గ్రీకు పురాణ గాథలు 5

హిందూ పురాణ గాథలలో సృష్టి జరిగిన విధానం

ఇంతవరకు చదివిన తరువాత, గ్రీకు పురాణ గాథలలో అస్తవ్యస్త పరిస్థితి నుండి సృష్టి జరిగిన విధానం, సంతానోత్పత్తి కొరకు మొదటి జంట ఏర్పడిన విధానాలలోని ఆచార వ్యవహారాలు చూస్తే కాసింత ఆశ్చర్యం, కాసింత జుగుప్స పుట్టుకొస్తాయి. ఇటీవలి కాలంలో డార్విన్ ప్రవచించిన పరిణామ సృష్టివాదం బలం పుంజుకొనక పూర్వపు రోజులలో మానవుడి పుట్టుక గురించి మనకి ఉన్న అవగాహన పూజ్యం. ఉదాహరణకి ఒక పురాణంలో సృష్టి ఎలా ప్రారంభం అయిందని చెప్పేరో చూద్దాం*.

శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టేడు. శ్రీమన్నారాయణుడు ఎలా పుట్టేడని అడగొద్దు. ఆద్యంతాలు లేని సర్వాంతర్యామి ఆయన!

బ్రహ్మ మనస్సులోంచి (గ్రీకు కథనంలో ‘శిరస్సుని చీల్చుకుని’ అన్న ప్రయోగం ఉత్ప్రేక్ష అయి ఉంటుంది.) పుట్టినవారిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వీరు ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం ఒకొక్క పురాణంలో ఒకొక్కలా ఉంది. దత్తాత్రేయ పురాణం ప్రకారం అలా బ్రహ్మ మనస్సులోంచి పుట్టుకొచ్చినవారే సప్తమహర్షులు. బ్రహ్మ నీడ లోంచి కర్దమ ప్రజాపతి అనే పురుషుడు ఉద్భవించేడు. బ్రహ్మ దక్షిణ భాగం నుండి స్వాయంభువ మనువు అనే పురుషుడు జన్మించేడు. కనుక స్వాయంభువ మన్వంతరంలో సప్తమహర్షులు, కర్దమ ప్రజాపతి, స్వాయంభువ మనువు బ్రహ్మ కొడుకులే కదా! (ఇక్కడ లెక్క స్వాయంభువ మన్వంతరం ప్రకారం అని గమనించ గోరుతాను. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరంలో సప్తమహర్షులు వేరు; వారు కశ్యప, అత్రి, వసిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ. వీరు బ్రహ్మ మానసపుత్రులు కారు.)

బ్రహ్మ వామభాగం నుండి శతరూప అనే స్త్రీ ఆవిర్భవించింది. అనగా, శతరూప మొదటి స్త్రీ. స్వాయంభువ మనువు శతరూపని వివాహం చేసుకుంటాడు. వీరు ఆదిదంపతులు. అనగా స్వాయంభువ మనువు తన సోదరిని పెళ్ళి చేసుకున్నాడన్నమాట! ఇది మొదటి జంట.

ఆదిదంపతులకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కొడుకులు, అకూతి, దేవహూతి, ప్రసూతి అనే కూతుళ్ళు పుట్టేరు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన రుచి అకూతిని వివాహం చేసుకుంటాడు. అనగా, రుచి తన సోదరుడికి, సోదరికి మధ్య ఉన్న వైవాహిక బంధం వల్ల పుట్టిన కుమార్తెని పెండ్లి చేసుకున్నట్లే కదా! ఇది రెండవ జంట.

కర్దమ ప్రజాపతి దేవహూతిని వివాహం చేసుకుంటాడు. ఇది మూడవ జంట. ఈ మూడవ జంటకి తొమ్మండుగురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగేరు. ఈ కుమార్తెల పేర్లు: కల, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఊర్ధ్వ, చితి, భ్యాతి. విష్ణువు అంశతో పుట్టిన కుమారుడు కపిలుడు.

బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన అత్రి, ఈ తొమ్మండుగురులో రెండవ అమ్మాయి అనసూయ నాలుగవ జంట! అత్రి ఒక విధంగా తమ్ముడి కూతుర్నీ మరొక విధంగా మనవరాలినీ పెళ్ళాడినట్లే కదా!

