సెలయేటి సవ్వడి
అనంతమైన కవిత్వంలోకి అక్షరమై ప్రవేశించే రసవిద్య తెలిసిన కవి మూలా సుబ్రహ్మణ్యం. ఎంత గంభీరమైన విషయాన్నైనా, తనదైన సున్నితపు శైలిని విడిచిపెట్టుకోకుండా చెప్పడం, సమకాలీన కవిత్వపు బిగ్గరితనం తన కవిత్వంలోకి చొరబడకుండా సౌకుమార్యాన్నే బలమైన తెరగా అడ్డుంచుకోగల్గడం ఇతని కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
సానుభూతి అంచుల్లో సంతోషం/ అభినందనల అడుగున అసూయ నింపుకు సంభాషించే లోకాన్ని మెత్తగా ఎత్తిపొడుస్తూనే దయగా మార్గాంతరమూ చెప్పిన గుప్పెడు మిణుగురులు అన్న కవితను గమనిస్తే, ఇతని కవిత్వ లక్షణం, బలం తేలిగ్గా అర్థమవుతాయి.
సముద్రమో నదో అక్కర్లేదు
చిన్న నీటి చెలమ
కన్నుల్లో
సూర్యుడో చంద్రుడో అక్కరలేదు
గుప్పెడు మిణుగురులు
గుండెల్లో…
చాలు!
ఆ చాలు అన్న ఒక్క చిన్న పదంలో మిణుగురు కాంతైనా లేని చీకటి బ్రతుకుల మీద ఎట్లాంటి విసురు, ఎట్లాంటి ఓదార్పు!
ఇస్మాయిల్‍గారు టాగూర్‌ను సదాబాలకులు అన్నారని మనకు తెలుసు. అయితే మంచి కవులందరూ సదాబాలకులే. వాళ్ళలో పసితనపు సమ్మోహనత్వమేదో నిలిచే ఉంటుంది. ఆ పసితనపు స్వచ్ఛత సూదంటురాయిలా ఆకర్షించినట్టు, వీళ్ళ కవిత్వం కూడా పాఠకులను లాగుతూ ఉంటుంది. ఈ సంపుటిలో కూడా ఇదే ప్రధాన ఆకర్షణ. పసితనమే ఆవరణగా ఆడుకున్నట్టుండే అక్షరాలతో వెలిగిపోయే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. వాళ్ళకే సాధ్యమనిపించే ఒక అమాయకమైన ప్రేమ, కుతూహలపు పరిశీలన, ఈ కవితల్లో కనిపిస్తాయి. బలవంతంగానో, రివాజుగానో, తరచి చూసుకునేందుకు క్షణమైనా వీలు మిగుల్చుకోలేని రద్దీలోనో బ్రతుకును వెళ్ళదీసే మనుషులను ఆపి, వాళ్ళు మర్చిపోయిన రోజువారీ అందాలను, అద్భుతాలను దర్శింపజేసే శక్తి కలిగిన వాక్యాలివి.
మెల్లగా
మెల్లగా
మెల్లగా
ఒక్కో పూవు విచ్చుకుంటుందని
సూర్యోదయమవుతుంటే
ప్రతి కొండా అరుణాచలమేనని
చెప్పే కవిత ఈ కోవలోనిదే.
స్వభావసిద్ధంగా ఏ లక్షణాలైతే పిల్లల ముఖాలు చూడగానే మన ముఖాలను వెలిగిస్తాయో, ఏ అమాయకత్వం తేటదనం అకారణమైన ప్రేమను వాళ్ళ పట్ల కలిగేలా చేస్తాయో, అవే లక్షణాలను ప్రతిభావంతంగా కవిత్వంలోకి తేగలిగారీ సంపుటిలో. చంటిబిడ్డల తల్లిదండ్రులు ఇట్టే స్వంతం చేసుకోగల కవితలకు ఉదాహరణలు: చిట్టి కవితలు, చిచ్చుబుడ్డి, నీలో నేను మొదలైనవి.
పాకడమైనా రాని నువ్వు
ఎక్కడెక్కడి లోకాలకో
ఆనందంగా
నీ వెనుక నేను
ఇందులోని చాలా కవితలు లోకం పట్ల చూపుని మారుస్తాయి. కాగితంపూల ఏ బరువూ లేని నవ్వులను, వరిచేను గట్టుపై ఒంటరి సైనికుడి లాంటి కొబ్బరిచెట్లను, వీధి దీపాల కాంతిలో మెరిసే వానచినుకులనూ గమనించగలిగిన కొత్త చూపునిస్తాయి. నిద్రపోయే పసిపాప రెప్పల వెనుక ఎన్ని అద్భుతలోకాలున్నాయోనన్న కవ్వింపు ఊహను ముందుంచి పాఠకుల ఊహల్లోనూ లిప్తకాలం పాటు అద్భుతాలను చిత్రిస్తుందీ కవిత్వం.
పసిపాప తప్పటడుగుల్లో ప్రపంచాన్ని బంధించే లయ ఉందని పసితనం మిగుల్చుకోలేని కవులు అనలేరు. ఇప్పటిదాకా నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయి/ నీతో మాట్లాడేందుకే ఓ కొత్త భాషని సృష్టించుకుంటాను అనేందుకు నిరహంకారము, ప్రేమలతో పాటు గొప్ప శక్తి కూడా కావాలి. చిత్రంగా ఈ పాదాలు, ఈ భావాలే అతని కవిత్వానికీ అన్వయించుకోవాలి. తేలిక పదాలకు అంతులేని బలం ఉంటుందని, ఒక పాఠకుడితో సంభాషించడానికి, అతని మానసిక ఆవరణలోకి ప్రవేశించడానికీ ప్రతి కవీ తనదైన ఓ కొత్త భాషను సృష్టించుకోవాలనీ తెలిసే రాసిన కవిత్వం సెలయేటి సవ్వడి. కవిత్వంలో ఇస్మాయిల్ పరిచిన తోవ అందం తెలిసిన వాళ్ళకి తప్పకుండా నచ్చే తావు ఈ సెలయేటి సవ్వడి. సామాజిక రాజకీయ అంశాలకు దూరంగా, సంక్లిష్టతకు, అస్పష్టతకు చోటు లేకుండా, హాయిగా అలవోకగా సాగినట్టున్న ఈ తేట తేట కవితల పుస్తకం వివరాలు:
రచయిత: మూలా సుబ్రహ్మణ్యం
ప్రచురణ: ఆన్వీక్షికి పబ్లిషర్స్
ప్రతులకు: ఆమెజాన్ మరియు నవోదయ బుక్ హౌస్
ధర: రూ. 100