Love
she tries it on
she decides it doesn’t fit,
and starts to take it off.
Her skin comes too.
-Lola Haskins
వెయ్యికళ్ళ మహేంద్రుడి దగ్గిరనుంచి ఆహ్వానం!
కావాలన్నా అందరికీ రాదు ఈ అవకాశం!!
ఈ సారి మనకి తెలిసిన చాలామంది భారతీయులకి కూడ ఈ ఆహ్వానం వచ్చింది.
చచ్చి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరూ సమానం కాదు. అక్కడ కూడా తరతమ భేదాలు, రకరకాల అంతరాలు ఉన్నాయి. కొందరికి ఎంతపుణ్యం చేసుకున్నా స్వర్గంలో మొదటి అంతస్థువరకే వెళ్ళే హక్కు వస్తుంది. అరిచి చచ్చినా వీళ్ళు రెండో అంతస్తుకి ఎక్కలేరు! మరికొందరు సరాసరి సప్త ఋషులుండే ఏడో అంతస్థుకి చేరగలరు.
ఏడు అంతస్థుల నరకాలలాగా, అదే, మనవాళ్ళు రౌరవాది నరకాలు అంటారే,అల్లాగే, ఏడు అంతస్థుల స్వర్గాలు కూడా ఉన్నాయి!
స్వర్గానికి పోయినా సవితిపోరు తప్పలేదన్నట్టు తెలుగుదేశంలో కులాల అంతస్థుల లాగానే, స్వర్గంలోకూడా హెచ్చు తగ్గులు ఉండటం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఎవరు స్వర్గంలో ఏ అంతస్థుకెళ్ళేదీ చట్టం ప్రకారం వారివారి పాప పుణ్యాలబేరీజు బట్టి(ట).
చట్టం చట్టమే కదా! చిత్రగుప్తుడుగారి చిన్న గుమాస్తా చిట్టాలో చెప్పిందే చివరి మాట!!
మహేంద్రుడు గారు మంచి విలాస పురుషుడన్న విషయం మళ్ళీ మళ్ళీ చెప్పక్కరలేదు. ఎడా పెడా బాగా ఢక్కామొక్కీలు తిన్న ఘటం కూడా కాబట్టి, ఈమధ్య రాజకీయంగా కొత్త కొత్త మెళుకువలు నేర్చుకున్నాడు (ఈ విషయంలో మనవాళ్ళ జోక్యం లేదనటానికి గట్టి ఆధారాలు ఏమీ లేవు!) అందుకనే కాబోలు, వార్షీకంగా చేసుకునే ఈ సంబరాలకీ సంతర్పణలకీ ఎందుకన్నా మంచిదని అన్ని రకాల వాళ్ళనీ అన్ని అంతస్థుల వాళ్ళనీ పిలవడం మొదలెట్టాడు. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అని ఆ దేవేంద్రుడుకి భయమూ, అనుమానమూ! ఇంతకుముందు ఒక సారి తక్షకుడి తడాఖా చూశాడుగా. అంతే కాదు. ఎవడిని పిలవక పోయినా చిక్కే. వాడు ఇంకొక దేవతతోటో, దయ్యంతోటో ఏ కోపిష్టిమునితోటో జట్టు కట్టి చివరకి తనకొంపే ముంచచ్చు. అలా ఎన్ని సార్లు జరగలేదు గనక!! అందుకనే కాబోలు, ఈ సారి ఇంద్రుడు గారు ముందుగానే జాగర్త పడ్డాడు.
మరొక్క విషయం మనుషులుగా మనం మనసులోపెట్టు కోవాలి. మనుషులకి ఒక సంవత్సరం, అంటే మూడువందల అరవై ఐదు రోజులు, అమరలోకాధిపతిగారి అమరావతిలో ఒక్క రోజుకి సమానం. అంటే మనం అమెరికాలో సంవత్సరానికోసారి సంతర్పణ చేసుకుంటే, అమరావతిలో ప్రతీరోజూ ఒక ఉత్సవం ఒక సంతర్పణా జరుగుతుందన్నమాట.
మరి రోజూ జరిగే భాగోతమే అయితే చెప్పుకోవడమెందుకూ అని అనుమానం రావచ్చు. అది సహజమే. అయితే ఈ “రోజు” జరగబోయే ఉత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈ ఉత్సవానికి ముఖ్య ఆకర్షణ “స్ట్రిప్ టీజ్ “. అంతే కాదు. ముఖ్య ఆహ్వానితుల జాబితా మరో ప్రత్యేక ఆకర్షణ. ఆ విషయానికి తరవాత వద్దాం.
