అన్వర్, సుహాల కోసం ఎదురుచూస్తోంది సాదా, హాస్పటల్ బెడ్ మీద కూచుని. పదకొండవుతోన్నా ఇంకా రాలేదు వాళ్ళిద్దరూ. ‘వర్షం వల్లేమో’ అనుకుంది కిటికీ వైపు చూపు సారిస్తూ.
ఆస్పత్రిలో ఉన్న రెండు వారాలూ రెణ్ణెల్లలా భారంగా గడిచాయి. మరో రెండు వారాలు ఇప్పుడు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలట. మరి తన స్టూడెంట్స్ గతేంటి? డాక్టర్ ఈ ప్రశ్నను పట్టించుకోలేదు. తను కోలుకోవడమే ముఖ్యమన్నాడు.
“సారీ సాదా, ఆలస్యమైంది. అన్వర్ కింద కారు పార్క్ చేసే పన్లో ఉన్నాడు.” సుహా గొంతు వినపడటంతో సాదా ఈ లోకంలోకి వచ్చి పడింది.
“నీకున్న సమస్యలకు కొత్తగా మరొకటి తెచ్చిపెట్టాలని కాదుగానీ నీకో విషయం చెప్పాలి సాదా” కాసేపాగి, హటాత్తుగా అన్నది సుహా.
“ఏమైంది? నాకేదైనా కొత్త రోగం ఉందని కనిపెట్టాడా డాక్టర్? నా స్టూడెంట్స్ దగ్గరికి ఎప్పటికీ వెళ్ళలేనా ఇంక? లేక అమ్మ లాగా నరకయాతన పడి చచ్చిపోతానా?” సాదా గొంతులో ఆందోళన.
“అలాంటిదేం లేదు, కంగారుపడకు గానీ, అదీ… మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అదే నేను చెప్పాలనుకుంది.”
“మళ్ళీనా?”
“ఇదే చివరిసారి. దేవుడలా రాశాడు.”
సాదాకేమీ అర్థంకాలేదు. “చివరి సారా? అదేంటి? ఎందుకు?”
“నేనిక లెబనాన్‌కి తిరిగి రాదల్చుకోవట్లేదు. అన్వర్‌ని కూడా ఎలాగో ఒప్పించాను. కెనడా వెళ్ళిపోతున్నాం.”
సాదాకి మాటలు కరువయ్యాయి. తను మళ్ళీ సుహాని పోగొట్టుకోబోతోంది. ఈసారి శాశ్వతంగా. ఈరోజు తర్వాత ఇహ ఎప్పటికీ తను సుహాని చూడలేదేమో? ఏమైందసలు? ఆందోళనని అణుచుకోడానికి ప్రయత్నించింది.
“డాక్టర్లు కెనడాలో ఎక్కువ సంపాదిస్తారా?”
సుహా చేదుగా నవ్వింది. “అన్వర్ మెడికల్ డిగ్రీకి కెనడాలో గుర్తింపు లేదు. ఆ మాటకొస్తే ఇక్కడా అతను ప్రాక్టీస్ చేసే పరిస్థితులు లేవు.”
అక్కచెల్లెళ్ళిద్దరూ ఒక్క నిమిషం మౌనంగా ఉన్నారు.
“మరి అన్వర్ అక్కడేం పని చేస్తాడు?”
“ఆస్పత్రి సామాన్లు అమ్మే కంపెనీలో ఏదైనా క్లర్క్ లాంటి ఉద్యోగం చూసుకుంటాడు.”
సాదా మూగదైపోయింది. అన్వర్‌కు అతని పేషంట్స్ అంటే ఎంతో శ్రద్ధ. అలాటి వ్యక్తి… నమ్మలేకపోతోంది.
“మరి నీ పెయింటింగ్ పని సంగతేంటి సుహా? ఇక్కడ నువ్వు, నీ ఆర్ట్ అందరికీ తెలుసు.”
“ఇక్కడ కూడా మొదట్లో ఎవరికీ తెలియని కొత్త ఆర్టిస్టుగానే మొదలుపెట్టా కదా. అక్కడా అలాగే మొదలుపెడతాను.”
పాశ్చాత్య దేశాల్లో ఎంత పోటీ ఉంటుందో చెప్పాలనుకుంది సాదా. అరబ్ దేశాల నుంచి వచ్చిన ఆర్టిస్టులకి అక్కడ అవకాశాలు దొరకడం అసాధ్యం.
“తన మూలాల నుంచి దూరంగా జరిగిన ఆర్టిస్ట్, ఆర్టిస్ట్‌గా మిగుల్తాడంటావా?” అడిగింది.
“మూలాలా? నాకా! ఇక్కడ నీకు మూలాలున్నాయేమో గానీ నాకేమీ లేవు. అన్వర్ కూడా నిజానికి ఇపుడు ఇక్కడ అపరిచితుడే అయిపోయాడు. యుద్ధం మా హక్కులన్నిటినీ ఒలిచి లాక్కుంది. అతన్ని రక్షించడానికి ఏ చట్టాలూ లేవు. అసలు ప్రభుత్వం ఏ చట్టాల అమలు కోసమూ నిలబడదు. మనల్ని ఎవరూ పట్టించుకోరు. అలా బయటికెళ్ళి చూడు, మన కోసం చూసేదెవరో తెల్సా? అదిగో, ఆయుధాలు పట్టుకుతిరిగే ఆ గూండాలే.”
