చిలుం పట్టిన కడ్డీ నైరాశ్యం
ఆకుపచ్చని పాచిరాళ్ళ వైరాగ్యం
గాల్లో కొట్టుకొచ్చే సోరుప్పు
ఎండి చారలు కట్టిన చెక్కిళ్ళు
రోజుకో గజం లోతు తగ్గే జీవితం
కీచుమంటూ గిర్రున తిరిగే తోటి కోడళ్ళు
చుట్టుముట్టిన మరో మూడు గిరకలు
తాడేస్తే కనిపించని బొక్కెన
పురిటికొచ్చిన లచ్చువమ్మ దాహమంటే
కీచుమన్న నా ఆఖరి ప్రయత్నం
అన్నీ మరిచి అట్టడుగున వెల్లకిలా
వొట్టిపోయిన బాయి, పక్కనే బొక్కెన