అత్రి ఆయుర్వేదాన్ని సృష్టించిన మహాముని. ఊర్ధ్వరేతస్కుడైన అత్రి తేజస్సు భావనాపూర్వక మిథునం ద్వారా అతని కంటినుండి కిందకి పడబోతుండగా వాయుదేవుడు దానిని అనంతంలోకి విసిరికొట్టాడు. దిగంగన దానిని స్వీకరించి, గర్భం ధరించి, బ్రహ్మంశతో అమృత స్వభావుడు, ఓషధీ గణపతి, రజోగుణ ప్రధానుడు అయిన చంద్రుడిని కన్నది.

అత్రి, అనసూయల మరొక పుత్రుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాంశలతో, మూడు శిరస్సులతో జనియించిన దత్తాత్రేయుడు. మహా శక్తిసంపన్నుడు.

అత్రి, అనసూయలకు శివాంశతో పుట్టిన మూడవ పుత్రుడు నిర్లిప్తుడు, మహాకోపి అయిన దుర్వాస మహాముని.

దత్తాత్రేయ పురాణంలో ఉన్న ఈ అంశాలు చాలు సృష్టి ఎలా ఆరంభమయి, విస్తరించిందో చెప్పడానికి! వేదాలలో దృక్పథం వేరుగా ఉంటుంది. ఉపనిషత్తులలో మరొక విధంగా ఉంటుంది. ఇతర పురాణాలలో ఇదే సంగతి మరొక విధంగా ఉంటుంది.

ఈ కోణంలో చూస్తే గ్రీకు పురాణం గాథలు అంత ఏవగింపుగా అనిపించవు.

(*ఆధారం: 1. మేనమామ బిడ్డ – పింగళి రమణరావు (ఎలక్ట్రాన్), ఆంధ్రప్రదేశ్, జులై 1999. 2. విలువల వెల ఎంత? (కథాసంకలనం), వాహిని బుక్ ట్రస్ట్, హైదరాబాద్, 2006.)

అపస్వరం అనే ఏపిల్ పండు కథ

గ్రీకు పురాణ గాథలలో ఒక కథ ఇది. ప్రస్తుతం టర్కీ దేశం ఆక్రమించిన ప్రాంతాన్ని పూర్వం ఏసియా మైనర్ అనేవారు. ఈ ప్రాంతపు ఈశాన్య మూలకి ట్రాయ్ అనే నగరం ఉండేది. గర్భవతిగా ఉన్న ఈ నగరపు రాణి హెకూబా (Hecuba) ఒక రాత్రి ఒక వింతైన జ్వాలని ప్రసవించినట్లు కల కన్నది. రాజు ఆస్థాన జ్యోతిష్కుడిని పిలిపించి కలకి అర్థం చెప్పమని అడిగేరు. ‘రాజా! రాణివారు ప్రసవించబోయే బాలుడు ట్రాయ్ నగరపు వినాశనానికి కారకుడు అవుతాడు! ఈ రాజ్యాన్ని, ప్రజలని రక్షించుకోవాలంటే ఈ బాలుడిని హతమార్చవలసిందే.’ అని జోస్యంతో పాటు ఆయన సలహా కూడా చెప్పేడు.

భూపతనమైన వెంటనే బాలుడిని హతమార్చమని భటుడికి ఆదేశం ఇచ్చేడు రాజు. ముక్కుపచ్చలారని పసికందు ప్రాణాలు తియ్యలేక భటుడు ఆ పసికూనని ఇడా పర్వతం మీద ఒక చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పసికందుని ఒక ఎలుగుబంటి చూసింది. పాపని చూసి, జాలిపడిందో ఏమో రాత్రల్లా కాపలా కాసింది. మరునాడు బాలుడు ఏమయ్యాడో చూద్దామని భటుడు తిరిగివచ్చేడు. ఆ బాలుడు ప్రాణాలతో కనిపించేసరికి ’ఈ బాలుడు భవిష్యత్తులో ఏదో సాధించవలసి ఉంది. అందుకనే ప్రాణాలతో బయట పడ్డాడు’ అనుకుంటూ ఆ పసివాడిని రహస్యంగా తన ఇంటికి తీసుకెళ్ళి పెంచుకున్నాడు. శుక్లపక్ష చంద్రుడిలా పెరిగిన పేరిస్ (Paris) స్ఫురద్రూపి, సత్యసంధుడు, శీలవంతుడుగా ముల్లోకాలలోను పేరు తెచ్చుకున్నాడు.

