శ్రీపాదరాయలు

నమః శ్రీపాదరాజాయ
నమస్తే వ్యాసయోగినే
నమః శ్రీపురందరార్యాయ
విజయార్యాయ తే నమః

హరిదాసులు హరికథాకాలక్షేపసమయములో, దేవరనామములను పాడే వేళలో “శ్రీపాదరాయలకు, వ్యాసరాయలకు, పురందరదాసులకు, విజయదాసులకు నమస్కృతులు” అని స్తుతించడము వాడుక. అంటే ఈ హరినామ సంకీర్తనములకు మూలపురుషుడైన శ్రీపాదరాయలను మొట్టమొదట పేర్కొనడము ఒక గొప్ప విశేషము.

బాల్యము


బృందావనం, శ్రీపాదరాజ మఠం
ముళ్బాగిల్, కోలార్ జిల్లా. కర్ణాటక.

శ్రీపాదరాయలు దాసకూట పితామహుడు. ఇతడు క్రీ.శ. 1412 నుండి 1502 వరకు జీవించాడని ఊహిస్తారు. కొందరు 1420 నుండి 1487 వరకు బ్రదికి ఉన్నాడని అంటారు. ఇతడు బెంగళూరికి 40 మైళ్ళ దూరములో ఉండే అబ్బూరు అనే గ్రామములో శేషాచార్యులు, గిరియమ్మలకు జన్మించాడు. ఇతని పూర్వాశ్రమపు పేరు లక్ష్మీనారాయణ. అక్షరాభ్యాసం పిదప తండ్రి వద్దనే పాఠాలు నేర్చుకొనేవాడు. ఆ కాలములో బ్రాహ్మణులకు పశుసంపద ఉండేది. లక్ష్మీనారాయణ పసులకాపరి కూడా. ఒక రోజు సాయంత్రం ఆవులను ఇంటికి తోలుకొని వస్తున్నాడు. అప్పుడు ఒక పల్లకి అక్కడికి వచ్చి నిలిచింది. అందులో స్వర్ణవర్ణతీర్థులనే ఒక స్వాములవారు కూర్చుని ఉన్నాడు. అతడు లక్ష్మీనారాయణుని పిలిచి “అబ్బూరు ఇక్కడికి ఎంత దూరం?” అని అడిగాడు. అప్పుడు లక్ష్మీనారాయణుడు ఇలా జవాబిచ్చాడు, “నన్ను చూడండి, నా మందను చూడండి, ఆకాశాన్ని చూడండి, అబ్బూరు ఎంత దూరమో మీకే తెలుస్తుంది.”

ఈ జవాబును విన్న స్వర్ణవర్ణతీర్థులు బాలకుని చురుకుదనానికి అబ్బుర పడ్డాడు. అబ్బూరులో ఉండే పురుషోత్తమతీర్థులనే యతివర్యుల దర్శనార్థము ఆ ఊరికి స్వర్ణవర్ణతీర్థులు వచ్చాడు. ఈ స్వర్ణవర్ణతీర్థులు జగద్గురు మధ్వాచార్యుల ప్రథమ శిష్యులైన పద్మనాభతీర్థుల మఠములోని ఒక శాఖకు అధికారి. పురుషోత్తమతీర్థులను సందర్శించి లక్ష్మీనారాయణుని తనతో తీసికొని వెళ్ళాలనే ఆశను ప్రకటించాడు. తండ్రి శేషాచార్యులకు అంతగా ఇష్టము లేకపోయినా చివరకు ఒప్పించి, అతని అనుమతితో ఆ కుటుంబాన్నంతా తనతో శ్రీరంగమునకు తీసికొని వెళ్ళాడు. త్వరలోనే ఆ కాలములో మతాచార్యులకు అవసరమైన సమస్త విద్యలలో ప్రావీణ్యాన్ని లక్ష్మీనారాయణుడు స్వర్ణవర్ణతీర్థుల వద్ద సంపాదించాడు. స్వర్ణవర్ణతీర్థులకు వృద్ధాప్యము రావడంతో తన మఠానికి లక్ష్మీనారాయణుని మఠాధికారిగా నియమించాడు. వేదాంత విద్యలో ఇంకా ఎక్కువ తరిఫీదు పొందడాని కోసం కుంభకోణములో ఉండే విబుధేంద్రతీర్థుల మఠానికి స్వర్ణవర్ణతీర్థులు లక్ష్మీనారాయణతీర్థులను పంపాడు. ఈ విబుధేంద్ర తీర్థుల మఠము అంతకు కొంత కాలమువరకు ఉత్తరాది మఠములో ఉండేది. కొన్ని కారణాలవల్ల (ఇక్కడ ఆ సుదీర్ఘ చర్చ అనవసరము) అది దానినుండి చీలిపోయింది. కొన్ని సంవత్సరాలకు పిదప ఇది మంత్రాలయములోనున్న శ్రీరాఘవేంద్రస్వామి మఠముగా మారింది.

