కాలం గడుస్తూ నేను మిడిల్ స్కూల్ మొదటి సంవత్సరం చదువు లోకి వచ్చేశాను. ఇంతకాలం మేము నేర్చుకున్న ఆంగ్లం అంతా ప్రాథమిక స్థాయిలోది. తరగతి మారడంతోటే మా ఇంగ్లీషు పాఠాలు ‘బి’ నుండి బంతి- ‘సి’ నుండి పిల్లి చదువు లోనుంచి ఒక్కసారిగా ఆధునిక ఆంగ్ల గద్య కారకులయిన రౌత్ జోసెఫ్ అడిసన్ మరియు రిచర్డ్ స్టీల్‌ల వ్యాసాల రాచబాటలోకి మళ్ళింది. ఇంగ్లీషు సంగతి సరే సరి. ఇక్కడ మిగతా సబ్జెక్ట్‌లు కూడా ఇంగ్లీషు లోనే బోధించడం మొదలుపెట్టారు. ఎందుకనో కన్నడాన్ని మాత్రం ఇంగ్లీషు లోకి మార్చలేదు. ఆ విధంగా అంతవరకు అన్నిటా ఉన్న కన్నడం ఇప్పుడు రెండవ భాష హోదాకు దిగింది.
కాసింత మంచి చదువు, భాష, సాహిత్య వాతావరణం ఉన్న ఇంటి నుండి వచ్చిన కారణంగా ఈ కొత్త ఆంగ్ల పాఠాల మధ్య కూడా నా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండింది. ఇంట్లో మా అన్నలు జరుపుకునే సంభాషణ అంతా తమిళం, ఇంగ్లీషు, కన్నడల మిశ్రమంగా ఉండేది. ఆయా సందర్భాలలో కోపతాపాలు, గిల్లి కజ్జాలు, వేళాకోళపు నవ్వు మాటలు అన్నిటి మధ్య ఈ భాషలు చాలా ప్రామాణికతతో పలకబడేవి. వాక్యపు వాచ్యం ఎలా పలకాలో, పదాలను ఎక్కడ నొక్కాలో, ఎక్కడ విరవాలో అనే జ్ఞానం నాకు నిత్య శ్రుతంగా దొరికేది. కాలేజి గాలి కబుర్ల దగ్గర నుండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేకానేక రాజకీయ, సామాజిక పరిణామాల వరకు వారి చర్చలు ఆంగ్లంలో నడుస్తూ ఉండేవి. చర్చ తాలూకు తీవ్ర వాగ్వివాదాల వేడి మధ్య కూడా, తాము జరిపే ఆంగ్ల సంభాషణలో వ్యాకరణం ఎక్కడయినా తప్పిందా వెంటనే ఎవరో ఒకరు దానిని సరి దిద్దేవారు. నా వరకు చదువుతున్న చదువులోని చరిత్ర, భౌగోళికం తదితర అంశాలలో మార్కులు తక్కువ వచ్చినా మా అన్నగార్లు క్షమించేవారు కానీ ఎప్పుడయినా ఆంగ్లంలో పేలవమైన మార్కులు వచ్చాయా! అవి నా సామర్థ్యపు తక్కువ స్థాయికి సూచికగా భావించేవారు. ‘ఏమిరా లక్ష్మణా? ఇలా అయితే పెరిగి పెద్దయి నీవేమవుతావురా?’ అన్నంత ప్రశ్న వారి మొహల్లో కనపడేది.
