ప్రచ్ఛన్నపరిణయము

ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో


దొమీనికో చిమరోసా

ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో (Il Matrimonio Segreto) అనునది జొవాన్ని బెర్తాతి (Giovanni Bertati) అను రచయిత ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు సుప్రసిద్ధ ఇటాలియను సంగీతకర్త యగు దొమీనికో చిమరోసా (Domenico Cimarosa) అను నతడు సంగీతరచన చేసిన సుప్రసిద్ధమైన సంగీతరూపకము (Opera). జార్జ్ కోల్మన్ (George Colman the Elder), డేవిడ్ గారిక్ (David Garrick) అను ఆంగ్లేయరచయితలు ఇంగ్లీషుభాషలో వ్రాసిన ది క్లాండస్టయిన్ మారేజ్ (The Clandestine Marriage) అను నాటకము నాధారముగా చేసికొని బెర్తాతి ఈ ఆపెరాను రచించియుండెను. ఇది ప్రప్రథమముగా వియన్నాలో క్రీ.శ.1792లో ప్రదర్శింపబడి అత్యంతప్రేక్షకాభిమానమునకు పాత్రమయ్యెను. ఆకాలములో ఆష్ట్రియా-హంగరీ సామ్రాజ్యమునకు చక్రవర్తియైన రెండవ లెపాల్డ్ (Leopold II) యావత్తు నాటకబృందమును తన ప్రాసాదమున కాహ్వానించి, వారికి అన్నపానాదిసంతర్పణము చేసి, వారిచే ప్రత్యేకముగా తన కుటుంబమునకీ ఆపెరాను ప్రదర్శింపజేసి, వారిని సత్కరించెను. చిమరోసా 80కి పైగా ఆపెరాలు వ్రాసినను, ఈకాలములో ఇదియొక్కటే తరచుగా ప్రదర్శింప బడుచున్నది. అంతేకాక అతడు వ్రాసిన అన్ని ఆపెరాలకును, ఇట్లే హాస్యరసాన్వితమైన ఇతివృత్తముతో ఇతరులు వ్రాసిన ఆపెరాలకును ఇది తలమానికమైనదని సంగీతపండితుల అభిప్రాయము. దీనికథ సంగ్రహముగా నిట్లున్నది.

కథాసంగ్రహము: ఇటలీదేశములో బొలోన్య (Bologna) అను నగరములో జెరోనిమో (Geronimo) అను ధనవంతుడున్నాడు. అతనికి ఎలిసెత్తా (Elisetta), కారొలీనా (Carolina) అను ఇద్దరు కూతురులును, ఫిదల్మా (Fidalma) అను చెల్లెలును, పావొలినో (Paolino) అను కార్యసహాయకుడును ఉన్నారు. జెరోనిమోకు తనకంటె ఉన్నతస్థాయిలో నున్న సామంతాదులవలె తనను కూడ అందఱు గౌరవించవలెనని, సామంతులతో వివాహసంబంధములు చేయవలెనని గాడమైన అభిలాష యున్నది. ఫిదల్మా మధ్యవయస్సులోనే ధనికుడైన తన భర్తను గోల్పోయి, తన ధనముతో గూడ జెరోనిమో ఇంటికి వచ్చి, తన ధనమును జెరోనిమో వ్యాపారములో మూలధనముగా పెట్టిబడి పెట్టి, అతని గృహమునకు యజమానురాలిగా బాధ్యత వహించినది.

పావొలినో, కారలీనాలు ప్రేమలోబడి రెండు నెలల క్రిందట రహస్యముగా వివాహము చేసికొన్నారు. ఉన్నతస్థాయి సంబంధములనే కోరుకొనుచున్న జెరోనిమోకు వారి వివాహవిషయము చెప్పుటకు వారికి ధైర్యము చాలలేదు. పైగా జెరోనిమో ముక్కోపి, చండశాసనుడు గూడ. అందుచేత పావొలినో ఒక ఉపాయమును పన్నినాడు. తనకు మిత్రుడును, సామంతుడును ఐన రాబిన్సన్ చేత ఎలిసెత్తాను అతడు పెండ్లాడునను ఒప్పందపుపత్రమును వ్రాయించి, ఆ లేఖను దెచ్చి జెరోనిమోకు ఇచ్చినాడు. ఇట్లు ఎలిసెత్తా పెండ్లియైన తర్వాత తమ వివాహమును బయల్పఱుచుట సులభముగా నుండునని అతని ఉద్దేశ్యము. కాని ఫిదల్మా కూడ లోలోపట పావొలినోను ప్రేమించుచున్నది. ఈవిషయము ఆమె మనసులోనే యున్నది, పావొలినోకు గాని, ఇతరులకుగాని ప్రకటితము గాలేదు.

