వఱడు: కథ నచ్చిన కారణం

కథ: వఱడు (1971)
రచయిత: అల్లం శేషగిరిరావు

తెలుగులో ప్రతిభావంతులైన కథా రచయితల్లో కీ.శే. అల్లం శేషగిరిరావు గారు ఒకరు. వీరి కథల్లో ‘వఱడు’, ‘మృగ తృష్ణ’ కథాభిమానులకు బాగా నచ్చినవి. సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శేషగిరిరావు గారి కథలు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్య ఘోష’ సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. ప్రసిద్ధ బెంగాలీ దర్శకులు బసు చటర్జీ గారు ‘వఱడు’ కథను టెలిఫిల్మ్ గా రూపొందించారట కూడా.

వఱడు కథలో వస్తువు విశ్వజనీనం. కథకు ఎంచుకున్న నేపథ్యం, పాత్రల సృష్టి, కథాంశాన్ని కళాత్మకంగా ప్రదర్శించిన తీరు అభినందించదగ్గవి. కథలో చెప్పదలచుకున్న ప్రధానాంశం నుంచి దృష్టి మరల్చకుండా, ఏ విషయాన్ని ఎంతవరకు చెప్పాలో ఆ మేరకు చెప్పడం ఈ కథ నాకు నచ్చడానికి, పదే పదే చదువుకునే కథల జాబితాలో చేరడానికి గల కారణాల్లో ఒకటి.

కథను పాఠకుల మనసును తాకేలా వృద్ధి చేయడానికి కల్పించిన వాతావరణం, సమకూర్చిన సంఘటనలు, చిత్రించిన పాత్రల స్పందన – సహజంగా ఉండడం నాకీ కథ నచ్చడానికి గల కారణాల్లో మరొకటి. వఱడు అంటే ముసిలి నక్కట. ఆ జంతువు ప్రతీకగా మానవ నైజాన్ని ఇంత సూటిగా చిత్రీకరించిన ఈ కథ మొదటి సారి చదివినప్పుడు నన్నెలా ప్రభావితం చేసిందో, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎప్పుడు చదివినా అలానే నన్ను పట్టి ఊపేస్తుంది.

నాగరికతకు, ‘సివిల్’ జనాలకు దూరంగా ‘కీకారణ్యం’లో ఒక కేంపులో జరిగే కథ ఇది. మిలటరీలో పనిచేసి రిటైరై, కేంపులో జీపు డ్రైవర్గా పనిచేస్తున్న చిన్నయ్య, రిటైరైన తర్వాత కూడా ‘చావకుండా బతికుండాలంటే చచ్చేదాకా పని చెయ్యక తప్పద’నే దశరథరామయ్య, సివిలోల్లలో తప్పబుట్టిన (చిన్నయ్య దృష్టిలో) యువ ఇంజనీరు రామారావులు ఈ కథలో ప్రధాన పాత్రలు. బతకడానికి ఎంతో కొంత లౌక్యం కావాలి. కానీ లౌక్యమే బతుకు కాకూడడు. మెతుకులు విదిల్చే వాళ్ళ మెప్పు కోసం, ఉపకారం చేసిన వాడికే ఎసరు పెట్టడం తప్పు …ఎలాంటి పరిస్థితుల్లోనైనా! కథ చివరి ఘట్టంలో, దశరధరామయ్య ప్రవర్తన జగుప్సాకరం.

వఱడులో పాత్రలు దైనందిక జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తారసపడ్డ వ్యక్తుల్లానే అనిపించారు, కథ చదువుతున్నప్పుడు. కథ చదవడం అయ్యేక – సమయం సందర్భాలను బట్టి, అవకాశాలు అవసరాలను బట్టి… చిన్నయ్యగానో, దశరథరామయ్యగానో, రామారావుగానో మనం కూడా ప్రవర్తిస్తాం కదా అనిపించింది. మీరు కూడా ఈ కథ చదివి, మీ ఆలోచనల్ని అందరితో పంచుకుంటారని ఆశిస్తున్నాను.