భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం

ముందుమాట

వోల్టేర్ రాతని ‘నోటిమాటకి వర్ణచిత్రం (painting of the voice)’ అన్నాడు. నిజమే, రాత కేవలం మాటకు శాశ్వత రూపాన్నిచ్చే పరికరం మాత్రమే కాదు. రాత ఈనాడు ఒక పరిణతి చెందిన అపురూపమైన కళారూపం. రాత సమాజంలో మానవ విజ్ఞాన సారస్వతాలకు వారధి. రాత సాంఘిక వ్యవస్థలలో ప్రజాస్వామిక సమాచార వ్యవస్థ.

రాత అనేది లేకపోతే సమాచారాన్ని పెద్దయెత్తులో భద్రపరచడం బహుశా సాధ్యం కాదు. ఆధునిక సమాజాల ఏర్పాటు, పెరుగుదలలలో రాత ప్రధానమైన సాంకేతిక సాధనం. రాయడం లేకపోతే పుస్తకాలనేవి లేవు. డప్పు వాయిస్తూ, ఊరంతా తిరుగుతూ రాజ శాసనాలనో, దానాలనో దండోరా వేస్తే పదిమందికీ తెలుస్తుంది. కానీ ఆ శాసనాలో, దానాల వివరాలో కలకాలం చెక్కు చెదరకుండా ఉండాలంటే, మనుషుల నోటిమాటకతీతంగా దానికంటూ ఒక శాశ్వతరూపం కావాలి. పాలించేవాడి మాట రాజ్యం నలుమూలలా విస్తరించడానికి దండోరాలు సరిపోయినా, రాజవాక్కు నిర్ద్వంద్వంగా పదికాలాల పాటు నిలబెట్టడానికి శాసనాలు అవసరమయ్యాయి.

ఒక దశాబ్దం క్రితం వరకూ లైబ్రరీలు, ఇప్పుడు ఇంటర్నెట్టు విజ్ఞాన సర్వస్వం. కాని, ఒకప్పుడు సమాచార వ్యవస్థతో సంబంధమున్న వ్యక్తులే విజ్ఞాన భాండాగారాలు. గురువులు, గణాచారులు, పూజారులు, పురోహితులు, ఉపాధ్యాయులు, మునులు, కళాకారులు — వారికి సమాజంలో ఎంతో విలువ ఉండేది. ఈ నాటికీ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. పరిపాలనా రంగంలోను, కార్పొరేట్ కంపెనీలలోను కనపడే లాబీయిస్టులు, స్పిన్ డాక్టర్లు, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల దగ్గర నుండి విలేకరులు, రచయితలు, వ్యాఖ్యాతలు చేస్తున్న పని కూడా అదే. అయితే, ఇప్పటి సమాచార విప్లవం లాగానే రాత మూలంగా వచ్చిన మార్పులు కూడా అన్ని సంస్కృతులలోనూ ఒకే రకంగా జరగలేదు. ముందు రాతతో రాజీపడడానికి, అటుపైన దాన్ని సొంతం చేసుకోడానికి ఒక్కో సమాజం, సంస్కృతి ఒక్కోలా స్పందించాయి.

రాత మూలంగా మానవచరిత్రలో సంభవించిన మౌలికమైన మార్పులని విపులంగా చర్చించడం, ముఖ్యంగా అటు పాశ్చాత్య సంస్కృతి లిఖిత వ్యవస్థని ఆకళించుకున్న తీరు, ప్రాచ్య సమాజాలు, ముఖ్యంగా మనం, లిఖిత సంస్కృతికి స్పందించిన తీరులోనూ ఉన్న మౌలికమైన భేదాలని విపులంగా ప్రదర్శించడం, రాబర్ట్ డార్న్‌టన్ సమాచార వలయం (Communication Circuit), మన సంస్కృతికి అన్వయిస్తూ, భారత సంస్కృతిలో రాతపుట్టుక నుంచీ, నేటి డిజిటల్/ఇంటర్నెట్ టెక్నాలజీలు పుస్తకాలని, పుస్తకాలతో ముడిపడ్ద సమాచార వ్యవస్ఠలనీ ఈ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించడం ఈ వ్యాస పరంపర ప్రధాన లక్ష్యం.


పుస్తక చరిత్ర

“అచ్చు ద్వారా నిర్వహింపబడే సమాచార వ్యవస్థల సామాజిక, సాంస్కృతిక చరిత్ర అంతా పుస్తక చరిత్రే” అని 1982లో డార్న్‌టన్ (Robert Darnton), What is book history? అనే పరిశోధనా వ్యాసంలో ప్రతిపాదించాడు [1]. డార్న్‌టన్ వ్యాసం పుస్తక చరిత్ర రచనలో ఒక మైలురాయిగా పరిగణిస్తారు. అప్పటివరకూ, పుస్తక చరిత్రకంటూ ఒక ప్రత్యేకమైన విభాగం లేదు. కొంతమంది సాహిత్య చరిత్రలో భాగం గానూ, కొందరు సామాజిక చరిత్రలో భాగం గాను, మరికొందరు గ్రంథాలయశాస్త్రంలో భాగం గానూ అధ్యయనం చేశారు. పుస్తక చరిత్రని శాస్తీయంగా అధ్యయనం చెయ్యడానికి ఒక విధివిధానాన్ని ఏర్పరిచిన ప్రముఖుల్లో డార్న్‌టన్ ఒకడు.

మనిషి ఆలోచనలు, భావనలు ఏ విధంగా ముద్రణామాధ్యమం ద్వారా ప్రసారం అయ్యేవి? గత ఐదువందల ఏళ్ళగా ముద్రణామాధ్యమం ఏ విధంగా మన ఆలోచనలని ప్రభావితం చేస్తోంది, అచ్చులో చదివే రచనలు మన ఆలోచనలని, సంస్కృతిని, సమాజాలని ఎలా ప్రభావితం చేస్తున్నాయి — అనే ప్రశ్నలకి సమాధానాలు చారిత్రక దృక్పథంతో అన్వేషించడం పుస్తక చరిత్ర లక్ష్యం. డార్న్‌టన్ తన వ్యాసంలో పుస్తక చరిత్ర పరిధిని అచ్చుయంత్రం కనిపెట్టిన తరువాతి దశకి పరిమితం చేసినా, ఇప్పుడు పుస్తక చరిత్రని అధ్యయనం చేస్తున్న పరిశోధకులు, రాత పుట్టుక, గ్రీకు, లాటిన్, యూరోపియన్ సమాజాల్లో, ముఖ్యంగా, రెండో శతాబ్దంలో రోమన్లు కనిపెట్టిన కోడీసుల (Codices) (విడి విడి తోలుపత్రాలు కలిపి కుట్టి, ఎడం వైపు బైండింగు చేసిన తోలు పత్రాల పుస్తకం) వరకూ పుస్తక చరిత్ర పరిధిని విస్తరించారు.

పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో, గత ముప్పై ఏళ్ళలో పుస్తక చరిత్ర కోసం ప్రత్యేకమైన విభాగాలేర్పడ్డాయి. ఈ రంగం కోసం ప్రత్యేకించి ఎన్నో విద్యావైజ్ఞానిక పత్రికలు (Academic Journals) ఉన్నాయి [2]. కేవలం పుస్తక చరిత్ర కోసం కొన్ని పరిశోధక సంఘాలు కూడా ఏర్పడ్డాయి. విశ్లేషణా గ్రంథసంచయం (Analytical Bibliography) ఒకవైపు, సామాజిక విజ్ఞానశాస్త్రం (Sociology of knowledge) మరొకవైపు, చరిత్ర, తులనాత్మక సాహిత్యం మరింకొకవైపు లాగుతూంటే అధ్యయనం చేద్దామని వేసే ప్రతి అడుగూ కొత్త దారుల వెంట తీసుకుపోతుంటుంది. ఇలా ఈనాడు, పుస్తక చరిత్ర శాఖోపశాఖలుగా విస్తరించింది. కాని, తెలుగులో, ఇంతవరకూ పుస్తక చరిత్ర పైన చెదురుమదురు వ్యాసాలే తప్పించి సమగ్రంగా, చారిత్రక దృక్పథంతో జరిగిన అధ్యయనాలు లేవనే చెప్పాలి.

తిరుమల రామచంద్ర లిపి పుట్టుపూర్వోత్తరాలు, భారతి, త్రిలింగ, పత్రికల్లో అచ్చుయంత్రం, తెలుగు లిపి సంస్కరణలు, ముద్రణ కళపై వచ్చిన కొన్ని వ్యాసాలు, సమగ్ర ఆంధ్రసాహిత్యంలో ఆరుద్ర ఇచ్చిన కొంత సమాచారం, మంగమ్మ తెలుగులో తొలినాటి ప్రచురణ రంగం మీద ప్రచురించిన పుస్తకం తప్పించి, మనకి పుస్తక చరిత్రపై చెప్పుకోదగ్గ రచనలు లేవు. ఆమాటకొస్తే భారత దేశంలోనే పుస్తక చరిత్రపై వచ్చిన పుస్తకాలు తక్కువ, అవి కూడా అన్నీ కేవలం అచ్చు పుస్తక చరిత్రను మాత్రమే చెప్పినవి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిన పేర్లు: తొలినాటి అచ్చుయంత్రాల గురించి వివరంగా చెప్పిన ప్రియోల్కర్ (Anant K Priolkar) [3], భారతదేశంలోనే అతి పెద్ద ప్రచురణ సంస్ట అయిన నావల్ కిషోర్ సంస్థ చరిత్రని చెప్పిన ఉల్‌రిక స్టార్క్ (Ulrike Stark) [4], తొలినాటి హిందీ, ఉర్దూ పత్రికల చరిత్రని చెప్పిన ఫ్రాంచెస్కా ఒర్సీని (Francesca Orsini) [5], చవకబారు పుస్తకాలుగా భావించబడే (బెంగాలీ) గుజలీ ప్రతులు చరిత్ర చెప్పిన అనిందితా ఘోష్ (Anindita Ghosh) [6], తమిళంలో పుస్తక చరిత్రపై గొప్ప పరిశోధన చేసిన వెంకటాచలపతి (A.R. Venkata Chalapthy)[7], తొలినాటి కాగితపు తయారి గురించి చెప్పిన అలగ్జాండ్రా సొటెరో (Alexandra Soutereu)[8]. ఈమధ్యకాలంలో, అభిజిత్ గుప్తా, స్వపన్ చక్రవర్తి కలిసి పుస్తక చరిత్ర గురించి రెండు వ్యాస సంకలనాలు తీసుకొనివచ్చారు [9]. (భారతీయ పుస్తక ప్రచురణ చరిత్రపై వివరంగా తరువాతి భాగాల్లో చర్చిస్తాం.)

డార్న్‌టన్ సమాచార వలయం

రచయితతో (Author) మొదలై, ప్రచురణకర్తలు (Publishers), ముద్రణ వ్యవస్థ (Printers), పంపిణీదారులు (Distributors), వ్యాపారుల (Sellers) ద్వారా పాఠకుడిని (Reader), పాఠకుడిని/ పాఠకసమాజాలని తిరిగి రచయితతోనూ కలిపే మొత్తం ప్రక్రియనంతా — సమగ్రంగా గానీ, సూక్ష్మంగా దేనికది లోతుగా గానీ — ప్రభావితం చేసే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలని, వాటి దేశ-కాల పరిస్థితులతో మేళవిస్తూ పరిశోధించే విధివిధానాన్ని, సమాచార వలయం (Communication Circuit) అని నిర్వచించాడు డార్న్‌టన్. ఈ సమాచార వలయం రచయిత మదిలో మెదిలిన ఒక ఆలోచన సందేశంగా అక్షరరూపం దాల్చి, ఆ అక్షరాలు సమాచారంగా అచ్చులో ముద్రించబడి పాఠకుడిని చేరి తిరిగి ఆలోచనగా మారే పూర్తి చట్రం.


1. డార్న్‌టన్ సమాచార వలయం. (వివరం కోసం బొమ్మపై క్లిక్ చేయండి)

డార్న్‌టన్ ఈ సమాచార వలయంలో ప్రతి అంశంలోనూ ఎటువంటి విషయాలు అధ్యయనానికి వస్తాయో చెప్పాడు. అవి భారతీయ పుస్తక చరిత్రకు ఎలా అన్వయించుకోవాలి?

1. రచయితలు: రచయితల జీవిత చరిత్రలు కోకొల్లలుగా ఉన్నా, గతంలో రచనాప్రక్రియ స్థితిగతులు, దానికోసం ఏర్పడ్డ ఉపాధులు, షరతులు గురించీ సమగ్రమైన సమాచారం దొరకడం కష్టం. ఎప్పటినుండీ రచయితలు రాజులు, జమీందారుల ప్రాపకాన్ని వదిలి స్వతంత్రంగా వ్యవహరించడం మొదలయ్యింది? అచ్చుయంత్రం, ప్రచురణ సంస్థలు రాక ముందు రచనలు రచయితల నుండి పాఠకులకి ఎలా చేరేవి? సమాచార-వలయంలో ప్రచురణ సంస్థలు, పంపిణీదారులు లేనప్పుడు రచయిత-పాఠకుడి మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? అచ్చుయంత్రం రాకముందు ఎవరు, ఎలా పుస్తకాలని పంపిణీ చేసేవారు? అచ్చుయంత్రం వచ్చిననాటి నుండీ నేటి ఇంటర్నెట్టు ప్రచురణ వరకూ, రచయితలు — ప్రచురణ సంస్థలు, ఎడిటర్లు, ప్రింటర్లు, పుస్తకవ్యాపారులు, సమీక్షకులు, విమర్శకులతో ఎలా వ్యవహరించేవారు? ఇటువంటి ప్రశ్నలు ఈ అంశంలో భాగంగా అధ్యయనానికి వస్తాయి.

2. ప్రచురణకర్తలు: పుస్తక చరిత్రలో ప్రచురణ కర్తల పాత్రపై పూర్తి స్థాయి అధ్యయనాలు ఇంకా రాలేదు. చిచెరో (Marcus Cicero) రచనలు, ఆయన మిత్రులు లేఖకుల చేత రాయించి, వాటికి నకళ్ళు చేయించి అమ్మడంతో ప్రచురణ రంగం మొదలైంది. జర్నల్ ఆఫ్ పబ్లిషింగ్ హిస్టరీలో మార్టిన్ లోరి (Martin Lowry), రాబర్ట్ పాటన్ (Robert Patten), గ్యారీ స్టార్క్ (Gary Stark) మొదలైన వారు రాసిన వ్యాసాల ద్వారా కొంత సమాచారం వెలికి వచ్చినా, గత ఐదువందల ఏళ్ళలో, ప్రచురణ విభాగంలో వచ్చిన మార్పులు పుస్తకాలని, రచయితలని, పాఠకులని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఇంకా సమగ్రమైన సమాచారం లేదు. ఇక భారతదేశంలో ముద్రణ – ప్రచురణ సమాచారాన్ని కేశవన్ (B. S. Kesavan) మూడు భాగాలుగా సంకలించాడు [10]. ప్రచురణ కర్తలు రచయితలతో ఎటువంటి ఒప్పందాలు చేసుకొనేవారు? పంపిణీదారులతో, వ్యాపారులతో వారికి ఎటువంటి సంబంధాలు ఉండేవి? సామాజిక, రాజకీయ పరిస్థితులని వారు ఎలా ఉపయోగించుకున్నారు? వ్యాపార లావాదేవీలు, పుస్తక ప్రచారం ఎలా ఉండేవి? వాటిల్లో వచ్చిన చారిత్రకమైన మార్పులు ఏ విధమైనవి? భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధ్వర్వంలో, మిషనరీల పాత్ర, పందొమ్మిదో శతాబ్దిలో ప్రాంతీయ భాషలలో ప్రచురణలు, ముద్రణకోసం లిపిలో వచ్చిన మార్పులు మొదలైనవన్నీ పరిశీలించాలి.

3. ముద్రణ వ్యవస్థ: ప్రచురణ సంస్థల చరిత్రతో పోలిస్తే, ప్రింటర్ల గురించి సమగ్రమైన చారిత్రక సమాచారమే లభిస్తోంది. పాశ్చాత్య ప్రపంచంలో ప్రింటింగు చరిత్రపై చాలా విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. పుస్తకం ఎలా తయారు అవుతుంది? పుస్తకం తయారీలో వచ్చిన మార్పులు ఏమిటి? ఒకప్పటి మూవబుల్ టైప్ నుండీ ఈనాటి డిజిటల్ ప్రింటింగ్ వరకూ ప్రింటింగు చరిత్ర, పుస్తకాల డిజైను, ఫాంట్ల రూపకల్పన, ప్రింటింగ్ పేపరు, కలర్ ప్రింటింగు, గ్రాఫిక్ ఆర్ట్‌లో వచ్చిన మార్పులు — ఇవన్నీ ఈ అంశం కిందకి వస్తాయి.

