మారుపేర్ల మాయువు

మాయువు అంటే పైత్యం.

పెట్టిన పేరు వదిలిపెట్టి మారుపేరు ఎందుకు వాడుతారు? ఇక్కడ వాడుతారు అనడానికి బదులు వాడుతాము? అనడం సబబు. చారులు, చోరులు, మాఫియా మనుషులు, మోసగాళ్ళూ మారుపేర్లు వాడుకోవటం మామూలు, అవసరం కూడాను.

కాని, రచయితలు మారుపేర్లు ఎందుకు వాడుతారు? ఆరా తీస్తే రకరకాల కారణాలు కనపడతాయి.

అమ్మా నాన్నలు పెట్టిన పేరు పలకలేనిది గాను, ఎబ్బెట్టుగానూ ఉన్నదనిపించడం, ఒక కారణం. పోతే, అప్పారావు, నారాయణరావు, రామారావు, సుబ్బారావు, వెంకటేశ్వరరావు లాంటి పేర్లు చాలా సాధారణమైన పేర్లు. మాకాలంలో తెలుగునాట ఈ పేర్లలో ఒకటైనా ప్రతి ఇంట్లోనూ మామూలే! ఇప్పటి రోజులు వేరనుకోండి. మా స్నేహితుడొకడు బంగాలీ సినిమాల వ్యామోహంలో పడి, వాడి కూతురికి నిర్జన సైకతే అని నామకరణం చేసాడు. ఇది కాస్త విపరీతమే!

ఆల్లెన్‌ స్టువర్ట్ కోనిగ్స్‌బర్గ్‌ పలకటం కష్టమై కాబోలు, ఆ పేరు వుడీ ఆల్లెన్ గా (Woody Allen) మారింది. సినిమాల వాడిగాను, రచయితగానూ ఆ పేరే సార్థకమయ్యింది. అంతకన్నా మంచి ఉదాహరణ, జోజెఫ్ తియదోర్‌ నలీజ్ కోన్రాడ్ కార్జెనియోవిస్కి పలకడమేకాదు, స్పెల్లింగ్‌ చెప్పడం కూడా కష్టమే. ఆయన జోసెఫ్ కాన్రాడ్ గా (Joseph Conrad) ప్రసిద్ధి చెందాడు. అలాగే మోలియర్‌, వోల్తేర్‌, విర్గిల్ వగైరా! తెలుగులో పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ గా ప్రఖ్యాతకవిగా గణుతికెక్కడం కారణం కావచ్చు; చాలామందికి మారుపేరు చివర శ్రీ తగిలించుకోవడం ప్రబలిందనుకుంటాను. ఉషశ్రీ, మంజుశ్రీ, విజయశ్రీ, ఇంకా ఇంకా! అయితే కొంతమంది తమ అసలు పేరు రాసుకొని, బ్రాకెట్లలో కలంపేరు రాసుకోవడం కూడా పరిపాటయ్యింది.

ఒక గొప్ప కవిగారి పేరు, మీపేరూ అనుకోకండా ఒకటే అయితే ప్రమాదమే! శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రపంచప్రసిద్ధి పొందితే, శ్రీభాష్యం శ్రీనివాసులు, ఏదైనా అడపా తడపా రాసి ఏ పత్రికకన్నా శ్రీశ్రీ అన్న పేరుతో పంపిస్తే, మందలించని సంపాదకుడు ఒక్కడూ ఉండడనుకుంటాను. అప్పుడు ఆయన శ్రీభాశ్రీ అనో మరేదో మారుపేరు పెట్టుకోవాలి, అసలు మారుపేరు ఎందుకు పెట్టుకోవాలీ అన్న ప్రశ్న తట్టకపోతే! చెట్టు ఇస్మయిల్ తానూ వేరు సుమా అని చెప్పడానికి కాబోలు, ఏలూరు ఇస్మయిల్ స్మయిల్ గా మారాడు!

చిన్నప్పుడు శ్రీశ్రీ మైకంలో పడి నేనూ ‘వేవే’ అని కథలూ కాకరకాయలు రాసిపారేద్దామన్న విపరీతమైన ఉబలాటం ఉండేది. ఆ కోరికకి పురిట్లోనే సంధి కొట్టింది, మాతెలుగు మేష్టారి దయవల్ల. మిత్రుడు వేమూరి వేంకటేశ్వరరావుకి అటువంటి పైత్యపు లక్షణాలు ఏవీ లేకపోబట్టే మంచి రచయిత అయి కూర్చున్నాడు!

చాలాకాలం క్రిందట పాశ్చాత్య దేశాల్లో స్త్రీ రచయితలని ప్రచురణ సంస్థలు ప్రోత్సహించేవి కావు. అందుకని మేరీ యాన్‌ ఎవాన్స్ (Mary Ann Evans)‌ జార్జ్ ఎలియట్ గా రచనలు చేసింది. బ్రాన్‌టీ అక్కచెళ్ళెళ్ళు (Bronte sisters) ముగ్గురూ ఎల్లిస్‌ బెల్‌, కర్రెర్‌ బెల్‌, యాక్టన్‌ బెల్‌ అన్న మారుపేర్లతో రాసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రమాదం లేదనుకుంటాను. ఇప్పుడు, తెలుగునాట మగ రచయితలు ఆడవారి పేర్లతో రాసి ప్రచురించుకోవడం పెరిగిందని ఒక పాత్రికేయుడు చెప్పంగా విన్నాను.

