పిలూ రాగం

హిందుస్తానీ శైలిలో లలితగీతాలకూ, సుగమశాస్త్రీయరచనలకూ పేరు పొందిన రాగం పిలూ. కర్నాటక కాపీ రాగాన్ని పోలిన ఈ రాగంలో అనేక రచనలు ప్రజాదరణ పొందాయి. విరహం, శృంగారం, భక్తి మొదలైన భావాలని ఈ రాగం బాగా పలికిస్తుంది. ఉపశాస్త్రీయసంగీతంలోనూ, ఠుమ్రీల్లోనూ ఈ రాగంలో ఒకదాని వెంట ఒకటిగా అనేక పోకడలు వినిపిస్తాయి కనక మిశ్రపిలూ అనేది చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. మోహన వంటి సీదా రాగాల్లో వినబడే స్పష్టమైన ఆరోహణా, అవరోహణా లేకపోవడంతో దీన్ని గుర్తుపట్టడం కాస్త కష్టమనిపించవచ్చుగాని స్వభావం రీత్యా దీని పోకడలు తెలుస్తూనే ఉంటాయి.

సందర్భానుసారం 12 స్వరాలూ పలికే ఈ రాగపు ఆరోహణ ని2 స గ1 మ1 ప ని2 స అవరోహణ స ని1 ద2 ప మ1 గ1 రి2 స అని స్థూలంగా చెప్పవచ్చు. తరుచుగా వినబడే ప్రయోగం గ1 మ1 ద1 ప గ1 స రి2 ని2 స. ఎవరైనా కీబోర్డ్ తీసుకుని లోగడ చెప్పిన పద్ధతిలో ఈ స్వరాలు వాయించి చూసుకుంటే ఈ రాగం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.

పిలూ ఎన్ని స్వరాల వరసలను పలికిస్తుందంటే ఆ రాగం వినిపిస్తున్నప్పుడు మధ్యలో అనేక ఇతర రాగాల ఛాయలను అలవోకగా మోగించవచ్చు. వాటిలో కర్నాటక ఖరహరప్రియను పోలిన కాఫీ, ఖమాజ్, పట్‌దీప్, కీరవాణి, దేశ్ మొదలైనవి ఉంటాయి. పిలూ రాగమాలిక ఠుమ్రీ వినిపిస్తున్నప్పుడు సమర్థులైన కళాకారులు ఆ పనే చేస్తారు. హిందుస్తానీ విద్వాంసుల్లో ఫయ్యాజ్‌ఖాన్, అమీర్‌ఖాన్ తదితరులు తప్ప అందరూ పిలూ వినిపించినవారే. ఠుమ్రీలకు పేరుపొందిన పంజాబ్, ముల్తాన్ ప్రాంతాల గాయకుల సంస్కారాన్ని మనం ఒంటబట్టించుకున్నట్టయితే వందలకొద్దీ గజల్ గీతాలూ, వేలకొద్దీ సినిమా పాటలకు మూలాలు కనిపిస్తాయి. పిలూవంటి రాగాలకు కూడా ఇది వర్తిస్తుంది. బెనారస్‌ లోనూ, ఇతర ప్రాంతాల సంగీతం లోనూ కూడా ఠుమ్రీల సంప్రదాయం ఉంది కాని పంజాబ్ శైలి బడేగులాం అలీఖాన్ తదితరులవల్ల ఎక్కువ పేరు సంపాదించుకుంది.

పిలూ రాగంలో బడే గులాం స్వరపరిచి పాడిన సైయాఁ బోలో, కటే నా బిర్‌హాకీరాత్ అనే ఠుమ్రీలూ, ఆయన తమ్ముడు బర్కతలీఖాన్ పాడిన తుం రాధే బనో శ్యాం మొదలైనవి పిలూ అందాలను స్పష్టం చేస్తాయి.

