అప్పర్ క్రస్ట్

“చెల్లాయ్! ఓ చెల్లాయ్!”

మెడ పైకెత్తి, మేడ వసారా కేసి చూస్తూ, కిందనుండి అరుస్తున్నాడు ఉదయ భాస్కర్. పైన ఎక్కడా అలికిడి లేదు.

“రాత్రీ! ఓ రాత్రీ!”

వెంటనే ధుమధుమలాడుతూ ఓ యువతి ముఖం మేడ పిట్టగోడ మీదుగా కనిపించింది.

“ఎన్నిసార్లు చెప్పాలీ? నన్నలా పిలవొద్దని. వస్తున్నా ఉండు కిందికి ఇప్పుడే.” చేతిలోని పుస్తకం కింద నుంచుని పైకి చూస్తున్న అన్నగారి మీదకు విసిరి కొట్టింది. గబగబా మెట్లు దూకుతూ కిందకు వచ్చి, “అసలు నాన్నగారిని అనాలి -ఇలాటి పక్షపాతం పేర్లు పెట్టినందుకు. నువ్వేమో morning sun వీ, నేనేమో, నేనోమో…” అని రోషంతో రొప్పుతూ ఆపేసింది.

“పూర్ డార్క్ నైట్! పూర్ క్రీచర్ యూ!” అని కింద పడిన పుస్తకం తీసి చూసి “సెక్రటరీ! హహ. సెక్రటరీ! ఎన్ని సార్లు చదువుతావు ఈ పుస్తకం. చదివితే నీ కోసం రాజశేఖరం వస్తాడనుకుంటున్నావా జయంతీ!” అన్నాడు, ఖరం అన్న మాట మీద వత్తుతూ.

“సర్లే, సర్లే, ఎప్పుడన్నా తమ ముఖం అద్దంలో చూసుకుంటే మంచిది. ఇంతకీ ఏమిటి నాతో పని సోదరా!”

“నాకేం లేదు. కాని శ్యామ్‌గోపాల్ అన్నతనికి ఎందుకో నీ మీద కరుణ కలిగినట్టుంది. హాల్లో ఓ పెద్ద బాక్స్ ఉంది. చూసుకోపో,” అనేసి గేటు తీసుకుని బైటికి వెళ్ళిపోయాడతను.

ఆమె అన్నయ్య మాటలు నమ్మలేదు. ఐనా హాల్లోకి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక పెద్ద అట్టపెట్టె ఉంది. తెరిచి చూస్తే దొంతరలు దొంతరలుగా ఇంగ్లీషు పుస్తకాలు పేర్చి ఉన్నయ్యి – సిన్‌క్లెయిర్ లూయీస్ మెయిన్ స్ట్రీట్, హారియెట్ స్టొవ్ అంకుల్ టామ్స్ క్యాబిన్, స్టెయిన్‌బెక్ కేనరీ రో, హెన్రీ జేమ్స్ పోర్ట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, థోరో వాల్డెన్, మెల్విల్ మోబీడిక్ – ఇలా ఎన్నో ఎన్నో పుస్తకాలు. అట్టలు మెరుస్తూ నున్నగా ఉన్నయ్. తెరిచి చూస్తే కాగితాలు మంచి క్వాలిటీ, చక్కటి ముద్రణ. ఆమెకు సంతోషం ఆగలేదు. లోపలి గదుల్లోకి పోయి, కొన్ని పుస్తకాలు వాళ్ళ నాన్నకు చూపించితే, ఆయన ఓ రెండు తను తీసుకున్నాడు.

మర్నాడు ఫోన్. గోపాల్ నుంచి.

“డాక్టరు గారూ! పుస్తకాలు వచ్చాయా? మీకు నచ్చాయా?”

“భలేగా ఉన్నయ్. అన్ని కొత్త ఇంగ్లిష్ పుస్తకాలే! ఎలా సంపాదించారు!”