4. పంపిణీదారులు: పుస్తకాలు ఏ విధంగా పాఠకులని చేరాయో పెద్దగా మనకి తెలియదు. పోస్టాఫీసులు, రైల్వేలు, ఓడలు పుస్తక చరిత్రలో పోషించిన పాత్ర చిన్నదేం కాదు. ఒకప్పుడు యూరపులో ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో పుస్తకాల షాపులకి పుస్తకాలు సకాలంలో అందేవి కాదు. కారణం, అప్పట్లో రవాణా బగ్గీల ద్వారా అయ్యేది. పంపిణీదారులంతా పంటనూర్పుళ్ళ పనిలో బగ్గీలు నడిపేవారు కాదు. అలాగే, నిషేధించిన పుస్తకాలు, సమాజంలో గౌరవప్రదం కాని పుస్తకాలు పాఠకులని చేరడంలో కూడా పంపిణీదారుల పాత్ర చెప్పుకోదగ్గది. ఇవి కాకుండా, గుజలీ ప్రతులు,, డిటెక్టివ్ పుస్తకాల పంపిణీ వ్యవస్థలు వేరే ఉండేవి. (కిళ్ళీబడ్డీలో డిటెక్టివ్ పుస్తకాలు అద్దెకి తీసుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. అవి మామూలు పుస్తకాల షాపుల్లో దొరికేవి కావు.) యూరపులో ఇలాంటి పంపిణీ వ్యవస్థలపై డార్న్‌టన్ రెండు గొప్ప పుస్తకాలు రాశాడు [11]. ఉదాహరణకి, వావిళ్ళ, వేదం, వెంకటరామా మొదలైన ప్రెస్సులతో పోలిస్తే ఎన్‌.వి.గోపాల్‌ &కో, అద్దేపల్లి వీరవెంకయ్య, కొండపల్లి వీరాస్వామి, కర్నూలులో బాల సరస్వతి బుక్‌డిపో వంటివారు చేసిన పుస్తక ప్రచురణ పూర్తిగా భిన్నమైంది. ఇటువంటి అంశాలన్నీ ఈ భాగంలో ప్రస్తావనకొస్తాయి.

5. పుస్తక వ్యాపారులు: పుస్తకాల వ్యాపారి అందరి లాంటి వ్యాపారి కాదు. పుస్తక సంస్కృతిని ప్రభావితం చెయ్యడంలో పుస్తకాల దుకాణాలాది ఒక ప్రత్యేకమైన పాత్ర. సామాజిక, సాంస్కృతిక కోణంతో సమగ్రంగా చూడవలసిన అంశం ఇది. ప్రాంతీయ భాషల్లో పుస్తకాల అమ్మకాలు, పుస్తకాల సంతలు, పాత పుస్తకాల షాపులు, రాయల్టీలు, రాయతీలు, ఒకప్పటి రైల్వే స్టేషన్లో విధిగా ఉండే వీలర్స్ నుండీ నేటి అమెజాన్ వరకూ పుస్తక వ్యాపారంలో వచ్చిన మార్పులు, పరిణామాలు, పరిణితి ఇవన్నీ ఈ అంశం కిందకి వస్తాయి. ఒక రచన సాహిత్యం నుండి వస్తువుగా మారేది పంపిణీదారు దగ్గరైతే, అది తిరిగి సాహిత్యంగా మారేది పుస్తకాల షాపులో.

6. పాఠకులు/పాఠక సమాజాలు: చదవటం, చదివించటం మన జీవితంలో అతి పెద్ద వ్యాసంగం. మనిషి జీవితంలో చాలా భాగం చదవడానికి, సమాచారానికి స్పందించడానికి వినియోగిస్తాడు. సాహిత్య విమర్శకులు, సమీక్షకుల ద్వారా పుస్తకం పాఠకులని ఎలా ప్రభావితం చేసేదో తెలిసినా, మనం పాఠకులకి, పుస్తకాలకి మధ్య అనుబంధం ఎప్పుడూ ఒకలాగే ఉండేదనుకుంటాం, కాని ఇది సరి కాదు. పదిహేడో శతాబ్దం వరకు పాఠకుడికి పుస్తకంతో ఉన్న అనుబంధం చాలా వేరుగా ఉండేది. చదవడం లోనే ఎన్నో చారిత్రకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు చదవడం సామూహికంగా జరిగేది. ఒక్కోసారి, ముఖ్యంగా సామాజిక/ రాజకీయ విప్లవాల కాలంలో రహస్యంగా జరిగేది. పుస్తకం, పాఠకుడి స్పందనని చాలా సున్నితంగా, సూక్ష్మంగా ప్రభావితం చేస్తుంది. బాపు బొమ్మ చూసి, ‘అయితే ఇది మంచి పుస్తకమే అయుంటుంది’ అనుకునే వారు ఎందరు లేరు? పుస్తకం డిజైను, దాని సైజు, దాని కోసం వాడిన పేపరు ఇవన్నీ కూడా పాఠకులని ప్రభావితం చేస్తాయి. అందులో పాఠకుడికో పాత్రని సృష్టించి, ఆ మూసలోకి అతన్ని నెట్టేస్తాయని ఓన్గ్ (Walter Ong) అంటాడు [12]. ఇవి కాకుండా, చదివే అలవాట్ల వచ్చిన మార్పులు – ఉదాహరణకి, పాశ్చాత్య సంస్కృతిలో ఎంతో కాలం పాటు మనసులో చదువుకోవడం ఉండేది కాదు, చదవటం అంటే బయటకి, బిగ్గరగా చదవటమే. చదవటం పరిపాటై పోయాక, పుస్తకం కూడా ‘చదివి, పారేయగలిగే’ ఒక వస్తువైపోయింది. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీతో పుస్తకం రూపురేఖలే మారిపోయాయి. వాటితో పాటు పఠనం కూడా పూర్తిగా మారిపోయింది. ఈ మార్పులని అధ్యయనం చేయడం ముఖ్యం.

ఈ సమాచార వలయాన్ని సమగ్రంగా చారిత్రక దృష్టితో చూస్తే, పుస్తకం కేవలం చరిత్రని చెప్పదు, అది చరిత్రని సృష్టిస్తుంది అనిపించకమానదు. అచ్చుయంత్రం రాక పూర్వం ఈ సమాచార వలయం మరోలా ఉండేది. ప్రచురణకర్తలు, పంపిణీదారులు, విక్రయదారులు — ఇవేవీ ఉండేవి కాదు కదా? అచ్చుయంత్రానికి పూర్వం చేతితో రాసుకునే పుస్తకాలు, దక్షిణభారత దేశంలో తాళపత్ర గ్రంథాలు ఉండేవి. ఏ పుస్తకాన్నైనా నకళ్ళు రాసుకునేవారు, కొన్ని కుటుంబాలలో, సమాజాలలో కొన్ని పుస్తకాలు భద్రపరచేవారు, పుస్తకాలు చదవడం, పుస్తకాలతో సంబంధాలు, పూర్తిగా వేరుగా ఉండేవి. మన దేశంలోనే కాదు, పాశ్చాత్య సంస్కృతిలో కూడా అచ్చుయంత్రానికి పూర్వం, ఈ సమాచార వలయం వేరుగా ఉండేది. ఈ విషయాలన్నీ, ఇంతకుముందు రాసిన అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య పుస్తక సంస్కృతి అన్న వ్యాసంలో విపులంగా చర్చించాం [13].

ఈ పుస్తక చరిత్రని మూడు భిన్న కోణాలలోంచి అధ్యయనం చెయ్యవలసి ఉంటుంది. మొదటిది — సామాజిక చరిత్ర కోణం (Social History). ఇందులో మతానికి – సమాచార వ్యవస్థలకి ఉన్న అవినాభావ సంబంధం, విశ్వవిద్యాలయాలు – గ్రంథాలయాల పాత్ర, ప్రచురణరంగంలో వచ్చిన మార్పులు, మొదలైనవి సమాజ సమీకరణాలని మౌలికంగా ఏ విధంగా ప్రభావితం చేశాయి అనే అంశాన్ని అధ్యయనం చెయ్యడం. రెండవది — సాంస్కృతిక చరిత్ర కోణం (Cultural History). విభిన్నకాలాల్లో, భిన్న సంస్కృతుల మధ్య మౌఖిక, లిఖిత సంస్కృతుల మధ్య ఘర్షణ, వాటిల్లో దశలవారిగా వచ్చిన పరిణామాలని విశ్లేషించడం. మూడవది — ఆలోచనల చరిత్ర కోణం (History of Ideas). అంటే లిపుల ఆవిర్భావం, అక్షర వ్యవస్థ ఏర్పరిక, అక్షరాలు, అచ్చులు (fonts), పుస్తకాలు, వాటి రూపకల్పనలో వచ్చిన మార్పులు, కాలిగ్రఫీ (Calligraphy) వంటి కళారూపాల చరిత్ర, రాత పరికరాలు, పుస్తకాలు రాయడం, తయారు చెయ్యడంలో వచ్చిన మార్పుల గురించిన చర్చ.

ఇందుకుగాను ప్రాచీనకాలం నుంచి సాంకేతిక పరిజ్ఞానం మారుతున్న కొద్దీ పాత సాంకేతిక వ్యవస్థలు పోయి వాటి స్థానంలో కొత్త కొత్త వ్యవస్థలు ఎలా ఏర్పడుతూ వచ్చాయో లోతుగా చర్చించాలి. అంటే రాత వ్యవస్థలో కొత్త కళలు — గ్రాఫిక్‌ ఆర్ట్స్, ఎలక్ట్రానిక్, కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీలు ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులకి అవసరమైన వనరులు, పరికరాలు అందించాయో, అంతకంటే ముఖ్యంగా ఒక వినూత్న వాతావరణాన్ని సృష్టించాయో కొంత లోతుగా పరిశీలించాలి.

మొదటగా ఈ వ్యాసావళిలో మొదటిదైన ఈ వ్యాసంలో పాశ్చాత్య సంస్కృతిలో రాత పుట్టుక, పరిణామాలని గురించి చర్చిస్తాం.


ఆధునిక సమాజాలకి రాతతో విడదీయరాని సంబంధం ఉండటంతో మనం రాత ద్వారానే భాషకి, మాటకి శాశ్వతత్వం వస్తుంది అనుకుంటాం. Verba Volent Scripta Manent అనే లాటిన్ నానుడి ఈనాడు ‘మాట క్షణికం, రాత శాశ్వతం’ అనే అర్థాన్ని పొందినా, ప్రాచీనకాలంలో అది ‘తన వేళ్ళే సంకెళ్ళై, కదలలేని మొక్కలా’ పలకకి అంటుకుపోయినది అక్షరమనీ, ఆ మొక్క కొమ్మల మీదనుంచీ రెక్కలు తొడిగి ఎగరగలిగే పక్షి వంటిది మాట అనే అర్థంలోనే వాడబడింది [14]. “చిత్రమైనా, శిల్పమైనా కాలగర్భంలో కలిసిపోవలిసిందే ప్రభూ, అదే ఏ మహాకవైనా ఈ కథని గానం చేస్తే అది ప్రజల నోళ్ళలో చిరస్థాయిగా ఉంటుంది,” అని లవకుశ సినిమాలో ఒక పాత్ర అంటుంది. అలాగే జాషువా రాజు-కవి అన్న కవితా ఖండికలో:

రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమేగె
రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాల్కల యందు

అంటాడు. ఈ ఊహలో లోతైన సామాజిక సూత్రం ఒకటుంది. వస్తురూపంలో భద్రపరిచిందేదైనా ఏదో ఒకనాటికి శిధిలమవకతప్పదు, అదే ప్రజల సంస్కృతి, భావనలో నిరంతరం నిలిచి ఉండగలిగితే అమరత్వం పొందుతుంది.

అందుకే, సుమారుగా అన్ని సమాజాలలోనూ, మొదట్లో రాతని వాఞ్మయాన్ని, సంస్కృతిని భద్రపరచడం కోసం ఉపయోగించలేదు. మొదట్లో రాత ప్రధానంగా జ్ఞాపకానికి ఒక ఉపకరణంగా మాత్రమే ఉపయోగించేవారు. క్రీ.పూ 3500-3000 నాటికి, మెసపొటేమియా ప్రాంతంలో సుమేరియన్ సమాజాలు మెట్టభూములు కూడా సాగుచెయ్యడానికి వీలయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించారు. అందువల్ల, పెద్దనగరాలు ఏర్పడ్డాయి. నగరజీవితానికి వాణిజ్య వ్యాపార సంబంధమైన లావాదేవీలని నియంత్రించే సాంఘిక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అవసరమైయాయి. సమాజంలో వాణిజ్యపరమైన వివాదాలు రాకుండా ఉండడానికి, సాంఘిక, వాణిజ్య పరమైన లావాదేవీలని, నోటిమాటకతీతంగా, సాక్ష్యాధారాల సహితంగా భద్రపరచవలసిన అవసరం రాత కనిపెట్టడానికి పురికొల్పింది. భాషని ‘రికార్డు’ చేసే పని రాతకి ఎన్నో శతాబ్ధాల తర్వాతకాని కల్పించబడలేదు [15]. అయితే, ఇందుకు కొంత విరుద్ధంగా, ఈజిప్టులో మాత్రం ప్రాచీనకాలం నుండే రాతని మత సంబంధమైన వ్యవహారాలకోసం, ఫారోల చరిత్రని దేవాలయాల మీద, సమాధుల మీద చిత్రించడం కోసం ఉపయోగించేవారు. బహుశా, అందుకే ఈజిప్టు గూఢచిత్ర లిపి ప్రాచీన లిపులన్నిటిలోనూ ఎంతో ఆడంబరమైనది. సుమేరియన్ల వ్యాపార ధోరణి వల్ల అక్కడ లేఖకులు గుమస్తాల స్థాయికి పరిమితమైపోయారు, అదే ఈజిప్టులో రాతకి మతపరమైన సంపర్కం వల్ల అక్కడి లేఖకులకి గురువులు, పూజారుల స్థానం ఉండేది. [16].

మనందరి సమిష్టి అనుభవంతో అంతర్భాగమైపోయన పుస్తకాలని, వాటితో ముడిపడ్డ ప్రింటింగ్, పబ్లిషింగ్, రాయడం, చదవడం మొదలైనవాటన్నిటినీ సమూలంగా ఈనాడు ఇంటర్నెట్ ద్వారా వచ్చిన సమాచార విప్లవం ఎలా సమూలంగా మార్చేస్తున్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఇంటర్నెట్ ద్వారా రాత, రాతతో ముడిపడ్డ సమాచార వ్యవస్థ ఎంతగా మార్పు చెందాయో, ఆ మార్పులు మన విజ్ఞాన సేకరణ మన చేతనలపై ఎలాంటి ప్రభావం, ఎటువంటి ఒత్తిడి కలిగిస్తున్నాయో ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తున్నది. ఇది కనీవినీ ఎరుగని ఒక పెనుమార్పుగా మనం అనుకుంటున్నాం. అయితే, అంతకంటే మౌలికమైన మార్పు రాత వల్ల మానవ సమాజాల్లో వచ్చింది. ఈనాడు సాహిత్యపరమైన, తాత్వికమైన, శాస్త్రీయమైన ఆలోచనలు, వాటి వ్యక్తీకరణల స్వభావం, లక్షణాలు మానవుడి అస్తిత్వంలో అంతర్భాగంగా మనం అనుకుంటాం కానీ, ఇవన్నీ రాత అనే ప్రక్రియ మన అంతశ్చేతనకి అందించిన వనరులు. అందువల్లనే, జ్ఞానసముపార్జనకి, సమాచారాన్ని సృష్టించడం నుంచి సరఫరా చెయ్యడం వరకూ అన్నిటికీ రాత మీద ఆధారపడిపోయిన మనకు, కేవలం నోటిమాట ఆధారంగా సమాచార వ్యవస్థలని నిర్మించుకున్న ఒకప్పటి మౌఖికసమాజాల యొక్క సాంస్కృతిక దృక్పథం ఎలా ఉండేదో అంతు చిక్కదు. ఎందుకంటే అటువంటి సంస్కృతులని మనం, మనకి తెలిసిన వ్యవస్థల ఆధారంగానే బేరీజు వేస్తాం. కేవలం శబ్దం మీద ఆధారపడ్డ సంస్కృతిలో మౌలికంగా ఆలోచనలు, భావనలు సృష్టించి, వాటిని భధ్రపరుచుకునే వనరులు చాలా వేరుగా ఉంటాయి. అందుకే ‘మౌఖిక సాహిత్యం’ అన్న భావనే అసంబద్ధం [17,18] అంటాడు వాల్టర్ ఓన్గ్.

ముందే ప్రస్తావించినట్లుగా ఇప్పటి సమాచార విప్లవం లాగానే రాత మూలంగా వచ్చిన మార్పులు కూడా అన్ని సంస్కృతులలోనూ ఒకే రకంగా జరగలేదు. ముందు రాతతో రాజీపడడానికి, అటుపైన దాన్ని సొంతం చేసుకోడానికి ఒక్కో సమాజం, సంస్కృతి ఒక్కోలా స్పందించాయి. శబ్దానికి ఒక బలీయమైన శక్తి ఉంటుందనే దృఢమైన నమ్మకం ఉండేది. పవిత్రమైన మతపరమైన సిద్ధాంతాలను రాసినప్పుడు గానీ, పలికినప్పుడు గానీ పొరపాట్లు జరిగితే ఊహించని ఉపద్రవాలు ఎదుర్కొనవలసి వస్తుందని అనుకునేవారు. అందుకే, ధారణ అతి ముఖ్యమైన సామర్థ్యంగా భావించేవారు. రాతకి పూర్వం సమాచార వ్యవస్ఠ అంతా మౌఖికం గానే నిర్వహించబడేది. జ్ఞాపకం, ధారణ కోసం మౌఖిక సమాజాల్లో ప్రత్యేకమైన పద్ధతులు, శిక్షణ ఉండేవి. ఛందోబద్ధంగా కావ్యాన్నో లేదా మంత్రాన్నో యతిప్రాసలతో అల్లడం యొక్క ముఖ్యమైన ప్రయోజనం, – వాటిని గుర్తుంచుకోడానికి, శబ్దరూపంలోనే వాటిని భద్రపరుచుకోడానికి అని మనకి తెలుసు. అంతే కాకుండా, అన్ని ప్రాచీన మౌఖిక సమాజాలలోనూ ఆలోచనా పద్ధతులు కూడా స్థాణువుగా, నియమాలకి లోబడి ఉంటేనే వాటిని నియంత్రించడానికి వీలవుతుంది (Fixed, formulaic thought patterns are essential for wisdom and effective administration – Walter Ong) [19,20]. శబ్దానికున్నఈ సమ్మోహన శక్తి, క్రమంగా రాయబడిన మాటకి కూడా ఆపాదించబడింది.

