Yellow Coal


(Combat – Stanley Hayter)

1.

హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారి ప్రపంచ ఆర్థికభారమితి, ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని కొంతకాలంగా సూచిస్తూనే ఉంది. కాని దాని నిశితమైన చూపు కూడా రాబోయే విపత్తు అంత త్వరగా ఉధృతమవుతుందని పసిగట్టలేక పోయింది. యుద్ధాలు, వాతావరణం కలగలసి భూమిని తన శక్తి తనే వృధా చేసుకునేట్టుగా మార్చేసాయి. పెట్రోలు బావులు ఎండిపోతున్నాయి. రాక్షసబొగ్గు, నల్లబొగ్గు, తెల్లబొగ్గుల నిలువలు తరిగిపోయి ఇంధనశక్తి తగ్గిపోతోంది. మునుపెన్నడూ ఎరగని కరవు కమ్ముకొచ్చి, భూమి అంతా డజను భూమధ్యరేఖలు విస్తరించినట్టు ఉష్ణమండలంగా మారిపోయింది. పంటలన్నీ వేర్లతో సహా కాలిపోతున్నాయి. భరించలేని ఆ వేడికి రగిలిన కార్చిచ్చులలో సౌత్ అమెరికా, ఇండియాలలోని సతతహరితారణ్యాలలోని చెట్లన్నీ ఫాక్టరీ గొట్టాల్లా పొగలు కక్కుతున్నాయి. వ్యవసాయాధారిత దేశాలు ముందుగా మట్టిగొట్టుకుపోయాయి. అడవుల్లో ఆకాశాన్నంటే ఆకుపచ్చటి చెట్లన్నీ కాలిపోయి వాటి స్థానంలో ఫాక్టరీ గొట్టాలు ఆక్రమించుకున్నాయి. అవీ ఇంక ఎంతోకాలం ఉండబోవు. ఇంధనం అడుగంటిపోతున్న కొద్దీ, చలనయంత్రాలు నిశ్చలమవుతున్నాయి. ఎడతెగని ఎండలవల్ల, హిమానీనదాలు నిరంతరంగా కరిగి పారుతున్నా, తగినంత జలశక్తి అందటంలేదు. కృశించిపోతున్న నదులు ఇసక మైదానాలుగా మారుతున్నాయి. త్వరలో వాయుశక్తితో పనిచేసే టర్బైన్లు కూడా మూతబడిపోనున్నాయి.

భూమికి జ్వరం వచ్చింది. సూర్యుడు ఇసుమంత కరుణ లేకుండా ఝళిపిస్తున్న పసుపు కొరడాల దెబ్బలతో, భూమి పిచ్చిపీరులా గింగిరాలు తిరుగుతోంది.

స్వార్థరాజకీయాలని పక్కనపెట్టి దేశాలు కలిసికట్టుగా పనిచేసుంటే, ఈ అనర్థం తప్పేదేమో. కానీ, ప్రమాదం తప్పదని తెలిశాక, రాజ్యాలూ రిపబ్లిక్కులూ దేశాలూ ఒకప్పటి నియంతల్లాగానే– ఎండిపోతున్న చెరువులో మిగిలిన చెలమల్లో చేపల్లా–సరిహద్దుల జిగట ఒరల్లోకి మరింతగా చొచ్చుకుపోయాయి. అంతర్జాతీయ సుంకాలు ఆకాశాన్నంటేంతగా పెరిగిపోయాయి.

ఇక మిగిలున్న ఒకే ఒక అంతర్జాతీయ కేనో (CANOE – Center for the Access of New and Original Energies). ఎవరైనా సరే భూమికి ఒక సరికొత్త ఇంధనం కనుగొంటే బహుమతిగా కోట్లు గుమ్మరిస్తామని ప్రకటించింది.

2.

ప్రొఫెసర్ లెకర్‌కి మనుషులని గమనించేంత తీరిక ఉండదు. డ్రాయింగులు, గ్రాఫులు, దీర్ఘాలోచనలతో పుస్తకాలలోని పేజీలకి అంటుకుపోయిన అతని కళ్ళకి మొహాలని పరికించేంత సమయం ఎక్కడ దొరుకుతుంది? కిటికీలని మూసేసిన కర్టెన్లు కూడా అతనికి బయట వీధి కనిపించకుండా రక్షిస్తుంటాయి. ఆఫీసుకు వచ్చేటప్పుడు కూడా, నల్లటి కారు అద్దాల వెనుక, వీధిలో ఏం జరుగుతోందో అతనికి కనిపించదు. ఒకప్పుడు అతను పాఠాలు చెప్పేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా పరిశోధనలలోనే ముణిగిపోయున్నాడు–క్వాంటమ్ సిద్ధాంతం, అయనీకరణ సిద్ధాంతం ఎలా ఇంద్రియ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తాయో అదేపనిగా పరిశోధిస్తున్నాడు.

అందుకే, ఆరోజు అతను వీధిలోకి వాహ్యాళికి రావడం (పదేళ్ళలో మొదటిసారి) కేవలం యాదృచ్ఛికం. పచార్లుచేస్తూ ఆలోచనల్లో మునిగిపోయిన అతను వీధిలో హడావుడిని మొదట గమనించలేదు. ట్రాఫిక్ కూడలి దగ్గర వీధిని దాటవలసి వచ్చినప్పుడు, తన ఆలోచనల్లోంచి బైటకు వచ్చి తలెత్తి ఎక్కడున్నాడో చూసుకోక తప్పలేదు. ఆ క్షణంలో, ఒక్కసారిగా వీధి అతని కళ్ళలోకి రాచుకుంది.

పైత్యంతో మకిలిపడ్డ సూర్యుడు మబ్బు గుడారాల్లోంచి ఏటవాలుగా చూస్తున్నాడు. రోడ్డుమీద జనాలు గుంపులు గుంపులుగా, భుజాలతో పక్కవాళ్ళని కసిగా తోసుకుంటూ విసుగ్గా నడిచిపోతున్నారు. షాపులు, ఆఫీసుల తలుపుల దగ్గర ఎవరికివారే ముందుగా లోపలకి వెళ్ళే ప్రయత్నంలో, ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటున్నారు. ఆ తోపులాటలో గుమ్మం దగ్గర కిక్కిరిసిపోవడంతో కోపంతో పళ్ళు కొరుకుతున్నారు. అందరి మొహాలు కోపంతోనూ, అసహనంతోనూ బిగుసుకుపోయున్నాయి.

ట్రాముల్లో, తలుపుల దగ్గర మెట్ల మీద దాకా కిక్కిరిసిపోయి చువ్వలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణిస్తున్నవాళ్ళు తమ ఛాతీలను ముందున్నవాళ్ళ వీపులకు ఆనించి నెడుతున్నారు. కానీ, ఆ వీపులు ద్వేషంతో బిగిసిన భుజాలతో అడ్డుకుని, ఆ ఛాతీలకు అంగుళం కూడా చోటు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ట్రాములో పడిపోకుండా బలంగా చువ్వలను పట్టుకొని నిలబడ్డవాళ్ళ చేతులు, మాంసం ముక్కకోసం కొమ్మ మీద వేచిచూస్తున్న గద్దల కాలివేళ్ళలా ఉన్నాయి.

