శ్రీపాద వారి నవలలు

ఇవ్వేళ ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీషు భాషలో మాట్లాడలేకపోతే శ్వాసక్రియ ఆగిపోతుంది సుమా! అని ఉధృతంగా కంగారుపెడుతున్న వ్యాపార విద్యాప్రణాళికల మధ్య ఉన్న మనం ఈ సందర్భంలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారిని తలుచుకోవడం ఎంతయినా అవసరం. అంతరించిపోతున్న తెలుగు భాషని, తెలుగు సంస్కృతినీ కాపాడుకోవాలనుకోవడంలో ప్రధాన భాగంగా తిరిగి ఆయన జీవితాన్ని, రచనలనూ స్మరించుకోవడం అత్యంత ఆవశ్యకం.

అందులోని భాగమే సుబ్రహ్మణ్య శాస్త్రిగారి నవలల పరిచయం.

శాస్త్రిగారు సాహిత్య ప్రక్రియలు వేటినీ వదిలిపెట్టలేదు. మొదట పద్యం, చిన్న కథ, నాటకం, చారిత్రక నవల, సాంఘిక నవల, జీవిత కథలు, అనువాదాలూ ఇంకా ఇంకా మరెన్నో రూపాలలో తమ ప్రతిభను వ్యక్తపరిచారు. వీటిలో భాగంగా 1914-1961 మధ్యకాలంలో 7 నవలలు రాశారు. అవి: 1. మిథునానురాగం (1914) 2. శ్మశానవాటిక (విష భుజంగము) (1917) 3. అనాథ బాలిక (1924) 4. రక్షాబంధనము (1925) 5. ఆత్మబలి (1951) 6. నీలాసుందరి (1959) 7. క్షీరసాగర మథనం (1961).

సుమారు 47 సంవత్సరాల మధ్యకాలంలో రాసిన నవలలు ఇవి. మొదటి నాలుగు నవలలకీ తర్వాతి మూడు నవలలకీ మధ్య దాదాపు 25 సంవత్సరాల వ్యవధానం ఉంది. అయితే ఈ కాల వ్యవధానం తాలూకు ప్రభావం నవలల మీద స్వల్పంగా మాత్రమే కనిపిస్తుంది. నవలల ఇతివృత్తాలు వేటికవే భిన్నమయినవి, ప్రత్యేకమయినవి కూడా.

ఇందులో మిథునానురాగము అన్న నవల వీరి మొదటి నవల. ఈ నవలా రచన వెనక ఉన్న ఒక విషయం గురించి శాస్త్రిగారే ఆ నవల తాలూకు ముందుమాటలో రాసుకున్నారు. 1910లో కాకినాడ నుంచి వచ్చే సావిత్రి అనే పత్రికలో కొమఱ్ఱాజు లక్ష్మణరావు రాసిన ‘ఫుల్ జానీ బేగం’ అనే ఒక మహారాష్ట్ర ప్రాంత కథ దీనికి మూలం. తెలుగు జాతీయతనిచ్చి నవలగా రాసుకున్నారట. ఇరువురమొక్కమాటే పోవుదము అని అదే కథను మళ్ళీ చిన్న కథగా కూడా రాశారు. అదే ఆయన మొదటి కథ కూడా.

భారతీయ దాంపత్య జీవనంలోని అన్యోన్యతను తెలిపే కథ ఇందులోని ఇతివృత్తం. ఎన్ని జాతులు ఎన్ని విధాల దండయాత్రలు చేసి ఈ సంస్కృతిని నశింపచెయ్యాలని చూసినా, ఇక్కడి మమతానురాగాలు ఆ సంస్కృతిని కాపాడుకుంటూనే ఉంటాయని, దాని కోసం ప్రాణాలనేనా వదులుకుంటాయని, ఇక్కడి దాంపత్య ధర్మం అంత గొప్పదని చెప్పడం కోసమే ఈ నవల రాసినట్టు అనిపిస్తుంది.

