పేరు రాము
పుట్టిన సంవత్సరం 1925
బరువు 5 టన్నులు (5,000 కిలోలు)
అద్దం మీద రాసిన ఫలకం చదువుతూ ఆలోచనలో పడ్డాను. ఈ రోజెందుకో చాలా సేపు ఈ ఏనుగుల ఎగ్జిబిట్ దగ్గర గడప బుద్ధేస్తుంది. నాకంతగా జూకు రావడం కుదరదు. ఇది రెండవసారి ఈ సంవత్సరం, పదేండ్ల మనుమడి పుట్టినరోజు సందర్భమ్గా జూకు తీసుకు వెళ్తానని ఎప్పుడో అన్న మాట పట్టుకుని నన్నివ్వాళ అవతల ఎన్ని పనులున్నా ఇలా లాక్కొచ్చాడు వాడు.
ఇలా ఈ ఏనుగుల ఎగ్జిబిట్ దగ్గర ఎక్కువ సేపు గడపడం కూడా మొదటిసారే. ఈ పెద్ద పది అడుగుల ఎత్తున్న ఏనుగును ఇదివరకు చూసాను. అప్పుడది ఆరుబయటే తిరుగుతూ చుట్టూ చూసే వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా తన దారిన తను అటూ ఇటూ నెమ్మదిగా తిరుగుతూనో, లేక కొన్ని గడ్డి పరకలను నములుతూనో కనిపించేది. ఒంటరిగాడు, నా లాగే అనుకునేవాడిని. క్రితంసారి వచ్చినప్పుడు మొదటిసారిగా వేరే కొంచెం చిన్న ఏనుగు ఇంకొకటి రాముతో కాక వేరేగా నిలబడి బయట తిరుగుతూ కనిపించింది. నాకు టూరిచ్చిన జూ కీపరు చెప్పాడు ఈ ఏనుగు పేరు సీత అని పిలుస్తున్నారట ఈ జూ వాళ్ళు, కొత్తగా శ్రీలంక నించి తెచ్చారట, రాముకు తోడుగా.
ఈ పెద్ద ఏనుగుదీ నాదీ దాదాపు ఒకటే వయసు. ఇప్పుడు తనకంటే ఇరవై సంవత్సరాల చిన్నదైన జతను తెచ్చేస్తే ఎలా అడ్జస్టు అవుతుందో అనే ఆలోచన వచ్చింది.
ఇదే మొదటిసారి ఈ రెండిటినీ ఒకే దగ్గర చూడటం. రెండూ ఒక్కో అర్రలో వున్నయి. మరీ పొద్దుటేమో ఇంకా జూ కీపరు వాటిని బయటకు వదల్లేదు. పైగా ఇప్పుడే రాము కాలకృత్యాలు కూడా తీర్చుకున్నట్టున్నాడు, అదోరకం వాసన, మేమున్న ఈ జనం చూడ్డానికేర్పరిచిన అద్దాల గదిలో కూడా తప్పలేదు. అసలు ఈ రెండింటినీ కలిపాక ఆర్నెల్ల తర్వాత కూడా ఇంకా వేరేగా పెట్టడం ఎందుకో అర్ధం కాలేదు.
చూస్తుండగానే ఒకాయన రాము వున్న గది తలుపు, ఇనుప కడ్డీలతో చేసింది, ఒక చిన్న స్విచ్ తో తెరిచాడు. రాము ఎందుకో వెంటనే బయటకి వెళ్ళలేదు. తనున్న చిన్న గది అసలు నిలబడ్డానికి తప్ప చుట్టూ తిరగడానికి కూడా సరిపోదు, నన్నెవరన్నా ఇలాంటి గదిలో పెడితే తలుపు తెరిచిందే ఆలస్యం బయటికి వురికే వాడినేమో, కానీ ఈ పెద్ద మనిషి మాత్రం అసలు మీరు చెప్పినట్టు నేనెందుకు నడుచుకోవాలి అన్నట్టు, తనకు తోచినంత సమయం తీసుకుంటూ బయట వెలుగులోకి అడుగులేసాడు.