ట్రాము ముందుకు వెళ్ళగానే, స్టేజిమీద తెర తొలిగినట్టు, అతనికి దాని వెనుక జరుగుతున్న దృశ్యం కనిపించింది. ఇద్దరు మనుషులు ఒకర్నొకరు తిట్టుకుంటూ పిడికిళ్ళు బిగించి చూపించుకుంటున్నారు. ఇట్టే వారిచుట్టూ ఒక చిన్న గుంపు చేరింది. దాన్ని చుట్టుకుంటూ మరోగుంపు, ఆపైన ఇంకోగుంపు. ఆ గుంపుల చేతుల్లో గాల్లో తేలుతున్న కర్రలు కటారులు.

ఇదంతా చూస్తూ, లెకర్ ముందుకు నడిచాడు. ఉన్నట్టుండి అతని మోకాలును, పైకి చాచుకొచ్చిన ఒక చెయ్యి ఢీకొట్టింది. మాసిపోయిన చింకిబట్టల్లోంచి ఆ చెయ్యి, డబ్బు కావాలని అడుగుతోంది. లెకర్ జేబుల్లో చెయ్యి పెట్టాడు. కానీ అందులో ఒక్క నోట్‌పాడ్ తప్పించి డబ్బులేం లేవు. ఆ చెయ్యి మాత్రం ఇంకా అలానే ఉంది. అతను మరోసారి జేబులన్నీ తడిమి, ఇవ్వడానికి ఏం లేకపోవడంతో, అలానే చూస్తూ పక్కకి తప్పుకున్నాడు. పుసికారుతూ, పూలు పూసివున్నప్పటికీ ఆ ముసలివాడి కళ్ళలో తనపట్ల కసిని లెకర్ గమనించకపోలేదు.

అంతకంతకూ ఆందోళన ఎక్కువవుతూ ఉద్రిక్తంగా మారుతున్న ఆ వీధిని ప్రొఫసర్ లెకర్ నిశితంగా మరోసారి పరికించాడు. వచ్చిపోయేవాళ్ళు మారుతున్నా, అంతా మునుపటి లాగానే ఉంది–బిగుసుకున్న దవడలు, ఇతరుల గాలిని కూడా సహించలేనట్టు ముడిపడివున్న నుదుళ్ళు, ముందున్నదేన్నో నెడుతున్నట్టు భుజాలు. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఆ సైంటిస్టు ఆశ్చర్యంతో ముందు కనుబొమ్మలు ఎగరేసి, అంతలోనే నుదురు ముడివేశాడు, తను చూస్తున్న దృశ్యాల వెనుక ఉన్న అర్థాన్ని అందులో కట్టివేస్తున్నట్టుగా. నడక వేగం తగ్గించి, సరైన పదాలకోసం వెతుక్కుంటూ తన నోట్‌బుక్‌ను బయటకి తీశాడు. ఇంతలోనే, ఎవరి మోచేయో కోపంగా పక్కలో పొడిచింది. ఆ తోపుకి పక్కకి తూలిపడడంతో, అతని వీపు ఒక స్థంభాన్ని గుద్దుకుని నోట్‌బుక్ చేతుల్లోంచి జారిపడింది. కాని, ఆ బాధ కూడా, ప్రొఫెసర్ పెదాలపై కమ్ముకొస్తున్న సంతోషాన్ని ఆపలేకపోయింది. అతని ఊహ, ఎన్నో ఆలోచనల దారాలు అల్లుకుంటూ అతని మదిలోని లోపలిపొరల్లోకి చొచ్చుకుపోయింది.

3.

కేనో సంస్థ ప్రకటించిన పోటీకి సుమారు వందకిపైగా ప్రతిపాదనలు వచ్చాయి. అందులో ప్రొఫెసర్ లెకర్‌ది కూడా ఒకటి. వచ్చినవాటిల్లో సైద్ధాంతిక వైరుధ్యాలున్నవీ, ఆచరణయోగ్యం కానివీ ఎక్కువ శాతం. మిగిలిన వాటిని సునిశితంగా పరీక్షించిన మీదట, వాటిల్లో వెంట్రుకవాసంత పరిష్కారం కనిపించినా, అవి ఆచరణలో పెట్టాలంటే అయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతుందని అనిపించడంతో వాటిని కూడా పక్కన పెట్టేశారు. ఇక మిగిలినవి రెండు: 1. ప్రొఫెసర్ లెకర్ ‘ఓడెరిన్ట్’ ప్రతిపాదన; 2. శాస్త్రీయంగా పటిష్టంగానూ, మంచి చతురతతోనూ కూడి, భూమిని మాడ్చేస్తున్న సూర్యుడిచేతే నష్టపరిహారం చెల్లింపించాలనే ప్రతిపాదన. భూమిమీద ఎండలు ఎక్కువ ఉన్న ప్రదేశాలలో, ఆ వేడిమిని ఇబ్బడిముబ్బడిగా వృద్ధిచేసి, సౌరశక్తి నుండి యంత్రాలకి కావాల్సిన చోదకశక్తిని తయారుచేసి, మూలపడుతున్న పరిశ్రమలని తిరిగి నడిపించుకోవచ్చనే ఆ ఆలోచన కమిటీలో చాలామందికి నచ్చింది. అది పోటీలో బహుమతి గెల్చుకునేదే కానీ డిప్యూటీ చైర్మన్ కళ్ళల్లోంచి పొడుచుకొచ్చిన ఆసక్తి చూసి చైర్మన్ కళ్ళు పచ్చబడ్డాయి. ఇద్దరికీ సౌరశక్తి ప్రాజెక్టు నచ్చినా, డిప్యూటి చైర్మన్‌తో ఏకీభవించడం అంటే అసహ్యించుకునే చైర్మన్, అతన్ని ఓ పోటుపొడవడానికి తన వోటు ఓడెరిన్ట్ ప్రతిపాదనకి వేశాడు. అలా చైర్మన్ వోటు వల్ల ఓడెరిన్ట్ నెగ్గింది.

రెండువారాల తర్వాత, కేనో కమిటీ ఒక రహస్య సమావేశంలో తన ప్రతిపాదన గురించి వివరంగా మాట్లాడమని ప్రొఫెసర్ లెకర్‌ని ఆహ్వానించింది.