రెండవ నవల శ్మశానవాటిక. ఈ పేరు పెట్టడం వల్ల ఆయన కొందరు పెద్దలతో పడిన ఇబ్బందులన్నీ తన అనుభవాలూ జ్ఞాపకాలూలో రాస్తారు. మీ శ్మశానవాటిక చూశామండీ అని ఎవరైనా చెప్తే అది మనందరిదీనూ అని ఆయన చమత్కరించడం లాంటి విశేషాలు అవి. తర్వాత చాలా ఏళ్ళకి ఆ నవలను బి.ఎ. విద్యార్థులకు ఉపవాచకంగా పెట్టడంతో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి సూచన మేరకు దానికి విషభుజంగం అని పేరు మార్చడమైంది. ఈ రెండు నవలలూ గ్రాంథిక భాషలో రాసినవే.

శాస్త్రిగారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సమీపంలో ఉన్న పొలమూరు వాస్తవ్యులు. విష్ణుకుండిన వంశజుడయిన మాధవవర్మ కాలంలో రాసిన తామ్రశాసనంలో ఉన్న పులిబూరు తమ పొలమూరేనని ఆయన ఉద్దేశం. ఆ శాసనంలో కూడా ఆ ఊరు తుల్యభాగానదీ తీరంలో ఉందనే ఉంటుంది. అఖండ గోదావరికి ఒక పాయ అయిన తుల్యభాగ తీరంలో పొలమూరుకు సంబంధించిన మూడు వందల ఏభయి సంవత్సరాల కిందటి కథ ఈ నవలలోని ఇతివృత్తం. కథంతా అపరాధ పరిశోధనాత్మకం. భుజంగరాయడనే ఒక రాజద్రోహిని పట్టుకోవడంలో ప్రజాప్రతినిధులయిన బ్రాహ్మణ యువకులు, వారి అనుయాయులు చూపిన యుక్తి, చాతుర్యాలు, పరాక్రమ శౌర్యాలే ఇందులో ప్రధాన విషయాలు.

మూడవది అనాథ బాలిక. ఈ నవల 1915లో మొదలుపెట్టినా 1922లో పూర్తి అయినట్టు తెలుస్తోంది. బ్రహ్మసమాజం ఆంధ్రదేశంలో రాజమండ్రిలో అడుగుపెట్టిన ఎందరో యువకుల్ని ప్రభావితం చేసింది. దాని ప్రభావంతో నడిచిన కథ ఇది. ఒక అనాథ బాలికను చేరదీసిన ఒక బ్రహ్మసమాజ యువకుడు ఆమెకు ఆశ్రయమివ్వడమే కాక ఆమె కోరికపై ఆమెను వివాహం చేసుకోవడం ఇందులోని కథ. వధూవరుల కులగోత్రాల ప్రమేయం లేకుండా ధనం తాలూకు అవరోధం లేకుండా కేవలం కరుణ, దయ కారణాలుగా ఏర్పడిన ప్రేమతో జరిగిన వివాహం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం ఈ నవలా రచన యొక్క ఉద్దేశం. వ్యావహారికంలో రాసినా కొంత గ్రాంథిక భాషారూపాల కలయిక కూడా కనిపిస్తుంది.

ఇందులో నాల్గవ నవల రక్షా బంధనము. ఇది 1925లో రాశారు. ఇది కూడా ఒక అపరాధ పరిశోధక నవలే. పూర్తి వ్యాహారిక వాడుక భాషలో రాసిన మొదటి నవలగా దీన్ని చెప్పుకోవచ్చు. నవల అంతటా ఎక్కువ భాగం సంభాషణల రూపంలోనే ఉంటుంది.

