ప్లవకు స్వాగతం

కం.
రమ్మో ప్లవవత్సరమా!
సమ్మోదముతోడ మాదు స్వాగత మాప్యా
యమ్ముగఁ గైకొని శుభసౌ
ఖ్యమ్ముల మాకీయఁ దావకాధ్యక్షతలోన్
ఉ.
కోయిలకల్కియైదువలు కోమలగానముతోడ నీకు నా
ప్యాయనమొప్ప స్వాగతము వల్కిరి లోకమునందు, పూజకై
ఆయితమైరి పుష్పయుతలై సుమనోజ్ఞలతాలతాంగులున్,
వేయరుదెంచ మంచు నిను వేడిరి లోకులు నుత్సుకంబునన్
ఉ.
పూవులతో లతాంగనలు పొల్పుగఁ దీర్చిన దారులందునం
దావులుగుల్కు మారుతరథంబుపయిం జనుదెంచెఁ జైత్రుఁ డాం
ధ్రావనిలోనఁ గాని శిశిరం బిట బాయక యుండె, తీవ్రశై
త్యావిలమై వడంకెఁ దను, వాతని చిన్నెలు గానరావిటన్.
ఉ.
లేవిట వేపపూతలును, లేవిట మావులు, మావిపిందెలున్,
లేవిట తింత్రిణీరసపు లేహ్యములున్, మధురేక్షుదండముల్,
లేవిట క్రొత్తబెల్లములు, లేవెవి గాని ప్రియంబు నీపయిన్
వావిరిగా నెసంగు, నిదె వాంఛితమౌఁగద నీకు నో ప్లవా!
కం.
ముగ్గులు లేవిట, కానీ
అగ్గలమగు సంతసమున నతివలు నీకై
యొగ్గిరి కుసుమాంజలులన్
దిగ్గున రమ్మిక నవాబ్ద! దీవింప మమున్.
తే.
వడకఁగానేమి వలిచేత వపువు లిచట,
లోనఁ గలదోయి వెచ్చనిదైన మనసు
అందుచేఁ బల్కెదము మనసార నీకు
నంచితంబగు నాహ్వాన మభినవాబ్ద!
తే.
పేరునకు దగినట్లుగా పృథ్వి నెల్ల
[1]‘శార్వరం త్వన్ధతమసే ఘాతుకే’- అని అమరము.
అనగా శార్వరమంటే కటికచీకటి యని, చంపునది, హింసించునది యని అర్థములు. శ్రూ హింసాయాం, శృణాతీతి శార్వరమ్ – ‘హిసించునది, చంపునది’ అని ఈశబ్దమునకు వ్యుత్పత్తి. స్త్రీలింగంలో ఈశబ్దము ‘శార్వరీ’ అనే రూపంలో ఉంటుంది. శర్వరీ అంటే రాత్రి, అందుచే శార్వరమ్ అనే తద్ధితరూపానికి రాత్రిసంబంధ మైనదనే అర్థంకూడ వస్తుంది. శార్వరీ అనేది సంవత్సరనామం కూడ.
శార్వరి కరోనరోగపిశాచమునకు
కట్టబెట్టి తానేగెను గుట్టుగాను
అంపుచుండె నందఱి నద్ది యముని కడకు
తే.
అమ్మహామారి కృత్యమ్ము వమ్ము చేసి
మరణభయమును దొలఁగించి ధరణిజనుల
స్వాస్థ్యమును పునరుద్ధరింపంగ నిన్నె
నమ్మియుంటిమి శ్రీప్లవనామకాబ్ద!
తే.
వమ్ముసేయక నీవు మానమ్మకమ్ము
సత్వరంబుగ స్వాస్థ్యంబు జనుల కెల్ల
గూర్చి కూర్చుము క్రొత్త వెల్గులను మాదు
బ్రతుకులందున ప్లవనామవత్సరంబ!

అధస్సూచికలు[+]