“నా ప్రతిపాదన చాలా సులభమైనది. మానవాళిలో విస్తరిల్లిన ద్వేషాన్ని నేను ఇంధనశక్తిగా మారుస్తాను. ఓడెరిన్ట్ డుమ్ మెటువాన్ట్! లెట్ దెమ్ హేట్ ఇన్ ఫియర్! భావోద్వేగాల పొడుగయిన కీబోర్డ్‌ మీద, షార్ప్ నోట్స్ అందించే నల్లటి మెట్ల వంటివి ద్వేషానికి సంబంధించిన ఉద్వేగాలు. మృదుత్వం, మాధుర్యం, అనురాగం వంటి తెల్లటి మెట్లు శరీరాన్ని సడలించి సేద తీరుస్తాయి. కానీ కోపం, ద్వేషం, కసి మొదలైనవి మాత్రం శరీరంలో కండరాలన్నిటినీ బిగించి, ఒత్తిడిని పెంచుతాయి. కాలేయం నుంచి పైత్యరసం పచ్చగా మరింతగా విడుదలవుతుంది. అది మనిషిని చేదుగా మారుస్తుంది. ఆ చేదును బిగించిన పిడికిళ్ళు, కొరుకుతున్న పళ్ళు, మరుగుతున్న రక్తం, ఇవన్నీ ఒక శక్తిగా మార్చుతాయి. కాని ఈ శక్తికి బయటకిపోయే దారి లేదు. అది మన లోలోపలే ఉడిగిపోతుంది. మన మూలుగలో మజ్జలో ద్వేషంగా మారి అక్కడే మిగిలిపోతుంది. మసిబారిన లాంతరు వెలుగును ఎలా బైటకు రానీయదో మన శరీరమూ అలా ఈ ద్వేషాన్ని సమాజంలోకి రానీయలేదు. ఇలా అస్థిమూలగతమైన ద్వేషాన్ని లోలోపలే ఆపుతున్న ఆ తలుపులు మనం తెరచి, దానికి అడ్డు లేకుండా సమాజంలోకి ప్రవహించనిస్తే, ఈ పచ్చ బొగ్గు–అవును, పచ్చగా పసరులాగా మనలో పేరుకుపోయే ఈ పైత్యరసప్రకోపితద్వేషాన్ని, నేను పచ్చబొగ్గు అని పిలుస్తున్నాను–మన కర్మాగారాలను మళ్ళీ నడిపిస్తుంది. ఈ విద్యుఛ్ఛక్తితో కోటానుకోట్ల ఇళ్ళలో దీపాలు నిరాటంకంగా వెలుగుతాయి. ఇదెలా సాధ్యం అంటే… ఒక చాక్‌పీస్ ఇవ్వండి. నా మైలోఅబ్సార్బరేటర్ (మూలుగనుంచి శక్తిని పీల్చే యంత్రం) ఎలా పనిచేస్తుందో బొమ్మలతో వివరిస్తాను.

ఇదిగో, ఇక్కడ అబ్సార్బరేటర్ ఉపరితలానికి, లంబకోణంలో, నిలువునా సూక్ష్మమైన రంధ్రాలుంటాయి. నాడులు కండరాలతో కలిసే చోట్లలో, నరాల్లోంచి వచ్చే ప్రేరణ అతి సూక్ష్మమైన నూలుపోగుల్లా విడిపోయి కండరాలని బూజులాగా చుట్టుకుంటుంది. దీని తాలూకు కణనిర్మాణసూత్రాలను ప్రొఫెసర్ క్రౌస్ ఇప్పటికే వివరించి వున్నాడు. కాని ఈ వల తాలూకు ఈక్వేషను మాత్రం పూర్తిగా నేను కనిపెట్టిందే. కండరాలలోని శక్తిని బైటకు తేవడం సులభమే. నేను నిరూపించగలను. ఎనీవే… ఎక్కడున్నాం మనం… ఆఁ! కిటుకు ఏమిటంటే, ఈ వలని మరో వలతో, బూజును బూజుకర్రతో చుట్టి తుడిచినట్టు, మనం మనిషి శరీరం లోంచి బయటకి లాగాలి. ఇప్పుడు, నా అబ్సార్బరేటర్‌లో ఉన్న రంధ్రాల వరుసలు చూడండి…”

అలా ప్రొఫెసర్ లెకర్ రెండుగంటలపాటు అనర్గళంగా మాట్లాడాడు. అతని ఉపన్యాసం తరువాత అక్కడ కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది. కాస్సేపటికి, కమిటీ చైర్మన్ మెరుస్తున్న కళ్ళతో ఇలా అన్నాడు:

“ఇదంతా బానే ఉంది. మనుషుల తాలూకూ ఏ ద్వేషాన్నయితే నువ్వు ఇంధనంగా మార్చాలనుకుంటున్నావో, అది చాలినంత వస్తుందా? ముఖ్యంగా దాని మీద మనం పూర్తిగా ఆధారపడగలమా? ఎందుకంటే, ఇది భూమిని తవ్వి తీసే ఖనిజం కాదు. మనుషుల ఉద్వేగాలకి హెచ్చుతగ్గులుంటాయి కదా? నేనడుగుతున్నది నీకు అర్థమయ్యిందా?”

ప్రొఫెసర్ లెకర్, ముక్తసరిగా, “ఆహా!” అన్నాడు.

ఓడెరిన్ట్ ప్రాజక్టుని పెద్ద యెత్తులో అమలుపరచడం విషయంలో కమిటీ గుంభనంగా ఉన్నా, ముందు ప్రయోగాత్మకంగా దాని సాధకబాధకాలని పరీక్షించాలని నిర్ణయించారు.

4.

ఒకరోజు తెలవారుతూ ఉండగా, అప్పుడప్పుడే ప్రజలు పనికి బయలుదేరే సమయంలో ఒకానొక యూరోపియన్ రాజధానిలో జరిగిందది. ఒక ట్రాము కారు, లూపులైను లోంచి వచ్చి స్టేషనులో ఆగింది. స్టేషనంతా తండోపతండాలుగా జనం, బ్రీఫ్‌కేస్‌లతోనూ లంచ్‌బాక్స్‌లతోనూ కిక్కిరిసి ఉన్నారు. బ్రీఫ్‌కేస్‌లు ఒకదాన్నొకటి తోసుకుంటూ ట్రాములోకి ఎక్కుతున్నాయి. ఆ తొందరలో వాళ్ళెవరికీ బోగీ ఇంతకు మునుపులా లేదని తోచలేదు. మెరుస్తున్న ఎర్రటి బోగీ చుట్టూ ఒక పచ్చటి పట్టీ బెల్టులా అంటుకుని ఉంది. దానినుంచి సన్నటి వైర్లు ద్వారాలు, రైలింగుల మీదనుంచి పాకి, బోగీ కిందకి పోతున్నాయి. సీట్ల మీదంతా చిన్నచిన్న ఇత్తడి బొత్తాల వంటి బుడిపెలు ఉన్నాయి. వాటినుంచి కూడా సన్నటి దారాల్లాంటి వైర్లు సీట్లగుండా బోగీ కిందకు పోతున్నాయి.

ఇంతలో డ్రైవర్, ఆ బోగీకీ ఇంజన్‌కూ మధ్యలో ఆగి, అక్కడున్న లింక్ తీసివేసి ఇంజనును బోగీనుంచి తప్పించాడు. ఆపైన మెయిన్ స్విచ్ వేశాడు. వెంటనే ఇంజన్ దానిమానాన అది ముందుకు వెళ్ళిపోయింది బోగీని అక్కడే వదిలేసి. కొన్ని క్షణాలపాటు ప్రయాణీకులకి ఏమవుతోందో అర్థం కాలేదు. కొంతమంది పిడికిళ్ళు బిగించి చేతులు పైకెత్తుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికీ, చేతకానితనంతో కలిసిన అసహనం కోపంగా మారి అందరిలోంచి పైకి ఉబకడానికీ ఎంతోసేపు పట్టలేదు.

“మనల్ని ఇలా వదిలేసి పోయారేంటి, చెత్తలాగా?”

“స్కౌండ్రల్స్!”