గొప్ప సాంకేతిక వ్యవస్థలన్నీ సమాజంలో మౌలికమైన మార్పులని, నూతన సమీకరణాలని తెస్తాయి, అంతకుముందు ఉన్న కొన్ని రకాల మానవీయ బాధ్యతల అవసరం తీరిపోతుంది, పాత అధికారాలు, పాత భయాలు పోయి వాటి స్థానంలో కొత్త అధికారాలు, కొత్త సమీకరణాలు, కొత్త బాధ్యతలు, కొత్త భయాలు పుట్టుకువస్తాయి. ఉదారణకి, అచ్చుయంత్రం వచ్చాక లేఖక సమాజాలు పోయాయి, డిజిటల్ టెక్నాలజి వచ్చాక కంపోజర్ల అవసరం పోయింది. పుస్తకం, న్యూస్‌పేపర్లు వచ్చాక, రచన చదివి పారేసే వస్తువు (Commodity) అయిపోయింది. ఇప్పుడు ఈ-రీడర్లు, స్వీయప్రచురణ, పాఠకుడే ఎప్పుడు కావాలంటే అప్పుడు పుస్తకాన్ని తక్షణం అచ్చు (On Demand Printing) తీసుకోగలిగే సౌలభ్యాలు సమాజంలో కొత్త సమీకరణాలని తీసుకుని వస్తున్నాయి. కంప్యూటర్, ఇంటర్నెట్ మనల్ని దృశ్యప్రధానమైన మాధ్యమం నుంచి తిరిగి శ్రవణ ప్రధానమైన మాధ్యమం వైపుకి నెడుతున్నాయంటాడు స్టీవెన్ ఫిషర్ (Stephen Fischer) [21].

రాత పుట్టుక

క్రీ.పూ. 13వ శతాబ్దంలో ఈజిప్టుని పరిపాలించిన రెండో రిమీసిసు చక్రవర్తి (Ramses II) తన కీర్తిప్రతిష్టలు ప్రపంచంలో ఆచంద్రతారార్కం నిలిచిపోవాలని గొప్ప గొప్ప నగరాలు నిర్మించాడు. వాటన్నిటిలో తన శిల్పాలు చెక్కించుకున్నాడు. ఫలకాలపై తన చరిత్ర రాయించుకున్నాడు. ఆ శిల్ప సంపద కొన్ని వేల ఏళ్ళపాటు మనిషిని, ప్రకృతిని ఎదిరించి నిలబడింది. కానీ కాలగర్భంలో కలిసిపోక తప్పలేదు. ఒకప్పుడు సగర్వంగా, నిలువెత్తుగా నిలబడ్డ ఆయన శిలాప్రతిమ, కాలప్రభావం వల్ల కాళ్ళు విరిగి ఈజిప్టు ఎడారిలో పడిపోయివుంది. దాని మీద ఇంగ్లీషు కవి షెల్లీ (P. B. Shelley) ఇలా అంటాడు:

“…
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them and the heart that fed.

And on the pedestal these words appear:
My name is Ozymandias, king of kings
Look on my works, ye Mighty and despair”
Nothing beside remains, Round the decay
Of that colossal wreck, boundless and bare
The lone and level sands stretch far away”

షెల్లీ, అలుపెరగని ఆ ఎడారికి ఆ చక్రవర్తి మహాసామ్రాజ్యం, ఆయన కీర్తిప్రతిష్టలు తలొగ్గక తప్పలేదంటూ, ఇరుకైన ఆయన హృదయ సౌశీల్యం మట్టుకూ ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి మదిలో నుంచి చెక్కు చెదరలేదంటాడు. షెల్లీ కవిత ప్రేరణతోనే, ఒక తెలుగు సినిమా కవి, “రాజులే పోయినా రాజ్యాలు కూలినా, మనుజులే దనుజులై మట్టిపాలు చేసినా… ఈ శిధిలాలో చిరంజీవివైనావయా” అంటాడు ఒక పాటలో. శిలాశాసనాల ద్వారా ఆనాటి చక్రవర్తులు ఏం సాధించదలచుకున్నారో పక్కన పెడితే – అవే పురావస్తు పరిశోధకులకి, ప్రాచీన లిపిశాస్త్రం అధ్యయనం చేసే వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎందరెందరో చెక్కించిన శిలా శాసనాలు, ముఖ్యంగా ఈజిప్టులో టాలెమీ (Ptolemy) మూడు భాషల్లో చెక్కించిన రొసెట్టా ఫలకం (Rosetta Stone), పెర్షియా చక్రవర్తి డారియస్ (Darius) మూడు లిపులలో చెక్కించిన ఫలకం, మన దేశంలో అశోక చక్రవర్తి శిలాశాసనాలు లేకపోతే, బహుశా ఈనాడు మనకి రాత పుట్టు పూర్వోత్తరాల గురించి కచ్చితమైన సమాచారం తెలిసేది కాదు. రాత చరిత్ర గురించి తెలుసుకోడానికి రాతనే ఆశ్రయించక తప్పదు కదా?

రాత అసలు, ఎలా ఎక్కడ పుట్టింది? ఆధునిక అక్షరవ్యవస్థలు (Alphabetic Writing Systems) ఎవరు కనిపెట్టారు? ఈ ప్రశ్నలకి ఖచ్చితమైన, అందరినీ సంతృప్తి పరిచే సమాధానమంటూ ఒకటి లేదు. ప్రాచీన సంస్కృతులు – ఈజిప్టు, మెసపటేమియా, సింధులోయ, చైనా – ఈ నాలుగు సమాజాలు రాతని వాటంతట అవే స్వతంత్రంగా కనుగొన్నాయా, లేదా ఒకదాన్నుంచి ఒకటి ప్రభావం చెందాయా, లేదా ఒక సంస్కృతి నుంచి వేరొకటి రాతని దిగుమతి చేసుకుందా అనే ప్రశ్నలు ఈ నాటికీ వివాదాస్పదమైన పరిశోధనాంశాలు.

పందొమ్మిదో శతాబ్దంలో చరిత్ర, పురావస్తు పరిశోధనలు విస్తృతంగా జరగక పూర్వం రాత చరిత్ర ఒక మిస్టరీగానే ఉండేది. బ్లేక్ (William Blake) తన జెరూసలేమ్ కవితలో –

Reader! …of books …of Heaven,
And of that God from whom…
Who in mysterious Sinai’s awful cave,
To Man the wondrous art of writing gave;

అన్నట్టు చాలా సంస్కృతులలో రాత భగవత్ప్రసాదంగానే భావించేవారు. మన సంస్కృతిలో, బృహత్కథలో పాణినికి శివసూత్రాలు ఎలా ‘స్ఫురించాయో’ తెలిపే ఒక చిత్రమైన కథ ఉంది. చిన్నప్పుడు పాణినికి గురువు చెప్పిన వ్యాకరణ పాఠాలు ఒక ముక్క కూడా తలకెక్కేవి కాదట. దాంతో విసుగెత్తిన పాణిని శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన ఢమరుకంతో — అ ఇ ఉణ్ ఋ ల్ క్ ఎఒ ఞ్ ఐ ఔ చ్ అంటూ కుడివైపు అచ్చులని (అ తో ప్రారంభమై చ్ తో ఈ సూత్రాలు అంతమైనందుకు వాటికి అచ్చులని పేరు) హ య్ వ ర ట్ అంటూ ఎడం వైపు హల్లులని — పలికించాడట. ఇవి మొత్తం పధ్నాలుగు సూత్రాలు. ఇవే పాణిని అష్ఠాధ్యాయికి మూలాధారం. సంస్కృత వర్ణమాల అంతా ఈ సూత్రాలలో ఉంది. పాణిని శివసూత్రాలు దైవానుగ్రహాలా కాదా అనేది పక్కన పెడితే, పాశ్చాత్య సంస్కృతులలో అక్షరాలు మొదట్లో వాటికి గుర్తుగా వాడిన చిత్రాలనుంచి ఏర్పడినవి. కాని భారత సంస్కృతిలో అవి శబ్దం నుండి వచ్చాయని చెప్పడానికి శివసూత్రాలు ఉపయోగపడతాయి. భారత సంస్కృతి ప్రధానంగా మౌఖిక సమాజం అని వాదించడానికి ఈ తేడా చాలా ముఖ్యమైనది. (దీని గురించి తరువాతి భాగాలలో వివరిస్తాం.)

కిప్లింగ్ (Rudyard Kipling) How the Alphabet was Made అనే కథలో ఇంగ్లీషు అక్షరాలు ఎలా పుట్టాయో ఊహిస్తాడు. ఆ కథలో తెఫెమాయ్ అనే అమ్మాయి ఉంటుంది, వాళ్ళ నాన్నతో ఆడుతూ, ఆయన నోరు తెరిచి ఆహ్‌ అంటే అట్లా తెరిచిన నోటి ఆకారం లోంచి A అక్షరాన్ని, యా అన్నప్పుడు Y అక్షరాన్ని, ఇలా కథ పూర్తయ్యేటప్పటికి మొత్తం అన్ని అక్షరాలని తెఫెమాయ్ రాస్తుంది. కిప్లింగ్ కథ పిల్లలకి చెప్పడానికి బాగానే ఉంటుంది గానీ, ఈనాడు మన చేతనలో అంతర్భాగం అయిపోయిన అక్షరాల పుట్టుక అంత తేలికగా జరగలేదు. అదొక సంక్లిష్టమైన ప్రక్రియ. ఏదో రకంగా రాయడం మొదలు పెట్టి, అక్షరాలతో భాషని సంపన్నం చేసుకోడానికి మానవాళికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఈ పరిణామక్రమం ఒక గొలుసుకట్టు కథలా కూడా ఉండదు ఎందుకంటే, ఈ కథలో మనకి తెలియనివి, తెలిసీ పరిశోధకుల మధ్య ఇప్పటివరకూ ఏకాభిప్రాయం కుదరనవి, ఎన్నో అంశాలు ఉన్నాయి.

ఈజిప్టు, చైనా, ఇండియాలలో ప్రాచీనకాలం నాటి చిట్టాపద్దులు ఎక్కడా పెద్ద ఎత్తులో లభ్యం కానప్పటికీ, లెక్కలు, జమా పద్దులు భద్రపరచడం అనే అవసరం నుంచే రాత పుట్టిందని పరిశోధకుల అభిప్రాయం. నాగరికతకు నాంది పలికిన మెసపటేమియాలో సుమారుగా క్రీ.పూ. నాలుగో సహస్రాబ్ది నాటికి రాజ్యవ్యవహారాలలో సంక్లిష్టత కేవలం జ్ఞాపకం పెట్టుకునే స్థాయిని దాటిపోయింది – సమాచారాన్ని చెరిగిపోకుండా భద్రపరచుకోవాలిసిన అవసరం వచ్చింది. అప్పుడు రాత-కోతలు అవసరమయాయి.

రాతలు-కోతలు అనడంలో కోతలు అంటే అబద్ధాలు, ఉత్ప్రేక్షలు అనే అర్థంలో మనం ఈనాడు వాడినా, మొట్ట మొదటి రాతలు అక్షరాలా కోతలే. మొదట్లో, లెక్కల వివరాలు టోకెన్ రైటింగ్ పద్ధతిలో (Token Writing) — కర్ర మీద లేదూ రాయిమీద గాట్లు పెట్టడం, దారాలు ముళ్ళు పెట్టడం, మట్టి పలకల మీద ముద్రలు, గుర్తులు వెయ్యడం ద్వారా — భద్రపరిచేవారు. క్రీ.పూ. 8000 నుండీ 1500 కాలానికి చెందిన ఇటువంటి ముద్రలు ఎన్నో మధ్యప్రాచ్యంలో పురావస్తు తవ్వకాలలో లభించాయి. కర్ర, రాయి వంటి గాట్లు పెట్టిన వస్తువు నుంచి పలక పైన చెక్కడం – అంటే మూడు కొలతల నుండి రెండుకి మారడం – రాత పరిణామంలో మొదటి మెట్టుగా పరిశోధకులు భావిస్తారు. కాని, ఈ జ్ఞాపికలు సుమేరియన్ శరాకార లిపి (Cuneiform – లాటిన్‌లో Cunei అంటే గాటు అని అర్థం) వచ్చిన తర్వాత చాలాకాలం వరకూ వాడుకలో ఉన్నాయి కాబట్టి రాత వీటిని మరుగు పరచలేదని, టోకెన్ రైటింగ్ పద్ధతిని రాతకి అనుబంధ వ్యవస్థగానే పరిగణించాలని మరికొందరి పరిశోధకులు వాదిస్తారు.

కర్రలమీద, రాతిమీద చెక్కిన గాట్లు, పూసలతో పేర్చిన పటకాలు, రంగు రంగు దారాలతో కట్టిన ముళ్ళ రాతలే కాకుండా, మరెన్నో రకాల ‘లేఖన’ విధానాలు ఉండేవి. ప్రాన్సులో 20 వేల ఏళ్ళనాటి సంకేత చిత్రాలు, మరెన్నో చోట్ల జంతువుల బొమ్మల సాయంతో వదిలిన సంకేతాలు, చంద్రకళలని గుర్తించడానికి తయారుచేసుకున్న ఎముకలు – ఇవన్నీ కూడా సమాచార సాధనాలే. ఈ పద్ధతులని ఆదిలేఖన (Proto writing) పద్ధతులంటారు. కానీ ఇది పరిపూర్ణమైన రాతవ్యవస్థ కాదు.

మనిషి ఆలోచనల సమస్తాన్నీ, అది ఎటువంటి ఆలోచనైనా సరే, చిత్ర రూపంలో వ్యక్తీకరించగలిగేదే పరిపూర్ణమైన రాత వ్యవస్థ (Complete writing system) అని జాఁ షాంపోయాఁ (Jean Francois Champollion) నిర్వచించాడు. ఈ నిర్వచనం ప్రకారం ప్రాచీన నాగరికతల సంకేత-లిపులు (Tokens, symbols, signs) మనం ఇప్పుడు వాడే ఆధునిక ట్రాఫిక్ సంకేతాలు, కంప్యూటర్లలో వాడే ఐకాన్లు, గణిత, రసాయన శాస్త్రాలు, పాశ్చాత్య సంగీతం రాయడానికి ఉపయోగించే సంకేత లిపుల వంటివి — ఇవేవీ కూడా పూర్తి రాత వ్యవస్థలు కావు, కాని ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని క్రోడీకరించడానికి వాటి రాతకి అనుబంధంగా ఉపయోగపడతాయి.

రాత పరిణామక్రమంలో ఐదు [22] ముఖ్యమైన దశలున్నాయి.

  1. చిత్రాల సహాయంతో సంభాషణ జరపడం లేదా సందేశాలు పంపడం. ఈ దశలో భాషని, భాషలోని పదసంపదని రాత క్రోడీకరించదు. ఈ రాత రాసినవారికి, అది ఎవరిని ఉద్దేశించబడిందో వారికి మాత్రమే అర్థమవుతుంది. ఈ దశని ప్రోటోరైటింగ్ (ఆదిలేఖనం) అంటారు.
  2. వస్తుప్రపంచం లోని వస్తువులతో సాయంతో, భాష లోని శబ్దాలకి కొన్ని చిహ్నాలని కల్పించడం. వస్తువుల సాయంతో పదాలని సూచించడం. దీనిని రీబస్ సూత్రం అంటారు.
  3. శబ్దలేఖనం – భాషలోని పదాలని చిత్రాలుగా మార్చడం.
  4. అక్షరసముదాయం – భాషలో ధ్వనులకి కొన్ని చిత్రసంకేతాలు ఏర్పరచడం.
  5. పూర్తి ధ్వనిలేఖనం – భాషద్వారా మాట్లాడే ధ్వనులని వర్గీకరించుకుని, వాటికి చిహ్నాలేర్పరుచుకొని వాటి సాయంతో భాషలోని ఈ పదానైన్నా రాయడం. ఇందులో తిరిగి స్వరాలని (అచ్చులు), వ్యంజనాలని (హల్లులు) ప్రత్యేకంగా, వేరు వేరు చిహ్నాలతో గుర్తించడం పూర్తి స్థాయి ధ్వన్య లిపి (Phonetic script).


2వ చిత్రంలో చూపినట్టుగా మెసపటేమియాలో మొట్టమొదటి లిపి ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. క్రీ. పూ 3000 నాటికి ఈజిప్టులో చిత్రలిపి, క్రీ. పూ 1650-1200 నాటీకి లీనియర్-ఎ, లీనియర్-బి లిపులు, క్రీ,పూ. 1500 నాటికి చైనాలోనూ, క్రీ.పూ. 800-700 మధ్య గ్రీసుదేశం లోనూ ఏర్పడ్డాయి. సింధులోయలో దొరికిన అవశేషాలలో కుండలు, మట్టిపలకల మీద కొన్ని రాత వంటి చిహ్నాలు దొరికాయి, కాని సింధులోయలో దొరికిన లిపి భాషని రాయడానికి ఉపయోగించుకున్నారా లేదా ఇంకా నిర్ధారించలేదు, అది ఇప్పుడు పరిశోధకుల మధ్య పెద్ద వివాదంగా మారింది.


