రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం!

రచన: భైరవభట్ల కామేశ్వరరావు
నవంబర్ 2018


(చిత్రం: అన్వర్)

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు.

ఈ వాక్యం చందమామ చదువరులకు చిరపరిచితమే. ఒక చేత్తో కత్తి పట్టుకుని, మరొక భుజం మీద శవాన్ని మోస్తూ నిలుచున్న విక్రమార్కుని చిత్రం అంతకన్నా సుపరిచితమే!

భారతీయ కథా సాహిత్యంలో కథామాలికలూ, కథలో కథ, కథలో కథగా అల్లుకుంటూ సాగిపోయే గొలుసుకట్టు కథలూ చాలా కనిపిస్తాయి. పంచతంత్రం, శుక సప్తతి, హంస వింశతి మొదలైనవి. వీటన్నిటికీ మూలాలు కథాసరిత్సాగరంలో ఉన్నాయని చెప్పవచ్చు. సంస్కృతంలో ఉన్న కథాసరిత్సాగరానికి మూలం పైశాచీ భాషలోనిదని భావించే బృహత్కథ. అది క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందిన గుణాఢ్యుడనే పండితుడు రచించాడని ప్రతీతి. అందులోనిదే మరొక ప్రసిద్ధ కథామాలిక భేతాళ పంచవింశతి.

పంచవింశతి అంటే ఇరవై అయిదు. అది ఇరవై అయిదు కథల సమాహారం. శవాన్ని ఆవేశించి ఉన్న భేతాళుడు కాలక్షేపానికి విక్రమార్కునికి ఒక కథ చెప్పడం, చివరన ఆ కథకి సంబంధించిన ఒక చిక్కుప్రశ్న వేయడం, తెలిసీ జవాబు చెప్పకపోతే నీ తల వేయివక్కలవుతుందని అనడం, విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పడం, అతనికి మౌనభంగమై ఆ శవం తిరిగి చెట్టెక్కడం–ఇదీ వరస. ఈ వరసలో భేతాళుడు చెప్పిన చివరి కథ ఏమిటో గుర్తుందా? అది ఆఖరి కథ ఎందుకయ్యిందో తెలుసా? విక్రమార్కుని సహనాన్నీ పట్టుదలనీ తెలివితేటల్నీ పరీక్షించి పరీక్షించి, అతను గొప్ప యోగ్యుడని నిశ్చయించుకుంటాడు భేతాళుడు. ఇక తాను అతనికి వశం కావాలి. తన కథల పరంపరకి ముగింపునివ్వాలి. కానీ ఎలా? దీనికొక అద్భుతమైన పరిష్కారం కనుగొంటాడు భేతాళుడు.

సమాధానం ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానం ఆలోచించి చెప్పగలగడం ఒక ఎత్తయితే, సమాధానం లేని ప్రశ్నకు సమాధానం లేదని తెలుసుకుని మౌనంగా ఉండిపోవడం ఇంకొక ఎత్తు! అలా చేయగలిగినప్పుడే అది సంపూర్ణ ప్రజ్ఞ అవుతుంది. విక్రమార్కుడు అలాంటి పూర్ణ ప్రజ్ఞావంతుడా కాదా? అది పరీక్షించేందుకు, కచ్చితమైన సమాధానం అంటూ లేని చిక్కుముడిని విక్రమార్కుని ముందుంచుతాడు భేతాళుడు. ఇది అతనికి చివరి పరీక్ష. మౌనంగా ఉండాల్సినప్పుడు ఉండగలడా లేడా? అలా ఉండిపోతే మౌనభంగం జరగదు. అప్పుడు తను విక్రమార్కునికి వశమవుతాడు. అదీ భేతాళుని యుక్తి. సమాధానం లేని ప్రశ్నకి దారి తీసిన ఆ చిక్కుముడి కథ ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చుంటుంది. తెలియని వాళ్ళకోసం స్థూలంగా ఇక్కడ…

అనగనగా తండ్రీ కొడుకులు. వాళ్ళిద్దరూ ఒకసారి అడవిలో వెళుతూ రెండు జతల స్త్రీల పాదాల గుర్తుల్ని చూస్తారు. పెద్ద పాదాలున్న స్త్రీని తండ్రి, చిన్న పాదాలున్న స్త్రీని కొడుకూ పెళ్ళాడుతామని ప్రతిజ్ఞ పడతారు. ఆ గుర్తుల వెంట వెళ్ళి ఆ స్త్రీలను కలుసుకుంటారు. వాళ్ళ ప్రతిజ్ఞల మేరకు పెద్ద పాదాలున్న స్త్రీని తండ్రి, చిన్న పాదాలున్న స్త్రీని కొడుకు పెళ్ళాడతారు. అయితే ఆ స్త్రీలిద్దరూ తల్లీ కూతుళ్ళు. పైగా పెద్ద పాదాలున్న స్త్రీ కూతురు, చిన్న పాదాలున్న స్త్రీ తల్లి. తదనంతరం వాళ్ళకు సంతానం కలుగుతుంది. ఇప్పుడు ఆ పిల్లల మధ్యనున్న సంబంధం ఏమిటి అన్నది ప్రశ్న.

