ప్రవాహ వేగంతో జాలువారే వాక్యాలతో, సరళంగా సాగుతూ చివరికంటా చదివించే గుణమున్నవి కల్పన రాసిన ఈ కథలు. తీసుకున్న వస్తువులు మాత్రం క్లిష్టమైనవి, నిలబెట్టి ఆలోచింపచేసేవీ. ఇందులో అధికభాగం స్త్రీలు ప్రత్యేకంగా ఎదుర్కునే సమస్యల గురించే కాగా, రెండు మూడు కథలు తప్ప అన్నీ ప్రవాస జీవితానికి సంబంధించినవే.
కథలో కథగా చెప్పిన ‘అయిదో గోడ’లో ఆ శిల్పవైవిధ్యాన్ని మన దృక్కోణాన్ని మనవైపే తిప్పడానికి సాధనంగా మలుచుకోవడం కనిపిస్తుంది. కొన్ని బయటి గోడలు బద్దలు కొడుతూనే లోలోపలి గోడల్ని గమనించక పోవడమూ, ప్రతిపాదిస్తున్న మార్పు కూడా కొన్ని పరిమితులకు, వివక్షాపూరితమైన వ్యవస్థిత నైతిక నియమాలకు తెలియకుండానే లోబడి ఉండడమూ, ఉదారవాదులూ తమ వైఖరిని తరచి చూసుకునేలా చేస్తాయి. స్త్రీ శారీరకావసరాలకూ ప్రాధాన్యత ఇవ్వడం వంటి నిషిద్ధవిషయాన్ని సానుకూల దృక్పథంతో సామాన్యీకరిస్తుంది ఈ కథ.
సాంఘికంగా చిన్న చూపు చూడబడుతూనో, ఎగతాళి చేయబడుతూనో, చట్టపరంగా సమాన హక్కులకు దూరం చేయబడ్డమే కాక నేరస్తులుగా పరిగణించబడే ఎల్‌జిబిటి+ వర్గాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అరుదయిన కథలు: సంచయనం, ది కప్లెట్. దేశవిదేశాల్లో వారి పట్ల ప్రజల, న్యాయస్థానాల వైఖరి మారుతున్నప్పటికీ మన సాహిత్యం భిన్న లైంగిక ధోరణులపై పెద్దగా స్పందించినట్టు కనపడదు. కుటుంబమూ, సమాజమూ హోమోఫోబియా నుండి బయటపడి, దాన్ని వాస్తవంగా అంగీకరించడానికి తోడ్పడే కథలు ఇవి. బయటపడలేని బేల మనస్తత్వాన్ని చూపుతూనే అమెరికా నగర నేపథ్యాన్ని వాడుకుంటూ హృద్యంగా చెప్పిన ప్రేమకథ ‘ది కప్లెట్’. భూత వర్తమానాల మధ్య, రెండు దుఃఖాల మధ్య తిరిగే ‘సంచయనం’ తండ్రి ఆమోదం కోసం పరితపించే కొడుకు కథ.
మాట్లాడడానికి ఇంకో నిషిద్ధ విషయమైన రుతుక్రమం చుట్టూ అల్లుకున్న అన్ని ఇబ్బందులూ, శారీరక బాధ, మానసిక వేదనా ‘రుతుభ్రమణం’ కథగా రూపు దిద్దుకున్నాయి. ఓదార్పు బదులు ఎగతాళీ, ఆసరా బదులు అలక్ష్యమూ ఎదురయ్యే సమయాల్లో ఒంటరి పోరాటమూ తప్పదు మరి.
కుల మత ప్రాంతాలకు అతీతంగా, ఆర్థిక విద్యాస్థాయిలతో ప్రమేయం లేకుండా అన్ని తరగతుల్లోనూ స్త్రీకి తప్పని గృహహింస నమ్మలేని సందర్భాల్లో తటస్థపడుతూనే ఉంటుంది. మౌనంగా భరించే స్థితి సాగి సాగి ఎక్కడో తెగుతుంది. ఇట్స్ నాట్ ఓకే అనే తెగింపుతో బయట పడే వాళ్ళకంటే మారిటల్ రేప్‌నూ దిగమింగుకుని ‘స్లీపింగ్ పిల్’ లాగే మిగిలిపోయేవాళ్ళు లెక్కకు అందరు.
వివాహం ద్వారా కట్టుబడని ప్రేమ సంబంధాల్లో శరీర ధర్మం వల్ల సాధారణంగా నష్టపోయేది స్త్రీలే. నిరోధకాల పట్ల అవగాహన లేక దాల్చిన గర్భానికి జవాబుదారీ ఆమే అవుతుంది. పర్యవసానం అరుదుగానయినా ‘ఎండమావులు’ కథలోలాగ కూడా ఉంటుంది. ప్రత్యమ్నాయాలూ అంత తేలికయినవి కావు. అభివృద్ధి చెందిన దేశమయినా అబార్షన్ హక్కు తీవ్రమైన రాజకీయాంశమైన చోట వైద్య సదుపాయాలు లేక ప్రాణానికి ముప్పుగానో, నేరానికి శిక్షగానో పరిణమిస్తుంది.