2. విభిన్న సంస్కృతులలో లిపుల ఆవిర్భావం (వివరం కోసం బొమ్మపై క్లిక్ చేయండి)

కాలక్రమంలో ఎన్నో లిపులు అంతరించిపోయాయి, మరెన్నో లిపుల ఆనవాళ్ళు దొరికినా అవే భాషలవో, వాటిని ఎట్లా పలికేవారో తెలియదు. కొన్ని లిపుల భాష ఏదో తెలిసినా, దానిని ఎలా చదవాలో తెలీదు, మరొకొన్ని లిపులలో సంకేతాలు ఏమిటో తెలిసినా, దాని భాష ఏమిటో, దానిని ఎలా చదవాలో తెలీదు. అలా మనకు తెలియకుండా పోయినవి, ఇంకెప్పటికీ తెలియని లిపుల పట్టిక 3వ చిత్రంలో చూడండి.


3. మనకి తెలియని కొన్ని లిపులు.
(వివరం కోసం బొమ్మపై క్లిక్ చేయండి)

ఈ ఐదు దశల గురించి విపులంగా పరిశీలిద్దాం.

చిత్రలిపి – బొమ్మల సాయంతో వ్యక్తీకరణ:

చారిత్రకగతిలో మార్పు చెందనిదంటూ ఏదీ ఉండదు. అక్షరాలవి శాశ్వతమైన ఆకృతులు కావు. ఈనాటి ఆధునిక లిపులన్నీ, ఒకప్పటి శరాకార (Cuneiform) లిపుల నుండి, ఈజిప్టియన్ల గూఢచిత్ర (Hieroglyphics) లిపుల నుండి, కాలక్రమంలో పరిణమించినవి (చిత్రం-4). భాష, రాతల పరిణామక్రమాన్ని చారిత్రక దృష్ఠితో పరిశీలిస్తే, దృశ్యరూపకమైన భాషని, ధ్వనిరూపకమైన భాషని వేరుగా గుర్తించి వాటిని అనుసంధానం చేసిన రీతిలో ఇమిడి ఉందనుకోవచ్చు.


4. శరాకార గూఢచిత్ర లిపుల నుండి ఆధునిక లిపి పరిణామక్రమం.
(వివరం కోసం బొమ్మపై క్లిక్ చేయండి)

కొన్నివేల సంవత్సరాలకు పూర్వం భాష, ధ్వని, లిపి ఒకదానితో ఒకటి మమేకమై ఉండేవి. సమాజం చిన్నదైనప్పుడూ, అందరికీ అందరూ తెలిసినప్పుడూ, మనకి తెలిసిన, మనకి సంబంధమున్న, మన వ్యాపారానికి కావాల్సిన, అనువైన వస్తు సముదాయం చిన్నదైనప్పుడూ కొన్ని శబ్దాలు, చిత్రాలు సరిపోతాయి. ఇట్లాంటి సంకేత చిత్రం (Pictograph) మానవుడి మొట్టమొదటి సంవాద సామాగ్రి. ఇట్లాంటి లిపిని మొన్నమొన్నటి వరకూ అమెరికన్ ఇండియన్లు వాడుతూ ఉండేవారు. ఉదాహరణకి, 5వ చిత్రంలో ఓ తండ్రి, తన కొడుక్కి ‘రాసిన’ ఉత్తరం – “నీకు 53 డాలర్లు పంపుతున్నాను. వాటితో ఇంటికి రా.” పంపిన వ్యక్తి పేరు Turtle-Following-His-Wife (ఇలాంటి పేర్లు అమెరికన్ ఇండియన్ తెగలలో సహజం.) దీనిని సూచించటానికి రెండు తాబేళ్ళ బొమ్మలుంటాయి, ఒక తాబేలు వెనక మరో తాబేలు వెళుతూ ఉంటుంది. 53 డాలర్లని సూచించటానికి 53 సున్నాలు ఉంటాయి. నువ్వు నా దగ్గరకి రా అని చెప్పడానికి, రావలసిన మనిషిలోంచి మరో మనిషిని పిలుస్తున్న మనిషి తన దగ్గరకి లాక్కుంటున్నట్టు ఉంటుంది. ఇటువంటి సందేశాలలో బొమ్మ, భాష వేరు వేరు కాదు. అందుకని, ఇటువంటి చిత్రాలతో సంభాషణలని లిపి అనడానికి కుదరదు. ఎందుకంటే, ఈ చిత్రాలని ఎలా పలికేవారో తెలియదు. ఈ చిత్రంలో సందేశానికి మాటలు అక్కరలేదు. వాటిల్లో పదాలు లేవు. కాబట్టి, వాటి పలుకుబడి ఎంతోకాలం నిలవలేదు [23].


5. “నీకు 53 డాలర్లు పంపుతున్నాను. వాటితో ఇంటికి రా” – చిత్రలిపిలో రాసిన ఉత్తరం
(షేయేన్ ఇండియన్ తెగ.)

చిన్న, చిన్న సందేశాలు పంపుకోడానికి చిత్రలిపులు ఉపయోగపడ్డా చెప్పుకోవలసింది – దాచుకోవలసింది – ముందు తరాలకి పంచవలసిందీ, సంస్కరించుకోవలసిందీ – పరిరక్షించుకోవల్సిందీ అయిన సమాచారం ఎక్కువైపోయినకొద్దీ, అమూర్త భావనల రద్దీ చిత్రలిపికి మొయ్యలేని భారమైపోయింది. చిత్రలిపి తరువాతి పరిణామం పద సంజ్ఞలు (Ideogram or Logography). ఉదాహరణకి పాదం బొమ్మను పాదానికే కాకుండా, నడకకి, పరుగుకి, రమ్మనడానికి, పొమ్మనడానికి సంజ్ఞగా వాడుకోవచ్చు. ఈ పద్ధతి మొదటి దానికన్నా సౌకర్యంగా ఉన్నా, అవసరమైన సంజ్ఞలు ఎక్కువైపోతాయి. ఒక సంజ్ఞతో ఎన్నో పదాలు సూచించ గలిగినప్పటికీ, భాష మొత్తానికి అవసరమయ్యే సంజ్ఙలు ఎక్కువవుతాయి. సుమేరియన్లకి ఇట్లాంటివి సుమారుగా 1500 సంజ్ఙలు ఉండేవి. చైనీయులకి తొమ్మిదివేలకి పైమాటే మరి! సుమేరియన్ల శరాకార లిపిలోనూ, ఈజిప్టియన్ల గూఢచిత్ర లిపిలోనూ ఇంట్లాంటి సంజ్ఞలతో కూడిన సంకేత భాష ఉండేది.

చిత్రలిపికంటే, పదసంజ్ఞల లిపిలో అటువంటి అమూర్తత్వం ఎక్కువ. కాని, ప్రోటోరైటింగ్ దశనాటి ప్రాచీన సుమేరియన్, ఈజిప్టియన్ల లిపిని ఒక పరిపూర్ణ లిపి వ్యవస్థగా (Writing system) భావించడానికి వీలులేదు. అక్షరానికి ధ్వని సంకేతం (Phonetic Symbol), దృశ్య సంకేతం (Pictographic Symbol), అని రెండు రూపాలున్నాయి. సుమేరియన్‌, ఈజిప్టియన్‌ లిపులలో ఈ రెండూ రూపాలు వస్తుప్రపంచం ద్వారా అనుసంధానం (చిత్రం-6) అవుతాయి. అందుకని వీటిని సంపూర్ణ, స్వతంత్ర లిపి వ్యవస్థగా పరిగణించరు.


6. చిత్రలిపిలో సంకేతం ధ్వనిగా మారటంలో వస్తువు ప్రమేయం ఉంటుంది.

మాటని, వ్రాతని అనుసంధానం చేసే వస్తువుని తొలగించడమే ధ్వని ఆధారితమైన లిపుల ఆవిర్భావానికి నాంది. ఈ ప్రక్రియని రీబస్ సూత్రం (Rebus Principle) అంటారు. ఒకే రకంగా ధ్వనించే పదాలన్నిటికీ, వాటిల్లో చిత్రీకరణకి అనువుగా ఉండే ఏదో ఒక సంకేతం ద్వారా ఆ పదాలన్నిటినీ రాయడమే రీబస్ సూత్రం.


7. రీబస్ సూత్రం ఆధారంగా రాసిన I Saw Bill అన్న వాక్యం.

కాని, పూర్తి భాషని వ్యక్తీకరించడానికి ఇటువంటి పట సంకేతాలు (Graphic Symbols) సరిపోవు, పైగా ప్రతిబంధకాలుగా మారతాయి. ఈ పద్ధతిని కొత్త దారిలో పొడిగించుకోవలసిన అవసరం ఏర్పడింది. దాని పర్యవసానమే ధ్వనులని, వాటి సంకేతాలని వ్యవస్థీకృతంగా సమన్వయం చేసుకుంటూ ఆవిర్భవించిన అక్షరలిపుల వ్యవస్థ (Alphabetical System) – దీనినే ధ్వనిసంకేత వ్యవస్థీకరణ అని కూడా అనుకోవచ్చు. పటసంకేతాలు రూపాంతరం చెందుతూ, రీబస్ సూత్రాన్ని కొత్త దారుల్లో, సంక్లిష్ట పద్ధతులలో వాడుతూ ఉండటం వల్ల, క్రమక్రమంగా అక్షర స్వరూపంలో ధ్వని విలువ (Phonetic Value) పెరుగుతూ, అనాదిగా ఉన్న శబ్దార్థం (Semantic Value) పూర్వపక్షం కావడమనే ప్రక్రియకి సంపూర్ణరూపమే ఆధునిక అక్షరలిపి.

అక్షరలిపులలో – ధ్వనికి, స్వరూపానికి అనుసంధానం బయటి ప్రపంచంలోని వస్తువుతో ఉండదు. వాటి అనుసంధానం భాషా వ్యవస్థలో అంతర్లీనంగా, నిబిడీకృతమై ఉంటుంది. అంటే, మొదటి దశలో యాపిల్ పండు ని సూచించాలంటే యాపిల్ బొమ్మ, నిమ్మపండుని సూచించడానికి నిమ్మపండు బొమ్మ ఉంటాయి. రెండో దశలో, ఏదో ఒక ‘పండు’ బొమ్మ అన్ని పళ్ళకీ ప్రతీక అవుతుంది. మూడో దశలో పండుతో పండునే కాకుండా, తినడాన్ని, ఆకలిని, భోజనాన్ని సూచించవచ్చు, అటుపైన రీబస్ సూత్రంతో పండుబొమ్మతో దంతాలని సూచించటం. చివరగా, పండు అనే శబ్దంలో ‘ప’ కారాద్వనికి , ‘డ’ కార ద్వనికి చిత్ర-చిహ్నాలు ఏర్పరుచుకోవడం. ‘ప’కారాన్ని చూసినప్పుడు, దానిని ఎలా పలకాలో ఆ భాష మాట్లాడేవారికే తెలుస్తుంది.

క్రీ.పూ 3700 నాటికే, పటసంకేతాలు ధ్వనిసంకేతాలుగా రూపాంతరం చెందటంతో, రాతకి పలుకొచ్చింది. చిత్రాలతో సంభాషణ శబ్దసంకేతంగా మారింది – అప్పటినుండే రాత ‘సాంకేతికం’ అయిందనుకోవచ్చు. పిక్టోగ్రఫీనుంచీ ఫోనోగ్రఫీకి మారడంతోనే అసంపూర్ణమైన లిపులు, పూర్తి రాత వ్యవస్థలుగా మార్పు చెందడం మొదలుపెట్టాయి. మొదట్లో, ఎద్దు బొమ్మతో ఎద్డుని మాత్రమే సూచించ గలిగేవారు, కాలక్రమంలో ఆ బొమ్మే ఈనాటి Aగా మారింది. A అనే శబ్ద సంకేతం ఈనాడు ఒక ధ్వనిరూపకం మాత్ర్రమే, దానికి బాహ్యప్రపంచం లోని ఏ వస్తువు తోనూ ప్రమేయంలేదు. అంటే అమ్మతో అ’కారం, ఆవుతో ఆ’కారం అనుకుంటూ మొదలెట్టిన మనిషి, అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అనే స్థాయికి చేరుకోవడంలోని వైచిత్రి, చిత్రలిపులనుండి ధ్వని సంకేతాలకి మారటంలోనే ఉంది.


8. లిపి ఆవిర్భావం: వస్తువు ప్రమేయం లేకుండానే సంకేతం ధ్వనిగా మారటంవల్లే రాత సాధ్యమయింది.

ఆయా ప్రాంతాల భాషలకి, అవసరాలకి అనుగుణంగా అది చిత్రలిపులతో, శబ్దలేఖనం, నిర్ధారకాలు (Determinatives – sign identifiers) ఒకదానితో ఒకటి పెనవేసుకుంటూ వేరు వేరు లిపులు ఏర్పడ్డాయి. ఈజిప్టులోని గూఢలిపి (Hieroglyphs), మెసపటేమియాలోని శరాకార లిపి (Cuneiform) కూడా ఈ మిశ్రమ పద్ధతి నుంచి పుట్టినవే. అయితే, ఈ రెండు భాషలు మౌలికంగా వేర్వేరు భాషలు కాబట్టి, వాటని రాసే పద్ధతి, పరికరాలు కూడా వేర్వేరు కాబట్టి వాటి లిపుల పరిణామం కూడా ఒకదాని కొకటి సంబంధం లేనట్టుగా జరిగింది. కాని ఈ రెండు లిపులు సుమారు 3400 ఏళ్ళపాటు ఆ సమాజాల అభివృద్ధికి దోహదపడ్డాయి.

కాలక్రమంలో, ఈ లిపులన్నిటిలోనూ మొదట్లో ప్రత్యేకంగా ఒక వస్తువుని, వస్తు సముదాయాన్ని సూచించటానికి ఉపయోగపడ్డ సంకేతాలు, వస్తుప్రపంచంతో వాటికున్న అనాది సంబంధాన్ని తెంచుకుని, ఒక్కో సంస్కృతిలో ఒక్కో మార్గంలో వాటి పరిధిని పెంచుకున్నాయి. ప్రతి ఒక్క సంకేతమూ దేనికదే ఒక ప్రత్యేకమైన భాషా పరికరంగా ఎదిగింది. రాత కూడా చిన్నపాటి లెక్కలు, రాజ శాసనాల పరిధిని దాటి విస్తృతం అవటంతో రాతకి భాషని వ్యక్తీకరించడంలో కొత్త అస్తిత్వం వచ్చింది. భాష అవసరాలని మాటలుగా, పలుకుబడిని కొత్త దారుల్లో ఆమంత్ర్రించడానికి, నియంత్రించడానికి, పెంపొందించడానికి సాధనం అయింది. ఈ ప్రక్రియలో కొత్త సమాజాలు రాతని అలవర్చుకొని, వాటి అవసరాలకి అనుగుణంగా మార్చుకొన్నాయి. కేవలం ఒక వెయ్యి సంవత్సరాలలో, అభివృద్ధికి రాత మౌలికావసరం అయిపోయింది.

లిపుల వర్గీకరణ

ఇంగ్లీషు భాష చదవడం, రాయడం వచ్చినవారికి 52 అక్షరాలు (26 పెద్దబడి, 26 చిన్నబడి అక్షరాలు), అంకెలు, విరామ చిహ్నాలు, = + & % మొదలైన అర్థసంకేతాలు (Logographs) సునాయాసంగా గుర్తు పట్టడం వస్తుంది. అదే, భారతీయ భాషలు చదవడం, రాయడం వచ్చినవారికి సుమారుగా 45 అక్షరాలు, వాటి గుణింతాలతో సైతం గుర్తు పడతారు. (భారత భాషల్లో అక్షరాలు, గుణింతాలు, సంయుక్తాక్షరాల సంక్లిష్టత గురించి విపులంగా తరువాత చర్చించాం). అదే జపాను భాష చదివేవారికి కనీసం 2000 సంకేతాలు, బాగా చదువుకున్నవారైతే 5000 సంకేతాల వరకూ గుర్తుపడతారు. స్థూల దృష్టికి చైనా-జపాను భాషలకి, ఇండో-యూరోపియన్ భాషల లిపులకి మధ్య తేడా చాలా పెద్దదిగా అనిపించినా, నిజానికి అన్ని భాషల లిపుల మధ్యా ఎంతో కొంత సామ్యం ఉంటుంది.

జాఁ షాంపోయాఁ నిర్వచనం ప్రకారం పరిపూర్ణ లిపులన్నీ ఒక సూత్రానికి లోబడి ఉంటాయి. ఇంగ్లీషు, లాటిన్ వంటి అక్షరలిపులు (Phonetic), చైనీస్, జపానీస్ వంటి అర్థ-సంకేత లిపులు (logographic) శబ్దానికి, చిత్ర రూపకమైన సంకేతాలు ఉంటాయి. అన్ని లిపులు ధ్వని సంకేతాలని (Phonetic symbols), అర్థసంకేతాలతో (Logographic Symbols) మిశ్రమం చేసుకున్నవి. అయితే, ఒక్కో లిపిలో ఈ నిష్పత్తి – అంటే, ధ్వని సంకేతాల, అర్థ సంకేతాల మిశ్రమం ఏ మేరుకు ఉందనేది – మారుతూ ఉంటుంది. లిపిలో ధ్వని సంకేతాల నిష్పత్తి ఎక్కువగా ఉంటే, ఒక పదం యొక్క ధ్వనిని సులువుగా ఊహించవచ్చు. ఇంగ్లీషు వంటి భాషల్లో ఈ నిష్పత్తి ఎక్కువ, చైనా-జపాను భాషల్లో ఈ నిష్పత్తి తక్కువ. భారత లిపుల్లో ఈ నిష్పత్తి ఇంకా ఎక్కువే. అందుకే భారతీయ లిపులని ధ్వన్యలిపులు (phonetic script) అంటారు.


