వడిసెట్లో రాయి

కట్టు తెంచుకుని ఒక మనసు గుట్టు విప్పుకుంది
గట్టు తెగి ఒక కన్నీటిబొట్టు మళ్ళీ లోపలికే జారింది

యే హై దునియా యహా కిత్‌నే ఎహ్ల్-ఎ-వఫా
బేవఫా హోగయే దేఖ్‌తే దేఖ్‌తే
*

చాలాసేపు అలా కొమ్మనుంచి కొమ్మకి ఎగురుతూ అంగలార్చుతూ తబ్బిబ్బయ్యాను. అంతసేపూ తొణక్కుండా విగ్రహమై నన్ను జావగార్చింది. కొద్దికొద్దిగా వీడదామనుకున్నా ప్రాణం ఆమెలోనే ఇంకుతోంది మరి. ఒక్కసారి పైట ఝాడించి పూర్తిగా ఎండపాల్జేసింది.

వెన్నెట్లో స్వరాలు పేని తేనెలద్ది అందించానా
ఆనుకోబోతున్న మేకని అదిలించినట్లు
ఒక్కసారి విదిలించేసింది

ఎన్నోసార్లు అలానే కళ్ళప్పగించి మూగగా పరిభ్రమించాను. అన్నిసార్లూ తను మరో వైపు చూపు తిప్పుకుంది. ఎన్నో అక్షరాల మాలలు చుట్టి తన పడవలో పరిచాను. అన్నిసార్లూ తను మరో తీరానికి సాగిపోయింది. ఎన్నోసార్లు అడగకనే అగ్నిలో ప్రవేశించాను. అన్నిసార్లూ తను ఉడెకొలోన్ అద్దుకుంటూ పరవశించింది.

నా ధోరణికి ఒక బాటని చెక్కి
ఓరచూపులేవీ చూడకనే
మెడవంచి కూర్చుంది మేళాల మధ్య
ఎవరో పైకెత్తేరు పూలజడని.

పాట హుష్ కాకి!

(*నుస్రత్ ఫతేఅలీఖాన్ ఖవ్వాలీనుంచి)