“నాకు న్యూస్ పేపర్ ఉన్నట్టు మీకు తెలుసుగా. అమెరికన్ జర్నలిస్టుల డెలిగేషన్ – ఇక్కడ వార్తా పత్రికలు ఇక్కడి పరిస్థితులు చూట్టానికి వచ్చారు. మా ఆఫీసుకి కూడా వచ్చారు. ఈ పుస్తకాలు వారి బహుమతులు. నేనా, పుస్తకం అంటుకోను. మా ఎడిటర్లు చదువుతారా అంటే అనుమానమే. ఎప్పుడూ, లోకల్ పాలిటిక్సూ, కారాకిళ్ళీలూ, గోల్డ్‌ఫ్లేక్ సిగిరెట్లూ. పుస్తక ప్రియులు గదా, మీరు గుర్తుకు వచ్చారు. అందుకని మీకు పంపాను.”

“చాలా చాలా థేంక్స్!”

“మీకు కావాలంటే, ఈ ఇంటికి వచ్చి చదువుకోవచ్చు విశ్రాంతిగా. సరే, ‘సంక్రాంతి’ థియేటర్ ఓపెనింగ్ కి వస్తున్నారా? మీకు వాళ్ళంతా పెద్ద దోస్తులు. మీ ఇంట్లో వాళ్ళకీ, మీకు, తప్పకుండా ఇన్విటేషన్ వచ్చే ఉంటుంది.”

“మా ఇంట్లో వాళ్ళంతా వస్తారు. నా స్నేహితురాళ్ళు కూడా. మేమంతా బుద్ధిమంతుడు సినిమా ప్రీవ్యూ ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్నాం.”

“నేనొక్కడినే మా ఇంటి నుంచి వచ్చేది. నా కోసం ఒక చిన్నపని చేస్తారా? మీకు, మా ఇంటివాళ్ళు ఈ మధ్య పంపిన పెళ్ళి చీరల్లో ఒక పసుపు కలనేతల చీర ఉంది. అది నా సెలెక్షన్. అది కట్టుకు రావాలి, మీకు నచ్చితేనే.”

నిసికి హఠాత్తుగా గుర్తు వచ్చింది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నట్టు.

అంతకు ముందు కొన్ని వారాలుగా ఆ రెండిళ్ళ మధ్య చీరలూ, నగలూ అటూ ఇటూ నడుస్తున్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చేరి, అవి అన్నీ పోగేసుకుని, ఆ చీరల మడతలు విప్పుతూ, భుజాల మీద వేసుకునీ, ఆ నెక్లెసుల పెట్టెలూ అవీ తెరిచి, ఒక్కొక్కళ్ళు పెట్టుకుని చూస్తూ, ఏవి బాగున్నాయో బాగోలేదో – ఆమెకి తెలుస్తూనే ఉంది.

“అమ్మో! వాటి జోలికి పోటమే. నాకు భయం వేస్తున్నది. మీరు గమనించారా. కొన్ని చీరలు యుద్ధాస్త్రాల్లా మీ ఇంటికి వెళ్ళి, మళ్ళీ మా ఇంటికి తిరిగొచ్చి… ఇలా. మీ అమ్మా, మా అమ్మా మంచి స్నేహితులు. మనవల్ల చివరికి స్నేహితులు కాస్తా ఈ చీరల గురించి, నగల గురించి పోట్లాడుకుంటారేమో?” ఆమె దిగులుగా అంది.

“మీరేం పట్టించుకోవద్దు. అది మన కుటుంబాల్లో మామూలే. ఏం పర్వాలేదు. మీకు ఏది ఇష్టం ఐతే అదే కట్టుకు రండీ. ఊరికే ఉబలాటం కొద్దీ అడిగాను. ఐనా ఒక సలహా. చీర జరీకి మంచి వైపు, చెడు వైపు ఉంటాయి. మీరెటు కట్టినా బాగానే ఉంటారనుకోండి. జరీ మాత్రం సరైన వేపు ఎక్కువ మెరుస్తుంది.”

“నాకేం అర్థం కాలేదు.”

“మీరు ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళారట. అప్పుడు మీ చీర తలకిందులుగానూ, జరీ తప్పు వేపుకూ కట్టుకు వెళ్ళారనీ ఊళ్ళో వదంతులు…” అట్నుంచి గోపాల్ నవ్వు.

నిసికి అప్పుడు అర్థమైంది. ఆ కంట్రాక్టర్ హనుమంతరావుగారి కూతుళ్ళిద్దరూ తనను చూసి ఎందుకు నవ్వారో. కాని తనతో చెప్పలేదు. ఇంకా ఎంతమంది నవ్వుకున్నారో, ఏమో.