కౌంట్ రాబిన్సన్ వచ్చినాడు. అతనికి ఎలిసెత్తా నచ్చలేదు. కాని కారలీనాపై అతని దృష్టి మళ్ళినది. కారలీనా అతనిని నిరాకరించినను తనకు వివాహమైనదని చెప్పలేక పోయినది. అందుచేత ఆమెయందు అతని అభిలాష ఇంకను అధికమైనది. ఇది గమనించిన ఎలిసెత్తా వారిర్వురు కలిసి తనను మోసము చేయుచున్నారని అనుమానించినది.

మాట తప్పకుండ ఎలిసెత్తాను పెండ్లావలెనని రాబిన్సన్‌ను జెరోనిమో నిర్బంధించినాడు. కాని అతడు ససేమిరా చేసికొననన్నాడు. ఐతే మధ్యేమార్గంగా ఇరువురి పరువులు నిల్పికొనుటకు మునుపు ఒప్పుకున్నదానిలో సగము వరకట్నమును మాత్రమే గ్రహించి కారలీనాను చేసికొంటానని జెరోనిమో ఒప్పుకొనునట్లుగా చేసినాడు. ఈవిషయమును తెలిసికొన్న పావొలినో తాను కారలీనాను పెండ్లి చేసికొన్న విషయమును ఫిదల్మా ద్వారా జెరోనిమోకు చెప్పించుట కామె నాశ్రయించినాడు. కాని ఈ విషయమును చెప్పక ముందే ఆమెయే తనను ప్రేమించుచున్నదని తెలిసికొని విభ్రాంతుడైనాడు. ఈసన్నివేశమును గమనించిన కారలీనా తనను వంచించుచుండెనని పావొలినోను తూలనాడినది. కాని అది నిజము కాదని పావొలినో ఆమెను ఒప్పించినాడు. ఈపరిస్థితులనుండి పూర్తిగా తప్పించుకొనుటకు వారిర్వురు తెలవారుజామున ఎవరికి తెలియకుండా ఇంటినుండి పాఱిపోవ నుద్యుక్తులైనారు.

తనకు పోటీగా కారలీనా పావొలినోను ప్రేమించుచున్నదని ఫిదల్మాకు అనుమానము గల్గినది. అట్లే తనను పెండ్లాడుటకు వచ్చిన సామంతుని కారలీనా తన వలలో వేసికొన్నదని ఎలిసెత్తా అనుమానించినది. ఈపీడలను తొలగించుకొనుటకై కారలీనాను సన్యాసినుల మఠానికి కొంతకాలం పంపడానికి నిర్ణయించి జెరోనిమోను దీని కొప్పించినారు. కారలీనా అట్లు చేయవలదని ప్రాధేయపడినా వారు వినలేదు. ఆనాటి రాత్రి కారలీనా తోబాటు పాఱిపోవుటకు పావొలినో ఆమె గదిలోనుండగా ఇతరులు వారిని పట్టుకొన్నారు. వారు రెండునెలలకు పూర్వమే ప్రేమవివాహము చేసికొన్నట్లు ఒప్పుకొన్నారు. జెరోనిమో ఆగ్రహోదగ్రుడై వారిని బహిష్కరింప నుద్యుక్తుడైనాడు. సామంతుడు కారలీనా పైగల స్వార్థప్రేమను నిస్స్వార్థముగా మార్చుకొని ఆమె ప్రచ్ఛన్నవివాహము నంగీకరించినచో తాను ఎలిసెత్తాను పెండ్లాడుదునని సంధి చేసినాడు. ఇర్వురు కన్యల వివాహములు వైభవముగా జరిగి కథ సుఖాంతమైనది.

ప్రస్తుతప్రయత్నము

ఇటలీభాషలోనున్న అత్యంతరసవత్తరమైన ఈరూపకముయొక్క ఆంగ్లానువాదమును ఆధారముగా చేసికొని, తెలుగులో దీనిని పునర్మించితిని. ఇది ఇంగ్లీషుప్రతికి అనుకరణయే కాని అనువాదము కాదు, మూలేతివృత్తా ధారముగా నిర్మింపబడిన స్వతంత్రరచన. మూలములో నున్న సన్నివేశములు, పాత్రల పేర్లు భారతసంస్కృతికి తగునట్లుగా మార్చబడినవి. కారలీనా, ఎలిసెత్తాలు మోహినీ పద్మినులుగాను, జెరోనిమో, ఫిదల్మాలు రత్నాకర మందాకినులు గాను, పావొలినో, కౌంట్ రాబిన్సన్‌లు సుబంధు, సామంత సరసవర్మలుగాను మారినారు. బొలోన్య శ్రీపురమైనది. మూలములోనున్న వరకట్నము ఇందులో కన్యాశుల్కముగా మార్చబడినది.