అయిదవ నవల ఆత్మ బలి. ఇది 1942లో ఆంధ్ర పత్రికలో ధారావాహికంగా వచ్చింది. ఈ నవలా రచనకు కూడా ప్రేరకమయిన అంశాన్ని శాస్త్రిగారే చెప్పినట్టు పరిశోధకులు చెప్తున్నారు. ఒక నడివయసు వితంతువు తన పిల్లవాడిని కాన్వెంట్‌కి పంపుతూ ఉండగా చూసిన శాస్త్రిగారి మనసులో ఈ కథ రూపుదిద్దుకుందని, ఆ వితంతువు తన కొడుకును యుద్ధంలోకి పంపి తాను వంటరిగా జీవిస్తూ ఉండగా ఆమె మనసులో జరిగే అంతస్సంఘర్షణే ఈ నవలలోని కథ.

నీలాసుందరి ఆరవ నవల, కృష్ణుడు నాయకుడుగా తన మేనమామ కూతురు నీలాసుందరిని పెళ్ళి చేసుకోడానికి రెచ్చిపోయిన ఏడు పోట్లగిత్తలను లొంగదీసుకునే పందెంలో నెగ్గడం ఇందులోని కథ. ఇది 1959లో వచ్చిన నవల.

చివరిది క్షీరసాగర మథనం. 1961లో రాసిన నవల. అరవైల నాటి ఆధునిక జీవన రీతి అంతా ఇందులో కనిపిస్తుంది. ధనవంతురాయిన, విద్యావంతురాలయిన ఒక బ్రాహ్మణ వితంతు యువతి స్వయంవరం కోసం చేసిన పరీక్ష, ఎంపిక ఈ నవల్లోని కథ.

ఇలా ఏడు నవలలలోని కథలూ దేనికవే విడివిడి అంశాలకి చెందిన ఇతివృత్తాలు. ఇందులో మిథునానురాగము, అనాథ బాలిక అన్న రెండు నవలలూ ప్రస్తుతం ముద్రణలో లేవు. పరిశోధకులకు దగ్గర ఉన్న ఒకటి అరా కాపీలు కూడా శల్యావశిష్టంగా ఉన్నాయి.

ఈ నవలలు రాస్తున్న కాలంలోనే ఆయన విశేషంగా కథలు, వీరగాథలు, చారిత్రక నవలలు, రూపకాలు, రూపికలూ రాస్తూ వచ్చారు. వాటితోపాటు మధ్య మధ్య ఈ నవలలు కూడా వ్రాయకుండా ఉండలేకపోయారు. దానికి కారణం ఏమయి ఉంటుంది అని ఆలోచిస్తే కాలమహిమ అనే చెప్పాలి. ఆ కాలంలో ఎన్నో మంచి నవలలు వచ్చేయి. గొప్ప నవలలు కూడా. అందువల్ల ఒక కథలోని వస్తువునే తిరిగి నవలగా రాసి ఉండాలి. క్షీరసాగర మథనం అన్న కథే అనంతర కాలంలో నవలగా రూపుదిద్దుకుంది.

కులవిద్యలయిన వైదిక విద్యలను ఆమూలాగ్రంగా అభ్యసించి, ప్రాచీన సంస్కృతాంధ్రాలను క్షుణ్ణంగా చదువుకుని అటుపైన వాటిని నిరసించడం అన్న సాహసోపేతమయిన తిరుగుబాటు చెయ్యడమే ఆయనలోని దృఢమయిన వ్యక్తిత్వానికి గుర్తు. ఆయన లోపల ఉన్న సృజనశీలి ఆ పని చేయించాడు. ఆ సృజనశీలే ఇన్ని రకాలయిన ప్రక్రియలలో శాస్త్రిగారి సృజనాత్మకతను పొంగిపొరలే విధంగా బయటికి తెచ్చాడు.

