చెలగాటం

అదేందో ఉరేనియం అంట మన ఇండ్ల కిందనే ఉందంటున్నరు, నర్సిమ్మ వూరి నడిమిట్ల ఉన్న డబ్బ దుకుణం కాడ గొణిగిండు కడీలతోటేసిన కొట్టం లోపటికి ఒచ్చుకుంట.

సమ్మయ్య పొద్దున లేసిన సంది గీడనే ఉంటడని తెలిసే ఒచ్చిండు.

యాదిగా, ఏమన్న పేపర్ల రాసిండ్రార? అడిగిండు నర్సిమ్మే డబ్బ దుకుణమాయినని.  యాదగిరికి ఈళ్ళిద్దరి సంగతి బాగనే తెలుసు కాబట్టి, జవాబు చెప్పకుండ ఓ ఖాళీ అయిన పిప్పరమెంట్ల సీస మూత తీసి పట్నం నించి తెచ్చిన కొత్త పాకెటు నిమ్మ గోలీలు సీసల నింపుకుంటున్నడు.

ఒక్కక్కొడు ఒక్కో తీరుగ శెప్తర్రా, ఇంత కూడు పెట్టేదో, మనకిన్ని గింజలొచ్చే మాట ఎవడు చెప్పడు, కుసున్న కాడ్నించి లేవకుంట, భుజమ్మీద ఉన్న రుమాలు తీసి నెత్తికి చుట్టుకుంట పక్క తిరిగి తుప్పున ఊంచిండు సమ్మయ్య.

మొగురానికానించిన శేతి కట్టె అందుకుంట అడిగిండు పటేలేంజేస్తడట ఈ ఏడాది, అని.

నర్సిమ్మ పటేలు తాడ జీతముండబట్టి ఏడాది దాటింది.  ఒక్క బిడ్డ పెండ్లి జేస్తందుకు చేసిన అప్పు తీర్తందుకు జీతముండక తప్పలేదు కని ఎండిపోయిన ఆరు గుంటల భూమి దున్ని, ఇన్ని పెసర్లు సల్లి వస్తదో రాదో తెల్వని ఆన కోసం కొబ్బరికాయలు కొట్టేదానికంటె, గీ జీతమే బాగుంది.

పటేలుకేపాటి పండుతయో ఊరంతటికి తెలుసు, ఎనకట బాయిల నీళ్ళున్నప్పుడు ఎనిమిదెకరాలు నాటువెట్టేటోడు.  ఊళ్ళె జనానికి ఇంత పనన్న దొరికేది.  ఆరు కోలల నీల్లుండే బాయిల కప్పలు బతుకుతందుకు కూడ సరిపోయ్యే నీళ్ళు లేకపాయె.  గడ్డపారలతోటో, పొక్లెయిను బెట్టో మొరమంత తీస్తె బండ తేలిన సంది పటేలు అంత తీసుకున్నట్టు అయిండు.

పటేలు కూడ నిన్నియ్యాళ కొత్త సంగతేదో కనుక్కున్నట్టు చెప్పబట్టిండు, బాయిలు తొవ్వి యవసం చేశి పచ్చబడ్డోడు ఎవడు లేడు అని.

బోరింగులేస్తమని పట్నపోల్లు ఊళ్ళమీద బడి ఒడ్డెరోళ్ళ కడుపు కొట్టే కాలమొచ్చె.  నాలుగు బోర్లేస్తె రెండు మంచిగనే పడ్డయి.  వూళ్ళె అందరికి ఇంత ఆశ మళ్ళ, పటేలు తాడ నీళ్ళు పడ్డ దినం పెద్ద కోమటాయిన కొట్ల ఇంత బెల్లం, ఇన్నన్ని కొబ్బరికాయలు ఎక్కువ అమ్ముడెఇనయట.