శ్రీపాదరాయ నామము

లక్ష్మీనారాయణతీర్థులకు శ్రీపాదరాయలనే పేరు ఎలా వచ్చింది? దీనికి రెండు కథలు ఉన్నాయి. వాడుకలో ఉన్న మొదటి కథ – ఒకప్పుడు విబుధేంద్రతీర్థులతో తీర్థయాత్రలు చేస్తుండగా ఉత్తరాదిమఠ స్వాములైన రఘునాథతీర్థులను కొప్ర అనే గ్రామములో సందర్శించడమైనది. ఒక విద్వత్సభను ఏర్పాటు చేశారట. అందులో లక్ష్మీనారాయణుడు ఇద్దరు యతివర్యుల సమక్షములో టీకాచార్యులనబడే జయతీర్థుల న్యాయసుధను గురించి అపూర్వమైన పద్ధతిలో వ్యాఖ్యానము చేశాడట. దానికి ముగ్ధులైన రఘునాథతీర్థులు “మేమంతా శ్రీపాదులమైతే (యతులైతే) నీవు శ్రీపాదరాయలు” అని అన్నారట. ఈ బిరుదు అలా అతనికి శాశ్వతముగ నిలిచి పోయింది. మరో కథ – ఆ కాలములో తిరుమలలో శ్రీనివాసుని అర్చించే పూజారులు లంచగొండులు, దేవునికి చెందిన ఆభరాణాదులను తమ స్వంత ఖర్చులకై వాడుకొనేవారట. చంద్రగిరి రాజైన సాళువ నరసింహరాయలు వారిని శిక్షించగా పసివాళ్ళు తప్ప మిగిలిన వారందరు చనిపోయారు. అప్పుడు బ్రహ్మహత్యాదోషము రాజుకు అంటుకొంటుంది. ఆ దోషము నుండి రాజును కాపాడినాడనీ, రాజు తన సింహాసనముపై కూర్చుండబెట్టాడని, అప్పుడు ఇతనికి శ్రీపాదరాయలనే పేరు వచ్చిందని అంటారు.

ఈ రెండవ కథ నిజానికి కొంత దగ్గరని నా అభిప్రాయం. ఎందుకంటే ఉత్తరాది మఠాధికారులైన రఘునాథతీర్థులకు, అందులోనుండి చీలి వేరైన మఠానికి అధికారియైన విబుధేంద్ర తీర్థులకు సామరస్యము ఎంతగా ఉంటుందో అన్నది ప్రశ్నార్థకమే. స్వర్ణవర్ణతీర్థులు బృందావనస్థులైన పిదప శ్రీరంగములో కొన్ని యేళ్ళు ఇతడు ఉండి ఉండవచ్చు. ఒకప్పుడు దేశాటన చేస్తూ, కోలారుకు సమీపములో ఉండే ముళ్బాగిలుకు వచ్చారు. ముళ్బాగిలు అసలు పేరు మూడలబాగిలు, అంటే పూర్వద్వారము (మూడల అంటే కన్నడములో తూర్పు దిక్కు). దీనికి నిదర్శనముగా వీరి శిష్యుడైన శ్రీనిధితీర్థులు వ్రాసిన శ్రీపాదరాజాష్టకములోని క్రింది పద్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను –

నమ్యద్వీరనృసింహనామనృపతేర్భూదేవహత్యా వ్యధాం
దూరీకృత్య తదర్పితోజ్జ్వల మహాసింహాసనే సంస్థితః
సేవ్యే పూర్వకవాటనామకపురే సర్వేష్టసిద్దిప్రదః
సః శ్రీపాదయతీశ్వరః ప్రతిదినం భూయాత్బహుశ్రేయసే