నవలా రచయితగా సుబ్రహ్మణ్య శాస్త్రిగారి గురించి చెప్పుకోవలసిన అంశాలలో ప్రధానమైనది భాష. భాష విషయంలో ఆయనలో క్రమక్రమంగా వచ్చిన మార్పుకు ఈ నవలలు దర్పణాలు. మొదటి రెండు నవలల్లోనూ పండిత లోకం శిరసున ధరించే వరమ ప్రామాణికమైన గ్రాంథిక భాష. అది కూడా అలంకారశోభితమై వర్ణనాత్మకమయిన శైలీ విన్యాసంతో అలరారిన భాష. నవల మొదలుపెడితే ఆపకుండా చదివించగల ధారాప్రవాహం లాంటి సారళ్యతను ఆ గ్రాంథిక రచనలో కూడా సాధించగలగడం శాస్త్రిగారి విశేష ప్రజ్ఞ. ‘పల్లవితమై, కోరకితమై, కుసుమితమై, ఫలితమై ఆమె హృదయము ఆనందరవవహమయ్యెను’ వంటి వాక్యాలు, ‘లఘుచపీటికను బహూకరించెను’ వంటి శబ్ద ప్రయోగాలూ పూర్వ కావ్య విశేష పరిచయాన్ని చెప్తాయి. ‘ప్రథమోదబిందువులు ఆమెపై పడెను’ అనే వాక్యం కుమార సంభవం కావ్యంలో కాళిదాసు ఎంతో అపురూపంగా ప్రయోగించిన ‘ప్రథమోద బిందువులు’ అన్న ప్రయోగాన్ని గుర్తు తెస్తుంది.

ఇలా ప్రాచీన కావ్యభాష మీది ఆయన ఆధిపత్యాన్ని ఈ నవలలోని భాష పట్టి ఇస్తుంది. తర్వాత ఆయన దృష్టి మారింది. గిడుగు, గురజాడల వాడుక భాషా ప్రచారం తాలూకు అవసరమేమిటో అర్ధం అయింది. అందువల్లే రక్షాబంధనం నవలని మొదట గ్రాంథికంలో రాసి తర్వాత తిరిగి అంతటినీ వాడుక భాషలోకి మార్చారట. దానికి ముందు వచ్చిన అనాథ బాలిక నవలలో వాడుక భాష కొంత గ్రాంథికంతో కలగలిసి ఉండడం కనిపిస్తుంది. కానీ తర్వాతదయిన రక్షా బంధనం నవలలో చక్కటి వ్యవహారంలో ఉన్న తెలుగే ఉంది. ఇక పాతికేళ్ళ వ్యవధానంలో వచ్చిన మిగిలిన నవలల్లో ఎక్కువ భాగం కథను సంభాషణలే నడుపుతాయి. వర్ణన గాని, రచయిత కథాకథనం గానీ ఎక్కడో తప్ప కనిపించదు. ఎంతో ఆర్థవంతంగాను, చమత్కార భూయిష్టంగాను, సాకూతంగానూ జరిగే సంభాషణల ద్వారా కుటుంబాలలో, ముఖ్యంగా స్త్రీల మధ్య ఒలకబడుతున్న ఎంతో రమ్యమయిన తెలుగు వినిపిస్తుంది. యథాతథంగా ఇళ్ళలో జరిగే సంభాషణలనే రచనకెక్కించడం ద్వారా అంత అందమయిన తెలుగు పలుకుబడులను నవలలోకి పట్టుకురాగలిగేరు. ఎంత వెతికినా ఒక్క ఆంగ్ల పదం కూడా దొరకని అంత స్వచ్ఛమయిన వాడుక తెలుగు ఇవ్వాళ మనకి ఎంతో అరుదు.

కథావరంగా ఈ నవలలన్నింటినీ పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు ఎంతో స్పష్టంగా తెలుస్తాయి. ఇంచుమించుగా ఆ అరవయి సంవత్సరాల కాలమూ ఆంధ్రదేశమంతా రకరకాల సంస్కరణల ప్రభావంతో ప్రజ్వరిల్లుతూ ఉంది. బ్రహ్మసమాజంలోని మానవీయ దృక్పథం సామాన్యమైనదేమీ కాదు. కానీ అటువంటి ప్రభావాలను ఎంతమాత్రమూ దరిచేరనివ్వని ఛాందసభావాల పుట్టిల్లు పొలమూరు, తదితర ప్రాంతాలు. ఇక్కడే శాస్త్రిగారిలోని మానవీయ శక్తి ఆయన్ని తిరుగుబాటుదారుగా చెయ్యడం కనిపిస్తుంది.

