“చెల్లాయ్! ఓ చెల్లాయ్!”
మెడ పైకెత్తి, మేడ వసారా కేసి చూస్తూ, కిందనుండి అరుస్తున్నాడు ఉదయ భాస్కర్. పైన ఎక్కడా అలికిడి లేదు.
“రాత్రీ! ఓ రాత్రీ!”
వెంటనే ధుమధుమలాడుతూ ఓ యువతి ముఖం మేడ పిట్టగోడ మీదుగా కనిపించింది.
“ఎన్నిసార్లు చెప్పాలీ? నన్నలా పిలవొద్దని. వస్తున్నా ఉండు కిందికి ఇప్పుడే.” చేతిలోని పుస్తకం కింద నుంచుని పైకి చూస్తున్న అన్నగారి మీదకు విసిరి కొట్టింది. గబగబా మెట్లు దూకుతూ కిందకు వచ్చి, “అసలు నాన్నగారిని అనాలి -ఇలాటి పక్షపాతం పేర్లు పెట్టినందుకు. నువ్వేమో morning sun వీ, నేనేమో, నేనోమో…” అని రోషంతో రొప్పుతూ ఆపేసింది.
“పూర్ డార్క్ నైట్! పూర్ క్రీచర్ యూ!” అని కింద పడిన పుస్తకం తీసి చూసి “సెక్రటరీ! హహ. సెక్రటరీ! ఎన్ని సార్లు చదువుతావు ఈ పుస్తకం. చదివితే నీ కోసం రాజశేఖరం వస్తాడనుకుంటున్నావా జయంతీ!” అన్నాడు, ఖరం అన్న మాట మీద వత్తుతూ.
“సర్లే, సర్లే, ఎప్పుడన్నా తమ ముఖం అద్దంలో చూసుకుంటే మంచిది. ఇంతకీ ఏమిటి నాతో పని సోదరా!”
“నాకేం లేదు. కాని శ్యామ్‌గోపాల్ అన్నతనికి ఎందుకో నీ మీద కరుణ కలిగినట్టుంది. హాల్లో ఓ పెద్ద బాక్స్ ఉంది. చూసుకోపో,” అనేసి గేటు తీసుకుని బైటికి వెళ్ళిపోయాడతను.
ఆమె అన్నయ్య మాటలు నమ్మలేదు. ఐనా హాల్లోకి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక పెద్ద అట్టపెట్టె ఉంది. తెరిచి చూస్తే దొంతరలు దొంతరలుగా ఇంగ్లీషు పుస్తకాలు పేర్చి ఉన్నయ్యి – సిన్‌క్లెయిర్ లూయీస్ మెయిన్ స్ట్రీట్, హారియెట్ స్టొవ్ అంకుల్ టామ్స్ క్యాబిన్, స్టెయిన్బెక్ కేనరీ రో, హెన్రీ జేమ్స్ పోర్ట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, థోరో వాల్డెన్, మెల్విల్ మోబీడిక్ – ఇలా ఎన్నో ఎన్నో పుస్తకాలు. అట్టలు మెరుస్తూ నున్నగా ఉన్నయ్. తెరిచి చూస్తే కాగితాలు మంచి క్వాలిటీ, చక్కటి ముద్రణ. ఆమెకు సంతోషం ఆగలేదు. లోపలి గదుల్లోకి పోయి, కొన్ని పుస్తకాలు వాళ్ళ నాన్నకు చూపించితే, ఆయన ఓ రెండు తను తీసుకున్నాడు.
మర్నాడు ఫోన్. గోపాల్ నుంచి.
“డాక్టరు గారూ! పుస్తకాలు వచ్చాయా? మీకు నచ్చాయా?”
“భలేగా ఉన్నయ్. అన్ని కొత్త ఇంగ్లిష్ పుస్తకాలే! ఎలా సంపాదించారు!”
“నాకు న్యూస్ పేపర్ ఉన్నట్టు మీకు తెలుసుగా. అమెరికన్ జర్నలిస్టుల డెలిగేషన్ – ఇక్కడ వార్తా పత్రికలు ఇక్కడి పరిస్థితులు చూట్టానికి వచ్చారు. మా ఆఫీసుకి కూడా వచ్చారు. ఈ పుస్తకాలు వారి బహుమతులు. నేనా, పుస్తకం అంటుకోను. మా ఎడిటర్లు చదువుతారా అంటే అనుమానమే. ఎప్పుడూ, లోకల్ పాలిటిక్సూ, కారాకిళ్ళీలూ, గోల్డ్‌ఫ్లేక్ సిగిరెట్లూ. పుస్తక ప్రియులు గదా, మీరు గుర్తుకు వచ్చారు. అందుకని మీకు పంపాను.”
“చాలా చాలా థేంక్స్!”
“మీకు కావాలంటే, ఈ ఇంటికి వచ్చి చదువుకోవచ్చు విశ్రాంతిగా. సరే, ‘సంక్రాంతి’ థియేటర్ ఓపెనింగ్ కి వస్తున్నారా? మీకు వాళ్ళంతా పెద్ద దోస్తులు. మీ ఇంట్లో వాళ్ళకీ, మీకు, తప్పకుండా ఇన్విటేషన్ వచ్చే ఉంటుంది.”