ఇక్కడ ఇంట్లో నా వ్యవహారం ఇలా ఉంటే అక్కడ బడిలో నా సహ విద్యార్థులు చాలా మంది అప్పుడప్పుడే చదువు ప్రారంభించినవారు. వారికి ఈ ఇంగ్లీష్ చదువు నేర్చుకోవడం చాలా కష్టంగా అవుతూ ఉన్నది. వారిలో ఎక్కువ మంది కాస్త ఎక్కువ కన్నడ భాష చాలా తక్కువ ఇంగ్లీషు చదువు తెలిసినవారు. ఇటువంటి పిల్లల ప్రాణాలకు క్రితపు శతాబ్దాల ఘనత వహించిన సర్ రోజర్ కవర్లీగారిపై సర్ అడిసన్ వ్రాసిన వ్యాసాలను చదవడం, చదివిన దానిని అర్థం చేసుకోవడం, ఆ పై దానిని తమ సొంత మాటలతో ఒక వ్యాసంగా రాయడం వంటి అసాధ్యపు పనులు చేయడం సాధ్యం అయ్యేది కాదు. ఈ వ్యాసాలలో వాడబడినవి అత్యంత క్లిష్టమైన వాక్యాలు, మా స్వల్ప ప్రాథమిక జ్ఞానానికి అందని ఉచ్చారణ. ఇంకా మనకు అలవాటు లేని, బుర్రకు బోధపడని బ్రిటిష్ హాస్యం ఉన్నాయి. అంతే కాదు, మా పాఠ్యపుస్తకంలో స్టీపుల్‌చేజ్ అనే మరో వ్యాసం ఉంది. ఈ వ్యాస రచయిత ఒక చాలా ప్రముఖ రచయిత కూడాను.
సరే! మాకు పాఠాలు అర్థం కాకపోవడానికి ఒక అర్థం ఉంది. మా తరగతి ఉపాధ్యాయుడికి కూడా ఆ స్టీపుల్‌చేజ్ పాఠం చాలామటుకు అర్థం కాలేదు, అందుకని అతను దానిని మాకు బోధించే సాహసం చేయలేదు. ఇదేమంత ముఖ్యమైన పాఠం కాదంటూ మాకు దాన్ని బోధించకుండానే నిశబ్దంగా దాటేశాడు. ఒకసారి అనువాద తరగతిలో ఏం జరిగిందంటే, మేము ఒక ఇంగ్లీషు పాఠాన్ని కన్నడలోకి అనువదించవలసి వచ్చినప్పుడు పుస్తకంలో ప్రశ్నలోని వాక్యం ఇలా ఉంది: We had a picnic under a tree in the park. మాలో ఒకడు మా ఇంగ్లీషు ఉపాధ్యాయులవారిని అడిగాడు కదా “సార్! సార్! పిక్కునిక్కు అంటే ఏమిటి సార్?” అని. మా పంతులుగారు తల పైకెత్తి అనంతంగా తరగతి పైకప్పు చిల్లు పడేంత తీక్షణంగా చూస్తూ ఆలోచించి, “పిక్కునిక్కు అంటే మరేం కాదు, అది ఒక రకం పండురా అబ్బాయిలు! మేము, చెట్టు కింద కూచుని పిక్కునిక్కుని పీక్కుని తిన్నాము అన్న మాటన్నమాట దాని అర్థం.” ఇలా ఉండేది అన్నమాట సగం సగం తెలిసిన మా ఉపాధ్యాయుల పాండిత్యం. రోజూ తరగతి గదిలో కూచుని ఈ ఇంగ్లీష్ భాష చేసే దాడి, దాని వ్యాకరణపు పిడికిలి పోట్లు తట్టుకోలేని చాలామంది విద్యార్థులు చదువుకొక నమస్కారం పెట్టి తాము సైతం అంటూ నిరక్షరాస్య జనాభా సంఖ్య పెంచడానికి చదువు మానేసి వెళ్ళిపోయారు.
ఈ మాదిరి మిక్కిలి సాధ్యదూరమైన ఆంగ్ల వ్యాసాలు, కవితా ఖండికలు చదవడం, అర్థం చేసుకోవడం, దానిని తిరిగి వ్రాయడమనే పనిలో తరగతిలో ఉండే మిగతా పిల్లలకంటే నాకు మాత్రమే ఉన్న గొప్ప సౌలభ్యం మా అన్నలు. ’అన్నా’ అని వారి దిక్కు ఒక చూపు, నా ఇంగ్లీషు పాఠం వంక మరో చూపు- అటూ ఇటూ చూస్తే చాలు, వారు నాకు సహాయం చేయగలిగేవారే! కానీ ఇటువంటి సహాయాల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా సంభవిస్తాయి. తరగతి గదిలో మన చదువు ఎంతమాత్రమో అందరికీ తెలుసు కదా. ఇపుడు ఇలాంటి పనులు చేసి సంపాదించుకోగలిగేది గొప్ప ఏ మాత్రమూ కాదు, కాకపోగా మిగిలేవి కన్నీళ్ళు అవమానాలు మాత్రమే.
