భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం

ముందుమాట

వోల్టేర్ రాతని ‘నోటిమాటకి వర్ణచిత్రం (painting of the voice)’ అన్నాడు. నిజమే, రాత కేవలం మాటకు శాశ్వత రూపాన్నిచ్చే పరికరం మాత్రమే కాదు. రాత ఈనాడు ఒక పరిణతి చెందిన అపురూపమైన కళారూపం. రాత సమాజంలో మానవ విజ్ఞాన సారస్వతాలకు వారధి. రాత సాంఘిక వ్యవస్థలలో ప్రజాస్వామిక సమాచార వ్యవస్థ.

రాత అనేది లేకపోతే సమాచారాన్ని పెద్దయెత్తులో భద్రపరచడం బహుశా సాధ్యం కాదు. ఆధునిక సమాజాల ఏర్పాటు, పెరుగుదలలలో రాత ప్రధానమైన సాంకేతిక సాధనం. రాయడం లేకపోతే పుస్తకాలనేవి లేవు. డప్పు వాయిస్తూ, ఊరంతా తిరుగుతూ రాజ శాసనాలనో, దానాలనో దండోరా వేస్తే పదిమందికీ తెలుస్తుంది. కానీ ఆ శాసనాలో, దానాల వివరాలో కలకాలం చెక్కు చెదరకుండా ఉండాలంటే, మనుషుల నోటిమాటకతీతంగా దానికంటూ ఒక శాశ్వతరూపం కావాలి. పాలించేవాడి మాట రాజ్యం నలుమూలలా విస్తరించడానికి దండోరాలు సరిపోయినా, రాజవాక్కు నిర్ద్వంద్వంగా పదికాలాల పాటు నిలబెట్టడానికి శాసనాలు అవసరమయ్యాయి.

ఒక దశాబ్దం క్రితం వరకూ లైబ్రరీలు, ఇప్పుడు ఇంటర్నెట్టు విజ్ఞాన సర్వస్వం. కాని, ఒకప్పుడు సమాచార వ్యవస్థతో సంబంధమున్న వ్యక్తులే విజ్ఞాన భాండాగారాలు. గురువులు, గణాచారులు, పూజారులు, పురోహితులు, ఉపాధ్యాయులు, మునులు, కళాకారులు — వారికి సమాజంలో ఎంతో విలువ ఉండేది. ఈ నాటికీ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. పరిపాలనా రంగంలోను, కార్పొరేట్ కంపెనీలలోను కనపడే లాబీయిస్టులు, స్పిన్ డాక్టర్లు, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల దగ్గర నుండి విలేకరులు, రచయితలు, వ్యాఖ్యాతలు చేస్తున్న పని కూడా అదే. అయితే, ఇప్పటి సమాచార విప్లవం లాగానే రాత మూలంగా వచ్చిన మార్పులు కూడా అన్ని సంస్కృతులలోనూ ఒకే రకంగా జరగలేదు. ముందు రాతతో రాజీపడడానికి, అటుపైన దాన్ని సొంతం చేసుకోడానికి ఒక్కో సమాజం, సంస్కృతి ఒక్కోలా స్పందించాయి.

రాత మూలంగా మానవచరిత్రలో సంభవించిన మౌలికమైన మార్పులని విపులంగా చర్చించడం, ముఖ్యంగా అటు పాశ్చాత్య సంస్కృతి లిఖిత వ్యవస్థని ఆకళించుకున్న తీరు, ప్రాచ్య సమాజాలు, ముఖ్యంగా మనం, లిఖిత సంస్కృతికి స్పందించిన తీరులోనూ ఉన్న మౌలికమైన భేదాలని విపులంగా ప్రదర్శించడం, రాబర్ట్ డార్న్‌టన్ సమాచార వలయం (Communication Circuit), మన సంస్కృతికి అన్వయిస్తూ, భారత సంస్కృతిలో రాతపుట్టుక నుంచీ, నేటి డిజిటల్/ఇంటర్నెట్ టెక్నాలజీలు పుస్తకాలని, పుస్తకాలతో ముడిపడ్ద సమాచార వ్యవస్ఠలనీ ఈ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించడం ఈ వ్యాస పరంపర ప్రధాన లక్ష్యం.