“అసలు అర్థరాత్రులూ అపరాత్రులూ ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు? నిద్ర పాడు చేసుకుని ఆ టైంలో లేచి వెళ్ళటం. అయినా సినిమా చూడ్డానికి, జరీ చీరలెందుకండీ.”

గోపాల్ – “అంత మోపు జరీ ఏం లేదు. బ్లౌస్ కూడా కుట్టించా. మీరు చూసి ఉండరు. మళ్ళీ అడగొద్దు నా జాకెట్టు కొలతలు మీకెక్కడవీ అని. మీరు ఆ వాన రాత్రి వచ్చి, నా ఇంట్లొ బట్టలు మార్చుకున్నప్పుడు, అదొక్కటే తీసుకెళ్ళటం మర్చిపోయారు. సీ యూ ఎట్ ది పార్టీ, బై.. ”

“ఉత్త ఆడంగి లాగున్నాడు. నాకే రాదు ఇంకా, జాకెట్లు కుట్టించుకోటానికి ఎక్కడికి పోవాలో. ఇతనికి ఎలా వచ్చో. ఆడవాళ్ళ జాకెట్లు సంగతి ఇతనికి ఎందుకు? Strange Man! Men are strange creatures, indeed.” అక్కడినుంచీ ఇక అంతా ఇంగ్లీషులోనే ఆలోచించుకోటం మొదలెట్టింది నిసి. అమెరికా పుస్తకాలు చదవటం మొదలెట్టగానే, వెనువెంటనే ఆమె ఇండియాతనం కొంత తగ్గినట్టు, ఆలోచన పద్ధతి మారినట్లు ఆమెకే తెలీదు.


ఓ రోజు గోపాల్, ఆమెను తనతో సాయంత్రం దాకా గడపమని అడిగాడు. కారు పంపిస్తున్నట్టు చెప్పాడు.

“శ్యామ్! ఏమిటి విశేషం ? నాకు హైదరాబాద్ చూపిస్తారా?”

“రండీ. వచ్చాక మీకే తెలుస్తుందిగా.”

కారు ఆమెను తీసుకు వెళ్ళి, నాంపల్లిలో ఒక డాబా ముందు ఆగింది. ఆ బిల్డింగ్ ముందంతా కొట్లు. రకరకాల సామాన్లు అమ్మే బండ్ల వాళ్ళూ. బిల్డింగ్ మీద ‘డెయిలీ న్యూస్’ అన్న బోర్డ్ వేలాడుతూంది. ఒక ఎర్ర షామియానా కింద నడిచి లోపలికి వెడితే, అక్కడ ముందు గదిలో కొంతమంది స్టాఫ్ కూర్చుని ఉన్నారు. గోపాల్ ఎదురొచ్చి, ఆమెను లోపలి తన ఆఫీస్ లోకి తీసుకు వెళ్ళాడు.

“అంతకు ముందు నా ఇల్లు చూశారుగా, అకస్మాత్తుగా వచ్చి. ఇప్పుడు నేనే నా ఆఫీసొకటి మీకు చూపిద్దామని పిలిచాను. ఇది నా న్యూస్ పేపర్, ప్రిటింగ్ ప్రెస్ నడిపే చోటు. బిల్డింగ్ మాది కాదు. గవర్నమెంట్ -పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అద్దెకు తీసుకున్నాం. ఆ ముందు గదుల్లో మీరు చూసింది, నా సెక్రెటరీ, అకౌంటెంట్ జోసెఫ్, ఆఫీస్ ఆడ్మినిస్ట్రేటర్. ఈ న్యూస్ పేపరుకు నేనే మేనేజింగ్ ఎడిటరూ, పబ్లిషరూ అన్నీ. కూర్చోండి. మంచి ఎండలో వచ్చారు. కాస్త సేద తీరండి ముందు.”

బాయ్ చల్లటి కూల్‌డ్రింక్స్ ట్రేలో తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. ఇంతలో ఫోన్ మోగింది. అతను ఫోన్‌లో మాట్లాడుతుంటే డ్రింక్ తాగుతూ చుట్టూ చూసింది. గది ఎయిర్ కండిషనింగ్ చేసి ఉంది. చక్కని ఫర్నిచర్. విండో బేలో బోన్సాయ్ మొక్క ఒకటి ఏటవాలుగా పడుతున్న ఎండలో.

