‘నేను’ అంటే…?
అడుగుతోంది పాప.
నవ్వాన్నేను.
నువ్వంటే…
కొంచెం అమ్మ, కొంచెం నాన్న
కొంచెం తాతయ్యలు, అమ్మమ్మ నానమ్మలూ
కొంచెం నువు పుట్టిన వూరు
ఇంకొంచెం నువు పెరిగిన ఇల్లూ…
మరి నా బొమ్మలూ, చాక్లెట్లూ…
మళ్ళీ నవ్వాను.
అవి కూడా.
ఇంకా నీ నవ్వులు, నీ కన్నీళ్ళూ
నీ జాలీ నీ ప్రేమా…
మరి నా బుజ్జిబుగ్గలూ, నా బుంగమూతీ?
అవే కాదు.
నీ కోపం, నీ కరుణ, నీ ప్రేమ…
మరీ, మరీ… నేను అంటే నువ్వు కూడా కదా?
అవును.
నువ్వు అంటే నేను కూడా! అన్నాన్నేను
చటుక్కున కంటి చివర మెరిసిన జ్ఞానాన్ని అద్దుకుంటూ.