ముందుగా, మహేంద్రుడి అమరావతీపురం అందాన్ని గురించి చెప్పక తప్పదు. అమరావతి కూడా విశ్వకర్మగారు కట్టినదే! అది కుబేరుడి కైలాసం కన్నా కాస్త పెద్దది. త్రికూటపర్వతానికి, సువేలపర్వతానికీ మధ్య కట్టిన శ్రీలంకాపురి కన్నా బాగా చిన్నది. అమరావతి నూట ఇరవై యెనిమిది మైళ్ళు పొడుగు అంతే వెడల్పు. లంక రెండువందల నలభయి మైళ్ళ వెడల్పు, ఎనిమిది వందలమైళ్ళ పొడవూనూ! అందుకే కాబోలు, “వీడికి లంకంత కొంప ఉంది” అని అంటారు కానీ “అమరావతి అంత ఇల్లు ఉంది” అని అనరు. అమరావతిలో భవనాలన్నీ మన భాగ్యనగరంలో సినిమా స్టుడియోలంత పెద్దవి. “మేలిమి కోటల పువ్వుతోటలతో … నీలపు మేడలు పైడి గోడలున్” అన్నట్టు అహర్నిశలూ కళకళలాడుతూ ఉంటాయి. ప్రతి భవనానికీ బంగారపు ప్రహరీ గోడలు, వైడూర్యాలు, మాణిక్యాలు పొదిగిన ముఖ ద్వారాలు, రకరకాల యంత్రాలు, వజ్రాలు పొదిగిన ఎలివేటరులూ…. అయితే, అమరావతిలో ఏ ఒక్క భవనానికీ భాగ్యనగరం వాస్తుబ్రహ్మ వామనరెడ్డిగారు చచ్చినా మస్తరెయ్యడు.ప్రస్తుతం అది అప్రస్తుత ప్రసంగమే అనుకోండి. అయినా నిప్పులాంటి నిజం చెప్పితీరాలన్నాడు, మహాకవిగారు!
“సురాసురకిరీటతటఘటిత రత్నప్రభా భాసురపదుండైన” మహేంద్రుడి ఊళ్ళో ఎల్లప్పుడూ మందపవనాలు వీచే ఒక్క నందనవనమే కాదు, రకరకాలయిన “మందార మంజరీ మంజుల మకరందపాన మత్త మధుకరగాన మనోహర స్థలాలు” ఎన్నో ఉన్నాయి. ఆరు ఋతువుల్లో ఏ ఋతువు అనుభవించాలని గుబులు పుడితే ఆ ఋతువు అనుభవించడానికి అనువుగా విహార స్థలాలు తోటలు రహస్య మందిరాలు మణిమయ వేదికలు, “చంద్రికా సుందరంబులైన సికతాతలంబులు,” ఎల్లవేళలా రతికేళీ సౌఖ్యాంబుధిలో ఓలలాడటానికి అనువుగా నిర్జర విహార స్థానాలూ,…అబ్బో! ఒక్కటేమిటి! అచ్చంగా తెలుగు సినిమాల్లో సెట్టింగులలా ఎన్నో ఉన్నాయి!
ఈ స్ట్రిప్ టీజ్ కి ఆహ్వానితుల లిస్టు చూస్తే గుండె గుబేలుమనచ్చు. ఋషులు, మహా ఋషులు ప్రతి ఉత్సవానికీ రావలసిందే!వాళ్ళు ముఖ్యులు. అందుకని వాళ్ళు రాసినందుకునన్ను, చదివినందుకు మిమ్మలినీ శపించకముందే వాళ్ళనిగురించే ముందుగా చెప్పుకుందాం.