బర్కతలీ ఖాన్ హైదరాబాద్‌కు వచ్చి, నవాబ్ జాహిర్‌యార్‌జంగ్ అతిథిగా ఉన్నప్పుడు రికార్డ్ చేసిన నాలుగు ఠుమ్రీల్లో ఇదొకటి. ఇవి ఎల్.పి.గా విడుదల అయిన కొత్తల్లో 1970లలో దీన్ని వినడానికి బొంబాయిలోని ఒక తెలుగు మిత్రుడి ఇంటికి వెళ్ళాను. శాస్త్రీయసంగీతంతో పరిచయం లేకపోయినా అతను తన ప్లేయర్‌ మీద పాటలు వినేవాడు. బర్కతలీ పాట మొదలవగానే అతను, ‘ఇతనెవరండీ, గొంతు సిల్క్‌లాగా అద్భుతంగా ఉందే?’ అని ఆశ్చర్యపోయాడు. ముందుగా ఎటువంటి పరిచయమూ లేకపోయినప్పటికీ గొప్ప కళాకారులు సులువుగా మెప్పు పొందగలరు.

బిస్మిల్లాఖాన్ (శహనాయీ), ఎన్. రాజమ్ (వయొలిన్) వాయించిన జుగల్‌బందీలో మిశ్రపిలూ పోకడలు మనకు తెలుస్తాయి. తమిళురాలైన రాజమ్ పండిత్ ఓంకార్‌నాథ్ ఠాకుర్ శిష్యురాలిగా ఉత్తరాదిలో పేరు పొందకముందు మద్రాసులో నాకు సితార్ నేర్పిన గురువుగారు ఎల్.ఆర్.కేళ్కర్‌గారి వద్ద వయొలిన్ పాఠాలు మొదలు పెట్టింది. ఆమె సోదరుడు ప్రసిద్ధ కర్నాటక వయొలినిస్ట్ టి.ఎన్. కృష్ణన్.

పిలూ రాగంలో ప్రధానంగా వినబడేవి రి2, గ1, మ1, ద2, ని1 అనే స్వరాలు. కాని సందర్భాన్నిబట్టి ని2, గ2, ద1 వినిపిస్తూ ఉంటాయి. ఇక మిగిలినవల్లా రి1, మ2 మాత్రమే. ఇవికూడా మిశ్రపిలూలో వినబడతాయి. విలాయత్‌ఖాన్ సితార్ మీద తరుచుగా అవి చేర్చి పిలూ వినిపించేవారు.

నేను విలాయత్‌ ఖాన్ సితార్ కచేరీ మొదటిసారిగా మద్రాసులో 1965లో విన్నప్పుడు ఆయన పిలూ రాగంలో స్పెషలైజ్ చేసినట్టుగా అనిపించేది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ స్వయంగా మొదటి వరసలో కూర్చుని, విని, ఆనందించిన ఆ కచేరీకి చిట్టిబాబు కూడా హాజరయారు. అందులో విలాయత్‌ ఖాన్ పిలూ రాగంలో తన తాతగారు ఇమ్‌దాద్‌ ఖాన్ వాయించినదీ, తన తండ్రి ఇనాయత్‌ ఖాన్ వాయించినదీ పిలూ రాగంలో గత్‌లను సగర్వంగా వినిపించి, తరవాత తనది కూడా వాయించారు. ఆ గత్ ఆయన ఎల్.పి.లో కూడా నేను కొన్ని వందలసార్లు విని పూర్తిగా కంఠస్థం చెయ్యగలిగాను. అదే గత్ ఇక్కడ వినవచ్చు. విలాయత్‌ ఖాన్ పిలూ రాగం గురుత్వాకర్షణశక్తి నన్ను కొన్ని దశాబ్దాలపాటు వెంటాడింది. పిలూ రాగంలోని విషాదఛాయలు రామ్‌నారాయణ్ సారంగీ మీద పలికించిన తీరు అద్భుతం. ఇదే రాగం అలీఅక్బర్‌ఖాన్ క్లుప్తంగా సరోద్‌పై వాయించిన పద్ధతి బావుంటుంది.