వీరనరసింహుడనే రాజు బ్రాహ్మణుని చంపగా ఆ పాపాన్ని దూరము చేసినప్పుడు ఆ మహారాజు అర్పించిన సింహాసనాన్ని అధిరోహించాడు, తూరుపు వాకిలిగా ఉండే ఊరిలో అందరి కోరికలను తీర్చేవాడు, శ్రీపాదయతీశ్వరుడు ప్రతిరోజు ఎంతో మంచిని కలుగజేస్తాడు, వారికి నమస్సులు.

ముళ్బాగిలు విజయనగర రాజ్యానికి తూర్పు సరిహద్దు లాటిది. అక్కడే సుమారు వంద సంవత్సరాలకు ముందు అక్షోభ్యతీర్థ యతివర్యులు విద్యారణ్యులను వాదములో ఓడించి అంగారముతో (బొగ్గుతో) ఒక నరసింహస్వామి రేఖాచిత్రాన్ని గీచినట్లు ఒక కథ వుంది. ఏది ఏమైనా శ్రీపాదరాయలు ముళ్బాగిలులో స్థిరపడ్డాడు. అక్కడే పరమపదాన్ని అంది బృందావనస్థులయ్యారు. వారు అక్కడ ఉన్నప్పుడే వ్యాసరాయలు అక్కడికి వచ్చి శ్రీపాదరాయలను తన గురువుగా అంగీకరించి అక్కడే అతని శిష్యుడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషమేమంటే మధ్వమత యతి పరంపరలో గురు శిష్యులైన శ్రీపాదరాయలకు, వ్యాసరాయలకు మాత్రమే ఈ రాయల పట్టము ఉన్నది, మరెవ్వరికీ లేదు.

వాగ్గేయకారత్వము

శ్రీపాదరాయలు యెప్పుడు వాగ్గేయకారుడయ్యాడు? శ్రీపాదరాయలు శ్రీరంగములో తన గురువులైన స్వర్ణవర్ణతీర్థులతో ఉండేటప్పుడు తరచుగా రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళుతుండేవాడు. అక్కడ పూజాసమయములో ఆళ్వారుల భక్తిగీతాలను తమిళములో పాడుతూ ఉండడము అతనికి సుపరిచితము. ప్రాంతీయ భాష ఐన తమిళములోని పాటలు సంస్కృతము తెలియని, తమిళ సాహిత్యము కూడా అంతగా తెలియని ప్రజలకు అర్థమయ్యే అవకాశము వుంది, అందువల్ల వారి భక్తి భావము, ఆధ్యాత్మిక చింతన అధికమవడానికి ఆస్కారము వుంది. మరి కన్నడ భాషలో ఇలా ఎందుకు పాటలు లేవని ఆలోచించేవాడు. ముళ్బాగిలులో స్థిరపడిన తరువాత కన్నడములో పాటలను రచించి దేవుడి పూజ చేసేటప్పుడు వాటిని పాడేవాడు, పాడటము మాత్రమే కాదు, గజ్జెలు కట్టి భక్తి పారవశ్యంతో చిందులు తొక్కేవాడు. ఇతడు చేయని ప్రయోగము లేదనుటలో ఆశ్చర్యము, అతిశయోక్తి ఏ మాత్రము లేదు. కీర్తనలు, భ్రమరగీతములు, వేణుగీతములు, ఉగాభోగములు, వృత్తమాలికలు, దండకము, సుళాదులు మున్నగువాటిని ప్రప్రథమముగా కన్నడ భక్తి సాహిత్యములో ప్రవేశ పెట్టాడు.