“ఇదేంటి కొత్తగా ఇలా, ఎప్పుడూ లేనట్టు. ఫిల్తీ రెచెస్!”

“వీళ్ళని అరెస్ట్ చేయాలి.”

“చేసేముందు నా చేతులతో పీక పిసికేస్తే సరి.”

విషమై చిమ్ముతున్న వాళ్ళ ద్వేషానికి సమాధానంలా ఆ బోగీ ఇరుసులు కరకరలాడుతూ కదిలాయి, బోగీ ముందుకి నడవడం మొదలెట్టింది. డ్రైవర్ సీటు ఖాళీగా ఉంది. బోగీ నడపడానికి ఇంజన్ లేదు, పైన వేలాడే కరంట్ తీగలకు ఆనుకుని ట్రాలీ కూడా లేదు. అయినా బోగీ కదులుతూ రానురానూ వేగం పుంజుకుంటోంది. అందరూ ఆందోళనగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతలో ఒక స్త్రీ భయంతో అరవడం మొదలెట్టింది. అందరూ, ఒక్కసారిగా బోగీలోంచి గెంతుదామని గుమ్మాలవైపు ఉరికారు. ఎవరికివారు ముందు దిగిపోవాలనే తొందరలో, ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటున్నారు; భుజాలని భుజాలు, మోచేతుల్ని మోచేతులు పొడుచుకుంటున్నాయి–‘నన్ను పోనివ్వండి’, ‘నాకు ఊపిరాడటంలేదు’–అంతా గోలగోలగా ఉంది. దానితో, అంతకు ముందు కొద్దిగా నెమ్మదించిన ఆ బోగీ, ఒక్కసారిగా ఊపందుకుని దూసుకుపోసాగింది.

భయంతో, ఆందోళనతో, దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా అందరూ బోగీలోంచి పేవ్‌మెంట్ మీదకు దూకేశారు. అలా ఖాళీ అయిపోవడంతో ఆ బోగీ, తర్వాతి స్టేషనుకి ఒక పదిగజాలు ముందే ఆగింది. ఏం జరిగిందో పట్టించుకునే తీరిక లేక, ఆ స్టేషనులో కూడా ప్రయాణీకులు ఎగబడి బోగీ ఎక్కేశారు. ఒక్క నిమిషంలో, పచ్చబొగ్గు రాజుకొని, ఆ ఇనుప బోగీ పట్టాలపై గీసుకుంటూ, దాని పచ్చని గీతలతో గాలిని చీల్చుకుంటూ దూసుకుపోయింది.

ఆ వింత బోగీ, సాయంత్రానికి తిరిగి షెడ్డులోకయితే చేరింది కాని దాని కథ, ఫోటోలతో సహా మీడియాలో ప్రభంజనమై, ఒక దావానలంలా ప్రపంచమంతా వ్యాపించింది.

ఆరోజు ప్రపంచ చరిత్రలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి జన్మదినంగా పేరు తెచ్చుకుంది.

5.

పచ్చబొగ్గు ఇంధనానికి క్రమక్రమంగా ప్రపంచం అంతా అలవాటు పడుతోంది. కొత్తల్లో కొన్ని నెలలపాటు, మానవ ద్వేషపు నిలువలు ఎంతోకాలం ఉండవేమో అనే భయం అందర్నీ వెంటాడుతూ ఉండేది. అవసరమైతే కృత్రిమంగా మనుషుల్లో పైత్యప్రకోపాన్ని పెంచడానికి రకరకాల ఆలోచనలు చేశారు, ప్రణాళికలు వేశారు. శాస్త్రజ్ఞుడు క్రాంజ్ జాత్యంతర ద్వేషాల వర్గీకరణ అనే రెండు సంపుటాల పుస్తకం ప్రచురించాడు. మనుషులని వీలయినంత చిన్న చిన్న జాతులుగా, వర్గాలుగా విడగొట్టాలని, అలా వర్గద్వేషాన్ని మరింతగా రగిలించి అందరిలోనూ ద్వేషశీలత (ఇది క్రాంజ్ వాడిన పదం) పెంపొందింపవచ్చని ప్రతిపాదించాడు. కాని, ‘ఒకప్పుడు ఒకటి ఒకటే’ అనే పేరుతో ఒక కరపత్రాన్ని విడుదల చేసిన ఒక అనామక రచయిత మరింత ముందుకి పోయాడు. ‘అందరికీ అందరితో యుద్ధం’ అనే అతి ప్రాచీన సిద్ధాంతాన్ని అతను వెలికితీశాడు. ప్రాచీన సమాజాల్లో ‘నేను’ అన్న భావన పూర్తిగా స్థిరపడనందున అందరూ అందరితోనూ పోరాడేవారు కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఈ కొత్త ప్రతిపాదన వల్ల ప్రతి ‘నేను’ ప్రపంచంలో వనరులన్నీ తనకే కావాలని ఇతర ‘నేను’లతో పోరాడుతుంది. అందువల్ల, ప్రపంచంలో ఇప్పుడు మూడు బిలియన్లమంది నియంతలు ఉంటారు, ప్రతి నియంతా మిగిలిన అందరితో పోరాడుతూ ఉంటాడు. ఇలా మూడు బిలియన్లమంది, మూడు బిలియన్లమందితో అనుక్షణం పోరాడుతూ ఉంటారు. ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి లెక్కలు వేసి అతడు ఎంత ద్వేషాన్ని రాబట్టుకోవచ్చో గుణించి చూపించాడు.

అన్నిటిలోకీ బాగా వెలుగులోకి వచ్చింది మాత్రం, జూల్స్ షార్డన్ అనే సైకాలజిస్ట్ రాసిన ‘ది ఆప్టికల్ కపుల్’ అనే పుస్తకం. ఉపమానాలు వాడడంలో నిష్ణాతుడైన షార్డన్, దంపతులని జంట-నక్షత్రాలతో పోలుస్తాడు. విశ్వంలో రెండు రకాల జంట-నక్షత్రాలు ఉంటాయి. ఖగోళశాస్త్ర పరిభాషలో, రెండు నక్షత్రాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే వాటిని ‘సిసలైన జంట’ అనీ, అవి ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నప్పటికీ, మన కంటికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తే వాటిని ‘కనికట్టు జంట’ అని అంటారు. అదే విధంగా, దంపతులు కూడా రెండు రకాలు: ప్రేమానురాగాలతో నిజంగా కలిసి ఉన్న జంటలు, కలిసి బతుకున్నట్టు పైకి కనిపిస్తున్నా, లోపల ఒకర్నొకరు ద్వేషించుకునే జంటలు. ఇప్పటివరకూ, ప్రేమతో ముడిబడ్డ వైవాహికానుబంధాలు సమాజానికి ఉపయోగపడ్డాయి. ఇకముందు ‘కనికట్టు-జంటల’ వల్లే రాజ్యానికి అత్యధిమైన లాభం, అందువల్ల ప్రపంచంలో దాంపత్యాలన్నింటిని ‘కనికట్టు జంటలు’గా మార్చాలనేది అతని ప్రతిపాదన. ఇందువల్ల, ఉదాసీనత, దగ్గరతనం వల్ల వచ్చే అసహ్యాన్ని మరింతగా పెంచడం వల్ల, శరీరాల్లో పైత్యరసాన్ని మరింతగా ప్రకోపింపచేసి, తద్వారా వచ్చే ద్వేషాన్ని ఇళ్ళల్లో ఏర్పాటు చేసిన హోమ్ అబ్సార్బరేటర్‌ల ద్వారా బైటకు తెచ్చి, ఆపైన ఒక సెంట్రల్ రిజర్వాయర్‌లోకి ఈ పచ్చబొగ్గును, ఈ ద్వేష-ఇంధనాన్ని నిలువ చేయవచ్చు.