1917లో రాసిన విషభుజంగం నవలలో మూడు శతాబ్దాల కిందటి కథ రాస్తున్నా ఇప్పటికింకా ఆయనలోని ఆ విప్లవవాది బయటికి రాలేదని అనిపిస్తుంది. కథలో ప్రతినాయక చిత్రణ అర్ధవంతంగా ఉండదు. ఇతను ప్రజల మీద ప్రజాప్రతినిధుల మీద తీర్చుకుంటున్న ప్రతీకారానికి పెద్ద కారణం కనిపించదు. పైగా కొంతకాలం గడిచేసరికి పశ్చాత్తాపంతోనే ప్రతీకార హింస చెయ్యడం కనిపిస్తుంది. కథలో ఇటువంటి శైథల్యంతోపాటు కథ చివర నాయకుడి మరణం. ఇది కొంత పాశ్చాత్య నవలా ధోరణికి అనుసరణ కావచ్చు. కాని అతనితో అతని భార్య సహగమనం చెయ్యడం అన్న అంశం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పటికే సహగమన నిషేధం కోసం ఒకవైపు గొడవ జరుగుతూనే ఉంది. రచయిత ఈ సహగమనం గురించి చెప్తూ భారతీయ దాంపత్యం జీవనంలో ఉండే అన్యోన్యత గురించి ప్రశంసించడం కనిపిస్తుంది. ఈ నవల రాసేటప్పటికి ఆయనకు 26 ఏళ్ళు. అయితే ఆయన చివరి నవలలోని కథ ఒక వితంతు స్త్రీ రెండవ పెళ్ళికి స్వయంవరం ప్రకటించుకోవడం. దీన్ని బట్టి ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రయాణం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అంతేకాకుండా ఆనాటి సంస్కరణోద్యమాల లక్ష్యాలను ఆయన తన రక్తంలోకి చేర్చుకున్న వైనాన్ని ఈ రచనలు చెప్తాయి.

కులానికి, మతానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న గోదావరి పల్లెటూళ్ళలో బ్రహ్మసమాజమతము, దాని లక్ష్యాలూ ప్రవేశించడం కష్టం. అందుకే ఆయన అనాథ బాలిక కథ రాశారు. కులము, మతము, గోత్రమూ తెలియని పేద అనాథ బాలికను వివాహం చేసుకుని, ఆమెకు జీవితాన్ని ఇవ్వగల సంస్కారం బ్రహ్మసమాజమతం ఇస్తోంది సుమా! అని ఆ నవలలోని కథ చెప్తుంది.

రక్షాబంధనం నవల రాసేటప్పటికి ఆయన అవగాహన మరింత పెరిగింది. తన చుట్టూ ఉన్న వస్తున్న సమాజంలోని మార్పులను ఎంతో జాగ్రత్తగా పసిగట్టేరు. వాటన్నింటినీ ఒక్కచోట చూపించడానికే ఆ నవల రాసినట్టు తోస్తుంది. పైకి మాత్రం ఇందులోని కథ కేవలం అపరాధ పరిశోధక కథగా మాత్రమే కనిపిస్తుంది. కాని అంతమాత్రమే కాదు.