తూర్పునుంచి కణ్వుడు, కౌశికుడు, గార్గి, గాలవుడు, యవక్రీతుడు వచ్చారు. పడమరనించి, కవషి, కౌషేయుడు, ధౌమ్యుడు, నృషంగుడూ, దక్షిణం నుంచి అగస్య్తుడు,ఆత్రేయుడు, నముచి, ప్రముచి, సుముఖుడు, విముఖుడూ వచ్చారు. ఇక ఉత్తర దిక్కునుంచి సప్త ఋషులు… అత్రి, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడూ వచ్చారు. వీళ్ళు చాలా ముఖ్యులనుకోండి. ఎంత ముఖ్యులంటే, మన తెలుగు ఉత్సవాలలో రెండుతోకల సిల్కు బాడ్జీలు పెట్టుకుని హడావుడిగా అటూ ఇటూ తిరిగే వాళ్ళకి కాస్త అటూ యిటూగా అనుకోండి! వీళ్ళేకాకుండా కౌండిన్యుడు, మరీచి, దక్షుడు, కపిలుడు, అక్షపాదుడు, ఆంగిరసుడు, శాండిల్యుడు, క్రతుడు, కుత్సుడు, భృగుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, అసురుడు, వామదేవుడు, దూర్వాసుడు, బకుడు, వ్యాఘ్రుడు, మండనుడు.. మొదలైన మహామునులంతా వచ్చారు.
వీళ్ళు కాకండా చాలామంది రాజకీయనాయకులని, కవులని, రాజులనీ పిలిచాడు, ఇంద్రుడుగారు! అందుకే గా ఇది ప్రత్యేకమైన సంబరం అన్నాను!! అందులో మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా, ముఖ్యమయిన పెద్దలనే చెప్పుకుందాం. మహాత్మా గాంధి, నెహ్రు, మహతాబ్ , బిజు పట్నాయక్ , జాన్ ప్రొఫ్యుమో, కామరాజ నాడర్ ,కెన్నడీలు, మార్టిన్ లూథర్ , మార్క్స్ ,లెనిన్ , స్టాలిన్ , మావో, నాగిరెడ్డి, నంబూద్రిపాద్ , ఐన్ స్టీన్ , అల్లసాని పెద్దన, కృష్ణదేవరాయలు, కాళిదాసు, కొసాంబి, విశ్వనాథ, శ్రీశ్రీ, గురజాడ, చలం, కృష్ణశాస్త్రి, జాషువా, ఉన్నారు. వీళ్ళతో పాటు ఆహ్వానితుల్లో రావణాసురుడు, జనరల్ స్మట్స్ , గెంఘిజ్ ఖాన్ , గజ్నీ, గోరీ, ఔరంగజేబు, జిన్నా, ఆయూబ్ ఖాన్ , దుర్యోధనుడు, దుశ్శాశనుడు, కర్ణుడు, శకుని, పులస్య్తుడు, వివశ్రుసుడు వగైరా కూడా ఉండటం కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నది.
ఇది బహుశా ఇంద్రుడుగారి రాజకీయ లౌక్యానికి మంచి ఉదాహరణేనేమో! లేకపోతే, ఈ “అనాహితాగ్నులని, అతీర్థ సేవకులని, అనృతవాదులని, వేద విరుద్ధాచారులని, రణపరా ఙ్ముఖులనీ,”స్వర్గానికి రానియ్యడమేమిటి?
అంతేకాదు. స్వర్గానికి, పాస్ పోర్ట్ ఎవరికి ఇవ్వచ్చో మన ఆదికవి నన్నయ గారు చెప్పనే చెప్పారు కదా! “పరమ ధర్మ స్థితితో ప్రజలని కాపాడిన వాళ్ళు, ఉగ్ర రణంలో ప్రాణాలు విడిచిన వీరులు, యజ్ఞాలు చేసి పైన సురులని, కింద భూసురులనీ దనిపిన ధర్మాత్ములు,” వీళ్ళకి ఈ స్వయంప్రకాశితమైన అమరావతికి రావడానికి అర్హత ఉన్నది కానీ, అలగా జనం రావడానికి అర్హతలేదే! ఒకవేళ ఏదోరకంగా మభ్యపెట్టో, లంచంపెట్టో చిత్రగుప్తుడు గారి చిట్టాలోకెక్కి స్వర్గంలో పడ్డారే అనుకో. అటువంటి వాళ్ళనికూడా ఈ ప్రత్యేక సంబరాలకి పిలవడమేమిటి? ఏమయితేనేం! ఈ ఆహ్వానితుల్లో, మన దృష్టిలో “అలగా జనం” అని అనుకున్న వాళ్ళు కూడా ఉండటం తమాషాగానే ఉన్నది.