ఇలా కృత్రిమంగా ద్వేషశీలతను పెంపొందించే ఆలోచనలు అసంఖ్యాకంగా వచ్చాయి. అన్నిటినీ ఇక్కడ ఏకరువు పెట్టడం కుదరదు కానీ, అసలుకు వీటి అవసరమే లేకపోయింది. ఈర్ష్య అసూయల నుంచి అసహ్యం క్రోధం వరకూ ఎన్నో రూపాల్లో సహజంగానే పచ్చబొగ్గు నిలువలు అప్పటికే సమృద్ధిగానూ, ఎంత తోడినా ఇంకా ఇంకా ఊరుతూనూ ఉన్నాయి.

ఒక చిన్న తగాదా లోని ద్వేషశక్తిని సరిగ్గా పద్ధతి ప్రకారం అబ్సార్బరేటర్‌లోకి ఎక్కించగలిగితే దానితో ఒక అంతస్తు అంతా పన్నెండుగంటల పాటు దీపాలు వెలిగించవచ్చని; ఒక లక్షమంది ‘అన్యోన్య-దంపతుల’ పరుపుల కింద అబ్సార్బరేటర్‌లు పెట్టడం ద్వారా ఒక పెద్ద ఫాక్టరీని నిరంతరాయంగా నడిపించవచ్చని, లెక్క తేలింది.

అనూహ్యమైన వేగంతో ప్రపంచమంతా మారిపోసాగింది. ప్రతి జాగానూ, ప్రతి స్థలాన్నీ, ద్వేషాన్ని పిండడానికి వీలుగా మారుస్తున్నారు. ఆఫీసులకీ, షాపులకీ ద్వారాలు ఇంతకు ముందులా కాకుండా, ఇరుగ్గా, మనుషులు దూరడానికి కష్టంగా మార్చేశారు. దాంతో ద్వారాల దగ్గర తోపులాటవల్ల ద్వేషం పోగవుతోంది. పార్కుల్లో బెంచీలూ, సినిమా హాళ్ళలో సీట్లూ, ఆఫీసుల్లో వర్క్‌స్పేస్‌లు, ఒకటేమిటి, అన్నింటిలోనూ ప్రత్యేకమైన అబ్సార్బరేటర్‌లు అమర్చారు. చిన్నచిన్న ద్వేషపు బిందువులు వాగులై, వాగులు వరదలై, వరదలు నదులై, నదులు పొంగుతున్న సముద్రమై పచ్చబొగ్గు నిలువలు అనంతంగా పెరిగిపోతున్నాయి.

6.

ఫ్రాన్సిస్ డడిల్ మాత్రం మానవ జీవితాన్ని ఇలా పైత్యప్రకోపితద్వేషశక్తిగా మార్చడం సుతరామూ ఇష్టపడలేదు. ఆయనకి తోడుగా మరికొంతమంది కూడా ఉన్నారు. మరీ ఎక్కడికో పోనక్కర్లేదు. ఉదాహరణకి, ఆయన వెళ్ళే చర్చ్ ఫాదర్‌కి ఇష్టం లేదు; జీవితమంతా భక్తిగా అంట్లు తోమటానికే అన్నట్టున్న చేతులు గల అతని నలభై ఏళ్ళ మరదలు, ఆమెకు కూడా ఇష్టంలేదు. ఎంతోమంది ఈ పచ్చకాలుష్యం గురించి ప్రవచనాలు వల్లిస్తున్నారు. వాటికన్ నుంచి ఈ విషయం మీద ఒక పాపల్ నోటిఫికేషన్ ఇప్పటికే రావలసి ఉండింది కాని, దాని ప్రచురణలో అనివార్యకారణాల వల్ల జాప్యం జరుగుతోంది.

నింపాదిగానైనా సరే, పచ్చబొగ్గుని వ్యతిరేకించేవాళ్ళ సంఖ్య రాను రాను పెరుగుతోంది. పచ్చబొగ్గు పక్షంవాళ్ళు, ఈ వ్యతిరేకులని అభివృద్ధి నిరోధకులనీ, ఛాందసులనీ ఈసడించారు. కానీ ఈ వ్యతిరేకుల సంఖ్యాబలాన్ని వాళ్ళు తక్కువగా అంచనా వేశారు.

పచ్చబొగ్గు వ్యతిరేక వర్గం ఒక సంఘంగా ఏర్పడి ఒక కరపత్రం విడుదల చేసింది ‘కారుణ్యమా? కాలేయమా?’ అనే పేరుతో. ‘లవ్ ఆర్ లివర్?’ అనే పేరుతో అది పత్రికగా రావడం మొదలయింది–తొందరలోనే దాని సర్కులేషను పెరిగింది కూడా. డడిల్ ఈ పత్రికకి వ్యవస్థాపక సభ్యుడు, చురుకైన కార్యకర్త కూడా. అయితే, ప్రభుత్వాలు, సంస్థలు అన్నీ పచ్చబొగ్గు పక్షానే ఉండటం వల్ల, అతనికి చేతులు కట్టేసినట్టు ఉండేది. ప్రభుత్వానికి ఈ సంఘం కార్యకలాపాలు అంటే అనుమానమూ, అక్కసూ. సంక్షేమ సంఘాలన్నిటీనీ ప్రభుత్వం మూసేసింది, దాంతో ఈ సంఘానికి బలమైన అడ్డుగోడ ఎదురయింది (ఆ గోడ నిండా కూడా అబ్సార్బరేటర్లు అమర్చి ఉన్నాయి).

ఆరోజు ఉదయం కూడా, డడిల్ ఎప్పట్లానే నిరాశానిస్పృహలతో నిద్ర లేచాడు. లేచేసరికి అతని తలుపుకింద లవ్ ఆర్ లివర్? సంఘం నుంచి వచ్చిన ఉత్తరం ఒకటి కనిపించింది. దాని సారాంశం: సర్/మాడమ్, ఈ ఉత్తరం అందిన రెండు గంటలలోగా మీరు మానవజాతిని ప్రేమించాలి. ఆ పరిత్రాణం మన మనసులనుంచే మొదలవాలి.