నా సోదరుల ఆంగ్ల భాషాప్రావీణ్యం గురించి నాకు ఓ మాదిరి మంచి అవగాహనే ఉన్నది కానీ సమకాలీన భారతీయరచనలు చేసే గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకరు మా అన్న ఆర్.కె. నారాయణ్ అనే విషయం అప్పుడు నాకు తెలీదు. అంతోటి గొప్ప ఆంగ్ల రచనలు చేసే నారాయణ్ నా ఇంగ్లీష్ చదువు గురించి కూడా కాస్త శ్రద్ద చూపించి ఉంటే అప్పట్లో నాకు గొప్ప లాభం అయి ఉండేది. కానీ నారాయణ్ దృష్టి అంతా నా చదువు మీద కన్నా పొడువుగా పెరిగిన నా జుత్తు మీద, జుత్తుకు అంటుకోవలసిన నూనె మీద, జుత్తుకు నూనె అంటించిన అనంతరం సాపుగా తీయవలసిన క్రాపు మీదే ఉండేది. మరి పైగా నిత్యకృత్యమైన నా గోళ్ళు కొరుక్కునే అలవాటును మాన్పించడం ఎలా? ఇంకా, వంటికి చొక్కా ధరించడమనేది భోజనానంతరం చేతులు తుడుచుకోవడం కొరకు కాదని, ఆ చొక్కాకు కాలర్ ఉన్నది ముక్కు సాపు చేసుకోడానికి కాదని, చొక్కా చివర్లు పైకెత్తి మొహం తుడుచుకోకూడదని, వాటన్నిటికి పనికివచ్చే వస్త్రం ఒకటి వేరని దానిని తుండుగుడ్డ అంటారనే విషయాలను నాకు తెలియజెప్పడానికే ఆయనకు సరిపోయేది. నా తతిమ్మా సోదరులు ఎవరూ వహించని, అంత ఆసక్తి లేని గురుతర బాధ్యత ఒకటి తనకై తానే పుచ్చుకుని నారాయణ్ నాపై అస్తమానం ఒక చూపు నిలిపేవాడు. నేను చెట్లు ఎక్కుడం, సైకిల్ తొక్కడం మరియు మా కాంపౌండ్‌లో క్రికెట్ ఆడటం వంటి ఈ కార్యకలాపాలన్నిటినీ నిరసించేవాడు.
ఆ రోజుల్లో మేమంతా స్నేహితులం కలిసి ఒక క్రికెట్ టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాము. దానికి నేను ’రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ టీమ్’ అని పేరు పెట్టాను. ఆడటానికి పదకొండు మంది ఆటగాళ్ళు, ఒక బంతి, రెండు బ్యాట్లు, మూడు వికెట్లు ఉన్నంత మాత్రాన సరిపోదుగా. ఆడుకోడానికి ఒక ఆట స్థలం కూడా కావాలి, వీలు కుదిరినపుడల్లా మేము సైకిళ్ళు ఎక్కి చుట్టుపక్కల అటూ ఇటూ తిరుగుతూ, ఆడుకోవడానికి సరయిన ఒక మైదానం కోసం వెదికేవాళ్ళం. ఈ వెదుకులాటలో నేను ఒక చిన్న మైదానాన్ని కనుగొన్నాను, ఒక మంచి రోజు చూసుకుని నేనా నడి గ్రౌండ్ మధ్య వికెట్లు పాతి నా క్రికెట్ క్లబ్‌ను స్థాపించాను. అప్పటి నుండి మెల్లమెల్లగా మా క్రికెట్ జట్టు స్థానిక ప్రాంతంలో అత్యంత బలమైన జట్టుల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