మైలు పొడుగు, అరమైలు వెడల్పూ ఉన్న వేదికకి ఒక పక్క “అనవరత విగళ దవిరళ మదజల కుల్యాభిరామంబై నిరంతరనిర్ఝర నీహారనగంబును బోలె నొప్పుచున్న” ఐరావతము, మరోపక్క నలకూబరుడి పుష్పకవిమానమూ అలంకారాలుగా ఉన్నాయి. ఇక వేదికమీద ఉన్న అలంకారాలు చెప్పనే లేము! ఈ అనంతవిశ్వంలో ఉన్న ప్రతి పువ్వు, వేదికకు కట్టిన తోరణాలలో ఉంది. సురసిద్ధ సాధ్యగణం, గంధర్వులు, “అషర్లు” గా ఆహ్వానితులకి వారివారి ఆసనాలు చూపిస్తున్నారు. ఆహ్వానితులకి కాశ్మీర కస్తూరి, పచ్చకర్పూరం, పన్నీరు, పువ్వులు, రత్నాలు, శ్రేష్టమైన రకరకాల మధువు ఇస్తున్నారు. అమెరికా వాడి కోకు, పెప్సీ మినహా అన్ని రకాల మధుపదార్థాలూ సమృద్ధిగా సప్లై చేస్తున్నారు, తాగని వాడిది పాపం అన్నట్టు. అమెరికా యెం. యెన్ . సీ లంటే, అమరావతిలో కూడా అసహ్యమే కాబోలు!
కిన్నెరులు వేదికకి ఎడమపక్కన కూచొని “మదనాజ్ఞా వాద్య ఘోషంబుబోలె” అనేకరకాలైన వాద్యసంగీతం వినిపిస్తున్నారు అసలు ఆట ప్రారంభించడానికి ముందో, లేకపోతే ఏ మంత్రిగారో మందుకొడుతూ టైముకి రాకపోయినప్పుడో మనం మన తెలుగు సంతర్పణలలో ఘట్టిగా టేపు సంగీతం పెట్టి, విసిగి వేసారిన జనం చెవుల్లో తుప్పు వదలగొట్టినట్టు!
సభకి నారదుడు, తుంబురుడు యెం.సీలు అని బంగారపు రేకు మీద అచ్చేసి వెండిజలతారు జూలు తోకలుగా కట్టిన ఆహ్వాన పత్రికలో వేసారు. అబ్బ! దీని సిగ తరగా! ఆ ఆహ్వాన పత్రిక అచ్చంగా అమెరికాలో తెలుగు పెళ్ళికి, హైదరాబాదులో అచ్చేసి, తిరిగి అమెరికాలో పోష్ట్ చేసిన పెద్ద సైజు చేటలా వుంది. ఇంతకీ నారదుడు ఎందుకు రాలేదో ఎవరికీ తెలియదు. తుంబురుడితో కలిసి యెం.సీ. చెయ్యడం నామోషీ అయి ఉండవచ్చు. లేదా, ఏ ఇద్దరు పెద్ద దేవుళ్ళ పెళ్ళాల మధ్యనో పుల్లలు పెడుతూ వుండచ్చు.
తుంబురుడు గారు ఈ ప్రత్యేక ఉత్సవం ప్రారంభించారు.అమరలోకంలో అమరపురుషులందరితో విచ్చలవిడిగా సంచరించే అప్సర వేశ్యలు ఒక్కరొక్కరినే వేదికమీదకి రమ్మనమని ఆదేశిస్తున్నాడు. ఈ అప్సరసలు అందరూ చంద్రికాధవళ దుకూలాలు ధరించి, “మృగమద కర్పూర కుంకుమోన్మిశ్రిత సుగంధం బలదుకొని, వివిధ సురభి కుసుమ విసరంబులు ముడిచి, మణిమయ భూషణాలంకృతలై, కంకణ ఝణఝణత్కారంబును, కటికలాప కింకిణి క్రేంకారంబును” చేస్తూ మందగమనులై ఒక్కరొక్కరే వేదిక మీదకి వస్తున్నారు. ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, హేమ, శశిరేఖ వగైరా, వగైరాలు. ఈ అప్సర వేశ్యలు మామూలుగా అందరు నడిచినట్టు నడవలేరు. ఎప్పుడూ, ఏదో నృత్యభంగిమతోనే నడుస్తారు; ఏదో నృత్యభంగిమలోనే నిలబడుతారు, మావూళ్ళో కోడేరు నాయుడు డ్యాన్సు మేష్టారిలా.