పందేలలో పోటీకని పేరిస్ కోడె దూడలని పెంచేవాడు. పందెంలో తన గిత్తని ఎవ్వరి గిత్త ఓడగొడితే వారికి బంగారు కిరీటం బహుమానంగా ఇస్తానని పేరిస్ ఒకసారి సవాలు విసిరేడు. స్వర్గలోకంలో ఉన్న ఆరిస్ (Ares) ఈ సవాలు విన్నాడు. తానే స్వయంగా ఒక గిత్త రూపం దాల్చి పోటీలోకి దిగేడు. యుద్ధాలకి అధినేత అయిన ఆరిస్ ఈ పోటీని అనాయాసంగా గెలిచేడు. పేరిస్ పెద్దమనిషి తరహాలో ఓటమిని అంగీకరించి ఆరిస్‌కి బంగారు కిరీటాన్ని బహూకరించేడు. ఈ సంఘటనతో సత్యసంధుడు, మాట తప్పని పెద్దమనిషి అని పేరిస్ భూమి మీద, స్వర్గంలోనూ పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నాడు. ఇలాంటి పేరు రావడంతో ఒక అనూహ్యమైన పందేనికి పేరిస్ ఎలా న్యాయనిర్ణేత అయేడో చూద్దాం.

స్వర్గానికి అధినేత జూస్ భార్యలలో ఒకరైన థేమిస్ (Themis) జూస్ కొడుకులలో ఒకడు జూస్‌ని పదవీభ్రష్టుడిని చేస్తాడని జోస్యం చెప్పింది. ఈ జోస్యం ఇలా ఉండగా జూస్ ఒక రోజు సముద్రపుటొడ్డుకి విహారానికని వెళ్ళి, అక్కడ థేటిస్ (Thetis) అనే జలకన్యని చూసి మనసుపడి, గాంధర్వ విధిని పెళ్ళి చేసుకుంటానంటాడు. అప్పుడు థేటీస్‌కి పుట్టబోయే కొడుకు తండ్రిని మించినవాడు అవుతాడు అని మరొకరు జోస్యం చెప్పేరు. జూస్ రెండు రెండు కలిపితే నాలుగు అని లెక్క వేసుకుని, పెద్ద ఎత్తున కంగారుపడి, థేటిస్‌ని పీలియస్ అనే ముసలి మానవుడికి ఇచ్చి పెళ్ళిచెయ్యడానికి తాంబూలాలు ఇప్పించేసేడు. విందుకి జూస్ అందరినీ ఆహ్వానించేడు, కలహభోజని అని పేరు తెచ్చుకున్న ఒక్క ఏరీస్‌ని (Eris) తప్ప!

తనకి ఈ విధంగా జరిగిన అవమానానికి ఏరీస్ కోపోద్రిక్తురాలు అయింది. అసహనంతో రగులుతున్న ఏరీస్ అతిథులు బారులు తీర్చి భోజనాలు చేస్తున్న మందిరానికి గాలివానలా దూసుకు వచ్చింది. ఆమె లోపలికి రాకుండా హెర్మీస్ (Hermes) అటకాయించి అగ్గి మీద గుగ్గిలం జల్లేడు. ఏరీస్ బయట నుండే ‘ఇదే నా పెండ్లి కానుక’ అంటూ ఒక బంగారు ఏపిల్ పండుని అతిథుల మధ్యకి విసిరింది. ఆ బంగారు ఏపిల్ పండు మీద ‘ఇది ముల్లోకాలలోను అందమైన ఆడదానికి మాత్రమే’ అని రాసి ఉంది. ఇంకేముంది. ఆ పండు నాదే! అంటూ అక్కడ ఉన్న దేవతలంతా ఎగబడ్డారు. ఆ దొమ్మీలో హేరా, ఎతీనా, ఏఫ్రొడిటి అనే ముగ్గురు దేవతలు ఆ పండుని స్వాధీనపరచుకుందుకి పోటీపడ్డారు. హేరా సాక్షాత్తు జూస్ భార్య. పైపెచ్చు పట్టమహిషి. ఈమె స్త్రీలకి, వివాహ జీవితాలకి అధినేత్రి. ఎతీనా విద్యలకి అధినేత్రి. ఏఫ్రొడిటి అందాలకి దేవత.

ఈ ముగ్గురిలోను పండు ఎవ్వరికి చెందాలి? ముగ్గురూ దేవతలకి రాజైన జూస్‌ని తీర్పు చెప్పమన్నారు! జూస్‌కి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఎవరి పక్షాన్న తీర్పు చెబితే ఎవ్వరికి కోపం వస్తుందో! వారిలో ఒకామె తన భార్య కూడా!