ఆపెరా అనునది సంగీతనాటకము. అందులో పొడిపొడిమాటలనుగూడ తాళయుక్తముగా పఠింతురు. నేను పొడిమాటలను విధిలేనిచోట క్వాచిత్కముగా వ్రాసితిని. ఇవియు సామాన్యముగా తాళమునకు సరిపడునట్లు జాగరూకత వహించితిని. ఇవి మినహాయించిన, ఇతరసంభాషణ లన్నియు పాడుట కనుకూలమును, వచనాత్మకసంభాషణమునకు చేరువగా గల తేటగీతి, ఆటవెలది, కందపద్యములలోను, మాత్రాచ్ఛందోబద్ధవాక్యములలోను వ్రాసితిని. భావము దీర్ఘముగా నున్న కొన్నితావులలో ఉత్పలమాలలను వాడితిని. పాటలను త్ర్యస్ర,మిశ్ర,ఖండ,చతురశ్ర గతులలో వ్రాసితిని. అన్వయోచ్చారణ సౌలభ్యమునకై కొన్నిచోట్ల విసంధి చేసితిని. ప్రప్రథమమున నేనిట్లే చేసిన ఇంతులందఱు నింతయే (Cosi Fan Tutte) ప్రయోగము తర్వాత ఇది నా రెండవ ప్రయోగము. నా దృష్టిలో వీనిని ఆధునికయక్షగానములుగా గ్రహింపవచ్చును.


పాత్రలు

సరసవర్మ: ఒక చిన్న సామంత ప్రభువు – 32 ఏండ్ల ప్రాయము వాఁడు
రత్నాకరుఁడు: ధనవంతుడైన రత్నవ్యాపారస్థుఁడు – 50 ఏండ్ల ప్రాయమువాఁడు
సుబంధుఁడు: సరసవర్మ స్నేహితుఁడు, రత్నాకరుని ఉద్యోగి – 30 ఏండ్ల ప్రాయమువాఁడు
మందాకిని: రత్నాకరుని చెల్లెలు – 40 ఏండ్ల ప్రాయముగలది. ధనవంతుడైన తన భర్త గతించిన పిదప తన ఆస్తిని రత్నాకరుని వ్యాపారములో మూలధనముగా నుంచి, అతని ఇంటికి యజమానురాలిగా బాధ్యత వహించుచున్న స్త్రీ.
పద్మిని: రత్నాకరుని పెద్దకూతురు – 26 ఏండ్ల ప్రాయము గలది
మోహిని: రత్నాకరుని చిన్నకూతురు – 24 ఏండ్ల ప్రాయము గలది, పద్మినికంటెను అందకత్తె.

(రెండు భాగములుగా నున్న ఈ ఆపెరాయొక్క చక్కనైన ప్రదర్శనను యూట్యూబ్‌లో చూడవచ్చును.
మొదటి భాగము, రెండవ భాగము)


మొదటిదృశ్యము

(శ్రీపురములో రత్నాకరుని యిల్లు. రత్నాకరుడు ప్రవేశించి పాడుచుండును.)

పల్లవి:
రత్నాకరుఁడను, ధనరత్నాకరుఁడను
రత్నాకరుఁడను, గుణరత్నాకరుఁడను
చరణం1:
రమ్యంబగు మణిరాజంబుల
వైడూర్యంబుల, వజ్రంబుల,
మాణిక్యంబుల, మౌక్తికముల
నన్నియు నమ్మెడి వ్యాపారిని
చరణం2:
హారములందున, అందెలయందున
కమ్మలయందున, కమనీయంబగు
అఖిలాభరణములందున మెఱిసెడి
వన్నియు నాకడఁ గొన్నవె కాదా?
చరణం3:
రాజులు, రాణుల రవణంబులలో
తారలరీతిగ తళతళలాడెడు
అరుదగు రత్నము లన్నియు నాకడ
కోరికమీరఁగఁ గొన్నవె కాదా?
చరణం4:
ధనవంతుఁడ మఱి గుణవంతుఁడనగు
నన్నును రాజాన్వయములఁ బుట్టిన
వారికి సమముగ భావించుచు సం
భావించుటయే భావ్యము గాదా?

(ఇంతలో మందాకిని ప్రవేశించును.)

రత్నాకరుఁడు:
ఏమి వార్తను దెచ్చితి విపుడు నీవు?
మందాకిని:
క్రొత్తదేమి లేదు కోరుచున్న దొకటె
ఎన్నినాళ్ళనుండొ నిన్ను నేను
రత్నాకరుఁడు:
పద్మినీపరిణయమా?
మందాకిని:
అది గాకింకేమిటి? నా
హృదయంబును చక్కగ గ్రహియించితి వన్నా!
అదనిది పద్మిని కొకస
ద్హృదయునితో నుద్వహంబు నింపుగ సలుపన్.