స్త్రీ రేప్ చేయబడని దేశమేదీ లేదు. దాన్నుంచి రక్షణ, బాధితులకు న్యాయమూ ఎక్కడైనా కరవే. దాన్ని నేరంగా గుర్తించడానికీ, న్యాయపోరాటంలో మద్దతు ఇవ్వడానికీ కుటుంబమే ముందుకు రాదు. బాధితులనే శంకించడమూ, కళంకితులుగా ముద్ర వేసే సమాజ దృష్టీ, న్యాయం జరుగుతుందనే భరోసా లేకపోవడమూ ఇవన్నీ క్రైమ్ సీన్‌ను క్రైమ్ సీన్‌గానే ఉంచుతాయి. లెక్కకందని నేరాలు మూగరోదనల్లోనే ముగుస్తాయి. స్త్రీ దేహం రకరకాలుగా నేరస్థలంగా మారుతూనే ఉంటుంది.
రెండు దారులుంటాయి. ఒకటి నలిగిన, ఎవరినీ ఇబ్బంది పెట్టని, దేనితోనూ పేచీ లేని, అందరికీ ఆమోదయోగ్యమైన దారి. మరొకటి దాన్ని ఒప్పుకోలేని, రాజీ పడలేని, తోడు దొరకని, తనకు నచ్చిన సూటి బాట. ఏదీ తేలిక కాదు. ఏ బాట పట్టినా యుద్ధం లోపలి మనిషితోనో, బయటి సమాజంతోనో తప్పనిసరి అవుతుంది కొందరికి ఈ కథల్లోని పాత్రలకు లాగే. వ్యక్తిగత అవసరాలూ, సామాజిక సూత్రాల మధ్య నలగడం తప్పనిసరి. వీరికి కావలసింది మన ఔదార్యమో, సానుభూతో కాదు. నిష్పక్షపాత న్యాయదృష్టి.
నూ ఆర్లీన్స్ నగరం కట్రినా హరికేన్‌లో ధ్వంసమయింది. సమయానికి సరయిన సాయమూ అందక తల్లడిల్లిన ఆ నగరం తిరిగి తలెత్తుకుని తన నీడకు చేరినవారితో పునర్నిర్మితమవుతూ ఉంది. అందులో ఒకడయిన లోగన్ సాన్నిధ్యంలో ‘అయిదు సాజరాక్‌ల’తో సాంత్వన పొందుతుంది సృష్టి. నిన్నటి రేపటి తట్టుకునే శక్తిని ఆ శిథిల నగరం ఆ భగ్నహృదయానికి అందిస్తుంది. అమెరికాలోని నగరనేపథ్యాన్ని అనువుగా వాడుకున్న అతికొద్ది డయాస్పొరా కథల్లో ఇది ఒకటి.
సిమెంట్ కట్టడాల మధ్య పాకే మెట్రో ఇనపచక్రాల కింద నలుగుతూ వినపడని ‘టూ డాలర్స్ ప్లీజ్’ అభ్యర్థనలు ఎవరికీ పట్టవు కానీ, తోటి ఉద్యోగి ప్రతి కదలికల్నీ పట్టించుకుంటూ మోరల్ పోలీసింగ్ చేసేది ‘ఆ ముగ్గురూ’ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ. నగరజీవితపు స్పందనల్లోని వైరుధ్యాన్నీ, ఐరనీనీ ఈ రెండు కథలూ పట్టిస్తాయి.
‘హోమ్ రన్’ చదువులోనే కాక ఆటల్లోనూ తమ పిల్లలు ముందుండాలనే ఆకాంక్షా, తమ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తారనే ఆశా వెల్లడి చేస్తే, ‘టింకు ఇన్ టెక్సస్’ ఒంటరితనానికి విరుగుడుగా బొమ్మల్ని, ఇమేజినరీ ఫ్రెండ్స్‌నూ ఆశ్రయించడాన్ని తలిదండ్రులు అర్థం చేసుకోవలసిన అవసరం గురించి చెపుతుంది. ఈ దేశంలో బాల్యానికి అద్దంపట్టే కథలు ఈ రెండూ.
‘అమ్మకో ఉత్తరా’నికి కాలదోషం పట్టినట్టనిపించినా ఒక కాలాన్నీ, ప్రవాస జీవిత శకలాన్నీ రికార్డ్ చేసిందనుకోవచ్చును.
ప్రవాస జీవితము, స్త్రీల పట్ల హింస, వివక్ష – రెండు ప్రధానమైన పాయలుగా కనిపిస్తాయి ఈ కథల్లో. కొన్ని చెప్పక తప్పని కథలున్నాయి. కొన్ని కొత్తవీ, కొన్ని ఎంత చెప్పినా తీరని వ్యథలూ ఉన్నాయి. పాఠకుల మనసుల్ని కొంతయినా ఉన్నతీకరిస్తాయి. అది వాళ్ళ ప్రవర్తనపై ఎంత ప్రతిఫలిస్తుందనేది వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. కల్పన మాత్రం ప్రవాస జీవితపు పలుపార్శ్వాలను వెలుగులోకి తెచ్చే మరిన్ని కథలతో మన ముందుకు వస్తుందనే కాంక్షిద్దాం.
అయిదో గోడ కథల సంపుటి – కల్పన రెంటాల.
ఛాయా పబ్లికేషన్స్ ప్రచురణ. విడుదల అక్టోబర్ 2021, ధర రూ.130, $8.
నవోదయ బుక్ హౌస్, మిగతా అన్నీ బుక్ స్టాల్స్ లోనూ.
ఆన్‌లైన్‌లో: అమెజాన్, తెలుగుబుక్స్.
రచయిత నుంచి నేరుగా కూడా లభ్యం.