1957లో అనుకుంటాను, ఒక రోజున మా ఇంటి ముందు ఓ రిక్షా ఆగింది (అప్పట్లో అవి మనుషులు తొక్కే సైకిల్ రిక్షాలు). అందులోంచి సన్నని గ్లాస్గో పంచె కట్టుకుని, అంతే సన్నని తెల్ల లాల్చీ తొడుక్కుని, ఒక సుకుమారమైన మనిషి దిగి, “నారాయణరావుగారంటే మీరేనా? నాపేరు బాలగంగాధర తిలక్. మీతో మాట్లాడదామని వచ్చాను” అన్నాడు.
నేను నివ్వెర పోయాను. మనిషినెప్పుడూ చూడలేదు గానీ, బాలగంగాధర తిలక్ నాకు చాలా ఇష్టమైన కవి. నేను అతని మాటల పొందికనీ, సమాసాల కూర్పునీ, మనసు లోపల పొరల్లోకి చొచ్చుకుని వెళ్ళే అతని అందమైన ఊహల్నీ – అన్నిటికన్నా కవిత్వం మీద అతనికున్న స్పష్టమైన, ధైర్యవంతమైన నమ్మకాన్నీ తలుచుకుని తలుచుకుని ఉప్పొంగిపోతూ ఉండేవాణ్ణి. అలాంటి బాలగంగాధర తిలక్ తిన్నగా మాయింటికి వచ్చేస్తాడని నేను ఊహించలేదు.
నా ఉబ్బితబ్బిబ్బులోంచి నేనింకా తేరుకోక ముందే, అలా వచ్చిన మనిషి కుర్చీలో కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టాడు. నేనూ అంతే మామూలుగా అతని కబుర్లలో కలిసిపోయాను. మేమిద్దరం అంతకు ముందునుంచీ చాలాకాలంగా ఎరిగున్న స్నేహితుల్లా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం. గంటలు గడిచిపోతున్నాయి. కవిత్వాన్ని గురించీ, సాహిత్యాన్ని గురించీ, అప్పుడు రాస్తున్నవాళ్ళ మంచిచెడ్డల్ని గురించీ, ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఒడుపు ఎంత బాగుందో ఒకరికొకరు ఎంతో ఇష్టంతో ఊహలు కలబోసుకుంటున్నాం. అతను చాలా పెద్ద కవి అని నా గుర్తులో లేదు. నేను చాలా చిన్నవాణ్ణని ఆయన అనుకున్నట్టూ లేదు. అలా మాకు తెలియకుండా కాలం గడిచిపోతూంటే, వీధిలో ఉన్న రిక్షావాడు నాకు కనిపించాడు. అతనికి డబ్బిచ్చి పంపేయలేదే, ఏమిటా అని ఆశ్చర్యపోయాను నేను. అప్పుడు చెప్పాడు తిలక్, రిక్షా అక్కడే ఉండాలని, “లేకపోతే నాకు భయం, నడవాల్సొస్తుందేమోనని. ఏం ఫర్వాలేదు లెండి. ఉంటాడు.”
తిలక్‌ని తల్చుకోగానే నాకు జ్ఞాపకం వచ్చేవి రెండు – కవిత్వంలో ఆయనకున్న ధైర్యం, నిబ్బరం. జీవితంలో ఆయన నిస్సహాయత, భయం. ఈ రెండూ సమానంగా పెరుగుతూ వచ్చాయి తిలక్‌లో నేనెరిగున్నన్నాళ్ళూ. వ్యక్తులుగా తిలక్, నేనూ ఆయన జీవితపు చివరి దశాబ్దంలో బాగా స్నేహితులమయ్యాం. ఆయన తణుకునించీ తరుచు ఏలూరు వచ్చేవాడు. తణుకులో ఆయన తమ్ముడు, దేవరకొండ శివకుమార శాస్త్రిగారు పేరున్న లాయరు. ఆయన ఇంటికి, తిలక్, ఆయన భార్య ఇద్దరూ వచ్చేవారు. తిలక్ ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేసేవాడు కాదు. నడిచి వెళ్ళేవాడు కాదు ఆఖరికి పట్టుమని ఫర్లాంగు దూరమైనా. నేను అంత తరుచుగా కాదుగానీ అప్పుడప్పుడు తణుకు వెళ్ళేవాణ్ణి, ఆయన కోసం. ఈ మానసిక ఆందోళన, భయంలేని ఆరోగ్యవంతమైన రోజులు తిలక్ జీవితంలో చాలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో తిలక్‌ని నేనెరగను.