యౌవనభరమున పద్మిని
పూవుంగొమ్మంబలెఁ గడుపొల్పున నలరున్
వైవాహికబంధంబున
నో వరునకుఁ గూర్ప నామె నొప్పగు త్వరగన్

నాదు మిత్రులు, ధనమంత లేదు గాని
కలదు రూపంబు, గుణము, సంస్కారగరిమ;
అట్టివార లుత్తమకులమందుఁ బుట్టి
నట్టి వారు పద్మిని కరం బడుగుచుండ్రి

రత్నాకరుఁడు:
మందాకిని నీయోచన
సుందరమైనదె; వివాహశోభాన్వితయై
అందము లొల్కెడు పద్మిని
చందము గననెంతు నేను సైతం బైనన్.

ఉండిన చాలునె గుణమే?
ఉండఁగవలదా ధనమును నుచ్చస్థితియున్?
మెండుగ నివి యుంఁడగ, గుణ
మండితుఁడగు సద్వరునకె మత్సుత నిత్తున్.

సమమగు స్థితి గల్గినచో
క్రమముగ కల్యాణమైన కలహంబైనన్
సముపాదేయంబగు, నది
సమకూడని పెండ్లి యెట్లు సలుపఁగవచ్చున్?

ధనవంతుఁడ నగు నన్నును
ఘనులగు సామంతులందు గణుతింపవలెన్
ఘనుఁడగు సామంతుఁడె నా
తనయకు సరియైన వరుఁడు తర్కము లేలన్.

మందాకిని:
నాదుమిత్రుల కోర్కెను నీదుచెంత
విన్నవించితి నంతయే వేఱు కాదు;
నీవు గోరిన సామంతుఁడే వరింప
సందియంబేల? నేనును సంతసింతు.

రెండవదృశ్యము

సుబంధుఁడు:
నమ్మవె మోహిని! నవ్వుచు నిటుపై
సమ్మోదంబున జంకక జడియక
సంచరియించెడు సమయము వచ్చెను
మబ్బుల మాటున మఱుఁగగు వెన్నెల
మబ్బులు దొలఁగఁగ మంజుతరంబుగ

ప్రబ్బిలు కాలము రానే వచ్చెను
పొదలో పూచిన పూవటు చాటుగ
పరగిన మన పతిపత్నీత్వం బిక
సమ్మాన్యంబగు సమయము వచ్చెను

మోహిని:
నీమాటలు తేనియమూటలవలె
ఆమోదకరంబగుచుం దోఁచును
ఐనను మన రహస్యవివాహపు
వైనము నాకతిభయమును గూర్చును
సుబంధుఁడు:
నిరసింపవు గద నీవా పెండ్లిని?
మోహిని:
తలపఁగ నైనను దలఁపగఁ దగునా
కలనైనను ఆకరణిం బ్రియతమ?
సుబంధుఁడు:
జంకుల కొంకులనింక స్మరింపక
మన పరిణయ వేళను బూనినయటు
సంతోషంబున సంస్మిత మూనుము
మోహిని:
సంస్మితమున్నను శంకయు నున్నది
మన పరిణయమును జనకుఁడు మెచ్చున?
ఎని నాళ్ళాతని కెఱిఁగింపక యిటు
దాతుము మన యుద్వాహపుబంధము?
సుబంధుఁడు:
నమ్ముము ప్రియ! యీనాఁడే తొలఁగును
ఆతెర, ప్రకటితమగు మన బంధము
మోహిని:
చేయుము ప్రియ! యది శీఘ్రంబుగనే
ఈప్రచ్ఛన్నత యింకను సాగదు
ఇది నాజనకుని కెటులో తెలిసిన
ఆరంభంబగు ఘోరరణంబే

ఆఱడి కలుగును ఆప్తులచేతను
కావున నీవే కౌశలమేర్పడ
చల్లగ మెల్లగ సమయము నెఱిఁగి
ఆతని చెవికిది యంటింపుము

సుబంధుఁడు:
అటు సేయుటకే ఆయత్తుఁడనై
ఇట నుంటిని ప్రియ!
మోహిని:
ఇది వినఁగనె యతఁ డెత్తుగ నెగయును
పగిలెడు నిప్పుల పర్వతమట్లుగ
అది గని యలజడి నందకు మీవును
క్షణమాత్రమె యాతని క్రోధము
సుబంధుఁడు:
ఆతని ధోరణి యట్టిదె ప్రేయసి!
మోహిని:
పెనుతరఁగలతో వెఱపును గొల్పెడు
మున్నీటను తెలిముత్యములున్నటు
ఆతని హృదయపులోతులయందున
మధురప్రియతామార్దవ మున్నది
సుబంధుఁడు:
ఇదిగో ప్రియ! కనుమీ పత్రము
సామంతులతో సముఁడే తానని
సంబరపడు నీ జనకుని కియ్యది
సమధికసంతోషంబును గూర్చును