ఒకరోజు మా ప్రత్యర్థి జట్టుతో మా మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నప్పుడు, ఒక ముసలావిడ భయమూ బిత్తరా మర్యాదా లేకుండా నేరుగా పిచ్ మధ్యలోకి వచ్చి మేము ఆడుతున్న ఆటను ఆపేయమని అరిచింది. మేమాశ్చర్యపోయాం. రఫ్ అండ్ టఫ్ అండ్ జాలీ జట్టుకు కెప్టెన్ బాధ్యత వహించిన నేను ఆ ముసలావిడ ముందు నిలబడి “అవ్వా, ఏమిటి నీ దబాయింపు ఎందుకని మేం ఆట ఆపాలి?” అని ఎదురు ప్రశ్నించాను. “ఎందుకంటే ఈ స్థలం నాది, నేను దీనిపై ప్రభుత్వానికి పన్ను కడుతున్నాను, నా ఈ స్థలంలో ఆడుకునే హక్కు మీకు లేదు. అందుకని మీరంతా బయటికి వెళ్ళండి” అన్నది. నేను మళ్ళీ ఎదురు మాట్లాడాను. “చెప్పింది చాలు చాలు లేవమ్మా. ఈ భూమి నీది కాదు, మా మామయ్యది” అని ఎదురు పలికాను. నిజానికి నా మాటలకు ప్రామాణికమైన ఆధారమేమీ లేదు. చూచాయగా ఎవరో మా దూరపు బంధువుది ఈ స్థలం అని ఎవరో చెప్పుకుంటుండగా విన్నాను. భూమి ఎవరిది అనే దానిపై ముసలావిడతో కాసేపు వాదనలు నడిచాయి. “ఒరేయ్ గన్నాయిలు! మీరు ఇలాగే మొండి వేషాలు వేశారంటే నేను పోలీసులను పిలుస్తా ఏమనుకున్నారో!” అని గట్టిగా కేకలు పెట్టి, అక్కడ పాతి ఉన్న స్టంప్‌లను తీసి దూరంగా విసిరివేసింది. ఆ భూమిపై మా హక్కును నిరూపించడానికి తగిన గట్టి ఆధారము, మాట బలమూ మాకు లేదు. ‘ఈసారికి పోనీలే పాపమని వెళుతున్నామని, తొందరలోనే మేము తిరిగి వస్తామ’ని చేతకాని అరుపులు అరుస్తూ మేమంతా అక్కడినుండి బయలుదేరాము. మా ఈ ఆట మధ్యలో భూవివాదం అనే సంఘటనను ఆధారం చేసుకుని నారాయణ్ ‘ది రేగా క్రికెట్ క్లబ్’ అనే కథ రాశాడు. ఇదే కాదు, ఇంతకు మునుపు నాకు సంభవించిన మరో సంఘటనను దృష్టిలో ఉంచుకుని నారాయణ్ ‘డోడూ ది మనీ మేకర్’ అనే కథ కూడా రాసి ఉన్నాడు. వేరుశెనగకాయలు కొనడానికి ఒక కుర్రవాడికి కావలసిన డబ్బుల కోసం పడ్డ పాట్లు దీని కథాంశం. ఈ కథ మద్రాసులో ఒక పత్రికవారి సాహిత్య పోటీలో అతనికి అవార్డును తెచ్చిపెట్టింది.
సరే! ఆ ఆటలు, చదవాల్సిన పాఠాలు సరే సరి. మరి నా బొమ్మల కథ ఏమిటి? ప్రతి రోజూ గంటల తరబడి క్లాస్‌రూమ్‌లో కూర్చోవడం, చదువుకోవడం, నేర్చుకోవడం, పరీక్షలను ఎదుర్కోవడం అనే ఈ విద్యార్థి రోజుల విషయాలను నా వరకు నేను, అవి నాకు నా కుటుంబం మరియు సమాజం విధించిన అనివార్య బాధ్యతగా మాత్రమే భావించాను. అలాగే శిరసావహించాను కూడా. కానీ బొమ్మలు వేయడం అనేది ఒకటి నా జీవితంతో ముడిపడి ఉందే! ఆ డ్రాయింగ్ మరియు స్కెచింగ్ రాబోయే నా భవిష్యత్తు జీవితానికి కీలకమైన కట్టుబాటు అని నేను తెలిసీ తెలీని వయసులో నాతో నేను