’ఈ సమస్యని న్యాయబద్ధంగా పరిష్కరించగలిగే స్థోమత భూలోకంలో ఉన్న ఒక్క పేరిస్‌కి తప్ప మరెవ్వరికీలేదు’ అంటూ తన కొడుకు హెర్మీస్‌ని తోడు ఇచ్చి అందరిని భూలోకంలో ఇడా పర్వతం మీద ఉన్న పేరిస్ దగ్గరకి పంపి ఇబ్బంది నుండి తప్పుకున్నాడు జూస్!

సాక్షాత్తు స్వర్గలోకానికి అధిపతి అయిన జూస్ తనయుడు హెర్మీస్ స్వయంగా వచ్చి అడుగుతూ ఉంటే పశువులని కాసుకుంటూన్న పేరిస్ కాదనలేకపోయేడు. దేవతల ముందు నిలబడి ముగ్గురిని పరకాయించి చూస్తున్నాడు. దేవతలు ముగ్గురూ ఎలాగో ఒకలాగ పేరిస్‌ని మభ్యపెట్టి తీర్పు తమవైపు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

“నన్ను ఎంపిక చేస్తే నిన్ను ఐరోపాకీ, ఆసియా మైనరుకి చక్రవర్తిని చేస్తాను.” అని ఆశ పెట్టింది హేరా.

ఎతీనా ముందుకి వచ్చి, “నీకు విద్యాబుద్ధులు ప్రసాదిస్తాను. యుద్ధరంగంలో తిరుగులేని అస్త్రాలు ఇస్తాను.” అని ఎర చూపించింది.

చిట్టచివరికి తన కురులని సుగంధం వెదజల్లే పువ్వులతో అలంకరించుకున్న ఏఫ్రొడిటి ముందుకి వచ్చి, “పేరిస్! నువ్వు నన్ను ఎన్నుకున్నావంటే నీకు మరపురాని అనుభవాన్ని ప్రసాదిస్తాను. స్త్రీ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చవి చూపిస్తాను. స్పార్టా రాణి హెలన్‌ని (Helen of Sparta) మించిన అందగత్తె ఈ భూలోకంలో లేదు. ఆమె పొందు నీకు దక్కేలా వరం ఇస్తాను. ఆమె నీ సందిట బందీ అయేలా చేస్తాను. ఏమంటావు?” అంటుంది

హెలెన్ అసాధారణమైన అందగత్తె. ఆమె చేతినందుకోవడం కోసం ఎందరో యువకులు ఉవ్విళ్ళూరేవారు. శూరులు, వీరులు, మేధావులు, ఒకరేమిటి? ఎవరిని ఎన్నుకుంటే ఎవరికి కోపం వస్తుందో? హెలెన్‌ని వరించడానికి వచ్చిన యువరాజులందరి దగ్గర మెనలౌస్ (Menelaus) ఒక హామీ తీసుకున్నాడు. భవిష్యత్తులో ఈ కొత్త దంపతులకి ఏ ఆపద వచ్చినా అందరూ సైన్యసమేతంగా వచ్చి హెలెన్‌ని రక్షించాలి. అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు హెలెన్ తండ్రి టిండరియుస్ (Tyndareus) స్పార్టా రాజైన మెనలౌస్‌ని హెలన్ భర్తగా ఎంపిక చేసేడు.

ఇలా పెళ్ళి అయిపోయి, కాపురం చేస్తున్న హెలెన్‌ని పేరిస్‌ని ప్రేమించేలా చేస్తుంది ఏఫ్రోడిటి. ఈ సంఘటన మహాభారత యుద్ధాన్ని పోలిన మహాసంగ్రామానికి దారి తీసింది. గ్రీకులకి, ట్రాయ్ నగరానికి మధ్య జరిగిన ఈ భీకర పోరాటాన్ని హోమర్ అనే రచయిత తన ఇలియడ్, ఆడెస్సీ అనే ఉద్గ్రంథాలలో పొందుపరిచేడు. ఈ కథలో కొన్ని పాత్రలు భువి నుండి దివికి, దివి నుండి భువికి సునాయాసంగా తిరుగుతూ ఉంటాయి. దేవతలు పోటీ పడి, పందెం కట్టి, దాని పర్యవసానంగా భూమి మీద లక్షలాది ప్రజలు నాశనం అవడానికి కారణభూతులు అవుతారు.

(సశేషం)

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...