అందరిమీద సవారి చేశేటిది కాలమేనాయె.  పొయ్యి పొయ్యి పులి నోట్లె తలకాయ పెట్టినట్టయ్యింది.  మోట కొట్టేనాడె నయముండె, రెండు బోర్లకు మోటర్లు పెట్టి, రెండొందల పీట్ల నించి నీళ్ళుతియ్య బడ్తె, కరెంటు బిల్లే తడిశి మోపెడయ్యింది.  నలభెఇ మోపుల గడ్డెల్లలేదు పొయ్యిన కారు.

ఇగ గా మందమయ్యే కాలం కూడ పోబట్టె, శెప్పుకుంటె సిగ్గుపోతది గని పొయినేడెఇతె రెండెకరాలు సగ పారలేదు పటేలుకు.  ఊళ్ళె సగం మంది, గాయనకే అయితలేదు, మనతోటేమెఇతది అని పట్నం దిక్కు తొవ్వ బట్టవట్టిండ్రు.

ఇగో గిట్ల ఆశ సావక పడున్న సమ్మయ్య లాంటోళ్ళు, ఇంకా సంకకింద రెండెకరాలు పొలమున్నదని శెప్పుకుంట ఎగిరిపడ్తనే ఉంటరు.  అది పొలం కాదురయ్య, ఎండిపొయ్యి సర్కారు కంపశెట్లు మొలిశి సోరుప్పులాగ తయారయ్యి నాలుగేండ్లయ్యింది అని ఎవరన్న చెప్తె ముల్లు గర్ర తీసుకోని నేలమీద ఒక్క దెబ్బేస్తడు.  మీదిమీదికొస్తడు కొట్టేటోనిలాగ.  ఆని భూమిని ఏమన్న అంటె సాలు, ఏదో అయిపోతడు, ఎన్నటికన్న పెద్ద కోడలు గా భూమికోసమన్న గింత గంజి పోస్తదని యమ నమ్మకం, సమ్మనికి.

సమ్మయ్య నర్సిమ్మ ఇద్దరు ఒక్క తోటోళ్ళే, కని అదేదో నీళ్ళు తాగితె వస్తదట మాయ రోగం, నీళ్ళల్ల ప్లోరిన్‌ అని ఉంటదట గందుకే మోకాళ్ళు  రెండు దగ్గరికయ్యి నలభైకే సమ్మయ్య అరవై ఏండ్లోతిరి కట్టెలేంది నడ్వలేడు.

రెండు రోజులకింద మొదటి సారి సర్కారు జీపు ఊళ్ళెకొస్తె పోరగాళ్ళంత వొంటిమీద బట్టలు సక్కగ లేకున్నా అదాగే దాక ఎమ్మడి ఉరికి, అండ్లనించి దిగినోళ్ళను ఏరే గ్రహాన్నించి దిగొచ్చినట్టు సూడబట్టె.  అండ్లనించి దిగిన పాంటేసుకున్న ఒకాయిన గదేదో నక్ష బయటికి తీశి గాల్లె లెక్కలు రాసినట్టు రాసి, చేతిల ఉన్న పేపరు ముక్క మీద ఓ తాడ ఏలు పెట్టిండు.

కొట్ల ఉన్న యాదిగిరి అంటనే ఉన్నడు, మన బాస రానట్టుంది అని.  ఖాకీ గుడ్డలేస్కున్న జీపు నడిపేటాయిన లోపలికల్ల ఒచ్చి చెప్పేదాక తట్టలే గిట్ల జీపేసుకోనొచ్చింది ఉరేనియం పడ్డ ఊరు మనదే అని జెప్తందుకే ఉండొచ్చేమొ అని.

ఏడాది కింద సర్కారే తన భూమిల ఏదో తొవ్వి ఇంత మట్టి తీస్కపోతమని చెప్పి శేతిల ఒంద రూపాయలు పెడితె, అదేదో పండుగ చేసిన గ్యాపకమొచ్చింది సమ్మయ్యకు.

ఇయ్యాళ మల్ల ఇంకో ఒంద ఇచ్చి మళ్ళ మట్టి తోడ్కపోతనంటడేమొ అని, ఈ పాలి నూట యాభై అన్న లేంది ఒప్పుకోవొద్దు అనుకున్నడు సమ్మడు.

