హెచ్చరిక

స్పృహ వస్తూ పోతూ ఉంది అతనికి. కళ్ళు తెరిచేలోగానే మూతలు పడుతున్నాయి.

అర్ధరాత్రి కావస్తూంది. స్టేడియంలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. చూడడానికి వచ్చిన కొద్దిమందీ వేదిక మీద తలకిందులుగా వేలాడదీసిన అతని మీదికి నాలుగు రాళ్ళు విసిరి ఎంతసేపటికీ ఏ కదలికా, శబ్దమూ లేకపోయేసరికి ‘చచ్చినట్టుండాడు లేరా!’ అనుకుంటూ వెళ్ళిపోయారు.

మొదటి రోజు జనం చాలామంది ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారు. స్టేడియం నిండిపోయింది. వేదిక మీద ఏం జరిగేదీ పెద్ద తెరల మీద అందరికీ కనిపిస్తూంది. అన్ని టీవీ చానెల్స్ లైవ్ కవరేజ్ ఇస్తూ, వచ్చిన వాళ్ళ స్పందనలు కనుక్కుంటూ ఉన్నాయి. మధ్యమధ్యలో సగం కాలిన పాప మృతదేహాన్ని చూపుతూ అతను చేసిన ఘాతుకాన్నీ, పోలీసులు ఎంత చాకచక్యంగా రెండ్రోజుల్లోనే ఎలా పట్టుకున్నదీ, అయిదోరోజునే శిక్ష ఎలా అమలు చేస్తున్నదీ వివరిస్తున్నారు.

చనిపోయిన పాప తల్లిదండ్రులకే మొదటి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఖాళీ చేతులతోనే వచ్చారు. హింసించడానికి కావలసిన సాధనాలేవో ఇవ్వబోయారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఆ తండ్రి దుఖంతోనూ కోపంతోనూ వణికిపోతూ దగ్గరికి వెళ్ళి అతని మొహం మీద ‘థూ’ అని మాత్రం ఊయగలిగాడు. తల్లి అక్కడిదాకా కూడా వెళ్ళలేక, అతని వంక కూడా చూడలేక మధ్యలోనే దిగిపోయింది ఎవరి ఆసరాతోనో. వాళ్ళు దిగాక కొందరు కర్రలూ, కత్తులూ పట్టుకుని పైకి ఎక్కారు. జనం కేకలు వేశారు. ‘అంత తేలిగ్గా చావకూడదు వాడు’, ‘ఎముకలు విరగ్గొట్టండి’, ‘మరీ లోతుగా పొడవొద్దు’, ‘తోలు ఒలవండి’. వాళ్ళూ మొదట్లో జాగ్రత్తగానే ఉన్నారు. అతని బాధ తీవ్రతరం చేస్తూనే వీలయినంత సమయం కొనసాగించడానికి సిద్ధమయ్యే ఉన్నారు. ముందు కాళ్ళ మీదా, చేతుల మీదా పొడిచారు. ఎముకలు విరగ్గొట్టారు. అతను భయంతోటీ, తర్వాత బాధతోటీ అరుస్తూనే ఉన్నాడు. కారం తెచ్చి నెత్తురోడుతున్న గాయాలమీద అద్దారు. ఒకరు పట్టకారుతో చేతిగోళ్ళను పీకడం మొదలెట్టారు. అప్పటికి వేరేవాళ్ళు తోసుకుని పైకి వచ్చారు ఆ హింసను కొనసాగించడానికి.

అతని కేకలూ, ఏడుపులూ ఆగిపోయి ఏ స్పందనా కనపడని వేళకు జనంలో కోపం తగ్గి, ఉత్సాహమూ నీరుగారిపోయింది. స్టేడియం నెమ్మదిగా దాదాపు ఖాళీ అయింది. ప్రేక్షకులకూ విసుగెత్తిందని గ్రహించి టీవీలవాళ్ళూ వెళ్ళిపోయి వేరే గొడవలు చూపించడం మొదలెట్టారు పొద్దున రికార్డ్ చేసిన అతని ఏడుపునీ, కేకల్నీ మధ్య మధ్య చూపిస్తూ.

అక్కడ కాపలా కూచున్న పోలీసుల్లో ఒకతను లేచి వెళ్ళి చూసి వచ్చాడు అడ్డంగా తలూపుతూ.

“వీడింకా చావలేదేమిటీ?”

“పోతాడులే ఈ రాత్రికి. టీ తాగొద్దాం పద!”

వాళ్ళిద్దరూ లేచి బయటికి వెళ్ళారు. కాసేపటికి అధికారి కార్లో వచ్చాడు. దగ్గరలో పోలీసులు కనపడకపోయేసరికి తిట్టుకుని వేదిక మీదికి ఎక్కాడు. అక్కడ అంతా తడితడిగా ఉంది. ఆ వాసనకి వాంతి రాబోతుంటే తట్టుకుని ముక్కుకి అడ్డంగా చేతిగుడ్డ పెట్టుకుని దగ్గరికి వెళ్ళాడు. అతను బలహీనంగా శ్వాస పీల్చడం తెలుస్తూంది. కళ్ళు కొద్దిగా తెర్చుకున్నాయి.

“మీకు బుద్ధి రాదురా! పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపి టీవీల్లో చూపించినా భయం లేకుండా పోతుంది. ఇప్పుడు ఒక్కోడికీ ఉచ్చ పడాలి ఇట్లాంటి పని చేయాలన్న ఆలోచన వచ్చినా.”

అతనేదో గొణిగాడు. అధికారికి వినపడక కిందికి వంగాడు. “ఏమిటీ?”

“చంపేయండి తొరగా!”

“చస్తావులే! నువ్వా పిల్లని తేలిగ్గా చంపావా? అంత క్రూరంగానూ శిక్ష పడాలి కదా! అంత ఏమిటి? అంతకు అంతా, ఇంకా అంత. ఏమేం చేయిస్తున్నార్రా మాతోటి!”

“నేను చంపలేదు.”

“సీ.సీ. కెమెరాలు అబద్ధం చెబుతున్నాయా? జనమంతా నమ్ముతున్నారు, అది చాలదా? నీ ఒక్కడి మాటా నమ్మాలా?”

“నిజం చెబుతున్నా!”

“నిజం ఎవరిక్కావాలి? ఎవడి నిజం వాడిది. నువు చంపకపోయినా ఎవడిక్కావాలి? అందరికీ ఎంత రిలీఫ్ ఇప్పుడు! నువు పడ్డ చిత్రహింస చూసి ఇంకెవడూ ఇంత ఘోరం తలపెట్టడు. అందుకు బలిదానం చేస్తున్నాననుకో!”

“చచ్చే ముందు చెబుతున్నా. నిజంగా నాకేం తెలియదు.”

“ప్రతివాడూ అంతే చెప్తాడు. నరకంలో ఇంతకు ఇంతా అనుభవిస్తావు!”

“మళ్ళీ నరకంలోనా! నువ్వయినా నమ్ము.”

“ఇదంతా అన్యాయంగా చేశామంటావు అయితే! పాపమంతా మాదేనంటావు. ఇప్పటికయినా ఒప్పుకుని చావరా!”

అతని నుంచి బదులేమీ లేదు. కళ్ళు మూతలు పడ్డాయి. ఒళ్ళంతా ఒక్కసారి విపరీతంగా వొణికింది. ఒక మూలుగుతో అతని ప్రాణం పోయింది. అధికారికి ‘ఊఁ’ అని వినపడింది.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...