మొదటి నుంచీ శాస్త్రిగారికి తెలుగు జాతి మీద, తెలుగు భాష మీద అభిమానమున్నట్టే భారతదేశంలోని వ్యావసాయిక సమాజం మీద, ఆ సంస్కృతి మీద ఎంతో అభిమానమూ అపేక్షా ఉన్నాయి. ఆ భూస్వామ్య సంస్కృతిలోని మంచినంతటినీ తన రచనల్లో చూపెడుతూ వచ్చారు. అప్పటి ఆచారాలు, అలవాట్లు, రుచులు, అభిరుచులు ప్రతీ పుస్తకంలోనూ కనిపిస్తాయి. గోదావరి జిల్లాల పాడి పంటల సమృద్ధి అంతా వాటిల్లో కనిపిస్తూ ఉంటుంది. అప్పటి కుటుంబాల్లోని వ్యక్తుల మధ్య ఉన్న సత్సంబంధాలనూ మమతానురాగాలనూ కూడా చూపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పారిశ్రామిక నాగరికత భారతదేశంలోనూ ఆంధ్రదేశంలోనూ ప్రవేశించడం, అది భూస్వామ్య సంస్కృతిలో ఉన్న మంచిని దెబ్బతియ్యడం అన్న కోణం ఆయన దృష్టికి వచ్చింది. సరిగ్గా ఆ అంశాన్ని రక్షాబంధనం నవలలో ఆయన చాలా రూపాల్లో చూపెట్టారు.

నిజానికి రాయవరం శుద్ధ పల్లెటూరు. కానీ ఇరవయ్యో శతాబ్ది నాగరికత అక్కడ సమృద్ధిగా ఉంది. అచ్చుకూటం, పక్షపత్రిక, గ్రంథమాల, ఔషధశాలలు, ఆనుపత్రి, బియ్యం మర, సైకిలు షాపు, వాచీల మరమ్మత్తు దుకాణం, జట్కాలు, అన్నిటికీ జీవం పోస్తూ కాఫీ హోటలు కూడా ఉంది అక్కడ.

పై వర్ణన ఈ మార్పును చూపెట్టడానికి చేసినదే. శ్రమపడే లక్షణం వ్యావసాయిక సమాజపు లక్షణంగా గుర్తించిన ఆయన ఈ సుఖాలను అందించే పారిశ్రామికీకరణ తాలూకు మార్పును అంగీకరించలేదు. దానికి కారణం కూడా ఇలా చేప్పేరు.

కొత్త నాగరికత అబ్బుతోంది కాదూ జాతికి!? వేషాలు ప్రబలాయి. పని చెయ్యడం దర్జాకి లోటు అన్న భావం పెరుగుతోంది. సోమరితనం హెచ్చిపోతోంది. పోనీ అంటే కాఫీ హోటళ్ళు, సినిమాలు, సిగరెట్టులు, బీడీలు ఇవి తప్పనిసరి అవుతున్నాయి. మరి డబ్బు…’ అని ఒక పాత్ర చేత అనిపిస్తారు.

నిజానికి కృష్ణారావు అన్న పేరుతో చలామణీ అయ్యే ఆ పాత్రే ఆ నవలలో ప్రతినాయకుడు. దొంగ, హంతకుడూ కూడా. చురుకయిన తెలివయిన యువకులకు దబ్బుతో కొనుక్కోగల సుఖాలను అందించే ఈ నాగరికత వారిని సోమరులను, చివరకు దోపిడీ దొంగలను కూడా చేస్తోందన్నది చెప్పడానికే ఈ నవల వ్రాసినట్టు కనిపిస్తుంది.

ఈ నవల ద్వారా ఆయన ఎంచి చూపిన మరొక లోపం అవినీతిమయమయిన రక్షక వ్యవస్థ, సమాజాన్ని రక్షించవలసిన పోలీసు ఉద్యోగుల జులుం కారణంగా సాధారణ పౌరులు దొంగలుగాను, హంతకులుగానూ ఎలా మారుతారో ఇందులో ఉంటుంది. ప్రతి ఊళ్ళోనూ క్రమశిక్షణ కలిగిన కుటుంబాలలోని యువకులే ఆయా గ్రామాల సంరక్షణ చెయ్యగలరని కొత్తగా ఏర్పడిన ఈ పోలీసు శాఖ ఏమీ చెయ్యలేదని నిరూపించడమే ఈ నవల అంతటా నడుస్తుంది. ప్రయివేటు డిటెక్టివ్ లాగ పనిచెయ్యగల కుర్రవాళ్ళను ఇందులో చూపెడతారు. ఇందులోనూ వ్యావసాయిక సమాజం తాలూకు మంచిని చూపే ప్రయత్నమే ఉంది.

