అలిఖిత కఠిన శాసనం!

ఏ లిప్త కాలపు జాలంలోనో
చేజారిన నీ తాలూకు ఆనవాలు
మసక వెన్నెల్లో ఇంకా తారాడుతూనే వుంది.
కొండచరియ ఛాయలో ఓ క్రీనీడేదో
మోకాలి మీద మోవి దాచి, మరి మరి దుఃఖిస్తూనే వుంది.
వెనకెనకే, నడిచొస్తున్న నీ జ్ఞాపకాల మహల్
మబ్బుల ప్రాణాలు కరిగేలా జాజిపూల గానాలని వినిపిస్తోంది
లోలోని అలల విషాదాలకి కామోసు –-నది గొంతు కటిక నిశ్శబ్దమయింది.
అరిపాదాల కింద – ఇసక ఎడారి విరిగి, కళ్ళల్లోకి కడలిని తరలిస్తుంది.

అయినా, నన్ను చూసి
చందమామ తరిగింది లేదు. అడవి సముద్రం ఆగిందీ కాదు.
జాలి మాలిన కాలం ఓ కనికట్టు. ఏ ప్రేమ గాయాలకీ లేదు లేపనాల కట్టు.

ఒకటి చెప్పనా?
విరిగిన హృదయానికి విషాదాలే విందులు.
పగిలిన గుండెకి, గతించిన రోజులే పసందులు.
నీటమునిగిన వానికెందుకోయ్ తిరిగిరాని కలల పడవలు!
వెర్రి ప్రేమికునికి, తెరపు లేని వేదనే సాంత్వనం.

తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది.
తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె
మట్టిలో రాలిన చప్పుడవుతోంది.
వీధి కొసన గుడ్డి దీపసెమ్మె తల చుట్టూ చలికొంగు కప్పుకుని,
బిక్కుపోతున్న ఒంటరి తోవకి తోడుగా, నించుంది.
గూడు చెదరిన పక్షి తెల్లారడం కోసం తహతహలాడుతోంది.

నిశి ధారల నల్లుకున్న నల్ల పోగుల్ని వేళ్ళ కొసల చుట్టుకుంటూ…
తళుకు చుక్కల కన్నీటి చుక్కల్ని లెక్కిస్తూ చెక్కిళ్ళ తడిమెరుపుల్ని తుడిపేస్తూ
ఈ రాత్రికిక సెలవీయలేను. రేపటిని స్వాగతించనూ లేను.
ఇదొక మధురావస్థ. మిధ్య కాని తీపి మరణావస్థ.
కొన్ని నరకాలు ఎన్ని పూర్వ పుణ్యవరాలో!
ఈ హృది ఏ శిల్పి చెక్కని శిలా ఫలకం.
ఇదొక అలిఖిత కఠిన శాసనం!

నువ్వంతే! కదలని రాతివి.
నేనూ ఇంతే! కరగని రాత్రిని.

రచయిత ఆర్. దమయంతి గురించి: పుట్టింది బందరు, స్థిరపడింది హైదరాబాదులో. ప్రస్తుత నివాసం - బెంగుళూరు. ఎం.ఏ సోషియాలజీ చదువుకున్న వీరు జర్నలిస్ట్ గా పని చేసారు. ఇప్పటి దాకా25 కవితలు, 50 పైగా కథలు రాసారు.ప్రస్తుతం ఒక సీరియల్ రాస్తున్నారు. "చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువగా ఇష్టపడేది మాత్రం మొదటిదే. సాహిత్య విలువల్ని ప్రేమిస్తాను. సంస్కారవంతుల్ని గౌరవిస్తాను." అంటున్నారు ఈ రచయిత్రి. ...