సామంతుండగు నా మిత్రుండిదె
కన్యాశుల్కము కాన్క లొసంగుచు
పరిణయమాడెద పద్మిని నంచును
వ్రాసెను పత్రము పరమాదరమున

మోహిని:
ఎంత యదృష్టము! ఇట కేతెంచున
సామంతుఁడు?
సుబంధుఁడు:
కనఁగా నీజనకుని, నీసోదరి
నేతెంచును నతఁడీ దినమందే;
నేనే కూర్చితి నీ సోదరి కీ
సంబంధం బిది సాగిన తోడనె
ప్రకటింపం దగు బంధుజనాళికి
గర్వముతో మన కల్యాణంబును

(ఇంతలో దూరమునుండి రత్నాకరుఁ డచ్చటికి వచ్చుచున్నట్లు చప్పుడులు వినపడును)

త్వరపడవలె నీ పత్రము నొసఁగి
ఘటియింపఁగ నిఁక కార్యము నేను.

మోహిని:
కనరాదు జనకుండు మనల నేకాంతముగ
చనఁగానువలె నేను సత్వరమె యిటనుండి

పాట

మోహిని:
నినుఁ బాసి చనలేను నిక్కముగఁ గాని
పెనుకష్ట మొనగూడు చనకున్ననేను
క్షణములే యుగములౌ నిను వీడి యున్న
కాని ప్రళయంబె కాలూను నీతోడ నున్న
సుబంధుఁడు:
పోకతప్పదు నీకు నాకౌఁగిలిని వీడి
రాకముందే యిటకు రత్నాకరుండు
మనల కౌఁగిటనిట్లు కనుగొన్న నాతండు
వినశించు నాక్షణమె మనయాశ లన్ని
మోహిని:
రానుండె ప్రళయంబె కానిపోవఁగ లేను
నేనొక్క క్షణమైన నీకౌఁగిలిం బాసి
క్షణములో సగమైన, సగమైన క్షణములో
సగమైన నిటులె నీసంశ్లేషమున నుందు

(ఇంతలో రత్నాకరుఁడు సమీపించుచున్నట్లు వినపడును. అదివిని మోహినీసుబంధులు సంభ్రమోద్వేగపూరితులౌదురు. సుబంధుఁ డీ క్రింది విధముగా మోహిని నోదార్చి వీడ్కొలుపును.)

సుబంధుఁడు:
కొలది యెడఁబాటునకుఁ గుందంగరాదు
బలపడును విరహంబువలన బంధంబు
కావునం జెలి ! నీకు కన్నీటివీడ్కోలు
నీవక్త్రమును మఱల నేఁజూచువఱకు.

(మోహిని నిష్క్రమించును. నేపథ్యములో తనయం దగౌరవము చూపగూడదని సేవకులకు రత్నాకరుఁడు శాసించు మాటలు వినపడును.)

రత్నాకరుఁడు:
నతశిరస్కులు గాక నడతురు
నాదుముంగిట రాజులంబలె
ఎఱుఁగరో ఈదేశమందున
ధరణినాథుల కరణి ధనికుల
గారవంబునఁ గాంచవలెనని
సుబంధుఁడు:
అరుదెంచుచున్నవాఁడదిగొ రత్నాకరుఁడు
తరుణమియ్యదె యతని కరుణ నార్జించుటకు
సనసన్నగాఁ బల్క వినఁజాలఁ డాతండు
స్వనమెచ్చఁగాఁ బల్కి స్పష్టముగ వచియించి
ఒనగూర్చుకొనఁ బోలు యుక్తిగా కార్యంబు

(రత్నాకరుఁడు రంగముపై కన్పించి, సుబంధుని చూచి)

రత్నాకరుఁడు:
సుబంధూ! సంగతులేమి?
సుబంధుఁడు:

(కొంచెం మెల్లగా)

సరసుండు సామంతుండు …

రత్నాకరుఁడు:

(చెవులు నిక్కించి వినుటకు యత్నించి)

సరసంబు లందువా సుబంధూ?

సుబంధుఁడు:
(పెద్దగా) సరసాలు కాదార్య! సరసుండు సామంతుండు.
రత్నాకరుఁడు:
సామంతుండా? సరసుండా?
సుబంధుఁడు:
ఔను. వినండి …
స్వామీ రత్నాకర! యిదె
సామంతవిభుండగు సరసాఖ్యుఁడు మీకున్
ప్రేమంబున లిఖియించిన
శ్రీమహితంబైన లేఖ, ప్రీతిం గొనుఁడీ!