ఈరోజుల్లో పాశ్చాత్య దేశాల్లో పత్రికా సంపాదకులు మారుపేరుల్లో వచ్చే రచనలుగాని, ఉత్తరాలుగానీ సహించరు. ఒకవేళ వివాదాస్పదమైన రచనైతే, మారుపేరుతో ప్రచురించినా, అసలు పేరు ఎడ్రసూ వగైరా పత్రికకి చెప్పితీరాలి. ఎందుకంటే, మనం రాసింది మనమే రుజువు చేసుకోలేకపోతే, ఆ తరువాత కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది.

మారుపేరులతో రాయడానికి మరో కారణం: తన విద్యా పరిధిలో లేని విషయంపై రాసేటప్పుడు ఒక్కొక్క సారి మారుపేరు వాడుకోవడం స్వతహాగా మామూలే – కానీ, అసలు పేరు ప్రచురణ కర్తకి తెలియాలి. మరింకో కారణం: పరిచయం ఉన్న వ్యక్తి పై వివాదానికి దారితీసే వ్యాసమో, ఉత్తరమో రాయవలసి రావచ్చు. ఆ వ్యక్తికి అసలు పేరు తెలియకూడదని ఆశించడం సహజం. ఇక్కడ కూడా పత్రికల వారికి అసలు గుట్టు చెప్పకపోతే ప్రచురణ సాధ్యం కాదు. అలాగే, సాధారణంగా ఒక ప్రఖ్యాత పత్రికకి రాస్తున్నామనుకోండి. మరొక పోటీ పత్రికకి డబ్బులకోసం రాయడానికి మనసు పుట్టచ్చు. అప్పుడు మరోపేరుతో రాయడం తప్పుకాదు. అప్పుడు కూడా, ఆ పోటీ పత్రికకి అసలు రంగు చెప్పుకోవడం, లేదా ఆ పత్రికకి ఆ మారుపేరే సార్థకనామంగా వాడుకోవడం ఇక్కడ పరిపాటే. మరింకో ఇంకో కారణం: ఒక ప్రఖ్యాత కవి ఉన్నారనుకోండి. లైంగిక పరమైన సాహిత్యానికి మంచి గిరాకీ ఉంది. ఆ రచనలకి డబ్బులు బాగా గిడతాయి. అందుకని, ఆ కవి అటువంటి సాహిత్యం మరోపేరుతో రాయడం సంభవించవచ్చు. ఇందులో తప్పేమీలేదనుకుంటాను.

ఇంటర్నెట్లో పత్రికలు ముమ్మరంగా రావడంతో, రచనా వ్యాసంగం పెరిగింది. తెలుగులో కూడా రచయితలు పెరిగారు. అంతకన్నా ముఖ్యంగా, మా స్వానుభవంలో చూస్తున్నాం; ఉత్తరాలు, వ్యాఖ్యలూ రాసే వారి సంఖ్య బాగా పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో బ్లాగుల సాహిత్యం పెరిగిన తరువాత రకరకాల మారుపేర్లు ప్రబలంగా కనిపిస్తున్నాయి. నేను పైన చెప్పిన ఏ కారణాలూ ఈ మారుపేర్లతో (పోనీ కలం పేర్లు అని అందాం!) రాసేవారికి పట్టవేమో అన్న అనుమానం వస్తున్నది. ముఖ్యంగా ఒక వ్యక్తి రాసిన కథనో, కవితనో, వ్యాసాన్నో నిర్హేతుకంగా తూలనాడటానికి ఈ పేర్లు పుట్టగొడుగుల్లా పుడుతూ ఉన్నాయి. ఇది గర్హించవలసిన విషయం.

ఆ మారుపేర్లు కూడా క్షణాక్షణికంగా మారడం చూస్తున్నాం. కొత్తపేట కిషన్, చిలకల పూడి చిన్నమ్మ, కొప్పాక కోటిగాడు లాంటి పేర్లతో ఉత్తరాలు రాయడం కూడా చూస్తున్నాము. ఇది తప్పని అనటల్లేదు. పిల్లలమర్రి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలుసా (తెలుగు సాహిత్యం గ్రూపు) నడిచిన రోజుల్లో చాలా మంది కలంపేర్లతో పోస్టులు పంపేవాళ్ళు. ఐతే అది కేవలం సరదాకి, ఒక ఆట! అప్పట్లో వ్యక్తిగత దూషణలు వచ్చిన గుర్తులేదు.

వ్యక్తిగత దూషణలు, విషయానికి సంబంధించని ప్రసక్తులూ లేనంతవరకూ ఈమాటలో మారుపేర్లతో ప్రచురించడానికి మాకు ఏమీ అభ్యంతరంలేదు. అంతమాత్రాన ఈ మారుపేర్ల వ్యాసంగాన్ని మేము ప్రోత్సహిస్తున్నామని అనుకోవద్దు. ఈ మాట సాహితీ పత్రిక. సాహిత్యంలో వివాదాలు ఉంటాయి. ఉండాలి. విమర్శ ఉండాలి. ఆ వివాదాలు, విమర్శలూ నాగరికంగా ఉన్నంత కాలం ‘ఎవరీ రచయిత?’ అని ఆరా తీయటం మా పద్ధతి కాదు. ఒకవేళ ఆ రచయిత ఎవరో మాకు తెలిసినా, ఆ విషయం మా రహస్యం మాత్రమే! అసలు పేరు బట్టబయలు చేసి రభస చేయవలసిన అవసరం కనపడదు.

ఈ ఇంటర్నెట్ యుగంలో, ఎవరు పెట్టిన పేరు పక్కనపెట్టి మారు పేరుతో రాస్తున్నారో చట్టప్రకారంగా తెలుసుకోవడం అవసరమయితే, అది అసాధ్యం కాదని మీకూ తెలుసనుకుంటాను.