దుక్నం యాద్గిరికి ఒక పేపరు ఇచ్చుకుంట చెప్పిండు ఖాకీ గుడ్డల జీపు మనిషి, కొట్టుకు అంటించుమని.  గండ్ల ఏముందో సద్వరాదు అని సమ్మడు గట్టిగనే అంటనే ఉన్నడు గని, ముసలోడా నీకెందుకు ఇయ్యాల్నో రేపో పొయ్యేటోనివి అని నవ్వుకుంట జీపు తాడికి పొయ్యిండు గాయిన.  పక్కూరికి ఎట్ల బోవాలె అని జీపు తాడికొచ్చిన పది సదివి నోరెళ్ళబెట్టుకుంట తిరిగే పొల్లగాన్ని అడిగి దుమ్ము లేపుకుంట పోనే పొయ్యిండ్రు.

యాదిగిరికి ఇంత సదువొచ్చు కాబట్టి సరిపోయింది, లేకపోతె పటేలు తాడికి పోవాల్సొచ్చేది.  ఆ పేపరు దుకుణం డబ్బ మీద అంటు పెట్టుకుంట చెప్పిండు, మనూరి సుట్టుమట్టు బూములల్ల ఉరేనియం దొరుకుతదట, ఇంకో పదేను దినాలల్ల మనోళ్ళెవరన్న అడ్డం జెప్పేదుంటె చెప్పమని గవర్మెంటు అడుగుతున్నదట.

సమ్మయ్య ఒక పాలి గార పండ్లు బయటికి పెట్టిన సంగతి, నోరు ఎల్లబెట్టిన సంగతి మర్చి పోయి ఇంకేమన్న యాద్గిరి చెప్తడేమొ అని సూడబట్టిండు.  కని వాడు వాని పని వాడు చేసుకో బట్టిండు ఇగ చెప్పేదేంది లేదన్నట్టు.

పక్కన ఉన్న నర్సిమ్మ గంతే రాసున్నట్టుందిర, గవర్మెంటుకు నీ రెండెకరాలు కావాలె, ఇస్తవా శెప్పరాదు అన్నడు ఎక్కిరిస్తున్నట్టు.

శేతిల ముల్లుగట్టే వున్నా కూడ, ఈ సారి అల్పానికి అంటున్నడని తెలిసి, ఏందిరో సూశినావుర, గింత పెద్ద గవర్మెంటుకు కూడ మనల్నడుగకుండ పనెఇతలేనట్టుంది అని కొంత ఖుశీగ చెప్పిండు.

నర్సిమ్మ  ఇగ పోవాలె దీపాలు పెట్టే యాళ్ళయితుంది, పటేలమ్మ ఇంత నూనె తెమ్మన్నది మరిశే పోయిన అనుకుంట వూళ్ళె పెద్ద కోమటాయిన ఇంటి దిక్కు పొయ్యిండు.

తెల్లారి పటేలు ఇంటికాడ దొడ్లె పెండకాళ్ళు గిట్ల తీసేసి, ఒచ్చుకుంట సల్ల పూట సావు మాట తెచ్చినట్టు చెప్పిండు నర్సిమ్మ, పటేలు పేపర్ల సదివిందాన్ని బట్టి, మన సుట్టుపట్టు ఊళ్ళల్ల భూములు ఆళ్ళకు కావాలె, ఈడ తొవ్వితె అదేదో ఉర్రేనియం అని దొరుకుతదట, మనకు పెద్దగ పని దొర్కక పొయినా, భూములైతె అమ్ముకోవొచ్చట సర్కారు ధరకు అని రాసిండ్రట.