ఈ ప్రశ్నకి కచ్చితమైన సమాధానం లేదు. అది తెలుసుకున్న విక్రమార్కుడు మౌనంగా ఉండిపోతాడు. భేతాళుడు అతనికి వశమవుతాడు.

ఈ కథలో చిక్కుముడికి అసలు కారణం గమనించారా? ఒక తండ్రికి మరొక సంబంధం ద్వారా కొడుకే తిరిగి తండ్రి కావడం! ఒక దిశలో తిన్నగా సాగిపోయే సాధారణ బంధుత్వాల పరంపర, వేరొక బంధుత్వం ద్వారా మెలితిరిగి, తిరిగి మొదలికి వచ్చిందన్నమాట. దాని వలన సాధారణ సంబంధాలలో కనిపించని ఒకానొక వైరుధ్యం ఇక్కడ ఏర్పడింది. అదీ చిక్కుముడి, లాజికల్ ఫేలసీ (logical fallacy).

ఇది పైకి సరదా కథలా కనిపిస్తున్నా ఈ చిక్కుముడి వెనకనున్న తత్త్వం గాఢమైనది. తర్కశాస్త్రంలో (Logic) ఇది ఒక ముఖ్యమైన విషయం! పెద్ద పెద్ద గణిత శాస్త్రవేత్తలను సైతం బెంబేలెత్తించిన అంశం. కొన్ని మౌలికమైన లాజికల్ పేరడాక్సులకు ఉత్పత్తి స్థానం. దీని గురించి మరింత స్పష్టం కావాలంటే ఈ కింద రెండు వాక్యాలను చూడండి:

దీని తర్వాతున్న వాక్యం అబద్ధం. దీని ముందరున్న వాక్యం నిజం.

ఈ రెండు వాక్యాలలో ఉన్న వైరుధ్యాన్ని గమనించండి. మొదటి వాక్యం నిజమైతే, దాని ప్రకారం తర్వాతి వాక్యం అబద్ధం కావాలి. కానీ రెండో వాక్యం, మొదటి వాక్యం నిజమని చెపుతోంది. అది అబద్ధమైతే, మొదటి వాక్యం అబద్ధం కావాలి! పోనీ మొదటి వాక్యం అబద్ధం అయితే, దాని ప్రకారం రెండో వాక్యం నిజం కావాలి. అప్పుడు దాని ప్రకారం తిరిగి మొదటి వాక్యం నిజం కావాలి! ఈ వైరుధ్యానికి కారణం మొదటి వాక్యం రెండో వాక్యం గురించి చెప్పి, రెండో వాక్యం మళ్ళీ మొదటి వాక్యం గురించి వ్యతిరేక దిశలో చెప్పడం. దీని వల్ల ఏర్పడిన చిక్కుముడి. పరస్పర సూచకాలైన (అంటే referential) రెండు వాక్యాల మధ్య ఏర్పడిన తికమక ఇది.

అలాగే ఒకే వాక్యం తన గురించి తానే చెప్పుకొనేటప్పుడు కూడా ఇలాంటి తిరకాసు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ కింద వాక్యం చూడండి:

ఈ వాక్యం అబద్ధం.

ఈ పైనున్న వాక్యం నిజమా అబద్ధమా? నిజం అయ్యేమాటయితే, అది చెపుతున్న ప్రకారం ఆ వాక్యం అబద్ధం కావాలి. లేదూ అబద్ధమైతే, ఆ వాక్యం అబద్ధం కాదన్న మాట, అంటే నిజం అవుతుంది! అంచేత ఆ వాక్యం నిజమా అబద్ధమా అని నిర్ణయించడం అసంభవం. దానికి కారణం అందులోని అంతర్గత వైరుధ్యం. ఏటూ తేల్చలేని ఆ సందిగ్ధానికి అసలు కారణం మళ్ళా ఒక రకమైన ముడి. తన గురించి తాను చెప్పుకొనే లక్షణం నుంచి ఏర్పడ్ద చిక్కుముడి ఇది. దీనిని ఆత్మసూచన (Self-reference) అనవచ్చు. పైన యిచ్చిన రెండు వాక్యాలు కూడా ఒకరకంగా (పరస్పరం) ఆత్మసూచకాలే.

ఈ సెల్ఫ్-రిఫరెన్స్, వివిధ రంగాలలో ఎత్తే అవతారాలు ఎన్నెన్నో! తర్కం, గణితం, కళ, సాహిత్యం, తత్త్వం–ఇలా అనేక రంగాలలో ఇది చేసే విచిత్ర విన్యాసాలు, సృష్టించే చిత్రమైన చిక్కుముడులూ ఇన్నీ అన్నీ కావు. అది సృష్టించే మాయా ప్రపంచంలోకి కొన్ని నెలల ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది. ఇది నా గురించి, నాతో నేను, నాలోకి నేను చేస్తున్న ప్రయాణం. ఆసక్తిగల వాళ్ళందరికీ స్వాగతం. ఇది ఒక సాహస యాత్ర. అసలు ప్రయాణం వచ్చే నెల ఆరంభం!