రానుండెను సామంతుఁడు
మీ నిలయంబున స్వయముగ మిము దరిసింపన్
మానితముగ నాతని నా
హ్వానింపఁగ మీరలింకఁ ద్వరసేయవలెన్

రత్నాకరుఁడు:

(ఆలేఖను సుబంధుని హస్తమునుండి లాగికొని చదువును)

ఆహ, ఆహ! అద్భుతంబుగ నుండె ఆరంభమెంతొ!
ఓహొ, ఓహొ! మధురంబు, మధురంబు మధ్యభాగంబెంతొ!
ఈహి,ఈహి! శ్రీకరము, స్నేహదము చివరిభాగంబెంతొ।

సుబంధుఁడు:
ఆహ, ఓహొ, ఈహి! అంత అద్భుత మేముండె నార్య?
రత్నాకరుఁడు:
దూరముంటివేమి? చేరవచ్చి సుబంధు
కౌఁగిలించుకొనుము కౌతుకమున
నీదుపూన్కిచేతనే యిది సమకూడె
సాధు! ధన్యవాదశతము నీకు
సుబంధుఁడు:
చిన్నవిషయమొకటి….

(వీలైనచో తన వివాహమునుగుఱించి చెప్పఁబూని వినయముతో ననును)

రత్నాకరుఁడు:
చిన్నవిషయంబు కాదు; యాచించుచుండె
మాన్యసామంతవర్యుండు మత్తనూజ
పద్మినీకరము నిపుడు; పట్టె నేఁడు
రాణి యగు భాగ్య మామెకుం బ్రాజ్యముగను

రాణియై యిట్లు పద్మిని రంజిలఁగనె
భాగ్యవంతుని మండలేశ్వరుని నొకని
వెదకి తెచ్చెద మోహినిం బ్రియము మీర
పరిణయంబాడ రాడ్వైభవంబుతోడ.

సుబంధుఁడు:
(తనలో)
హతవిధీ! అనుకున్న దొకటి, అగుచున్నదొకటి

(అని విచారవదనుం డగును)

రత్నాకరుఁడు:
వంత యేదొ కన్పించు నీవదనమందు
చేదుగాఁ దోఁచెనొ సుబంధు! నాదుమాట?
సుబంధుఁడు:
నాకూ మీకూ… లేదు లేదు

(‘నాకూ మీకూతురు మోహినితో …’ అనఁబోయి భయముతో మధ్యలో మాట మార్చును)

రత్నాకరుఁడు:
నాకూ, మీకూ… ఏమనుచున్నావు?
సుబంధుఁడు:
నాకూ మీకూతురు పెండ్లి ఆనందకరంగా ఉంది

(అని మాటను మార్చి ప్రస్తుతాంశమునకును, తనస్థితికిని వర్తించునట్లుగా పల్కును. కాని రత్నాకరుఁడు దానిని ప్రస్తుతాంశమునకే అన్వయించుకొని ఇట్లనును.)

రత్నాకరుఁడు:
ఐన పోవోయి నీవింక నరుగుదెంచు
మాన్యసామంతవరుని సమ్మానమునకు
లోటు లేకుండ సర్వమేర్పాటు చేసి
వైభవంబున నాతని స్వాగతింప
సుబంధుఁడు:
అవశ్యముగ

(సుబంధుఁడు నిష్క్రమించును)

రత్నాకరుఁడు:
అడుగకుండనె తానె యై అరుగుదెంచె
భాగ్యరమ మత్పురాపుణ్యఫలము కతన
పంచుకొందును నాకుటుంబంబుతోడ
ఈ యదృష్టఫలంబును నీక్షణంబ

పద్మినీ! మోహినీ! మందాకినీ!
సేవకులారా! సేవికలారా!
రండి! రండి! వినండి! వినండి!

(ఉత్సాహముతో బిగ్గరగాఁ బిలుచును)

మోహిని:
ఎందుకీ పిలుపు నాన్నా?
మందాకిని:
ఏమైన దన్నా?
పద్మిని:
ఈకోలాహల మెందుకు నాన్నా?
రత్నాకరుఁడు:
రండి! మూగండి నాముందు రయముగాను
అద్భుతంబును కర్ణపేయంబు నగుచు
నింపుగొల్పెడు వార్త విన్పింపనుంటి
(పద్మినితో)
పద్మినీ! నీదు భాగ్యంబు పండె నేఁడు

క్షాత్రకులశేఖరుండును సద్గుణుండు
సరసుఁడను ఱేఁడు నేఁడె నీకరముగోరి
వచ్చుచున్నాఁడు; క్షాత్రగర్వంబుమీర
తనరుదువు నీవు రాజ్ఞీపదంబునంది.

నీదు కనుసన్న లానలై నిత్యముగను
సేవలందించుచుండ దాసీజనంబు
వైభవంబుగ ప్రాసాదవరములందు
జీవితము బుత్తువిఁక నీవు సేమముగను

ఇట్లు సామంతుఁ డల్లుఁడై యింటనుండ
మనము వీడెద మింక సామాన్యపదము
రాజవర్గములందు గౌరవముతోడ
ఉన్నతంబగు పదమంది యుందు మింక
(మందాకినితో)
మందాకిని! యేమందువు?