ఇంక ఈ రోజు కూడా వృధా కాబోతోందని డడిల్‌కు తెలిసిపోయింది. తలెత్తి గోడగడియారం కేసి చూశాడు–అప్పటికే తొమ్మిది అయింది. ‘ఇంకా టైముంది’ అనుకున్నాడు. మానవాళి అనే ఆ ఆకారం లేని వెయ్యితలల మృగాన్ని ఒకసారి తన మనస్సులో ఊహించుకునే ప్రయత్నం చేశాడు. మోచేతిమీద ఆనుకొని, ఆ రోజు పేపరు చూశాడు. చిరాకుతో ‘హూఁ… ఏముంటుంది ఇందులో, అంతా చెత్త’ అని దాన్ని ఉండ చుట్టి ఓ మూలకి విసేరేశాడు. వెంటనే ‘శాంతి, శాంతి. పదకొండుకల్లా నువ్వు శాంతపడాలి డడిల్!’ అని తనకు తాను చెప్పుకుని, చిరునవ్వు మొహం మీదకి తెచ్చుకున్నాడు. ఇందాక పడేసిన న్యూస్‌పేపరు ఉండని తిరిగి సాపు చేసి టేబిలు మీద పెట్టాడు.

తొమ్మిది నలభైఐదు నిమిషాలకి బ్రేక్‌ఫాస్ట్ తిందామని లేచాడు. రెండు కాల్చిన బ్రెడ్డు ముక్కలు, కొద్దిగా మాంసం, ఒక గుడ్డు. గుడ్డు లోపల పసుపు పచ్చబారిన కన్నుతో తనవైపే చూస్తున్నట్టు అనిపించి, టైము చూసుకున్నాడు. పది అయింది. అతనికి ఆకలి చచ్చిపోయింది, ప్లేటు అక్కడే పడేసి లేచిపోయాడు. ‘ఇలా కూచుంటే లాభం లేదు, ఏదో చెయ్యాలి.’ ఇంతలో ఫోను మోగింది. ‘ఊహు, నేను తియ్యను, వాళ్ళేమైపోతే నాకేం!’ అది మోగడం ఆగి, మళ్ళీ ఇంకా అర్జెంటుగా మోగడం మొదలెట్టింది. విసుగ్గా, రిసీవరు తీసి చెవికి ఆనించుకున్నాడు.

“హలో, ఎవరు? ఆఁ నేనే. హ్యుమానిటీకి సంబంధించిన ముఖ్యమైన పనితో బిజీగా ఉన్నాను. పదకొండు తర్వాత చేయండి. అర్జెంటా? ఏం అర్జెంట్? బిజిగా ఉన్నానని చెప్పాను కదా. ఇక విసిగించకండి…”

కోపంతో రిసీవరు హుక్ మీద దబ్బున పడేశాడు. చేతులు వెనక్కి కట్టుకుని, గదిలో పచార్లు చేస్తున్న డడిల్ కళ్ళు ఉండుండి గోడలకి అమర్చిన అబ్సార్బరేటర్లోంచి కాస్త పొడుచుకొచ్చిన భారమితి కేసి చూస్తున్నాయి. ప్రపంచంలో అన్ని ఇళ్ళలోనూ, అన్ని గోడల్లోనూ ఇప్పుడు అవి ఉన్నాయి కదా. ఆ బారోమీటర్ ద్వేషశీలత మట్టం చూపిస్తుంది. అతని గదిలోని భారమితిలో పాదరసపు మట్టం మెల్లిగా పెరుగుతోంది. ‘నాకూ కోపం పెరుగుతోందా? లేదు, లేదు, ఇంక పని ప్రారంభించాలి.’ డడిల్ తలుపుతీసి బాల్కనీలోకి వెళ్ళి వీధిని ఓసారి పరికించాడు. ఎప్పట్లానే వీధంతా నల్లగా మనుషులతో నిండి ఉంది. వాళ్ళంతా ఆఫీసుల్లోంచి, షాపుల్లోంచి వస్తూ పోతూ ఉన్నారు.

“నా ప్రియమైన మానవాళీ!” అని మొదలుపెట్టి తత్తరపడ్డాడు డడిల్. అతనికి తెలియకుండానే అతని చేతివేళ్ళు ఉద్రిక్తతతో బిగుసుకుంటున్నాయి. అసహనంతో వెన్నెముక బిగుసుకుంటోంది.

కిటికీ తలుపులు వాహనాల కీచు శబ్దాలకి టకటకమంటున్నాయి, కిటకిటలాడుతున్న జనం, గోడలవారగా నడుస్తున్నారు.

“నా ప్రియమైన సోదరులారా, నా ప్రజలారా…” సమయం పదీ నలభై. ‘ఇంకా ఇరవై నిమిషాలే ఉంది. ఎలా ఇప్పుడు, ఏం చెయ్యాలి?’ డడిల్ పళ్ళు కొరుకుతూ ఇంట్లోకి వచ్చాడు. భారమితివైపు చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ వీధి కనిపించకుండా కర్టెన్ వేశాడు.

‘ఇలా కాదు, కొంచెం తీవ్రంగా ఆలోచించు. అమూర్త్యంగా ఈ మానవాళిని ప్రేమించు ఎలాగోలా. ఎందుకూ పనికిరాని ఈ చెత్తను ఆ తర్వాత జీవితాంతం ద్వేషించడం కోసమయినా సరే, ఒక్క పావుగంట ప్రేమించు… అబ్బా, అప్పుడే ఐదునిమిషాల తక్కువ పదకొండు. దేవుడా, ఏదైనా చెయ్యి. మనుషులందర్నీ పక్కవాళ్ళని ప్రేమించేటట్టుగా చెయ్యి. సరే ప్రారంభిద్దాం… My beloved…’

ఏదో గ్లాసుగొట్టం టప్పుమని పగిలిన శబ్దం వినిపించింది. డడిల్ అబ్సార్బరేటర్ వైపు చూశాడు. ద్వేషశీలత ఒత్తిడి ఇక తట్టుకోలేక భారమితి పగిలిపోయి, అందులోని పాదరసం చివ్వున బైటకు చిమ్మింది.

7.

పచ్చబొగ్గుని వెలికితీసి వాడుకునే ప్రయత్నంలో మొదట్లో ఎదురైన ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ క్రమక్రమంగా పరిష్కారమయ్యాయి. ఈలోగా, వైఫల్యం అనే భావనకు ఒకప్పుడున్న అర్థం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు, వైఫల్యాన్ని మనుషులు సహించలేకపోయేవారు. కానీ, ఇప్పుడు జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే వైఫల్యాలే, కొత్త ఇంధనం. జీవితం మీద ఉన్న విరక్తి, కోపమే ఇప్పుడు లాభదాయకం. దానివల్ల బోలెడు సంపాదన వస్తోంది. ఈ విషయంలో అందరికీ కొత్తగా శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరు ఎంత ‘పైత్యాన్ని’ ప్రకోపించగలుగుతున్నారో కొలిచే సాధనాలు వచ్చాయి, దాన్ని బట్టే వాళ్ళ జీతాలు నిర్ణయిస్తున్నారు. ‘ప్రకోపించు లేదా పస్తులుండు’ అనే కొత్త స్లోగన్ వచ్చింది. సౌమ్యులు, మృదువైన మనుషులని పూర్తిగా బహిష్కరించడమో, వాళ్ళు పస్తులుండి చావటమో, లేదా ఈ కొత్త సమాజానికి అనువుగా మారటమో జరిగింది.