పుస్తక చరిత్ర

“అచ్చు ద్వారా నిర్వహింపబడే సమాచార వ్యవస్థల సామాజిక, సాంస్కృతిక చరిత్ర అంతా పుస్తక చరిత్రే” అని 1982లో డార్న్‌టన్ (Robert Darnton), What is book history? అనే పరిశోధనా వ్యాసంలో ప్రతిపాదించాడు [1]. డార్న్‌టన్ వ్యాసం పుస్తక చరిత్ర రచనలో ఒక మైలురాయిగా పరిగణిస్తారు. అప్పటివరకూ, పుస్తక చరిత్రకంటూ ఒక ప్రత్యేకమైన విభాగం లేదు. కొంతమంది సాహిత్య చరిత్రలో భాగం గానూ, కొందరు సామాజిక చరిత్రలో భాగం గాను, మరికొందరు గ్రంథాలయశాస్త్రంలో భాగం గానూ అధ్యయనం చేశారు. పుస్తక చరిత్రని శాస్తీయంగా అధ్యయనం చెయ్యడానికి ఒక విధివిధానాన్ని ఏర్పరిచిన ప్రముఖుల్లో డార్న్‌టన్ ఒకడు.

మనిషి ఆలోచనలు, భావనలు ఏ విధంగా ముద్రణామాధ్యమం ద్వారా ప్రసారం అయ్యేవి? గత ఐదువందల ఏళ్ళగా ముద్రణామాధ్యమం ఏ విధంగా మన ఆలోచనలని ప్రభావితం చేస్తోంది, అచ్చులో చదివే రచనలు మన ఆలోచనలని, సంస్కృతిని, సమాజాలని ఎలా ప్రభావితం చేస్తున్నాయి — అనే ప్రశ్నలకి సమాధానాలు చారిత్రక దృక్పథంతో అన్వేషించడం పుస్తక చరిత్ర లక్ష్యం. డార్న్‌టన్ తన వ్యాసంలో పుస్తక చరిత్ర పరిధిని అచ్చుయంత్రం కనిపెట్టిన తరువాతి దశకి పరిమితం చేసినా, ఇప్పుడు పుస్తక చరిత్రని అధ్యయనం చేస్తున్న పరిశోధకులు, రాత పుట్టుక, గ్రీకు, లాటిన్, యూరోపియన్ సమాజాల్లో, ముఖ్యంగా, రెండో శతాబ్దంలో రోమన్లు కనిపెట్టిన కోడీసుల (Codices) (విడి విడి తోలుపత్రాలు కలిపి కుట్టి, ఎడం వైపు బైండింగు చేసిన తోలు పత్రాల పుస్తకం) వరకూ పుస్తక చరిత్ర పరిధిని విస్తరించారు.

పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో, గత ముప్పై ఏళ్ళలో పుస్తక చరిత్ర కోసం ప్రత్యేకమైన విభాగాలేర్పడ్డాయి. ఈ రంగం కోసం ప్రత్యేకించి ఎన్నో విద్యావైజ్ఞానిక పత్రికలు (Academic Journals) ఉన్నాయి [2]. కేవలం పుస్తక చరిత్ర కోసం కొన్ని పరిశోధక సంఘాలు కూడా ఏర్పడ్డాయి. విశ్లేషణా గ్రంథసంచయం (Analytical Bibliography) ఒకవైపు, సామాజిక విజ్ఞానశాస్త్రం (Sociology of knowledge) మరొకవైపు, చరిత్ర, తులనాత్మక సాహిత్యం మరింకొకవైపు లాగుతూంటే అధ్యయనం చేద్దామని వేసే ప్రతి అడుగూ కొత్త దారుల వెంట తీసుకుపోతుంటుంది. ఇలా ఈనాడు, పుస్తక చరిత్ర శాఖోపశాఖలుగా విస్తరించింది. కాని, తెలుగులో, ఇంతవరకూ పుస్తక చరిత్ర పైన చెదురుమదురు వ్యాసాలే తప్పించి సమగ్రంగా, చారిత్రక దృక్పథంతో జరిగిన అధ్యయనాలు లేవనే చెప్పాలి.