తలుపు దాటాకకూడా దూరంగా వెంటనే వెళ్ళకుండా పెద్ద బుద్ధిమంతునిలా ఇంకో తలుపు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఎందుకో అని జాగ్రత్తగా గమనిస్తూ వుంటే మరో రెండు నిమిషాల్లో ఆ తలుపు కూడా తెరుచుకుని ఆడ ఏనుగు, సీత, బయటికి వచ్చింది. రెండూ నెమ్మదిగా బయట మైదానం వైపు కలిసి పదడుగులు వేసాయి. రాము కొద్దిసేపు విరామం తీసుకుంటున్నట్టు ఆగి, తనతో పాటే అడుగు కలిపి అడుగులో అడుగేస్తున్న సీతతో ఏదో రాత్రంతా దాచుకున్న ముచ్చట చెప్పినట్టుగా చెవి మీద తన తొండంతో రాస్తూ నిమరడం ప్రారంభించాడు. సీత కూడా ప్రేమగా నేల మీద వున్న దుమ్ము జాగ్రత్తగా తన పొడుగాటి నేలనంటే తొండముతో తీసి తన నేస్తాన్ని ప్రేమగా రాయడం మొదలు పెట్టింది.
మొదటిసారిగా చాలా వెలితి అనిపించింది, జీవితం. నా భార్య నన్నొంటరిని చేసి పోయి రెండేండ్లు కావస్తోందప్పుడే.
ఎప్పుడైనా రెండు గంటల ప్రయాణానికే తోడు వుంటే ఎంత హాయి అనుకుంటూ వుంటాం. అలాంటి ప్రయాణంలో మనం పైకి మాట్లాడుకోకున్నా వేరే వ్యక్తి స్పర్శ, పక్కనే మనక్కావలిసిన వాళ్ళున్నారన్న భావన చాలు చాలా సార్లు. అలాంటిది ఇక ఈ జీవితానికి చివరి దశలో వున్న నాబోటి వాళ్ళకు తోడు లేకుండా ఒంటరి ప్రయాణమంటే ఎంత కష్ఠమో ఇప్పుడే తెలిసివస్తూ వుంది. లేదా నా కోసమే ఇంటి దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఒక్కళ్ళైనా వుంటే అప్పుడప్పుడూ తప్పనిసరై చెయ్యాల్సిన ప్రయాణపు తీపే వేరుగా వుండేది. ఒంటరితనం మరీ ఇమ్త భయంకరంగా వుంటుందని, మిగతా బంధువులంతా వుండీ ఎవరూ లేని వాడినవుతాననీ ఎన్నడూ అనుకోలేదు.
తాతయ్యా మళ్ళీ ఎప్పుడు వద్దాం అని అడుగుతున్న మనవడి మాటలకు ఈ లోకంలో పడ్డాను. వాడి మాటలకు నవ్వొచ్చింది, ఇంకా జూలోనించి బయటికే నడవలేదు మేము, ఇప్పుడే నాతో ఒక మాట అనిపించుకుందామని వాడి ఉత్సాహం.
ఈ రెండు ఏనుగులనూ ఒకే దగ్గర చూస్తుంటే ఎంతో తృప్తిగా వుంది. నిండుగా కనిపిస్తున్నాయి.
మనవణ్ణి తీసుకుని బయటికి వచ్చి కార్లో కూర్చుంటూ వుంటే పీ. ఏ. దగ్గరికి వచ్చి, సీ ఎం గారూ, మీతో కలవాలని వచ్చే లక్ష్మి గారితో మీ మీటింగుకు లేటయ్యేలా వుంది, క్యాన్సిల్ చేయమంటారా అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించి లేదయ్యా, లేటైనా వెళదాం ఈ ఒక్కసారికీ టైమును పాటించకపోతే ఫరవాలేదు, కారెక్కుతూ అన్నాను.
ఎన్నడైనా టైమంటే టైమే అనే సీ. ఎం. రామారావుగారు ఇలా అనడం చాలా అరుదు, ఈ జూలో టైము ధ్యాసేలేని జంతువులు ఎంతటి వారినైనా ఇట్టే మార్చేస్తాయి అని అనుకుంటూ తన కారు వైపు బయల్దేరాడు, చరిత్ర మారిపోయిందని తెలియని పీ. ఏ. గారు.
(తమ పేర్లెక్కడా కనిపించవని తెలిసినా ప్రతి కథనీ (అదెటువంటిదైనా సరే) సొంత సమయాన్ని వెచ్చించి శ్రద్ధగా చదవడమే కాక ఒక కథకెంతో అవసరమైన సంకేతాలతో ఒక రచనను పాఠకులకు అందించడంలో ప్రత్యేక పాత్రను పోషించే సమీక్షకులందరికీ నా ఈ చిరు కానుక.)