“వెళ్దామా? అటు ఆ పక్కగదిలో ప్రూఫ్ రీడర్లు ఉంటారు. రండి. ఈ గది కంపోజింగ్ రూమ్. ఇక్కడ పేపర్ ఎడిటర్లు ఉంటారు. ఇతడు కేశవరావు. ఫెర్నాండెజ్ . శివ మోహన్. నారాయణ, ఆలీ,” – ఇలా చెపుతూ నడుస్తుంటే ఆమె నమస్కారాలు చెపుతూ అతడి వెంట వెళ్ళింది.

“ఈ టెలీ ప్రింటర్స్ మీదుగా వార్తలు యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా నుండి ఎప్పుడూ వరసగా వస్తూ ఉంటయ్. వాటిని ఎడిటర్లు చూసి ఏ వార్తలు మరుసటి రోజు పేపర్లో రావాలో గుర్తులు పెడతారు. తర్వాత కంపోజర్లు ఒక పాతిక ముప్పై మంది ఉన్నారు – వాళ్ళు ఆ వార్తలకు టైప్ సెట్టింగ్ చేస్తారు. ముందు ప్రూఫ్ రీడర్ తప్పులు సరిదిద్ది, నమూనా అచ్చు వేసి ఇచ్చిన పేజ్ ప్రూఫ్ లను, అప్పుడు ఎడిటర్లు చూస్తారు. చీఫ్ ఎడిటర్, అన్నిటిలోకీ ముఖ్యమైన వార్త అనుకున్నదానిని తీసుకుని తన ఎడిటోరియల్ రాస్తాడు.
ఇదిగో, ఇది నా ప్రింటింగ్ షెడ్. ఇది కట్టటానికి నాకు యాభయి వేలు ఖర్చయ్యింది. ఈ రెండు మెషీన్లు రష్యా నుండి, ఈ రెండు చెకోస్లవేకియా నుంచి తెప్పించాను. ఈ చిన్న మెషీన్లు, ఇవి ఇక్కడే లోకల్ తయారీ.

ఆమెకు ఇది పరిచయమున్న లోకం కాదు. ఏం ప్రశ్నలు వెయ్యాలో కూడా తెలియదు. అన్నీ ఆశ్చర్యంతో చూస్తూ, – “పేపర్లు ఎప్పుడు ముద్రిస్తారు?”- అని అడిగింది.

“నా పేపర్ చిన్నది కదా. ఎక్కువ సర్క్యులేషన్ లేదు. మహా ఐతే 5,6 వేల కాపీలు వేస్తాం. పేపర్ ప్రింటింగ్ అర్థరాత్రి జరుగుతుంది. నాకూ, ఇంకో భాగస్వామికీ పుస్తకాలు అచ్చు వేసే బిజినెస్ కూడా ఉంది. ఆ పనులు ఈ పెద్ద షెడ్లో జరుగుతాయి. ఇప్పుడు తెలుగు ఎకాడమి వారికి ఒక తెలుగు పాఠ్య పుస్తకం, ఒక ఫిజిక్స్ పుస్తకం తయారీలో ఉన్నయ్.”

అక్కడ పేజీలను వరుసగా బొత్తులు పెడుతున్నవారిని, పేజిలు కుడుతున్నవారిని, అట్టలు అతికిస్తున్నవారిని చూస్తూ ఆమె బైటికి నడిచింది.

మళ్ళీ ఆఫీసులొకి వెళ్ళాక – “సో! మీకు పుస్తకాల మోజు, రాయటం మీద ఇంటెరెస్ట్ చాలా ఉంది కదా. మా పేపర్కి రాయండీ,” అన్నాడు నవ్వుతూ.

“ఇంకా నయం. నేను రాస్తే ఆంధ్ర పత్రిక, ప్రభ, యువ -ఇలాటి తెలుగు పత్రికలకు రాస్తా. మీ ఈ రెండు పేజీల డింకీ పేపర్‌కి నన్ను రాయమంటారా?”

“పోనీ! పుస్తకం రాయండీ. అచ్చు వేయిస్తా.” అతనికి కోపం రాలేదు. లోపల నవ్వుకుంటున్నాడు.