ప్రొఫెసర్ లెకర్ ఐడియాని పూర్తి స్థాయిలో అమలు జరపడానికి ముందే, కేనో సంస్థ, ఒక రహస్య ఉప‌సంఘాన్ని నియమించింది. వర్గ విద్వేషాలని ఎలా ఉపయోగించుకోవచ్చో అధ్యయనం చెయ్యడం దీని పని. ఈ రకమైన ద్వేషం చాలా ప్రమాదకరమని కేనోకి తెలుసు. పచ్చబొగ్గుకి మారడం వల్ల కాలం చెల్లిన పరిశ్రమల శ్రామికవర్గాల్లో, అది చాలా ఆందోళనలకి దారితీసింది. ఈలోగా, పెట్టుబడిదారులు కేనోతో కుమ్మక్కయి, కార్మికుల సమస్యలని ఇంతకు ముందులా పరిష్కరించడం మానేశారు. ఎందుకంటే, కార్మికుల కోపం ఇప్పుడు పరిశ్రమలు నడపడానికి సరికొత్త ఇంధనం. వాళ్ళు ఎంతగా సమ్మెలు చేస్తే ఇప్పుడు అంత లాభం. యాజమాన్యం మీద వాళ్ళ ద్వేషం ఇప్పుడు అబ్సార్బరేటర్లలో ఇంధనాన్ని నింపుతోంది. మిల్లులు ఇప్పుడు కేవలం పనివాళ్ళ పనితనం మీద కాకుండా, వాళ్ళ ప్రకోపం మీదే నడుస్తున్నాయి. అబ్సార్బరేటర్లని చూసే ఇంజనీర్లు తప్పించి, ఇప్పుడు మరో రకమైన కార్మికుల అవసరం లేకుండా పోయింది. మెషీన్లన్నీ మనుషుల అవసరం లేకుండానే పనిచేస్తున్నాయి. దాంతో ఫాక్టరీలు చాలా మంది కార్మికులని ఉద్యోగాలలోంచి తీసేశాయి. దీంతో, ప్రపంచం అంతా సమ్మెలు, నిరసన ఉద్యమాలు పోటెత్తాయి. వాటితో మరింత పచ్చబొగ్గు సమృద్ఢిగా రిజర్వాయర్లలోకి వచ్చి చేరుతోంది.

పచ్చబొగ్గు వచ్చే మార్గాలంటిన్నింటిలోకీ, నిరుద్యోగుల నుంచి వచ్చే ఇంధనం అన్నిటికంటే మేలైనదని తేలింది. దానికి ఏ రకమైన వడపోత అవసరం లేదు. ఒక జర్మను ఆర్థికశాస్త్రవేత్త, రానున్న కాలంలో ఉత్పత్తంతా సమ్మెల ద్వారానే జరిగిపోతుందని జోస్యం చెప్పాడు. అతనా ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, ఆ సభ గోడల్లోని అబ్సార్బరేటర్లు అదే పనిగా కంపించాయట.

ఇప్పుడు నిజంగానే ప్రపంచ చరిత్రలో స్వర్ణయుగం. కష్టపడి భూమిని తవ్వి బంగారం పైకితియ్యడమో, నదుల్లో బంగారం కోసం వెతకడమో అవసరం లేదు. మనిషి కాలేయం నుంచే అది ఇప్పుడు నిరంతరాయంగా, బొట్లు బొట్లుగా పైకొస్తోంది. ప్రతి మనిషి ఇప్పుడొక బంగారు బాతు, అతని కడుపులోనే ఇప్పుడు బంగారు గని ఉంది, దాన్ని ఎవడూ దొంగిలించలేడు కూడా!

పెళ్ళాంతో పోట్లాటపెట్టుకుంటే రెండు పూటలా మంచి భోజనం కొనుక్కోవచ్చు. గూనివాడు, పక్కనున్న రూపసిని చూసి అసూయపడితే ఖరీదైన స్కాచ్ విస్కీ కొనుక్కోవచ్చు.

మొత్తం మీద జీవితం సాఫీగా, కులాసాగా నడిచిపోతోంది అందరికీ. కొత్తగా తయారువుతున్న ఇంధనంతో-

-ఇరుకు ఇళ్ళన్నీ పోయి, వాటి స్థానంలో విశాలమైన భవంతులు వచ్చాయి.

-చింకి, మురికి బట్టలు పోయి, రంగురంగుల ఖరీదైన దుస్తులు వచ్చాయి.

-వరదలుగా వచ్చి చేరుతున్న పైత్యం, ఇంధనంగా మారి, ఆకాశానికంటిన మసినీ, భూమికంటిన బురదనీ తుడిచేసింది.

-చీకటి గూభ్యాలలో మగ్గిన పేదప్రజలు ఇప్పుడు పొడుగాటి, ఎత్తైన ఇళ్ళలో పెద్ద పెద్ద ఫ్రెంచి కిటికీలు పెట్టుకున్నారు.

-చవకబారు బూట్లు కంతలుపడి కాళ్ళలో గుచ్చుకునేవి. ఇప్పుడు ఖరీదయిన లెదరు బూట్లతో ప్రజలు గర్వంగా నడుస్తున్నారు.

-పల్లెల్లో కరెంటులేక చలికి వణికిపోయి, శవాలమాదిరి పాలిపోయిన మొహాలతో, శతాబ్దాల తరబడి తమ అసహనాన్ని వ్యక్తం చేసుకోలేక కొట్టుమిట్టాడిన రైతుల ఇళ్ళల్లో ఇప్పుడు, పచ్చబొగ్గు పుణ్యమా అని చుట్టలు చుట్టుకున్న ఎలక్ట్రిక్ హీటర్లు రాత్రంతా వెచ్చదనాన్ని, సుఖాన్ని ఇస్తున్నాయి.

-ఎవరికీ ఇప్పుడు ఆకలి దప్పుల బాధలేదు.

-పాలిపోయిన బుగ్గలు ఇప్పుడు గులాబీరంగులీతున్నాయి.

-కృశించిన దేహాలు కండకట్టి నునుపుతేరాయి.

-లోతుకిపోయిన పొట్టల్లో కొవ్వు చేరి ఇప్పుడవి గుండ్రంగా వేలాడుతున్నాయి.

కాలేయం చుట్టూ ఆ కొవ్వు చిక్కగా పొరలా పేరుకుపోసాగింది.

అదే అంతానికి ఆరంభం.


పైకి అంతా బాగానే ఉంది; మిల్లులు, పరిశ్రమలు ఎడతెరిపి లేకుండా పనిచేస్తున్నాయి. అబ్సార్బరేటర్‌లు పచ్చబొగ్గుని పైకితీసి రిజర్వాయర్లు నింపుతున్నాయి.

చెదురుమదురుగా అక్కడక్కడా, లెకర్ ప్రణాళిక ఊహించని కొన్ని సంఘటనలు మాత్రం బయటపడ్దాయి. జర్మనీలో ఒకరోజు, ముగ్గురు ఆగంతుకులు పగలబడి సంతోషంగా నవ్వుకుంటూ పోలీసులకి పట్టుబడ్డారు. వాళ్ళని చూసిన పోలీసు అధికారి మొహం కోపంతో ఎర్రబడింది. ‘ఇవాళ మీరు పట్టపగ్గాలు లేకుండా నవ్వుతున్నారు, రేపు విచ్చలవిడిగా నగ్నంగా తిరుగుతారు’ అంటూ వాళ్ళమీద రౌడీయిజం నేరం మోపి జరిమానా విధించాడు.