వాగ్దానం చేసుకున్నాను. తెలీని భవిష్యత్‌గా దానిని గుడ్డిగా అనుసరించాను. ప్రేమించాను, ఆరాధించాను. అశోకుడి కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం ఏమిటి? మనం ఉన్న భూగోళాన్ని ఎన్ని మండలాలుగా విభజించారు. దాని అక్షాంశాలు, రేఖాంశాలు ఏమిటి వంటి పాఠాలప్పుడు, భాషాశాస్త్రాల్లో నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, విభక్తి ప్రత్యయాల యొక్క జంతర్ మంతర్ స్వభావాలని పునశ్చరణ చేసుకునేటప్పుడు ఆ చదువు అనే ఒత్తిడి నుండి పక్కకు తప్పుకోడానికని నేను నా ముందు తెరిచి ఉన్న నా పాఠ్య పుస్తకాల మూలమూలలా మిగిలి ఉన్న ఖాళీ స్థలాలను స్కెచ్‌లతో విపరీతంగా నింపేవాడిని. నేను కూచున్న తరగతి బల్లకు ఆనుకుని ఉన్న కిటికీ నుండి బయటికి చూస్తే కనపడే ఎండిన కొమ్మలు, ఆ కొమ్మల పైన పాకుతున్న తొండబీకి, ఆ ఎండు కొమ్మలను కట్టెలుగా కొట్టే గొడ్డలి మనిషి, ఆ చెట్టు వెనుక కనపడుతున్న భవనం పైకప్పులపై వివిధ భంగిమల్లో వాలుతూ, ఎగురుతూ, నానా గోల చేసే కావ్ కావ్ కాకులను లెక్కలేనంతగా గీసేవాడిని. అలా బొమ్మల్లో కాస్త సేదతీరిన నేను తాజాగా మారి నా పాఠ్యపుస్తకాల చదువులోకి తిరిగి వచ్చేవాడిని. మీరు అప్పటి నా పాఠ్యపుస్తకాలలోకి ఒక్కసారి తొంగి చూడాల్సింది. ఆ పుస్తకాల మూలమూలల ఏ ఒక్క చదరపు అంగుళం స్థలం కూడా నా పెన్సిలు ముక్క పెట్టిన బొమ్మలతో స్పర్శ జ్ఞానం పొందక ఉన్నది లేదు.
అక్షరాస్యత కలిగిన కుటుంబం కాబట్టి మా ఇంటికి ప్రతి దినమూ వార్తాపత్రిక వచ్చేది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకరి తరువాత ఒకరుగా చాలా ఏకాగ్రతతో, నిశితంగా వార్తాపత్రికలను చదివేవారు. ఆ పత్రిక నిరంతరమూ అలా చేతులు మారుతూనే ఉండేది. అప్పటికి నాకు రోజువారి దినపత్రికను చదివేంత ఆసక్తి అవసరమూ వచ్చిన వయసు, దశ కాదు కానీ అనుకోకుండా నేను ఒక రోజు హిందూ ఎడిటోరియల్ పేజీకి ఎదురుగా ఉన్న ఒక కార్టూన్‌ని గమనించాను, చాలా ఆసక్తిగా దానిని అధ్యయనం చేశాను. పర్వతాలవలె ఎగసిపడుతున్న గొప్ప అలలతో కూడిన సముద్రంలో ఒక పడవ, అందులో ఉన్న మనుషుల బొమ్మ అది. అలల సముద్రము, పడవ, మనుష్యులు. మూడిటికి మూడు విభిన్నమయిన గుణం కలిగిన అంశాలు. కానీ చిత్రకారుడు ఆ మూడు విషయాల మేళవింపుని గొప్ప సమన్వయంతో కూడిన గీతల్లో కూర్చి చిత్రించిన బొమ్మ అది. బొమ్మ కింద ఆ చిత్రకారుడి సంతకం ఉంది. సి ఓ డబ్ల్యూ (COW). మూడూ కలిస్తే ’కౌ’ అంటే ఆవుగారు.
