జులై 2021

తెలుగు సాహిత్యచరిత్రలో కొద్ది కథలు మాత్రమే రాసి అతి గొప్ప పేరు సంపాదించుకున్న రచయితలు కొందరున్నారు. వారందరిలోనూ కారా మాష్టారుగా సుపరిచితులైన కాళీపట్నం రామారావుగారు అగ్రగణ్యులుగా నిలుస్తారు. ఆయన కథల గొప్పతనాన్ని ఎందరో ప్రశంసించారు. మరెందరో తమను తాము కారా అభిమానులుగా ప్రకటించుకున్నారు. ఏ బహుకొద్దిమందో విమర్శించారు. కాని, ఆ కథల పూర్తి విస్తృతిని, వాటి లోతులను, అవి సూచించే ఐతిహ్యాలను గుర్తించి చర్చించిన పాఠకులే కాదు, రచయితలూ ఎక్కువమంది కనపడరు. కారా మాష్టారి కథలు నలుపు తెలుపుల్లో సమాజరుగ్మతలను ఎత్తిచూపి వాటికి కథలోనే ఒక పరిష్కారాన్ని చూపేవి కావు. అవి సమాజపు సంక్లిష్టతను, మానవ జీవన సంఘర్షణలను అంతే క్లిష్టంగా ప్రదర్శించేవి. వాక్యం వాక్యం చదివి లోతులను అందుకోవాల్సిన ఈ లక్షణమే, ఆ కథలను క్లాసిక్స్ స్థాయికి చేర్చింది. క్లాసిక్స్ కోరుకునే సహనాన్ని, సునిశిత దృష్టినీ కోరినందుకేనేమో బహుశా, ఎందరో పాఠకులు ఆ కథలు ఆవిష్కరించిన సమస్యల అసలు రూపాన్ని పట్టుకోలేకపోయారు. జరగవలసినంత కాకున్నా ఈ కథలపైన చర్చ కొంతైనా జరగడం, వాటిని విశ్లేషించ ప్రయత్నించడం ఆశావహంగా కనిపిస్తున్నా, బలహీనపడివున్న వర్తమాన సాహిత్యచిత్రం కూడా కళ్ళ ముందుకొచ్చి నిరాశ కమ్ముకోక తప్పదు. కథ చదవడం పాఠకులకే కాదు రచయితలకూ రావటల్లేదన్న నిజం, ఇప్పటి సాహిత్యం మీద ఒక అంచనానివ్వక మానదు. ఒక వాక్యం ప్రతిభవంతంగా వాడినప్పుడు అది ఎంత బలమైన ఆయుధం అవుతుందో రచయితలకు తెలియందే కథ బలోపేతం కాలేదు. వాక్యం గురించి, కథనం గురించి చర్చలు జరగందే, రచనను అర్థం చేసుకోవడానికి పడవలసిన శ్రమ మీద ఎవరూ దృష్టి పెట్టరు. బహుముఖీనమైన సాహిత్యాన్ని కేవలం పైపైన చదవడం కాదు, దాని అంతరంగాన్ని కూలంకషంగా తెలుసుకోవాలంటే, సాధన, శ్రమ తప్పవు. వ్యక్తిగత నమ్మకాలకు, రాజకీయ దృక్పథాలకు అతీతంగా, సాహిత్యకారులకు తమదైన ప్రాచీన ఆధునిక సాహిత్యంతో పరిచయం ఉండాలి. సర్వకాలీనమైన క్లాసిక్స్ అనబడే సాహిత్యాన్ని ఏ కాలానికా కాలం, ఏ తరానికా తరం సృష్టించుకోవడం ఒక సాహిత్యావసరం. అలాంటి సాహిత్యాన్ని గుర్తించడం, శ్రద్ధగా గమనించడం, చర్చించడం తరువాతి తరానికి సాహిత్యవారసత్వాన్ని అందివ్వడానికి దారులు. వాటిని మూసేసుకుంటున్న నేటి తరానికి నేర్పించేదెవ్వరు?