తిరుమల రామచంద్ర లిపి పుట్టుపూర్వోత్తరాలు, భారతి, త్రిలింగ, పత్రికల్లో అచ్చుయంత్రం, తెలుగు లిపి సంస్కరణలు, ముద్రణ కళపై వచ్చిన కొన్ని వ్యాసాలు, సమగ్ర ఆంధ్రసాహిత్యంలో ఆరుద్ర ఇచ్చిన కొంత సమాచారం, మంగమ్మ తెలుగులో తొలినాటి ప్రచురణ రంగం మీద ప్రచురించిన పుస్తకం తప్పించి, మనకి పుస్తక చరిత్రపై చెప్పుకోదగ్గ రచనలు లేవు. ఆమాటకొస్తే భారత దేశంలోనే పుస్తక చరిత్రపై వచ్చిన పుస్తకాలు తక్కువ, అవి కూడా అన్నీ కేవలం అచ్చు పుస్తక చరిత్రను మాత్రమే చెప్పినవి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన పేర్లు: తొలినాటి అచ్చుయంత్రాల గురించి వివరంగా చెప్పిన ప్రియోల్కర్ (Anant K Priolkar) [3], భారతదేశంలోనే అతి పెద్ద ప్రచురణ సంస్ట అయిన నావల్ కిషోర్ సంస్థ చరిత్రని చెప్పిన ఉల్‌రిక స్టార్క్ (Ulrike Stark) [4], తొలినాటి హిందీ, ఉర్దూ పత్రికల చరిత్రని చెప్పిన ఫ్రాంచెస్కా ఒర్సీని (Francesca Orsini) [5], చవకబారు పుస్తకాలుగా భావించబడే (బెంగాలీ) గుజలీ ప్రతులు చరిత్ర చెప్పిన అనిందితా ఘోష్ (Anindita Ghosh) [6], తమిళంలో పుస్తక చరిత్రపై గొప్ప పరిశోధన చేసిన వెంకటాచలపతి (A.R. Venkata Chalapthy)[7], తొలినాటి కాగితపు తయారి గురించి చెప్పిన అలగ్జాండ్రా సొటెరో (Alexandra Soutereu)[8]. ఈమధ్యకాలంలో, అభిజిత్ గుప్తా, స్వపన్ చక్రవర్తి కలిసి పుస్తక చరిత్ర గురించి రెండు వ్యాస సంకలనాలు తీసుకొనివచ్చారు [9]. (భారతీయ పుస్తక ప్రచురణ చరిత్రపై వివరంగా తరువాతి భాగాల్లో చర్చిస్తాం.)

డార్న్‌టన్ సమాచార వలయం

రచయితతో (Author) మొదలై, ప్రచురణకర్తలు (Publishers), ముద్రణ వ్యవస్థ (Printers), పంపిణీదారులు (Distributors), వ్యాపారుల (Sellers) ద్వారా పాఠకుడిని (Reader), పాఠకుడిని/ పాఠకసమాజాలని తిరిగి రచయితతోనూ కలిపే మొత్తం ప్రక్రియనంతా — సమగ్రంగా గానీ, సూక్ష్మంగా దేనికది లోతుగా గానీ — ప్రభావితం చేసే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలని, వాటి దేశ-కాల పరిస్థితులతో మేళవిస్తూ పరిశోధించే విధివిధానాన్ని, సమాచార వలయం (Communication Circuit) అని నిర్వచించాడు డార్న్‌టన్. ఈ సమాచార వలయం రచయిత మదిలో మెదిలిన ఒక ఆలోచన సందేశంగా అక్షరరూపం దాల్చి, ఆ అక్షరాలు సమాచారంగా అచ్చులో ముద్రించబడి పాఠకుడిని చేరి తిరిగి ఆలోచనగా మారే పూర్తి చట్రం.


1. డార్న్‌టన్ సమాచార వలయం. (వివరం కోసం బొమ్మపై క్లిక్ చేయండి)

డార్న్‌టన్ ఈ సమాచార వలయంలో ప్రతి అంశంలోనూ ఎటువంటి విషయాలు అధ్యయనానికి వస్తాయో చెప్పాడు. అవి భారతీయ పుస్తక చరిత్రకు ఎలా అన్వయించుకోవాలి?