9. అర్థ సంకేతాలు – ధ్వని సంకేతాలు: వీటి మిశ్రమాల నుండి ఏర్పడ్డ లిపులు. ప్రస్తుతం మనం వాడే IPA పరిపూర్ణమైన ధ్వనిసంకేత లిపిగా పరిగణించవచ్చు.

పై బొమ్మలో చూపినట్టుగా, స్థూలంగా లిపులన్నిటినీ ధ్వనిరూపకాలు గానూ, పదరూపకాలు గాను రెండు విధాలుగా విభజించవచ్చు. అయితే, ఏ లిపీ ఏకమొత్తంగా ధ్వనిరూపకంగా గానీ, లేదా పదరూపకంగా గానీ ఉండదు. ఎంతో కొంత శబ్దార్థం (Semantic meaning) ధ్వనిరూపాలలో అంతర్లీనంగా ఉంటుంది, ఎంతో కొంత ధ్వని సంకేతం పదరూపకాలలో ఉంటుంది. ఒక్కో లిపిలో వీటి నిష్పత్తులు ఒక్కోరకంగా ఉంటాయి. 6వ చిత్రంలో చూపినట్టుగా భారతీయ, ఫిన్నిష్ భాషల్లో ధ్వనిరూపక శాతం అత్యధికంగా ఉంటే, చైనా భాషలో పదరూపక శాతం అత్యధికంగా ఉంటుంది. అందువల్ల, స్వచ్ఛమైన లిపి అంటూ ఏదీ ఉండదు – అంటే, పూర్తిగా శబ్దార్థ సాయం లేకుండా ధ్వనిని మాత్రమే వ్యక్తీకరించగలిగే లిపి గానీ, లేదా ధ్వని సాయం ఏ మాత్రమూ లేకుండా శబ్దార్థాన్ని వ్యక్తీకరించగలిగే లిపి గానీ ఉండదు.

ఈ కారణం వల్లనే ప్రపంచంలోని లిపులని ఏ ప్రాతిపదికన వర్గీకరించాలనే విషయంలో పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఉదాహరణకి, కొంతమంది పరిశోధకులు గ్రీకు లిపికి పూర్వమే ఉన్న, అచ్చులు లేని ఫొనీసియన్ లిపిని అక్షరలిపిగా అంగీకరించరు. అయితే, 7వ చిత్రంలో చూపినట్టుగా, లిపులయొక్క ప్రధానమైన స్వభావరీత్యా వాటిని కొన్ని రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈ వర్గీకరణ లిపుల స్వభావాన్ని బట్టి చేసిన వర్గీకరణ – వాటి ప్రాచీనత ఆధారంగా చేసినది కాదు, అందువల్ల ఏ లిపి నుండి ఏ లిపి పుట్టిందో చూపించడం ఈ వర్గీకరణ ఉద్దేశ్యం కాదు.


10. లిపుల ప్రధాన స్వభావాన్ని బట్టి చేయగలిగిన లిపి వర్గీకరణ
(వివరం కోసం బొమ్మపై క్లిక్ చేయండి.)

ఈజిప్టు గూఢచిత్ర లిపి చరిత్ర


11. ఈజిప్షియన్ల వ్యంజనాక్షర లిపి

ఈజిప్టియన్ల గూఢచిత్ర లిపికి (Hieroglyphics), సుమేరియన్ల శరాకార లిపికి కొన్ని మౌలికమైన తేడాలున్నాయి — ఈ తేడాలు ఆ రెంటి భాషాస్వరూపాలకి చెందినవి. ఈజిప్టులో వాడిన గూఢచిత్ర లిపిని శబ్దవ్యంజన లేఖన పద్ధతి (Logo-Consonantism) అనీ, సుమేరియన్ల శరాకార లిపిని శబ్దాక్షర లేఖన పద్ధతి అనీ (Logo-Syllabary) అంటారు. లోగోగ్రఫీ అంటే శబ్దలేఖనం – శబ్దమంటే భాషలో అర్థవంతమైన ఒక మాట/పలుకు/పదం, కాబట్టి దీనిని అర్థసంకేతలిపి అని కుడా వ్యవహరించవచ్చు.

చిత్రలిపితో ప్రారంభమైన లేఖన పద్ధతి కాలక్రమంలో శబ్దలేఖనంగా మారింది. ఈజిప్టు లిపిని చిత్రలిపిగా వ్యవహిరించడానికి ముఖ్యకారణం – ఒక వస్తువు రూపాన్ని ఆ వస్తువు పేరు లోని మొదటి ధ్వనికి సంకేతంగా వాడడం. ఉదాహరణకి, ‘ప’ అనే ధ్వనిని సూచించడానికి పండు బొమ్మని వాడడం అన్నమాట. ఈ పద్ధతిని ఆద్యక్షరధ్వని (Acrophony) పద్ధతి అంటారు. ఈజిప్టు భాషలో రు అంటే నోరు. నోటి బొమ్మ నోటినే కాకుండా, ర్ అనే ధ్వనికి సంకేతంగా వాడేవారు. ఇటువంటి ధ్వనివాచకాలు వారికి 25 ఉండేవి. కానీ, అప్పటికి అచ్చులని వేరుగా రాయాలనే ఆలోచన లేకపోవడంతో, కేవలం ఈ ధ్వనివాచకాలతో భావాన్ని పూర్తిగా వ్యక్తపరచలేక పోయేవారు. ఈ 25 ధ్వనివాచకాలతో బాటు, మొత్తం పదాన్నంతా సూచించే బొమ్మలు, రెండు హల్లులని, మూడు హల్లులని కలిపి ఒకే సంకేతంగా కూడా రాసేవారు. ఇవే కాకుండా, ఒక పదాన్ని లేదా వాక్యాన్ని సందిగ్ధం లేకుండా సూచించడానికి, పదం పక్కనో, వాక్యం పక్కనో సందిగ్ధనివారణ కోసం కొన్ని నిర్ధారకాలని (Determinative) ఉపయోగించేవారు. ఉదాహరణకి, తన్ అంటే పుస్తకం. ఈ పదం ధ్వనిసంకేతాలతో రాసి, దాని పక్కనే పుస్తకం బొమ్మ కూడా గీసేవారు. (12వ చిత్రం చూడండి.)


12. ఈజిప్షియన్ల లిపిలో నిర్ధారకాల వాడకం

అచ్చులని, హల్లులని ప్రత్యేకంగా సూచించడం ఆధునిక అక్షరమాల (Alphabet) మౌలిక సూత్రం. ఈజిప్టు చిత్రలిపిలో ఉపయోగించిన 25 ధ్వనిసంకేతాలు ఈ విధంగా ఆధునిక లిపులకి మాతృకలనుకోవచ్చు. క్రీ.పూ 2000 నాటికి, ఈజిప్టు లేఖకులకి కేవలం ధ్వని సంకేతాలతో భాషని పూర్తిగా వ్యక్తీకరించవచ్చనే మౌలికసూత్రం అర్థమయినప్పటికీ, వారు తమకు అలవాటైన పాత పద్ధతిని వదలలేదు. అప్పటికే, ఎంతో ప్రాచుర్యం చెందిన గూఢచిత్రలిపే కాకుండా మరో మూడు లిపులు ఉండేవి. గూఢచిత్రలిపిని ముఖ్యంగా దేవాలయాల గోడల మీద, రాజవంశీయుల సమాధుల మీద, ఇతరత్రా చాలా ముఖ్యమైన రాతల కోసమే వాడేవారు. రోజువారి వ్యవహారాలకి, ముఖ్యంగా సిరాతో పాపిరస్ మీద రాయడానికి వారికి వేరేగా ఒక వంకర లిపి –హైరాటిక్ లిపి (Hieratic) – ఉండేది.


13. ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్ హైరాటిక్
డెమోటిక్ లిపులు

ఇది గూఢచిత్రలిపి అంత సంక్లిష్టంగా ఉండేది కాదు. గూఢచిత్రలిపిలో సుమారుగా 2500 శబ్దసంకేతాలు ఉండేవి, ధ్వని సంకేతాల వాడకం పెరిగాక శబ్దసంకేతాల వాడకం తగ్గి వీటిలో 500 మాత్రం విరివిగా వాడకంలో ఉండేవి. క్రీ.పూ. 700 నాటికి, లేఖకుల సంఖ్య పెరగడం వల్ల కావొచ్చు, లేదా దస్తావేజులు, పద్దు పుస్తకాలు రాయడానికి గూఢచిత్రలిపికి అవసరమైనంత శ్రద్ధ అనవసరమైనందువల్ల కావచ్చు — ఈ హైరాటిక్ లిపి అస్తవ్యస్తంగా మారి దాని లోంచి మరో లిపి పుట్టుకొచ్చింది. ఎవరు బడితే వారు రాయగలిగేది కాబట్టి, దీనికి హెరోడిటస్ డెమోటిక్ లిపి (Demotic script) అన్నాడు. ఈ డెమోటిక్ లిపే ఈజిప్టులో క్రీ.శ.500 వరకూ వ్యవహారంలో ఉండేది.

రొసెట్టా రాతిపలక


14. రోసెట్టా రాతిపలక

ఈజిప్టు గూఢచిత్ర లిపిని చదవడంలో రొసెట్టా రాతిపలక (Rosetta Stone) పాత్ర అతి ముఖ్యమైనది. క్రీ.పూ. 196లో ఈజిప్టుని పాలించిన ఐదో టాలెమీ (Ptolemy) దీనిని రాయించాడు. దీనిపై ఒకే సందేశాన్ని మూడు భాషల్లో – గూఢచిత్ర లిపి, డెమొటికి లిపి, గ్రీకు లిపి – రాయడం వల్ల, పరిశోధకులకి ప్రాచీన ఈజిప్టు లిపులని సాధించడానికి ఇది పనికివచ్చింది. ఈ పలక మొదట్లో ఒక దేవాలయంలో ఉండేది, కానీ క్రీస్తుశకం వచ్చేటప్పటికి ఈ పలక రొసెట్టా అనే పట్టణంలో ఒక భవంతి నిర్మాణంలో ఉపయోగించారు. దీనిని 1799 లో ఫ్రెంచి సైన్యంలో పనిచేసిన పియేర్ బుషార్డ్ (Pierre Francois Bouchard) అనే అతని ద్వారా ఈ రొసెట్టా ఫలకం బయటపడడంతో ఈజిప్టు చారిత్రక పరిశోధనలలో ఒక విప్లవం వచ్చింది. ఈజిప్టాలజీ పరిశోధకులైన థామస్ యంగ్ (Thomas Young), జాఁ షాంపోయాఁ రోసెట్టా రాతిపలక సాయంతో ఈజిప్టు గూఢచిత్రలిపిని చదవగలిగారు. యంగ్ మొదట ఈ లిపిని సాధించాడంలో చాలా ప్రయత్నం చేసినా, పూర్తిగా కనుక్కోలేకపోయాడు. జాఁ షాంపోయాఁ 1822 లో రోసెట్టా రహస్యాన్ని పూర్తిగా ఛేదించాడు.


12. ఆధునిక పాశ్చాత్య లిపులకు ఈజిప్ట్ చిత్రలిపులే మాతృకలు.

ఈజిప్టు గూఢచిత్రలిపి బహుశా ప్రపంచ లిపులన్నిటిలోనూ అందమైనదీ, సంక్లిష్టమైనదీనూ. రాతని ఒక కళారూపంగా ఆరాధించిన సంస్కృతి వారిది. మెసపటేమియాలో లేఖకులకి గుమాస్తాలకున్న స్థానమే ఉండేది గానీ, ఈజిప్టులో లేఖకులకి గురువులు, పూజారుల కుండే గౌరవం ఉండేది. హల్లులని గుర్తించి వాటి ద్వారా ధ్వనిలేఖనానికి పునాది వేయడం ఈజిప్టు సంస్కృతినుండే ప్రపంచం నేర్చుకున్నది. ఈనాటికీ, పాశ్చాత్య లిపులలో ఎన్నో అక్షరాల రూపానికి 15వ చిత్రంలో బొమ్మలో చూపినట్టుగా, ఈజిప్టు చిత్రలిపులే మాతృకలు.

మెసపటేమియా శరాకారలిపి చరిత్ర

రీబస్ సూత్రం నుండీ వచ్చిన శబ్దలేఖనం రూపాంతరం చెందుతూ ధ్వనిలేఖనానికి పరిణామం చెందడం ప్రధానంగా మెసపటేమియా శరాకార లిపి (Cuneiform) ద్వారానే జరిగింది. ఈ మార్పుకి బీజాలు ఈజిప్టులో ఉన్నప్పటికీ, ఈ మార్పుని తెచ్చుకోవాలసిన సామాజిక, రాజకీయ, భౌగోళిక అవసరం మెసపటేమియాలో ఉండింది. ఈజిప్టులో ఒకే భాషని నాలుగు రకాలుగా రాస్తే, శరాకార లిపి ఒక్క భాషకి పరిమితం కాకుండా ఎన్నో భాషలు రాయడానికి వాడేవారు. దానికి కారణం, శరాకార లిపిని ముందుగా ఉపయోగించిన సుమేరియన్ల (Sumerians) అధికారం అంతరించి, అక్కాడియన్లు (Akkadians) అధికారంలోకి రావడం – వారి భాష సుమేర్ల భాష కంటే మౌలికంగా వేరుగా ఉండటం మొదలైనవి ముఖ్యమైన కారణాలు. భౌగోళికంగా కూడా మెసపటేమియా చుట్టుపక్కల సంస్కృతులతో కలసిపోయి ఉండటం శరాకార లిపి ప్రాచుర్యానికి మరోకారణం. ఇవి కాకుండా, శరాకార లిపి పరిణామాన్ని రాయడానికి ఉపయోగించిన పరికరాలు, సాధనాలు నిర్దేశించాయి. శరాకార లిపిని మట్టిపలకల మీద త్రిభుజాకారంలో ఉండే ఘంటంతో రాసేవారు. అందుకని, శరాకారలిపి సరళంగా, సులువైన రేఖలతో ఉంటుంది. అందువల్ల ఈజిప్టు చిత్రలిపిలో ఉన్నట్టుగా సంక్లిష్టమైన చిత్రాలకి ఈ లిపిలో ఆస్కారంలేదు.


16. సుమేరియన్ శరాకార లిపి
(క్రీ.పూ 2400.)

మొదట్లో, శరాకార లిపిని చూచి అర్థం చేసుకోవలసిందే కాని, చదివి అర్థం చేసుకోడానికి వీలుగా ఉండేది కాదు. వాక్యాలు కూడా ఒక పంక్తిలో కాకుండా పలకంతా చెదురుమదురుగా ఉండేవి. సుమారుగా 1800కి పైగా సంకేతాలు ఉండేవి. కాలక్రమంలో, రాత వ్యవస్థీకృతం అయ్యాక (అంటే, క్రీ.పూ 2700-2350 నాటికి,) 800 శబ్దసంకేతాలు ఉండేవి. క్రీ.పూ. 2000 నాటికి, శరాకార లిపిలో శబ్దసంకేతాల సంఖ్య బాగా తగ్గి, ధ్వని సంకేతాలు పెరిగాయి. ఈ కాలం లోనే, ఈ లిపిని ఎడం నుండి కుడికి, పలకకి అడ్డంగా రాసే పద్ధతి కూడా వచ్చింది. కాని, రాతిమీది శాసనాలు మాత్రం అనాదిగా వస్తున్న నిలువు పంక్తులు గానే రాసేవారు, ఈ సంప్రదాయం క్రీ.పూ 1500 వరకూ అలాగే కొనసాగింది.


16. హురియన్ శరాకారలిపిలో
సంగీతం. (క్రీ.పూ. 1400.)

క్రీ,పూ 2500 నాటికే, శరాకార లిపి భాషని పూర్తిగా – అంటే, భాష ద్వారా వ్యక్తీకరించగలిగే ఏ ఆలోచననైనా – రాత రూపంలో వ్యక్తీకరించగలిగే స్థాయికి చేరుకుంది. ఈ ప్రక్రియలో ధ్వనిని సూచించగలిగే అక్షరాల (Syllables) — అవసరం సుమేర్ లిపిలో వస్తువుని సూచించే బొమ్మని, అక్షరంగా మార్చుకోవడంతో సాధ్యపడింది. మొదట్లో సుమేర్ భాషలో ము అంటే మొక్క. అందుకని మొక్క బొమ్మతో ము ధ్వనిని సూచించేవారు. ఈ సంకేతం, కాలక్రమంలో మొక్కనే కాకుండా, సంవత్సరం, ప్రథమపురుష శబ్దానికి వాడే ప్రత్యయంగా, నాది అని చెప్పడానికి కూడా ఉపయోగించేవారు. మరికొంత కాలానికి, ఈ అక్షరానికి వస్తువుతో ఏ సంబంధమూ లేకుండా, ము అనే ధ్వనికి ప్రతీకగా మారింది. ఈ విధంగా, చిత్రసంకేతం, ధ్వనిసంకేతం, నిర్ధారితాలు అనే ముక్కాలిపీట మీద శరాకారలిపి ‘శబ్దాక్షరలిపి’గా అవతరించింది, ఈ లిపిలో, స్వతంత్రమైన, పూర్తి పదాలని సూచించడానికి కొన్ని సంకేతాలు, పదాలలోని పదాంశాలు (అక్షరాలు) సూచించడానికి కొన్ని సంకేతాలు ఉండేవి – ఈ సంకేతాలు అచ్చు, అచ్చు-హల్లు, హల్లు-అచ్చు, అనే మూడు వర్గాలుగా ఉండేవి. క్రీ,పూ. 1500 నాటికే, సంగీతాన్ని కూడా ఈ లిపిలో రాసేవారు.