కృష్ణదేవరాయలు గారు అతి పరిశీలనగా వేదిక పైన చేరిన అప్సరవేశ్యలనిచూస్తున్నారు. “శతపత్రేక్షణ చంచరీక చికురం చంద్రాస్య చక్రస్తనిన్” వరూధినిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని. కాని ఎంత వెదికినా ఆమె మాత్రం కనిపించలేదు. తెగ మధన పడిపోతూ పెద్దన గారి కేసి బిక్కమొహం పెట్టుకొని చూస్తున్నాడు! పాపం, అమాయకుడు, రాయలు గారికి ఏం తెలుసు? వరూధిని పెద్దనగారి కల్పన అని!
మొట్టమొదటి ప్రదర్శన ఊర్వశీదేవిది. ఊర్వశి అతివిలాసంగా వేదిక ముందుకువచ్చి, జారుతున్నపమిట సర్దుకోవటం మొదలుపెట్టంగానే, కాళిదాసుగారు గుడ్లప్పగించి నోరుతెరుచుకొని అతి శ్రద్ధగా చూడటం మొదలెట్టారు. అచ్చంగా తాను వర్ణించినట్టుగా ఈ ఊర్వశి ఉన్నదా లేదా అని కాబోలు! బహుశా, ఆయనగారి మనసులో అసలు కోరిక, ఊర్వశి మళ్ళీ ఇంకోసారి “పురుషోత్తమా” అనడానికి బదులు “పురూరవా” అని అంటుందేమోనని చూడాలని కాబోలు! అప్పుడు తను విక్రమోర్వశీయం తిరగ రాయచ్చనుకున్నాడో ఏమో! వెనక వరసలో కాళిదాసుగారి వెనకే కూచున్న కొశాంబి గారు విజయోత్సాహంతో, “హా తెలిసెన్” అన్నట్టు మొహం పెట్టి,ఋగ్వేదంతో మొదలుపెట్టి ఎనిమిదిరకాలుగా చెప్పిన ఊర్వశీపురూరవుల వృత్తాంతంపై తాను చేసిన పరిశోధనని మించి చెప్పేందుకు ఇక ఏమీ లేదుసుమా అని చెప్పుదామనుకున్నట్టు నోరు తెరిచాడు. కాళిదాసు గారు, కొసాంబి గారు, ఊర్వశిని చూస్తూ ఉవ్విళ్ళూరుతూ, వాదన మొదలెట్టారు. ఈ వాదన వింటే మరేదన్నా కొత్త సందేశం దొరుకుతుందేమోనన్న ఆశతో జాషువా గారు వాళ్ళ వెనకాలే చేరాడు. పమిట జార్చి, గజ్జెల ఘలఘలతో ఊర్వశి తన పృష్ఠభాగం చూపిస్తూ చీర ముడి సడలించగానే, నెహ్రు, మహతాబ్ , ప్రొఫ్యూమో, పెద్దన, గిరీశం వేషంలో గురజాడ, దుశ్శాసనుడు, కెన్నెడీలు, వగైరాలు మదన బాణబాధితులై, స్మృతిపథంలోకి జారుకున్నారు. దుశ్శాశనుడుకి ద్రౌపది, కెన్నడీలకి నార్మా షేరరు, గురజాడ గిరీశంకి మథురవాణి, ప్రొఫ్యూమోకి అలనాటి కీలరూ గుర్తుకొచ్చి, ప్రాణాలు రెపరెపలాడి పోయిఉండాలి. ఊర్వశి వేదిక వెనుకభాగానికి వచ్చి, కిన్నెరుల వాద్యగానానికి అనుగుణంగా నృత్యం చెయ్యడం మొదలు పెట్టింది.