“మీకు చిన్న కథ కూడా రాయనంటే పుస్తకం రాయమంటారు! మీరెవరండీ, నా రాతలు అచ్చు వెయ్యటానికి?”

“అమ్మో! పోనీ కథ రాసి నాకు పంపిస్తే నేను సుధాకర్ కి పంపిస్తా. యువలోనే వేయిస్తా, మీకదే మోజైతే.”

“మీ సిఫార్సు నా కక్కర్లా. మీరసలు కుటుంబరావు, ఆదివిష్ణు, రాజారాం, భానుమతి, వీరెవరి కథలైనా చదివారా? వీరి కథలన్నీ మీ సిఫారసు మీదే అచ్చవుతున్నయ్యా?” తల ఎగరేస్తూ అడిగింది.

అతడు కళ్ళజోడు తుడిచి పెట్టుకుని, “లేదులెండి. కథలు రాస్తే వాళ్ళకి డబ్బిస్తారు. అందుకు రాస్తారు. మీరైతే నేను పే చెయ్యక్కర్లేదనీ, అడిగా. అంతే. అంత కోపం ఎందుకు?

“ఆశ కాదూ. నాకైతే మీరు ట్రిపుల్ రేట్ ఇవ్వాల్స్సుంటుంది నా రచనలకి.”

“ఊరికెనే అడిగా లేండి. ఇంతకీ నే పంపిన పుస్తకాలు నచ్చాయా?”

“అవేవో, మీరు రాసినట్లు. నేనింటికి పోవాలండీ, ఇంక.”

“మిమ్మల్ని దిగబెట్టమని చెపుతా. పార్టీకి రావటం మానరు గదా?” అన్నాడు శ్యామ్ గోపాల్.

ఆమె వెళ్ళిపోయాక, చాలాసేపు మనసులో నవ్వుకున్నాడతడు. ఈ పిల్లకేం లోకం తెలియదు. వేరే చాలామంది ఆడపిల్లలకు ఉండే తెలివితేటలు ఈమెకు శూన్యం. మరి ఈవిడగారు చదివే ఆ పుస్తకాల్లో ఆ రచయితలు వాళ్ళు ఏం రాసి అఘోరిస్తున్నారు? ఈమెకు లోకం గురించి ఏం చెపుతున్నారు? పేపర్లోనూ, ఎడ్వర్టయిజ్మెంట్ల మీదొచ్చే డబ్బులు, స్టాఫ్ జీతాలకే బొటాబొటీగా సరిపోతాయి. పుస్తకాల్లోనూ ఏమీ లాభాలు రావు. అయినా మనుషులకు ఉపాధి కల్పించాలా, వద్దా? ఏదో ఒక పని కల్పించి, డబ్బు అనే పదార్థాన్ని , ఒకరి జేబులోనుండి ఇంకో జేబులోకి వారం వారమో, నెల నెలో మార్చాలి కదా. అప్పుడే గదా ఎవరైనా తిండి గింజలు కొనుక్కుంటారు. కొంచెం తిన్నని బట్ట కట్టుకుంటారు. ఆ సంగతి నేను చెప్పితే, ఈమె చేసే వీరంగం – అమ్మో, నాకు తలుచుకోటానికే భయం వేస్తున్నది. ఓహో! ఈ పిల్లతో జీవితం చాలా సరదాగా ఉండేట్టుంది – అనుకున్నాడతను.

ఆ తర్వాత, కాసేపు ఆ పని ఈ పనీ చూసుకుని, సిమెంటూ, పంచదార -అమ్మే తన గోడౌన్లు వద్దకు వెళ్ళిపోయాడు.


మర్నాడు ఊళ్ళో చాలా కోలాహలం. ఆంధ్రాలో పెద్ద జమిందార్లుగా, మైకా మైన్ ఓనర్లు, రేస్ హార్స్ ఓనర్లుగా, సినిమా డిస్ట్రిబ్యూటర్లుగా పేరు పడ్డ ఓ కుటుంబం – వారిలో ఒక యువకుడు, కొత్తగా కట్టిన సినిమా హాలు ఓపెనింగ్ ఆ సాయంత్రం. మంచి ఆవరణ. పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసిన సినిమా హాలు. ఎర్ర తివాచీ పరిచిన ఒంపుల రాంప్. పైన ఖరీదు తరగతుల బాల్కనీ, కింద తక్కువ ఖర్చు తరగతులు. హైదరాబాదులో అంత చక్కని థియేటర్ అంతకు ముందు లేదు. ఆ రోజు ‘బుద్ధిమంతుడు’ ఊళ్ళో ప్రముఖులకు మాత్రమే చూపబడుతుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, జడ్జీలు, జర్నలిస్టులు, ఊళ్ళో మోతుబరి కుటుంబాలు ఎందరెందరికో ఆహ్వానాలు. ముందు తేనీటి పార్టీ. తర్వాత సినిమా. నిసి, అమ్మా నాన్నా, అన్నలతో కలిసి పార్టీకి వెళ్ళింది.