ఇంతకన్నా విచిత్రమైన కేసు మరోటి జరిగింది. రద్దీగా ఉన్న ట్రాములో ఒకరోజు, ఒక యువకుడు ఒక ముసలామెకి లేచి తన సీటు ఇచ్చాడు. కండక్టరు అతనికి ‘మీ సీటు ఇంకొకరికి ఇవ్వడం చట్టరీత్యా నేరం, అందుకు జైలుశిక్ష పడవచ్చు’ అనే రూలు చూపించినా ఆ యువకుడు పట్టించుకోలేదు. ఆ ముసలామెకి కూడా ఆ యువకుడి ప్రవర్తన అర్థంకాలేదు.

విస్తారమైన ప్రపంచ రంగస్థలం మీద, అర్థంకాని ఇటువంటి సంఘటనలు తరుచుగా జరుగుతూ అతిత్వరగా వ్యాపించసాగాయి. అన్నిటిలోకి, ఎక్కువ ప్రచారంలోకి వచ్చిందొక స్కూలు టీచరు మీద కోర్టులో కేసు. అతను, విద్యార్థులకి ‘తల్లి తండ్రులని గౌరవించి ప్రేమించా’లని చెప్పాడు.

పాపం, పిల్లలకి ప్రేమ అనే మరుగునపడ్డ పదానికి అర్థం బోధపడలేదు. వాళ్ళ తల్లితండ్రుల్లో చాలామందికీ తెలీదు. అంతకు ముందు తరంలో వారికి మాత్రం తెలుసు. మనవళ్ళకు ఈ పదానికి అర్థం వాళ్ళు చెప్పారు. ఈ వార్త న్యూస్‌పేపర్‌లలో పొక్కింది. విద్యార్థులని పాడుచేస్తున్న ఆ స్కూలు టీచరుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

ఊహించని రీతిలో, జడ్జి అతని నేరం ఏమీ లేదని వదిలేశాడు. దీంతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. న్యూస్ పేపర్లు, టి.వి.లు జడ్జిని మార్చాలని గొడవ చేశాయి. ప్రభుత్వం కొత్తగా నియమించిన జడ్జిల బెంచికి ఈ కేసుని పునఃవిచారణకి పంపింది. కొత్తగా వచ్చిన జడ్జిల ఫొటోలు పేపర్లలో వేశారు, వాళ్ళందరి మొహాలు కూడా ఆనందంగా, ప్రేమాస్పదంగానే ఉన్నాయి. నేరస్తుడికి ఏ శిక్షా పడలేదు.

అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. పచ్చ సమాజమే కాకుండా, పచ్చబొగ్గు పరిశ్రమ కూడా మెల్లగా అంతమైపోతోంది. ఒక కలపమిల్లులో, పచ్చబొగ్గుతో నడిచే రంపం ఓరోజు ఉన్నట్టుండి ఆగిపోయింది. ప్రయాణీకుల పైత్యంతో నడిచే ట్రైన్లు, బస్సుల చక్రాలు కాస్త నెమ్మదిగా తిరుగుతున్నాయి. ఇళ్ళలో లైట్లు కొద్ది కొద్దిగా మసకబారిపోతున్నాయి.

ఇంకో ఐదారేళ్ళపాటు పచ్చబొగ్గు నిల్వలు సరిపోవచ్చు. కానీ, కొత్త ఇంధనం ఇప్పుడు ఇంతకు ముందులా పోటెత్తి రావటం లేదు.

ఈ ఉపద్రవాన్ని తప్పించడానికి అన్ని ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. కృత్రిమంగా పైత్యాన్ని పెంచడానికి, ఇళ్ళకి కరెంటుకోతలు విధించారు. కానీ, దానివల్లా ప్రయోజనమేమీ లేకపోయింది. ప్రజలు ఎవరూ ఆందోళన చెయ్యలేదు, కోపగించుకోలేదు, సమ్మెలు చెయ్యలేదు. అసలు వాళ్ళకి, ఆ చీకటి గదుల్లో వెచ్చగా ఉన్న హీటర్ దగ్గరికి జరుగుదామన్న ఆలోచన కూడా రాలేదు.

వాళ్ళ మొహాల్లో ఇప్పుడు ఏ విధమైన భావమూ లేదు. ఆ గులాబీ బుగ్గల మొహాల్లో అభివ్యక్తి శూన్యం, వాళ్ళ మెదళ్ళు పనిచెయ్యడం మానేశాయి.

డాక్టర్లని పిలిపించి, ఎలాగైనా తిరిగి పైత్యగ్రంథులని పనిచేసేలా మందులు ఇప్పించారు. ఇంజక్షన్స్, స్టిరాయిడ్స్, షాక్ ట్రీట్‌మెంట్–ఏం చేసినా ప్రయోజనం లేకపోయింది. తను చెప్పాల్సిందంతా చెప్పేసి, ఇవ్వాల్సిందంతా ఇచ్చేసిన కాలేయం, వెచ్చటి కొవ్వు గూట్లోకి చేరి నిద్రపోయింది–ఎవరెంత లేపినా అది ఇక లేవలేదు.

సమయం మించిపోతోంది. ఇక పైత్య సముద్రం ఇంకిపోవడమే తప్ప అది మళ్ళీ పోటెత్తదు అని తెలిసిపోయింది. మళ్ళీ కొత్త ఇంధనం కోసం వెతుకులాట మొదలైంది. ఎప్పుడో మూలపడిన కేనో సంస్థ తన బూజు దులుపుకుని, పనిలో పడింది. ఎవరైనా కొత్త ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేసింది. కొత్త ఇంధనం కనిపెట్టినవారికి కోట్లు గుమ్మరిస్తామని ప్రకటించింది.

ప్రతిపాదనలైతే ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి, ఐడియాలూ బోలెడు ఉన్నాయి, కాని వాటిల్లో లేనిదల్లా సృజనాత్మకతే. శాస్త్రజ్ఞులు ఎంతమంది ఉన్నా, వాళ్ళలో ఇప్పుడు యుక్తి, చతురత లేవు. ఒకప్పడు, అసహనంతో, పాతని భరించలేని రోతతో, కొత్త కోసం ఉవ్విళ్ళూరిన సృజనశక్తి ఇప్పుడు లేదు. ఉద్వేగాన్ని కోల్పోయి, ఉత్తేజం ఏమాత్రమూ లేక, నిస్సారంగా మిగిలిపోయిన ఈ కాలపు కలం పదును పోగొట్టుకుంది. రక్తమాంసాలు, జవజీవాలు లేని సిరా ఆ కలాలనుంచి అస్పష్టమైన మరకల్లాంటి ఆలోచనలు, వెర్రిమొర్రి రాతలూ తప్ప ఇంకేం సృష్టించడం లేదు. సంస్కృతి నశిస్తోంది–మౌనంగా, హీనంగా.

ఉవ్వెత్తున ఎగిసి, మూణ్ణాళ్ళ ముచ్చటగా ముగిసిన పచ్చబొగ్గు యుగం మీద ఒక పదునైన వ్యంగ్యాస్త్రం సంధించడానికి మంచి కవి ఒక్కడు కూడా చివరకి మిగలలేదు.

(1939)