అందాకా ఒక భేతాళ ప్రశ్న:

ఈ, ఇది, నేను, నా–మొదలైన సర్వనామాలు ఉపయోగించకుండా, తన గురించి తాను చెప్పుకొనే ఒక తెలుగు వాక్యాన్ని తయారు చేయగలరా? ప్రయత్నించండి!

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    నాగరాజు పప్పు November 5, 2018 12:17 pm

    kamesh – glad you picked this up. hopefully that 30 page reading list i prepared is going to be of some use 🙂

    ఈ, ఇది, నేను, నా–మొదలైన సర్వనామాలు ఉపయోగించకుండా, తన గురించి తాను చెప్పుకొనే ఒక తెలుగు వాక్యాన్ని తయారు చేయగలరా?

    “చివర్న క్రియాపదంతో అంతమయ్యేదే సూటైన తెలుగు వాక్యం”

    does this qualify?

  2. 2
    nagamurali November 6, 2018 1:16 am

    నాగరాజుగారు,

    “చివర్న క్రియాపదంతో అంతమయ్యేదే సూటైన తెలుగు వాక్యం”
    does this qualify?

    మీ హ్యుమర్ కి నమోవాకాలు.
    —

    ఈ, ఇది, నేను, నా–మొదలైన సర్వనామాలు ఉపయోగించకుండా, తన గురించి తాను చెప్పుకొనే ఒక తెలుగు వాక్యాన్ని తయారు చేయగలరా?

    చిన్నపిల్లలు, స్వామీజీలు తమను తాము ప్రథమ పురుషలో చెప్పుకోవడం నేనెరుగుదును.

    “స్వామికి చిన్నప్పుడే దైవ దర్శనం అయ్యింది” (అంటే తనకి అయ్యిందని. ఇటువంటి వాక్యాలు చిన్నప్పుడు సత్యసాయి బాబా ఇంటర్వ్యూల్లో చదివిన గుర్తు.)

    “అమ్ముపాప ఏమి చేసింది?” “అమ్ము పాప ఆమ్ము తినేసింది.”
    —

    చాలా మంచి వ్యాస పరంపర మొదలుపెట్టారు. డగ్లస్ హాఫ్స్టాడ్టర్ పుస్తకాల గురించి తప్పకుండా ఈ వ్యాసాలు స్పృశిస్తాయి అనే నా నమ్మకం. ఆయన వ్రాసిన I am a strange loop చదవడం నాకొక పెద్ద అనుభవం. అందుకు నాగరాజుగారికి ధన్యవాదాలు.

    తరువాయి భాగాలకోసం ఆసక్తితో ఎదురుచూస్తాను.

  3. 3
    Lalitha TS November 15, 2018 7:23 pm

    Interesting topic – మీ అసలు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

  4. 4
    రాం కిదాంబి November 28, 2018 5:13 am

    “చిన్న వాక్యాన్ని”

    ఇది (వాక్యం), తన గురించి తాను చెప్పుకుంటున్నది.
    ఏమంటారు?

  5. 5
    Tadepalli subrahmanyam July 15, 2020 11:44 am

    ఆహా! ప్రవచనాలు గాడిదలకు అర్ధమయినట్లుగా మనుష్యులకు అర్ధం కాలేదని యెంత బాగా చెప్పేరు స్వామి! భేష్ భేష్.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి
  • అర్థం కాని కవిత్వం
  • నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు
  • గడి నుడి – 11 సమాధానాలు, వివరణ.
  • నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ

ఇటువంటివే…

  1. నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన
  2. నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు
  3. నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం
  4. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం)
  5. ఆఖరి మనిషి

నవంబర్ 2018 సంచికలో ...

  • TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ
  • అడ్డగాడిద
  • ఆనందం
  • ఇరవై యేళ్ళ పైమాటే
  • ఏడు కవితలు
  • ఒక మరిచిపోలేని వాక్యం
  • ఒక్క క్షణమైనా నీలా…
  • కలుపుకొంటే కలుపుకొన్నంత
  • కాళీ పదములు 4
  • కేనాపారా
  • గడినుడి – 25
  • గాయకులుగా సంగీత దర్శకులు
  • చిత్తం
  • జీవనసంధ్య
  • తడిబల్ల – పొడిబల్ల
  • నవంబర్ 2018
  • నాకు నచ్చిన పద్యం: హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం
  • నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం!
  • పిలుపు
  • పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి
  • పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్
  • బురద
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 6
  • మాగ్నెట్
  • రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం
  • శిథిల రాజ్యం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 25
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కేనాపారా
నవంబర్ 2018

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.