పడి పడి లేచె

అతను కాదు ఆమె కాదు
ఎగసిన మోహార్ణవం జీవనవనాన్ని దహించబోగా
నిజాయితీ కన్నీళ్ళు కొన్నీ
టీచర్స్ హైలాండ్ క్రీమ్ బొట్లు కొన్నీ
కలిసిపోయి రంగులు వెలిసిపోయి
కలిసి తెలుసుకుని మరీ తెలిసి కలుసుకొని

మొదట్లో తియ్యటి నొప్పికి ముసుగేసి ముద్దర్లేసి
సొగసుని మూలుగుల్లోకి మార్చి
కాదూ అవునూల మధ్య కాస్తంత అనువుల మధ్య
అనవసరానికి అవసరపు అంగరఖా తొడిగి
వెలుగుని చీకటి చేసి వెనువెంటనే మరలి చని

ఖస్సున లేచిన కెరటాన్ని
కాక్సిక్స్‌లో ఖననం చేసి
ఆచితూచాననునుంటూ ఆరితేరాననుకుంటూ
ఆరిపోయిందనుకుంటూ మాడి ఊడిపోయిందనుకుంటూ
ఇంకలేదని ఇంకేంలేదని దూసుకుపోతూ చెరిగిపోతూ

టూ క్యూబ్స్ ప్లీజ్
థ్యాంక్యూ ట్లింగ్‌ ట్లింగ్
కోటు బొత్తాలకంటిన పోగులు పీకేస్తూ…


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...