(పద్మినితో)

పద్మిని! నీవేమందువు?

(మందాకినీ పద్మినులు గర్వపూరితమైన భావమును ప్రదర్శింతురు)

(అందఱితో)
ఈబాంధవ్యంబున కీవైభవమునకు
కారణ మీరత్నాకరుఁడే
కారణ మీ రత్నాకరుఁడే!
సమయంబిది సంతోషంబున
స్వాగతమొసఁగఁగ సామంతునకు
సమయంబిది, సమయంబిది!

(ఆ ఉత్సాహమునకు విముఖురాలైన మోహిని ముఖమును పరిశీలించి ఇట్లనును)

మొగుడుపద్మమువోలె నీముఖ మదేల
చిన్నబోయెను మోహిని! చెన్ను దఱిగి?
ఈర్ష్యయో అసంతృప్తియో యేదొ నిన్నుఁ
గలఁచుచున్నట్లు నీమోము దెలుపుచుండె

చింతసేయవలదు చిన్నారి నాతల్లి!
నీకుసైతమొక్క నృపకులేంద్రు
సుగుణసాంద్రుఁ జూచి శుభవివాహముఁ జేతు
నీదుమదిని ముదము నిండఁ జూతు
(సేవకులతో)
త్వరపడుడిఁక మన భవనమునెల్లను
రాజోచితమగు ప్రాసాదంబుగఁ దీర్చుఁడు
ఇంటికిముందును ఇంటికి వెనుకను
గల తోటల, బాటల నీటుగ దీర్చుఁడు
(కుటుంబముతో)
ఆహా! నాభాగ్యము! నా పద్మిని
రాణీ యని గౌరవముగఁ బిలువంబడు;
తడబడుమాటల తాతా యనుచును
ప్రాకుదురొడిలో రాచనిసుంగులు

ఆనందంబున అంబరమంటుచు
ఆసామంతుని ఆహ్వానింపఁగ
సన్నద్ధంబగు సమయంబిది
సంబరపడియెడు సమయంబిది

(రత్నాకరుఁడు, సేవకులు నిష్క్రమింతురు)

మూఁడవదృశ్యము

(పద్మిని అప్పుడే తాను రాణి నైనట్లు గర్వముతో పల్కును. మోహిని ఆమెను చులకన చేయుచు ఆటపట్టించును)

పద్మిని:
నీకు మున్నుగ నే జనించితి
నన్న విషయము నాత్మ నెంచుము
చిలిపిచేష్టలు చికిలిచూపులు
మాని నన్నిఁక రాణికిం దగు
గారవంబునఁ గాంచు మింకను
మోహిని:
పూని మ్రొక్కక రాణిగారికి
జేసియుంటిన చెడ్డనేరము?
మనవిసేతును మహారాణికి
నేరమును మన్నింపుమంచును
పద్మిని:
మానుమీయవమానవాక్కులు
మానుమిఁక నీమడ్డిమాటలు
నేను రాణిని, నీవొ యేమియు
లేనిదానివి, లేకిదానివి
మోహిని:
నీదుగర్వము నిశ్చయంబుగ
నాకుఁ గూర్చును నవ్వు మెండుగ
హాహ హీహీ! హాహ హీహిహి!
హాహ హీహీ! హాహ హీహిహి!
నీదు గర్వమె నీదు రాజ్యము
నీదు డంబమె నీకిరీటము
హాహ హీహీ! హాహ హీహిహి!
హాహ హీహీ! హాహ హీహిహి!
మందాకిని:
ఒక్కతల్లికి నొక్కతండ్రికి
జననమందిన చానలిర్వురు
గర్వమేటికి? కలహమేటికి
మెలఁగలేరా మిత్రులట్టుల?
పద్మిని:
నాదుతప్పిద మేది యిందున?
పెద్దదానిని, పెద్దయింటికి
రాణియై చనుదాని నించుక
గారవించుట గాదె మంచిది?
మోహిని:
ఆమె భాగ్యము నామెపదవిని
ఒక్కయింతయు లెక్కసేయను
కాని గర్వము మాని యించుక
మనిషిచందము మసలుమందును
పద్మిని:
నీదుమనసున నిండె నీర్ష్యయె
అందుచే నిట్లనుచునుంటివి
మోహిని:
లేడు వరుఁడును, లేదు పెండ్లియు
రాణినంచును రభస చేతువు
ఇట్టిరాణుల వట్టిమాటల
కెట్టి యీర్ష్యయుఁ బుట్టనేరదు.
మందాకిని:
ఇర్వురిర్వురె, యింక యుద్ధము
మాని శాంతముఁ బూని యుండుఁడు
కవుంగిలిలోఁ గలహమెల్లను
కరగఁజేయుఁడు, కనుఁడు స్నేహము

(అనిష్టముగా నైనను ఇద్దఱు కౌఁగిలించుకొని శాంతించుదురు. మోహిని ఉద్రేకముతో నిష్క్రమించును.)