మనదేశంలో 1905లోనే తొలి గ్రామొఫోన్ రికార్డులు పాడిన అబ్దుల్‌ కరీమ్‌ఖాన్ తరుచుగా మైసూర్ రాజదర్బారులో కచేరీలకు వెళ్ళడంవల్ల ఆయనకు కీరవాణివంటి కర్నాటక రాగాలతో పరిచయం ఏర్పడింది. ఆ పద్ధతిలో ఆయన శుద్ధపిలూ అనే పేరుతో పాడిన సోచ్ సమఝ్ నాదాన్ అనే పాట చాలా పేరు తెచ్చుకుంది. మరొక సంగతేమిటంటే కర్నాటక పద్ధతిలో స్వరాలను పలికే సంప్రదాయం అప్పటివరకూ ఉత్తరాదిన ఉండేదికాదు. అది ఆరంభించినది ఈయనేనని ఈ పాటను బట్టి తెలుసుకోవచ్చు. పేరు పెట్టనప్పటికీ ఇది కీరవాణి రాగమే.

కర్నాటకపద్ధతిలో పిలూ రాగం లేదుకాని, కర్నాటక కాపీ అదే వైఖరి కలిగినది కనక బాల మురళీకృష్ణ పాడిన ఆలాపన వల్ల అదెలా ఉంటుందో మనకు తెలుస్తుంది. అదే రాగంలో ఆయన పాడిన పురందరదాసు కీర్తన జగదోద్ధారన ఇక్కడ వినవచ్చు. ఇదే రాగంలోని త్యాగరాజకీర్తన మీవల్ల గుణదోషమేమి మేండొలిన్‌మీద శ్రీనివాస్ పలికించిన తీరు వినవచ్చు. ఇవన్నీ విన్నాక ఈ రాగం ఆధారంగా చేసిన సినీగీతాలు విన్నప్పుడు హిందుస్తానీ శైలి ప్రభావమే ఎక్కువగా ఉందనిపిస్తుంది.

గజల్ సంగీతానికి పిలూ ఎలా పనికొస్తుందో తెలియడానికి ఖయ్యామ్ స్వరపరిచి బేగం అఖ్తర్‌ చేత పాడించిన దూర్ హై మంజిల్ అనే చక్కటి పాట ఒక మంచి ఉదాహరణ. ఇది షకీల్ బదాయునీ రచన.

పాత వీడియోల్లో రాగాలను దృశ్యానికి ఎలా అన్వయించేవారో కూడా కొంత తెలుస్తుంది. హిందీ సినిమాపాటల్లో పిలూ రాగాన్ని అనేకసార్లు బాగా ఉపయోగించుకున్న నౌషాద్ రచనలు ఝూలేమేఁ పవన్ (బైజూబావ్రా), మొరే సైయాఁజీ (ఉడన్ ఖటోలా) (నదియా ధీరేబహో అనే ఒక హిందుస్తానీ ఠుమ్రీ కూడా ఉంది), చందన్‌కా పల్‌నా (షబాబ్), (పాటకు సంబంధించిన ఘట్టంకూడా ఇందులో చూడవచ్చు.) నా మానూఁ (గంగా జమునా), పీకే ఘర్ ఆజ్ (మదర్ ఇండియా) వగైరాలు.

ముగలేఆజం సినిమా లోని మోహే పన్‌ఘట్‌పే అనే పాటను చాలామంది పిలూ అనుకుంటారు గాని అది గారా అనే రాగంలో చేసిన రచన. దాని ప్రధానలక్షణం మంద్రస్థాయిలో ని2 స ధ2 ని1 స ని2 స అనే ప్రయోగం. ఈ పాటలో ఇది మధ్యమశ్రుతిలో వినబడుతుంది. అల్‌బేలా సినిమాకు సి.రామచంద్ర పిలూ రాగంలో చేసి స్వయంగా లతాతో కలిసి పాడిన ఈ లాలిపాట అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ సినిమానూ, పాటనూ తెలుగులో కూడా అనువదించారు.

శాంతారామ్ దర్శకత్వం వహించి నటించిన మరో సినిమాలో రామచంద్ర పిలూలో చేసిన యుగళగీతం ఇది. ప్రతిభావంతుడైన ఎస్.డి.బర్మన్‌కూడా పిలూలో కొన్ని మంచిపాటలు స్వరపరిచాడు. వాటిలో నైనా దీవానే (అఫ్సర్), అబ్‌కే బరస్ (బందినీ), కాలీఘటా (సుజాతా) మొదలైనవి ఎంతో బావుంటాయి. ఒకే రాగాన్ని సంగీతదర్శకుడు ఎన్నిరకాలుగా ఉపయోగించు కోగలడో వీటినిబట్టి తెలుసుకోవచ్చు.

