ఆత్మకథ వంటి, స్వీయగానం వంటి సొంతశైలి ప్రభవించే దశలో తమ వెలుగు విస్తరించేలోగా ఆయనే అస్తమించేసేరు. దేశ విదేశీ పెయింటింగ్‌లకు తగిన, మంచి రంగుల ముద్రణ లేకపోవడం, వివిధ ప్రాంతాల్లో దామెర్ల చిత్రప్రదర్శనలు విరివిగా జరగక పోవడం, దామెర్ల మిత్రులుగాక ఆనాటి నూతన కవిపండిత ప్రముఖులు ఎవరూ పట్టించుకుని ప్రచారం చేయకపోవడం వంటి కారణకారణాంతరాలు ఆయన్ను ముందుకి తెచ్చింది లేదు. ఆయన పై రాసింది, ఇంటర్‌వ్యూలు చేసిందీ, అనంతరకాలం డాక్యుమెంటరీలు చేసింది ఎన్ని? ఎక్కడ, ఏపాటివి? నాటికి నూతన కవులకు, రామరాజు, చంద్రయ్య దొర వంటి విప్లవ ఉద్యమకారులకూ ప్రచారం ఏముంది గనుక? సాహిత్యం వైపు పనిగట్టుకుని మహనీయులు చేసిన ప్రచారం, అచ్చుతో విస్తరణతోనూ పోలిస్తే దామెర్ల చిత్రకళ బయటకు పొక్కిందెంత? ఆలస్యంగా ‘శిల్పి’, ఇతర ‘వజ్రోత్సవ ప్రత్యేక సంచికలు’ తప్ప రంగుల బొమ్మల అచ్చువేసే సాహిత్య పత్రికలు, వాటి ఆర్థిక స్థితి ఎంత గనుక!

అయిందేదో అయింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓపిక చేసుకుని దామెర్లవారి చిత్రాలు అతి భారీ సైజులో పుస్తకాలుగా ముద్రించడం, పెద్ద పెద్ద సైజు కేలండర్‌లుగా ప్రచురించడం, అత్యాధునిక సాంకేతిక ప్రగతిని ఈ మేరకు సద్వినియోగం చేసుకోవడం అసాధ్యం కానేకాదు. చొక్కా, టీషర్టు, చీరల వరకు దామెర్ల చిత్రాలు అచ్చుపోయవచ్చు ఈనాడు. తెలుగు సాహిత్య, సాంస్కృతిక కళాకేంద్రాలన్నిటా దామెర్లవారి చిత్రాలు గట్టి ఫ్రేములు చేయించి పెట్టవచ్చు. అసలు రాజమండ్రిలోని ఆయన చిత్రాలున్న భవనాన్ని, కళాఖండాలనూ పదిలం చేయవచ్చు… నావంటి వేలాది ప్రేక్షక, వీక్షకులకు ఆనందం కలిగించనూవచ్చు.

దామెర్లవారి గురించి కృషిచేసే మిత్రులందరికీ నమస్కారాలు.

తల్లావజ్ఝుల శివాజీ

రచయిత తల్లావజ్ఝుల శివాజీ గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు. ...