క్రీ,పూ. 2800 కాలంలో సుమేర్ని ప్రాచ్య సెమెటిక్ ప్రాంతంనుంచి వచ్చిన అక్కాడియన్ తెగలు జయించాయి. సుమేర్ భాష మరో వెయ్యేళ్ళు మనగలిగినా, అక్కాడియన్లు శరాకార లిపిని వారి భాషని రాయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. కాని, అక్కాడియన్ల భాషకి, సుమేరియన్ల భాషకి కొన్ని మౌలికమైన తేడాలున్నాయి. సుమేరియన్ భాషలో ఎక్కువగా ఏకశబ్ద పదాలుండేవి, కాని అక్కాడియన్ల భాషలో ఎక్కువగా బహుశబ్ద పదాలే. దీనిమూలంగా శరాకార లిపిలో ఉన్న శబ్దసంకేతాల వాడకం తగ్గి, ధ్వనిసంకేతాల వాడకం పెరిగింది. కాలక్రమంలో, శరాకారలిపి రకరకాలుగా రూపాంతరం చెందుతూ హిటైట్ (Hittite), ఎలామైట్ (Elamite), హురియన్ (Hurrian), యురార్టియన్ (Urartian) మైదలైన ఎన్నో భాషలకి లిపి-మాతృక అయింది. ఈ లిపిని నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా ద్విభాషా నిఘంటువులు కూడా ఉండేవి


17. సుమేరియన్ – అక్కాడియన్
ద్విభాషా నిఘంటువు

శరాకార లిపి అభివృద్ధిలో మరొక ముఖ్యమైన పరిణామం ప్రాచీన పారశీక భాషని రాయడానికి క్రీ.పూ 350 వరకూ ఈ లిపినే వాడటం. పర్షియా చక్రవర్తి డారియస్ (Darius I) కొలువులో లేఖకులు శరాకార లిపితో పారశీక భాషని రాయడానికి కొన్ని సులువు సూత్రాలు ఏర్పరిచారు. పారశీక లేఖకులు తెచ్చిన మార్పుల్లో రెండు ముఖ్యమైనవి – అక్షరం (క – syllable), హలంతాక్షరం (క్ – phoneme) అనే రెండు రకాల ధ్వని సంకేతాలని రాయడానికి వీరు శరాకార లిపిని కుదించారు. దీనితో పాటుగా, దీర్ఘాక్షరాలు (ఆ, ఈ, ఊ…) రాయడానికి కూడా సౌలభ్యం వీరు కల్పించారు.

ప్రపంచంలో సాహిత్యరచనకి అంకురార్పణ జరిగింది కూడా శరాకార లిపితోనే! ప్రపంచ సాహిత్యంతో అతి ప్రాచీనమైన రచనలు – గిల్గమేష్ ఇతిహాసం (Epic of Gilgamesh), సుమేరియన్ల దైవప్రార్థనలు మొదలైనవి సుమేరియన్ మట్టిపలకల మీదే లభ్యం అయాయి. కానైతే, ఇప్పటి వరకూ దొరికిన లక్షాయాభైవేల పైచిలుకు మట్టిపలకలలో 75 శాతం వరకూ దస్తావేజులూ, పద్దు పుస్తకాలే. మిగిలిన వాటిల్లో న్యాయసూత్రాలు, కొన్ని వైద్యగ్రంథాలు, జ్యోతిష శాస్త్రం, నిఘంటువులు మొదలైన వాఙ్మయం కూడా ఉంది.[ఫుట్ నోట్-3]

భాష ప్రధానంగా ధ్వనిరూపకం. ఆ ధ్వనిరూపకమైన భాషకు చిత్రసంకేతాలతో ఒక పద్ధతిగా దృశ్యరూపాన్నివ్వడం అనే ఒక చిన్న భావన ఊపందుకుని, రీబస్ సూత్రం, వస్తుప్రపంచంతో సంబంధం తెంచుకుని, హల్లులు, అచ్చులు గుర్తించడంతో ఊడలు పాతుకుని, ప్రాచీన ప్రపంచం అంతా ధ్వనిలేఖనంగా విస్తరించింది. రాత అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన మెసపటేమియా ఈజిప్టు సంస్కృతులలో, వాటి రాతవ్యవస్థలలో కూడా ఈ మార్పు ప్రతిబింబించింది. మెసపటేమియాలో రాతకోసం ఉపయోగించిన పరికరాల మూలంగా వారి లిపి ధ్వనిలేఖనం దిశగా పయనిస్తే, ఈజిప్టు సంస్కృతి రాతని ఒక అత్యున్నతమైన కళారూపంగా, భగవత్ర్పసాదంగా ఆరాధించింది. ఈనాటికీ మధ్య ప్రాచ్య దేశాల్లో కాలిగ్రఫీని కళలన్నిటిలోకి అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు.

శరాకార లిపిలో ఉన్న సరళత, ధ్వనిని చిత్రీకరించగలిగే సౌలభ్యం వల్ల అది ఇతర భాషలని కూడా రాయడానికి అనువుగా ఉండేది, అంతే కాకుండా సుమేరియన్లు అధికారం కోల్పోయి, అక్కాడియన్లు అధికారంలోకి రావడం, భౌగోళికంగా ఆ ప్రదేశం చుట్టుపట్ల సంస్కృతులని ప్రభావితం చెయ్యడానికి అనువుగా ఉండటం వల్ల సుమేరియన్ల ధ్వనిలేఖన పద్ధతే ఈనాడు రాత వ్యవస్థలన్నిటిలోకీ అతి ముఖ్యమైనదిగా నిలిచింది.

ధ్వన్య లిపుల ఆవిర్భావం

ప్రాచీన ఈజిప్టు, మెసపటేమియా లిపులకి, ఆధునిక అక్షర లిపులకి మధ్య ఒక ప్రధానమైన భేదం ఉంది. అక్షర లిపులలో, అచ్చులకి తమకంటూ ప్రత్యేకమైన సంకేతాలు ఉంటాయి. హల్లుల నుండి అచ్చులని వేరుచేయడం అక్షర లిపులలో వచ్చిన పెద్ద పరిణామం. అచ్చులు, హల్లులు అన్నపేర్లు మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా పాణిని మహేశ్వర సూత్రాలతో వచ్చింది. భారతీయ ధ్వనిశాస్త్రంలో అచ్చులని స్వరాలని, హల్లులని వ్యంజనాలని అంటారు. స్వరం అంటే ఆపకుండా ఉచ్చరించగలిగేది, వ్యంజన మంటే ఉచ్చారణలో విరామం అవసరమయ్యేది అని స్థూలంగా చెప్పుకోవచ్చు. అచ్చులని ఒకదానివెంట మరోకటిగా ఆపకుండా ఉచ్చరించవచ్చు, అదే హల్లులని ఒకదానివెంట మరొకటి విరామంలేకుండా ఉచ్చరించడానికి అవదు [28]. స్వరాలని, వ్యంజనాలని వేరు వేరుగా గుర్తించడం (చిత్రం-18) ధ్వన్య లిపులలో (Phonetic scripts) ఆఖరి పరిణామం.


18. తొలి అక్షరసంచయాల ఆవిర్భావం – ఒక నమూనా.
(వివరం కోసం బొమ్మపై క్లిక్ చేయండి.)

రాత పుట్టుకే అంతు చిక్కని మాయ అనుకుంటే, మొట్టమొదటి అక్షర లిపి ఎలా వచ్చింది అనేది అంతకుమించిన వివాదస్పదమైన అంశం. గ్రీకుల ద్వారా ఆధునిక ప్రపంచానికి అక్షర లిపులు వచ్చాయనేది నిర్వివాదమే అయినా, ఎందుకు, ఎలా గ్రీసు దేశంలో అక్షరాలు అవసరమయ్యాయో తెలీదు. అచ్చులకి, హల్లులకి వేర్వేరు సంజ్ఞలు కల్పించాలనే ఆలోచన వారికెలా వచ్చింది? ఏ పరిస్థితులు అటువంటి ప్రయోగానికి ప్రేరేపించాయి?

ఇప్పటి సిరియా తీరప్రాంతమైన రస్‌ షమ్రా (Ras Shamra) వద్ద — ఒకప్పటి ఉగరిత్ (Ugarit) వద్ద — 30 అక్షరాలున్న శరాకార లిపి క్రీ.పూర్వం 14 శతాబ్దంలోనే ఉండేదనీ, ఫోనీసియాలో క్రీ.పూ. రెండో సహస్రాబ్దిలోనే 22 అక్షరాల హల్లులతో కూడిన లిపి ఉండేదని పరిశోధకులందరూ నిర్వివాదంగా అంగీకరించే సంగతి. అయితే, అక్షర లిపులు సుమేరియాన్ల శరాకార లిపినుంచీ పుట్టాయా, ఈజిప్టియన్ల గూఢచిత్ర లిపి నుండి పుట్టాయా, క్రీటులోని రేఖాచిత్రాల నుండి పుట్టాయా అనే ప్రశ్నకి సంతృప్తికరమైన సమాధానం లేదు [29]. ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేశారు. వ్యాపార లావాదేవీలు ఎక్కువ కావడంతో సులువుగా, అందరికీ వేగంగా నేర్చుకోగలిగే లిపి అవసరం వచ్చిందనేది ఒక వాదన. కాని, ఈ వాదనని నిరూపించే ఆధారాలేవీ లేవు – సుమేరియన్ల లావాదేవీలు రాసిన పలకలు దొరికాయి గానీ, గ్రీకుల గ్రీకులిపితో ఉన్న వ్యాపార సంబంధమైన లావాదేవీల ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు. అందుకే, మరికొందరు హోమర్ ఇతిహాసాలని రాయడం కోసం గ్రీకులు క్రీ.పూ. ఎనిమిదో శతాబ్దిలో అక్షరలిపిని కనుగొన్నారని ప్రతిపాదించారు.


18. సెరబిత్-ఎల్-ఖదీమ్ లిపి

1905లో సైనాయ్‌లో (Sinai), సెరబిత్-ఎల్-ఖదీమ్ (Serabit-el-Khadim) దగ్గర, టర్క్వాయిస్ (Turquoise) గనుల తవ్వకాలు జరుగుతుండగా, పెట్రీ (Flinders Petrie) అనే పరిశోధకుడికి , ఒక స్ఫింక్స్ (Sphinx) బొమ్మ కనిపించింది – అది ఈజిప్టు 18వ రాజవంశానికి చెందినదని గుర్తించారు. అంటే సుమారుగా క్రీ. పూ. 1500కి చెందినదన్నమాట. దాని కాళ్ళ దగ్గర అతనికి అంతకుముందు వరకూ తెలియని ఒక కొత్త లిపిలో చెక్కిన అక్షరాలు కనిపించాయి. దానిపక్కన ఈజిప్టు చిత్రలిపిలో రాసిన అక్షరాలు కూడా ఉన్నాయి. దానిపైన ఇలా ఉంది: Beloved Hathor, Mistress of Turquoise. ఇటువంటి రాతలు మరికొన్ని అతనికి కనిపించాయి. ఈ కొత్తలిపి బహుశా ధ్వన్య లిపి (phonetic script) అయ్యింటుదని ఆయన ఊహించాడు. అందులో ముప్పై కంటే తక్కువ సంకేతాలున్నాయి. ఆ గనుల్లో, ప్రాచీనకాలంలో, కానన్ (ఇప్పటి ఇజ్రాయెల్/లెబనాన్ ప్రాంతం) ప్రాంతం నుంచి వచ్చిన సెమైట్లు బానిసలుగా, కూలివారుగా పనిచేశారని ఆయనకి తెలుసు. అందుకని, ఆ లిపి సెమిటిక్ భాష అయ్యింటుందని ఆయన ఊహించాడు.

1915లో ఈజిప్టు చరిత్ర పరిశోధకుడు గార్డినర్ (Alan Gardiner) ఈ ప్రొటో-సెమిటిక్ (Proto Semitic) అని పిలవబడే లిపిని చదవగలిగాడు. ఇక్కడ దొరికిన శాసనం రెండు భాషల్లో ఉందికాబట్టి, ఆయన, ఈజిప్టు చిత్రలిపిలో ఉన్న అక్షరాల పక్కన ఉన్న ఈ కొత్త లిపి అక్షరాలకి, వాటి సెమిటిక్ పేర్లతో సరిచూశాడు. అంటే, ఈజిప్టు చిత్రలిపిలో ఒక అక్షరం ఉంటే, అది దేనిని సూచిస్తుందో తెలుసు కాబట్టి, వాటిని సెమిటిక్ భాషలో ఏమంటారో, ఆ పేర్లు ఆయన ఈ కొత్తలిపిలో ఉన్న అక్షరాలకి పెట్టాడు. ఇలా చూస్తే, అవి హిబ్రూ భాషలో ఉన్న అక్షరాల పేర్లతో సరిగ్గా సరిపోయాయి. కాని, అవి హిబ్రూ అక్షరాలలా లేవు కాబట్టి, ఈ పధ్ధతి పూర్తిగా విశ్వసనీయం కాదు. ఎలాగైతేనేం, ఈ సూత్రంతో గార్డినర్ సెరబిత్ దగ్గర దొరికిన శాశనం చదివితే అది బాలత్ అని వచ్చింది, బాలత్ అంటే సెమిటిక్ భాషలో అతివ. అంతే కాకుండా ఆ పదం హెదర్ (Hathor) దేవతని కూడా సూచిస్తుంది. ఈ ఆధారంతో, ఈ శాసనలిపి ఈజిప్టు-సెమిటిక్ భాషలు రెండిటిలోనూ రాసిన శాసనం అని ఆయన నిర్ణయించాడు. ఈ ఒక్క శాసనం తప్పించి, మరేమీ ఈ పద్ధతితో సాధించలేకపోయారు.

గార్డినర్ ప్రతిపాదన సరైనదో కాదో ఇప్పటీకీ మనకి తెలియదు. కొంతకాలం వరకూ ఈజిప్టులో దొరికిన ప్రొటో-సెమిటిక్ లిపులే చిత్రలిపులకి, ఉగరిత్ దగ్గర దొరికిన శరాకార లిపికి, ఫినీషియన్ ధ్వన్యాక్షర లిపికి వారధి అని భావించారు. కాని, పామరులైన బానిసలు, గని కార్మికులకి కొత్త భాషని తయారుచేయవలసిన అవసరం ఏముంటుందనే ప్రశ్నకి ఇప్పటివరకూ సమాధానం లేదు.

1990 దశాబ్దంలో గార్డినర్ ఈజిప్ట్-సైనైటిక్ ప్రతిపాదనకి పుంజుకోడానికి సహాయపడే ఆధారాలు డార్నెల్ దంపతులు జాన్, డెబోరాలకి (John C. and Deborah Darnell) ఈజిప్టులో, వడీ-అల్-హాల్ దగ్గర దొరికాయి. ఈ ప్రాంతం ప్రాచీన వాణిజ్య మార్గంలో ఉంది. ఇక్కడ వారికి క్రీ.పూ. 1900-1800 మధ్యకాలం నాటి కొన్ని శాసనాలు దొరికాయి. ఇవి లెబనాన్/ ఇజ్రాయెల్ లో దొరికన వాటికంటే పురాతనమైనవి. ఇక్కడ దొరికిన రెండు శాసనాలు చాల చిన్నవి. అందులో అక్షరాలకి ఈజిప్టు హెరిటిక్ లిపికి సామ్యాలున్నాయి. వీటిని చెక్కిన వ్యక్తి బహుశా ఎవరో లేఖకుడై యుంటాడని ఒక అంచనా. ఒకవేళ డార్నెల్ దంపతుల ప్రతిపాదనలే ఋజువైతే, ధ్వన్యాక్షర లిపులు ఈజిప్టునుంచీ వచ్చినవే అని ఋజువవుతుంది, కాని ఇప్పటివరకూ ఇది కూడా ఇదమిద్ధంగా తేలలేదు [30].

ఇదిలా ఉండగా, లెబనాన్/ ఇజ్రాయెల్ దగ్గర, క్రీ.పూ. 1700-1800కి చెందిన కొన్ని శాసనాలు దొరికాయి. ఇవి ఈజిప్టులో దొరికిన శాసనాలకంటే పురాతనమైనవి, పైగా ఇవికూడా ధ్వన్యాక్షరాల మాదిరిగానే ఉన్నాయి. అక్కడి ప్రజలు అప్పుడు ఈజిప్టు, హిటైట్, బాబిలోనియా, క్రీటు రాజ్యాల సరిహద్దుల్లో నివసించిన నాగరీకులైన వ్యాపారులు. వారికి అప్పటికే, రాత వ్యవస్థలపై అవగాహన ఉంది, వారికొక లిపి – సులువుగా నేర్చుకోడానికి, రాయగలగడానికి వీలుగా ఉండేటట్టుగా – అవసరముంది. ఈ లిపే మొదటి ధ్వన్యాక్షరలిపి అయ్యింటుందని ఒక అంచనా. ఈ అంచనాలని నిర్ధారించే ఆధారేలేమీ ఇంతవరకూ దొరకలేదు.