“మా ఇంట్లో వాళ్ళంతా వస్తారు. నా స్నేహితురాళ్ళు కూడా. మేమంతా బుద్ధిమంతుడు సినిమా ప్రీవ్యూ ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్నాం.”
“నేనొక్కడినే మా ఇంటి నుంచి వచ్చేది. నా కోసం ఒక చిన్నపని చేస్తారా? మీకు, మా ఇంటివాళ్ళు ఈ మధ్య పంపిన పెళ్ళి చీరల్లో ఒక పసుపు కలనేతల చీర ఉంది. అది నా సెలెక్షన్. అది కట్టుకు రావాలి, మీకు నచ్చితేనే.”
నిసికి హఠాత్తుగా గుర్తు వచ్చింది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నట్టు.
అంతకు ముందు కొన్ని వారాలుగా ఆ రెండిళ్ళ మధ్య చీరలూ, నగలూ అటూ ఇటూ నడుస్తున్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చేరి, అవి అన్నీ పోగేసుకుని, ఆ చీరల మడతలు విప్పుతూ, భుజాల మీద వేసుకునీ, ఆ నెక్లెసుల పెట్టెలూ అవీ తెరిచి, ఒక్కొక్కళ్ళు పెట్టుకుని చూస్తూ, ఏవి బాగున్నాయో బాగోలేదో – ఆమెకి తెలుస్తూనే ఉంది.
“అమ్మో! వాటి జోలికి పోటమే. నాకు భయం వేస్తున్నది. మీరు గమనించారా. కొన్ని చీరలు యుద్ధాస్త్రాల్లా మీ ఇంటికి వెళ్ళి, మళ్ళీ మా ఇంటికి తిరిగొచ్చి… ఇలా. మీ అమ్మా, మా అమ్మా మంచి స్నేహితులు. మనవల్ల చివరికి స్నేహితులు కాస్తా ఈ చీరల గురించి, నగల గురించి పోట్లాడుకుంటారేమో?” ఆమె దిగులుగా అంది.
“మీరేం పట్టించుకోవద్దు. అది మన కుటుంబాల్లో మామూలే. ఏం పర్వాలేదు. మీకు ఏది ఇష్టం ఐతే అదే కట్టుకు రండీ. ఊరికే ఉబలాటం కొద్దీ అడిగాను. ఐనా ఒక సలహా. చీర జరీకి మంచి వైపు, చెడు వైపు ఉంటాయి. మీరెటు కట్టినా బాగానే ఉంటారనుకోండి. జరీ మాత్రం సరైన వేపు ఎక్కువ మెరుస్తుంది.”
“నాకేం అర్థం కాలేదు.”
“మీరు ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళారట. అప్పుడు మీ చీర తలకిందులుగానూ, జరీ తప్పు వేపుకూ కట్టుకు వెళ్ళారనీ ఊళ్ళో వదంతులు…” అట్నుంచి గోపాల్ నవ్వు.
నిసికి అప్పుడు అర్థమైంది. ఆ కంట్రాక్టర్ హనుమంతరావుగారి కూతుళ్ళిద్దరూ తనను చూసి ఎందుకు నవ్వారో. కాని తనతో చెప్పలేదు. ఇంకా ఎంతమంది నవ్వుకున్నారో, ఏమో.
“అసలు అర్థరాత్రులూ అపరాత్రులూ ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు? నిద్ర పాడు చేసుకుని ఆ టైంలో లేచి వెళ్ళటం. అయినా సినిమా చూడ్డానికి, జరీ చీరలెందుకండీ.”
గోపాల్ – “అంత మోపు జరీ ఏం లేదు. బ్లౌస్ కూడా కుట్టించా. మీరు చూసి ఉండరు. మళ్ళీ అడగొద్దు నా జాకెట్టు కొలతలు మీకెక్కడవీ అని. మీరు ఆ వాన రాత్రి వచ్చి, నా ఇంట్లొ బట్టలు మార్చుకున్నప్పుడు, అదొక్కటే తీసుకెళ్ళటం మర్చిపోయారు. సీ యూ ఎట్ ది పార్టీ, బై.. ”
“ఉత్త ఆడంగి లాగున్నాడు. నాకే రాదు ఇంకా, జాకెట్లు కుట్టించుకోటానికి ఎక్కడికి పోవాలో. ఇతనికి ఎలా వచ్చో. ఆడవాళ్ళ జాకెట్లు సంగతి ఇతనికి ఎందుకు? Strange Man! Men are strange creatures, indeed.” అక్కడినుంచీ ఇక అంతా ఇంగ్లీషులోనే ఆలోచించుకోటం మొదలెట్టింది నిసి. అమెరికా పుస్తకాలు చదవటం మొదలెట్టగానే, వెనువెంటనే ఆమె ఇండియాతనం కొంత తగ్గినట్టు, ఆలోచన పద్ధతి మారినట్లు ఆమెకే తెలీదు.
ఓ రోజు గోపాల్, ఆమెను తనతో సాయంత్రం దాకా గడపమని అడిగాడు. కారు పంపిస్తున్నట్టు చెప్పాడు.
“శ్యామ్! ఏమిటి విశేషం ? నాకు హైదరాబాద్ చూపిస్తారా?”
“రండీ. వచ్చాక మీకే తెలుస్తుందిగా.”