1. రచయితలు: రచయితల జీవిత చరిత్రలు కోకొల్లలుగా ఉన్నా, గతంలో రచనాప్రక్రియ స్థితిగతులు, దానికోసం ఏర్పడ్డ ఉపాధులు, షరతులు గురించీ సమగ్రమైన సమాచారం దొరకడం కష్టం. ఎప్పటినుండీ రచయితలు రాజులు, జమీందారుల ప్రాపకాన్ని వదిలి స్వతంత్రంగా వ్యవహరించడం మొదలయ్యింది? అచ్చుయంత్రం, ప్రచురణ సంస్థలు రాక ముందు రచనలు రచయితల నుండి పాఠకులకి ఎలా చేరేవి? సమాచార-వలయంలో ప్రచురణ సంస్థలు, పంపిణీదారులు లేనప్పుడు రచయిత-పాఠకుడి మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? అచ్చుయంత్రం రాకముందు ఎవరు, ఎలా పుస్తకాలని పంపిణీ చేసేవారు? అచ్చుయంత్రం వచ్చిననాటి నుండీ నేటి ఇంటర్నెట్టు ప్రచురణ వరకూ, రచయితలు — ప్రచురణ సంస్థలు, ఎడిటర్లు, ప్రింటర్లు, పుస్తకవ్యాపారులు, సమీక్షకులు, విమర్శకులతో ఎలా వ్యవహరించేవారు? ఇటువంటి ప్రశ్నలు ఈ అంశంలో భాగంగా అధ్యయనానికి వస్తాయి.

2. ప్రచురణకర్తలు: పుస్తక చరిత్రలో ప్రచురణ కర్తల పాత్రపై పూర్తి స్థాయి అధ్యయనాలు ఇంకా రాలేదు. చిచెరో (Marcus Cicero) రచనలు, ఆయన మిత్రులు లేఖకుల చేత రాయించి, వాటికి నకళ్ళు చేయించి అమ్మడంతో ప్రచురణ రంగం మొదలైంది. జర్నల్ ఆఫ్ పబ్లిషింగ్ హిస్టరీలో మార్టిన్ లోరి (Martin Lowry), రాబర్ట్ పాటన్ (Robert Patten), గ్యారీ స్టార్క్ (Gary Stark) మొదలైన వారు రాసిన వ్యాసాల ద్వారా కొంత సమాచారం వెలికి వచ్చినా, గత ఐదువందల ఏళ్ళలో, ప్రచురణ విభాగంలో వచ్చిన మార్పులు పుస్తకాలని, రచయితలని, పాఠకులని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఇంకా సమగ్రమైన సమాచారం లేదు. ఇక భారతదేశంలో ముద్రణ – ప్రచురణ సమాచారాన్ని కేశవన్ (B. S. Kesavan) మూడు భాగాలుగా సంకలించాడు [10]. ప్రచురణ కర్తలు రచయితలతో ఎటువంటి ఒప్పందాలు చేసుకొనేవారు? పంపిణీదారులతో, వ్యాపారులతో వారికి ఎటువంటి సంబంధాలు ఉండేవి? సామాజిక, రాజకీయ పరిస్థితులని వారు ఎలా ఉపయోగించుకున్నారు? వ్యాపార లావాదేవీలు, పుస్తక ప్రచారం ఎలా ఉండేవి? వాటిల్లో వచ్చిన చారిత్రకమైన మార్పులు ఏ విధమైనవి? భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధ్వర్వంలో, మిషనరీల పాత్ర, పందొమ్మిదో శతాబ్దిలో ప్రాంతీయ భాషలలో ప్రచురణలు, ముద్రణకోసం లిపిలో వచ్చిన మార్పులు మొదలైనవన్నీ పరిశీలించాలి.

3. ముద్రణ వ్యవస్థ: ప్రచురణ సంస్థల చరిత్రతో పోలిస్తే, ప్రింటర్ల గురించి సమగ్రమైన చారిత్రక సమాచారమే లభిస్తోంది. పాశ్చాత్య ప్రపంచంలో ప్రింటింగు చరిత్రపై చాలా విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. పుస్తకం ఎలా తయారు అవుతుంది? పుస్తకం తయారీలో వచ్చిన మార్పులు ఏమిటి? ఒకప్పటి మూవబుల్ టైప్ నుండీ ఈనాటి డిజిటల్ ప్రింటింగ్ వరకూ ప్రింటింగు చరిత్ర, పుస్తకాల డిజైను, ఫాంట్ల రూపకల్పన, ప్రింటింగ్ పేపరు, కలర్ ప్రింటింగు, గ్రాఫిక్ ఆర్ట్‌లో వచ్చిన మార్పులు — ఇవన్నీ ఈ అంశం కిందకి వస్తాయి.