“ఇదన్నమాట మీరు వెళ్దామనుకోడానికి కారణం. అంతేలే, రాజకీయాలు అడుగుపెట్టిన చోటంతా మొత్తం కలుషితం కావాల్సిందే!” అంది సాదా దిగులుగా.
“నా జీవితానికి సంబంధించి అయితే, అదెప్పుడో కలుషితం అయిపోయింది. అందులో రాజకీయాలకు ఏం సంబంధం లేదు.” కసిగా అంది సుహా.
“కావొచ్చు. కానీ రాజకీయాలు ఈ పరిస్థితిని మరింత చెత్తగా మార్చాయి. అన్వర్‌ని ఇప్పుడు బలిపశువు చెయ్యకు.”
“అతణ్ణి బలిపశువుని చేసింది యుద్ధం. కానీ అంతకు ముందే అన్వర్ నన్ను బలిపశువుని చేశాడు. అతనికి తన పని, కెరీర్, పేషంట్స్, ఇవే ముఖ్యం.”
సుహా గొంతు పూడుకుపోయింది. చెల్లెలి కళ్ళలో నీళ్ళు గమనించింది సాదా. “అతనికి నువ్వంటే ప్రేమ సుహా.” నెమ్మదిగా అంది. సుహా వ్యంగ్యంగా నవ్వింది. అన్వర్ ఇదివరకులా లేడని, తమ మధ్య బంధం ఇదివరకులా లేదని అక్క గమనించలేదా?
“ఔను. అతనికి నువ్వంటే చాలా ప్రేమ. నిన్నూ నాడియానీ బాగా చూసుకోడానికి రాత్రింబవళ్ళు కష్టపడతాడు.”
“అతను రాత్రింబవళ్ళు కష్టపడేది తన కెరీర్ కోసమే. నా మీద అతనికేమీ ప్రేమ మిగల్లేదు.”
సాదా విస్తుపోయింది. సుహా అక్కని పట్టించుకోలేదు.
“ప్రేమంటే పెద్ద కలర్ టీవీ, ఫ్రిడ్జ్, కొత్త కారూ కొనుక్కోడమా? ప్రేమంటే లక్షలకొద్దీ లీరాలు సంపాదించడమా? ఆత్మీయతకు, అనురాగానికీ ఒక్క దమ్మిడీ విలువ కూడా లేదా?”
సుహా అవమానాన్ని దిగమింగింది. సాదా దృష్టిలో ప్రేమంటే, బాగా చదువుకోవడం, మంచి స్థాయికి చేరి, డబ్బు సంపాదించడం. ప్రేమ గురించి తనకేం తెలుసు? ప్రేమ గురించి కథల్లో నవలల్లో చదివింది తను. తనంటే మాత్రమే తనకి గొప్ప ప్రేమ.
“ఎప్పుడూ ఏవో ఆదర్శాలు వల్లిస్తావ్. పుస్తకాల ప్రపంచంలో బతికే నీకు జీవితంలో ప్రేమంటే ఏంటో ఎలా తెలుస్తుందిలే!” సుహా గొంతులో తిరస్కారం స్పష్టంగా పలికింది.
“నువ్వూ అన్వర్ ఎంత సామరస్యంగా ఉండేవాళ్ళో మర్చిపోయావా?” చెల్లెలి కళ్ళలో ద్వేషాన్ని చూస్తూ అంది సాదా.
“అదే ప్రేమ అయితే, అదెప్పుడో మాసిపోయింది.” కన్నీళ్ళను బిగబట్టింది సుహా.
చొక్కా విప్పేసి, తెల్లటి సర్జికల్ గౌన్ వేసుకుని ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు పెట్టాడు అన్వర్. టేబుల్ మీద అనస్తీషియా ప్రభావంతో అచేతనంగా పడుకున్న పేషంట్ కేసి చూస్తూ, చేతులు కడుక్కుని సమియా సహాయంతో గ్లవ్స్ వేసుకుని, ముక్కూ నోరూ కవర్ అయ్యేలా మాస్క్ కట్టించుకున్నాడు.
పేషంట్ పొట్టమీద ఆపరేషన్ చేయబోయే చోట చర్మాన్ని సమియా స్టెరిలైజ్ చేసింది. అన్వర్ స్కాల్పెల్ అందుకుని గాటు పెట్టబోతుండగా, అకస్మాత్తుగా బయట పెద్దగా కలకలం వినిపించి అతని చేయి ఆగిపోయింది. గట్టిగా ఏదో అతని వీపు మీద గుచ్చుకుంది.