మందాకిని:
ఆటపట్టించుచుండెనిన్నామె యంతె
కాని నీయందు వైరంబు గలది కాదు;
ఐన పెండ్లియై నీవుందు వామెనుండి
దూరముగ, నుండదిఁక నామె పోరు నీకు

అంకురితమయి యుండె నాయందుఁ గూడ
హృద్యమగు రహస్యప్రణయేచ్ఛ యొకటి
దీని చూచాయగా నీకుఁ దెలుపుచుంటి
ఈరహస్యంబు బయటివా రెఱుఁగరాదు

పద్మిని:
నీరహస్యంబు నెవరికి నేను జెప్ప
దాఁచుకొందును నాలోనె ధనమువోలె
అంకురించెన తిరిగి పెండ్లాడు కోర్కె?
మందాకిని:
అంకురించిన యాశ్చర్య మందనేమి?
ధనికురాలను, నింక యౌవనపుశోభ
తరుగకున్నదానను నన్ను పరిణయమ్ము
నాడఁ గోరెడు పురుషులుగూడ లేరె?
పద్మిని:
ఆతఁ డెవ్వాడొ నేనరయంగ గలన?
మందాకిని:
అది రహస్యంబు
పద్మిని:
యౌవనుండా యతఁడు? అందగాడా యతఁడు?
మందాకిని:

(ఆప్రశ్నకు ప్రియునిరూపు మనసులో మెదలగా నుబ్బిపోవుచు, తనలో నిట్లనుకొనును)

ఆతఁడు సుబంధుఁడని చెప్పివైతునేమొ
నిబ్బరించుకొనవలె నా యుబ్బుపాటు
(ప్రకాశముగ) అన్నియున్నవాఁడె.

పద్మిని:
రాజన్యుఁడా యతఁడు? రాజబంధువా యతఁడు?
మందాకిని:
అందఱము రాణులము కాలేము

పాట

చరణం1:
ప్రియముగ నన్నలరించెడు నన్నయు
స్వయమగు కూతులవలె ననుఁ గను
కోడండ్రును గల్గుదురిటఁ గానీ
వీరలు చూపెడు ప్రేమలకంటెను
పత్యనురాగమె బహుళ ప్రశస్తము
చరణం2:
నాకనుసన్నల నందఱు నడచుచు
నను నమ్ముచు పూర్ణంబుగ నుంచిరి
నాపై యింటిని నడపెడి బాధ్యత
కానీ ఈయధికారముకంటెను
ధవుకౌఁగిటిబంధనమే శ్రేయము
చరణం3:
పొలఁతికి స్వేచ్ఛాపూర్ణతకంటెను
చెలువుని కౌఁగిటిచెఱయే కామ్యము
త్వరలో పద్మిని! పరిణయవశమున
ఈవిషయంబునె నీవును గందువు
కని తలఁతువు మఱిమఱి నా మాటలు

నాల్గవదృశ్యము

(రత్నాకరుఁడు, మోహిని ప్రవేశింతురు. మోహిని విచారగ్రస్తయై యుండును)

రత్నాకరుఁడు:
సామంతునకున్ స్వాగతమీయఁగ
సన్నద్ధులమై సంతోషంబుగ
నుండఁగవలె నిఁక నుల్లాసంబును
పూనుము నీముఖమున మోహిని!
మోహిని:
తాల్చఁగవలెనా దరహాసంబును
నామనసందున లేకున్నను?
రత్నాకరుఁడు:
చింతింపఁగవల దింతయు మోహిని!
అక్కకుఁ బెండిలి యయ్యెనొ లేదో
నీవంతును రానేవచ్చును గద!
మోహిని:
(తనలో)
జారుచునున్నది, దిగ
జారుచునున్నది నాస్థితి
నా ప్రచ్ఛన్నతయును
నా మౌనంబును శోకము
నాకుం గూర్చుచు నున్నవి;
ఎందుంటివొ నీవు సుబంధూ!
ఇపుడే నీ యవసర మయ్యెను
రత్నాకరుఁడు:
ఏదీ! చిందింపు మొక్క చిరునవ్వు నాకొఱకు …
సుబంధుఁడు:
(ప్రవేశించి)
వచ్చియున్నాడు సామంతవర్యుఁడిపుడు
త్వరపడుం డింక నాతని స్వాగతింప
రత్నాకరుఁడు:
(మోహినితో)
తర్వాతఁ జేత మీభాషణము

(అందఱును సామంతునికి స్వాగతమిచ్చుటకై అటనుండి నిష్క్రమింతురు)