కర్ణాటక సంగీత పితామహుడు శ్రీపాదరాయలను పదకవితా పితామహుడు, దాససాహిత్య పితామహుడు అని ఎందుకు అంటారంటే –

  1. అంతకు ముందు కన్నడములో విరివిగా లేని కొత్త విధములైన సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉండేటందుకు మార్గదర్శి అయ్యాడు. ఈ మార్గదర్శకత్వము ఎలాటిదంటే తరువాతి కాలములో బహుజనాదరణ పొందిన దేవరనామములకు ఇతడే సూత్రధారి.
  2. ఇతని భ్రమరగీతాలు, వేణు గీతాలు తరువాతి కాలములోని పదాలకు, జావళులకు నాందీవాక్యాలను పలికాయి.
  3. రాగబద్ధమైన, తాళబద్ధమైన పాటలను వృత్తమాలిక ద్వారా కనిపెట్టినది కూడా ఇతడే.
  4. కొత్తవి కాకపోయినా ఉగాభోగాలను ఇతనికి పిదప వచ్చిన హరిదాసులు ఎక్కువగా వాడారు.
  5. సంస్కృతములో , తెలుగులో దేవునిపై దండకాలు ఎన్నో ఉన్నా, కన్నడములో ఇతడు వ్రాసిన దండకము నిజముగా అపూర్వమైనది.
  6. అన్నిటికంటే ముఖ్యముగా రాగమాలికలవలె తాళమాలికలను తాను వ్రాసిన సుళాదుల ద్వారా కర్ణాటకసంగీతములో ప్రవేశపెట్టిన ఘనత ఇతనిదే.
  7. ఒక సంగీత బాణీని సృష్టించడము మాత్రమే కాక ఆ పద్ధతి నిరంతరముగా గంగాప్రవాహములా కొనసాగడానికి ప్రత్యక్షముగా, పరోక్షముగా శిష్యులను ప్రోత్సహించాడు.

ప్రత్యక్ష శిష్యులలో ప్రముఖుడు వ్యాసరాయలు. మాధ్వ యతి పరంపరలో వ్యాసరాయల స్థానము మధ్వాచార్యుల, జయతీర్థుల తరువాతిది మాత్రమే. ఈ ముగ్గురిని ఆచార్యత్రయము అంటారు. శ్రీపాదరాయలవద్దకు రాక మునుపే ఇతడు ఎన్నో విద్యలను నేర్చినాడు. అయినాకూడ శ్రీపాదరాయలను గురువుగా అంగీకరించాడు. వాదిరాజయతి, పురందరదాసు, కనకదాసు, (వీరు వ్యాసరాయల శిష్యులు) తరువాత తండోపతండములుగా వచ్చిన అనేక హరిదాసులు ఇతని పరోక్ష శిష్యులే.

శిష్యుడు గౌరవముతో, భక్తితో గురువును స్తుతించడము సామాన్యము, కాని గురువు శిష్యుని గొప్పవాడని, తనతో సమానమని చెప్పడము అరుదు. శ్రీపాదరాయలు అలాటి గురువు. వ్యాసరాయలను గురించి ఇలా అంటాడు –

“సాసిర జిహ్వెగళుళ్ళ శేషనె కొండాడబేకు
వ్యాసమునిరాయర సంన్యాసదిరవ”

వేయి నాల్కలతోడి శేషుడె మెచ్చుకొనవలెను
వ్యాసమునిరాయని సంన్యాస మహిమ

విద్యా ప్రౌఢిమ: వ్యాసరాయలు తన గురువులైన శ్రీపాదరాయల విద్యాప్రౌఢిమనును గురించి సరళముగా సంస్కృతములో వ్రాసిన ఈ పాటలో ఇలా అంటాడు.

పల్లవి:
వాదిగజ మస్తకాంకుశ సుజన బుధగేయ
మేదినీసురవంద్య శ్రీపాదరాయ
చరణం:
సకల శాస్త్రకలాప సంన్యాసకులదీప
సకల సత్యస్థాప సుజ్ఞానదీప
ప్రకట పావనరూప అరికుజనమతలోప
నికటవర్జిత పాప కీర్తిప్రతాప
చరణం:
హరిపదాంబుజభృంగ పరమతాహివిహంగ
పరమ సుగుణాంతరంగ భవదురితభంగ
శరణ కీర్తితరంగ శత్రు తిమిరపతంగ
శరణు శుభచరితాంగ షట్ఛాస్త్రసంగ
చరణం:
సిరికృష్ణ దివ్యపాదాబ్జ చింతాలోల
వర హేమవర్ణ మునిపతియ సుకుమార
గురుతిలక శ్రీపాదరాయ అమితోద్ధార
శరణజన సురధేను భక్తమందార