ఆ హాలు ఓనరు జీ. పీ. నిసి అతన్ని అన్నా అని పిలుస్తుంది. రమారమి గోపాల్ వయసే. ఇద్దరి వయసూ ఇరవయ్యిల్లొనే. గొప్ప అందగాడు. ఏ సినిమా స్టార్లూ అతని అందానికి చాలరు. అతడి మాటలో విలాసం. నవ్వులో విలాసం. నడకలో ఓ రాజసం. కుర్ర జమిందారు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. అతడికి నాగేశ్వర రావు, రామారావు లాగా జమిందారు పాత్ర నటించాల్సిన అవసరం లేదు.

అతడి భార్య అతనికి దీటైన అందగత్తె. ఆమె ఒక గులాబీ రంగు జరీ పని చేసిన చీర కట్టి, అదే రంగు జాకెట్టు వేసుకుంది. చేతికి ముత్యాలు, రవ్వల గాజులు. ఒక చేతికి వరుస వరసల ముత్యాల బ్రేస్ లెట్. ఆమె ముఖం కోలగా, ఎంతో ముద్దుగా ఉంది. ఇంత వంక పెట్టలేని కనుముక్కు తీరు. తెల్లని తెలుపు. తెలుపు గులాబి పువ్వు రేకుల మడతల్లో కనిపించే గులాబి రంగు స్ఫురిస్తూ ఉంది ఆమె ఒంటి చాయలో. ఉత్తరాదిలొ పెరిగినందున, తెలుగు రాదు. ఎక్కువ హిందీలో, ఇంగ్లీషులో మాట్లాడుతూ, అప్పుడే కొద్దిగా తెలుగు మాట్లాడుతూ ఉంది. ఆమెను అత్తింటివాళ్ళు ముద్దుకి ‘బహూ’ అని పిలుచుకుంటారు. బహురానీకి, ఆ తెలుగు సినిమా ఏం అర్థం కాదు.

హాలు ఆవరణలో, చిన్ని చిన్ని గుంపులు తయారయ్యాయి. నిసి ఎందరో స్నేహితురాళ్ళు. కుసుమ, జయ, వీణ, వారి కజిన్లు, ప్రభ, షీల -అందరూ ఆ కుటుంబం లోని వారే. ఎంత మందో సీతాకోక చిలుకల్లాగా అలంకరించుకున్న చిన్నారులు. ఒకరిని మించిన అందగత్తెలు ఒకరు. అందరి చెవులకూ జుంకీలు వేళ్ళాడుతున్నాయి. మెడల్లో సరికొత్త ఫేషన్ నెక్లెసులు. ఆ చిలకలెవరికీ తెలుగు రాదు. నాగేశ్వరరావు వారికి హీరోనూ కాదు. కొంతమంది కాలేజీలో ఇంగ్లీషు, ఫ్రెంచ్ తీసుకుంటున్నారు. ఇంట్లో సినిమా స్టూడియో – డాన్స్ మాస్టర్లే వచ్చి వారికీ డాన్స్ నేర్పుతారు. సంగీతం జోలికి వాళ్ళెవరూ పోలేదు. అప్పుడప్పుడూ గుర్రపు స్వారీ, ఇంగ్లీషు నవలలు చదవటం, సీజను మారినప్పుడల్లా, మద్రాసు, బెంగుళూరు, ఊటీల్లో రేసులు చూస్తూ, తమకు ఫ్యూచర్లో కాబోయే పెళ్ళికొడుకులెవరా అని ఒకరితో ఒకరు సరాగాలాడుకుంటారు. వారి ఊహల్లో హీరోలు వేరు. వాళ్ళు తెలుగు వారు ఎంతమాత్రం కారు.