ఆ రోజు నుండి నేను హిందూ పత్రికలో అప్పుడప్పుడు కనిపించే ఆవుగారి కార్టూన్ కోసం వెతికేవాడిని. ప్రచురితమైన ఆయన ప్రతీ బొమ్మని గంటల తరబడి నేను చాలా శ్రద్దతో అధ్యయన పూర్వకంగా పరిశీలించేవాడిని. ఆయన కార్టూన్లలోని రాజకీయ వ్యాఖ్యానాలలోని చురుకు, వెటకారం నాకు అర్థం అయ్యేంత వయసు కాదు కానీ ఆవుగారు చిత్రించే బొమ్మలోని వ్యక్తుల ముఖకవళికలను వ్యంగం చేస్తూ సున్నితంగా వేసే కారికేచర్ అలవోకయైన రేఖ, బొమ్మలో పెర్స్‌పెక్టివ్, డ్రాయింగ్ మీద గొప్ప పట్టు, అన్నిటిని గొప్పగా సమన్వయం చేయడంపై ఆవుగారికి ఉన్న నియంత్రణ నన్ను ముగ్ధుణ్ణి చేసేవి. చూస్తున్న కొద్దీ ఆయన బొమ్మలు నాకు వ్యసనమైపోయాయి.
కాలక్రమేణా నేను తెలుసుకున్న ఇంకో కొత్త విషయం ఏమిటంటే ఆవుగారి పేరు ‘సి ఓ డబ్ల్యు’ కాదని, ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యంగచిత్రకారులని ఆయన సంతకపు పేరు ఎల్ ఓ డబ్ల్యూ (LOW) అని, పూర్తి పేరు సర్ డేవిడ్ లో అని తెలుసుకున్నాను. ఈయన న్యూజిలాండ్ నుండి వలస వచ్చి లండన్‌లో నివాసం ఉంటున్నారని, అక్కడ లండన్ లోనే ఈవినింగ్ స్టాండర్డ్ పత్రికలో పనిచేస్తున్నాడని తెలుసుకున్నాను. నేను డేవిడ్ లోగారికి ఎంత పెద్ద అభిమానినంటే ఆయన బొమ్మలే కాదు వీలయినంతగా ఆయన జీవితపు విశేషాలన్నిటిని తెలుసుకున్నాను. ఆయనకి స్పోర్టీ అనే కుక్క ఉందని, లో దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఆయన ప్రతిరోజూ ఒక సినిమాకి వెడతాడని, కానీ ఏ రోజూ సినిమా సాంతం చూడడని, సినిమా ముగిసేలోగానే బయటికి వచ్చేస్తాడని గట్రా, గట్రాలు బోలెడు సేకరించా. అంతే కాదు, నాకు వీలయినంతగా ఆయన రాజకీయ కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలను ఉన్న చాలా కొన్ని పుస్తకాలను కూడా సేకరించాను.
ఒకసారి నా జీవితంలో అత్యంత విచిత్రమైన సంఘటన 1952వ సంవత్సరం ఉదయాన జరిగింది. అప్పటికి నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఐదేళ్ళుగా రాజకీయ కార్టూనులు వేస్తూ వస్తున్నాను. నేను ప్రతిరోజూ చాలా ఉదయం, 8:30 గంటలకే, మిగతా పత్రికా సిబ్బంది ఎవరూ రాకమునుపే ఆఫీస్ చేరుకుంటాను. ఆ రోజు కార్యాలయం చేరి నేను నా గదిలోకి ప్రవేశించగానే నా డెస్క్‌కి ఎదురుగా ఉన్న కుర్చీలో ఒక జంట కూర్చోని ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఎవరబ్బా వీరు? ఇంత ఉదయానే నా గదిలో! కాదు కాదు! ఉండండి. నాకు తెలుసు ఈ వ్యక్తి ఎవరో! బాగా తెలుసు. ఎప్పటికీ మరిచిపోలేనంత బాగా తెలుసు. అక్కడ కూచుని ఉన్నది మరెవరో కాదు. నా ఆరాధ్య చిత్రకారుడు సర్ డేవిడ్ లో మరియూ వారి శ్రీమతీనూ! కలయా? నిజమా? ది గ్రేట్ కార్టూనిస్ట్ లో! నా చిన్నప్పటి నుండి నా కలలతో పాటు, నా బొమ్మలతో పాటు ఆరాధించిన వ్యక్తి. జీవితంలో ఏదో ఒకరోజు కలవాలి, కలవకపోతానా అని వేయి ఊహలు చేసిన వ్యక్తి ఇంత అనూహ్యంగా నా ఎదురుగా నా గదిలో! నాకు నోట మాట లేదు. కంటి ముందు నక్షత్రాలు మెరిసినట్లు సంభ్రమాశ్చర్యాలు. ‘వారి దేవుడా’ లో!
(సశేషం)