తుంబురుడు మేనకని వేదిక ముందుకు రమ్మని ఆహ్వానించాడు. మేనక వేదికమీదకి రావడమే విక్టోరియా సీక్రెట్ కేటలాగ్‌లో బొమ్మలా వయ్యారంగా వచ్చింది, ఓణీలా మెత్తటి నీలివెన్నెల రంగు చిరుచీరె, వంటికి పట్టేసిన చేతుల్లేని జాకెట్టు కట్టుకోని. ఇంకా ఆవిడ వంటిమీదనుంచి ఆ చిరుదుకూలాలు ఒలవడం మొదలుపెట్టనే లేదు; గజ్జెలు గట్టిగా కట్టుకోడానికి వంగడం మూలంగా కాబోలు, కొద్దిగా “తూలి బాలపైవలు వెడలన్ బయల్పడియె వల్దకుచంబులు, కక్షయుగ్మము, లలిత కృశోదరము, తరళ త్రివళీయుత రోమరాజి”. అది చూసి, విశ్వామిత్రుడు గారు రుసరుసలాడుతూ గడ్డం తడుముకుంటూ కమండలం పట్టుకోని, కణ్వుడి కంటికి కనిపించకండా పారిపోయాడు, మళ్ళీ ఎందుకొచ్చిందిరా బాబూ మరో భారతం అని నసుక్కుంటూ! ఆయనతో పాటు అత్రి, భరద్వాజుడు, దూర్వాసుడు, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, గార్గి, వగైరాలు లేచి పోయారు. వేదిక ముందు మేనక, వేదిక వెనక వరసలో ఊర్వశీ చీరెలు విప్పి నృత్యం చెయ్యడం మొదలు పెట్టంగానే, పెద్ద కమ్యూనిష్టులు మార్క్స్ , లెనిన్ , స్టాలిన్ , మావో, వాళ్ళ వెనకాలే తోకల్లా నంబూద్రి, నాగిరెడ్డీ, వీళ్ళతో పాటు మధ్యరకం మళయాళీ, చిన్నసైజు తెలుగు కమ్యూనిష్టులూ, “బూర్జువా సంస్కృతి, బూర్జువా సంస్కృతి” అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఐతే అరుస్తూనే నోళ్ళు చప్పరించుకుంటూ, రెప్పలు వాల్చకుండా చూస్తూ చతికిల పడ్డారే గాని అక్కణ్ణుంచి కదల్లేదు వాళ్ళు. వీళ్ళకి కూడా అసలు బాధ మదన బాధే. పైకి బూర్జువా బూర్జువా అని గొంతు చించుకోని అరిచినప్పటికీ, ఈ మదనబాధ భరించలేని బాధ అయ్యుండాలి. మహాకవి ఒక్క శ్రీశ్రీ గారే ఎంత సహచరప్రయాణీకుడైనా, ఊరికే నోరుపారేసుకోకుండా, హాయిగా నవ్వుతూ కూర్చున్నాడు.
తరువాత ఉలూచి, తిలోత్తమ, ఘృతాచి అర్థవివస్త్రలై వేదికమీదకొచ్చి కోణార్క లో సూర్యదేవాలయం మీద విగ్రహాల్లా నృత్యభంగిమలో నిలబడ్డారు! వాళ్ళ నగ్న నృత్యం ప్రారంభం కానేలేదు; విశ్వనాధ గారు శివ శివా అనుకుంటూ కండువా దులుపుతూ మళ్ళీ మరో రామాయణం రాయడం కోసం లేచి పోతారనుకున్నారు, పక్కనే కూచున్న చలం గారు, కృష్ణశాస్త్రీను. చలంగారికి రాజేశ్వరి కథ, తెలుగు సినిమాకి సరిపోయేటట్టుగా ఈ సారి తిరిగి సరిగా రాద్దామని గుబులు పుట్టి ఉండాలి. కృష్ణశాస్త్రి గారు విశ్వనాధ శపిస్తాడేమోనని కాస్త భయపడ్డమాట నిజమే! అయినా, మరోసారి “మనసారగా ఏడ్వటానికా” అన్నట్టు చలం గారి వెనకాలే సర్దుకున్నాడు, జూలుజులపాల జుట్టు పీక్కుంటూ, తనదైన ఊహాసుందరి ఊర్వశిని తలుచుకుంటూ! విశ్వనాధ గారు మాత్రం వీళ్ళనుకున్నట్టు ఎక్కడికీ కదలకుండా హాయిగానే కూర్చుని వున్నారు.