అవతల, వేరే గుంపుల్లో వీరిని మించిన వారు, ఈ యువతుల అమ్మలూ నాన్నలూ. వారికి మాత్రం వయసెంత? ముప్పయిలూ, నలభైలే. ఎవరి ఆరాధకులు వారికే ఉన్నారు. ఎవరు నడిపించే ప్రేమకథలు వారివే. అప్పుడప్పుడూ ఏ పత్రికా విలేఖరో కూపీ లాగి -ఏ మెరీనా బీచిలో ఒక సినిమా తారతో, ఒక ప్రొడ్యూసర్ నగ్నంగా కనిపించాడనీ, ఒక రేసు గుర్రం ఒక సినిమా డాన్సరుకు బహుమతిగా వెళ్ళిందనీ – ఇలా వారి మీద కథలేవో ప్రచురించి, వాళ్ళూ నాలుగు రాళ్ళు జేబులో వేసుకుంటారు. వీటివల్ల జమిందారీ కుటుంబాల వారికి వచ్చే నామోషీ ఏమిటి? ఇతరులకు, మాకు లేదే ఈ వైభోగం అన్న అసూయ తప్పించి. అక్కడ, ఆ సాయంత్రం, మన్మధుడి బాణాలు చెల్లా చెదరుగా ఎంత మంది మీదో పడుతున్నయి. సినిమా హాలు కర్టెన్ రైజ్ కాక ముందే, అక్కడ మరెన్నో సిజ్లింగ్ ప్రేమ కథలు. ఆ సిల్కుచీరలు, ఆ రెపరెపలు, ఆ నగల తళ తళలు, సిల్కు చొక్కాలు, బిన్నీ పంచలు, సూట్లు, కలిసిపోయి చేస్కుంటున్న చతుర సంభాషణలు -ఎర్ర కార్పెట్ పరిచిన ఆ సినిమా హాలు, బాల్కనీ లౌంజ్ ఎంతో శోభాయమానంగా ఉంది.

ఇంతలో కొంత కోలాహలం. కలెక్టరుగారు వచ్చారని. కలెక్టరు అంటే ఎవరో పెద్ద వయసు ఆయన అనుకుంటే కాదు. చాలా చిన్న వయసే. ఆయన పక్కన విమలను చూసి, నిసి, ఆమెను చూసి విమల, ఆశ్చర్య పోయారు. “అరే! నువ్విక్కడ!”, “అరే! నువ్విక్కడ!” అనుకున్నారు.

కొన్నేళ్ళ కింద వారిద్దరికీ గుంటూరు స్త్రీల కళాశాలలో స్నేహం కలిసింది. అక్కడ లాన్లో, కాలేజీ గ్రౌండ్సులో, గడ్డిలో అమ్మాయిలు గుంపులుగా కూర్చుని క్లాసుల మధ్యలో ఇంటర్వెల్లో పత్రికల్లో కథలు జోరుగా చర్చించుకునే వారు. ఆ డిస్కషన్లు పోట్లాటలుగా మారి, కొన్నాళ్ళు కొంతమంది ఆడపిల్లల మధ్య మాటలుండేవి కాదు. మళ్ళీ వేడి తగ్గాక మామూలుగా కలిసి తిరిగేవారు. నిసికి అప్పుడు చప్పున గుర్తు వచ్చింది. ఐ.ల్. టి.డి ఆఫీసరు గారమ్మాయి విమల, కాబొయే మొగుడు, అసిస్టెంటు కలెక్టరనీ, వాళ్ళూ బ్రాహ్మలేననీ, తన ఫేమిలీ వాళ్ళు, ఒకసారి చెప్పుకోటం.

మిసెస్ కలెక్టర్, నిసిని పక్కకు లాక్కుపోయి, “బుద్ధిమంతుడు సినిమాకోసం వచ్చా. మనిద్దరం కలిసి చూద్దాం. మా పక్కన సీటుంచుతా నీకోసం” అంది.