యాద్గిరి అందుకున్నడు, ఆల్ల పని గీడ నోటీసు అంటియ్యుడుతోటె అయిపోయింది.  ఇగ మల్ల సారొచ్చినప్పుడు అందరి చేతుల సర్కారు ధర పెడ్తమంటరు, వూళ్ళె నించి మందిని ఎల్లగొడ్తరు అన్నడు.  గవర్మెంటోడు పిల్లిలాంటోడు, వానికి ఆటెఇతె, మనకు పాణం మీదికొస్తది.  ఏ పని గాని సరిగ్గ చెప్పరు, మనలాంటోల్లె ఆకరికి ఏట్లె కలుస్తరు అన్నడు.  ఈల్లు గా సిటీలల్ల కుసోని మనకోసం గీ నోటీసులు రాస్తె ఎవళ్ళకు అర్ధమైతదిరయ్య, అన్ని ఆటలు గాకపోతె.

సమ్మయ్య ఏం మాట్లాడలేదు.  నోట్లె నోట్లెనె తిడుతున్నడో మరి లెక్కలేస్తున్నడో ఏమన్న పైసలొస్తయేమొ  అని, ఎవలకెరుక.

నర్సిమ్మ కూడ ఇగ చెప్పేదేది లేదన్నట్టు సప్పుడు జెయ్యకుండ గూడెం దిక్కు పోయిండు.

మూడో నాడు ఇంకో మాట తీసుకొచ్చిండు, పటేలు తాణ్ణించి,  పొలానికి పది యేలు, శెల్కకు అయిదు కట్టిస్తదట గవర్మెంటు అని. కని ఆటినికూడ ఒక్క పాలె ఇయ్యదట.  కారుకు ఇంత అని ఇస్తదట, కని గవర్మెంటోడు ఏమన్న పంటలు పండిస్తడా అంటె అది లేదు మరి గట్ల ఎందుకు కట్టియ్యాల్నో తెల్వది.

సమ్మయ్య అర్ధమైనట్టు చూశి అన్నడు, మరి నా రెండుగూడ పొలమే గద ఇరవెఇ కట్టిస్తర అడిగిండు, గింతంత ఆశ గొంతుల.

యాద్గిరి ఉన్నడుకద నీళ్ళు సల్లుతందుకు, కారుకు ఎఇదు ఎయిల కింద నాలుగేండ్లు ఇస్తమని చెప్పి, జీపులల్ల దిగేటోళ్ళందరు మింగినంక నీ జేతిల రెండు ఎయిలు పెడ్తరు గని ఇగ వూకో అన్నడు.

మరి నా పొలం? అన్నడు మల్ల నోరు ముయ్యడం మర్చిపోయిన సమ్మయ్య.

అవ్వ కావాలె, బువ్వ కావాలె?  పొలం తీస్కోనే కదర నికు ఇచ్చేటివి గా రెండు ఎయిలు.  పుక్యానికిస్తర గా పైసలు కూడ?  యాద్గిరే అన్నడు.

ముళ్ళకట్టే మొగురాన్ని గట్టిగ కొట్టింది, సమ్మయ్య తుప్పున ఉంచుకుంట లేశిండు.

నాలుగు దినాలైంది.  కొత్తగ ఎవరో  బస్సు దిగి వూళ్ళె ఎవళన్న భూములమ్మితె కొంటమంటున్నరట.  ఎంత కట్టిస్తరో నర్సిమ్మనే అడిగొచ్చిండు, ఇప్పుడు చేతిల అయిదొందలు పెడ్తరట, మిగతాది ఒచ్చే ఏడు ఇస్తరట, మొత్తం నాలుగెయిలు శెల్కకు.  ఆ వూళ్ళె అందరివి శెల్కలే అని చెప్పిండ్రు, ఒక్క పటేలుకు పోయిన కారు పారిన రెండెకరాలు తప్పితె.  గవర్మెంటోల్ల దగ్గర ఆళ్ళే అడుక్కుంటరట ఇగ మనకు గీ యాతన ఉండదట.

అరె పాపం పోయినేడే కదర ఆరు దాక పారనే పారె పటేలుకు, తనకన్న పటేలుకెక్కువ నష్ఠమైతున్నందుకు బాధపడ్తున్నట్టు అన్నడు సమ్మడు.

