కినిమా పత్రికనుంచి


కినిమా పత్రిక
మొదటి సంపాదకీయం

ఈ సంచికలో మీకోసం కినిమా సినిమా పత్రికనుంచి కొన్ని పాత విశేషాలు అందిస్తున్నాను. మొట్టమొదటగా కినిమా పత్రిక మొట్టమొదటి సంచికలో వెలువడిన సంపాదకీయం చూడండి. సినిమా సాహిత్యం కోసం ప్రారంభిస్తున్న పత్రిక అని చెప్తూ, అనధికార వార్తలూ, గాసిప్ కబుర్లూ ఉండవని ముందుగానే సంపాదకుడు చెప్పడం ఒక విశేషం. ఆ రకంగా కినిమా ఉన్నత ప్రమాణాలకోసం పాటుపడబోతున్న పత్రిక అని తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఇతర సినిమా పత్రికలు చాలావరకూ సినిమా తారల ముచ్చట్లకే ప్రాధాన్యమిచ్చి టెక్నికల్ విషయాలను నిర్లక్ష్యం చేయడంతో కినిమా పత్రిక స్థాయికి చేరుకోలేకపోయాయనే నా అభిప్రాయం.



కళ్యాణం పణ్ణి పార్

ఈ రెండో చిత్రం విజయా వారి కళ్యాణం పణ్ణి పార్ (తెలుగులో పెళ్ళి చేసి చూడు సినిమా) మద్రాస్ వెల్లింగ్‌టన్ థియేటరులో ఆగస్ట్ 15, 1952న విడుదలైనప్పటిది. జెమిని గణేశన్, సావిత్రి, జి. వరలక్ష్మి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం, మీనాక్షి, దొరైస్వామి, రేలంగి వెంకట్రామయ్య తదితరులు నటించిన ఈ సినిమా తెలుగులోనూ, తమిళంలోనూ కూడా ప్రజాదరణ పొందింది. తెలుగులోనూ, తమిళంలోనూ ఒకేసారి నిర్మించిన ఈ సినిమాలో సావిత్రి, వరలక్ష్మి, ఎస్.వి.ఆర్, రేలంగి రెండు భాషల్లోనూ అవే పాత్రలు పోషించగా, గెమినీ గణేశన్ పాత్రలో తెలుగులో ఎన్. టి. రామారావు నటించిన ఈ సినిమాకి ఎల్. వి. ప్రసాద్ దర్శకుడు. ఆ తర్వాతెప్పుడో ఈ సినిమాను షాదీ కే బాద్ అని హిందీలో కూడా తీశారు.



తలత్ మద్రాసులో

తలత్ మొహమూద్ ‘చండీరాణి’ (1953) హిందీ సినిమాకి పాటలు పాడటానికి మద్రాస్ వచ్చినప్పుడు తీసిన ఫోటో ఈ పక్కది. తలత్‌తో పాటుగా రామకృష్ణ, చక్రపాణి, సంగీత దర్శకుడు దత్తు ఉన్న ఈ ఫోటోకి మంచి ఆర్కైవల్ వేల్యూ ఉంది. ఈ సినిమాలో తలత్, భానుమతి కలిసి పాడిన డ్యూయెట్ చందా తలే ముష్కురాయేఁ బాగా పాపులర్ అయింది. ఇదే రాగంలో ఈ పాటను తెలుగులో (ఓ తారకా) ఘంటసాల, భానుమతి పాడారు. ఈ సినిమాకి ఇంకో విశేషం – ఇది భారతదేశంలో ఒక స్త్రీ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా. ఆమెవరో కాదు, భానుమతి. ఈ సినిమాకు దర్శకురాలు, నిర్మాత కూడా. ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భరణీ స్టుడియోవారు నిర్మించిన ఈ సినిమాలో భానుమతి ద్విపాత్రాభినయం కూడా చేసింది. ఆమె అసామాన్య ప్రతిభకు ఇదొక తార్కాణం మాత్రమే.



మీ విజ్ఞానం 1


మీ విజ్ఞానం 2

సినిమా పత్రికలంటే కేవలం సినిమా తారల ముచ్చట్లకే అని కాకుండా అప్పుడు కినిమాలో ‘మీ విజ్ఞానం’ అనే పేరుతో పాఠకులు అడిగిన సినిమా రంగపు టెక్నిక్స్ గురించిన ప్రశ్నలకి సమాధానాలిచ్చే శీర్షిక ఎంతో ప్రాచుర్యం పొందింది. పక్కనున్న రెండు చిత్రాలు ఈ శీర్షికకు ఒక ఉదాహరణగా ఇస్తున్నాను. ఆవారా సినిమాలో డ్రీమ్ సీక్వెన్స్ ఎలా తీశారు? సినిమాల్లో రెండు పాత్రలని పోషించే నటుడు ఒకేసారి ఆ రెండుపాత్రల్లో స్క్రీన్ మీద కనిపించడం సాంకేతికంగా ఎలా సాధ్యం? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుండేవి ఈ శీర్షికలో.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...