నవల అంతటా కనిపించే మరొక ప్రధాన అంశం వేశ్యావృత్తి. వీరిపట్ల సమాజంలో రెండు వైఖరులున్నాయి. ఒకటి వారిని తమ ఇళ్ళల్లో జరిగే పెళ్ళి వేడుకలకు ఆహ్వానించి వాళ్ళ చేత నృత్య ప్రదర్శనలు, గాన కార్యక్రమాలు జరిపించి సత్కరించి పంపించే వర్గం. రెండోది వారిని భోగవస్తువులుగా వాడుకుంటూ శరీర సుఖాన్ని కొనుక్కునే వర్గం. ఈ రెండో వర్గం వారిలో పోలీసులూ ఉన్నారు. అంగడిలో వస్తువులుగా బతికే ఈ జీవితాలను అసహ్యించుకుంటూ అంతకంటే ఉన్నతమయిన జీవితం కోరుకునే వేశ్యలను మనకు చూపించడమే శాస్త్రిగారి ఉద్దేశం. పైగా అమాయకులయిన వారిని మోసగించే దొంగ విటుల గురించి చెప్పడమే నవల అంతటా ఉంటుంది. సంఘంలో పరువు ప్రతిష్టలతోపాటు భద్రత కూడా లేక అణిగిమణిగి పడి ఉన్న వారి మీద సానుభూతి కలిగించే ప్రయత్నం కూడా శాస్త్రిగారు తన నవలలో చేశారు.

ఆనాటి సంఘంలో వేశ్యల కంటే కూడా అతి నికృష్టమయిన పరిస్థితిలో ఉన్నవారు వితంతువులు. అందులోనూ బ్రాహ్మణ కుటుంబాలలోని వితంతువుల పరిస్థితి మరీ దారుణం. అయితే బ్రాహ్మణ వితంతువుల పరిస్థితి గురించి అప్పటికే చాలామంది రచయితలు రాసి వున్నారు. బహుశా ఆ కారణం చేతనేనేమో శాస్త్రిగారు ఆత్మబలి నవలలో బ్రాహ్మణేతర వితంతువు గురించి రాశారు. దీన్ని మరో వైజ్ఞానిక నవల అని కూడా అన్నారు.

నవల అంతా ఇంచుమించు సంభాషణల రూపంలోనూ తలపోతల రూపంలోనూ ఉంటుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఒక ప్రౌఢ వితంతువు గోవిందమ్మ కొడుకు మిలట్రీలో ఉన్నాడు. అనురాగాన్ని అందించే తోడు కోసం తహతహలాడే మనసుతో ఉంటుంది ఆమె. ఊళ్ళో ఉన్న తిమ్మన్న అనే చురుకయిన యువకుడు ఆమె మీద మోజుతో ఉంటాడు. నారమ్మ అనే ఒక జాణ ద్వారా రాయబారం పంపుతాడు. అతని మీద ఉన్న తన ఇష్టాన్ని పైకి చెప్పడానికి, అతన్ని అంగీకరించడానికీ గోవిందమ్మ పడిన సంఘర్షణే నవలలో అధిక భాగం ఉంటుంది. తీరా అతన్ని అంగీకరించి అతనికి రహస్యంగా తనని అర్పించుకునే లోపు తన కొడుకు యుద్ధంలో చూపిన సాహసం, పేరు ప్రతిష్టలు ఆమెకు తెలుస్తాయి. తల్లి మీద అతని ప్రేమ కూడా మధ్యవర్తులు వచ్చి చెప్తారు. ఆమెలోంచి మాతృహృదయం బయటికి వచ్చి తోడు కోసం పరితపించే స్త్రీ హృదయాన్ని అణచివేస్తుంది. ఇదీ కథ. స్త్రీ ఆమె చెడుదారి పట్టకుండా ఆమెలోని తల్లి ఆమెను రక్షించినట్టుగా పైకి కనిపిస్తుంది కానీ అందుకోసమే అయితే సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఇంత సంఘర్షణ రాయనక్కరలేదు. పైగా దానికి ఆత్మబలి అన్న పేరు కాక మరొక పేరు పెట్టి ఉండవచ్చు. ఆమెకు సంఘం మరొక వివాహాన్నీ భర్తనూ అనుమతిస్తే ఆమె ఈ విధంగా తనను తాను బలిచేసుకోవలసిన పరిస్థితి రాదు కదా! అన్న విషయం మనకు తోపించడమే ఆయన ఉద్దేశం.