నిసి ఉషారుగా, విమల ఈ మధ్య చేసిన పెయింటింగుల గురించీ, శిల్పాల గురించీ ఎంతో ఆసక్తితో అడిగి చెప్పించుకుంది. నిసి బీ. యస్సీ చదువుతూ, కప్పల్నీ, మొలస్క్ లనీ కోస్తుంటే, వాటి బొమ్మలు వేస్తుంటే, విమల బి.యే చదువుతూ, కాలేజీలో ఆయిల్ పెయింటింగ్స్ వెయ్యటం, మట్టితో బొమ్మలు చెయ్యటం నేర్చుకుంది. ఆ పిల్ల అవి మాత్రమే చదువుతాను, మరేం చదవను అని మంకు పట్టు పడితే, ఆ కాలేజీలో, కొత్తగా మాస్టర్ను తెప్పించి, ఆర్ట్స్ విభాగం సృష్టించి, ఆ కోర్సులు ప్రవేశపెట్టారు. అందుకని నిసికి, విమల అంటే చాలా ఎడ్మిరేషన్. ఆమె పొడగరితనం, చక్కని రూపు, షార్ప్ పలుకూ అన్నీ నిసికి ఇష్టమే.

కొంచెం సేపటికి సినిమాహాలు ఓనరు భార్య వచ్చి, ఆమెను మరో పక్కకు లాక్కెళ్ళి – “గోపాల్ వస్తానన్నాడు. నిన్ను మా పక్కనే కూర్చో పెట్టుకోమన్నాడు. అలా ఐతేనే తను వస్తానని ఒప్పందం.” అని చెప్పింది.

“గోపాల్‌తో నీకు ఒప్పందమా? నేను కదా నీ ఫ్రెండ్ ని.”

“అవునులే, కానీ మీ అన్నయ్యకు ఈ సినిమా హాలు కట్టటానికి తన గోడౌన్ల నుండి సిమెంటూ, ఇంకా మంత్రులతో మధ్యవర్తిగా మాట్లాడి, బిల్డింగ్ పర్మిట్లూ, ఇలా గోపాల్, చాలా సాయం చేశాడు. జమిందారీ ఫాయీ. ఎవరితో చెప్పరు. కానీ, నేన్నీతో చెపుతున్నా. కాన్ఫిడెన్షియల్ అనుకో. అందుకని ఈ థియేటరు విషయంలో అతడే మాకెక్కువ.”

“వచ్చాడు, అడుగో!”

ఆశ్చర్యంగా, నిసికి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంది. దూరంగా జీ.పి. అన్నయ్య, గోపాల్ మాట్లాడుకుంటూ కనిపించారు. గోపాల్ వారిని చూసి, అక్కడినించే పలకరింపుగా నవ్వాడు. ఇటుక రంగు చొక్కా, పసుపు రంగు కలనేత టై. నిసిని చూస్తూ, అతడు తన టై కొంచెం ఎత్తి సర్దుకున్నాడు. టై మీది జరీ పూలూ, దానితో పాటు అతడి చేతి రోలెక్స్ తళతళా మెరిశాయి. నిసి గుర్తు పట్టింది. ఆ టై, తన చీర, ఒకే రంగు. ఒకే మెటీరియల్.

అందరూ మెల్లిగా వెళ్ళి హాల్లో కూర్చున్నారు. నాగేశ్వర రావు సినిమా చూసే ఎక్సైట్మెంట్లో ఉన్నారు. సినిమా హాల్లో లైట్లు డిమ్ చేశారు. కొంచెం సేపట్లో, గోపాల్ ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు.

నిసిని చూసి, “జస్ట్ లైక్ ఐ థాట్. నిరాభరణ భూషిత.” అని నవ్వి జేబులోకి చెయ్యి పోనిచ్చి, తీసి ఆమె మెళ్ళో ఒక బంగారు జలతారు నెక్లెస్ వేసి, ఒక బంగారు కంకణం చేతికి తొడిగాడు. అతని కంఠంలో ఎక్కడ లేని తియ్యదనం. ఇంత కూడా ఆలస్యం లేకుండా, నిసి చేతిని తన చేతిలోకి తీసుకుని తన పెదాలకు నొక్కిపెట్టి, ఆమె వేళ్ళలొ, వేళ్ళు జొనిపి కూర్చున్నాడు.

‘బుద్ధిమంతుడు’ సినిమాలో ఏం ఉందో, ఆమెకి సరిగా ఇప్పటికీ తెలియదు.

(నిసి 1960ల డైరీల్లోంచి.)