శరాకార లిపి నుంచి ధ్వన్య లిపుల ఆవిర్భావం

కచ్చితమైన అక్షర లిపి ఒకటి, ప్రొటొ-సెమిటిక్, ప్రొటొ-కాననైట్ లిపులకు ఎటువంటి సంబంధం లేని లిపి ఒకటి ఉగరిత్ దగ్గర దొరికింది. ఇది క్రీ.పూ. 1400 కాలానికి చెందినది. ప్రాచీన ఉగరిత్ (ఇప్పటి రస్-షమ్రా) ఉత్తర కానైన్ దగ్గర ఒక తీరప్రాంతం. అప్పట్లో అదో పెద్ద నగరం కిందే లెక్క. సిరియా, మెసపటేమియా, అనటోలియా, క్రీట్, సైప్రస్‌ల నుండీ వచ్చిపోయే వర్తకులతో ఈ నగరం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. సుమారుగా పది భాషలు, ఐదు లిపులు అక్కడ వాడకంలో ఉండేవి. ఇక్కడ ఈజిప్టు చిత్రలిపి, హిటైట్ శరాకార లిపులతో రాసిన రెండుభాషలలో రాసిన శాసనాలు దొరికాయి.

ఇక్కడ, మొదట్లో ప్రముఖంగా ఉపయోగించిన లిపి అక్కాడియన్ శరాకార లిపి. కాని, కాలక్రమంలో ఇక్కడి వ్యాపారులకి ఒక సులువుగా రాయగలిగే కొత్త లిపి అవసరమయ్యుంటుంది. వారు దానిని, ప్రోటొ-కాననైట్ నుంచీ అభివృద్ధి చేసుంటారు, అయితే వారు ప్రొటొ-కాననైట్ నుంచి ధ్వన్యాక్షరాల భావనని మాత్రం తీసుకొని, వారి లిపిని చిత్రలిపితో కాకుండా, వారికి అప్పటికీ అలవాటైన శరాకార లిపితో అనుసంధానించి వుంటారు. ఈ లిపిలొ ఉన్న మట్టిపలకలు వెయ్యికి పైగా దొరికాయి. వాటన్నిటినీ, ఇప్పుడు చదవగలుగుతున్నారు. వాటిల్లో కొన్ని వ్యాపార లావాదేవీలు, సుంకాలు మొదలైన ప్రభుత్వ వ్యవహారాలకి సంబంధించి పలకలు, మరికొన్ని సాహిత్య, మత సంబంధమైన రచనలూ ఉన్నాయి. మతసంబంధమైన పలకల మీద రాతలలో కథలకి, ప్రాసకి, పలుకుబడికి పాత-టెస్టమెంట్ కథలతో సామ్యాలున్నాయి. ఈ విధంగా చూస్తే, బైబిలు కథలు హిబ్రూలో రాయడానికి కొన్ని శతాబ్ధాలకి పూర్వమే ఉగరిత్ భాషలో రాశారని అనుకోవాలి [31].

ఈ ఉగరిత్ లేఖకులు ఏ ప్రాతిపదికన, వారి అక్షరాల రూపాలని, అక్షరమాల క్రమాన్ని నిర్ణయించి ఉంటారు? బహుశా, అన్నిటికన్నా సుళువైన చిహ్నాలని, ఎక్కువగా వాడే అక్షరాలకి నిర్దేశించి ఉంటారు. వాటి క్రమం కూడా, ప్రొటొ-కాననైట్ అక్షరక్రమాన్ని అనుసరించి ఉంటుంది (అదేమిటో కచ్చితంగా తెలియదు). ఉగరిత్ పలకలు కొన్ని అబిసిదారిలు – అంటే, అవి అకారాది పట్టికలు అనుకోవచ్చు. వాటిల్లో ఉన్న క్రమం ఇప్పటి పాశ్చాత్య వర్ణక్రమానికి దగ్గరగా ఉంది. అక్కడే మరో పలక దొరికింది – అందులో కొత్త ఉగరిత్ అక్షరాల పట్టిక ఎడం వైపునా వాటికి సరిపోయే అక్కాడియన్ శరాకారలిపిలోని పదాంశాలు కుడిపక్కనా ఉన్నాయి. అది రాసిన వ్యక్తి బహుశా, ఇరవై ధ్వన్యాక్షరాలతో పోయేదానికి 600 పదాంశాల లిపి అవసరమా అనుకొనుంటాడేమో!

ఫినీషియన్ లిపి – ఆధునిక అక్షరలిపులకు మాతృక

ఉగరిత్ వ్యాపారులు ఉపయోగించిన లిపి క్రీ.పూ. 1200 నాటికే అంతరించి పోయింది. ఇజ్రాయెల్ దగ్గర, ఇదే సమయానికి చెందిన మరో శాసనం ద్వారా అప్పటికే ధ్వన్యాక్షర లిపుల ప్రయోగాలు ముమ్మరమైనాయని తెలుస్తోంది. క్రీ.పూ. 1100 నాటికి ఫినీసియాకి చెందిన బిబ్లోస్ నగరంలో దొరికిన శాసనాలే కచ్చితంగా ఇప్పుడు నిర్ణయించగలిగిన మొదటి అక్షరలిపులు.

ఈనాటి హిబ్రూ, గ్రీకు అక్షర లిపులకి మాతృకగా భావించే ఫినీషియన్ లిపి, క్రీ.పూ. 1000కి చెందినది. ఫినీసియా ప్రజలు, ప్రాచీన చరిత్రలో గొప్ప వ్యాపారులు. బిబ్లోస్, సిడాన్, తైరో మొదలైన ఫినిసియా నగరాలనుంచీ వారు ఓడల మీద ప్రపంచం అంతా ప్రయాణిస్తూ ఉండేవారు. మ్యురెక్స్ (Murex) అనే ఒక నత్తగుల్ల నుంచీ తీసిన ఒక ఊదారంగు అద్దకం వారి ప్రధానమైన వ్యాపార వస్తువు. ఫినీసియా అనేపదానికి ఊదారంగు వ్యాపారి అని అర్థమట. మనకి ఫినీసియా గురించి తెలిసినంతలో, వారి లిపి కూడా వారి వెంటే ఉండేదని మాత్రం తెలుసు. వారి లిపిలోని అక్షరాల పేర్లు – అలెఫ్, బెత్, గిమెల్, డెల్త్ – ఇవే హిబ్రూ భాషలోనూ, గ్రీకు భాషలోనూ వాడేవారు. అయితే, ఫినీసియా అక్షరమాలలో అచ్చులు లేవు, కేవలం 22 హల్లులతో కూడిన వ్యంజనాక్షర లిపి వారిది.

(బిబ్లోస్ నగరాన్ని 11వ శతాబ్దంలో పాలించిన అహిరమ్ (Ahiram) రాజు సమాధి పైన చెక్కిన ఒక శాసనంలో, ఈనాటి అక్షరలిపులకి మాతృకైన వారి భాషలో రాసిన హెచ్చరిక పరిశోధకులలో ఒక సంచలనం రేపింది.)

గ్రీకుల అక్షర లిపులు

గ్రీకు సంస్కృతికి రాయడంతో ఎప్పుడు సంపర్కం కలిగిందో తేల్చగలిగే ఆధారాలు అన్నీ వివాదాస్పదమైనవే! హెరొడొటుస్ (Herodotus) అనే ప్రఖ్యాత గ్రీకు చరిత్రకారుడు, వర్ణమాలని ఫొనీకా గ్రమాటా (ఫినీసియా అక్షరాలు) అని, కడ్మాస్ నుండీ అవి గ్రీసుకి వచ్చాయని అన్నాడు. 2500 ఏళ్ళ తర్వాత కూడా అంతకు మించి గ్రీకు అక్షరమాల గురించి మనమేం చెప్పలేం. ఇప్పుడు కొంతమంది పరిశోధకులు, ఫినీసియాలో ఉండే గ్రీకు దేశస్థులు, అక్షరలిపిని అక్కడ నేర్చుకుని, గ్రీకు దేశానికి తీసుకొచ్చారని అంటున్నారు [32].

(ఎవరో ఒక గ్రీకు వ్యాపారి లేదా లేఖకుడు ఫినీసియాలో రాత నేర్చుకున్నాడని అనుకుందాం. ఒక్కో భాషలో ఉచ్చారణ ఒక్కోలా ఉంటుంది కాబట్టి, ఫినీసియా భాషలోని కొన్ని ధ్వనులు అతని చెవులకి వేరేలా వినిపించే అవకాశం ఉంది కదా? అందువల్ల ఫినీసియా ఎలెఫ్ – ఆల్ఫా, బెత్ – బీటా, గిమెల్ కాస్తా గామా అయ్యుండవచ్చు. ఈ ప్రక్రియలో, వాటి పేర్లు పూర్తిగా అర్థరహితం అయ్యుండవచ్చు. ఫినీసియా భాషలో 22 హల్లులే గ్రీకు హల్లులు, అచ్చులుగా మారాయని ఒక వాదన. అటుపైన వాటికి మరికొన్ని ధ్వనులు చేర్చి ఉండవచ్చు. అచ్చులు వర్ణక్రమంలో ప్రత్యేకంగా వాడడం అతి పెద్ద మార్పే అయినా, అది కావాలని చేసిన మార్పు కాకుండా, ఫినిసియా భాషలోని హల్లులని (వ్యంజనాలని) ఎలా పలకాలో తెలియక అవి యాదృచ్చికంగా అచ్చు ధ్వనులయి ఉంటాయని కొందరి ప్రతిపాదన [33]. ఉదాహరణకి, కొన్ని తాలవ్య హల్లులు – అలెఫ్ వంటివి, ఫినీసియాలో, దగ్గినప్పుడు వచ్చే అహ్‌లా పలుకుతారు, అవి గ్రీకు చెవికి అ గా వినపడ్డాయేమో.)

గ్రీకు అక్షరమాల చరిత్రని తేల్చి చెప్పడానికి రెండు సమస్యలు ఉన్నాయి. మొదటిది – గ్రీకు దేశంలో దొరుకుతున్న మొట్టమొదటి శాసనం క్రీ.పూ. 730 నాటిది. రెండోది, ఎటువంటి వ్యాపార లావాదేవీలు అక్షర లిపులు వచ్చిన 200 సంవత్సరాల తర్వాత కాలం నాటివే తప్పించి, అంతకు ముందువి దొరకలేదు. (ఇలాంటి సమస్యే భారత లిపుల విషయంలోనూ ఉంది.)

1952లో లీనియర్-బి లిపి కనుగొనడానికి పూర్వం, గ్రీకు సంస్కృతికి, ఫినీసియా నుండి అక్షరాలు దిగుమతి కావడానికి ముందు, అక్షరజ్ఞానం లేదనే అనుకున్నారు. లీనియర్-బి లిపి కనుగొన్న తర్వాత పరిశోధకులలో రెండు వర్గాలు ఏర్పడ్దాయి. సంప్రదాయ వర్గం, హోమర్ కాలం నుండి క్లాసికల్ గ్రీకుల వరకూ (క్రీ.పూ. 8 శతాబ్దం) మధ్యనున్న కాలం, అక్షరాస్యత విషయంలో చీకటి యుగం అని భావిస్తారు. మరి కొంతమంది ఈ వాదాన్ని కొట్టిపారేస్తూ, గ్రీకు సంస్కృతికి క్రీ.పూ. 1100 నుంచే అక్షరజ్ఞానం ఉందని వాదిస్తారు [34]. వీరి వాదనకి ముఖ్యమైన ఆధారం – పురాతన గ్రీకు శాసనాలలో పంక్తులు రాసే దిశ ఒక్కోచోట కుడి నుండి ఎడం వైపుకి, మరోచోట ఎడం నుండీ కుడికీ, మరికొన్ని చోట్ల, నాగేటిచాలులా ఒక వాక్యం కుడినుండి మొదలై, దాని తర్వాతి వాక్యం ఎడం నుండి కుడికి ఇలా, వాక్యం ఎక్కడ ఆపితే అటువైపు నుండి మరో వాక్యం ప్రారంభం అయ్యేట్టు ఉన్నాయి. పురాతన ఫినీషియన్ శాసనాల్లో కూడా రాసే పద్దతిలో ఈ అనిశ్చిత ఉంది – క్రీ.పూ. 800 నాటికి కానీ ఫినీషియన్ లిపి కుడి-ఎడమ దిశగా కుదురుకోలేదు. ఇదే అనిశ్చితి గ్రీకు లిపిలో కూడా ఉంది కాబట్టీ గ్రీకు సంస్కృతిలో కూడా అక్షరజ్ఞానం ముందు నుండే వుండేదని వీరి వాదన. అందువల్ల, ఎప్పుడు అచ్చులతో కూడిన గ్రీకు లిపి ఏర్పడింది – క్రీ.పూ. 1100 నుండి 800 లోపు – అన్నది వివాదస్పదమైన అంశమే.

అసలు ఎందుకు ధ్వన్యాక్షరాలు అవసరమయాయి అనేది ఇంకా వివాదస్పదమైన విషయం. ఇప్పటివరకూ ఏ రకమైన వ్యాపార/ వాణిజ్య సంబంధమైన ప్రతులు దొరకక పోవడం పరిశోధకులని ఆశ్చర్యపరిచే విషయమే. దొరికిన అవశేషాలన్నీ, సాహిత్యపరమైనవే, ఇంతకు ముందు చెప్పిన క్రీ.పూ. 730లో ప్రస్తావించిన రాత పలక కూజా మీద ‘అద్భుతంగా నాట్యం చేసే నీకోసం’ అని రాసి ఉంది.

ఈ వివాదానికి పరిష్కారంగా, కొందరు – హోమర్ ఇతిహాసాలని రాయడానికి ఎవరో గ్రీకు-అక్షరలిపిని కనిపెట్టారని ప్రతిపాదిస్తున్నారు. అచ్చులు లేని ఫినీషియన్ లిపి హోమర్ ఇతిహాసాలు రాయడానికి ఎందుకూ పనికి రాలేదని, అందుకోసం అచ్చులతో కూడిన లిపి యతి-ప్రాసలతో కూడిన చంధోబద్దమైన కవిత్వాన్ని రాయడానికి అవసరమయ్యిందని వీరి వాదన [35]. ఒకవేళ ఇదే నిజమైతే, ఆ కనిపెట్టినవారెవరో ఆ సంగతిని ఎక్కడా ఎందుకు రాసుకోలేదు అనే ప్రశ్న వస్తుంది కదా? హోమర్‌కి, గ్రీకు-అక్షరాలకి సంబంధం ఉన్న సమాచారం ఏదీ గ్రీకు సాహిత్యంలో లభ్యం కావటంలేదు.

గ్రీసు దేశంలో ఒకటి కంటే ఎక్కువ వర్ణమాలలు ఉండేవి. ఇప్పుడు వాడుకలో ఉన్న గ్రీకు వర్ణమాలని ఐయోనియన్ (Ionian) అక్షరాలని అంటారు. ఇవి క్రీ.పూ 403 నాటికి గాని ఏథెన్సులో స్థిరపడలేదు. అంతకుముందు యూబోయిన్ (Euboean) వర్ణమాల ఉండేది, అదే ఇటలీ లోకి వచ్చింది. ఈ లిపినే ఎట్రూస్కన్ (Etruscan) తెగవారు నేర్చుకున్నారు, వారి నుండి రోమన్లకి ఈ అక్షరాలు సంక్రమించాయి. ఆధునిక యూరోపియన్ లిపులకి, గ్రీకు లిపికి మధ్యనున్న వ్యత్యాసం ఐయోనియన్,ఇబొయిన్ వర్ణమాలల వల్ల వచ్చింది.

తూర్పు యూరోపులో, ఈనాడు రష్యన్ భాష రాయడానికి ఉపయోగిస్తున్న సిరిలిక్ (Cyrillic) లిపి సుమారుగా 60 భాషలకి లిపిగా ఉంది. ఈ లిపిలో 43 అక్షరాలు ఉండేవి. ఈ లిపిని, బైజాంటైన్ చక్రవర్తి కాన్‌స్టాన్టిన్ (Constantine) కోరిక మేరకు సిరిల్ అనే సన్యాసి తయారుచేసాడని ఓ కథ ఉంది. కానీ, సిరిల్ తయారుచేసింది గ్లాగొలైటిక్ (Glagolitic) లిపి. సిరిలిక్ ఎంతోకాలం తర్వాత గానీ ప్రాచుర్యంలోకి రాలేదు.


19. పాశ్చత్య ప్రపంచంలో లిపుల పరిణామం.
(వివరం కోసం బొమ్మపై క్లిక్ చేయండి.)

ఎక్కడ, ఎందుకు, ఎలా మొదలయాయో తెలియకపోయినా, అక్షర లిపులు మాత్రం వాటి అంతర్గత సౌలభ్యం వల్ల, యూరోపియన్ల వలస పాలన వల్ల ప్రపంచం అంతా ప్రాచుర్యం లోకి వచ్చాయి. గ్రీసు నుండీ, ఎట్రూస్కన్ తెగల ద్వారా రోమన్లకి, వారి నుండి యూరోపు భాషలకి అవి విస్తరించాయి. తూర్పున అరమయక్ లిపితో ఇవే దక్షిణాసియా లిపులకి కూడా మాతృకలని ఇప్పుడు చాలామంది పరిశోధకుల అభిప్రాయం, కానీ భారత సంస్కృతిలో రాత చరిత్ర చాల సంక్లిష్టమైనది (ఈ వ్యాసం తరువాతి భాగాలలో విపులంగా చర్చిద్దాం.) ఇరవై శతాబ్దంనాటికి, యూరోపియన్ల వలస పాలన ప్రభావం వల్ల, చైనా, జపాన్ తప్పించి, మిగిలిన ప్రపంచం అంతా అక్షరలిపులనే వాడుతోంది. చాలా భాషలకి 20 నుంచీ 40 మధ్య అక్షరాలున్నాయి. తూర్పు పపువా న్యూగుయానాకి చెందిన రోటోకాస్ (Rotokas Script) 20 అక్షరాలతో అన్నిటికన్నా చిన్న లిపి; కంబోడియాలో ఖ్మేర్ లిపి (Khmer script) 74 అక్షరాలతో అన్నిటికన్నా విస్తారమైనది. కొన్ని ముఖ్యమైన ఆధునిక లిపులు, ప్రోటో-సినియాటిక్/ కాననైట్ లిపుల నుంచి ఎప్పుడు, ఏ క్రమంలో పుట్టాయో 19వ చిత్రంలో చూడవచ్చు. ఇందులో, భారతలిపులు విషయంలో ఉన్న వివాదాల దృష్ట్యా అరమయక్ నుంచి బ్రాహ్మిలిపి వచ్చినట్టు చూపలేదు. ఇంకా, 1821లో వచ్చిన చెరోకీ లిపి, స్కాండినేవియా లిపులు, రూనిక్ లిపులు కూడా ఇందులో చూపలేదు.