ఆఖరి ప్రదర్శన రంభది. ఆ విషయం తుంబురుడుగారు మైకులో ప్రకటించగానే, మైకంలోపడ్డ రావణాసురుడు మొహం చెల్లక పలాయనం చిత్తగించాడు.ఇంకా నయం. మళ్ళీ కోడలురంభని బలాత్కరించి, పుష్పక విమానం ఎత్తుకు పోలేదు! వాడి వెనకాలే గజ్నీ, గోరీ, ఔరంగజేబు, పులస్య్తుడు, స్మట్సూ, చెంఘిజ్ ఖాను, ఆయూబ్ ఖానూ,వగైరాలందరూ సర్దుకున్నారు. రావణాసురుడితో వీళ్ళకి స్నేహం ఏమిటో ఆ ముక్కంటి మహేశ్వరుడికే తెలియాలి! రంభ వేదిక మీదకి వచ్చేటప్పటికి, వేదిక వెనుక ఊర్వశి, తిలోత్తమ, మేనక, ఉలూచి, ఘృతాచి మొదలైన అప్సరలు అర్థ నగ్నంగా నృత్యం చేస్తున్నారు. వేదిక వెనుకభాగాన వెలుగు తక్కువగా ఉండబట్టి వాళ్ళ ఆకారాల్లో వంకరలు కనిపిస్తున్నాయి కానీ, వాళ్ళ ముఖాలు మాత్రం సిలొవెట్ లో కలిసిపోయినట్టున్నాయి.
రంభ వేదిక మీదికొచ్చిఓర చూపులతో పుష్పక విమానం కేసి చూసింది, నలకూబరుడు లోపల ఉన్నాడేమోనని కాబోలు! వేదికపైనున్న రంభను కళ్ళార్పకుండా పరీక్షగా చూస్తున్నారు, గాంధీ గారు, వశిష్ఠుడు, ఐన్ స్టీనూ!
రంభ తన వంటికి అంటిపట్టివున్న సన్నని తెల్లని వలువలు ఒక్కటొక్కటే అతి సుకుమారంగా ఒలవడం మొదలుపెట్టింది. రకరకాల నృత్యభంగిమలలో తన అవయవ సౌష్ఠవం సౌందర్యం ప్రదర్శిస్తూ కిన్నెర వాద్యాలకి తన గానం కలిపింది. రంభ పూర్తిగా వివస్త్ర అయి, ఆఖరి నృత్యం అత్యంత లాఘవంతో అభినయించి, చిరునగవుతో గర్వంగా, అజంతాబొమ్మలా వేదిక ముందు నిలబడ్డది, ఈ సంబరం పూర్తి అయ్యిందన్నట్టుగా! వన్స్‌మోర్ , వన్స్‌మోర్ అని ఆన్కోర్ ప్రదర్శనకోసం ఎవ్వరూ అరవక పోవడం ఆశ్చర్యమే! రంభ మూతి ముడుచుకోని చూస్తోంది కోపంగా!
వశిష్ఠుడు, ఐన్ స్టీనూ, నవ్వుకుంటూ లేచారు. గాంధీ గారు, రంభ వంటిమీద ఇంకా మిగిలిఉన్న “పదియార్వన్నియ బంగరు వలువను” విప్పదేమిటి, అని అడిగారు. వెంటనే, వశిష్ఠుడు, ” ఆమె వంటిపై మిగిలినవి వలువలు కావు; అది ఆమె బంగారువన్నె చర్మం” అని చెప్పాడు. “అయితే, ఆచర్మాన్నే ఒలవమనండి,” అన్నాడు గాంధి.
వశిష్ఠుడు, ఐన్ స్టీనూ ఉమ్మడిగా కంగారుపడి అన్నారు, “ఆ బంగారురంగు చర్మాన్ని వలిచేస్తే, రంభకి కూడా మిగిలేది మనందరికి మల్లేనే, ఎర్రగా రక్తం మాంసం మాత్రమే!”
“ఓస్ ఇంతేనా! మీరు పొగిడే సౌందర్యం కేవలం చర్మసౌందర్యమే నన్న మాట. స్వర్గంలో కూడా ఇంతకు మించి వేరే సౌందర్యం లేకపోవడం ఎంత దౌర్భాగ్యం?” అన్నారుగాంధి గారు చిరునవ్వుతో!
వశిష్ఠుడు గాంధీగారికి దణ్ణం పెడుతున్నట్టుగా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, వెంటనే అరుంధతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.
ఐన్ స్టీన్ నిశ్చేష్టుడై నిలబడి తను ఒకప్పుడు గాంధీ గారి గురించి చెప్పిన మాటలు సవరించుకున్నాడు : ఇటువంటి మహాపురుషుడు భూమిపైనేకాదు, అమరపురిలో కూడా నడిచి ఉంటాడంటే ఆశ్చర్యపడవలసినదే! అని.