సినీసంగీతంలో నిష్ణాతుడైన రోషన్ పిలూ రాగాన్ని వాడుకున్న తీరు తెలియాలంటే వినవలసిన పాటలు ఛాగయే బాదల్ (చిత్రలేఖా), మైఁనే షాయద్ (బర్‌సాత్‌కీ రాత్), తుమ్ ఏక్‌బార్ (బాబర్), వికల్ మోరా మన్‌వా (మమతా), దునియామేఁ ఐసా (దేవర్).

మదన్‌మోహన్ దుల్‌హన్ ఏక్‌రాత్‌కీలో చేసిన పాట మైఁనే రంగ్‌లీ కూడా పిలూ రాగమే. రవి సంగీతంలో మన్నాడే పాడిన ఏ మేరీ జోహర్‌జబీఁ (వక్త్), రఫీ పాడిన న ఝట్‌కో (షహనాయీ) ఇదే రాగం. శాస్త్రీయరాగాలను అంతగా లక్ష్యపెట్టినట్టు కనబడని ఓ.పి.నయ్యర్‌ కూడా ఈ రాగాన్ని చక్కగా వాడుకున్నాడు. పాశ్చాత్యపోకడలతో జాయియే ఆప్‌కహాఁ (మేరేసనమ్), పంజాబీ జానపదశైలిలో కభీ ఆర్ కభీ పార్ (ఆర్‌పార్), గజల్ పద్ధతిలో మేరీజాన్ తుమ్‌పే (సావన్‌కీ ఘటా) మొదలైనపాటలు అతనివే.

తమిళంలో జానకి ఇళయరాజా దర్శకత్వంలో పాడిన కాట్రిల్ ఎందన్ గీదమ్ (జానీ) కీరవాణి రాగం. పిలూలా వినిపిస్తుంది. అతను చేసిన కణ్ణే కలైమానే (మూండ్రమ్ పిరై) జేసుదాస్ పిలూలోనే పాడాడు. దీని తెలుగు వర్షన్ బాలసుబ్రహ్మణ్యం పాడాడు.

తెలుగు సినిమాపాటల్లో పిలూకు మంచి ఉదాహరణ పెండ్యాల సంగీతంలో శాంతకుమారి పాడిన ఎన్నాళ్ళని నా అనే పాట. తెలుగు సినిమాపాటల్లో ఎస్.రాజేశ్వరరావు కర్నాటక కాపీలో చేసిన పిలచిన బిగువటరా అందరికీ నచ్చిన జావళీ. మరొకటి అందాల బొమ్మతో (అమరశిల్పి జక్కన్న). ఆయన సంగీతంలో ఎమ్.ఎస్.గోపాలకృష్ణన్ వయొలిన్ వినిపించిన అందేనా ఈ చేతుల (పూజాఫలం) ప్రధానంగా పిలూ రాగమే.

కర్నాటక కాపీలోని మంచిపాటల్లో జిక్కీ పాడిన వద్దురా కన్నయ్యా (అర్ధాంగి), బాలసరస్వతి పాడిన రమ్మనవే మాని (అన్నమాచార్య), లాలి నను కన్నయ్య (పెద్దరికాలు మాస్టర్ వేణు సంగీతం) వగైరాలున్నాయి.

పిలూ ఆధారంగా లీల పాడిన ఓ సర్వలోకేశ (పెద్దమనుషులు) అనే పాటకు ఓగిరాల సంగీత దర్శకత్వం. ఘంటసాల సంగీతం సమకూర్చి పాడిన ప్రైవేట్ రికార్డ్ రమతేయమునా అనే అష్టపది కూడా కర్నాటక కాపీయే.

నాకు గుర్తున్న పాటలు ఇవి. వీటిలో కొన్నిటికి లింకులు పంపినవారు (ఇటువంటి విషయాల్లో అసామాన్యప్రతిభ కలిగిన) పరుచూరి శ్రీనివాస్‌గారు. ఆయనకు నా కృతజ్ఞతలు. పిలూ రాగానికి ఉదాహరణలు ఇంకా చాలానే ఉంటాయిగాని రాగాన్ని గుర్తుపట్టేందుకు ఇవి సరిపోవచ్చు.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...