మాటని దృశ్యరూపంలోకి మార్చడమే కాకుండా, ధ్వనిరూపంలోని భాషని, దృశ్యరూపకమైన వస్తుప్రపంచంలోకి బదిలీచెయ్యడం రాత సాధించిపెట్టిన ఘనత. వినేదానికి, చూసేదానికి మధ్యనున్న మౌలికమైన తేడాని, లోతుగా విశ్లేషిస్తూ మక్‌లుహాన్ (Marshall Macluhan), “అక్షరం మనిషిని అద్భుతమైన శ్రవణప్రపంచం నుండీ తటస్థమైన దృశ్యంలోకి బదిలీ చేసింది” అంటాడు [36].

మాటగాని, పాటగాని కేవలం వినిపిస్తుంది కాని కనిపించదు. అందుకని దాన్ని మనం ఏకమొత్తంగా ఒక స్థలంలో చూడలేం. శబ్దానికి అస్తిత్వం కాలం లోనే ఉంటుంది. దృశ్యానికి అస్తిత్వం స్థలం లోనే ఉంటుంది. శబ్దం కాలంలోనే ఉంటుంది కాబట్టి క్షణికమైనదనీ, రాత దేశంలో ఉంటుంది కాబట్టి శాశ్వతమైనదనే అభిప్రాయంతోనే లిపికి అక్షరం అని పేరు పెట్టారు [37]. అయితే ఉచ్చరించగలిగే భాషని యథాతథంగా ఈ లిపీ ప్రతిఫలించలేదు. ఒక భాష మాట్లాడేవారు ఆ భాషలోని పదాలని ఒకలా ఉచ్చరిస్తారు, వేరే భాషలవారు అదే పదాలని పలికినప్పుడు వేరేలా పలుకుతారు. పలకగలిగే ధ్వనులన్నిటినీ ఏ లిపీలోనూ పూర్తిగా వ్యక్తీకరించడం సాధ్యం కాదు. లిపులు పుట్టి కొన్ని వేల సంవత్సరాలైనా, రాత దైనందిన జీవితంలోకి రావడానికి చాలా కాలం పట్టింది. ముందు వ్యాపార వ్యవహారాలలోనూ, అటుపైన మత సంబంధమైన వ్యవహారాలలో మాత్రమే రాత ఉపయోగింవేవారు. ప్రజలందరూ విరివిగా రాత మీద ఆధారపడటం పాశ్చాత్య ప్రపంచంలో కూడా క్రీ.శ. 787 వరకూ జరగలేదు.

గ్రీకు సంస్కృతిలో ఆధునిక అక్షరలిపులకి పునాది పడింది. అచ్చులని, హల్లులని వేరు వేరుగా చూపటం గ్రీకు అక్షరలిపితో మొదలయినా, ఆ మార్పు యాదృచ్చికంగానే మొదలయింది. ఎందుకంటే, గ్రీకు భాషలో అచ్చులకి, హల్లులని వేరువేరుగా వర్గీకరించింది ప్లేటో [38]. అంతవరకూ పాశ్చాత్య లిపులలో అచ్చు, హల్లు తేడాలు ప్రస్పుటంగా ఉండేవి కావు. ఇంతే కాకుండా, పాశ్చాత్య లిపులలో, వర్ణమాల క్రమం – అంటే, ఎ తర్వాత బి, బి తర్వత సి – ఎలా ఏర్పడ్డాయ్యో కచ్చితంగా తెలీదు – కొన్ని ఊహాగానాలున్నాయి. క్రీ.పూ. ఆరోశతాబ్ధం నాటికే, బైబిల్లో వర్ణమాల క్రమాన్ని కొన్ని చిత్రబంధ శ్లోకాలలో వర్ణించారు (Pss 111; 112; 119; Proverbs 31:10-31 Lamentations 1, 2, 3.) దీనికి సంబంధించిన మరికొంత చర్చ డ్రైవర్ (Godfrey R. Driver), రాసిన సెమిటిక్ రైటింగ్’ అనే పుస్తకంలో దొరుకుతుంది [39] [40].

రోమన్ సామ్రాజ్యం అంతమొందాక, యూరోపులో నెలకొన్న రాజకీయ శూన్యతని భర్తీచేస్తూ, రోమన్‌ చర్చి అధికారాన్ని హస్తగతం చేసుకుని, ‘పవిత్ర రోమన్ సామ్రాజ్యం’ రావడం మధ్యయుగాల యూరోపు చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం. ఒకపక్క పాశ్చాత్య యూరపునంతా సాంస్కృతికంగా, మతపరంగా ఒకతాటిపైకి తెస్తూ, మరోపక్క ఆసియాలోని ముస్లిము మతంతో క్రైస్తవానికి జరిగిన ఘర్షణ ప్రపంచచరిత్రని ఎంతగానో ప్రభావితం చేసింది.

ఇదేకాలంలో యూరోపులో వేరు వేరు జాతులు, తెగలు అన్నీ ఇష్టంగానో, బలవంతంగానో క్రైస్తవానికి తలవొగ్గడంతో, చర్చి అండదండలతో కరొలిఙ్గయన్ సామ్రాజ్యం (Carolingian Empire) , షార్లమాన్‌ చక్రవర్తి (Emperor Charlemagne) సారధిగా ఏర్పడింది. ఆ రాజవంశాలే కాలక్రమంలో యూరోపియన్ దేశాలుగా ఏర్పడ్డాయి. సుమారుగా పదోశతాబ్దం వరకూ రాత పూర్తిగా మతసంబంధమైన వ్యవహారాల్లోనే ఉండేది, అదీకూడా ఎక్కువగా సన్యాసుల మఠాలకే పరిమితం అయిఉండేది. ఎనిమిది, తొమ్మిది శతాబ్దాలలో షార్లమాన్ చక్రవర్తి రాతని, లిఖిత వ్యవహారాలని సన్యాసుల ఆరామాలనుండీ బయట ప్రపంచానికి తీసుకువచ్చాడు. ఆయన, రాయడం తెలిసినవారిని ప్రత్యేకంగా తన కొలువులోకి ఆహ్వానించి, రాయడం, రాసినదానిని చదవడం సామాజిక వ్యవహారాలలోకి కూడా ప్రవేశపెట్టాడు. క్రీ.శ 787 లో, లిఖితరూపంలో ఉన్న చట్టాలనే, మౌఖికమైన ఆచారాలకన్నా ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలని ఒక ‘ఫర్మాన్’ జారీ చేశాడు. ఈ కాలంలోనే, కరొలిఙ్గయన్‌ దస్తూరిలో కొత్త విరామచిహ్నాలు ప్రవేశపెట్టబడ్డాయి.

యూరోపు సాంస్కృతిక ప్రస్థానంలో, మధ్యయుగాల్లో క్రైస్తవానికి, లాటిన్ భాషకి అవినాభావమైన సంబంధం ఉంది. లాటిన్ భాష అధికార భాషగా, సాహిత్యభాషగా, మతభాషగా యూరోపంతా స్థిరపడింది. అందువల్ల, ముఖ్యంగా క్రైస్తవ సంఘారామాల్లో, ప్రత్యేకంగా లేఖనశాలలు నెలకొల్పి బైబిలు, ఇతర మతపరమైన గ్రంథాలన్నీ క్రైస్తవ సాధువులు అవిరామంగా నకళ్ళు రాసేవారు. క్రైస్తవాన్ని యూరోపునంతా విస్తరించడానికి, ప్రజలని క్రైస్తవమతానికి మార్చడానికి బైబిల్‌ని లిఖితరూపంలోకి తేవడం, దేశభాషల్లో మౌఖిక రూపంలో ఉన్న సాహిత్యంకంటే, పవిత్రమైన లాటిన్‌ భాషలో లిఖించబడ్డ బైబిల్‌ గొప్పదనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం, కొత్తమతాన్ని ప్రచారం చెయ్యడం కోసం యూరోపులో పలుచోట్ల నెలకొల్పిన సంఘారామాలు – ఇవన్నీ మౌఖిక సంప్రదాయం లిఖిత సంప్రదాయంగా మారడంలో, బలమైన పుస్తక సంస్కృతి ఏర్పడడంలో ప్రముఖమైన పాత్రని పోషించాయి. క్రైస్తవ సంఘారామాలలోని లేఖనశాలలు యూరోపియన్ పుస్తక సంస్కృతిలో అతి ముఖ్యమైన పాత్రని పోషించాయి [41].

ఇక భారతీయ/దక్షిణాసియా భాషల విషయానికి వస్తే, ఇక్కడ రాత పుట్టుక వేరే విధంగా జరిగింది. రాత అవసరం చాలా కాలం వరకూ ఈ సమాజాలకి అవసరం లేకపోయింది. రాత లేకుండానే, మౌఖిక రూపంలోనే ఇక్కడ ధ్వనిశాస్త్రం, వ్యాకరణం అవీ వచ్చాయి. లిపికి పూర్వమే వర్ణమాల పూర్తిగా ద్వనిరూపంలోనే పాణిని మహేశ్వర సూత్రాలలో కనిపిస్తుంది. ఇక్కడ ధ్వన్యాక్షరానికి, లిఖితాక్షరానికి తేడా ముందునించీ ఉంది. అందుకని, స్వరాలు, వ్యంజనాల తేడాలు లిపితో సంపర్కం ఏర్పడకముందునుంచే ఈ సంస్కృతికి తెలుసు. ఇంగ్లండులో జరిగిన కొన్ని పరిశోధనలో పూర్తి స్పష్టతతో మాట్లాడటానికి 45 ధ్వనిసంకేతాలు కావాలని నిర్ధారించారు, కాని సంస్కృతం ఆ స్థితికి ఎప్పుడో చేరుకుంది [డోనాల్డ్ అండర్సన్, 42.]

పాశ్చాత్య వర్ణమాలలోని అక్షరాలు నిజానికి  ధ్వనులుకావు, అవి కొన్ని ధ్వనిసంపుటాలని సూచించే పేర్లు — ఎ అంటే ఎలెఫ్, బి అంటే బెత్ అని వివరంగా పైన చూసాం కదా? ఎ అనే అక్షరం ఒక ధ్వనికాదు, ఆ అక్షరం ఎన్నో ధ్వనులని సూచిస్తుంది.

భారతీయ భాషల్లో ప్రతి అక్షరం ఒక ప్రత్యేకమైన ధ్వని.  వోల్టేర్ మాటనే భారత సంస్కృతికి అన్వయించి చెప్పాలంటే – భారతీయుల వర్ణమాలని ‘ధ్వనితో చిత్రించిన చిత్రాలు’ (Painting with the voice)  అనడం సబబేమో!  ఈ కారణంచేత భారత సంస్కృతిలో రాత చరిత్ర గురించి చెప్పాలంటే, కేవలం రాతని లిపుల పరిణామంగా మాత్రమే కాకుండా, మరింత లోతుగా చూడవలసి ఉంది. ముఖ్యంగా, భారతీయ లిపులు ధ్వని ప్రధానమైవి. అందుకే, ధ్వనికి ఏవిధమైన ఆకృతినైనా ఈ భాషలు కల్పించుకోగలవు.

మన లిపుల పరిణామం, అలాగే మన భాషలకి, ఇతర భాషలకి ఉన్న సారూప్యాలు, భేదాలు  మొదలైన వివరాలు విపులంగా వచ్చే భాగాలలో చూద్దాం.

(ఇంకా ఉంది)


ఉపయుక్త గ్రంథసూచి

[Acknowledgements – Many drawings used in this essay are taken from Stephen Fisher’s “History of Writing” and Andrew Robinson’s “Writing and Script”]

[1]. Darnton, Robert; ‘What is History of Books?’, Daedalus, Vol. 111, No. 3, 1982, pp. 65-83. A revised version.

[2]. Some of them are: ‘Publishing History:The Social, Economic and Literary History of Book, Newspaper and Magazine Publishing’ (ISSN 0309-2445); ‘Book History’ (ISSN 1098-7371); ‘Archiv für Geschichte des Buchwesens’ (ISSN 0066-6327); ‘Revue française d’histoire du livre’ (ISSN 0037-92120048-8070); ‘The Library’ (ISSN 0024-2160); ‘Annual bibliography of the history of the printed book and libraries’ (ISSN 0303-5964).

[3]. Priolkar, Anant Kakba; ‘The printing press in India:its beginnings and early development – being a quatercentenary commemoration study of the advent of printing in India (in 1556)’; Marathi Samshodhana Mandala; Bombay, 1958.

[4]. Stark, Ulrike; ‘An empire of books:The Naval Kishore Press and the diffusion of the printed word in colonial India; Permanent Black; Ranikhet, 2007.

[5]. Orsini, Francesca; ‘Print and pleasure:Popular literature and entertaining fictions in colonial north India’; Permanent Black; Ranikhet, 2009.

[6]. Ghosh, Anindita; ‘Power in print:Popular publishing and the politics of language and culture in a colonial society; 1778 – 1905’; Oxford Univ. Press, New Delhi; 2006.

[7]. Venkatachalapathy, A.R.; ‘The province of the book:Scholars, scribes, and scribblers in colonial Tamilnadu’; Permanent Black; Ranikhet, 2012.

[8]. Soteriou, Alexandra; ‘Gift of Conquerors – Hand Paper Making in India’, Mapin; Ahmedabad, 1999.

[9]. Gupta, Abhijit; Chaktravorty, Swapan (Eds); ‘Print areas:Book history in India’; Permanent Black; Ranikhet; 2004 and ‘Moveable type:Book history in India’; Permanent Black; Ranikhet, 2008.

[10]. Kesavan, Bellary Shamanna; ‘History of printing and publishing in India : a story of cultural re-awakening’(3 Volumes); National Book Trust, 1985-1997.

[11]. Darnton, Robert; ‘The Forbidden Best-Sellers of Prerevolutionary France’; Norton, New York; 1996; ‘Poetry and the Police: Communication Networks in Eighteenth-Century Paris’; Belknap Press; Cambridge, 2010.

[12], [17], [20] Walter Ong, ‘Orality and literacy:The technologizing of the word’; Theatre Art Books, 2002.

[13], [41] Pappu, Nagaraju; Paruchuri, Sreenivas, “అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య పుస్తక సంస్కృతి”.

[14]. Manguel, Alberto “A History of Reading”, Penguin Books, 1997; అక్షరమంటే నాశనం లేనిది అని అర్థం ఉన్నప్పటికీ, అక్షరమంటే లిపికి సంబంధించినది అని మామూలుగా అందరూ అనుకునే మాట. కానీ భారతదేశపు ఊహలో అక్షరం శబ్దమే. అదే శాశ్వతమైనది. లిపి శబ్దమైనంత శాశ్వతమైనది కాదు.

[15], [19]. Finklestein, David; ‘An introduction to book history’; Routledge; New York, 2005.

[16], [21], [22]. Fischer, Steven R.; ‘A History of Writing’; Reaktion Books, London, 2005.

18. Oral Literature అనే పదానికి తెలుగులో సాధారణంగా “మౌఖిక సాహిత్యం” అని వాడుతున్నారు. వెల్చేరు నారాయణరావుగారు, “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” రాసిన చివరిమాటలో ఇల్లిందిల సరస్వతీదేవిగారు “వాక్ సాహిత్యం” అనే పదం సూచించారని, ఆ పదమే మౌఖిక సాహిత్యం అనే వాడుక కంటే సమంజసమైనదని అభిప్రాయపడ్డారు.

[23], [42]. Anderson,Donald, “Calligraphy – The Art of Letter Forms:, Dover Publications, 1969.

[24], [25]. Robinson, Andrew, “The Writing Systems” Oxford Companion to the Book, Vol1, Oxford University Press, 2010.

[26]. Naveh, Josesh, “Early History of the Alphabet”, Varda Books, 2005.

[28]. Oral Communication with Velcheru Narayana Rao.

[29] – [31], [33]. Robinson, Andrew, “Writing and Script”, Oxford University Press, 2009.

[32], ]34], [35]. Powell, Barry, “Homer and the origin of the Greek Alphabet”, Cambridge University Press, 1991.

[36]. McLuhan, Marshal, “The Gutenberg Galaxy – Making of Typographic Man”, University of Toronto Press, 2011.

[38]. Lara Pagani, From Scholars to Scholia, Chapters in the History of Ancient Greek Scholarship, Edited by Franco Montanari and Lara Pagani, De Gruyter, p.22

[39]. http://bibleencyclopedia.com/alphabet.htm

[40]. Driver, Godfrey R, “Semetic Writing”, Periodicals Service Co, 1948.