అది పోయినేటి కత, ఇయ్యాలటిదియ్యాలనే అట, పైసలు కావాల్నా ఒద్దా.

నర్సిమ్మ గందుకే పొద్దున్నే పటేలు తాణ్ణించి ఒచ్చుడే చెప్పిండు పటేలెఇతె అమ్ముకుంటున్నడు ఒచ్చినతాడికి సాలని, ఆయనకు పెఇసలు ఇయ్యాల్నే అవసరమున్నెఇ గద, బిడ్డ పెండ్లి చెయ్యాలె అని.  తర్వాత ఎట్ల బతుకుతవు అంటె పటేలు, పటేలమ్మ మొఖాలు సూసుకున్నరు తప్పితె మాట్లాడలేదు, నిమ్మకు నీరెత్తినట్టు చెప్పిండు నర్సిమ్మ.

పటేలే అమ్మంగ ఇగ ఎవళకు తప్పేటట్టులేదు అని అందరికి తెలుసు.

గవర్మెంటోడు కొంటె ఎన్నడిస్తడో, ఆళ్ళే ఎంత తింటరో, పట్నంల అడక్క తిన్నట్టు ఆళ్ళ సుట్టు తిరుగాలె, గిదైతె శేతుల పైసలు పడ్తయి ఎమ్మటే అని పటేలే అనుకుంటున్నడు మరి.

దశెపో నీయమ్మ, ఇగ పటేలే అమ్మినంక మనకేంది, ఇయ్యమను గా అయిదొందలు గా కాయితమ్మీద ఒక నిశానేసుడే కద పద అని కట్టె ఆడించుకుంట తన గుడిశె దిక్కు పొయ్యిండు సమ్మడు.

యాదగిరి మెల్లగ గొణిగిండు, పటేలు కంటె ఎక్కువ, మన సమ్మడు సగ గాని బూమమ్ముతున్నడంటె వూళ్ళె అందరు ముద్దర్లేస్తరు ఇగ, నేను కూడ ఇగ కొట్టు తీసేసి పట్నానికి పోవాల్సొస్తట్టుంది.

ఇదెఇన రెండు వారాలల్ల వూళ్ళె సగంబడ అమ్మనే అమ్మిండ్రు, ఎకరానికి అయిదొందలు తీసుకోని.  మిగతా పైకానికి ఒక ఏడు పెట్టిండ్రు.  ఇంకో ఏడు ఈ వూర్లె ఏముందని బతుకాలె అని సగం మంది కాల్వకిందికో, పట్నమో పోతందుకు తయారెఇండ్రు.

పైసలు చేతులబడ్డ వారం మాత్రం పెద్ద దుకాణంల మల్ల కొబ్బరికాయలు, బెల్లం బాగ అమ్ముడెఇనయి.

నెలైంది, గవర్మెంటోని జీపు మల్ల అన్నట్టే రానే ఒచ్చింది.  దిగి ఇంకో నోటు యాదిగిరికి ఈ సారి తెల్ల గుడ్డలేసుకున్న ఇంకో డ్రెఇవరు అంటించుమని చెప్పి తన దారిన తను పొయ్యిండు.  పోతున్నోణ్ణి ఈ సారి సమ్మడు ఏం అడగలేదు.

గిదేందిరో మల్ల ఏం పుట్టె అన్నడు సమ్మడు.  ఏం లేదుర, ఉరేనియం పనోళ్ళు కాదు ఈళ్ళు, మన వూరిమీంచి గదేందో కాల్వ కడ్తరట, ధరలు పెరుగుతయట నీళ్ళొచ్చి, మనయన్ని పొలాలైతయట భూములెవళ్ళకు అమ్మొద్దని గవర్మెంటు చెప్తున్నది అని యాద్గిరి సదివి చెప్తుంటె అందరు నోళ్ళెల్ల బెట్టిండ్రు.

సమ్మడు కడ్డీకేసి కొడ్తున్న ముళ్ళకర్ర సప్పుడు తప్ప అక్కడ ఇంకోటి ఇనపడ్తలేదు.