‘క్షీరసాగర మథనం’ నవల రాసేనాటికి శాస్త్రిగారికి స్త్రీల సమస్యల పట్ల వచ్చిన అవగాహన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సహస్రాబ్ది ఆరంభాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సాధికార సంవత్సరంగా ప్రకటించింది. మహిళలు అన్ని రంగాలలోనూ శక్తి సంపాదించినప్పుడే వారి సమస్యలు తీరుతాయనే అవగాహన ఈ ప్రకటనలో ఉంది. ఇదే అవగాహన 1961లో రాసిన క్షీరసాగర మథనం నవలలో కనిపిస్తుంది. ఒక బ్రాహ్మణ యువ వితంతువు రెండో పెళ్ళి చేసుకోడానికి స్వయంవరం కోసం ఒక పత్రికా ప్రకటన ఇస్తుంది. ఆ విధంగా ఇవ్వగలగడానికి ఆమె అన్ని రకాల సాధికారతలు సంపాదించుకున్న స్త్రీ అని ఆ ప్రకటనలో తెలుస్తూ ఉంటుంది. స్త్రీలు తమ సమస్యల పరిష్కారానికయినా, విముక్తి కోసం అయినా, స్వేచ్ఛ కోసం అయినా పోరాడాలంటే ముందు వారు సాధికారత సంపాదించాలని ఆనాడేనాడో ఆయన గ్రహించారు.

విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగివుండి, మగవారితో సమానంగా వాహనాలు నడవడం, ఆటలాడడం, ఈత కొట్టడం లాంటి పనులన్నీ నేర్చుకున్న ఒక నాయికను ఈ నవలలో చిత్రించారు. ఇన్ని చేతనయిన స్త్రీ ఏ కోరిక కోరినా సమాజం ఆమోదిస్తుందని కూడా చెప్పకనే చెప్పేరు.

ఈ నవలల్లో నీలాసుందరి కొంత విభిన్నమయిన నవల. శాస్త్రిగారు సరదా కోసం రాసిన నవలలా ఉంటుంది తప్ప సామాజికపరమయిన స్పృహ ఏదీ దానిలో ఉండదు. కానీ ఆద్యంతమూ చదివింపచేసే శక్తి ఉన్న నవల.

చివరగా ఈ నవలల గురించి ఒక్కమాట చెప్పాలి. కథలలో చెప్పిన అంశాలు ఆయనకు తృప్తి కలిగించి వుండవు. అందువల్ల ఆయా సమస్యలకు ఇంకా వివరంగా సుదీర్ఘంగా చెప్పాలనే ఇచ్ఛతో పొడిగించి నవలలుగా వ్రాశారు తప్ప వీటిని నవలలు అనేకంటే పెద్ద కథలు అనడమే బావుంటుంది. నవలా లక్షణాలతో వీటిని పరిశీలించడం అనవసరం.