“చేస్తున్న పని ఆపి, ముందు, ఈ కామ్రేడ్ ఛాతీలో దిగిన బులెట్ బయటికి తియ్యి.” కర్కశంగా ఆదేశించింది ఒక గొంతు.
ఏం జరిగిందో అన్వర్ గ్రహించేలోపే, ఆయుధాలు పట్టుకున్న ఇద్దరు బలమైన వ్యక్తులు ఆపరేషన్ టేబుల్‌ని దూరంగా నెట్టేసి, రక్తమోడుతున్న ఒక యువకుడిని మరో టేబుల్ మీద పడుకోబెట్టి తోసుకొచ్చారు.
“త్వరగా. కామ్రేడ్ చాతీలో బుల్లెట్ దిగింది. వెంటనే తీసెయ్!” అతని వీపు మీద ఆ వస్తువు మరింతగా గుచ్చుకుంది.
“పిచ్చిగానీ పట్టిందా? బయటికి పొండి!” కొలీగ్ సాద్ అరిచాడు.
“మేము వెళ్ళం. డాక్టర్ ఈ పని చెయ్యకపోతే ఇప్పుడే చంపిపారేస్తాం అతన్ని.”
ఇది పీడకలా లేక వాస్తవమా? అన్వర్ చుట్టూ చూశాడు. తుపాకీలు అతనికేసి గురిపెట్టి చుట్టూ నిలబడ్డారు ఆ వ్యక్తులు. వాళ్ళ మొహాల్లోకి చూసే ధైర్యం లేకపోయింది. అంతటి భయానకమైన పరిస్థితిలో మృదువుగా సమియా గొంతు వినపడింది.
“బయటికి వెళ్ళండి మీరంతా. ఒకవేళ అతనికి ఆపరేషన్ చేయాలన్నా, అతని బట్టలు తీసేసి, గాయాన్ని స్టెరిలైజ్ చెయ్యాలి మేము.”
“డాక్టర్ ఆపరేషన్ మొదలు పెట్టేదాకా కదిలేదే లేదు!”
అన్వర్ గబగబా అతని చొక్కా కత్తిరించి తొలగించాడు. రక్తం బడబడా కారింది.
“స్టెతస్కోప్.”
సమియా అందించడం చూసి, ఆ వ్యక్తులంతా ఒక్కొక్కరు బయటికి నడవడం ప్రారంభించారు. గాయపడిన వ్యక్తి గుండె ఆగి ఆగి కొట్టుకుంటోంది. ‘ఆపరేషన్ చేయకపోతే ఏమవుతుంది? అసలు అతను ఇప్పుడే చచ్చిపోతేనో?’
వీపు మీద గుచ్చుకుంటున్న వస్తువు, అతని ఆలోచనలని ఆపింది. అవతల టేబుల్ మీద మత్తులో పడున్న పేషంట్ కేసి చూశాడు. ఇతని బుల్లెట్ తీసేలోపే అతనికి స్పృహ వచ్చేలా ఉంది. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. గబగబా ఆ యువకుడి ఛాతీ మీద స్కాల్పెల్‌తో గాటు పెట్టాడు.
ఒంటికి అతుక్కున్నట్టున్న సర్జికల్ గౌను విప్పుతూ, తలుపు తీయడానికి ఒక్క క్షణం సందేహించాడు. బయట వాళ్ళు ఎదురుచూస్తుంటారు.
“డాక్టర్!” ఆరుగురు వ్యక్తులు చుట్టుముట్టారు. చేతుల్లో ఆయుధాలు. వాళ్ళ వెనుకగా ఒక ముసలామె, ఒక యువతి. గుండె వేగంగా కొట్టుకోనారంభించింది.
“బుల్లెట్ తొలగించారా?”
“తొలగించాను. దేవుడి దయ వల్ల.”
వాళ్ళు అడిగిన ప్రశ్న అతనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం రానివ్వలేదు. ఇప్పుడు చేయాల్సిన పని ఒక్కటే.
వాళ్ళు అతనికి దారిచ్చి, ఒక్కసారిగా ఆపరేషన్ థియేటర్‌లోకి దూసుకుపోయారు. మెట్ల రెయిలింగ్‌ని గుద్దుకుంటూ అన్వర్ కిందకు పరిగెత్తాడు. కాసేపట్లో వాళ్ళకి తెలుస్తుంది, ఆ బుల్లెట్ అతని రక్తనాళాల్ని చీల్చుకుంటూ పోయి గుండెను పూర్తిగా ఛిద్రం చేసింది. ఎవరు చేయడానికీ ఏమీ లేదక్కడ.
అతని ఆఫీసు గదిలోకి వచ్చి బ్రీఫ్‌కేసు తీసుకుని బయటికి వస్తుండగా, బిల్డింగ్ మేనేజర్ విష్ చేశాడు.
బహుశా చివరి సారి… అతనికి ప్రతిగా విష్ చేస్తూ ఇంటికి పరిగెత్తాడు, స్థిరచిత్తంతో నిశ్చయంతో.
(Improvisations on a missing string లెబనీస్ నవల నుంచి. ఆంగ్లానువాదం: Stuart A Hancox.)