తిలక్ రాయడం మొదలుపెట్టిన రోజుల్లో (ఆయన మొదటి పద్యం 1941లో రాశాడు) భావకవిత్వం వెనకబట్టి, శ్రీశ్రీ ప్రభావం బలపడుతోంది ముఖ్యంగా యువకుల్లో. కవులు లోకంలో జరిగే అన్యాయాలను పట్టించుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా ఒక ప్రత్యేక తరహా న్యాయంకోసం తమ కవిత్వపు గొంతుకతో పోరాడాలని, ఒక కొత్త అభిప్రాయం బలపడడం మొదలైంది. కవిత్వం త్రికాలాబాధితమనీ, రసానందమే దాని పరమావధి అనీ అలంకారశాస్త్రంలో చెప్పిన మాటలు పాతబడి చాలా కాలమయింది. దాంతోబాటు, భావకవిత్వపు రోజుల్లో బలపడిన ఊహలు కూడా నీరసపడడం మొదలైంది. ప్రేయసీ, వెన్నెలా, మలయానిలమూ, మల్లెపువ్వులూ వేళాకోళపు మాటలయ్యాయి. భావకవి అభావకవి అయ్యాడు. విప్లవమూ, వర్గపోరాటమూ, ఎర్ర జెండా కొత్త కవితా వస్తువులయ్యాయి. యువకులందరూ ధైర్యంగా శ్రీశ్రీ కవితా, ఓ కవితా చదివి సొమ్మసిల్లి పోతున్నారు. శ్రీశ్రీ కవిత్వం అప్పటికింకా అచ్చు కాకపోయినా చాలా మంది జేబుల్లో రాతప్రతులుగా, చాలా మంది నోళ్ళల్లో గీతప్రతులుగా చలామణీ అవుతోంది. ముందుకు కుచ్చిళ్ళు వదిలేసి, బెంగాలీ కట్టు గ్లాస్గో పంచెలు, సిల్కు లాల్చీలు, గిరజాలు కవికి గుర్తులవడం తగ్గి, పంట్లాలూ చొక్కాలూ తొడుక్కున్న కవులు సభల్లో కనిపిస్తున్నారు.
అలాంటి దశలో వచ్చాడు తిలక్.
నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
ఈ పద్యం చాలామందిని ఆపి, అల్లరిపెట్టింది. ఇందులో తరవాత రెండు చరణాలు ఇటు కొంచెం భావకవిత్వం వైపు, అటు కొంచెం శ్రీశ్రీ కవిత్వం వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తాయి. జాగ్రత్తగా చూస్తే నిజానికవి రెండూ కావు.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్రలోకపు మణిస్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు.
కవిత్వంలా కనిపించడానికి ప్రయత్నిస్తున్న ఈ మాటల వెనకాతల, తిలక్‌లో గాఢంగా నాటుకుని ఉండి రూపొందుతున్న ఒక తీవ్రత ఉంది. మనిషి తన జీవితంలో ప్రపంచాన్ని ఆనందించడానికి పడే తపన అక్కడితో ఆగిపోకుండా, ఈ పద్యంలో ఉన్న చివరి మూడు పంక్తులూ నన్ను కట్టి పడేశాయి.
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
ఆఖరి చరణం దాకా మామూలుగా అప్పటి పద్యాలలో అలవాటైన మాటల కూర్పులే సున్నితంగా కనిపిస్తాయి. అయితే అందులో ఒక ఒడుపుంది, పంక్తికొక తూగుంది. మొత్తం మీద పద్యం శక్తిమంతంగా చేసే నేర్పుంది. కానీ అకస్మాత్తుగా ఆఖరి చరణం చిన్న మాటల్లో మామూలు వాడుకలోని తెలుగులో ఏ ఆర్భాటమూ లేకుండా అంతకు ముందు పద్యంలో ఉన్న ఆర్భాటాన్ని అకస్మాత్తుగా చల్లారుస్తూ మనం ఊహించని మామూలు తనంతో కనిపించే సరికి, పద్యం ఒక్కసారి అపూర్వమైన ప్రాణం పోసుకుంటుంది. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనే మాట తిలక్‌లో అంతకు ముందు ఎవరికీ లేని, ఆ తరవాత ఎవరికీ అబ్బని ఒక అసాధారణమైన, సాధారణ శబ్దశక్తిని ప్రపంచించింది. ఆ ఒక్క పంక్తీ ఇతను నిజంగా కవి అని నాకు గుర్తుకు తెచ్చింది.
ఈ పద్యంలో తిలక్ తన కవిత్వాన్ని గురించే కాకుండా అసలు కవిత్వాన్ని గురించి చెప్పాడు. రాజకీయాల అలజడిలో, ఉద్యమాల ఉత్సాహంలో ఉపన్యాసానికీ కవిత్వానికీ మధ్య తేడా చెరిగిపోవడం మొదలైన రోజుల్లో వచ్చిన ఈ పద్యం చాలామందికి ప్రాణం పోసింది. ఇంకా చాలామందికి కోపం తెప్పించింది.