ప్రవహించు…

కన్నీరు తుడుస్తుందనుకున్న కాలం
కసిగా కాటేసినా
ఎద లోపలి వ్యథను
మరిపిస్తుందనుకున్న చెలిమి
సరికొత్త గాయమై వేధించినా
ప్రేమ వర్షం కురిపిస్తుందనుకున్న మేఘం
నిర్దయగా పిడుగుల్ని విసిరినా
వెలుగు నిస్తుందనుకున్న దీపం
వేల మిణుగురులుగా మారి
అనంత శూన్యంలోకి అదృశ్యమయినా
ఆగకు
ఘనీభవించకు
ప్రవహిస్తూనే ఉండు

గుచ్చుకున్న ముళ్ళ నుండి కారుతున్న రక్తాన్ని
పారాణిగా అలంకరించుకుని
ఆత్మబంధాన్ని ముడి వేసుకొని
అడుగులో అడుగుగా
అగ్ని కీలల చుట్టూ తిరుగుతూ
నిన్ను నువ్వే మనువాడు
నీ జతలో నువ్వే బ్రతుకు

ఎండిపోయిన మనసుని తడిపే
జ్ఞాపకాల చెమ్మ కోసం
ఆనందపు క్షణాల అమృత లేపనం కోసం
విచ్చుకున్న గులాబీ సాక్షిగా
అస్తమించిన ప్రతిసారీ
సరికొత్త ఉదయమై పల్లవించే ఆశతో
అన్వేషిస్తూనే ఉండు


నల్లపనేని విజయలక్ష్మి

రచయిత నల్లపనేని విజయలక్ష్మి గురించి:

ప్రముఖ కవయిత్రి, రచయిత్రి డా. నల్లపనేని విజయలక్ష్మిగారి రచనలు అనేక పత్రికలలో వెలువడ్డాయి.

 ...